[శ్రీ సముద్రాల హరికృష్ణ రాసిన ‘రాగవల్లరి!!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆమెకు సుమారు ఎనభై ఏళ్ళుంటాయి. పచ్చని శరీరం, నుదుటున మరీ పెద్దదీ కాదు చిన్నదీ కాదు, సరిగ్గా అలనాటి పావలా బిళ్ళంత కళకళలాడే కుంకుమబొట్టు. మెళ్ళో రెండు వరుసల ముత్యాల హారం, చెవులకు దిట్టమైన, కానీ నాజూకైన రవ్వలు దుద్దులు, రెండు చేతుల ఉంగరపువేళ్ళకూ రెండు రత్నపు టుంగరాలు. చూడగానే లక్ష్మీ కళతో ఎవరబ్బా ఈమెగారు అనిపించే స్వరూపం.
మాట గలగల, మనసు గోదారి అలే. రెండూ స్వచ్ఛమే! ఎవ్వరినైనా సౌజన్యం ఉట్టి పడే పలకరింపుతో ఇట్టే ఆకట్టుకునే నైజం!
ఆమె విశ్రాంత తెలుగు లెక్చరర్, విశ్వవిద్యాలయం వారి కాలేజీలో! మన ఆచారాలు, సంప్రదాయాలు, పురాణాలు అన్నీ కొట్టిన పిండి ఆమెకు. సాధ్యమైనంత వరకూ ఆ విషయాలను అమలులో పెట్టి ఆచరించే మనిషి కూడా..
ఇదీ ప్రహరీ గోడకు బిగించిన గ్రానైట్ ఫలకం, ‘రాగవల్లరి’, అని చెప్పే ‘ఇంటి’ పేరు గల ఆ ఇంటి యజమానురాలు రాజ్యలక్ష్మి గారి గురించి.
ఈమె దక్షిణ ధృవమైతే, దానికి బొత్తిగా వ్యతిరేకం, ఆ గృహ యజమాని, 90 దాటిన, రిటైర్డ్ బ్యాంకు జనరల్ మేనేజరు రామ్మోహనరావు గారు! చేతికి వాచీ కూడా అలవాటు లేని సాదాసీదా మనిషి. మితాతిమితభాషి!
వారిరువురిదీ 65 ఏళ్ళ పై మాటే, దాంపత్య బాంధవ్యం!
***
వీరికి సంతానం, ఇద్దరూ కూతుళ్ళే, అమెరికాలో స్థిరపడ్డారు. రోజు విడిచి రోజు ఇద్దరిలో ఎవరో ఒకరు వీడియోకాల్ చేసి తల్లిదండ్రులతో మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకుంటూ ఉంటారు.
సంతోషం, సంతృప్తి నిండుగా ఉన్న పండు దాంపత్య జీవితం వారిది. ఒకరంటే ఒకరికి – అనురాగం, ఆదరం, గౌరవం, చనువూ, అన్నీనూ!
***
వీరి వివాహ షష్ఠిపూర్తి ఉత్సవం జరిగింది ఒక 5 ఏళ్ళ క్రితం. పెళ్ళి కన్నా ఘనంగా జరిగిందనే చెప్పాలి ఆ ఉత్సవం. వాళ్ళుంటున్న కాలనీలోని కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేశారు.
అమెరికా నుంచి వారం ముందుగానే వచ్చేశారు ఇద్దరు అమ్మాయిలూ, సకుటుంబంగా ఈ పండుగ జరిపించటానికి! నిర్వహణ అంతా వారిదే, భర్తల సంపూర్ణ సహకార సహాయాలతో!
కొన్ని విషయాల్లో, తమ పిల్లలు వారి ఆలోచన బట్టి ఇచ్చిన సూచనలను కూడా అమలు చేస్తూ మరీ! కాలనీలో దగ్గరి వాళ్ళను, ముఖ్య బంధువులనూ, చిరకాల స్నేహం వున్న కొందరు స్నేహితుల కుటుంబాలనూ, అందరినీ పిలిచారు. మొత్తం సుమారు ఓ వందమంది.
