Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పురుషాలంకారం

[డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతిరావు గారు రచించిన ‘పురుషాలంకారం’ అనే హాస్య కథని పాఠకులకు అందిస్తున్నాము.]

‘ఆడవాళ్ళు అలంకరించుకుందురు’ అన్నది పాతకాలపు మాట.

‘స్త్రీలు సింగారించుకుందురు’ అన్నది మధ్యకాలపు మాట.

‘లేడీస్ ఫోషన్‌బుల్‌గా ఉంటారు’ అన్నది ఈ కాలపు మాట.

అయినా ఇప్పుడు అదీ కాలం చెల్లిపోతున్న మాట.

ఆ కాలంలో లాగా బారెడు జడలేసుకొని, అందులో పూలు తురుముకొని, రంగురంగుల పట్టుచీరలు కట్టుకొని.. వయ్యారపు నడకలతో, అంటే అదే హంసనడకలు, ఏనుగు నడకలు వంటివి నడిస్తూ వెళ్తున్న ఆడది ఒక్కతంటే ఒకతయినా కనిపిస్తోందా అసలిప్పుడు?

ఏవో పొట్టి పొట్టి షార్టు, చినుగుల జీన్స్ పాంట్లు, భుజాల దగ్గర పెద్దపెద్ద హోల్స్ వున్న టాప్సు తోడుక్కొని, బోసి మెడ, బోసి చేతులతో వెళ్తున్నారు ఎటు వెళ్తున్నా. వీటికి తోడు బొట్టులేని ఖాళీ ముఖాలు, స్నోలు, పౌడర్లు కూడా లేక జిడ్డోడుతున్న పేస్‌లతో. మరి అంతకు ముందున్న ఆ అలంకరణలు, అలంకరణ సామగ్రులు ఎటు పోయాయి, ఏమయిపోయాయి అంటే అవన్నీ పురుష పుంగవుల దగ్గరికి హుష్ కాకి అంటూ ఎగిరిపోయాయి.

అబ్బో.. అబ్బో ఎన్ని సోకులో ఇప్పుడు మగవాళ్ళకు! పట్టలేకుండా ఉన్నాం వాళ్ళనిప్పుడు. ఒకప్పటి స్త్రీల అలంకారాలన్నీ ఇప్పుడు పురుషాలంకారాలుగా రూపాంతరం చెందాయి.

అసలు నాకు తెలియక అడుగుతానూ ఈ మగవాళ్ళకు బ్యూటీపార్లర్లు ఎందుకండీ – హవ్వ! మెన్స్ బ్యూటీపార్లరట! వీధికి పదికి తక్కువ లేవు.. బాహాటంగా బయట బోర్డులు వేలాడదీసి మరీ..! అందులో దూరుతున్నారు ఈ మగసంత అంతా ‘పొలో’మంటూ.

‘ఫర్ మెన్’ అని బయట బోర్డు పెట్టారంటే అర్థం, లేడీస్‌కి అందులో ప్రవేశం లేదు అనే కదా. ఇంతకు ముందు ‘స్త్రీలకు మాత్రమే’ అని బోర్డులు కనబడేవి.. ఇప్పుడు ‘పురుషులకు మాత్రమే’ అని కనబడుతున్నాయి. ఔరా..! కాలం ఎంత మారిపోయింది.

ఇంతకూ ఈ మగవాళ్లు బ్యూటీ పార్లర్లలో దూరి ఏం చేస్తారయ్యా అంటే – అహఁ ‘మీకెలా తెలుసు’ అన్నట్టు అలా నా వంక అనుమానంగా చూడకండి. నాకన్నీ అలా తెలిసిపోతూ వుంటాయి. మేకప్పులేసుకుంటారట! ఇక అసలు విషయానికి వస్తే – నాకు ‘క్రిష్’ అని ఒక బోయ్ ఫ్రెండ్ ఉన్నాడు లెండి. ఇంతకూ, ఇంతవరకూ నా పేరు చెప్పలేదు కదూ? నా పేరు సారా. క్రిష్, సారా ఏంటి ఈ పేర్లు అని అలా చూడకండి. ఈ మోడ్రన్ యుగంలో యూత్ పేర్లు అలాగే వుంతిన్నాయి. ఈ ఇంతకూ ‘వాడి’ అదే, నా బోయ్ ఫ్రెండు వారానికి రెండుసార్లయినా బ్యూటీపార్లర్లో దూరతాడు. దూరి, పగటి వేషగాడిలా తేపకో గెటప్‌తో నా ముందు దిగబడిపోయి “సారా హౌ ఐ యామ్ లుకింగ్?” అంటూ పెద్ద గావు కేక లాంటిది పెడతాడు.

