Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎవరికి వారే చదువుకొని పలవరించాల్సిన గొప్ప కవిత్వం ‘రాత్రి వీస్తున్న గాలి’

[శ్రీ ముకుంద రామారావు గారి ‘రాత్రి వీస్తున్న గాలి’ అనే కవితా సంపుటిని పరిచయం చేస్తున్నారు డా. కాళిదాసు పురుషోత్తం.]

హృదయ కవిమిత్రులు శ్రీ ముకుంద రామారావు గారి కవితా సంకలనాలన్నీ ఇష్టంగా చదివాను. అనువాద కవితలు, స్వీయ కవితలు అన్నీ చదివాను. చాలా సీదాసాదా పదాల తోనే ఎంతో గంభీరమైన భావాల్ని కవితల్లో పలికిస్తారు. వారు ప్రకృతి ప్రేమికులు, ప్రకృతిలో ప్రతి చిన్న మార్పు వారికి కవితా వస్తువే. ఈ కవితలన్నిటి వెనక, మానవుల పట్ల, జంతువుల పట్ల, చెట్టు చేమలు పట్ల అపారమైన ప్రేమ.. ఇష్టం.

ఈ సంపుటికి ‘రాత్రి వీస్తున్న గాలి’ అనే కవిత పేరే పెట్టారు. ఎనభమ్యో పడిలో ప్రవేశించినా కవిగారు నిరంతరం ప్రకృతిని గమనిస్తూనే ఉంటారు. తనలో వయసు తెచ్చిన మార్పులు, దృక్పథంలో వచ్చిన పరిణతి ఈ కవితల్లో పొదిగారు.

~

రాత్రి వీస్తున్న గాలి..

చెట్లను కోల్పోయిన ఆకులు

తానొచ్చిన అడవికి దూరమైన బొగ్గు

……

శరీరమంతా రక్తం..

~

‘ప్రతి పదమూ చివరి పదమేనేమో!’ అన్న ఆర్తి ఈ కవితల్లో ధ్వనిస్తుంది.

120 పుటల పుస్తకంలో 51 కవితలు.

ఇక్కడ ఏ కవితను ఉదహరించను? ఎంపిక చేద్దామన్నా, ప్రతి కవిత మనోహరంగా అనిపించింది.

~

అనుభూతి అనుభవం’ కవితలో వర్షపు నీటి బిందువులను – “కిటికీ మీద/కన్నీరులా కారుతున్న/చినుకులు” అంటారు.

మలి సంధ్యలో విస్మృతిలోకి జారుతున్న స్మృతులను “పలక మీద/చెరిపివేయబడ్డ అక్షరాల్లా/గుర్తుకు తెచ్చుకోలేని/జ్ఞాపకాలు” అని పోల్చుతారు.

మారుతున్న జీవన సరళిని “ఏ బల్లయితే నేమి/నిలబడి తినడం కూడా/అలవాటు అయిపోయాక అందరికీ” అని వ్యాఖ్యానిస్తారు.

వాలిపోతున్న నీడ’ కవిత వృద్ధాప్యంలో మెదిలే అనేక ఊహలను.. “ఎన్ని సూర్యుళ్ళను చూసినా/ఇవాళ్టి సూర్యుడు/రేపు నిజంగా కనిపిస్తాడా../

అతనికీ తెలుసు/తెలిసిన చిరునామాకయినా/ఎంత దూరం వెళ్ళాలో/చేరేవరకూ ఆరాటామేనని/” అని వ్యాఖ్యానించారు.

నీడలన్నీ’ కవితలో “ఎంత భారంగా వాలిపోతున్నాయో ఆ నీడలు/నేరుగా గోడల మీదో/ఇతర నీడలతో కలిసిపోయేందుకు” అంటారు.

ఊహలకు అందని అనుభవాల దృశ్యాలు!

వర్షాభినయం’ కవితలో మెరుపులు.. “మేఘాల మధ్య ప్రేమ/అందరికీ తెలుసేలా/తళతళా మెరుపులై/ఉరుములై ప్రకటిస్తాయి/…/నిరాశ్రయ మేఘాలు/ఎక్కడో ఎప్పుడో అలసిపోయి/జలజలా కన్నీరు కారుస్తాయి” అంటారు.

ఆగిపోని..’ కవితలో “ఎన్నెన్ని బరువులో అందరివీ/అన్నీ ఒకే సంచీలో/మోసుకు తిరుగుతున్నారు/ఎవరి కన్నీళ్ళు వారివే అయినా/కన్నీళ్ళలో తేడా లేనట్టే/అందరినీ తాకుతున్న బాధ” అంటారు.