ఇప్పటి ఆనవాయితీగా క్యాటరింగుకి ఇవ్వదలచుకోలేదు ఇద్దరు అమ్మాయిలూ! వారి నాన్నగారికి ఇట్లాంటివి నచ్చవని, మొత్తం వంట పొద్దునే మొదలుపెట్టి, మధ్యాహ్నం ఒంటిగంట కల్లా అందించే ఏర్పాటు చేశారు.
భోజనాలు – పెద్దవారికి టేబుళ్ళ పైనా, కింద బాసిపెట్లు వేసుకుని కూర్చోగలిగే వారందరికీ, కింద అరిటాకులు వేసీ!
పొద్దున్నే సన్నాయి మేళంతో మొదలై, రామావధాన్లు గారు కంచుకంఠంతో మంత్రాలు చదువుతుండగా షష్టిపూర్తి తంతు యథావిథిగా జరిగిపోయింది, చిన్నపాటి హోమంతో సహా. చివర్లో వేద పఠనం, ఆశీర్వచన సూక్తంతో శాస్త్రోక్తంగా పూర్తయింది కార్యక్రమం.
2 గంటలకల్లా భోజనాలు – కబుర్లూ, నవ్వుల మధ్య కోలాహలంగా పూర్తి అయినై! తరువాత అరగంట విశ్రాంతి!
***
2.30కి వధువు వరుడు తమ అనుభవాలు చెప్పాలని కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇద్దరు వృద్ధ దంపతులూ, “ఎందుకమ్మా ఇవన్నీ, మామూలుగా అందరి జీవితాల్లో ఉండేవే మావీనూ, ప్రత్యేకం ఏముంటాయీ”, అన్నారు గానీ ఆప్తులందరూ పట్టుబట్టడంతో సరే అన్నారు.
ముందుగా తమ అనుభవాలు చెప్పమని రాజ్యలక్ష్మి గారిని ఆహ్వానించారు.
***
ఏంకరమ్మగా ప్రశ్నలు వేయటానికి, డిగ్రీ ఫైనల్ చేస్తున్న వాళ్ళ పెద్ద మనవరాలు, జ్యోత్స్న.
రాజ్యలక్ష్మి గారు చెప్పటం. మొదలుపెట్టారు:
“మాది తెనాలి దగ్గర బాగా శ్రోత్రియ కుటుంబం. మానాన్న వేద పండితులు. మంచి స్థితిమంతుల కుటుంబమే. పొలాలూ అవీ ఉండేవి. కౌలుకు ఇచ్చి వ్యవసాయం చేయించేవారు. ఇంట్లో నాలుగు ఆవులతో పాడి కూడా ఉండేది. వచ్చే పోయే బంధువులతో అంతా మహా సందడిగా! నాకూ ఆ రోజుల్లో అందరిలాగే, చిన్న వయసులోనే పెళ్ళి చేసేశారు. నా చదువు సెకండ్ ఫామ్‌తో ఆగిపోయింది.”
ఏంకర్ జ్యోత్స్న – “అమ్మమ్మా, ఆగాగు! ఇక్కడ రెండు ప్రశ్నలు: మొదటిది – సెకండ్ ఫామ్ అంటే ఏమిటీ, ఎప్పుడు, ఏ ఏజ్‌లో అయింది మీ పెళ్ళి, అదీ చెప్పు!” అన్నది.
రాజ్యలక్ష్మి గారు జ్యోత్స్నను ఆప్యాయంగా తట్టి, “ఏడో తరగతి అనుకోవచ్చు మీ లెక్కల్లో, సెకండ్ ఫామ్ అంటే! ఇక పెళ్ళప్పుడు నా వయస్సా?! అప్పుడు నాకు 15 ఏళ్ళు” నవ్వుతూ చెప్పారు.
ఏంకర్‌తో సహా పిల్ల బ్యాచ్ అందరూ, “మై గాడ్” అన్నారు ఒక్కసారిగా! పదిహేనేళ్ళకే పెళ్ళా?! అని ఆ పిల్ల బ్యాచ్ అబ్బురపాటు!
రామ్మోహనరావు గారు చిరునవ్వుతో వినసాగారు, మనసు ఆ దశాబ్దాల నాటి సంఘటనలలోకి పయనమౌతుంటే!
