[శ్రీ గొర్తి సాయి బ్రహ్మానందం గారి ‘క్విల్ట్’ కథాసంపుటి లోని కథలను విశ్లేషిస్తున్నారు శ్రీ అంపశయ్య నవీన్.]
అమెరికాలో స్థిరపడిన అనేకమంది తెలుగువాళ్ళు తమలోని సృజనాత్మకతను అనేక రూపాల్లో వెలువరిస్తున్నారు. వాళ్ళళ్ళో చాలామంది కథలు రాస్తున్నారు, కవితలు రాస్తున్నారు, నవలలు రాస్తున్నారు. నవలలు రాసేవాళ్ళకు అమెరికాలో తానా సంస్థ వాళ్ళు నవలల పోటీలు నిర్వహిస్తూ పెద్ద మొత్తంలో బహుమతుల్ని అందజేస్తున్నారు. ఇలా అమెరికాలో స్థిరపడిన తెలుగువాళ్ళు తెలుగు సాహిత్యానికి ఇతోధికమైన సేవ చేస్తున్నారు. అట్లా అమెరికాలో స్థిరపడి తెలుగు సాహిత్యాభివృద్ధికి తోడ్పడువాళ్ళళ్ళో గొర్తి సాయి బ్రహ్మానందం గారి లాంటి వాళ్ళను ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఆయన ‘అంతర్జ్వలనం’, ‘నేహల’ లాంటి నవలల్ని, ‘క్విల్ట్’, ‘కోనసీమ కథలు’ లాంటి కథా సంకలనాల్ని, అర్థవంతమైన రచనల్ని వెలువరించారు.
వృత్తిరీత్యా బ్రహ్మానందం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆయన అమెరికాలోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కేంద్రమైన కాలిఫోర్నియాలోని సిలికాన్ వాలీలో పనిచేస్తున్నాడు. ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‍కు సాహిత్యం పట్ల గొప్ప అభినివేశం ఉంది.
ఆయన వెలువరించిన ‘క్విల్ట్’ అనే కథా సంకలనంలోని కథల్ని గూర్చి నాలుగు మాటలు రాయాలన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసాన్ని మొదలెట్టాను.
అమెరికాలో నివసిస్తున్న తెలుగువాళ్ళను గూర్చి మాత్రమే కాకుండా అక్కడ నివసిస్తున్న అమెరికన్లను గూర్చి కూడా ఈ రచయిత కథలు రాయటం విశేషం.
అమెరికా ప్రజల జీవిత విధానం ఎలా ఉంటుంది? అక్కడ మానవ సంబంధాలెలా ఉంటాయి.. వాళ్ళ అలవాట్లు, వాళ్ళ అభిరుచులు, వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ వివాహ వ్యవస్థ, భార్యాభర్తల సంబంధాలు, స్నేహితుల మధ్య సంబంధాలు.. ఇవన్నీ ఎలా ఉంటాయో చాలాకాలం అమెరికాలో ఉంటున్న వాళ్ళకు తప్ప మనకు తెలీదు. బ్రహ్మానందం చాలా కాలంగా అమెరికాలో ఉంటున్నాడు కాబట్టి అమెరికన్ల జీవితాల్ని ఒక ఆర్టిస్టు దృష్టితో పరిశీలించాడు. తన పరిశీలనను ఈ కథలుగా మలిచాడు.
బ్రహ్మానందం ఈ కథల్ని రచించిన విధానం చాలా వినూత్నంగా ఉంది. పాత్రల్ని మన ముందు పెట్టటం తప్ప పాత్రల్ని గురించి తానేమీ చెప్పడు. జీవితాన్ని గురించి యేవో వ్యాఖ్యానాలు చేసి తన తెలివిని, తన జ్ఞానాన్ని ప్రదర్శించుకోవాలని ప్రయత్నించడు. అనవసరమైన వర్ణనలు, పదాడంబరం ఆయన కథల్లో కనిపించవు. కథల్ని చదవటం ద్వారా మనకేదో సందేశం ఇవ్వాలని ప్రయత్నించడు. అలాంటిదేదన్నా ఉంటే పాఠకులే ఆలోచించి తమంతట తాము తెలుసుకోవాల్సిందే తప్ప రచయిత దేన్నీ వాచ్యం చేసి చెప్పడు.
