Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రాగద్వేషాలు

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘రాగద్వేషాలు’ అనే రచనని అందిస్తున్నాము.]

గవద్గీత 3వ అధ్యాయం, 34వ శ్లోకం ఈ విధంగా వుంది.

~
ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ।
తయోర్న వశమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపంథినౌ॥

ప్రతి ఇంద్రియానికి తగిన విషయములలో రాగం (ఆసక్తి) మరియు ద్వేషం (విరక్తి) సహజముగా ఉంటాయి. కానీ మనిషి వాటికి వశుడవకూడదు. ఎందుకంటే అవే మోక్ష మార్గానికి అడ్డువుతాయి అని పై శ్లోకం భావం.

మనిషి మనసును పక్షితో పోల్చుతారు. ఆ పక్షికి రెండు రెక్కలు – రాగం మరియు ద్వేషం. ఈ రెక్కలతోనే మనసు యథేచ్ఛగా విహరిస్తుంది. రాగం అనే రెక్కలోని ఈకలు మమకారం, అహంకారం, అభిమానం, అతిశయం. ద్వేషం అనే రెక్కలోని ఈకలు అసూయ, ఈర్ష్య, పగ, ప్రతీకారం, కోపం, మూర్ఖత్వం. ఈకలు దట్టంగా పెరిగితే రెక్కలు బలపడతాయి; అలాగే రాగద్వేషాలు బలపడితే మనసు గతి తప్పుతుంది.

మనసును అదుపులో ఉంచాలంటే ముందుగా రాగద్వేషాలను నియంత్రించాలి. యోగశాస్త్రం చెప్పినట్లుగా ఇది చిత్తవృత్తి నియమనం. మనసులోని ఈ క్షోభలే వృత్తులు. వాటిని అదుపు చేస్తేనే మనస్సు శాంతిస్తుంది. భగవద్గీత (3-34) లో శ్రీకృష్ణుడు స్పష్టంగా అన్నాడు – ప్రతి ఇంద్రియానికి సహజంగా రాగద్వేషాలు ఉంటాయి, కానీ వాటికి వశం అయితే అవే మోక్షమార్గానికి అడ్డుగోడలవుతాయి.

ఈ రాగద్వేషాలను నిర్మూలించాలంటే మూల కారణమైన అజ్ఞానం తొలగించాలి. అది బ్రహ్మజ్ఞానంతోనే సాధ్యం. కానీ సాధారణ మానవుడు ప్రారంభంలో సద్గుణాలను పెంపొందించడం ద్వారా వాటిని తగ్గించవచ్చు. స్నేహం, కరుణ, జాలి, ఉపేక్ష, నిర్లక్ష్యం వంటి గుణాలు మనసుకు శాంతిని ఇస్తాయి. యోగులు ప్రతికూల వృత్తులను సానుకూల ధర్మాలతో అణచే సాధన చేస్తారు. రాగాన్ని వైరాగ్యంతో, ద్వేషాన్ని విశ్వప్రేమతో జయించాలి. భక్తి, నిష్కామకర్మలు ఈ సాధనకు శ్రేష్ఠమైన మార్గాలు.

ఇది కేవలం ఆధ్యాత్మిక సూత్రం మాత్రమే కాదు; జీవనపాఠం కూడా. మహాభారతంలోని ధృతరాష్ట్రుడు దీనికి స్పష్టమైన ఉదాహరణ. తన కుమారులపై రాగం, పాండవులపై ద్వేషం అతన్ని అంధుడిని చేశాయి. ధర్మబద్ధంగా వ్యవహరించాల్సిన సమయంలో అలా చేయలేకపోయాడు. చివరికి కౌరవవంశం అంతమైంది. నేటి కాలంలో కూడా పిల్లలు విలాసాలకు, చెడు సావాసాలకు లోనై దారి తప్పుతుంటే తల్లిదండ్రులు వారిని సక్రమమార్గంలో నడపకపోతే, ఫలితాలు ధృతరాష్ట్రుని పరిణామాల్లాగే ఉంటాయి.

భగవద్గీత (7-27) లో కృష్ణుడు చెప్పినట్టు, ఇచ్ఛా–ద్వేషాల వల్లనే మోహం పెరిగి జీవులు జననమరణ చక్రంలో చిక్కుకుంటాయి. అలాగే (5-23) శరీరం ఉన్నప్పుడే రాగద్వేషాల ప్రభావాన్ని జయించగలవాడే నిజమైన యోగి అని గీత బోధిస్తుంది.

రాగం, కామం ఒకే స్వభావం కలిగినవి. ఇవి అగ్నిలాంటివి. అగ్నికి ఇంధనం పోసినంతవరకు మరింత మండి మండుతుంది; అలాగే రాగం ఎప్పటికీ తృప్తి చెందదు. తీరని తపనగా మిగిలిపోతుంది. అందుకే గీత సమాధానం ఇచ్చింది – రాగద్వేషాల జయమే విముక్తి మార్గం.

Exit mobile version