[శ్రీ వెంపరాల దుర్గాప్రసాద్ రచించిన ‘పునర్వివాహం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
అది విశాఖపట్నంలో డాబాగార్డెన్స్ ఏరియా. రంగనాధం గారు ఉదయపు నడకకి కాలనీలో వున్న పార్క్ దగ్గరికి వచ్చి, స్కూటర్ ఆపేరు.
అప్పటికే అక్కడ ఆయన కోసం వెయిట్ చేస్తున్న మిత్రుడు జగన్నాధం కనపడ్డారు.
“హే జగ్గూ.. నా కంటే ముందు వచ్చేవు?” అని పలకరించారు.
ప్రతిగా.. “నేను వచ్చి 5 నిముషాలే ఐందిలే”.. అన్నారు జగన్నాధం గారు.
పార్క్ బయట, బండి స్టాండ్ వేస్తూ, పార్క్‌కి పక్క, రెండు ఇళ్ల అవతల ఇంటి గుమ్మంలో కూరల బండి దగ్గర కూరగాయలు కొంటున్న సుమతిని చూసి ఆశ్చర్య పోయేరు రంగనాధం గారు.
జగన్నాధం, రంగనాధం వైపు తిరిగి, ఆయన చూస్తున్న వైపు చూసేరు.
రంగనాధం గారి ముఖంలో ఆశ్చర్యం గమనించి, “ఆ అమ్మాయి నీకు తెలుసా” అన్నారు.
“తెలుసు. ఆ కథ తర్వాత. ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయింది కదా.. ఇక్కడ ఉందేమిటి? అని ఆలోచిస్తున్నాను” అన్నారు.
“అదా.. నాకు తెలుసు. పద, ఎలాగూ పార్క్ లోకి వెళ్తున్నాము కదా, తీరిగ్గా మాట్లాడుకుందాము” అన్నారు జగన్నాధం గారు.
పార్క్ లోకి వెళ్ళేక, ఎదురుగా వున్న బెంచీ మీద కూలబడి, సుమతి కథ ఆయన ఇలా చెప్పేరు:
“సుమతి తండ్రి గోపాలరావు, నాకు ఫ్రెండ్. 2 సంవత్సరాల క్రితం ఆమెకి పెళ్లి అయింది. ఆ అబ్బాయిది హైదరాబాద్. దురదృష్టవశాత్తూ, ఆ అబ్బాయి హార్ట్ అటాక్‌తో చనిపోయాడు. దాంతో తిరిగి విశాఖ వచ్చేసింది. పిల్లలు లేరు సుమతికి. ఇక్కడ కోపెరేటివ్ బ్యాంకులో పని చేస్తోంది.
అల్లుడు పోయాక బెంగతో ఆరోగ్యం పాడయ్యి, ఏడాది తిరగకుండా, గోపాలరావు కూడా చనిపోయాడు. తల్లితో కలిసి, వారం క్రితం, మకాం ఇక్కడికి మార్చుకున్నారు వాళ్ళు. ఇదివరకు ద్వారకానగర్‌లో వుండేవాళ్ళు. నాకు కుదిరినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తూ వుంటాను. గోపాలరావు భార్య సుగుణ చదువుకోలేదు. ప్రాపంచిక విషయాలు తెలియవు. నేనే, వాళ్లకి అప్పుడప్పుడు సలహాలు ఇస్తూ, పెద్ద దిక్కుగా వుంటాను.” అని ముగించారు జగన్నాధం గారు.
“ఆ అమ్మాయికి మళ్ళీ పెళ్లి చెయ్యచ్చు కదా!” అన్నారు రంగనాధం గారు.
“అదే నేనూ చెప్తున్నాను. ఈమధ్యనే అమ్మాయి ఒప్పుకుంది. అన్నట్లు నువ్వు సంబంధాలు బ్యూరో నడుపుతున్నావు కదా.. నీకు ఎరుకలో వున్న మంచి సంబంధం చూడు” అన్నారు ఆయన.
“తప్పకుండా” అన్నారు రంగనాధం గారు. లేచి, “ఇక వాకింగ్ చేద్దాం పద!” అన్నారు.
ఇద్దరూ కలిసి ఓ 40 నిముషాలు వాకింగ్ చేసి, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్లి పోయారు.
రంగనాధం గారికి మనసు నిండా సుమతికి జరిగిన అన్యాయానికి చాలా బాధగా వుంది.
రెండు రోజుల్లో తన వద్ద వున్న పెళ్లి కొడుకుల లిస్ట్ లోంచి ఒక మంచి సంబంధం చూసేరు.
ఆరోజు మంచిదని, సాయంత్రం జగన్నాధం గారితో కలిసి, సుగుణ గారి ఇంటికి వెళ్ళేరు. వీళ్ళని చూస్తూనే, సుగుణ గారు ఎదురు వచ్చి, జగన్నాధం గారిని పలకరించింది.