దాంతో నేను దడుసుకొని చచ్చి వాడే వీడని గుర్తుపట్టడానికి నానా అవస్థా పడుతుంటాను. ముళ్ళకంపలా ఇంతెత్తున పైకి లేచిన క్రాప్‌తో ఒకసారి, అంటకత్తెరతో మరొకసారి కనిపిస్తాడు. దానికి తోడు ఒక కనుబొమ నడమ నాలుగు వెంట్రుకలు పీకినట్టు చిన్న కట్స్, చెవికి పోస, పూల పూల చొక్కా, పొట్టి నిక్కరు.. చేతికి రాగిరంగులో గాజు లో విచిత్రవేషధారిగా సర్కసు బఫూన్ చూడగానే నవ్వొచ్చేలా వుంటాడు. ఆ సమయంలో నా పక్కనున్న నా ఫ్రెండ్స్ కొంతమందయితే వాడు బుష్ లాంటి జుట్టుతో వున్నప్పుడే భయంతో కెవ్వున కేక పెట్టి “వీడెవడే సిరిసిరిమువ్వ సినిమాలో చంద్రమోహన్ లాగున్నాడూ – డప్పు, కర్ర ఒకటే తక్కువ” అన్నారు.

దాంతో నాకు రోషం వచ్చి – “అరేయ్ క్రిష్. ఇలా సడన్‌గా అవతారాలు మారుస్తూ వచ్చి భయపెట్టావంటే, నీకు బ్రేకప్ చెప్పి నేను మరో బోయ్ ఫ్రెండ్‌ని చూసుకుంటాను. అంతేకాదు. ఇప్పుడు భయపడ్డ ఈ ఫ్రెండ్సందరికీ ఏ పబ్ లోనో గ్రాండ్ బ్రేకప్ పార్టీ కూడా ఇస్తాను” అన్నాను.

“వెస్ట్రన్ స్టైల్ సారా!”

“ఇదేం వెస్ట్రన్ స్టైల్? నీ బొంద. ఈసారి ముళ్ళపంది స్టైల్ హెయిర్‍కట్ చేసుకొని వరాహావతారం ఎత్తి వస్తావా ఏంటి? అలా మా ఇంటికి మాత్రం రారు. మా గ్రానీ అసలే వరాహమూర్తి భక్తురాలు, చూసిందంటే ‘నా దేవుడ్ని అవమానించావ్’ అంటూ చీపిరి కట్ట తీసుకుంటుంది” అన్నాను నవ్వుతూ.

నేను నవ్వుతూ అన్నా క్రిష్ నా మాటలను సీరియస్ గానే తీసుకున్నాడు.

“మీ గ్రానీ ఏమో గానీ నువ్వు మాత్రం చాలా ఏన్షియంట్.. నా లేటెస్ట్ వెస్ట్రన్ ఫాషన్స్‌ని మెచ్చుకునే మరో గర్ల్ ఫ్రెండ్‌ని వెతుక్కుంటాను నేను్” అంటూ బై బై చెప్పి వెళ్ళిపోయాడు.

నేనూ మోడ్రన్ అమ్మాయినే – నేనూ బ్యూటీపార్లర్ కు వెళ్ళి హెయిర్ కటింగ్, ఐబ్రోన్ కటింగు, కాళ్లూ చేతులకు వాక్స్ చేయించుకుంటాను. కానీ, ఇప్పుడు ఈ ఆడవాళ్ళ అలంకారాలన్నింటినీ మించి పురుషాలంకారాలు వేలంవెర్రిగా, గంగవెర్రులెత్తినట్లుగా చెలరేగిపోతున్నాయన్నదే నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం. ‘మగవాళ్లు అంత బ్యూటీ కాన్షస్ ఎందుకయిపోతున్నారు? కారణం ఏంటి? అందంగా, హ్యాండ్సమ్‌గా కనిపించాలన్న తాపత్రయంలో ఉన్న అందాన్ని పాడు చేసుకుంటున్నారా?’ అని ఆలోచిస్తూ యాక్టివా స్టార్ట్ చేసి రయ్యిన రోడ్డు మీద పరుగులు తీయిస్తూ పక్షిపిల్లలా వచ్చి ఇంట్లో వాలాను. నేను ఇంటికొచ్చేసరికి మమ్మి సిటౌట్‌లో కూర్చుని ఇంగ్లీష్ మాగజైన్‌లో ఫోటోలేవో చూస్తోంది. మా డాడీ గార్డెన్‌లో చెట్లకు పైప్‌తో నీళ్లు పెడుతున్నాడు. “హాయ్ మామ్!” అంటూ పరుగున వెళ్ళి మమ్మీ భుజం చుట్టూ చెయ్యివేసి హగ్ చేసుకొని, నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను. “హాయ్ సారా! కూర్చో” అంది మమ్మీ. కూర్చున్నాను. అయినా మమ్మీ మాగజైన్ మీద నుంచి చూపు తిప్పకుండానే “సారా! మేము వయసులో ఉన్నప్పుడు మా బామ్మ, మా అమ్మా ‘మగవాడికి అందమేంటి’ అనేవాళ్ళు. మగపిల్లలున్న తల్లులంతా ‘హాయిగా వుంది ప్రాణానికి. క్రాప్ దువ్వి, ఒంటికి ఒక చొక్కా, లాగూ తగిలించి వదిలేస్తే మగపిల్లాడిని తయారు చెయ్యటం అయిపోతుంది. కానీ ఆడపిల్లలకు అలా కాదు. ఆ బారెడు జుట్లకు తలంటి పోసి, చిక్కు తీసి, జడ అల్లాలి.. బొట్టూ, కాటుకా పెట్టాలి.. గౌనో, పరికిణో వేయాలి..! చేతులు పడిపోతాయి’ అనేవాళ్ళు. అలా అనుకునే బంగారం లాంటి పిల్లనయిన నన్ను తీసుకెళ్ళి, ఓ అందం, చందం; పర్సనాలిటీ లేని మీ డాడీకి అంటగట్టారు” అంది మమ్మీ.