ఈ సంపుటిలోని కొన్ని కథల్ని బ్రహ్మానందం ‘నేను’ అంటూ ఉత్తమ పురుషలో చెప్పాడు. కొన్ని కథల్ని ఉత్తరాల రూపంలో చెప్పాడు. మరికొన్నింటిని సినిమాల్లో వాడే ‘ఫేడిన్’, ‘డిస్సాలు’, ‘కటౌటు’ లాంటి టెక్నిక్‌తో రాశాడు. మరికొన్ని కథల్ని పూర్తిగా థర్డ్ పర్సన్‍లో (అంటే ఒకర్ని గూర్చి మరొకరు చెబుతున్నట్టుగా). ఇలా ఈ కథల్లో ఎప్పుడూ చాలా మంది కథకులు వాడే రచయిత దృష్టికోణం నుండే రాయటం కాకుండా చాలా వైవిధ్యభరితంగా రూపుదిద్దిన రచయితను అభినందించాలి. ఇక ఈ సంపుటిలోని కొన్ని కథల్ని పరిశీలిద్దాం.
~
‘క్విల్ట్’ అని ఈ సంపుటికి రచయిత పేరు పెట్టారు.
ఒంటరిగా దూరంగా నివసిస్తున్న తన అమ్మమ్మకు ఆమె మనుమరాలు స్వయంగా అమ్మమ్మ ఇంటికి వెళ్ళి వృద్ధాప్యంలో ఉన్న ఆ అమ్మమ్మ కోరుకున్న ‘క్విల్ట్’ను ప్రెజెంట్ చేస్తుంది. క్విల్ట్ అంటే చలికాలంలో మనం కప్పుకునే దుప్పటి లాంటిది. చాలా దళసరి గుడ్డల్ని ఒకదానితో మరొకదాన్ని జతచేసి వాటిని సూదితో గుచ్చి క్విల్ట్‌ని తయారు చేస్తారు. మన భాషలో చెప్పాలంటే తీవ్రమైన చలి ఉన్నప్పుడు కప్పుకునే ‘బొంత’. తనకెంతో అవసరమైన క్విల్ట్‌ని ప్రెజెంట్ చేసినందుకు తన మనవరాలుకు తనమీద ఎంత ప్రేముందో అమ్మమ్మకు తెలిసి చాలా సంతోషిస్తుంది. తను చనిపోయినప్పుడు తన శవం పక్కనే ఆమెకెంతో ఇష్టమైన మరికొన్నింటితో పాటు ఈ ‘క్విల్ట్’ను కూడా పెట్టాలని ఆ అమ్మమ్మ కోరుకోవటం మనల్ని కదిలిస్తుంది. మానవ హృదయ స్పందనలు ఇండియాలోనైనా అమెరికాలోనైనా ఒకే విధంగా ఉంటాయి కదా అనిపిస్తుంది. ఈ సార్వజనీనతే సాహిత్యం తనలో ఇమిడ్చుకున్న ఔన్నత్యం.
‘ఆ ఇంట్లో ఒకరోజు’ అనే కథలో తల్లిదండ్రులకు వారి సంతానానికి మధ్య ఉండే సంబంధాన్ని చెబుతుంది. తమకు దూరంగా ఉంటున్న తమ కొడుకు తమతో ఉంటే తామెంతో సంతోషించేవాళ్ళమని ఆ తల్లిదండ్రులు అనుకుంటారు. అమెరికాలో తల్లిదండ్రులను చాలా చిన్న వయసులో వదిలేసి ఎక్కడో ఉండే కొడుకులను గూర్చి మనకు తెలుసు. ఇప్పుడు మనదేశంలో కూడా అదే పరిస్థితి నెలకొంటున్నది. కొడుకులు దూరమైనప్పుడు అమెరికన్ తల్లిదండ్రులు కూడా ఎలా బాధపడ్తారో ఈ కథ చిత్రిస్తుంది.
