Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రారా మా ఇంటికి

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన వి. శ్రీనివాస మూర్తి గారి ‘రారా మా ఇంటికి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

ప్రభాకర్ ఆఫీసులో తన అర్ధాంగి శ్రావణి కాల్ కోసము ఎదురు చూస్తున్నాడు. ఏ పని మీద, మనసు నిలవడం లేదు. తను చెప్పబోయే ఫలితము ఎలా ఉంటుంది అని ఒకటే ఆలోచనలు. తమ దాంపత్య జీవితంలో, తన వ్యక్తిగత జీవితంలో, ఇరు కుటుంబాల జీవితంలో ఆ ఫలితం ఒక మైలురాయి కాబోతోంది.

అలా ఆలోచిస్తూ ఉండగానే, తన ‘స్వీట్ హాఫ్’ నుంచి మెసేజ్ ఫోన్ మీద. పరీక్షల ఫలితాలు వెబ్‌లో ఇంతకు ముందు చాలా సార్లు చూసుకున్నాడు. కానీ ఈ సారి మనసులో ఉద్వేగం భిన్నంగా వుంది. కళ్ళు పెట్టి చదవాలని ఉత్సుకత, ఫలితం తాను అనుకున్నట్లు వుండదేమో అని భయం. మిశ్రిత అనుభూతులు. అయినా ఇక ఆపుకోలేక చూశాడు.

“ఆ పరమాత్మ మన ఇద్దరి తల్లితండ్రులుకు మనవడు, మనవరాలు రూపంలో పదోన్నతి ప్రసాదించాడు”

ఒక్క క్షణం కాలం ఆగిపోయినట్లు అనిపించింది. ఒక పెద్ద విజయం సాధించినట్లు, ఆనంద శిఖరం అధిరోహించినట్లు హృదయం పొంగిపోయింది. తన జీవితంలో పెద్ద బాధ్యత కూడా మనసులో స్పురించింది. తెలియకుండానే అతని నోటి నుంచి ఏదో శబ్దం గట్టిగా బయటకు వచ్చింది. పక్కనే కూర్చొనే తన మిత్రుడు కృష్ణ “ఏంటి గురు, అలా అరిచావు” అన్నాడు.

సరే శుభవార్త చెప్పడం, అందరికీ పాకడం, హాల్లో వున్న వారంతా వచ్చి అభినందనలు చెప్పడము, దాదాపు అరగంట దాటిపోయింది. శ్రావణికి కాల్ చేస్తే బిజీ వచ్చింది. కాసేపటికి తానే కాల్ చేసింది. “చాలా ఆనందంగా వుంది డియర్, ఇంట్లో ఒక గంటలో కలవబోతున్నాము. టేక్‌ కేర్” అని పెట్టేసింది. సిగ్గుతో ఆమె బుగ్గలు ఎరుపు ఎక్కడం, ఆమె ఆనంద బాష్పాలు, తనకు ఫోన్‌లో కనిపించాయి. ఆమె గుండె తన గుండెతో గుసగుసలు చెప్పుకున్నట్లు భావన.

ఇంటికెళ్లే సరికి తాను ముందుగానే ఇంటికి వచ్చి నీట్‌గా తయారు అయ్యి సోఫాలో కూచుని ఎవరితోనో ఫోన్‌లో మాటలాడుతూ కనిపించింది. దగ్గరకు వెళ్ళి అమాంతం ఎత్తుకొని గిర్రున తిరిగాడు. ఆమె నవ్వుతూ, కేరింతలు కొట్టింది.

“నీవే ముద్దొచ్చే అల్లరి పిల్లవి. నీవు తల్లి కావడం”.

“ఇక ఈ ఇంట్లో నవ్వులే నవ్వులు”

ఛాలా సేపు కౌగిలిలో ఇమిడి పోయారు. మాటల కంటే, అలా ఒదిగి వుండటమే సరి అనిపించింది ఒకటైన ఆ రెండు హృదయాలకు.

“రాణి గారు ఇక కాలు కింద పెట్ట కూడదు”అంటూ కిచెన్‌లో రెండు కప్పులు టీ కలుపుకొని వచ్చాడు. ఇద్దరు పక్కపక్కన కూచుని తమకు ఇష్టమయిన సినిమా పాటలు వినడంలో లీనమయ్యారు. ఆమె ఒడిలో పడుకొని ఆమె పొట్ట దగ్గర తడుముతూ తన్మయం చెందాడు. ఆమె అతని జుత్తులో చేతి వేళ్ళు పోనిస్తూ తన్మయత్వం చెందింది. బయట పడడానికి చాలా సేపు పట్టింది. ఆ రోజు బయట డిన్నర్ చేసి, రాగానే పడుకున్నారు.