రాజ్యలక్ష్మి గారు చెప్పసాగారు:
“నాదా పల్లెటూరు వాలకమూ, అలవాట్లూ.! పట్నాలు కొత్త. తరువాత ఇంకేముంది, వారి బ్యాంకు ఉద్యోగం ఎటు పంపిస్తే అటు వెళ్ళాము. మొదట బొంబాయి, తరువాత మద్రాసు, తరువాత మన ఆంధ్రాలో పలుచోట్లా! కొత్త కొత్త ప్రదేశాలూ, కొత్త కొత్త భాషలూ,యాసలూ, గొప్ప స్నేహానుబంధాలూ! మొత్తం మీద ఇక్కడకు చేరాం, గత కొన్నేళ్ళుగా ఇదిగో వీరందరితో”, అని ఆ కాలనీలో బాగా దగ్గరైన వారిని చూపిస్తూ అన్నారు రాజ్యలక్ష్మి గారు.
జ్యోత్స్న,”అది సరే, సెకండు ఫామ్‌తో ఆగిన చదువుతో, కాలేజ్‌లో తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ ఎట్లాగయ్యావో అది చెప్పు ముందు”, అన్నది అమ్మమ్మతో , ‘నా చురుకైన ప్రశ్న చూశావా’, అన్నట్టు!
అందరూ, ఆ దంపతుల పట్ల ఉన్న ఆదర భావంతో శ్రధ్ధగా వింటున్నారు, ఈ కొత్త రకంగా ఉన్న ‘ఇంటర్వ్యూ!’.
ఆ ప్రశ్న వింటూనే రావు గారు కల్పించుకున్నారు, “అది నే చెప్తానమ్మా విను”, అంటూ!
“చెప్పండి చెప్పండి తాతయ్యా”, అంటూ ఏంకర్ జ్యోత్స్న ఆయన కుర్చీ దగ్గరకు వెళ్ళింది ఉత్సాహంగా!
***
“మీ అమ్మమ్మ మహా ఫాస్ట్! ఏదో అంతా నా ప్రోత్సాహం అంటోంది గానీ, తనదే ఆ పట్టుదల, కృషి ఆంతా. నేను సైన్ పోస్టును మాత్రమే, ఇదిగో ఇక్కడ ఈ కోర్సు వగైరా వివరాలు చెప్ఫటం వరకే నా పని, తరువాత తనే అల్లుకుపోయేది. పెళ్ళై వచ్చిన కొత్తల్లో వాళ్ళ ఆచారాలు బాగా వంటపట్టిన మనిషిగా దిగింది. శుచీ శుభ్రతా, మడీదడీ కాస్త ఎక్కువే! ఎంతవరకూ అంటే, నాకు చాదస్తం అనిపించే వరకూ!
తరువాత మెల్లగా మార్చుకుందనుకో, మా కొలీగ్సూ వాళ్ళూ, తమ కుటుంబాలతో వచ్చీ పోవటంతో, వారితో స్నేహం సంబంధాలు ఏర్పడటంతో! ఒకసారి ఏమైందో తెలుసా?!” అని ఏదో చెప్పబోయి, “ఎందుకులేమ్మా. నొచ్చుకుంటుందేమో”, అన్నారు రావుగారు.
అందరూ వింతగా చూస్తున్నారు వృద్ధ దంపతుల అన్యోన్యాదరాలను!
రాజ్యలక్ష్మిగారు నవ్వుతూ, “మీకు చెప్పాలని అనిపిస్తే చెప్పండి, దీనిలో దాపరికం ఏముందీ”, అన్నారు, భర్త వంక చూస్తూ!
“చెప్పు తాతయ్యా చెప్పు”, అని జ్యోత్స్న కూడా రెట్టించింది.
రావు గారు మళ్ళీ మొదలెట్టారు:
“ఒకసారి ఒక చిన్న, మీ భాషలో గెట్ టుగెదెర్ అనుకో జరుగుతోంది ఇంట్లో. భోజనాల వేళ అయింది. ఈమెకు ఒకటే కంగారు. వాళ్ళింటి ఆచారం ప్రకారం ‘ముందు మగవాళ్ళకి వడ్డిస్తాము, తరువాత మేమూ పిల్లలమూ భోజనానికి కూచుంటాము’, అన్నది.”
