[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ని పాఠకులకు అందిస్తున్నాము.]
భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.
అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.
~
ప్రశ్నలు:
- భారతం ప్రకారం, దక్షుడి శాపాన్ని తప్పించుకోడానికి చంద్రుడు స్నానం చేసిన తీర్థం వద్ద అర్జునుడు తపస్సు చేస్తాడు? ఆ తీర్థం పేరేమిటి?
- మత్స్యపురాణం ప్రకారం, కురుక్షేత్రంలో, ప్రభావతి అనే స్త్రీ, వశిష్ఠుని రూపంలో వచ్చిన ఇంద్రునికి బదరీఫలాలు వండిపెట్టడానికి, పొయ్యిలో తన కాళ్ళు పెడుతుంది. ఆ స్థలం పేరు?
- భాగవతం ప్రకారం, రాక్షసుడైన మహాబలి కొడుకు, శోణితపురాన్ని రాజధానిగా చేసుకుని, శివుడి గురించి తపస్సు చేసి, పార్వతికి కొడుకయ్యేటట్లు, వెయ్యి చేతులు వచ్చేట్టు వరం పొందినవాడెవరు?
- ఉత్తర రామాయణం ప్రకారం, రావణ కుబేరులకు జరిగిన యుద్ధంలో కుబేరునికి సహాయపడి రావణుడి సైన్యాన్ని నాశనం చేసిన యక్షుడి పేరు?
- భారతాన్ని అనుసరించి, ధర్మరాజు చేసే యాగానికి కావలసిన యజ్ఞోపకరణాలు తేవడానికి నియమించిన అర్జునుని రథసారథి ఎవరు?
- ఉత్తర రామాయణం ప్రకారం, బ్రహ్మ కన్నీళ్ళ నుంచి పుట్టినవాడు, ఆదిమ వానరుడు. అడవిలో తిరుగుతూ, ఒక కొలనులో దిగి స్త్రీగా మారుతాడు. ఈమెను చూసి, సూర్యుడు, ఇంద్రుడు మోహించగా వారికి సుగ్రీవుడు, వాలి పుడతారు. ఆ వానరుని పేరు?
- పద్మపురాణం ప్రకారం, మాండవ్యుడి శాపం వల్ల యముడే అంబిక దాసికి, వ్యాసునికి పుట్టినవాడు?
- శివుడు కాత్యాయనికి ఉపదేశించిన మంత్రం పేరు?
- భాగవతం ప్రకారం, భరతవంశంలో జన్మించిన రాజు. చిత్రరథుడి కొడుకు. ఇతనికి పదివేల మందికి పైగా భార్యలున్నారు. ఒక్కొక్కళ్ళకు లక్షమంది పిల్లలున్నారు. ఇతని పేరు?
- బ్రహ్మపురాణం ప్రకారం, మహేంద్రపర్వతం దగ్గర తపస్సు చేసుకునే పరశురాముడి వద్దకు వెళ్ళి -సముద్రుడు గోకర్ణాన్ని ముంచేశాడు. దుష్ట సంహారార్థం ఆయుధం చేపట్టినా పాతకం రాదని చెప్పిన ముని ఎవరు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 జూలై 08 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-15 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 జూలై 13 తేదీన వెలువడతాయి.
జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పురాణ విజ్ఞాన ప్రహేళిక 13 జవాబులు:
1.యజ్ఞదత్తుడు 2. యజుడు 3. హరిభద్ర 4. రాజాధిదేవి 5. రోమపాదుడు 6. వత్సాసురుడు 7. వసాయువు 8. శతరూప 9. శుకుడు 10. గుణవతి
పురాణ విజ్ఞాన ప్రహేళిక 13 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- పి.వి.రాజు, హైదరాబాదు
- రామలింగయ్య టి, తెనాలి
- శ్రేయ క్షీరసాగర్, దావణగొరె, కర్నాటక
- వనమాల రామలింగాచారి, యాదగిరిగుట్ట
- కె. గాయత్రి
వీరికి అభినందనలు.
గమనిక:
- పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
- ఈ క్విజ్కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.