“రండి అన్నయ్య గారు! అని, రంగనాధం గారి కేసి తెలియనట్లు చూస్తూ నమస్కారం పెట్టింది.
“ఈయన పేరు రంగనాధం. ఈయన పెళ్లి సంబంధాలు చూసే బ్యూరో నడుపుతారు. మీ అమ్మాయి సుమతికి సంబంధం చూసేము” అని పరిచయం చేసేరు జగన్నాధం గారు.
“కూర్చోండి. కాఫీ తెస్తాను” అంది ఆవిడ.
“అమ్మాయి ఇంకా ఆఫీసు నుండి రాలేదనుకుంటా” అన్నారు జగన్నాధం గారు.
“ఇంకా రాలేదండి. ఇంకో గంట పడుతుంది..” అంటూ ఆవిడ లోపలి వెళ్ళింది.
కాఫీ తాగి, తెచ్చిన ప్రొఫైల్ ఆవిడకి ఇచ్చి తిరిగి వచ్చేసారు మిత్రులు ఇద్దరూ.
ఆ సంబంధం తల్లి, కూతురుకి నచ్చింది. పెళ్లి చూపులు మరో వారంలో ఏర్పాటు చేసేరు రంగనాధం గారు.
పెళ్లి కొడుకు రమేష్ కూడా డివోర్సీ. అతను తాలూకా ఆఫీస్‌లో పని చేస్తాడు.
అతనికి సుమతి నచ్చింది. సుమతికి కూడా పెళ్లి కొడుకు నచ్చేడు.
సంబంధం ఖాయం చేసుకున్నారు.
ఆరోజు ఆదివారం. సుమతి, తల్లితో కలసి, రంగనాధం గారి ఆఫీస్‌కి వచ్చింది.
“అంకుల్ మీ ఫీజు యెంతో చెప్పండి. ఇచ్చేస్తాము” అంది నవ్వుతూ.
“ముందు నీ పెళ్లి అయిపోనీయ్ తల్లీ.. ఫీజు దేముంది” అన్నారు ఆయన.
సంబంధం కుదిరే వరకు వస్తే, సాధారణంగా ఆయన 10000 రూపాయలు తీసుకుంటారు. కానీ, సుమతి విషయంలో ఆయన ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు. ఒకింత అపరాధ భావం ఆయన్ని వెంటాడుతోంది.
అర్ధం కానట్లు చూస్తున్న సుమతి కేసి తిరిగి, “నీ పెళ్ళికి పిలవవా?” అన్నారు.
“అయ్యో అంకుల్, మీరు లేకుండా ఎలాగ? మళ్ళీ నెలలో ముహూర్తాలు పెట్టుకున్నాము. మరో వారంలో కార్డ్స్ రెడీ అవుతాయి. అప్పుడు మళ్ళీ వస్తాము పిలవడానికి” అని బయలుదేరడానికి లేచేరు తల్లీ, కూతుళ్లు.
అనుకున్నట్లే, మళ్ళీ నెలలో పెళ్ళికి వెళ్లి, దంపతులని ఆశీర్వదించి, పెళ్లి కూతురికి 10000 రూపాయలు కవర్లో పెట్టి ఇచ్చి వచ్చారు.
మర్నాడు జగన్నాధం గారు, వారి భార్యతో కలిసి, సుగుణమ్మ గారు రంగనాధం గారి ఇంటికి వచ్చేరు.
“అన్నయ్య గారు, మీరు ఫీజు తీసుకోలేదు. పైగా, మా అమ్మాయి పెళ్ళికి అంత పెద్ద మొత్తం గిఫ్ట్‌గా ఇచ్చేరు. మాకు చాలా మొహమాటం వేసింది. ఇదేమీ బావులేదు..” అంది ఆవిడ.
“పర్వాలేదు అమ్మా, సుమతి నా అన్న కూతురు అయితే, నేను సంబంధం చూడనా, మంచి బహుమతి ఇవ్వనా?” అన్నారు ఆయన.
“మీకు, వదిన గారికి బట్టలు పెడదామని వచ్చేము.. కనీసం ఈ బట్టలు తీసుకోండి”, అని, జగన్నాధం దంపతుల చేత్తో, దంపతులిద్దరికీ, బట్టలు పెట్టి వెళ్లిపోయారు ఆవిడ.
ఈ సంఘటన చూసిన జగన్నాధం గారికి ఏమీ అర్థం కాలేదు.
మర్నాడు ఉదయపు నడకకి వెళ్లినప్పుడు అదే మాట అడిగేరు.. “సుమతి విషయంలో ఆ ప్రత్యేకత ఏమిటి అని.”
