Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మాగి ముగ్గిన మధుర భక్తి కావ్యం మాకినీడి ‘రాధికాకృష్ణం’

[శ్రీ మాకినీడి సూర్య భాస్కర్ రచించిన ‘రాధికాకృష్ణం’ అనే పద్యకావ్యాన్ని సమీక్షిస్తున్నారు అవధానుల మణిబాబు.]

వృత్తి, సాహిత్య వ్యాసంగం సమాంతరంగా నిర్వహించుకుంటూ అటు వంద పుస్తకాల ముద్రణను, ఇటు పదవీ విరమణ వయస్సును పూర్తి చేసుకున్న శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ విశ్రాంత జీవనంలో మొదటి పుస్తకం ఏమిటా? అని మిత్రులంతా ఆసక్తిగా ఎదురు చూశారు. తన “రసనకు పూతవృత్తి సుకరంబుగ చేకురునట్లు” ఏదైనా చెప్పాలనుకున్నారేమో! అందుకే “పలికెద, వేరొండు గాథ పలుకగ నేలా? అని దశాబ్దాల కాలంగా తాను రూపుదిద్దుతూ రంగులద్దుతూన్న ‘రాధికాకృష్ణం’ మన ముందుకు తెచ్చారు. వేరు తీర్థంబు లవనిపై వెదుకనేలా?” అని కవిత్వము, విమర్శ, చిత్రకళా వీటన్నిటినీ కాస్త ప్రక్కకు జరిపి ఏడాది పాటు ఈ తాదాత్మ్యంతోనే తాను మునిగి మనల్ని ముంచి తేల్చారు. మనం మాత్రం వద్దంటామా? ప్రియుడగు హరి చరితంబులు, ప్రియ భక్తుల కెల్ల యెడల ప్రియములు కావే!”

***

ఇది ఒక తపస్సు. తనను తాను రాధగా భావన చేసుకోనిదే రాయలేని కావ్యం ఇది. ఐతే ఒక పారవశ్య స్థితిలో వ్రాసిన ఈ కావ్యానికి సమీక్ష వ్రాయడం అనేది సాహసమే. ఈ పుస్తకంలో అన్ని చోట్లా కవి రాధికగా మారిపోయాడు. ద్వంద్వ అనుభవం నుండి విముక్తి పొంది ఒక వర్ణనాతీత అనుభూతిని పొందడం. దీనినే తురీయ స్థితి అన్నారు విహారి గారు, ముందుమాటలో. ఆ పలవరింతల అర్థమేమిటని కొన్నిచోట్ల అడుగుదామంటే, మాకినీడి రాధగా చెబుతారో, కవిగా చెబుతారో. మనకు తెలియవచ్చినంత మనమే తేటపరచుకునే ప్రయత్నం చేద్దాం.

కవిది మధుర భక్తి. అంటే సాకార బ్రహ్మమును పరబ్రహ్మముగా తనను తాను ప్రేయసిగా భావించుకుని ఆ పరబ్రహ్మ సాక్షత్కారమును, సాయుజ్యమును పొందడం. సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులంతా స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు, విష్ణు భక్తులంతా. ఇకపై కావ్యంలోని పంక్తులను ఉటంకించినపుడు నా వ్యాఖ్యానంలో రాధ, కవి వేరుకాదని గమనించాలి.

ఈ గుప్తమైన ప్రేమతత్త్వాన్ని పట్టుకోవడం అందరికీ సాధ్యమయ్యే సంగతి కాదని కవికి తెలుసు. పూర్వ పుణ్య పరిపాకం వలన వ్యాసుడెరుగు కొంత, శుక యోగీశుడెరుగు; కృష్ణ కృప నెరుగ నగు సకృత్తుగాను!” అని వినమ్రంగా చెప్పుకున్నారు. “శూలికైన తమ్మి చూలికైన” కష్టసాధ్యమైన సంగతులను “ప్రేమ రసామృత తత్వములో, శ్యామ పదాంకితుడై, లేమ సమర్చనంబుతో, గోముగ లీనమైనపుడు” ఆ వివశత్వంతో వ్రాశారు.