‘చిరిగిన చిత్తరువు’ కథను ఈ కథలోని ఒక స్త్రీ పాత్ర చెబుతున్నట్టుగా రచయిత రాశాడు. ఇది ఒక పెయింటింగ్కు సంబంధించిన కథ. ఆ అమ్మాయి వాళ్ళ తల్లికి పెయింటింగ్స్ మీద చాలా ఇంటరెస్ట్ ఉంటుంది. తను కూడా పెయింటింగ్స్ వేస్తుంది. తను కలెక్ట్ చేసిన పెయింటింగ్స్ అన్నింటిని తన కూతురికి అప్పజెప్పి ఆ తల్లి చనిపోతుంది. కొంతకాలం తర్వాత పెయింటింగ్స్‌ని ఇంట్లో పెట్టుకోవడంకంటె ఒక ఎక్జిబిషన్ పెట్టి అమ్మేయడం నయం అనుకుంటుందా అమ్మాయి. అలా వాళ్ళ ఇంటి దగ్గరే ఒక ఎగ్జిబిషన్ పెట్టి ఆ పెయింటింగ్స్‌ని అమ్మటం మొదలెడ్తుంది. కొద్దిమంది కళా ప్రేమికులొచ్చి ఆ పెయింటింగ్స్‌లో కొన్నింటిని కొంటుంటారు. అప్పుడొక పెద్ద గడ్డం ఉన్న వృద్ధుడొచ్చి ఆ పెయింటింగ్స్లోని ఒక పర్టిక్యులర్ పెయింటింగ్ కావాలని అడుగుతాడు. ఆతడా పెయింటింగ్‌కు 20 డాలర్లు మాత్రమే ఇవ్వగల్గుతానని చెబుతాడు. 20 డాలర్లకు ఆ పెయింట్ను అమ్మనని ఆ అమ్మాయి చెప్పేస్తుంది. కనీసం 200 డాలర్లయినా కావాలంటుంది. తన దగ్గర అంత డబ్బు లేదని ఆ గడ్డం వృద్ధుడు నిరాశతో వెళ్ళిపోతాడు. ఆ పెయింటింగ్లో ఉన్నది ఒక రెడ్ ఇండియన్. ఆ గడ్డం వృద్ధుడికి ఆ పెయింటింగ్ మీద అంత ఇష్టం ఎందుకు కల్గిందో ఆ అమ్మాయికి అర్థం కాదు. ఆ వృద్ధుడు మరోసారొచ్చి ‘30 డాలర్లు ఇస్తాను. ఆ పెయింటింగ్ను తన కమ్మమ’ని అంటాడు. అప్పుడు కూడా ఆ అమ్మాయి అమ్మనంటుంది. కొంతకాలం తర్వాత పెయింటింగ్స్‌ని గురించి బాగా తెలిసిన వాళ్ళ మిత్రుడొకాయన వాళ్ళింటికొచ్చి పెయింటింగ్‌ని చూసి దాన్ని అమ్మితే ‘వందవేల డాలర్లు’ వస్తాయని, తనతో వచ్చిన మిత్రుడొకాయన దాన్ని వందవేల డాలర్లకు కొనటానికి ఒప్పుకున్నాడని చెప్పినప్పుడు ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులుండవు. అది బలాయీ అనే ఆర్టిస్టు ఒరిజినల్ పెయింటింగ్ అనీ నిర్ధారణ చేసి అంత డబ్బు చెల్లించటానికి వాళ్ళు ఒప్పుకుంటారు. తర్వాత కథలో బలాయీ అనే ఆర్టిస్టును గురించి, ఆ పెయింటింగ్ కొంటానని వచ్చిన ఆ గడ్డం వృద్ధుడు బలాయీ కొడుకై ఉంటాడని అనుకుంటారు. ఆ పెయింటింగ్‌ని పదివేల డాలర్లకు అమ్మవద్దని భార్యాభర్తలిద్దరు (ఈ కథ చెబుతున్న అమ్మాయి, ఆమె భర్త రాబర్టు) నిర్ణయించుకొని ఆ గడ్డం వృద్ధుని కోసం ఎదురుచూస్తుంటారు.
