[డా. దిట్టకవి శ్యామలాదేవి గారు రచించిన ‘రాజహంస’ అనే నవలని పరిచయం చేస్తున్నారు డా. కాళిదాసు పురుషోత్తం.]
నేనెక్కవలసిన రైలు జీవితకాలం లేటని ఆరుద్ర అన్నట్లు, నలభై ఏళ్ళ క్రితం శ్యామలాదేవి రాసిన నవలలో కొంతభాగం పత్రికలో ధారావాహికగా వెలువడింది. ఇంతకాలం తర్వాత ఈ నవలను పూర్తి చేసి పిల్లల ప్రోత్సాహంతో అచ్చువేశారు.
డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి ఎన్నో ఏళ్ళ క్రితం ఆంధ్ర విశ్వవిద్యాలంలో ‘విశ్వనాథ స్త్రీ పాత్రల’ మీద పరిశోధించి డాక్టరేట్ పట్టా పొందారు. తన ఆధ్యాత్మిక రచనలు, ఇతర రచనలు చాలాకాలం క్రితమే పత్రికల్లో అచ్చయ్యాయి. ఈ నవలకు ఆచార్య ముదిగొండ శివప్రసాద్, దర్శనం పత్రిక సంపాదకులు ఎం. వి. ఆర్. శర్మ, డాక్టర్ రాపర్ల జనార్దన రావు పరిచయ వాక్యాలు రాశారు. రచయిత్రి ఎనభయ్యవ పడిలో ప్రవేశించిన తర్వాతనే ‘రాజహంస’ నవల పుస్తక రూపంలో వెలువడింది.
శ్యామలాదేవి చెప్పుకొన్నట్లు సనాతన, ఆధునిక భావాలను జాగ్రత్తగా అనుసరిస్తూ, ఒక తాత్వికతను ఏర్పరచుకొని ‘కథాకథన’ పద్ధతిలో ఈ నవల రాశారు.
శ్యామలాదేవి బావగారు అడవి బాపిరాజు మేనల్లుడు. బాపిరాజు అసంపూర్ణ నవల ‘మధురవాణి’ని ఈమె పూర్తి చేసి, బాపిరాజుతో బాంధవ్యాన్ని గట్టిపరచుకొన్నారు. ఈమె రచనలు ‘దిశాదేవి’ కలం పేరుతో పత్రికల్లో వచ్చాయట.
ఈ నవల ‘రాజహంస’ పేరులోనే ఆధ్యాత్మికత, పావిత్ర్యం, మరెన్నో ఉదాత్త భావాలు స్ఫురిస్తాయి. ‘ఉదాత్తమైన చరిత’మని, ‘పరిణత కథ’ అని పరిచయ వాక్యాల్లోనే ఈ నవల గురించి కొన్ని సూచనలు చేశారు. రచయిత్రి జీవితంలో ఎదురైన వ్యక్తులు, సంఘటనలు నవలలో చేరిపోయినట్లుంది. భూస్వాములైన బ్రాహ్మణ కుటుంబాల ఆశలు, ఆశయాలు, ఆదర్శాలు, జీవితం నవలలో ప్రతిబింబిస్తాయి. కృష్ణా తీరంలో అమరావతికి సమీపంలో ముక్కారు పండే వెంకటాపురంలో కథ ఆరంభమవుతుంది. దగ్గర బంధువులైన రెండు కుటుంబాల పురోగతి, చరిత్రను రచయిత్రి ఈ నవలలో చిత్రించారు. ఈ నవలలో పాత్రలన్నీ ఆర్థిక బాధలు లేని భద్రజీవితం అనుభవించేవే.
బసవయ్య అతి పిసినారితనం వల్ల ఆ కుటుంబం కొంత ఇబ్బంది పడుతుంది. అతను పిల్లల చదవు మీద ఖర్చు కూడా అనవసరమని అనుకునే మనిషి, పైగా కర్కశుడు. బసవయ్య భార్య పున్నమ్మ మహాసాధ్వి, ఉత్తమురాలు. బసవయ్య ప్రవర్తన వల్లే వెంకట్రామయ్య కుటంబం దూరంగా ఉంటుంది.