***

మనకు పాడాలనే ఉత్సాహం మాత్రం ఉంటే సరిపోతుందా? మన పాట అంతవరకూ విన్న పాటలన్నిటి కంటే మిన్నగా ఉండాలి. అందులోనూ, ఆ పాట ఎవరి గురించి? కవికి తెలుసు ఆగమంబులు నీ యాలపనంబుల్”. ఇపుడు ఆయన ముందున్నది ఎంత క్లిష్టమైన లక్ష్యమో చూడండి. కానీ ఈయన పాడుతున్నది వైయక్తిక గీతం కాదు. గళం కలిపేందుకు, తాళానుగుణంగా నృత్యం చేసేందుకు తనతో స్వామి ఉన్నాడు. అందుకే, సాగిపోదమురా సంబర రథ్యల్” అంటున్నాడు.

ఆ గమనం నడకలా లేదు. అలా అని ఇది సాధారణ నృత్యం కాదు, సమ్మోదభరిత తాండవం. కారణం, తనను ఆవహించినది “ఏ పరమేశు తేజమున నీ సచరాచరమైన లోకముద్దీపితమయ్యె”నో ఆ కాంతి. ఓ దివ్యమైన మోహావేశం. అడుగులు పడుతున్నది విరగబూసిన చెట్లన్ని వేగిరపడి పూల కల్లాపి జల్లిన నేల కంబళి”. ఇది తప్పా? ఒప్పా? గమనించే స్థితి లేదు. ఎవరేమంటారో అనే స్పృహ లేదు. నిజానికి ఎవరేమన్నా లెక్కలేదు. శాపంబేమేం చేయున్, హా! నా దీపంబే నీవై యున్నంతన్” అనేంత వరకూ వచ్చేసింది వ్యవహారం.

ఐతే, ఎంత నడచినా ఆ లక్ష్యం కనిపించటం లేదు. గగనానికి ఇలకూ బహు దూరమ్మనినాడో” అని త్యాగయ్య అన్నట్లు ఆత్మకు పరమాత్మ యెంత దవ్వొ!” అని వాపోతాడు. ఐనా, ఆ నడక ఆగదు, కారణం అది కేవలం గమనం కాదు, ప్రియ సమాగమం కోసం గవేషణ. ఆ ప్రేమ ఎంత దూరమైనా నడిపిస్తుంది. ప్రేమ యొకటే జగాల పాలించగలుగు నొక నిరంకుశపు నియంత; ఒక నిమేషముననె జీవితాన్వేషణమునకు మలుపు నీయగల్గు గడుసరి రసాయనమ్ము!” అంటాడు, కవి.

బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానేరావు, అంటారు, కృష్ణశాస్త్రి. ఈ ఎదురుచూపుతో బ్రతుకంతా ఏడుపయ్యి పోయిందంటాడీ, కవి. ఆ ఆవేదన వడగాడ్పువోలె నార్చివేయుచు లోచెమ్మ నంత; అంతరించిపోవగా రసికత రిక్తమౌచు గుండె బండరాయిగ మారకుండు నెట్లు?” అని ప్రశ్నిస్తాడు. ఈ బండరాయిగ మారిన గుండె నిరాశతో పగిలి పోయింది. మరి అంతటి విస్ఫోటనం జరిగితే మామూలుగా ఉంటుందా! సకల దిశలా శబ్దం ఆవరించింది. లోలో ఏడ్చిన ఆర్తారావం వినబడకపోతే పోయింది, ఈ శబ్దమైనా నీ చెవులబడలేదా? అని దెప్పుతున్నాడు, కవి. ఇది, వినబడక పోవడం కాదు, వినడం రాకపోవడం అంటాడు – వినుట చేతనౌనె, వినిపించు వానికి?”. ఎప్పుడూ చేత మురళి పట్టుకుని ఆ రావాన్ని వినిపించే నీకు మా ఆర్తనాదం వినడం రావటం లేదు అంటాడు, ఆ మురళి నైనా కాకపోతినే, అని బాధ పడతాడు.