నిజమే! మమ్మీ చాలా అందంగా ఉంటుంది.. దానికి తగ్గట్టు పర్సనాలిటీని, వయసుని కూడా చాలా చక్కగా మెయిన్‌టైన్ చేస్తుంది. తనంతట తనే బ్యూటీ పార్లర్‌కు వెళ్ళి ఫేస్ గ్లో చేయించుకుంటుంది. వయసులో తాజాదనం కనిపించేలా బ్యూటీ టిప్స్‌ని ఫాలో అవుతుంది. మనిషి కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అలాంటి మమ్మీకి అందవిహీనత, ముదురు వయసూ ఉండే డాడీ భర్తగా దొరికాడు. ‘మామ్ ముందు డాడ్ తేలిపోతున్నట్లు ఉంటాడు.’ అనుకున్నాను నేను.

“సారా, ఈ రోజుల్లో మగవాళ్లు కూడా ఎంత ప్యాషనబుల్‌గా ఉంటున్నారో చూడు. ఇప్పుడు గుబురు గడ్డం, పిచ్చిక గూడ హెయిర్ స్టయిలూ ఫాషన్. మగవాడంటే ఒకప్పుడు క్లీన్ షేవ్డ్ గడ్డంతో పొట్టి జుట్టు క్రాఫ్ లతో ఉండేవాళ్ళు.” అంది మమ్మీ సూటూ, బూటూలో రకరకాల హెయిర్ స్టైల్ లో ఉన్న జంట్స్ వంక చిరునవ్వుతో చూస్తూ. ఇంతలో డాడ్, చేస్తున్న పని ముగించి మా వైపు వస్తూ, “ఓ యంగ్, ఫ్యాషనబుల్ లేడీ, లేచి కాస్త ఓ కప్పు టీ ఇస్తావా?” అన్నాడు మమ్మీ వైపు చిరునవ్వుతో చూస్తూ.

“నువ్వు కూడా కాస్త ఫ్యాషనబుల్ గా ఉండొచ్చుకదా డాడీ” అన్నాను నేను డాడ్ వంక చూస్తూ.

“నాకెందుకమా ఫ్యాషన్లు. మగవాడిని. నేను ఎలా ఉంటేనేం?” అన్నాడు డాడ్.

“అది పాతకాలం డైలాగ్ డాడీ. ఇప్పుడి ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళే ఎక్కువ అలంకారాలు, అదే ఫ్యాషన్స్ చేసుకుంటున్నారు. మమ్మీ కోసమయినా మారొచ్చు కదా?”

“ఇప్పుడు ఇంకేం మారతాను? నన్ను పుట్టించిన ఆ బ్రహ్మదేవుడు కూడా ఈ వయసులో ఇంక నన్ను మార్చలేడు. ఎందుకంటే తల చూడు వెంట్రుకలన్నీ ఊడిపోయి బట్టతల కూడా వచ్చేసింది” అని డాడీ అనగానే “అయ్యో, నువ్వు ఇంకా ఎక్కడో వెనక ఉన్నావ్ డాడీ. ఇప్పుడ్య్ బట్టతల మీద కూడా వెంట్రుకలు మొలిపిస్తున్నారు తెల్పా? హెయిర్ ప్లాంటేషన్!” అన్నాను నేను.

అదే సమయంలో, టీ కప్పుతో బయటికి వస్తున్న మమ్మీ అందుకుంటూ “అలా చెబితే ఆయనకేం అర్థమవుతుందీ? నేను చెబుతా వుండు” అని, “వరిపొలాలలో వరినాట్లు వేస్తారు చూడండి. ఒకో మొక్క నేలలో గుచ్చి నాటుతూ… అలా ఒక్కొక్క వెంట్రుకనూ మీ బట్టతల మీద నాటి వెంట్రుకల పంట పండిస్తారు” అని చెప్పింది.

“అది ఇప్పుడు నాకు అవసరమంటావా? నా నెత్తిన జుట్టు లేకపోతే ఇప్పుడు నువ్వు నాకు విడాకులిచ్చేస్తావా?” అన్నాడు డాడీ.

దాంతో నాకు నవ్వొచ్చింది.

“డాడీ. ఇప్పుడు డైవర్స్ అంటే ఈజీ. కనుక మమ్మీతో సవాల్ చేయకండి. మమ్మీ అసలే మీ విషయంలో ఫ్రస్ట్రేషన్‌లో వుంది” అన్నాను నేను నా గదిలోకి వెళ్తూ, తమాషాగా. నాలో నేను మాత్రం ‘ఈ పురుషాలంకారాలు ఎంత పని చేస్తున్నాయి. పెళ్ళయి ముప్పయి ఐదేళ్ళ తర్వాత కూడా ఆడవాళ్ల మనసులో ఆశలు, కోర్కెలు కల్పిస్తూ’ అనుకున్నాను ఆశ్చర్యపోతూ.