మరో కుటుంబం పెద్ద వెంకట్రామయ్య ఆధునిక భావాలున్న విద్యావంతుడు. అతని భార్య మాధవి అనుకూలవతి. వెంకట్రామయ్యకు పెళ్ళి కావలసిన చెల్లెలు సావిత్రి, ఉత్తమురాలు. ఈ నవల సావిత్రి చుట్టూ అల్లి వుంటే మరింత సాధికారికంగా ఉండేది.
సావిత్రి, పొరుగున ఉన్న మహేష్ చంద్ర ప్రేమించుకుంటారు. కానీ సావిత్రిని అయోగ్యుడైన కాశీ పాపారావుకిచ్చి చేస్తారు. ధనవంతులైన కుటుంబానికి దత్తు పోవడం తప్ప, అతనిలో చెప్పుకోదగ్గ ఒక్క మంచి గుణం కూడా ఉండదు. పైగా గిరీశం అంశ పుణికిపుచ్చుకున్నాడు, వ్యసనపరుడు, స్థిరబుద్ధి లేని చపలుడు. భార్య సావిత్రి గర్భవతిగా ఉన్న సమయంలో పనివాళ్ళ పిల్ల రోజాను లేవదీసుకొని ఎటో వెళ్ళిపోతాడు. దేశాలన్నీ తిరిగి, రోజా శీలాన్ని పాడు చెయ్యకుండా అప్పగించాడు. భార్య సావిత్రి జీవితాన్ని దుఃఖభాజనం చేసిన వ్యర్థుడు. కాశీ పాపారావు వ్యర్థుడు కావచ్చు గానీ దుష్టుడు కాదని, స్థిరబుద్ధి లేని వ్యక్తిగా ఈ నవలలో రచయిత్రి చిత్రించారు. తాను ఇష్టపడిన మనిషితో పెళ్ళి కాక, కాశీ పాపారావుతో వివాహం అయినా సావిత్రి సర్దుకుని పోతుంది. కాశీ పాపారావు ఆమె ఔన్నత్యాన్ని వ్యర్థం చేస్తాడు.
జయంతి అనే మరో ప్రేమాస్పదురాలి జీవితం, ప్రేమ వ్యర్థమై, ఆమె జిల్లెళ్ళమూడి అమ్మ ఆశ్రమం బాధ్యత తీసుకొన్నట్లు రచయిత్రి చిత్రించారు. పాత్రలు అన్యాయాన్ని ప్రశ్నించలేక, విధిని నమ్మి గంగిరెద్దుల వలె వ్యవహరిస్తాయి.
రమేష్ చంద్ర తమ సేవకులలో ఒకరి కుమార్తె – దివ్యాంగురాలు రత్నకుమారిని ఇష్టపడి పెళ్ళి చేసుకొంటాడు. అందం అంటే మానసిక సౌందర్యం అని రమేష్ – రత్నల ప్రేమ ద్వారా వ్యక్తమవుతుంది.
వెంకట్రామయ్య బంధువులను, పౌరోహిత్య కుటుంబ దంపతులను, కొందరు వెంకటాపురం గ్రామీణులను వెంటపెట్టుకుని కాశి, గయ తదితర క్షేత్రాలనీ చూచి వస్తాడు. ఈ యాత్రానుభవాలు నవలలో కొంతభాగం ఆక్రమించాయి. యాత్రానుభవాలను పాఠకులు ఆసక్తితో చదువుతారు.