***

‘పాపోహం పాప కర్మాహం’ అని భక్తుడు ప్రతి రోజూ పరమాత్మకు చెప్పుకుంటాడు. కవి ఇదే సంగతిని వేరేగా చెప్పుకుని ఒప్పుకుంటున్నాడు. నా విరహ పంకిలము వలన నేను పుణ్య యమునలో మునిగితే నీరంతా కలుషితమవుతుంది. కాబట్టి నన్నే ముందు స్నానం చెయ్యనీ. ఆ తర్వాత నువ్వు చెయ్యి. ఎందుకంటే – స్వచ్చమైనదగుట స్వామి, నీ హృదయమ్ము నీవు మునుగ యమున నీరమపుడు తిరిగి పుణ్యమౌను, తిరుగులేదు!. ఎంత చమత్కారో ఈ కవి. పద్యం మొదలుపెట్టినపుడు కవి ఇలా అంటాడని అనుకోం, ఈ మలుపు తిప్పిన తీరుకి ఆశ్చర్య పోతాం.

తనకు, పరమాత్మకు ఇంత అంతరం ఉందనడం అతని సంస్కారమే కానీ “మనమిద్దరం ద్వంద్వ సమాసం” అని చెప్పుకోగల చేరిక ఉంది. భాష యుండుదాకను జంట బ్రతుకు సాగు!” అని విశ్వసించగల ప్రేముడి ఉంది, ఎవరేమనుకున్నా నాకు బాధ లేదు గానీ కరుణ వీడి యనాథను జేయకెంతయున్!” అని కోరగల స్నేహముంది. మరిన్ని ఉన్నాక ఎంతసేపని ఎదురు చూస్తాడు?

ఇక నిందించడం మొదలు పెడతాడు, కవి – కానను నిన్ను మించు పటుకర్కశు నెక్కడ గోపబాల, లోకాన” అనడానికి వెనుకాడడు. నన్నిటు గెంటివేసి శోకానలమందు, నీవెటుల కమ్మగ నవ్వుచునుంటివో సఖా!” అని తన జీవితం అడవి గాచిన వెన్నెల చేశావని నిలదీస్తాడు. అసలు అప్పటి దాకా కూడా ఉండి తీరా అవసరమైనపుడు మాయమై పోవడం ఈ దేవుళ్ళకు అలవాటేమో! “ప్రేక్షకుల్ పరిహాసము చేయుచుండిరి, తెరవేయమంచు నీ కోసము జూసితిన్ కసరుకొంటి విదెక్కడి దర్శకత్వమో!” అని వాపోతారు పాపయ్య శాస్త్రి గారు.

తన బాధ ఏమిటో చెప్పేంత శక్తి లేదంటాడు, కవి. చిత్రమేమిటన్న చిత్రించగాలేను అక్షర పదచిత్ర మక్షయముగ” కారణం, అందంగా వ్రాయగలిగిన బ్రహ్మ తన తలరాతను అందంగా వ్రాయలేదు అంటారు. ఒకటా? రెండా? ఎన్ని బాధలు?

నీళ్ళకెళ్ళునపుడు నీవు గుర్తొస్తావు యేటిగట్టు కాడ నీటుగాడ! నిన్ను చూడగలనొ నేను నీ రోజైన మనసు తహతహపడు మాట నిజము!” నిజానికి స్వామిని కలవడానికే ఏటికి వెళ్ళటం కానీ నీళ్ళ కోసం కాదు. అందుకే, రావలసిన వాడు వచ్చేవరకూ పని పూర్తికాదు – నీటితో బిందె నెమ్మది నిండుతుంది. యెడదలో యాశ నెమ్మది యెండుతుంది”.

ఈ ధ్యాసే రోజంతా. అందుకే నిద్రలో ఎందుకు నవ్వావని ఇంట్లో వారు అడిగితే ఎందుకో తనకే తెలియలేదట – మెలకువందున చూడని వెలుగునేమి జూచితినొ చెప్పలేనోయి చోరసఖుడ”. నిజానికి, అది నిద్రయినా, మెలకువ అయినా చూసేదీ, చూడాలనుకునేదీ ఆ నల్లనయ్యనే.