తన మనసులో వచ్చిన రిలీఫ్‌తో రంగనాధం గారు, ఇలా అన్నారు:
“సుమతికి నా కొడుకు కొంత అన్యాయం చేస్తే, భగవంతుడు మరొక అన్యాయం చేసేడు రా.. అదృష్టవశాత్తూ, ఆమె మళ్ళీ తిరిగి నీ ద్వారా నా కంటపడింది”.
ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు జగన్నాధం గారు.
ఇద్దరూ పార్క్‌లో బెంచీ మీద కూలబడ్డారు.
“వివరంగా చెపుతాను విను”, అంటూ జరిగిన విషయం రంగనాధం గారు ఇలా వివరించారు:
“నా కొడుకు రాజేష్, సుమతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని కొన్నాళ్ళు సరదాగా స్నేహంగా తిరిగేడు. కానీ, పెళ్లి విషయం దాటవేసేవాడు. ఆర్మీలో జేరటం మీద దృష్టి అనేవాడు.
వీడి వలన, తండ్రికి ప్రేమ విషయం చెప్పలేక, ఆమె తండ్రి చూసే సంబంధాలు చెడగొడుతూ ఉండేది. వీడు ఆఖరి సారిగా ఆమెకి వుత్తరం రాసి, తనని మర్చిపొమ్మని చెప్పి, తన ఫోన్ నెంబర్ కూడా మార్చేసేడు. ఇక గత్యంతరం లేక, తండ్రి చూసిన సంబంధం ఒప్పుకుని పెళ్లి చేసుకుంది.
కానీ, మా ఇల్లు, వాడి వివరాలు ఆమెకి తెలియకుండా జాగ్రత్తపడ్డాడు నా కొడుకు అనబడే దుర్మార్గుడు. అందుకే సుమతికి నేను రాజేష్ తండ్రిని అని తెలియదు. ఇప్పుడు నేనూ, తెలియకుండా జాగ్రత్త పడ్డాను” అని ఆపారు ఆయన.
“ఈ వివరాలు అన్నీ నీకు ఎలా తెలిసాయి?” అన్నారు జగన్నాధం గారు.
“సుమతి తండ్రి ఒకసారి నా బ్యూరోకి వచ్చినప్పుడు మావాడు నా దగ్గర వున్నాడు. ముందు రోజే వాడికి ఆర్మీలో వుద్యోగం వచ్చింది. మర్నాడు వాడు జాయిన్ అవడానికి వెళ్ళాలి.
ఆయన్ని చూసి భయపడిపోయాడు. ఆయనకి వీడు తెలియదు కనుక సరిపోయింది. వీడు గబా గబా బయటకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రే, వాడిలో భయాన్ని గమనించి, నేను ప్రశ్నించాను. కంగారుగా నాకు జరిగిన విషయాలు అన్నీ చెప్పేడు. ఆమె ఫోటో చూపించాడు. సంబంధం కోసం ఆమె వివరాలన్నీ గోపాలరావు గారు అప్పటికే నాకు ఇచ్చారు.
నేను మందలించాను. తప్పు అని చెప్పాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పాను. కానీ నా మాట వినలేదు. ఆ రాత్రే వాడు ఫ్లైట్ లో వెళ్లిపోయాడు. వాడు పని చేసేది ఆర్మీలో కదా. ఇప్పటికీ వాడు వాడి ఐడెంటిటీ ఎవరికీ తెలియనివ్వడు. మరో 3 నెలల్లో సుమతికి పెళ్లి అయింది.
సుమతికి పెళ్లి అయిందని తెలిసేకే, వాడు ఇంటికి వచ్చాడు.
కొడుకు చేసిన పిచ్చి పని లోకానికి తెలియదు కనుక నేను బ్రతికి పోయాను. కానీ విధి చిన్న చూపు చూసి ఆ అమ్మాయి భర్త చనిపోవడం, ఆ బాధ తట్టుకోలేక గోపాలరావు గారు చనిపోవడం నీకు తెలిసిందే కదా.” అని ఆగి, గాఢంగా నిట్టూరుస్తూ..
“నాకు చేతనయిన సహాయం చేసి, ఆమె జీవితాన్ని నిలబెట్టే అవకాశం భగవంతుడు మళ్ళీ నాకే ఇవ్వడం నా అదృష్టం” అని ముగించారు రంగనాధం గారు.
మిత్రుడి కేసి అభినందనగా చూసేరు జగన్నాధం గారు.
శ్రీ వెంపరాల దుర్గాప్రసాద్ A.P.E.P.D.C.L లో పర్సన్నల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించి, పదవీ విరమణ చేశారు. వారిని 9440602019 అనే నెంబరులో సంప్రదించవచ్చు.