Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పులిరాజాకూ కరోనా వస్తుందా?

పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా?
ఏళ్లనాటి ప్రశ్న ఇప్పుడు మరో రూపంలో
పులిరాజాకూ కరోనా వస్తుందా?
జవాబు కోసం పునరన్వేషణ

ప్రపంచమంతా సామ్రాజ్యాన్ని విస్తరించిన దేశంలోని
థేమ్స్ అలల చప్పుడు
మూడువైపులా మధ్యధరా సముద్రం
పికాసో గీత పుట్టిన స్పెయిన్ సీమ రాచకుటుంబంలో
మరణం ఉద్బోధించిన గీతాసారం
లక్షలాదిమందిని ఆడిపాడించిన
కపూర్ల ఆడపడుచు కంఠంలో కరోనా గీతం
నలువైపుల నుండీ వినవస్తున్న ఉత్తరాలు

లండన్, మాడ్రిడ్, న్యూయార్క్, లక్నో
కాదేదీ జవాబుకతీతం
కరోనా స్థలాలకతీతం
రాజైనా, భటుడైనా, మంత్రయినా, కూలీ అయినా
ఏ శరీరమైనా సమ్మతం
సమదృష్టి కరోనా సిద్ధాంతం

నిర్జీవ కణ పయనం-
కోటలోకైనా, పేటలోకైనా
కండిషన్స్ అప్లై- అన్నిటిలాగే ఈ వాక్యానికీ.

మురుగు కాల్వలో రాయేస్తే మాలిన్యం చిమ్మదా?
వరాహమే చెంత ఉంటే కల్మషం అంటదా?
స్వయం రక్షణతో వైరస్
సోకకుండా ఉంటుంది
ముక్కు, మూతి మూసుకుంటే
మిన్నకుండి పోతుంది
చేయి చేయి కలపకుంటే
చాటుకెళ్ళిపోతుంది
దూరాన్ని పాటిస్తే
దూరంగా పోతుంది
పరిశుభ్రత మనదైతే
పరారైపోతుంది

పులిరాజాకూ కరోనా వస్తుందా?
పదేపదే వినబడే పొగరుబోతు ప్రశ్న
నిర్జనవీధుల్లో నాకేం కాదని తిరిగే
అహంభావ రాజాలకు అంటనూ వచ్చు
నియంత్రణ పాటించే
సామాన్యుడికి జడిసి పారిపోనూవచ్చు

Exit mobile version