[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన సీత గారి ‘పునరపి జననం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఉదయం నుంచి పని చేసుకుంటుంది కానీ తన మనసంతా ఆందోళనగా ఉంది సుమనకి. అప్పటికే పదిసార్లు ఫోన్ చేయబోయి, తన వల్ల కాక ఎర్ర బటన్ నొక్కేసింది.
“ఈసారి వాళ్ళ ఆశ తీరకపోవచ్చు సుమన, ఆలస్యం చేయకుండా చెప్పేస్తే మంచిది!!” అన్నాడు కిరణ్ కూడా.
సుమన కాస్త ధైర్యం తెచ్చుకుని ఫోన్ చేసింది.
“అమ్మా!! ఈసారి ఊరికి రావడం కుదరకపోవచ్చు, రానని మొండిపట్టు పట్టింది వినీల. నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నాం..!!” అంటూ ఆగింది, అటువైపు నుంచి ఏమోస్తుందా అని.
“ఓహో!! పర్లేదులే సుమనా. వినీకి ఇష్టమైతేనే యే పనైనా చేయండి.. సరే ఉంటాను!!” దుఃఖం దిగమింగుకుంటూ ఫోన్ పెట్టేసింది అవతల గొంతు.
“ప్చ్!!” సోఫాలో వెనక్కి వాలుతూ నిట్టూర్చింది సుమన.
***
“అమ్మా!! దీపావళి లాంటి పెద్ద పండగ మనింట్లో చేసుకోకుండా ప్రతీసారి ఎందుకు ఆ ఊరెళ్ళడం. నాకు వాళ్ళూ, వాళ్ళ ఇల్లు, ఆ ఆవుల వాసన అస్సలు నచ్చదు. అంతకు మించి వాళ్ళసలు మన కుటుంబానికి ఏమీ అవ్వరు. నేను రాను. అంతే!!” అక్కడనుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది వినీల.
“సరే అయితే ఈసారి వాళ్ళే మనింటికి వస్తారు!!” అరిచింది సుమన.
వినీల తలుపు తెరిచి తల్లి వైపు కోపంగా చూసి, ధడాలున మళ్లీ తలుపేసుకుంది.
కిరణ్ కాస్త మంచినీళ్ళు అందించాడు సుమనకి.
“ఎందుకు వినీ ఇంత విపరీతంగా ప్రవర్తిస్తుంది కిరణ్. ఆ వాసన నచ్చదట, అసలు అది ఊపిరి పీల్చుకోడానికి వాళ్ళే కదా కారణం!!” అన్నది బాధగా.
“వినీలకి నిజం తెలియదు సుమన. ఇన్నాళ్లు తను చిన్నపిల్ల, అర్థం చేసుకునే వయసు కాదని మనం ఊరుకున్నాం, ఇప్పుడు తనకి తెలుసుకునే పరిణతి వచ్చింది, కాబట్టి నిజాన్ని ఎదురుకోవాలి!!” అన్నాడు కిరణ్.
రెండురోజుల తర్వాత వినీలని తీసుకుని ఉదయాన్నే ఊరి అవతల వాళ్ళ ఫార్మ్‌హౌస్‌కి వెళ్ళారు కిరణ, సుమన.
వినీల చాలారోజుల తర్వాత అక్కడకి రావడంతో చుట్టూ ఉన్న తోటలో కలయతిరుగుతూ ఫోటోలు తీసుకుంది.
“వినీ, కమ్!!” అని పిలిచాడు కిరణ్, అక్కడే పచ్చగడ్డి మీద సుమన పక్కన కూర్చుంటూ.
పరిగెత్తుతూ వచ్చి కూర్చున్న వినీల చేతిలో ఒక ఫైల్ పెట్టారు.
అందులో కొన్ని హాస్పిటల్ పేపర్లు చూసి, ప్రశ్నార్థకంగా చూస్తున్న వినీలతో, “అవన్నీ చూడు!!” అన్నాడు.
అందులో ఒక్కో పేజీ తిప్పుతుంటే వినీల ముఖంలో ఆందోళన, గుండెలో బాధ మొదలైంది.
“అమ్మా!! ఇదంతా నిజమేనా, పుట్టడమే గుండెజబ్బుతో పుట్టానా నేను??” తల్లి ఒడిలో తలపెట్టుకుంటూ అడిగింది వినీల.
“మాకు ఈ విషయం తెలిసిన రోజు నుంచి మళ్లీ నువ్వు మామూలు అయ్యేదాకా దేవుడిని కోరుకున్న ఒకే ఒక్క కోరిక, నీ సంపూర్ణ ఆరోగ్యం వినీ!! నేనూ, మీ నాన్న అనాథలం, ఒకరినొకరం ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాం, ఇద్దరం చిరుద్యోగులం. మా జీవితాల్లోకి నువ్వు దేవుడు పంపిన వరం. ఇంతకుమించి మన దగ్గర ఆస్తిపాస్తులు, నా అనే బంధువులెవరు లేరు. అలాంటి సమయంలో చిమ్మచీకటిలా నీ ఆరోగ్య సమస్య.. నీకు పుట్టుకతోనే గుండెలో వాల్వ్ సమస్య ఉన్నదని చెప్పారు.. అది మాకు తెలిసేటటప్పటికీ నీకు రెండేళ్లు. అప్పటినుంచి ఈ వాల్వ్ డోనార్ కోసం వెతుకుతూనే ఉన్నాం కానీ ఒకవేళ దొరికితే లక్షల్లో ఖర్చు అవుతుందని తెలిసింది. అయినాసరే వెనకడుగు వేయలేదు.