***

నేను రీసెంట్ నా బోయ్ ఫ్రెండ్ క్రిష్‌కి బ్రేకప్ చెప్పేసి మరో బోయ్ ఫ్రెండ్ కోసం గాలించడం మొదలుపెట్టాను. క్రిష్ కూడా నాకు బ్రేకప్ చెప్పడంతో ఇద్దరం కలిసి ఆ రోజు మా ఇద్దరి కామన్ ఫ్రెండ్స్‌కి పార్టీ ఇచ్చాం. అండర్‌స్టాండిగ్‌తో విడిపొయ్యాం. అయినా అప్పుడప్పుడు పార్టీలలో, ఫంక్షన్స్‌లో కలుసుకుంటూనే ఉన్నాం. అతనూ ఈ మధ్య మరో కొత్త గర్ల్‌ ఫ్రెండ్‌తో తిరుగుతున్నాడు. తనలో పురుషాలంకారం కూడా మరికొంత పెరిగినట్లు అనిపించింది.

ఇంతలో నేను జాబ్ రావడంతో బెంగుళూరుకు షిఫ్ట్ అయాను. ఫాస్ట్ లైఫ్‌కి పెట్టింది పేరయిన బెంగుళూరు కల్చర్, అక్కడి యువత స్టెలిష్ లైఫ్ నన్ను క్రమక్రమంగా ఆకర్షించటం మొదలు పెట్టింది. దాంతో నేనూ మరికొంత ఫ్యాషనబుల్‌గా తయారయ్యాననే చెప్పాలి. అంతేకాదు, మగపిల్లల మోడ్రన్, వెస్ట్రన్ అలంకారాల పట్ల కొంత అవగాహన పెంచుకున్నాక ఇలా గుబురు గడ్డాలు, ముళ్ళకంప హెయిర్ స్టైల్సు, ఇవి బాగానే ఉన్నట్టు అనిపించటం మొదలు పెట్టాయి. ఈ మార్పుకు, ఒక కారణం మా కాలేజీ కుర్రాళ్ళు, నా యంగ్ కొలీగ్స్ అయితే మరొక కారణం నేను రెగ్యులర్‍గా వెళ్ళే నా బ్యూటీ పార్లర్. అది ఎలా అంటే- మంచి పాష్ లొకాలిటీలో వున్న నా బ్యూటీ పార్లర్ ఎదురుగా ఒక మెన్స్ బ్యూటీ పార్లర్ వుంది. నేను వెయిటింగ్ రూమ్‌లో ఉన్నప్పుడు ఆ రూమ్ అద్దాలలో నుంచి, ఎదురుగా వున్న బ్యూటీ పార్లర్‌కు వెళ్ళేవాళ్ళు – అందులో నుంచి బయటకి వచ్చేవాళ్లు ఎంతో మంది మగవాళ్ళు యువకులు, నడివయసు వాళ్ళు కనిపిస్తూ వుంటారు. లోపలికి వెళ్లేటప్పుడు తెలుపు నలుపుల జుట్టుతో జిడ్డు ముఖాలతో వెళితే బయటకు వచ్చేటప్పుడు మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టయిల్స్, హెయిర్ లలో, మంచి గ్లో తో మెరిసిపోయే ముఖాలతో వస్తారు. అందులో కొన్ని ఫ్యాషన్స్ అతిగా వెకిలిగా మోటుగా అనిపించి నవ్వు తెప్పిస్తాయి. అక్కడున్న రష్ మా లేడీస్ బ్యూటీ పార్లర్‌లో కూడా ఉండటం లేదు. పిచ్చిపిచ్చి వాలకాలతో భుజాలు ఎగరేసుకుంటా, ఛాతిని విలాసంగా అటూ ఇటూ అప్పుతూ వచ్చే జెంటిల్మన్‌లను చూసి ‘ఓరి నా సోకులో- ఏం ఇరగబడతన్నారు రా నాయనా!’ అనుకుంటాను. మధ్యవయసులో వుండే మగవాళ్ళు వెళుతున్నప్పుడు ఏదో నీరసంగా కనిపిస్తూ వచ్చేటప్పుడు మాత్రం గాల్లో తేలిపోతున్నట్టు రావటం చూసి ‘పురుషాలంకారం సైకలాజికల్ ప్రోబ్లమ్స్‌కి కూడా భలేగా పనిచేస్తోందే’ అనుకుంటాను, యంగ్‌గా కనబడుతున్నామన్న భావన ఎవరికి మాత్రం బాగుండదు!