ఆదివాసీల జీవన తత్వాన్ని ‘ఆదివాసీలు’ కవితలో ఎంత బాగా నిర్వచించారో చదవండి: “ఆకాశ నక్షత్రాల నిశబ్దం/ఏకాంత పర్వతాల గాఢ నిద్ర/వాగులూ వంకలూ/అడవులూ పక్షులే కదా/ఆదివాసీల చదువులు.”

జ్ఞాపకాలను ముకుంద రామారావు గారు కొండతో పోల్చి, “లోపల జ్ఞాపకాల కొండ/పెరుగుతూ తరుగుతూ/నా దారినే కొనసాగుతోంది/ఎప్పటినుండో ఏమో” అంటారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, వృద్ధులకు వీపు మీద కళ్లుంటాయన్న మాటలు ఈ చరణాలు చదువుతున్నాప్పుడు గుర్తొస్తాయి.

కలల వ్యాకరణం’ కవితలో, “ఎన్ని భాషలొచ్చినా/కలల భాష వేరుగా లేదు/ఎప్పుడూ ఒకటే భాష/మనుషులు వేరు వేరైనా కనే స్వప్నాలన్నీ ఒకటే” అంటారు.

ఆశ చావదు’ కవితలో, “కూకటి వేళ్ళతో/పెకలించబడుతున్నా/కొంత కాలమయినా/బతికున్న చెట్లు/మనుషులు” అంటారు. కొట్టిపడేసిన చెట్ల మానులు చిగురించే దృశ్యం ఈ చరణాలు చదువుతున్నపుడు నా మనసులో తోచింది.

“చీకటి భయమే లేని విత్తనం/అన్ని చీకట్లనూ చీల్చుకొని/తల పైకెత్తి/ఆకాశాన్ని అందుకోవాలని/చూస్తూనే ఉంటుంది/నిశ్శబ్దంగా/../మొలకెత్తే విత్తనం/ఏమడిగినా ప్రశ్నలానే ఉంటుంది” అంటారు. ఎంత నిశితమైన చూపో!

రైలు’ కవితలో, రైలు ప్రయాణంలోకిటికీ నుంచి దృశ్యాలు చూస్తూ, “వెలుగు చీకట్ల మధ్య పయనిస్తూ/ బయట ఆకాశాన్ని, పొలాల్ని, వాగుల్ని,/నన్నూ, సముద్రాల్ని/ఇళ్లను, భవనాల్ని,/గుళ్ళను గోపురాల్ని,/బయట ఉన్న సమస్తాన్నీ/తెరచి ఉంచిన కిటికీ చూపిస్తూనే ఉంది” అంటారు.

నా వరకూ, ఎక్కడో సుదూర ప్రదేశానికి రైలు ప్రయాణం చేస్తూ, సంజెవేళ ఇళ్ళల్లో వెలిగించిన దీపాలు, పిల్లలు, స్త్రీలు పంచల్లో కూర్చుని ఉండడం వంటి దృశ్యాలు చూడగానే చాలా దిగులు.. ఎందుకీ ప్రయాణం? వెనక్కి వెళ్ళిపోతే అని క్షణకాలం అనిపించేది.

శాండియాగో’ కవితలో “రోజూ సూర్యుడు ఎక్కడికి పోతుంటాడని/అడుగుతాడు మనుమడు/నీకూ నాకూ తాతలకు తాతే అతను/చూసుకుందుకు మనకు ఒక ఇల్లే/అతనికి ఎన్ని ఇళ్ళో/నువ్వు లేచేసరికి వచ్చేస్తాడు కదా/ అని సర్ది చెబుతాను” అంటూ బాల్యంలోని అమాయకత్వాన్ని రూపు కట్టిస్తారు.

జాలరి’ కవితలో “ఇంటిలో మగవారిని/యుద్ధానికి పంపుతున్నట్లు/ సన్నద్ధం చేసి పంపుతుంది/” అంటారు. ఆ తల్లి మనసును ఎంత సున్నితంగా చిత్రించారో ఈ కవితలో!

~

ఇట్లా రాస్తూ పోతే ‘రాత్రి వీస్తున్న గాలి’ సంపుటిలోని ప్రతి కవితనూ పరిచయం చేయలనే లౌల్యం నన్ను ఆవహిస్తుంది!

లేదు, ఇంత గొప్ప కవిత్వాన్ని ఎవరికి వారే చదువుకొని పలవరించాలి.

***

రాత్రి వీస్తున్న గాలి (కవిత్వం)
రచన: వై. ముకుంద రామారావు
ప్రచురణ: బోధి ప్రచురణలు, హైదరాబాద్.
పేజీలు: 118
వెల: ₹ 150/-
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, హైదరాబాదు.
ఫోన్: 92474 71362
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Raatri-Veestunna-Gaali-Mukunda-Rama/dp/B0DNSSCRJC

Exit mobile version