***

గత వారంగా, వారి మనసుల్లో ఆనందం, తెలియని భయము చోటు చేసుకున్నాయి. రొటీన్ పనులు మధ్య కూడా తమ బిడ్డ గురించి, తాము ఈ పెద్ద బాధ్యత ఎలా మోయగలము అనే ఆలోచనలే. మెల్ల మెల్లగా ఈ లోకం లోకి వచ్చారు. మనసులు కొంత కుదుట పడ్డాయి. ఆదివారం ఉదయం కాఫీ తాగుతూ ఎలా తమ బిడ్డని ఆహ్వానించడానికి తయారు కావాలని మాటలాడుకున్నారు.

ఈపాటికి ఇద్దరు ఆన్‌లైన్ లోను, స్నేహితుల ద్వారానూ, ఇద్దరి తల్లిదండ్రుల దగ్గరి నుంచి, చాలా సమాచారం, సలహాలు, సూచనలు సేకరించారు. అవి వారి వారి అనుభవాలు, ఆలోచనలు, నమ్మకాలు. ఇక సరే మెడికల్ పరంగా డాక్టర్ గారు చెప్పినవి. ఆహారం, నిద్ర, వ్యాయామం గురించి.

ఇంతకు ముందు, కాబోయే తల్లులకు, అమ్మ, అమ్మమ్మ, అత్తగారు, కుటుంబంలో ఇతర పెద్దలు సలహాలు పాటిస్తే చాలు. వారు కూడా, కొద్ది తేడాతో, ఒకే విధంగా చెప్పేవారు. ఎన్నుకొనే సమస్య లేదు. జీవితం సులభంగా ఉండేది.

ఇప్పుడు ఇంత సమాచారం వుంది. దాంట్లో నుంచి కాబోయే తల్లి శారీరక, మానసిక స్థితికి అనుగుణంగా తమ తయారీ ప్లాన్ చేయాలి.

మాటల్లో చాలా విషయాలు వచ్చాయి. కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు

ఎవరు చెప్పినా, లింగ నిర్ధారణ పరీక్షకి వెళ్ళే ప్రశ్నే లేదు. ఆ దేవుడు ఎవరు ప్రసాదిస్తే వారిని స్వీకరించడమే. అదీ కాక, ఆ ఉత్కంఠతో ఎదురు చూడడమే మజా. సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరికి ప్రయత్నించాలి. కాన్పుకి ఒక నెల ముందు సెలవు తీసుకోవాలి. బిడ్డ పుట్టిన తర్వాత, ఒక సంవత్సరం కంపెనీ ఇచ్చే సెలవు కాకుండా ఇంకొక సంవత్సరం లీవ్ తీసుకోవాలి. దీనికి ఇప్పటి నుంచే కంపెనీ వారి పర్మిషన్కి అప్లై చేయాలి. కనీసం ఒక సంవత్సరం వరకు బిడ్డకి తల్లి పాలు పట్టాలి.

ఇక సరే బేబీకి క్రిబ్ అదీ ఎక్కడ ఏర్పాటు చేయాలి, బొమ్మలు, డ్రెస్సులు, వాటి గురించి కూడా. ఈ చర్చలు రెండు మూడు ఆదివారాలు జరుగుతూనే ఉన్నాయి.

కొన్నిటి మీద అభిప్రాయ బేధాలు, అలకలు, బుజ్జగింపులు షరా మామూలే. ప్రతి ఇంటా వుండేవే.