చాలా మంచి కథ. చివరి వరకు సస్పెన్స్‌ను పోషిస్తూ, ఆ అమ్మాయి ఆ పెయింటింగ్ అమ్మటం వల్ల వచ్చే డబ్బుకు ఆశ పడకుండా ఆ పెయింటింగ్ న్యాయంగా ఆ గడ్డం వృద్ధునికే చెందాలని నిర్ణయించుకోవటం.. ఆ దంపతుల్లోని నైతిక బలాన్ని తెలియజేయడంతో కథను ముగించటం – మనల్ని అబ్బురపరుస్తుంది.
ఈ సంపుటిలోని చాలా మంచి కథల్లో ‘అతను’ అనేదొకటి. ఒక విమానంలో అమెరికా నుండి ఇండియా కొస్తున్న ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ రూపంలో ఈ కథ సాగుతుంది. ఈ ఇద్దరిలో ఒకరు స్త్రీ, ఒకరు పురుషుడు. ఆ ఇద్దరికీ ఇదివరకు ఒకరికొకరు పరిచయం లేదు. అతనికి ఆమె పక్కనే సీటు దొరుకుతుంది. ఆమె పేరు ఉత్పల. ఆమెకు అతనితో మాట్లాడాలని లేకపోయినా అతడే అతిగా కల్గజేసుకొని ఆమెకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అతన్ని భరించక తప్పదని నిర్ణయించుకున్న ఉత్పల క్లుప్తంగానైనా అతడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటుంది. ఆమె ఒక డాక్టర్ అని, తను అమెరికాలో డాక్టర్‌గా పని చెయ్యటానికి అర్హత సంపాదించానని, కాని తను డాక్టర్‌గా పని చెయ్యటానికి తన భర్త ఒప్పుకోవటం లేదని ఆమె చెబుతుంది. ఆమె భర్త చాలా మంచివాడే.. తనను బాగా చూసుకుంటాడు – అని చెప్పి తను అమెరికా నుండి ఇండియాకొచ్చేస్తున్నానని మళ్ళీ తనకు అమెరికాకు వెళ్ళే ఉద్దేశం లేదని చెబుతుంది. తనకో కూతురు కూడా ఉందని, ఆ కూతురును తన భర్తకే అప్పజెప్పి ఇండియాకొచ్చేస్తున్నానని కన్నీళ్ళతో చెబుతుంది. ఎందుకిలా చేస్తున్నది అంటే: అమెరికాలో ఉన్నంత కాలం ఆమె భర్త ఆమెను డాక్టర్‌గా ప్రాక్టీసు చెయ్యనివ్వడు. ఇండియాకొచ్చి డాక్టర్ ప్రాక్టీసు చేస్తూ పేదవాళ్ళకు సహాయం చెయ్యాలనే ఆమె ఉద్దేశం అతడు అర్థం చేసుకుంటాడు. ఈ కథలోని చాలా విషయాల్ని వాళ్ళ మధ్య జరిగిన సంభాషణల ద్వారా మనమే అర్థం చేసుకోవాలి తప్ప రచయిత యేమీ చెప్పడు. అతడు అన్ని విధాలా మంచివాడే అయినా అతనిలోని ‘మేల్ ఈగో’ ఎలా పనిచేస్తున్నదో మనం తెలుసుకుంటాం.
“ఎంతో కష్టపడి మెడిసిన్ చదివి నేను ఎవరికీ పనికి రాకుండా పోతున్నాను. ఆయనకు (ఆమె భర్తకు) నా అవసరం కంటె మనుష్యులకు నా అవసరం ఎక్కువనిపించింది. డాక్టర్లు అందుబాటులో లేక ఎంతోమంది చనిపోతున్నారు. వాళ్ళకి నా అవసరం ఉందనిపించింది. అందుకే…” ఇహ మాటలు పెగల్లేదు ఉత్పలకి.