“నేను పక్కకు పిలిచి, అదేమీ అక్కర్లేదు, ముందు వయసులో మరీ పెద్దవారు నలుగురైదుగురున్నారు – వారికీ, పిల్లలందరికీ వడ్డించేద్దాము. తరువాత మిగతా మనమందరమూ కలిసి భోంచేద్దాము, బాగుంటుంది”, అని చెప్తే, అది ఆమెకు కొత్తగా అనిపించినా బాగుందనిపించి ఒప్పుకుంది.
అట్లాగే ముగించాము ఆ రోజు, ఇంకా ఆ తరువాత కూడా, ఏదైనా అట్లాంటి పండుగలూ వగైరా సందర్భాల్లో!
అట్లా మెల్లమెల్లగా నేర్చుకుంటూ, చదువులో పై పై మెట్టు ఎక్కుతూ, లోకంతో పాటు, తరువాత దాన్ని మించీ కూడా వెళ్ళిపోయిందనుకో మీ అమ్మమ్మ”, అంటూ ముగించారు రావుగారు.
రాజ్యలక్ష్మి గారు ఆనందంగా వింటూ కూర్చున్నారు భర్త ఆ పాత విషయాలు వివరంగా చెపుతుంటే!
ఒక్క నిమిషం ఆగి మళ్ళీ అందుకున్నారు రావు గారు:
“చదువులో, కాస్త మధ్యలో బండి ఆగినా, మళ్ళీ మొదలుపెట్టి చదువురైలును ఝామ్మని ఎం.ఏ అయ్యేదాకా ఆపలేదు. అదీ ఏకబిగిన పూర్తి చేసింది. అన్ని తరగతుల్లో క్లాసు ఫస్టే! ఎం.ఏ.లో అయితే యూనివర్శిటికే ఫస్టు రావటంతో, ‘ఇక తప్పదమ్మా నీకు ఇవ్వాల్సిందే’ అనుకున్నారేమో, వారు గోల్డ్ మెడల్ కూడా ఇచ్చి సత్కరించారు.”
రాజ్యలక్ష్మి గారు కలుగజేసుకుని, “సరేలేండి నా గొప్పేముంది ఇందులో! నాలాంటి వాళ్ళు కోకొల్లలు మన దేశంలో, అవకాశాలు రాకా, లేకా, చాలా చోట్ల ఇవ్వకా – మట్టిలో మాణిక్యాలుగా ఇంటి పనికో, కూలీపనికో మిగిలిపోతున్నారు. అయినా సంతోషం, ఇప్పుడు మా ఆడవాళ్ళు కూడా బాగా చదువుకుని ముందరకు వస్తున్నారు, అన్ని రంగాల్లో!” అన్నది హుందాగా తన పధ్ధతిలో!
రావుగారు, “సరిసరి వయోజనవిద్యా,స్త్రీ విద్య,మీద చర్చ కాదిక్కడ. నేను చెప్తోంది ఈ స్త్రీ లక్ష్మి గారి గురించి మాత్రమే ప్రత్యేకంగా – ఈ రోజు ఇది సందర్భం కాబట్టి”, అనగానే అందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టారు.
ఎనభై ఏళ్ళ వయస్సులో, అందరిలో ఆ అనుకోని మెచ్చుకోలుకి రాజ్యలక్ష్మి గారు కాస్త బిడియ పడటం, రావుగారి కంటపడక పోలేదు!
ఆయన ఆ దృశ్యం ఆనందంగా చూసి, ‘She deserves it’ అని మనసులో అనుకుని నవ్వుకున్నారు కూడా!
తరువాత ఓ పదిమంది సరదాగా అంత్యాక్షరి ఆడారు జ్యోత్స్న ఫ్రెండు రమ్య ఆంకరింగు చేయగా. అందరూ ఆనందించారు, వంత పాడిన వారు పాడారు, కూనిరాగం తీసేవారు దానితో సరిపెట్టుకున్నారు.
అప్పుడు ఇంకో అయిదు నిమిషాలు రావు గారు తమ ఉద్యోగానుభవాలు చెప్పి, “అబ్బో మూడున్నరౌతోంది, ఇంక ముగించి, అందరికి స్నాక్స్, కాఫీ ఏర్పాటు చూడమ్మా” అన్నారు, మనవరాలు జ్యోత్స్నతో!