విశ్వనాథ వారి ‘మా బాబు’ నవల ప్రభావం రాజహంస మీద ఉన్నట్లనిపిస్తుంది. తను ఇష్టపడిన మేనకోడలు మరొక వ్యక్తిని ప్రేమించినట్లు గ్రహించి, కథానాయకుడు ఆమెను అతనికి అప్పచెపుతాడు. ఇటువంటి త్యాగాలు చేసే పాత్రలు సావిత్రి వంటివి ఈ నవలలోనూ ఉన్నాయి. నవలలో చిన్నా పెద్ద పాత్రలు చాలా వస్తాయి. పాత్రల మధ్య సంబంధాలను పట్టికలో ఇచ్చి వుంటే పాఠకులు పేజీలు వెనక్కి తిప్పి చూసుకోకుండా, ఎంతో సౌలభ్యంగా ఉండేదేమో! పైగా నవల రెండు తరాల కథలతో, దాదాపు నలభై సంవత్సరాలకు విస్తరిస్తుంది. వెంకటాపురం లోనూ, కలకత్తా లోనూ కథలో కొన్ని భాగాలు జరిగినట్లు చిత్రించారు రచయిత్రి.
కొన్ని పాత్రలు ఉన్నత విద్య చదివి విదేశాల్లో, మహానగరాల్లో స్థిరపడితే, కొన్ని పాత్రలు మళ్ళీ తమ మూలాలను వెతుక్కుంటూ సొంత వూరికి వచ్చి, సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తాయి. సుధేష్ణ వంటి ఉత్తమ పాత్రను మధ్యలోనే కారు ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రించనవసరం లేదేమో!
సుధేష్ణ మరణం నవల ఇతివృత్తాన్ని ముందుకు నడిపించడంలో తోడ్పడదు. జయంతి అనే మరో యువతి పాత్ర కూడా వైరాగ్యమార్గంలో జిల్లేళ్ళమూడి అమ్మ ఆశ్రమ నిర్వాహక బాధ్యత స్వీకరిస్తుంది. నా వరకు – పరిస్థితులను ఎదుర్కొని పోరాడి జీవిత ధ్యేయాలను సాధించవలసిన యువతులు సన్యాసమనే పలాయనవాద, సులభమార్గాన్ని ఎంచుకున్నట్లు అనిపించింది. రచయిత్రి జీవిత దృక్పథానికీ, నా దృక్పథానికీ మద్య ఉన్న భిన్నత్యం వల్లే ఈ వైరుధ్యాలు స్ఫురించాయి.
నవలలో తరచూ వెండి గ్లాసుల్లో ఆవుపాలు తాగే సజ్జనులు, భక్తులు, వేదాంతులు కనిపిస్తారు. యజమానులకు అత్యంత విధేయులైన సేవకులు, ఇతర పనివాళ్ళు.. ఒకే ఒక్క చోట మాత్రమే రైల్వే స్టేషన్లో, చదువుకోవలసిన బాలలు బిచ్చమడుక్కోవడం చూసి, ఒక పాత్ర బాధపడడం నా దృష్టి నుంచి తప్పిపోలేదు.
రచయిత్రి తాలూకూ కుటుంబాలు రెండు మూడు తరాలుగా ఆంగ్ల విద్య అభ్యసించి న్యాయవాదులుగా, వైద్యులుగా, పారిశ్రామికవేత్తలుగా, న్యాయాధిపతులుగా, ప్రొఫెసర్లుగా చేసిన విద్యాధికులు. డాక్టర్ శ్యామలాదేవి భర్త జస్టిస్ దత్తాత్రేయ గారికే ఈ కృతిని అంకింతం చేశారు.
శ్యామలాదేవిగారితో నాకేదో బాదరాయణ సంబంధం ఉన్నట్లు స్ఫురించింది. నా గరుదేవులు స్వర్గీయ బిరుదురాజు రామరాజుగారి నివాసం ప్రక్కనే ఈమె గారు కూడా కొంతకాలం కాపురం ఉన్నారు! నవలను పరిచయం చేసిన ప్రొఫెసర్ శివప్రసాదు గారు పరిచయస్థులే!
***
రచన: డా. దిట్టకవి శ్యామలాదేవి
పేజీలు: 360
వెల: ₹ 275/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000413413
~
డా. దిట్టకవి శ్యామలాదేవి
303, బిందు ప్రెస్టీజ్ అపార్ట్‌మెంట్,
డి. డి. కాలనీ, బాగ్ అంబర్‌పేట్,
హైదరాబాద్ – 500013
ఫోన్: 9700332443
~
ఆన్‍లైన్‌లో:
https://www.telugubooks.in/products/rajahamsa?