సరిగా సంవత్సరం తర్వాత ఒకరోజు ఎన్జీవో నుంచి ఫోన్ వచ్చింది. ఒక ఆక్సిడెంట్ అయి, పాతిక సంవత్సరాల అమ్మాయికి బ్రెయిన్ డెడ్ అని. అక్కడకి వెళ్ళేసరికి ఉన్న ఒక్క కూతురిని పోగొట్టుకుని ఒక దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
“ఏవండీ!! మీతో మాట్లాడాలి!!” అని నిన్ను చూపించి విషయం వాళ్ళకి చెప్పాము.. అసలు ఇలా అవయవదానం వంటిది నిజంగా ఉంటుందని కూడా వారికి తెలియదు, అటువంటి మారుమూల గ్రామం నుంచి వచ్చారు. కానీ నిన్ను చూసాక వారికి మంచి చేయాలనిపించింది. డాక్టర్లతో వారికి అర్థమయ్యేట్టు మాట్లాడించాము. మంచిమనసుతో అర్థం చేసుకుని నీతోపాటు ఇంకో ఇద్దరికీ కూడా తమ కూతురి అవయవాలు దానం చేయడానికి ఒప్పుకుని మిమ్మల్ని మళ్లీ బ్రతికించారు!!” అని వినీలను పొదివిపట్టుకుంది సుమన.
వినీల తల్లి కన్నీళ్లను తుడుస్తూ, “చాలా ఏడిపించాను కదమ్మా మిమ్మల్ని!!” అన్నది..
“మీకు అవయవదానం చేసినమ్మాయి పేరు తెలుసా?? వినీల!!” అన్నది సుమన, కిరణ్ వైపు చూసి.
“ఆమె రాధమ్మమ్మ కూతురు కదా??!, అందుకే నాకు మళ్ళీ పేరు మార్చి తన పేరు పెట్టారా అమ్మా??” అన్నది వినీల.
సుమన, కిరణ్ ఆశ్చర్యంగా చూశారు.
“రిపోర్ట్స్‌లో అమ్మమ్మ తాతయ్య పేర్లు చూశాను. వాళ్ళు ఒప్పుకుంటేనే కదా ఇవాళ నేనింతదాన్ని అయ్యాను, అలాంటిది నేను వాళ్ళ పట్ల చాలా కఠినంగా ప్రవర్తించాను!!” అంటూ ఏడ్చింది వినీల.
“ఇప్పుడు నీకు నిజం తెలిసిందా కదా. అసలు ఆరోజు మీకు సర్జరీలు అయిన తర్వాత వారిని తీరిగ్గా కలిసి కృతజ్ఞతలు తెలుపుకుందాం అనుకున్నాము. కానీ అప్పట్లో అవయవదానం చాలా అరుదు కాబట్టి, పెద్ద చర్చ చేశారు.. మమ్మల్ని, వాళ్ళని కొన్నిరోజులు కలవనివ్వలేదు ఈ మీడియా ఛానెల్స్ వలన. తర్వాత నీ ఆరోగ్యం దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని కొన్నిరోజులు ఎక్కడకి వెళ్ళలేదు మనం. అలా నీకు నాలుగేళ్లు గడిచిపోయాయి.. అప్పటినుంచి వారి ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నాం. ఊరి పేరు, వారి పేర్లను పట్టుకుని చాలా మున్సిపల్ ఆఫీసుల్లో కనుక్కుంటే నీకు పదేళ్లు ఉన్నప్పుడు వారి ఆచూకీ తెలిసి వెళ్ళి కలిసాము..
మమ్మల్ని చూసిన దానికంటే నిన్ను చూసినప్పుడు వారి కళ్ళల్లో ఆనందం చెప్పలేనిది వినీ!! అందుకే నీకు సర్జరీ జరిగిన దీపావళి రోజును వారి కూతురి జ్ఞాపకంగా నిన్ను కలుస్తారు. ఈరోజు కోసమే ఎంతో తపిస్తూ ఉంటాయి ఆ ప్రాణాలు!!” అని వినీల వైపు చూసింది సుమన.
“నాన్నా!! అమ్మమ్మ ఊరు వెళ్దామా??!” అన్నది కళ్ళు తుడుచుకుంటూ వినీల.
కూతురి ఫోటోకి దండ వేసి, దీపం వెలిగించింది రాధమ్మ.