చక్కని శిల్పంతో మలచబడిన ఈ కథ ఈ సంపుటిలోని అత్యుత్తమ కథల్లో ఒకటనిపించింది.
“తనకంటె ఎక్కువ సంపాదిస్తూ ఉండటం అతను భరించలేడు. పైకి ఎవరూ అనకపోయినా అందరికీ తెలుస్తుంది. ఎప్పటికీ ఆయనదే పైచెయ్యుండాలి. పైకి చెప్పలేడు. చెబితే తను సౌమ్యుడన్న పేరు పోతుంది. పైకి వెళ్ళగక్కలేని పురుషాహంకారం. అంతకు మించి ఏమీ లేదు” అంటుంది ఉత్పల.
“ఈ రోజుల్లో కూడా ఇలా ఆలోచించే వారుంటారా?” అని అంటాడు ఆమె మాటలు వింటున్న వర్మ. అతని పేరు వర్మ అని కథ చివర్లో తెలుస్తుంది.
“అతడు నిజంగా మంచివాడే, కానీ మగాడు. మీ అందరిలాంటివాడు” అంటూ హైద్రాబాద్‌లో విమానం దిగి వెళ్ళిపోతుందామె.
‘డ్యూస్’ అనే కథ టెన్నిస్ ఆటకు సంబంధించింది. టెన్నిస్ ఆడుతూ తను కొట్టిన షాటుకు తన మిత్రుడు జాన్ గాయపడి హాస్పిటళ్ళో చేరాడని, చాలాకాలం దాకా కోలుకోడని తెలుసుకున్న ఈ కథ చెబుతున్న టెన్నిస్ ప్లేయర్ చాలా బాధపడ్తాడు. ఒక మంచి స్నేహితుణ్ణి దూరం చేసుకున్నానే అనుకుంటాడు. కానీ ఆ జాన్ “ఆటలో ఇది మామూలే, నువ్వు నన్ను కొట్టాలని ఆ షాట్ కొట్టలేదు కదా!” అని జాన్ మళ్ళీ అతనికి స్నేహితుడౌతాడు.
మెక్సికో నుండి ఇల్లీగల్‍గా సరిహద్దు దాటి అమెరికా వచ్చి అక్కడి సిటిజెన్‌షిప్పు తీసుకోవాలని వచ్చే ఓ వ్యక్తి పడే అష్టకష్టాలు.. ఇల్లీగల్‌గా మెక్సికో సరిహద్దు దాటి అమెరికాకు వచ్చేవాళ్ళు చాలామందే ఉంటారు. కొందరు బ్రోకర్స్‌కి బోల్డు డబ్బిచ్చి కొందరు మెక్సికన్లు, కొందరు భారతీయులు మెక్సికో సరిహద్దు దాటే ప్రయత్నం చేస్తారు. అలా చేస్తూ వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్తారో ఈ కథ చెబుతుంది. మెక్సికో నుండి ఇల్లీగల్‌గా అమెరికాకొచ్చే వాళ్ళకు అడ్డుకట్ట వెయ్యాలని ట్రంప్ గారు అధ్యక్షుడైనప్పుడు మెక్సికో – అమెరికా సరిహద్దులో ఒక గోడ కడ్తానన్నాడు.
‘బతుకాట’ అనే కథలో కూడా టెన్నిస్ ఆటే ముఖ్యమైన భూమికగా ఉంటుంది. టెన్నిస్ ఆట ఆడటం చాలా డబ్బున్న వాళ్ళకే సాధ్యమౌతుందని, పేదవాళ్ళు ఈ ఆట ఆడితే చాలా కష్టాలు పడ్డారని ఈ కథ చెబుతుంది.
