[డా. ఎ. వి. నరసింహరావు రచించిన ‘పుష్ప రాగం..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
మొగ్గగా –
రంగుల కలలను,
పురుడు పోసుకుంటుంది ‘పువ్వు’!
రెక్కలు విప్పుతూ –
చిరునవ్వులు చిందిస్తుంది!
విరబూసి –
గాలికి తావిని అద్దుతూ-
మధుపాత్రై –
అమృతాన్ని చిందిస్తూ-
పుప్పొడై మరో జన్మకు
అంకురార్పణ చేస్తుంది!
ఆనందంతో –
గుడికో జడకో చేరుతుంది!
బతుకు,
సంక్షిప్తమైనా, సంక్లిష్టమైనా
గాలికి పెరిగినా,
ఆప్యాయత –
అణువంతైనా పుష్ప రాగమై,
మనస్సున రంగవల్లులు దిద్దుతుంది!!