[తొలి ఏకాదశి హరివాసర సందర్భంగా శ్రీమతి మరింగంటి సత్యభామ గారి ‘రాసలీలా విలాసం’ అనే దీర్ఘ కవితను అందిస్తున్నాము.]
శరదృతు వాగమనమున వనముల రొంపు లెండె
జ్ఞానయోగుల మదివోలె శాంతమాయె నభము
వినువీధి నక్షత్ర దీప్తుల ముత్యాల జల్లు పరచె
చంద్రచంద్రకా పరిమళ ధాన్య రాశులు పంటలు
పుడమి మాతకు ప్రణమిల్లి అనురక్తితో భక్తి చాటె
పక్షి గణములు వెన్నుల కబళించి ఆరగించి
కిలకిలా రవముల గగన వీధి నెగురు వేళ
సైకత తిన్నెల మునివరులు ధ్యాననిష్ఠా గరిష్టులై
మునికన్యలు వన సుమ తరువులు తడప
పూతేనియలుగ్రోలి జుంటితుమ్మెదలు భ్రమర
నాదమే ఓంకార ప్రణవనాద మాధుర్యమున
నిశిరాజు కిరణముల వనరాణి పులకించి
రాయంచల రాజిల్లు వాణివల్లభు సౌధము
అభిరామ ఆరామ మాయె సాగరము భువికి
మేఘ మాలిక నభమున అలంకారముగ
చంద్రకా శోభల ఇలా తలంబున శరదృతువు
రాగ శుభ హారతుల సిరిదేవి దైవా రాధన వేళ
ఆలమందల బృందసమేత గోవిందుడు
అరవిందాననలమధ్య ఇంద్రనీలమైమెరయుచు
నొప్పెనీలమేఘమేని రూపముగలవెన్నుడు
బృందావనమున పశులపాలించువనమాలి
కర్ణికారసుమములు కర్ణమునదాల్చివెన్నుడు
శిఖిపింఛధారియై వేణువును చేబూని అప
సవ్య పాద మృదులాంగుళీ చాతుర్యమున
షడ్జమధ్వనుల డాకాలిపై కుడికాలు నడుమ
చాచి వనమాలకాంతులతో సంగీతవిన్యాస
వేణునాద వేదగంధర్వగానము మురళీ
రవము పూరించుచు ఆల వెనక వన
సంచారియై సంచరించ గోపికాలలనలు,
కమలనేత్రుడు మురారి వంశీనాదరాగమున
బృందావనమున కర్ణాంగుళీ విలాసమున
షట్ స్ధానముల మురళినూదసాగెవేడుకగ
రారేచెలులార రమణీమణులార ఒండొరులు
రా రండని పిలిచి ఆనంద మానసులైచనిరి
నవ గోస్ధాన రంగము కేళీ వినోద లాస్యము
చేయుచుగోప బాలకులచేరరారే వేవేగ
కృష్ణుని అధరము మోవిసొంపారవీక్షించి
నేత్ర పర్వ మాయెననిపులకరింతలఏజన్మ
పుణ్యఫలమో కణుపుల వంశమ్ము పరమాత్మ
అధరాన మెరపులీనె యమునానదీ అలల
వేణువు వర్ధిల్లెనా ఏమి ఎంతధన్య మాయె
వంశి తరువు జన్మ సిధ్ధించె వెన్ను నధరము చేర
పిల్లనగ్రోవి గానమున పూదేనియలు జాలువారె
కరిమేఘ రూపున వేణునాదము ఉరుముల
మెరపు లతో కేకి క్రేంకారమున నాట్యమాడ
కృష్ణ పద ముద్రల బృందావనము ఇంద్రనగరిగ
జ్షానభావన లేని వనచరము లన్ని పూజ్యభావము
తోడ ఉప్పొంగిపోయె లేగలు పాలు కుడువక
వేణు గానము విని కన్నుల వెన్నుని గనుచు
గోవులుమేతలు మేయక కృష్ణ గానామృత
ధారల గ్రోలుచు నేత్రము లన్నియు వెన్నుని
వేపు ఆనందాశ్రు బిందు హర్ష వర్షముల
మురళీ రవ సుధా రస ధారల త్రాగుచు
పక్షి గణములుఅరమోడ్పుకనులతొ మ్రొక్కెను
గోవిందు స్వరజతి గానము లను విని
నీలి మేఘము పరిమళ పుష్ప వర్షము కురిసె
మయూఖ పింఛాలంబన భిల్లపడతులు
పింఛమాలికల సమర్పించిరి భక్తిభావన తొ
కొండల నుండి నీటి వాలులు జాలు వారగా
దివిజులు గగనము నందు నిలిచి చూసిరి
ఏమినోము ఫలమొ రేపల్లె వ్రేతల పుణ్యరాశి
ఫలమొ నంద నందనునితో రాసకేళీ విహారం
శరదృతు చంద్ర కౌముది వనమున గోప
భామినుల గూడి వలయా కారప్రభల నిలచి