శ్రావణి ఆహారం వరకు అమ్మ, అత్త గారు ఎన్ని చెప్పినా, తాము బాగా నమ్మిన డాక్టరు గారు చెప్పినదే పాటించదలచుకొన్నారు. అత్తగారి మాటలు కొన్ని వినలేదని కోపం రావడం, ప్రభాకర్ కూడా కొంత విసుగు పడిన మాట వాస్తవం. అది పదే పదే మనసులో ఆలోచనగా వస్తున్నా, ఈ సమయంలో శ్రావణి మనసు ప్రశాంతంగా వుండడం అవసరం అని బయట పడకుండా వుంటున్నాడు. ఇలాగే రెండు మూడు విషయాల్లో పూర్తిగా ఇష్టం లేక పోయినా ఒప్పుకోవడం వల్ల మనసులో ఒత్తిడి పెరుగుతూనే వుంది. శ్రావణికి కూడా ఒకటి రెండు సార్లు ప్రభాకర్ తన అమ్మానాన్నల గురించి చేసిన కామెంట్స్ మీద తీవ్ర మనస్తాపం కలిగింది. ఆమె మనసులో కూడా పూర్తిగా అవమానం అనే భావన పోలేదు. అత్తగారి, ఆడబిడ్డ వ్యంగ్యం మాటలు, సూటి పోటీ మాటలు చెప్పనక్కరలేదు. ఈ మాటల ప్రస్తావన వస్తే శ్రావణి కాళీ మాత రూపమే.

ఇక పేరు ఏమి పెట్టాలి అనే దాని మీద కూడా అన్ని ఇళ్లలో లాగే దీర్ఘ చర్చ. పేరు నూతనంగా వుండాలి, అరుదైనదిగా ఉండాలి, పొట్టిగా ఉండాలి. అమెరికా వెళితే సులభంగా అందరూ పలికేటట్లు ఉండాలి. ఇవి వారి ఆలోచనలు. అన్ని రకాల సహస్ర నామాలు, ఆన్‌లైన్ శోధనలు, అన్ని అయిన తర్వాత ఇద్దరు కలిసి, ఒక అయిదు లిస్ట్ చేశారు. ఇక ఫైనల్ చేయాలి. ఈ లోపల ఇద్దరి కుటుంబాల నుంచి, ఇష్ట దైవం, ముత్తాత, పెద్ద బామ్మ పేరు కలవాలని, సూచనలు వస్తూనే వున్నాయు. వీరు అంత అనుకూలంగా లేరు అని తెలిసిన తర్వాత

“ఈ తరం పిల్లలకు పెద్దల మాట నచ్చదు. పెద్దలంటే లెక్క లేదు”మనసులో అసంతృప్తి.

ఇవి కూడా దంపతుల మనసులో అలజడి కలిగిస్తున్నాయి. అందరికీ నచ్చేటట్లు చేయడము అసాధ్యం అని తెలుసుకొన్నారు.

“మనల్ని ఎందుకు అర్ధం చేసుకోరు ఈ పెద్దలు. నిజంగా మన మంచి, బిడ్డ మంచి కోరితే మనసు కష్టపెట్టే మాటలు ఎందుకు అంటారు. వారి మాట నెగ్గడం, పెద్దరికం ముఖ్యమా, అందరు ఆనందంగా వుండడమా??”

ఇంటి పనులు, ఆఫీసు పనుల మధ్య డాక్టర్ విజిట్లు, తయారీ గురించి మాటలు జరుగుతూనే ఉన్నాయి

***

ఒక ఆదివారం ఉదయం మరలా తీరికగా దంపతులు కూర్చొన్నారు.

శ్రావణి మొదలు పెట్టింది.

“మన బిడ్డని ఆహ్వానించడానికి తయారీలో భాగంగా కావలసిన వస్తువులు, నేను తినే ఆహారం, పేర్లు, చాలానే పూర్తి చేశాము. ఇవి అందరూ చేసేవే. డబ్బులు పడేస్తే దొరికెవే. ఇవి మనము అనుకుంటున్నాము, వచ్చే బిడ్డకు అవసరం అని. కానీ ఆలోచిస్తే నిజంగా ‘అవి బిడ్డకు అవసరం’ అనిమనము నిర్ణయిస్తున్నాము. ఇక అందరి లాగే జీవితాంతం మనము ఇదే దారిలో పోవడం కరక్టేనా?? బిడ్డకి కావలసినవి అన్నీ మనకే తెలుసు. వారి ప్రమేయం అవసరం లేదు అని. కొన్ని విషయాలలో మనము కూడా మన పేరెంట్స్, మన మనసు తెలుసుకోకుండా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అది సరికాదు అని మనము అనుకోలేదా, వారికి చెప్పడము కూడా జరిగినది. తెల్సి మనము ఆ తప్పు చేయాలా”

ప్రభాకర్ ఓపికగా విన్నాడు. సబబు అని పెంచింది. కానీ అతిగా ఆలోచన చేయడము లేదు కదా అని అనుమానం. అందరి కంటే భిన్నంగా వెళితే ఇబ్బందుల్లో పడతామా అని అనుమానం శ్రావణి తో వెలిబుచ్చాడు.