ఒకరోజు నేను నా టూ వీలర్‌ని రోడ్డు పక్కన పార్క్ చేస్తూ వుంటే ఓ కండల వీరుడు హీరో ఫోజుతో పార్లర్ నుంచి బయటకు వస్తూ నా అందానికి, మోడ్రన్ లుక్‌కి పడిపోయి “హాయ్ బ్యూటీ” అంటూ నా దగ్గరకు వచ్చి పలకరించాడు. గుబురు ప్లస్ లాంగ్ గడ్డం కాక వెనక ఇంత పొడుగున్న జుట్టును మెడ మీదికి వదిలేసి మరికొంత పైన ముడిలా కట్టాడు. ఆయన వంక అలా ఆశ్చర్యపోతూ చూస్తుండగానే మరొక యంగ్ చాప్ గడ్డం కాక, వెనక పోనీ టేల్‌తో మొహమంతా జుట్టుతోనే నిండి వున్నాడు. వాళ్ళను అలా చూస్తుంటే వశిష్ట మహామునీ, విశ్వామిత్ర మహర్షి కలిసి వస్తున్నట్టుగా అనిపించి; లోపల ఇంకెంత మంది సన్యాసులు, మునీశ్వరులూ ఉన్నారో అనే ఆలోచన వచ్చి కిసుక్కున నవ్వాను. “ఎందుకు నవ్వుతున్నారు?” అని అడిగాడు ముందుగా వచ్చినతను. “లోపల ఇంకెంతమంది ఋషిపుంగవులు ఉన్నారా అన్న ఆలోచన వచ్చి!” అని నేను ఆగిపోగానే “బుషిపత్నులు ఇద్దరు వున్నారు” అని చెప్పారు. “ఆడవాళ్ళా?” అని నేను ఆశ్చర్యపోతుంటే, “కాదు- ఆడవాళ్లుగా కనిపించే మగవాళ్లు! ఈ రోజుల్లో ఫ్యాషన్స్ కి ఆడా మగా తేడాలేంటండీ? మీరు చూడండి. బోయ్ కట్ క్రాఫ్, జీన్స్ పాంటు, షర్టులో అచ్చం అబ్బాయిలా కనబడుతున్నారు” అన్నాడు రెండో అతను, ఆ తర్వాత నాకు కౌంటర్ ఇస్తున్నట్టుగా.

“మేము ఆడపిల్లలం మగపిల్లల్లా కనిపించినా ఫరవాలేదేమో గానీ మీరు ఆడపిల్లల్లా కనిపిస్తే బాగుండదేమో?” అన్నాను నేను.

“ఇప్పుడో ఆ భేద భావాలేమీ లేవు మిస్. ఒకప్పుడు, ‘జపాన్‍లో ఫాషను గంటకో రకంగా మారిపోతాయి’ అని వినేవాళ్ళం. ఇప్పుడు ప్రపంచమంతా అదే పరిస్థితి. అందుకే ఎక్కడ పడతే అక్కడ, పుట్టగొడుగుల్లా బ్యూటీపార్లర్లు వెలుస్తున్నాయి.. దానికి తగ్గట్టుగా రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్. కాలం మారింది మిస్. ఇప్పుడు ఈ మోడ్రన్ యుగంలో ఎవరు ఎలా కనిపించినా ఎవ్వరూ పట్టించుకోరు” అన్నాడు మిస్టర్ వశిష్ఠ. ఆరోజు తర్వాత అలా అలా మా పరిచయం పెరిగి నేను వశిష్ఠకి దగ్గరయ్యాం. అతని అసలు పేరు మానవ్ అట. అయినా నేను వశిష్ట అనే నిక్ నేమ్‌తో ఆట పట్టిస్తూ వుంటాను. ప్రేమ స్టేజ్ దాటి మా పరిచయం డేటింగ్ స్థాయికి ఎదిగిపోయి, ఇంకో ఆరు నెలలకు పెళ్ళి చేసుకుందాం అని డిసైడ్ అయిపోయాం

బెంగుళూర్‌లో ఒక ఫ్లాట్ రెంట్‌కి తీసుకొని లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. ఒకళ్ళనొకళ్ళం బాగా అండర్‌స్టాండ్ చేసుకున్నాక, ‘నచ్చితే పెళ్ళి చేసుకుందాం’ అన్నది మా నిర్ణయం.

అందరూ అనుకుంటున్నట్టుగా మా రిలేషన్ మరీ హద్దులు మీరకుండా కొంచెం కంట్రోల్లోనే ఉంటున్నాం. రాబోయే పండుగ శలవుల్లో హైదరాబాద్‌కి వెళ్ళినప్పుడు మా మ్యారేజ్ గురించి మా పేరెంట్స్‌కి చెప్పాలని అనుకుంటున్నాను.

***

నేను ఇంటికెళ్లే సరికి ముందుగా నా కళ్ళకు కనిపించింది సిటౌట్‌లో కూర్చుని సినిమా మాగజైన్ ఏదో చూస్తూ కాఫీ తాగుతున్న మా మమ్మీ. గార్డెనింగ్ చేస్తున్న వ్యక్తి మాత్రం ఈసారి మా డాడ్ కాదు, ఎవరో కొత్త అతను. ‘మాలిని పెట్టినట్టున్నారు’ అనుకుంటూ “ఏయ్ మ్యాన్ – ఈ లగేజీ లోపల పెట్టు” అన్నాను, పెరిగిన చెట్టుకొమ్మల్ని పెద్ద కత్తెరతో కత్తిరిస్తున్న అతన్ని ఉద్దేశించి.