‘ఐ హేట్ మై లైఫ్’ అనే కథను ఒక యువతి చెప్పినట్టుగా రచయిత రచించాడు. అమెరికాలో స్థిరపడ్డ తెలుగువాళ్ళు తమ పిల్లల్ని.. ముఖ్యంగా ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఆడపిల్లలు నైట్ పార్టీలకు వెళ్ళొద్దని, ప్రిమారిటల్ సెక్స్‌కు తమ పిల్లలు దూరంగా ఉండాలని అనుకుంటారు. అమెరికాలో అయితే ప్రిమారిటల్ సెక్స్‌ని సీరియస్‌గా తీసుకోరు. పురుషుల విషయంలో అయితే ప్రిమారిటల్ సెక్స్‌కు వాళ్ళ తల్లిదండ్రులకు పెద్ద అభ్యంతరం ఉండదు. కానీ ఆడపిల్లలు మాత్రం వాళ్ళు తమ వర్జినిటీని కాపాడుకోవాలని వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటారు. “నైట్ పార్టీకి వెళ్తానంటే అమ్మ ఎందుకంత కంగారు పడింది” అని ఆ అమ్మాయి వాళ్ళ నాన్ననడిగితే అతడు చెప్పిన సమాధానం- “ఒక పేరెంట్‌గా భయంరా.. యూ హావ్ టు బి ఎ పేరెంట్ టు నో హౌ ఎ పేరెంట్ థింక్స్. పైగా ఇది మన కల్చర్ కాదు. నువ్వెక్కడ పెళ్ళికి ముందే వర్జినిటి కోల్పోతావో, నిన్ను మన వాళ్ళెవరూ పెళ్ళి చేసుకోరేమోనని ఆవిడ భయం”. అమెరికాలో ఉంటున్నప్పటికి అమెరికన్ కల్చర్‌కు అలవాటు పడని మన తెలుగువాళ్ళ సమస్యను ఈ కథ అత్యంత వాస్తవికంగా చిత్రించింది.
“డాడీ! వర్జినిటీ ఆడవాళ్ళకేనా? మగవాళ్ళకు అవసరం లేదా?” అని ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నకు వాళ్ల డాడీ దగ్గర సమాధానం లేదు.
‘అహిగా’ కథలో ఒక పెయింటింగ్కు సంబంధించిన ఉదంతం ఉంటుంది. ఒక భారతీయ స్త్రీ చిన్న నేలబారు పీట మీద కూర్చొని స్నానం చేస్తున్న ఆ చిత్రంలో ఆ స్త్రీ ముఖం కనిపించదు. వాళ్ళింట్లో గోడకు వెళ్ళాడేసి ఉన్న ఆ పెయింటింగ్‌ను ఈ కథలోని సరూ అహిగా అనే ఆయన వేసిన ఆ పెయింటింగ్‌ను అదేపనిగా చూస్తోంటే ఆమె భర్త జాన్ కు ఆమె ఎందుకలా చూస్తోంది అన్న సందేహం కల్గుతుంది. అయితే ఒకరోజు సరూ ఆ పెయింటింగ్ లో ఉన్నది నేనేనని చెబుతుంది.
‘గలుబె’ కథలో ‘గలుబె’ అనేదొక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్. సిద్ధూ అనే స్టూడెంట్ స్పెల్లింగ్ పోటీలో పాల్గొని గలుబె స్పెల్లింగ్ కరెక్ట్ చెప్పి బోల్డు డబ్బు గెల్చుకొని అతని తల్లిదండ్రులను ఆనందంలో ముంచెత్తుతాడు. అమెరికన్ కాలేజీల్లో స్పెల్లింగ్ పోటీలు జరుగుతాయి. ఇండియాలో అలాంటి పోటీలు జరగటం లేదు.
‘నీడ’ అనే కథను రచయిత థర్డ్ పర్సన్లో చెప్పాడు. కథ చెబుతున్నవాడికి ఆ కథలో యేమీ పాత్ర ఉండకపోవటం, కేవలం ఒక సాక్షిగా ఆ కథలో యేం జరిగిందో చెప్పటం ఆ చెప్పేవాడి బాధ్యత. ఇలా థర్డ్ పర్సన్ కథలు చెప్పే పద్ధతి మన తెలుగు సాహిత్యంలో చాలా తక్కువ.