శ్రావణి చెబుతూనే వుంది

“బిడ్డ పెరుగుదలకు, బిడ్డ భవిష్యత్తుకు, మానసిక ఆరోగ్యానికి, నా కడుపులో బిడ్డ ఎలా ఫీల్ అవుతుంది, వీటికి మనము చేసిన ఏర్పాట్లు ఏవి నేరుగా సంబంధించినవి కావు. అలా అని ఇవి అవసరం లేదు అని నేను అనడం లేదు. కానీ ఇవి తయారీలో ఒక భాగం మాత్రమే. ఆహారం వరకు నేను సరిగా తీసుకుంటున్నాను ఇద్దరికి. అది శారీరక పెరుగుదలకి ఉపయోగపడుతుంది. ఎదుగుదల కేవలం శరీరానికి సంబంధించినది కాదు కదా. మనసుకు, హృదయానికి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి కదా. మనము ఇద్దరు వాటికి కావలసిన ప్రాముఖ్యం ఇవ్వలేదేమో అనిపిస్తుంది”

శ్రావణి ఆపి కొంచం నీరు తాగింది.. ప్రభాకర్‌కి కూడా ఆ అమ్మాయి చెప్పిన విషయాలు అర్థం అవుతున్నాయి. ‘ఎంత చక్కగా ఆలోచిస్తున్నది’ మనసులో అనుకున్నాడు. బయటకు కూడా అన్నాడు.

“అవును తొమ్మిది నెలలు నివసించి, రోజు రోజుకి శారీరంగా, మానసికంగా ఎదగవలసిన ఆ జీవికి నా లోపల ప్రశాంత వాతావరణం కలిగిస్తున్నామా??

మన మనసులు, హృదయాలు ఆరోగ్యంగా ఉన్నాయా?? రకరకాల భయాలు, ఈర్ష్య, పక్షపాతం, పగ, శోకం. స్వార్థం, అహంకారము. అంతా చెత్తతో నిండిపోయింది. హృదయంలో ప్రేమ, దయ ఎంత వుంది??. బేషరతు ప్రేమ ఎక్కడ వుంది?? లావాదేవీలతో ముడిపడిన ప్రేమ తప్ప. పరిశుద్ధత ఒక శరీరానికేనా??

ఇంట్లో ప్రశాంతత గురించి ఇంత మాట్లాడుతున్నాము? కృత్రిమంగా, మనసు పూర్తిగా ఒప్పుకోకపోయిన పాటిస్తున్నాము. అంతా బాగానే వుంది అని మనలని మనం మోసం చేసుకుంటున్నాము. మనసులో ప్రశాంతత కృత్రిమం అయినప్పుడు ఆ లోపల జీవిపై ప్రభావం ఉంటుంది అని గుర్తించ లేదు.”

శ్రావణి చెప్పినవి ఒక ఆధ్యాత్మిక గురువు మాటల్లా తోస్తున్నాయి ప్రభాకర్‌కి. ఈ ఆలోచన రావడం కేవలం దైవికం అని ఇద్దరూ నమ్మారు. ఎవరో ఒక కవి చెప్పినట్లు “పిల్లలు నీ నుంచి కాదు, నీ ద్వారా పుట్టారు అని. నీ పిల్లలు కాదు, నీది కేవలం పెంచి పోషించే బాధ్యత మాత్రమే”. అది పూర్తిగా అర్థం అయ్యింది. అనుభవం లోకి కూడా వచ్చింది.

అక్కడకు ఆపేసి, ఆ దిశగా తమ బిడ్డకు అమ్మ కడుపులో ప్రశాంత వాతావరణము ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. గత ఒక సంవత్సరంగా శ్రావణి ఒక ఆధ్యాత్మిక గురువు గారి దగ్గర ఒక ప్రక్రియ మొదలు పెట్టింది. ఆయన సలహా తీసుకుందామని ఇద్దరు వెళ్లారు. ఆయన ఇంత చిన్న వయసులో ఈ యువ జంటకు ఇంత పవిత్రమైన కోరిక కలగడం చాలా సంతోషం అని ఆయన ఒక ప్రణాళిక ఇచ్చాడు. మొత్తము ప్రక్రియ రోజుకు 30 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఇద్దరు కలిసి చేస్తే మంచిది అని చెప్పాడు. ఆయనకు ధన్యవాదాలు చెప్పి. పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదం తీసుకొని ఇల్లు చేరారు. మనసు చాలా తేలిక పడ్డట్లు, హృదయం ప్రేమతో నిండినట్లు అనిపించింది.