చేస్తున్న ఆ పనిని ఆపి తలెత్తి చూసాడు అతను. “హాయ్ బేబీ” అన్నాడు నా వంక చూసి చెయ్యూపుతూ.

“ఓ డాడ్?! నువ్వా!!, మై గుడ్‌నెస్ – ఏంటి ఇలా మారిపొయ్యావ్? నెత్తిన హెయిరు -పెరిగిన గడ్డం, గుబురు మీసాలు – గుర్తుపట్ట లేకపొయ్యాను అస్సలు. ఎంత యంగ్‌గా, హ్యాండ్సమ్‌గా కనబడుతున్నావ్!’ అన్నాను నేను చాలా ఎక్జయిట్ అవుతూ.

“మీ మామ్ నన్నిలా మార్చేసిందమ్మా బలవంతాన, ఎంత వద్దన్నా వినకుండా రెండో వారాలకొకసారి మెన్స్ బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి కూలేస్తోంది. నువ్వేంటి,  ఎవ్వరూ నన్ను గుర్తుపట్టడం లేదు ఈ కొత్త వేషంలో. మరో ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే?.. ఇలా దగ్గరికి రా.. చెబుతా. సీక్రెట్! నేను వాకింగ్‌కి, షాపింగ్‌కి వెళుతుంటే ఆడవాళ్లు ‘ఏయ్, యంగ్ మ్యాన్. లుకింగ్ హ్యాండ్సమ్’ అంటూ కన్ను కూడా కొడుతున్నారు. ఇదేంటి అని అదిరిపడటం నా వంతవుతోంది.” అని చెప్పుకుంటూ పోతున్నాడు డాడ్.

“మెయింటైన్ చేస్తే అంతే డాడీ. ఇన్నాళ్ళూ నేనూ, మమ్మీ చెబుతున్నా వినలేదు గానీ!’ అన్నాను నేను జవాబుగా.

“అవునమ్మా సారా.. మీరు చెబుతూనే ఉన్నారు. దీని రుచి తెలియక నేనే మీ మాట వినలేదు. చూసే కళ్ళకు మనం అందంగా, మేమయితే పురుషత్వం ఉట్టిపడేలా కనిపిస్తే అందులో మనసుకు ఎంత మజా దొరుకుతుందో ఇప్పుడు అర్థమయ్యాక మీ మమ్మీ తీసుకెళ్ళకుండా నా అంతట నేనే బ్యూటీ పార్లర్‌కు వెళ్తున్నా. ఈ జుట్టు నెత్తిన నాట్లు వేసి నాటింది అయిపోయింది గానీ ఒరిజనల్ అయితే మెడల మీదికి పడేలా జునపాల హెయిర్ స్టయిల్ ని పెంచేవాడ్ని కదా అని అనిపిస్తూ వుంటుంది” అని డాడ్ అంటుంటే,

“డాడ్, ఆశకు అంతుండాలి. ‘బారెడు జుట్టుంటే ఏ కొప్పయినా పెట్టొచ్చు’ అని బొమ్మ సామెత చెపుతూ వుంటుంది చూడు – అలా బట్టతల ప్రాప్తమైన నీకు ఈ మాత్రం నెత్తిన జుట్టే ఎక్కువ” అని నేను నవ్వుతూ ఉంటే, “విధి వెక్కిరిస్తున్నట్టు మా మగవాళ్ళకి ఈ బట్టతలల శాపం ఏంటో – అరవైయేళ్లు వచ్చేసరికి ఆకులు రాలే కాలంలో చెట్ల ఆకులు రాలిపోయినట్లు మగవాళ్ళ నెత్తి మీది వెంట్రుకలన్నీ రాలిపోతాయి. మీ ఆడవాళ్ళకు మాత్రం ఏంత వయసొచ్చినా రాలిపోని జుట్టు ఒక వరం. మీ అమ్మ తల వంక చూడు – తెల్ల జుట్టుకు డై వెయ్యటంతో ఎలా నల్ల రంగులో తారురోడ్డులా మెరిసిపోతోందో” అన్నాడు డాడీ.

“చాల్లెండీ నన్ను దెప్పటం. ఇంక దాన్ని లోపలకు రానియ్యండి. గేటు దగ్గరే నిలబెట్టి ఫ్యాషన్ల పురాణం మొదలుపెట్టారు” అని మమ్మీ అనటంతో “పదమ్మా లోపలికి.” అంటూ నా చేతిలో నుంచి బ్యాగ్ అందుకున్నాడు డాడీ.