***

వేణువును, సానువును ఇన్నిటికి సన్నిధిలో ఉండే భాగ్యం కలిపించిన స్వామి తననెందుకు ఈ దూరం ఉంచాడు. బహుశా తనకు ప్రాణం ఉండడం వలననేమో! అదే అడ్డయితే తొలగించమంటాడు. ప్రాణము లేకపోవుటయె వాటి యదృష్ట మనందువా, సరే ప్రాణము నాకగున్ గరికపాటిది, చెప్పుచునుంటి నో సఖా! దానిని వీడి నీకు దరిదాపున నుండుటె తోషమెప్పుడున్ కాన, నిదేను విన్నపము – గావుము ప్రాణము దీసివైచి నన్!!”. ఎంత తెగించాడు కవి. ఇది తెగించడం కాదు. అక్కరలేనివి తెంపుకోవడం. “నీకున్ మ్రొక్కెద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ” పద్య సారమెరగడం అంటే ఇదే. తొలినాళ్ళలోనే తన “సుమకవితాంజలి”లో “నీదు పూజకయి సిద్ధము చేతును తత్ప్రసూనమున్” అని తన ఆత్మకుసుమార్పణకు సిద్ధమైనవాడీ కవి.

ప్రతి దశలోనూ కవి అంతర్వీక్షణ చేసుకుంటాడు. భక్తిలోపము కలదన్న ప్రశ్న లేదు, మా మొరల నాలకించుటకేమొ నీకు తీరికే లేదొ!” నా పరంగా ఎటువంటి లోపం లేదు నీకు తీరిక లేక చూడడం లేదంతే అంటాడు, విరహాగ్ని కీలలలో దహించిపోతూ. ఒకవైపు ఇలా అంటూనే “ఐనాగాని పసందు యౌను, నిను నా యాలోచనందున్ గనన్” అంటూ ఉన్మేషంబుతో (మెలకువ, కనువిప్పు, వికాసం) సాగిపోతాడు. ఈ పదం ఈ సందర్భంలో ఎంతో గొప్పగా అమరింది.

ఏ వేళప్పుడు ఎచ్చటుందువొ సరే, యేనెట్లు నూహింతు, నీ

భావోద్వేగము నోపలేక విలసద్ర్భాంతిం బడంగానగున్

భావంబంత ముభావ మౌనుగ, సదా భారంబు జీవించుటే;

జీవన్మాలిక వాడిపోవునుగ; పెంజీకట్ల నీడౌనుగా!” అని ఈసారి కాస్త గట్టిగానే అడుగుతాడు.

అమాయకత్వం కాకపోతే ఆ చిరునామా చెప్పేస్తే ఋషులంతా తపస్సు మానేసి ఓసారి వెళ్ళి చూసి వచ్చెయ్యరూ! తమ భక్తి మీద అపారమైన నమ్మకం అది. తనలో ఆయనే ఉన్నపుడు ఎవరి కోసం రాడు? అనే ధీమా అది. ఓలేటి వేంకట రామశాస్త్రి గారు “ఉపాయనం”లో

“ఏత్రోవ నిను జేర నేతేర వచ్చునో

పలుకు మా దారినే పయన మగుదు

ఎచ్చోట దిరముగా నెపుడు నీ వుందువో

యెరిగింపు మచ్చోటి కేనెవత్తు” అంటారు ఇలాగే.

ఇలా అనడం అమాయకత్వం కాదు. ఒక గౌరవం. ఒక మర్యాద. అవతలివాడు పెద్దవాడు అయినపుడు మీకు వీలు కాకపొతే నేనే వస్తాను సుమండీ అంటాం కదా! అలా అన్నమాట.

రమ్మని ఆర్తితో పిలిచినా, ఇసుమంతైనా సంతసముండదు. ఇందాక చెప్పుకున్న పాట కొనసాగింపులో “ఎదు రరయని వేళవచ్చి ఇట్టే మాయమౌతావు” అన్నట్లు నిజంగా ఆయన వచ్చేసినా, ఆ సాక్షాత్కార భాగ్యం క్షణికం. వచ్చేంతవరకూ ఎదురుచూపు, తీరా వచ్చాక మళ్ళీ వెళ్ళిపోతాడని బెంగ. నీవు వచ్చెద, వంతలో నిజమదెపుడు; వెళ్ళిపోదువో యను బాధ వేసటించు”.

