[నెల్లుట్ల సునీత గారు రచించిన ‘రాలిన ఋతువుల్లోంచి’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
ఈ జీవితపు నౌకాయాత్రలో
కాలం రెక్కల పైన ప్రయాణిస్తూ
క్షణాల్ని కరిగిస్తూ రోజుల్ని తరిగిస్తూ
దిక్కుల్ని దిశల్ని దాటి
రాలిన ఋతువుల్లోంచి
సమయం వెళ్ళిపోతుంది
ఎన్నో అనుభవాల్లోంచి
మరెన్నో ఆలోచనల్ని
ఉద్విగ్న భరితం చేస్తూ
గత వర్తమానాల సంధిట
కాలయవనికలోకి
సమయం వెళ్ళిపోతుంది
సుఖదుఃఖాల సుడిగుండాల్లోంచి
రాగద్వేషాల కదిలికల్లోంచి
శిధిల జ్ఞాపకాల్లోంచి
మేడు బారిన జీవితాల్లోంచి
పైబడే వయస్సు ముడతల
గీతల మడతల్లోంచి
సమయం వెళ్ళిపోతుంది
కొండవాలు అంచున
వాలిన పొద్దులో
సంజె వెలుగుల సయ్యాటలో
నిద్రాణమైన
నిన్నలో కలిసిపోతూ
సమయం వెళ్ళిపోతుంది
రేపటి తొలి పొద్దులో
కాంతి కిరణాలను ఛేదిస్తూ
మళ్ళీ సమాయత్తమవుతూ
శ్రీమతి నెల్లుట్ల సునీత కథా రచయిత్రి, కవయిత్రి, సంపాదకురాలు. నూతన సాహిత్య ప్రక్రియ సున్నితం సరళ శతకం రూపకర్త్రి. విమెన్ రైటర్స్ అసోసియట్ వ్యవస్థాపకురాలు, సాహితీ బృందావన విహార జాతీయ వేదిక వ్యవస్థాపకురాలు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పాతర్ల పహాడ్ జన్మించిన సునీత గారి ప్రస్తుత నివాసం ఖమ్మం. యం. ఎ., యం.ఎడ్ (M A M.ed) చదివి, ఓ ప్రైవేటు విద్యా సంస్థలో తెలుగు అధ్యాపకురాలుగా పని చేస్తున్నారు.
సామాజిక, ఆధ్యాత్మిక వ్యాసాలు, కవితలు, కథలు, బాల గేయాలు, పాటలు, బాలల కథలు, మినీ నవల, సున్నితాలు, హైకూలు, నానీలు, పలు ప్రక్రియలలో పరిచయం ఉంది.
సేవలతో పాటు సాహిత్య సేవలు తెలుగు భాష కోసం సేవలందిస్తూ ఉత్తమ రచనలకు సన్మానాలు, అవార్డులు, నగదు బహుమతులు గెలుచుకున్నారు. యూఎస్ఏ ఎఫ్ఎం రేడియోలో కెనడా ఎఫ్ఎం రేడియోలో కవితలు ప్రసారమయ్యాయి. పలు యూట్యూబ్ ఛానల్స్‌లో పాటలు, కవితలు, కథలు ప్రసారమయ్యాయి. పత్రికలలో కథలు, కవితలు, సంకలనాలలో ప్రచురితమయ్యాయి. పలు పుస్తకాలకు ముందుమాటలు రాశారు. వివిధ సాహితీ సంస్థలు నిర్వహించిన కవిత పోటీలకు న్యాయ నిర్ణయితగా వ్యవహరించారు.