“అలాగే తాతయ్యా” అని ఆ అమ్మాయి రాజ్యలక్ష్మి గారితో, “అమ్మమ్మా చివరి ప్రశ్న, నీకింకా ఏదైనా చేయాలని ఉన్నదా, అంటే ఏదైనా ప్రదేశం వెళ్ళాలని, ఎవరినైనా కలవాలని, ఏదైనా ఎవరికైనా సహాయంగా ఇవ్వాలని ఇట్లాంటివి!”, అన్నది ఉత్సాహం తొణికిసలాడే స్వరంతో!
“వీలైనన్ని ప్రదేశాలు మనదేశంలో, బయట కూడా చూపించేశారమ్మా మీ తాతయ్య, చేయగల సహాయం చేశాము. ఇక మీద చేస్తాము కూడా మాకు చేతనైనంత! కాకపోతే ఒకటే నేను ఆ వేంకటేశ్వరుడిని కోరుకునేది”, అన్నది ఆమె కాస్త ఉద్వేగభరితమైన గొంతుకతో.
“ఏంటి, ఏంటది అమ్మమ్మా”, మనవరాలి ప్రశ్న!
“ఏంలేదమ్మా, నేను ఆయన చేతుల్లో, రెండు అడుగులు ముందుగానే దాటిపోవాలన్నదే ఆ కోరిక” అన్నారు రాజ్యలక్ష్మిగారు, గద్గదికంగా!
ఒక్కసారి, అందరూ చకితులయ్యారు ఆ ఆనంద సందర్భంలో, అటువంటి మాట విని!
వెంటనే రావుగారు, మూడ్ మార్చేశారు తాను కలుగజేసుకుని!
“ఓహో ఎక్కడికైనా రెండు టికెట్లు బుక్ చేసే అలవాటు ఇక్కడ మొదట్నుంచీ! ఆ రూలు, అంత తొందరగా మారదమ్మోయ్! మనది ఎప్పటికీ జాయెంట్ టిక్కట్టే, దేవుడి సంగతి నాకు తెలియదు గానీ, ఆ భరోసా నాది” అన్నారు నవ్వుతూ!
ఆ మాటలతో వాతావరణం కాస్త తేలికపడింది, అందరూ ఊపిరి పీల్చుకున్నారు హమ్మయ్య అనుకుని!
రాజ్యలక్ష్మి గారు కూడా చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండి పోయారు.
అంతలో జ్యోత్స్న,”తాతయ్యా మెగా ఫైనల్ క్వశ్చెన్ మీకు! మీకేమైనా ఉన్నాయా ఇంకా చేయాలన్న కోరికలు” అన్నది.
రావుగారు క్లుప్తంగా, “నాకేమీ లేవమ్మా,మీ అమ్మమ్మ కోరికే, నాది కూడా” అన్నారు.
“ఓకే నైస్ రిప్లై, 100 మార్క్స్ తాతయ్యా,”, అన్నది తాతగారికి షేక్ హ్యాండు ఇస్తూ జ్యోత్స్న!
వెంటనే “థాంక్యూ సో మచ్ ఎవ్రీబడీ ఫర్ మేకింగ్ టుడే ఎ మెమొరబుల్ డే ఇన్ అవర్ లైవ్స్! Have your snacks and coffee please. They are ready in the mini hall. Thank you all” అని ముగించింది జ్యోత్స్న.
***
సరిగ్గా 5 ఏళ్ళైంది షష్ఠిపూర్తి ఉత్సవం జరుపుకుని.
ఏదో అత్యవసరమైన పనున్నట్టు తన పాటికి తాను పరుగులెత్తే కాలం,గిర్రున తిరిగి, మళ్ళీ ఆ రోజు వచ్చింది. ఆ రోజు వారి పెళ్ళిరోజు.
తెల్లవారుఝామునే లేచి రాజ్యలక్ష్మి గారు తలంటి స్నానం చేసి, పట్టు చీర కట్టుకుని పొద్దున 6.30 కల్లా రెడీ అయిపోయారు, కాలనీలోనే ఉన్న నీలాభూదేవీ సహిత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి.