ఆ సన్నిధి శాశ్వతం కావాలంటే ఆయనను రమ్మని పిలవడం కాదు. మనమే ఆయన పదాల దగ్గర చతికిలపడిపోవాలి. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము అంటారు వీటినే. అలా జరిగిన నాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా మనకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆయనతోనే మనం. “తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ తో పాటు ఆబాల గోపాలము” వాళ్ళతో మనమూనూ.

ఈ సత్యం ఇంకా బోధపడక ఒక్క నిమేషమాగి చనుమో ప్రియ! తాళుము కొంతసేపు నే నొక్కతె నౌదునన్న భయ ముప్పతిలంగను వేడుకొందు, నీ విక్కడ నాకడన్ నిలువు” అని వెన్నెల కాసే రాత్రిని ఒంటరిగా భరించలేనని ఉక్కిరిబిక్కిరి అయిన మనసుతో బ్రతిమాలుకుంటున్నాడు.

“నా మెలంగు తోట నా మాటలో దేట

నా వరాల కొంగు నా వెలుంగు

నా వయాళి తేప నా చూపులో బాప

నిలచు గాక! తన్ను గొలచు దాక” – అని వేడుకుంటారు వేంకటపార్వతీశ్వర కవులు “ఏకాంత సేవ”లో.

***

ఎవరికోసం ఉద్దేశించి ఒక వస్తువు ఉన్నదో అది వారికి చెందనపుడు అదంతా వృథా. అందుకే

“వీడు లేకున్న పురమటవీస్థలంబు

వీని పొందని జన్మంబు విగత ఫలము

వీని బలుకని వచనంబు విహగ రుతము

వీని జూడని చూడ్కులు వృథలు వృథలు” అనిపించారు, పోతన.

మన కవి అనుకుంటున్నాడు –

ఎందుల కెందుకీ సొగసు? ఏరున గాచిన చంద్రకాంతిలా!

ఎందుల కెందుకీ రసన? యెంచుచు కీర్తన జేయకుండ నిన్!

ఎందుల కెందుకీ శిరము నెంచగ నంఘ్రుల నంటకున్నచో!

ఎందుల కెందుకీ యురము? నింపుగ నీ కర స్పర్శ లేకనే!

ఈ పుస్తకంలోని ఉత్పలమాలికల్లో మాకినీడి విశ్వరూపం ప్రకటితమవుతుంది. “పిల్లన గ్రోవి పిలుపు” లో ఖిన్నుని వేదనంతయును క్రేంకృతి దాల్చెడు సంతసమ్ములా; ఎన్నగ వెన్నముద్ద గళ మించుక జారుచు నట్లనట్లనే” లాంటి పాదాలు చదువుతున్నపుడు “వెన్న ముద్దలు గొంతులో జారినంత” సులభంగా వ్రాసిన కవికి అభినందన తెలపకుండా ముందుకు సాగలేo.

***

గీతలో “అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే; తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం” అని కదా స్వామి అన్నారు. మఱో చింతన లేకుండా తనను ఉపాసించే వాళ్లు ఎవరో, వారి యోగాన్నీ, క్షేమాన్నీ నేను వహిస్తాను అని అర్థం. అలా తన చింతన అంతా ఆయనపై నిలిపిన ప్రతిఫలనమే ఈ యోగం. తిరుప్పావై వ్యాఖ్యానంలో రోచిష్మాన్ ఇలాంటి సందర్భంలో కఠోపనిషత్తు వాక్యాన్ని గుర్తు చేస్తూ, ఇలాంటివి స్వామి వ్రాయమని సూచన చెయ్యాలి తప్ప మనం వ్రాయాలని కూర్చుంటే జరగవు అంటారు. ఎందుకంటే, భగవంతుడు మన సొంత బుద్ధి బలంచే తెలియబడడు. కానీ, ఆయనకు శరణాగతి చేసిన వారు ఆయన కృపకు పాత్రులౌతారు. అప్పుడు ఆయన కృప చేత ఆయనను తెలుసుకోగలుగుతారు.

“నాయమాత్మా ప్రవచనేన లభ్యో

న మేధయా న బహునా శ్రుతేన

యమేవైష వృణుతే తేన లభ్య

స్తస్యైష ఆత్మా వివృణుతే తనూం స్వాం”.