తలుపు చప్పుడుకి గుమ్మంవైపు తిరిగిన వారికి,
“అమ్మమ్మా!! తాతయ్యా!!” అంటూ వచ్చి హత్తుకుంది వినీల.
ఆ ఆప్యాయత కోసమే ఎదురుచూసిన వారి కళ్ళు వర్షించాయి. ఎదురుగా ఉన్న వినీల పిన్ని ఫోటోకి దండం పెట్టుకునీ కృతజ్ఞతలు తెలుపుకుంది వినీల..
ఎన్నో ఏళ్ల తర్వాత ఆ దీపావళి వారందరిలో సరికొత్త వెలుగును నింపింది.
అక్కడ నుంచి తిరిగి వచ్చేముందు రాబోయే మూడు నెలల్లో చనిపోయిన పిన్ని జన్మదినాన ఆమె జ్ఞాపకంగా వారికొక బహుమతి ఇస్తానని చెప్పి వచ్చింది వినీల.
ఇంటికెళ్ళిన తర్వాత తన ఆలోచన చెప్పిన వినీలను చూసి, “అసాధ్యమైతే కాదు కానీ కొంచం కష్టమే వినీ!!”అన్నాడు కిరణ్.
“ఇప్పుడున్న సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద కష్టమేమీ కాదు కిరణ్. ప్రయత్నిద్దాం తప్పకుండా ప్రతిఫలం దొరుకుతుంది!!” అన్నది సుమన ఆశాజనకంగా.
సంక్రాంతి పండగకి అమ్మమ్మ ఊరు వచ్చిన వినీల తనతో పాటు ఇంకొందరిని కూడా తీసుకెళ్ళింది.. వారిని పరిచయం చేస్తూ,
“అమ్మమ్మ, తాతయ్యా, ఇదిగోండి, ఈయన మీ అబ్బాయి మురళీ!!” అన్నది.
వారు ఏదో అడిగేలోపు,
“ఇదిగో ఈ అమ్మమ్మ మీకు చెల్లెలు!!” అని చెప్పింది.
అర్థంకానట్టు చూస్తున్న వారి చేతులు పట్టుకుని,
“మీ వినీల వలన నేనివాళ నా కుటుంబంతో సంతోషంగా ఉన్నాను అమ్మా. నా చిన్నప్పుడే టైప్ 1 డయాబెటిస్ అని తెలిసింది. ఇన్సులిన్ మీద బాల్యమంతా గడిపాను, తర్వాత పాంక్రీయాటిక్ ఐలెట్స్తో నయమవుతుందని, వాటి దాత కోసం వెతుకుతున్న సమయంలో వినీల నన్ను బ్రతికించింది!!” అని ఇద్దరికి చేతులెత్తి దండం పెట్టాడు మురళి.
“రాధక్కా!! వినీల అవయవదానం వలన నాకు మళ్ళీ నా కంటిచూపు దక్కింది. పెళ్లి తర్వాత ఇంట్లో సిలిండర్ పేలి కంటిచూపు తాత్కాలికంగా పోయింది అన్నారు. కార్నియా పోయింది కానీ లోపల నరాలు బాగుండడంతో ఎవరైనా దాతల కోసం చూస్తున్న తరుణంలో వినీల వెలుగు చూపించింది!!” అని చేతులు పట్టుకుని ఏడ్చింది సుధ.
రాధమ్మ దంపతులు వినీలని దగ్గరకు తీసుకుని,
“మా బిడ్డను కోల్పోయి ఒంటరిగా బ్రతుకుతున్న మా జీవితంలోకి ఒక నూతన కుటుంబాన్ని బహుమతిగా ఇచ్చావు తల్లి, చిన్న దానివైనా నీ మంచిమనసుకి వేవేల నమస్కారాలు!!” అంటూ ఏడ్చేసింది రాధమ్మ..
“అయ్యో!! మీ బిడ్డ మంచితనం కూడా దానికి చేరింది అమ్మ. పెద్దవారిగా దాన్ని ఆశీర్వదించండి చాలు. ఇప్పుడు మీకు మనవరాలు, కొడుకు, చెల్లెలు, మా కుటుంబాలు అందరం అండగా ఉన్నాం. మంచి చేస్తే దానికి ఇంకొంత జతచేసి అంతకంటే ఎక్కువ మంచి చేస్తాడు దేవుడు మనకి!! ఇది అక్షరాలా నిరూపించి చూపించింది మీ బిడ్డ. దానికి సాక్ష్యం ఇదిగో వీరి నవ్వుల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది!.” అన్నది సుమన దండ వేసిన ఫోటో వైపు చూస్తూ.
You must be logged in to post a comment.
వి(ముక్తి)
కశ్మీరు పర్యటన – కొంచెం తీపి కొంచెం చేదు
నీలమత పురాణం – 31
దేశభక్తి కథలు – పుస్తక పరిచయం
మేనల్లుడు-28
చిరుజల్లు-58
భగవంతుడిని చేరడానికి సాధనా మార్గం
నీలమత పురాణం-91
ఆటాడుకుందాం రా తాతా
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®