***

ఇంతరు ముందు ప్రేమలు పెళ్ళి రూపం ధరించాలంటే అమ్మాయిలకు అబ్బాయిలకు పెద్దవాళ్ళతో ప్రేమయుద్ధాలు చేసి విజయం సాధించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు. కొడుకో కూతురో ‘ప్రేమలో పడ్డాను’ అని చెప్పగానే ఒప్పుకోకుంటే ఎక్కడ ‘ఇంట్లో నుంచి లేచిపోయి పెళ్ళి చేసుకుంటారో లేక ఉరేసుకొని చస్తారో’ అని భయపడి విషయం బయటపెట్టగానే ఇష్టం లేకపోయినా పెళ్లికి ఒప్పుకుంటున్నారు. అందులోనూ మా మమ్మీ చాలా మోడ్రన్ థింకింగ్ గల మనిషి గనుక ‘రియల్లీ’’ అంటూ పచ్చజెండా ఊపేసింది ఎక్సయిట్‌మెంట్‌తో, అంతేకాదు డాడ్ వంక చూస్తూ “ఆ రోజుల్లో నేను కూడా ఎవర్నయినా ప్రేమించి ఇలా లవ్ మ్యారేజ్ చేసుకొనివుంటే బాగుండేది” అంది.

“ఇంకా ఏమయిందే నాకు – నువ్వు చెప్పినట్టు మారా కదా? అయినా నచ్చటం లేదా? ఈ రోజుల్లో ముసలివాళ్లు కూడా రెండో పెళ్ళి, మూడో పెళ్లి చేసుకుంటున్నారు గానీ నువ్వూ నీకు నచ్చిన ముసలోడ్ని ఎవర్నయిన్గా వెళ్ళి చేసుకొని వెళ్ళిపోవే. పీడ పోతుంది” అన్నాడు డాడీ.

“నేనేమో గానీ మీరు చేసుకునేలా వున్నారు – చేసుకోండి. ఆడవాళ్ళు వెంట పడుతున్నారు మిమ్మల్ని చూసి అంటున్నారుగా ఇందాక సారాతో” అంది మమ్మీ.

“విన్నావూ?” అని దీర్ఘం తీసాడు డాడీ.

వాళ్ళ వాదన నాకు అలవాటయిందే గనుక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాను. ‘వాళ్ళు పైకి అలా అంటారు గానీ ఒక్కళ్ళను వదిలి మరొకళు ఉండలేరు మళ్ళా. అది దశాబ్దాల బంధం, ఇంకా ఎన్నో దశాబ్దాలు కొనసాగే బంధం. ఈ రోజుల్లో నచ్చితే ఓ.కే, నచ్చకుంటే బ్రేకప్ ఆర్ డైవర్స్ లాంటి తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి క్షణికానుబంధాలు కావు.’ అనుకున్నాను నాలో నేను.

అలా అనుకుంటుంటే నాకు క్రిష్, రాంపా ఇద్దరూ గుర్తుకొచ్చారు. ఆ కాలం బంధాలు ఎమోషనల్ అండ్ ట్రెడిషనల్ బంధాలు.. సెంటిమెంట్స్‌తో కూడుకున్నవి. ఇప్పుడు అలా కాదు. ప్రాక్టికల్‌గా ఆలోచించాలి – మెయిన్‌టైన్ చేసేవి. చెయ్యలేనప్పుడు పుటుక్కున తెగిపోయేవి. ఇప్పుడు ప్రేమలను, పెళ్ళిళ్ళను ఎవరూ అంత సీరియస్‌గా తీసుకోవటం లేదు. కాపురాలనూ అంతే! అనుకుంటుంటే మారుతున్న కాలం ‘వయసుండగానే అనుభవించు.. జీవితం వుండగానే ఎంజాయ్ చెయ్యి’ అని బోధిస్తున్నట్టు అనిపించింది కొత్త రాగాన్ని కొత్త వెస్ట్రన్ స్టయిల్‌లో పాడుతూ.

***

 నేనూ మానవ్ కొంతమంది ముఖ్యమైన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్చు మధ్య సింపుల్‌గా రిజిస్టర్ మారేజీ చేసుకున్నాం. కొత్త కాపురం పెట్టాక అప్పుడు గానీ నాకు అర్థం కాలేదు పురుషాలంకారం ఆడవాళ్ళ పాలిట ఎంత బాధాకరమైనదో. అంతకు ముందు లవర్స్‌గా ఉన్నప్పుడు అటొచ్చి ఒక హగ్గు, ఇటొచ్చి ఒక్క కిస్సు పెట్టుకుంటుంటే అంతగా తెలియలేదు. ఇప్పుడు వైఫ్ అండ్ హాజ్బండ్ అయినాక తెలుస్తోంది. మానవ్ బిరుసు గడ్డం, మెలి తిరిగిన రెండు చాకుల్లాంటి గుబురు మీసాలూ, మాటి మాటికి సూదుల్లా నా చెంపలను, మూతిని, ముక్కును గాయాలపాలు చేయటం మొదలుపెట్టాయి.

“మానవా, ఇదేంటి ఈ పురుషాలంకారాలు ఇక మానవా? లేకుంటే నా ముఖం రప్చర్ అయి రక్తసిక్తమయ్యేలా వుంది. ఫ్యాషన్లొద్దు, పాడు వద్దు – కుర్రవాళ్ళగా ఉన్నప్పుడు ఏదో వేషాలు వేస్తే వేసాం – ఇప్పుడు మనం మ్యారీడ్ కదా – రేపే వెళ్లి క్లీన్ షేప్ చేయించుకొనిరా – గడ్డం వద్దు, పాడూ వద్దు. ఆ మీసాలను కూడా పనిలో పనిగా పీకి పారెయ్యి. లేకుంటే నీతో నిత్య సంసారం నా పాలిటీ నిత్యనరకంలా తయారయ్యేలా వుంది” అన్నాను.