రాసము దాస్యము సవిలసరీతి సలుప
గమన గతుల గమనమున విన్నాణీ హరి
ఆదెస ఈదెస వీణా వాదన ప్రవీణలు వీణ
మీటుచు సొంపార ఆనంద లహరుల వలె
తరళ సరళ అవిరళ మురళీ రవమున
మధురా ధరమున చేరి విలాస గానము
వ్రేతల శిఖసౌగంధికాసుగంధతావిలీనగ
యతి, లయ, తాళ, విన్యాసముల వేణువు
నూదుచు, త్రిభంగి భంగిమ నిలచి వెన్నుడు
పద్మ కర్ణిక మధ్య నిలచినట్లు పద్మ రేఖల
వల్లవాంగనలు వెనుక గోపవల్లభుండు
ఒక్కొక్కగోపికకు ఒక్కగోపాలుడు ఎచట
చూసిన రాస కేళీ విలాసము రాక వెలుగుల
లోన రాస లీలా ప్రకాశము
నృత్యార్ణవ వేలా వలయ వలయాకార
రాసక్రీడ ఆమండలము వీక్షించీ గగనమున
సురలు, నారద, తుంబురాదులు, యక్ష
గంధర్వ, కిన్నరలు హర్షానందస్మితహర్ష
నభో తలసుగంధపుష్ప వర్షము కురిపించి
దేవధుంధుభుల, మేళ, తాళముల
నారద తుంబుర వీణాగానమున
అచ్చెరువున వీక్షించిరి రాసకేళీ విలాసం
పుష్ప మంజరీ భ్రమరాతి శయ శోభల
స్వర్ణ మణిమయ రత్నముల నడుమ
వెన్నుడు మహేంద్ర నీలమణి వోలె మెరయ
కుంజర సింధురముల సౌరుల కుసుమిత
సుమముల రీతి పల్లవిత లతల నల్లుకొను
మెరపుతీగలవలె అతిశయించు కరిమొగిళ్ళ
తరంగిణుల తోనున్నరత్నగిరి శిఖరము
సుందర దరహసిత వదనారవిందుడు
విశ్వమోహనాకార వసుదేవ సుతుడు
అరుణ తామరవంటి నఖముల వడిలోన
వేద, శృతు, లలంకారముల, యోగివరులు
నుతించు చరణారవిందముల కంజలి
ఘటించి అంజలి నిండుగ పుష్పవర్షా
భిషేకమున, భక్తి ప్రపత్తులప్రవరల తోడ
పద్మహస్తినులు పద్మమాలికల గోపాలు
నలంకరించి అలరించ గీతానుసారాధ్భుత
సంచారము సలుప వర్తులాకార
రాస బంధముల రాస క్రీడా నర్తనము
చేయుచు గోపీ లలామలు శంఖాకార
విన్యాసముల నృత్య కళా భంగిమల
భ్రమర జాను వర్తనల గిరగిర తిరుగుచు
సుర మండలమున కరము లెత్తి నటించి
దర్పణమున లలాట తిలక రేఖ లదిద్ది
మయూర నృత్యము కదలి చేయుచు
సురగంగా ప్రవాహ మభినయించుచు
ఏకపాద తానకమున మురిసి
సమ పాదతాడనమున నటించి
వినివర్తిత తాడనమున నటనచేసి
గత గతా తాడన నాట్య హేలల
పరిత తానకమున మొగ్గ వలెనర్తించి
వైశాఖ తానకమున శాఖలై కదలి
మండల తానకమున నృత్య
మండలము చుట్టి త్రిభంగి తానక
మువ్వంకల దేహమును వంచి
తమ కమున కింకిణీ మంజీర
మధుర శింజనీ రవళుల గజ్జెలు
ఘల్లు ఘల్లు మన అందెల సవ్వడి
ఇంపు గూర్చగ అరవిందాననల
అడుగుల సవ్వడి మర్దిత నటనలు
పాదకర్మలు పార్ధివ చార భంగిమల
గోవిందు డెచటని వెతుకు నటనల
ఎదురుచూపుల ముఖ కవళికల
అలుకలు కినుకలు ఉగ్రా గ్రహముల
మనోహర హసిత నేత్రాభినయమున
గంగా ప్రవాహ గతుల అభినయము
మయూర నృత్యము కదలి చేయుచు
వాలుచూపుల కరుణారస దృక్కుల
మమతలు మీరగ వికాస చూడ్కుల
ముకుళ నయనముల నవ్వు మోముతో
కుంపిత కుంఠిత శిరోముద్రలతో
అపరాజితాంగ హారముల సిరి
మువ్వల రవము పద్మాకార బంధనల
హరి చేరువలో సుందర గతి గమన
మురళీ గానామృత రస వాహినిలో
రాసక్రీడలు గోవిందునితో రమణు
లాడిరి భయ భీభత్సాభి నయమున
సురేంద్ర శాఖా మనోహర కదలిక
అర్ధ చంద్రాకార భావమున నటించి
వివిధ భంగిమల హస్తాభినయము
మురళీ మోహన గంధర్వ గానము
