సమాజ దేహం మీద రాచకురుపు లేచింది!
అది పగిలి, చీము, రసి, కారుతూనే ఉన్నాయి.
శస్త్ర చికిత్స చేసి దాన్ని తొలగించే మొనగాడెవరూ
అధికారంలోకి రాలేదింత వరకు.
విచిత్రమేమంటే జనం కూడ అవినీతికి అనుకూలమే
అక్రమ సంపాదనతో వేల కోట్లకు పడగ ఎత్తిన వారు
హీరోలుగా చలామణీ అయ్యే దేశం మనది!
పనైపోవడానికి సంతోషంగా ముడుపులు సమర్పించుకోవడం
మనకు సిగ్గులేని సంస్కృతిగా మారింది!
కాబోయే అల్లుడికి ‘పై ఆదాయం’ బాగానే ఉంటుందని
అదో అదనపు అర్హతలాగా మురిసిపోయే దౌర్భాగ్యం!
‘అనిశా’ అని ఒకటుంది కానీ
బహుశా అది అజాగళ స్తనమే!
రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారాస్త్రమే తప్ప
నిర్మూలన అది చేసేది సున్న!
భ్రష్టాచారం కొత్త పోకడలు పోతో
‘క్విడ్ ప్రో కో’ లాంటి ప్రయోగాలు తెచ్చింది.
కథలకూ, కవితలకూ ఇతివృత్తంగా ఉంటూ
అవినీతి మరింత సృజనాత్మకమయింది.
లంచం తీసుకొనేవాడూ, ఇచ్చేవాడూ నేరస్థులే, శిక్షార్హులే!
దోషులను దండించడంలో మన న్యాయవ్యవస్థ
నత్తకేమీ తీసిపోదని చిత్తగించండి
అవేవో అరబ్ దేశాలలో ఉన్నట్టు
అవినీతి అజగరాలకు కాలో చెయ్యే తీసేస్తేగాని
ఈ జాడ్యం వదలదు ఎన్నటికీ
అవినీతిపై పోరు కేవలం ‘ఉటోపియా’ కాకూడదు
అది జనహితమై పరిఢవిల్లాలి
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.