“జాన్తా నై. నీ మాటలలో నా మేల్ ఇగోని దెబ్బకొట్టాలని చూడకు. గడ్డం, మీసం లేకుంటే ఇక మీకూ, మాకూ తేడా ఏముంది. అయినా ఫ్యాషన్లు మేమొక్కళ్ళమేనా? మీరు చేసుకుంటున్నారుగా” అన్నాడు మానవ్ తల ఎగరేస్తూ.

“మా ఫ్యాషన్లు, మా స్త్రీల అలంకారాలు మిమ్మల్ని బాధించేవేమీ కావు. మా పెదవుల మీది లిప్‌స్టిక్ మీ ముఖంమీద అందమైన గులాబీ ముద్ర. మా కళ్ళ కాజల్ మీ బుగ్గ మీద దిష్టి చుక్క. మా ఫేస్‌క్రీమ్ మీ ముక్కలకు సుగంధం” అన్నాను ఇంటర్ వరకూ తెలుగును చదువుకున్న జ్ఞానానికి మోడ్రన్ పదజాలాన్ని యాడ్ చేస్తూ,

మానవ్ నా మాటలని వింటూ అలాగే నిద్రపోయాడు.

పెళ్ళయ్యాక కుర్రకారుతనం తరిగిపోతుందన్న సైకలాజికల్ ఫీలింగ్ ఏదన్నా పట్టుకుందో ఏమో గానీ మానవ్‍లో పురుషాలంకారాలు పిచ్చి ఫారిన్ లెవల్లో హద్దు మీరి రెచ్చిపోవటం మొదలుపెట్టింది అంతకంతకూ. ఎంతగా అంటే – నేను కంపెనీ పని మీద ముంబాయి వెళ్లి ఆ రోజు రాత్రి ఫ్లయిట్‌కి తిరిగి బెంగుళూరు వచ్చి మా ఫ్లాట్ కాలింగ్ బెల్ కొట్టాను. తలుపులు తెరుచుకోగానే ఇంట్లో ఏదో అడవి మృగం జొరబడిందని గుర్తించి గట్టిగా కేక పెట్టాను.

“సారా, ఎందుకలా అరుస్తున్నావ్?” అన్నాడు మానవ్ అర్థం గాక.

మొల కింద నుంచి షార్ట్ తప్ప పైన షర్టు లేక సగం న్యూడ్‌గా వున్న హబ్బీని చూసి “నువ్వా? మానవ్? ఏంటలా అయిపోయావ్ – జబ్బల మీద, చెస్ట్ మీద ఆ మచ్చలేంటి?” అని అడిగాను చూపుడు వేలుతూ చూపిస్తూ.

“ఏయ్. యూ మ్యాడ్. మచ్చలు ఏంటి – ఇవి టాబూస్. నాకిష్టం. నువ్వు ఉన్నప్పుడయితే ఒప్పుకోవని, నీకు సర్‌ప్రయిజింగ్‌గా నువ్వు లేనప్పుడు వేయించుకున్నాను” పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ అన్నాడు మానవ్.

“నీ బొంద. దరిద్రంగా వుంది నీ ఇష్టం. నీకు పైత్యం మరి ప్రకోపించినట్టుంది. ఒకసారి వేసుకుంటే జీవితాంతం ఉంటాయి అవి. నలుగురిలో ఎలా తిరుగుదామనుకుంటున్నావ్? అందరూ హడలి చావరూ?”

“ఏయ్. ఇప్పుడిది వెస్ట్రన్ స్టయిల్. అమెరికాలో అందరూ ఇలాగే వుంటారు”

“అయితే అక్కడికిపోయి ఏడువు – ఆ గడ్డాలు, మీసాలకే పక్క మీద సూదులు, దబ్బనాలూ పెట్టుకొని పడుకున్నట్టు గుచ్చుకొని చస్తున్నాను. ఇప్పుడు ఈ టాటూలా జబ్బల మద్య, ఆ క్రోకొడయిల్ ఏంటి నా బొంద? ఈ చేతి మీద ఆ తేళ్లు, ఆ పాములు ఏంటి? నీ పక్కన పడుకొని తెల్లవార్లూ వాటిని కౌగిలించుకొన్ని ముద్దుపెట్టుకోనా.. బుర్రుందా అసలు నీకు? మెన్స్ బ్యూటీ అంటే ఇంత భయంకరంగా ఇంత క్రూరంగా ఉండాలా? బ్రేకప్- మానవ్ బ్రేకప్! నీకు నేను ‘డైవర్స్’ ఇస్తున్నాను. నువ్వు కాదంటే కోర్టుకెళ్ళి నీవంటి మీది ఈ క్రూరాన్నంతా చూపిస్తాను.” అంటూ లోపలికి వచ్చినంత వేగంగా బయటికి వెళ్ళిపోయాను, నా వెనకనున్న మానవ్ దిమ్మ తిరిగిపోయేలా!

Exit mobile version