***

గురువు గారు చెప్పినట్లు మనసు శుద్ధికి కొన్ని అభ్యాసాలు మొదలుపెట్టారు. ఇంకా మనసులో మిగిలి వున్న కల్మషం కొద్ది కొద్దిగా వెలుగులోకి తీసుకొచ్చి నిశితంగా దాన్ని పరిశీలన చేశారు. పగకు కానీ, ఈర్ష్యకి కానీ, ఒకరితో శత్రుత్వం కానీ పరిశీలన చేస్తే, అసలు మూల కారణం ఏమిటి?? మన అహంకార పూరిత మనసు చెప్పేది అంతా నిజమా, ఆ సంఘటనలో తమ తప్పు కూడా లేదా, అసలు అప్పటి పరిస్థితులు ఇప్పడు లేవు కదా. ఇలా ఆలోచిస్తే మనకే నవ్వు వస్తుంది ఎందుకు ఇంత కల్మషం పెట్టుకొని మనము బాధపడుతున్నాము. ఎదుటి వారు మర్చిపోయి కూడా ఉండవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా ఇంకా పెద్ద సమస్యలు వున్న వారితో మాట్లాడి, అవసరం అయితే క్షమాపణ చెప్పి బాంధవ్యాలను మరల సరి అయిన త్రోవలో తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అ సమస్యలకు తాము కూడా పాక్షికంగా బాధ్యులు అనే జ్ఞానం నిజంగా కళ్ళు తెరిపించింది.

ఈ మధ్య మనసు కష్టపెట్టిన ఇద్దరి పేరెంట్స్‌కి ఫోన్లు చేసి, పాత విషయాలు పక్కకు పెట్టి, మాటలాడారు. అందరి మనసులు కుదుటపడ్డాయి

ప్రతి రోజు కలిసి ధ్యానం చేస్తున్నారు. ఆమె ధ్యానం చేస్తూ, తన బిడ్డ చుట్టూ ఒక ప్రేమతో నిండిన శక్తి ఆవహించినట్లు మానసిక చిత్రం ఏర్పాటు చేసుకుంటుంది. ఇద్దరు చక్కటి సంగీతం వింటున్నారు. మంచి పుస్తకాలు చదువుతున్నారు. తమ వ్యక్తిగత విలువలు, కుటుంబాల విలువలు మంచి హృదయంతో చర్చించుకొని, వాటి సారం గ్రహించి కుటుంబ విలువలు నిర్ధారించుకొన్నారు. దీని వల్ల బిడ్డని పెంచడంలో విలువల గురించి ఘర్షణ రాకూడదని. అలాగే తమ మతపరమైన విశ్వాసాలు, పూజలు, ప్రార్థనా పద్థతుల గురించి మొదటిసారి అర్థం చేసుకున్నారు. ఫ్యూచర్‌లో సమస్యలు రాకుండా. తమ విలువలు, విశ్వాసాలు బిడ్డకు ఎప్పుడు, ఎలా తెలియచేసి ఆ బిడ్డలో ఆ విలువలు ఇమిడిపోవడానికి తమ కృషి ఏంటి అని నిర్ణయించుకున్నారు. ధ్యానం చేసేటప్పుడు తన బిడ్డ కదలికలు స్పష్టంగా ఫీల్ అవుతోంది. ఆ బిడ్డకి, తల్లికి భాషకి అందని సంభాషణ జరుగుతోంది. తన ఆలోచనలు ఒక డైరీలో రాస్తోంది. తాను బిడ్డకు జాబులు రాస్తోంది. తన ప్రేమ, అశలు, కలలు అన్నీ బిడ్డకు చెప్పుకుంటుంది. ప్రభాకర్ గమనిస్తూ తన్మయత్వం చెందుతున్నాడు. ఇద్దరు కలిసి, ఇంట్లో, ఆమె గర్భంలో ఒక పవిత్ర వాతావరణం సృష్టించారు. దీనితో ఇద్దరి హృదయాలు ప్రేమతో, ఆనందంతో నిండిపోయాయి. రోజులు గడిచే కొద్ది ఇద్దరు తమ బిడ్డ పెరుగుదలకు, ఫ్యూచర్‌కి మంచి పునాది వేసామని నమ్మారు. ఇప్పుడు తయారీ సంపూర్ణంగా ఉంది అనే తృప్తి. బిడ్డ గురించి అని మొదలు పెట్టిన ప్రక్రియ తమ జీవితాలను పెద్ద ఎత్తున మార్చేసింది. మనసు నిండా ప్రశాంతత, గుండె నిండా ప్రేమతో జీవించడం ఆనందమయం అయ్యింది. ఇబ్బందులు, సమస్యలు వచ్చినా, ఎవరి మీద తొయ్యకుండా తాము ఆ క్షణానికి చేయ కలిగింది చేయడమే మన చేతుల్లో వున్నది. సమస్యల గురించి వ్యథ వల్ల ప్రయోజనం లేదు అని నమ్మి ముందుకు వెళ్తున్నారు.