డా. కాళిదాసు పురుషోత్తం గారిది ప్రకాశం జిల్లా తూమాడు అగ్రహారం. వీరి తండ్రిగారు గొప్ప సంస్కృత పండితులు. నెల్లూరులో స్థిరపడ్డారు. జననం 1942 మే. ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య. పెద్దక్క, రచయిత మిగిలారు. పెద్దక్క 97వ ఏట ఏడాది క్రితం స్వర్గస్తులయ్యారు.
రచయిత బాల్యంలో నాయనగారి వద్ద సంస్కృతం కొద్దిగా చదువుకున్నారు. నెల్లూరు వి.ఆర్.హైస్కూలు, కాలజీలో విద్యాభ్యాసం, యం.ఏ. తెలుగు ఉస్మానియాలో ఫస్ట్ క్లాసులో, యూనివర్సిటీ ఫస్ట్ గానిలిచి, గురజాడ అప్పారావు స్వర్ణ పురస్కారం ఆందుకున్నారు. హైదరాబాద్, స్టేట్ ఆర్కైవ్సు వారి జాతీస్థాయి స్కాలర్షిప్ అందుకొని వెంకటగిరి సంస్థాన సాహిత్యం మీద పరిశోధించి 1971 సెప్టెంబర్‌లో డాక్టరేట్ అందుకున్నారు. 1972లో నెల్లూరులో శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాలలో చేరి, ఆ కళాశాల ప్రిన్సిపల్‌గా రిటైరై నెల్లూరులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఫొటోగ్రఫీ, సినిమాలు, పర్యటనలు ఇష్టం. 15 సంవత్సరాలు మిత్రులతో కలిసి కెమెరా క్లబ్, ఫిల్మ్ సొసైటీ ఉద్యమం, దాదాపు పుష్కరకాలం నడిపారు. సాహిత్యం, సినిమా, యాత్రానుభవాలు వ్యాసాలు భారతినుంచి అన్ని పత్రికలలో అచ్చయ్యాయి.
2007లో దంపూరు నరసయ్య – ఇంగ్లీషు లో తొలి తెలుగు వాడిమీద పరిశోధించి పుస్తకం. 1988లో గోపినాథుని వెంకయ్య శాస్త్రి జీవితం, సాహిత్యం టిటిడి వారి సహకారంతో. డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాచ్య పరిశోధన శాఖ వారికోసం పూండ్ల రమకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి సంపుటాలనుంచి మూడువందల పుటల “అలనాటి సాహిత్యం” గ్రంథానికి సంపాదకత్వం, 2011లో కనకపుష్యరాగం పొణకా కనకమ్మ స్వీయచరిత్ర ప్రచురణ. మనసు ఫౌండేషన్ సహకారంతో AP Sate Archives లో భద్రపరచిన గురజాడ వారి రికార్డు పరిశీలించి స్వర్గీయ పెన్నేపల్లి గోపాలకృష్ణ, మనసు రాయుడు గారితో కలిసి “గురజాడ లభ్య సమగ్ర రచనలసంకలనం” వెలువరించారు. మనసు ఫౌండేషన్ వారి జాషువ సమగ్ర రచనల సంకలనంకోసం పనిచేశారు. 2014లో “వెంటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం” గ్రంథ ప్రచురణ.
2021లో పెన్నేపల్లి గోపాలకృష్ణతో కలిసి అనువదించిన”letters from Madras During the years 1836-39″ గ్రంథం ‘ఆమె లేఖలు’ పేరుతో అనువాదం. (ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్-ఎమెస్కో సంయుక్త ప్రచురణ).
పూండ్ల రామకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి ఆనాటి సాహిత్య దృక్పథాలు మీద మాచవోలు శివరామప్రసాద్, అల్లం రాజయ్య నవలలు, కథలు మీద కుమారి ఉభయ భారతి పిహెచ్.డి పరిశోధనలకు పర్యవేక్షణ. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సంస్థాపక సభ్యులు, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సభ్యత్వం.