జాలువారగా పలు రీతుల రాసలీల
యజ్షేశ్వరుడైన నల్లనయ్య గోపికల
కేల్పట్టీ వ్రేతల గూడి నర్తన మాడగ ప్రభుని
యమునా నదీ వారి తుంపరలతో
వన వాటికా సుమ పరిమళముల తావి
మంద మలయానిలు సమీర వీచికల
రాసలీలా కేళి నలసిన ప్రమదల
సేదతీర్చ పవనుడు వీవనల వలె
సైకత పవనసేవ హరిమానస మలరింప
మంగళకర మారుతము వీచువేళ
నొకలేమ మాధవ గానమున వీణియ
తీగమీటె రమ్య స్వర సమూహముల
స్ధాయితోడ రమణుడాకర్ణించిమేలు
మేలనగ ఆటపాటల అలసిన ఇంతి
హరి కరముల స్పృశించి సేదతీరె
చందన పూతల పద్మ పరిమళముల
వనమాలి మూపున ఆనినిలచె
తగుతగు రీతుల గోపికలు సేద తీర్చి
రాసలీలల నలసిన చెలియలు హరి
బింబ ప్రతిబింబము గా నలరించ
నంద నందను తోడి సల్లాపములు
జన్మ జన్మల పుణ్య ఫలమని నుతించి
రాసక్రీడ చాలించి సుందరాంగులతో
తటిల్లతల వలె ముత్యముల బోలు
చెమట బిందువులు మెరుపులీన
అలసిన రమణులతో యమున
యందు సలిల క్రీడలనాడె కంసవైరి
హంసల మీనముల తామరతూడుల
పద్మ ముఖులు పుష్ప శర రీతిగ
తళతళా కృతి మేనుల వారి జల్లుల
సరస సల్లాపముల జలక్రీడ లాడ
శ్వేత కాలువల నీలోత్పలములతో
బంతు లాడసాగె ఇంతు లందరును
కలువ పుప్పొడుల తో ముక్కంటి వోలె
దేవేంద్రుని వలె ప్రభవించె కేశవుడు
యమున నుండీ వెడలి పీతాంబరము
దాల్చి సుగంధ లేపనా లంకారముల
పల్లవ లతల కుసుమ శాఖల విలాస
పుష్పశయ్యల శయనించె వినోద హేల
సకల ధర్మకర్త చేయు క్రియ లన్నియు
సకలమ్ము భక్షించు అగ్నిరీతి
దోషమంటనివాడు సర్వేశ్వర సత్య ప్రభువు
గోపాలకుల లోన,గోపికలయందుసకల
జీవరాశుల అంతరాత్మవేదపురుషునకు
పరాంగన లెవరుసర్వ వ్యాపకుడు
విశ్వవిభుడు కృష్ణమాయాప్రభావ
మోహితులు వ్రేతలు
మాయామానుష విగ్రహధారీ అసురారీ
మురారీనమో నమః
నమోనమః నమోనమః
~
దశమస్కంధం 4 లో రాసలీల నాట్యముద్రల వివరణ చూడగలరు
స్వరసమూహం
స్వరస్ధాయి తాళగతి
వ్రేతలు గొల్లభామలు
ఖేచరులు దివిజులు
నంద్యావర్త 64 అక్షరాల తాళగతి
చంద్రుడు రస కారకుడు పంటల దేవుడు
చంద్రికలు వెన్నెల కౌముది
డాకారి ఎడమకాలి వద్ద కుడికాలుఎత్తి
బొటనవేలుకింద ఆన్చుట!
~
కృష్ణమురళీ వాయిద్య చిత్రంలో గమనిస్తే, పాదములు చేతివేళ్ళు ముఖభంగిమల భావము గ్రహించవచ్చు
షడ్జమస్వరాలు
నాసిక కంఠం శిరస్సు జిహ్వ
తాలుపు దంతములు
కణుపు వెదురుకణుపు
కరిమేఘం నల్లనిమేఘం
మర్దితం బంకమన్ను తడిపి కాళ్ళతో కుమ్ముట
తంత్రి తంతువు తీగ
తరళ స్ధిరంగా
సరళ మధ్యగల
మురళీ వేణువు పిల్లనగ్రోవి
విస్మయం ఆశ్చర్యం
మారేడు మారాజు రెండు యమకాలంకారం
మారేడు దళం
తమ్మిపుట్టి బ్రహ్మ
గింజపట్టనిధాన్యం పాలుపోయనిధా న్యం
ఏతము రెండువేపులా నీరు తోడు తాడు బొక్కెన
కుంజర కరేణు ఆడ ఏనుగు
సింధుర మగఏనుగు
కర్ణకారపుష్పం కొండగోగుపువ్వు
మారేడు బిల్వపత్రం
కేకి క్రేంకారములు మయూరధ్వని
నెమలిఅరుపు
హసితనేత్రాభినయం కనులతోనవ్వునటన
శాఖ కొమ్మ
నీలోత్పలము నీలికలువ
(భక్తిలీలావారాశి దశమస్కందం నుండి. శ్రీ బమ్మెర పోతనామాత్యులకు సాష్టాంగ నమస్కారములతో..)