వెళ్ళే ముందు రావు గారు ఇంకా నిద్ర లేచినట్లు లేదే అని వెళ్ళి చూశారు, భర్త గదిలోకి. ఆయన దుప్పటి కప్పుకుని పడుకునే ఉన్నారు.
సరే వెళ్తే సాయంకాలం కలిసి మళ్ళీ వెళ్లాలంటే, అప్పుడు వెళ్తాంలే ఇద్దరమూ అనుకుని ఆమె వెళ్ళబోయారు.
ఆ అలికిడికి ఆయనకు మెలకువ వచ్చింది.
“గుడికా, నువ్వు వెళ్ళిరా, నేను ఓ పావుగంటలో లేస్తాను”, అన్నారు తనే.
“సరే అలాగే, నేను వెళ్ళి ఇద్దరి తరఫునా ఇప్పుడు దర్శనం చేసుకుని వస్తాను, వీలైతే సాయంత్రం కలిసి వెళ్దాం”, అని ఆమె బయటకు వచ్చారు.
గుమ్మం దగ్గరకు అప్పటికే డ్రైవరు తెచ్చిన తమ కార్లో గుడికి వెళ్ళి,ఓ గంటలో తిరిగి వచ్చారు, తృప్తిగా దర్శనం, అర్చనాదులు ముగించి.
వరండాలో పేపరు చదువుతున్న రావు గారు నవ్వుతూ, “వరుడు గారు వేడి కాఫీకి సిద్ధం ఇక్కడ” అన్నారు.
“ఇదిగో, ఇప్పుడే తెస్తున్నాను”, అంటూ ఆమె లోపలికి వెళ్ళి పది నిమిషాల్లో రెండు వేడి కాఫీ కప్పులతో వరండాలోకి వచ్చారు. కాఫీ అందించి భర్తకు, “దర్శనం చక్కగా అయిదండీ, తృప్తిగా ఉంది. ఈ రోజు శనివారమైనా ఇంకా అంత రద్దీ లేదు”, అన్నారు.
రావు గారు, “సంతోషం, నీ దర్శన పుణ్యంలో నాకు సగం వాటా ఉండనే ఉన్నది. అది సరే, ఏం కోరావు, తిరుమలరాయుణ్ణి”, అన్నారు సరదాగా!
“నాకు ఏ కొరతా చేశాడనీ, మా అలమేలుమంగాపతి – ఇంకా నేను కోరుకోవటానికీ! ఒక్కటే కోరిక, చివరి పరుగులో నేనే ముందుండాలని ఓ రెండడుగులు! అంతే అదే ఇప్పుడు మిగిలున్న ఒకే కోరిక”, అన్నారు.
రావుగారికి ఎందుకో, ఆ మాటలు రుచించలేదు ఆ రోజు, ఆ వేళలో! ఇంతలో అమ్మాయిల దగ్గర నుంచి కాల్ రావటంతో ధ్యాస అటు మళ్ళింది ఇద్దరికీ! ఇద్దరు కూతుళ్ళూ, అల్లుళ్ళూ అమ్మా నాన్నలను వీడియో కాల్ చేసి ఆప్యాయంగా పలకరించారు.
మనవరాళ్శు కూడా తమదైన పద్ధతిలో “Great going grandma”, అనీ, “Century round the corner, Grandpa” అనీ ఉత్సాహంగా పలకరించారు అమ్మమ్మ, తాతయ్యలను.
పెద్దవారిద్దరూ సంతోషించారు తమ వాళ్ళ ఆప్యాయపు పలకరింతలతో!
***
గుడికి వెళ్ళాలనుకున్న సాయంకాలపు ట్రిప్పు అమలు కాలేదు.
భోంచేసి, ఓ అరగంట నడుం వాల్చి లేచినప్పటి నుంచీ రాజ్యలక్ష్మి గారు “ఏవండీ కాస్త దడగా ఉంటోంది, ఏదో గాభరాగా ఉంది” అనటంతో!
కాస్సేపటికి కుదుట పడగానే, ఆమె ఓపిక చేసుకుని లేచి దేవుడి మందిరంలో దీపారాధన వెలిగించి, రోజూ చదువుకునే చంద్రశేఖరాష్టకం మొదలుపెట్టారు.