‘లవ్ ఆల్’ – అందర్నీ ప్రేమించమని చెప్పే కథ. ఈ కథ కూడా టెన్నిస్ ఆటకు సంబంధించిందే. స్టీవ్ అనేవాడు తనకేదో అన్యాయం చేశాడని భావించే రాజాను మార్చేసి స్టీవు ప్రేమించేలా చెయ్యడం ఈ కథలో జరుగుతుంది.
‘పార్డన్ మీ ప్లీజ్’ అనే కథను రచయిత సినిమాల్లో వాడే ‘డిస్సాల్, ఫేడౌట్, ఫేడిన్, కట్’ లాంటి టెక్నిక్స్ తో రాయబడిన కథ. సినిమాలో వాడే టెక్నిక్స్‌ని కథలు చెప్పడానికి కూడా వాడొచ్చునని రచయిత ఈ కథలో రుజువు చేశాడు. యూనివర్శిటీల్లో చదువుకునే విద్యార్థినీ, విద్యార్థుల మధ్య జరిగే ప్రేమకథను రచయిత ఈ ఆసక్తికరమైన శిల్ప విధానంతో చెప్పడం బావుంది.
‘మామూలు మనుషులు’ అనే ఈ కథలో జర్నలిస్టుల వల్ల కొంత మంచి, కొంత చెడు జరుగుతుందని రచయిత చెప్పాడు. జర్నలిస్టులు కూడా మామూలు మనుషులే అని చెప్పటం రచయిత ఉద్దేశం.
‘రేపటి గతం’ అనే కథను కూడా రచయిత థర్డ్ పర్సన్లో చెప్పాడు. ఒకమ్మాయి రేపు గురవుతుంది. పోలీసు స్టేషనకు వెళ్ళి కంప్లెయింట్ ఇస్తుంది. అక్కడుండే ఇన్‌స్పెక్టర్ ఆమె చెప్పిందంతా విని ఆమెను ఆ రాత్రే జడ్జి దగ్గరకు తీసికెళ్తాడు. ఆమెను రేప్ చేసినవాడు ఒక ఎం.పీ. కొడుకని జడ్జిగారికి తెలుస్తుంది. రేప్ చేసిన వాడిమీద కేసు పెడ్తో వాడికేమీ శిక్షపడకుండా తప్పించుకుంటాడని, నువ్వు కేసు పెట్టకుండా, గప్‌చుప్‍గా ఇంటికెళ్ళి నిన్ను రేప్ చేసిన విషయం నీ తల్లిదండ్రులకు తప్ప ఎవరికీ చెప్పకుండా, బయటి ప్రపంచానికీ విషయం తెలియకుండా జాగ్రత్త పడి హాయిగా పెళ్ళి చేసుకొమ్మని జడ్జిగారు ఆ అమ్మాయికి సలహా ఇస్తాడు. అమెరికాలో కూడా ఇలాంటివి జరుగుతాయంటే బోల్డు ఆశ్చర్యం కల్గుతుంది.
అమెరికాలో ఉంటున్న మన పిల్లలు వృద్ధాప్యంలో మనల్ని వాళ్ళ దగ్గరికి అమెరికాకు రమ్మంటారు. అమెరికాకు వెళ్ళటం కంటే మన స్వంతూర్లో మనకొచ్చే పెన్షన్‍తో స్వతంత్రంగా బతకటమే నయమంటాడీ రచయిత. స్వంత ఇల్లు, స్వంత సంపాదన, అనోన్యంగా కలుసుండే భార్యాభర్తలు తమ స్వంత ఇంట్లోనే ఉండాలని, వృద్ధాశ్రమాలకు వెళ్ళకపోయినా ఫరవాలేదని ఈ కథ చెబుతుంది.