మనసు తేలిక, శుభ్రం అయ్యింది. మంచి నింపడానికి స్థలం దొరికింది. మనసు శుభ్రపడగానే, ప్రేమ, కారుణ్యం గుండెలో నిండుగా చేరుకున్నాయి. తన బిడ్డనే కాదు. అందరి బిడ్డలని తన బిడ్డలు అనుకొని అక్కున చేర్చుకోగలిగే అంతా విశాలం అయ్యింది హృదయం. అంతా ప్రేమమయం. తన బిడ్డకైనా, ఇంకా ఎవరికైనా షరతులు లేని ప్రేమ పంచగల స్థితి. స్వంత బిడ్డ కాక పోయినా, యశోద కృష్ణుణ్ణి తిన్నగా హృదయంలోకి తీసుకెళ్లి అక్కడ ప్రేమ సాగరంలో ముంచేసింది. తాను కూడా ఆ సాగరంలో తేలియాడింది. ఏమి ఆశించక ఒక దైవిక కార్యంగా కృష్ణుణ్ణి పెంచింది. యశోద తల్లులకు ఆదర్శం. ఎలా వుండకూడదో తెలియాలి అంటే కైకేయి గురించి తెలియాలి.. చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. కైకేయి హృదయం బదులు మనసు వాడింది. తన కొడుకు రాజు కాడేమో అని భయం ఆమెను నడిపించింది

***

డెలివరి తేదీ దగ్గర పడింది. పూర్తి విశ్వాసంతో, తాను ప్రశాంతతగా ఉంటే ప్రకృతి తన పని తాను చేసుకుపోతుంది అని నమ్మి మంచి భావంతో ఆ క్షణం కోశము ఎదురు చూస్తోంది.

ఆ రోజు రానే వచ్చింది. అమ్మను నమ్ముకున్న బిడ్డకు ఎలా భయం ఉండదో, ప్రకృతి మాతని నమ్ముకున్న శ్రావణికి భయం కొంచం కూడా లేదు. నెప్పులు రాగానే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. లేబర్ గది లోకి తీసుకెళ్లారు. నెప్పులు ఎక్కువయ్యాయి. అవి నచ్చిన, మెచ్చిన, ఎదురు చూసిన నెప్పులు. అంతే చూస్తుండగానే ప్రకృతి అతి సహజంగా పండంటి బిడ్డను (మగ,ఆడ తెలుసుకోవడం అనవసరం) ఈ భూమి మీదకి తీసుకువచ్చింది. శ్రావణి ఆనందానికి అవధులు లేవు. పక్కనే వున్న ప్రభాకర్ ఆనందం శ్రావణి ఆనందంతో కలిసి ఆ గదిలో కాంతి రెండింతలు చేసినట్లు అనిపించింది. శ్రావణి బిడ్డతో “వెల్కమ్ టు దిస్ వరల్డ్. ఏరా మా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?? లోపల అంతా హాయిగా, ప్రశాంతముగా ఉందా. ఏవైనా పోరాబాట్లు ఉంటే సారీ. మా ఇద్దరి తరపున, పెంపకం దేవుడు ఇచ్చిన అవకాశంగా పవిత్రంగా చేపడుతాము. ఆర్ యు హ్యాపీ” అని అంది.

ఆ బిడ్డ తన ఆనందాన్ని తన బోసి నవ్వుతో తెలియ చేశాడు. శ్రావణి వరకు ఆ బిడ్డ హృదయంలోని ఆనందం, తన హృదయంలో వెలిగినట్లు ఫీల్ అయ్యింది.

Exit mobile version