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్..
అంటూ ఆమె చదువుతున్న స్తోత్రం హాలులో కూర్చున్న రావు గారికి వినిపిస్తూనే ఉన్నది.
యక్షరాజ సఖం భగాక్షహరం భుజంగవిభూషణం..
చంద్రశేఖర మాశ్రయే మమ కింకరిష్యతి వై యమః..
స్తోత్రం చివరకు వచ్చారు రాజ్యలక్ష్మి గారు,
భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం..
చంద్రశేఖర మాశ్రయే మమ కింకరిష్యతి వై యమః..
అక్కడి వరకు వచ్చిన స్తోత్రం ముందుకు సాగలేదు. అయిదు నిమిషాలు ఐనా రాలేదేమిటా అని మెల్లగా వెళ్ళి చూసిన రావు గారికి, నమస్కార ముద్రలోనే పీట మీదకు వాలిపోయిన భార్య కనిపించింది.
ఆయనకు విషయం అర్ధమైంది. ఇంటర్కామ్‌లో ఔట్ హౌసులో ఉన్న తమకు అటెండెంట్‌గా పెట్టుకున్న శివుడిని పిలిచారు. శివుడూ, అతని భార్యా పరుగున వచ్చారు.
రెండిళ్ళ అవతల ఉన్న తన మేనల్లుడి కొడుకు రామాన్ని కూడా పిలిచారు మొబైలులో. క్షణంలో అతనూ వచ్చాడు, “ఏమిటి, ఏమైంది తాతగారూ” అంటూ!
విషయం తెలుసుకుని,డ్రైవరు రావటం ఆలశ్యమౌతుంది అని రామం తానే కారులో బయలుదేరి, కాలనీలోనే ఉన్న బాగా పరిచయస్థులైన సీనియర్ డాక్టరు పరబ్రహ్మం గారిని తీసుకువచ్చాడు.
ఆయన కంగారుగా లోపలికి వచ్చి, రాజ్యలక్ష్మి గారిని పరీక్ష చేసి, “సారీ రావుగారు, లక్ష్మిగారు దాటిపోయి పావుగంటైంది”, అన్నారు విచారంగా!
రావుగారు కీడు ఊహించినా, డాక్టరు గారి నోట అది నిర్ధారణ అవగానే తట్టుకోలేకపోయారు.
క్షణ కాలం మ్రాన్పడి నిలుచుండి పోయారు, ప్రశాంతమైన భార్య ముఖాన్నే చూస్తూ!
అప్రయత్నంగా ఆయన మదిలో ఆమె పొద్దున చెప్పిన కోరిక గుర్తు వచ్చి, ‘మొత్తానికి ఆమె చివరి కోరిక నెరవేర్చుకున్నది’, అనుకున్నారు, ఏదో తెలియని వెలితి తొలిచేస్తునట్టు అనిపిస్తుండగా!
***
సరిగ్గా అదే సమయానికి, అంటే తంతు పూర్తయ్యే సమయానికి కూడా, అమెరికా నుంచి ఇద్దరు కూతుళ్ళూ రాలేకపోయారు, వారి ఊళ్ళలో భయంకర తుఫానుల వల్ల.
రామం, కుటుంబంతో సహా అక్కడే రావుగారితో ఉండటం ప్రారంభించాడు తోడుగా.
15 రోజుల తరువాత మొదటి సారి టీవీ ఆన్ చేసి చూశారు, రావుగారు.
తనూ, భార్య రాజ్యలక్ష్మీ రోజూ పక్కపక్కనే కుర్చీల్లో కూచుని చూసే ఇంగ్లీషు న్యూసు వస్తోంది టీవీలో!
న్యూసు వినబడలేదు, ఏ బొమ్మా ఆయనకు కనబడలేదు మారిన తన జీవితంలో. ఏదో భయంకరమైన వెలితిగా అనిపించింది ఆయనకు. టీవీ కట్టేశారు.
మర్నాడు మళ్ళీ అదే వేళకు అదే ఛానెల్ పెట్టారు. టీవీలో యథాప్రకారం వారిద్దరికీ ఇష్టమైన ఆశాలత వార్తలు చదువుతోంది ప్రసన్నమైన కంఠంతో!