‘ఒంటరి విహంగం’ కథలో ఆ తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చిందని తెలిసినా అతని పిల్లలు, కొడుకు, కూతురు అతన్ని చూడటానికి రారు. అతడొక్కడే.. భార్య చనిపోయింది. ఒంటరితనం భరించలేక 70 యేళ్ళ వయస్సులో ఆ తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు. తను ఈ వయస్సులో మళ్ళీ ఎందుకు పెళ్ళి చేసుకున్నాడో చెబుతూ అతడు యు.ఎస్.ఏలో ఉన్న అతని కొడుక్కు పెద్ద ఉత్తరం రాస్తాడు. అయినా ఆ కొడుకు కన్విన్స్ కాడు. ఈ సంఘటన మన ఎన్.టి.ఆర్. లక్ష్మిపార్వతిని పెళ్ళి చేసుకున్న సంఘటనను గుర్తుచేస్తుంది.
‘సైన్యం’ అనేది ఒక మర్డర్ మిస్టరీ లాంటి కథ.
‘నేను అహల్య కాదు’ అనే కథలో నంది నాటకపోటీల్లో నాటకాలు ప్రదర్శించే నాటక సమాజాలవారు ఎదురుకునే సమస్యలు చిత్రితమయ్యాయి.
‘కథా కలహం’ కథలో ఒక సినిమాకు స్క్రిప్టు రాయాలని కూర్చున్న రచయిత.. మామూలుగా కథలో నవలలో రాయటం కంటే సినిమాకు స్క్రిప్టు రాయటం చాలా కష్టమని ఆ రచయిత తేల్చుకుంటాడు.
‘ఊర్మిళరేఖ’ అనే కథలో రామాయణంలో అందరం మరచిపోయిన లక్ష్మణుడి భార్య ఊర్మిళను గూర్చిన ప్రస్తావన ఉంటుంది. సీత రాముడితో అడవులకు వెళ్ళినప్పుడు ఊర్మిళను తనతో అడవులకు తీసికెళ్ళటానికి లక్ష్మణుడెందుకొప్పుకోడు? అన్న ప్రశ్నను ఈ కథ లేవనెత్తుతుంది.
ఇలా గొర్తి బ్రహ్మానందం రచించిన ఈ కథలన్నింటిలోను కొత్తదనం ఉంది. అమెరికాలో ఉంటున్న తెలుగువాళ్ళను గురించే కాకుండా అక్కడుండే అమెరికన్ల సమస్యల్ని కూడా ఈ కథలు చర్చించాయి. అక్కడి సంస్కృతికి మన తెలుగు వాళ్ళ సంస్కృతికి ఎంత వ్యత్యాసం ఉందో ఈ కథలు చాలా సంయమనంతో అవగాహనతో చెబుతాయి.
శిల్పరీత్యా కూడా ఈ కథల్లో గొప్ప వైవిధ్యం ఉంది. కథను ఎన్ని శిల్పరీతుల్లో చెప్పొచ్చో ఈ కథలు చూపించాయి. కథలు రాసేవాళ్ళు ఈ కథల నుండి నేర్చుకోవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈ కథల్లో ఉన్న మరో గొప్ప గుణమేమిటంటే పఠనీయతాగుణం. కథను మొదలెట్టామంటే పూర్తి చెయ్యకుండా ఉండలేం. ఎవరికైనా.. అంటే యే పాఠకుడికైనా ఈ కథల్ని చదవటం ఒక గొప్ప అనుభవం.
***
రచన: సాయి బ్రహ్మానందం గొర్తి
పేజీలు: 278
వెల: ₹300.00
ప్రతులకు: అనల్ప బుక్స్, సికింద్రాబాద్ 7093800303
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. 90004 13413
ఆన్‍లైన్‌లో:
https://telugu.analpabooks.com/quilt
https://www.amazon.in/dp/B0BWK4G4V9
అంపశయ్య నవీన్ సుప్రసిద్ధ తెలుగు రచయిత. వీరి ‘కాలరేఖలు’ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
అంపశయ్య, ముళ్ళపొదలు, అంతస్స్రవంతి నవలలు రవిత్రయ నవలలుగా పేర్గాంచాయి.
కాళోజీ సాహిత్య పురస్కారం, రావి శాస్త్రి పురస్కారం, జ్యేష్ట సాహిత్య పురస్కారం లభించాయి.
కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.