అదిగో, అలా అనుగ్రహింప బడి ఆయన చేయిపట్టి దిద్దించిన ఫలితమే ఈ పుస్తకం.

“ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్

గన్నుల కానరట్టి హరి గౌగిట చేర్చుచు జెట్ట పట్టు చున్

తన్నుచు గ్రుద్దుచున్ నగుచు దద్దయు పైబడి కూడి యాడుచున్

మన్నన సేయు వల్లవ కుమారుల భాగ్యము లింతయొప్పునే” అని భక్తులు అసూయ పడినట్లే, మాకినీడి కావ్యాన్ని చదివాక మనం అసూయ పడతాం. ఆ అసూయ అవసరం కూడా.

***

ఇక రచనా విశేషాల విషయానికి వస్తే, అష్టవిధ నాయికల్లో స్వాధీనపతిక ఒకామె. అంటే పతిని తనకు స్వాధీనం చేసుకునేది. రాధ తానే ప్రభువుకి వశమైoది. అందుకే, ఆమెను ‘స్వాధీన పత్ని’ అంటారు, గడుసుగా. మరోచోట ఆమెను ‘ప్రేమాభిసారిక’ అన్నారు. దొరకును, ‘దొర’కును లాంటి విరుపులు; “మాగి ముగ్గిన ప్రేమంపు ఫలమ్ము”; “చేరడేసి కళ్ళ ‘చెంప’క మాలలు”; భావంబంత ముభావమౌ’; ‘నీడల ప్రణయమ్ము నీరెండ చాయ”; “కోటి కోర్కెల గోడైన గూడు మనసు” లాంటి భావ చిత్రాలు అంతటి ఆధ్యాత్మిక మనస్స్థితిలోనూ మనల్ని పలకరించిపోతాయ్. ఝాడాగా (పూర్తిగా, బొత్తిగా), జంజాడి (ఒక రకమైన కత్తి), సన్నకసన్న(మెల్లమెల్లగా), హేరామి(హింసించు, ఉపద్రవమగు) వంటి పదాలు నిఘంటువుకి పని చెబుతాయ్.

వలపు బిచ్చగత్తె, నల్ల కెంపులు, పెదవి పగడాలు, వెండి విలేపనము, మడతి పావురము(ఆడ పావురము), ప్రణయ మాక్షికము (ప్రణయమనే తేనె), దాహపు వాదర (దాహమనే కత్తి అంచు), తీయనౌ చాకిరీ, వెరపుటూయెల, బ్రహ్మజెముళ్ళ పరువము .. ఇవన్నీ కొత్తగా తోచి మరోసారి ఆగి చదివేలా చేస్తాయ్. ఇక ఈ పుస్తకంలో ఉపయోగించిన అరుదైన ఛందాలను గురించి వ్రాస్తే అది మరో వ్యాసం అవుతుంది.

విశ్వమోహన చైతన్యంగా పరమాత్మను దర్శించి అందులో తాదాత్మ్యం చెందిన ఉదాత్త ప్రేయసిగా రాధను సంభవించిన ఈ కావ్యం, మాకినీడి శతాధిక గ్రంథాలలోనే కాదు సమకాలీన ఆధ్యాత్మిక సాహిత్య గ్రంథాలలోనూ మొదటి వరసలోనిది అని చెప్పడం ఇన్ని చెప్పాక తప్పుకాదు. అందుకే, వారి పద్య పదాన్నే కాస్త మార్చి మనమంతా కలిపి అందాం, కవీ! “గణ్యులైరి మీరు పుణ్యులైరి” అని.

***

రాధికాకృష్ణం (ప్రేమాకృతి రాధ – ప్రణయ రాగాలు)
రచన: మాకినీడి సూర్య భాస్కర్
ప్రచురణ: సౌమ్య ప్రచురణలు, కాకినాడ
పేజీలు: 156
వెల: ₹ 200/-
ప్రతులకు:
శ్రీమతి మాకినీడి సుభద్ర
సౌమ్య పబ్లికేషన్స్, కాకినాడ
ఫోన్: 8985217627

Exit mobile version