వారికి ఆ రోజు ఏ వార్తా వినిపించలేదు కానీ, బొమ్మ కనిపించింది!
అయితే అది, అక్కడ ఉన్న ఏంకర్‌ది కాదు! హుందాగా ఉన్న రాజ్యలక్ష్మి గారిది.
“ఏవిటండీ, దిగాలుగా ఉంటున్నారు. నేను మీతోనే మీలోనే ఉన్నానండీ, బయటకు వెళ్ళండి, మన కాలనీ వాళ్ళను కలవండి, మీకిష్టమైన కచ్చేరీలకు వెళ్ళండి. ఇట్లా మీరు నిరుత్సాహంగా ఉంటే నాకు కష్టంగా ఉందండీ చూడటం” అన్నట్టు అనిపించింది.
ఆయనకు తన భార్య తనతో ఉన్నట్టే అనిపించింది ఆ క్షణం!
ఇక ఆ క్షణాన్ని చేజార్చకూడదనుకుంటూ, కాస్త ఊరటఫడ్డ మనసుతో నిద్ర పోయారు తొంభైయేళ్ళు పైనే ఉన్న రామ్మోహనరావు గారు.
***
మర్నాడు పదింటికల్లా తయారై,తమ డ్రైవరు కారు నడపుతుండగా బయటకు వెళ్ళి తమ కాలనీలో ముఖ్య స్నేహితుల నిద్దరిని కలిసి రెండింటికి ఇంటికి వచ్చారు, రావుగారు కాస్త తేలికైన మనసుతో!
ఇంట్లోకి వెళ్ళబోతూ, ఒక్క క్షణం ఆగి చూశారు, కాంపౌండు గోడ మీద ఉన్న గ్రానైటు ఫలకం మీద ‘రాగవల్లరి’, అన్న తమ ‘ఇంటి’ పేరును.
అక్షరాలు కాస్త పాతపడ్డట్టూ, ఫలకం మాసినట్టూ అనిపించింది!
***
మర్నాడు పదింటి కల్లా, శివుడు వచ్చి చెప్పాడు, “అయ్యా నిన్ను మీరు ఫోను చేశారట, గ్రానైటు షాపు రమేష్ గారు పంపారని ఇతనొచ్చాడు”, అని వచ్చిన వ్యక్తిని చూపించాడు.
“అవునవును, వచ్చావా, రా”, అంటూ రావు గారు అతనికి ఇంటి ప్రహరీకి ఉన్న ఆ పాత ఫలకం చూపించి, ఇది తీసి కొత్తది పెట్టాలనీ, కొత్త రంగుల్లో అందంగా ఉండాలనీ చెప్పారు.
అతను కొలతలూ అవీ తీసుకుని రెండురోజుల్లో కొత్తది తెచ్చి పెడతానని చెప్పి వెళ్ళిపోయాడు.
***
“శివుడూ, ఎట్లా ఉంది మన కొత్త బోర్డు?” అన్నారు, రెండు రోజుల తరువాత కొత్త ‘రాగవల్లరి’ని ఫిక్సు చేయించగానే, రావుగారు ఉత్సాహంగా!
“చాలా బాగుందయ్యా, కొత్త కళ వచ్చేసింది” అన్నాడు శివుడు, తమ యజమాని ముఖంలో సంతోషం చూసి, ఎంతో ఆనందిస్తూ!
“కరెక్టుగా చెప్పావ్ శివుడూ, ఈ మొక్కలకు కాస్త పాదులుచేసి, ఆ మల్లె పందిరి బిగిద్దాం రా” అంటూ లోపలికి వెళ్ళారు రావుగారు, తన పూర్వపు జీవనోత్సహంతో!
ఆయనను అనుసరించాడు శివుడు చకచకా మొక్కల దగ్గరికి వెళ్తూ!
కొత్త రాగవల్లరి, కొత్త పందిరి! మానసోద్యానంలో ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ, కాపాడుకోవలసినవే, రెండూనూ! జీవిత పర్యంతమూ!
అపుడే ఆ జీవితానికి నిత్య వసంతం! ఒక ప్రాణవంతమైన ప్రవాహ సౌందర్యం!