[వజ్జీరు ప్రదీప్ గారి ‘పుడమి నవ్వింది’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
వర్షం అప్పుడే మొదలైంది. నెర్రలు బారిన నేల పులకించింది. మెల్ల మెల్లగా ఎండకు ఎండిన గడ్డివేర్లు బలాన్ని పుంజుకుని పచ్చని గడ్డిపరకలై ముద్దుగా బయటకస్తున్నాయి. అక్కడ అక్కడా ముడుచుకున్న గడ్డిపూలు అందంగా విచ్చుకుంటున్నాయి. ప్రేమగా తడిసి ముద్దైన మన్ను కరుగుతు మిన్నును చూసి దాని వంక కృతజ్ఞతగా చూసింది.
ఈ ప్రకృతి దృశ్య భావం ఆ ఊయలలోని పసి మనసు అప్పుడే కలగందేమో! కిసుక్కున కిలకిలమని నవ్వింది.
“పుడమి నవ్వింది” నవ్వుతూ అంది నాయనమ్మ.
“నిజంగానా? తన నవ్వు చూసి రెండు దినాలు అయింది. రాధ జర నోరు తీపి చేయి తల్లి అందరికీ” అంది చిన్న వొదిన.
రాధా వంటింట్లోకెళ్లి ముందు రోజు పెనిమిటి సుదర్శన్ తెచ్చిన స్వీట్ బాక్స్ తెచ్చి అందరికీ పంచింది.
కూతురు పుడమిని చేతిలోకి తీసుకొని మురిపంగా మల్లోసారి చూసుకుని ముద్దు పెట్టింది. తల్లిని చూడగానే మళ్ళీ నవ్వింది, కిలకిలమన్నా శబ్దం ఇప్పుడు ఇల్లంతా వినిపించింది.
బయట వర్షం జోరుగా పడుతుంది.
చుట్టూ ఉన్న ఇండ్ల వాళ్లంతా ముచ్చటకు ఒక దిక్కు చేరిండ్లు. ఎవలే విత్తనం ఏస్తాండ్లో ఎవరు ఏ పనులు చేతన్లు విచారణ చేసుకుంటూ కూర్చున్నారు.
పుడమి రాధమ్మ కూతురు. మొన్ననే ఇరవై ఒక్క దినం చేసి పేరు పెట్టిండ్రు. ఆ ఫంక్షన్ చాలా పెద్దగా చేసిండ్లు, ఊరందరిని పిలిచి పండుగ చేసిండ్లు.
టివి వార్తలల్లో వాతావరణ వివరాలు చెబుతుంటే అందరు అటు దిక్కు తిరిగిండ్లు. ఆకాశం మేఘావృతమై ఉరుములతో కూడిన జల్లులు పడుతాయని చెబుతున్నారు.
“దుక్కులు పొతమైనాయి, సాలేల్లే వాన పడుతే అచ్చుకొట్టి విత్తనం బెడితే అయిపాయే” అన్నాడు రామయ్య.
“ఇసారి పొయినేడేసిన భూమిలో అదే పంటేయకుండా పంట మార్పిడి చేసి వేద్దాం” అన్నాడు సుదర్శన్.
అందరు ఒకరి మొఖాలొకరు జూసుకున్నాక “అదేంది అట్ల కుదురుతదా?” సందేహంగా అంది చింతకింది రాజవ్వ.
“అవ్ ఓ పంటకు నీళ్ళు గావాల్నాయే, ఓ పంటకు నీళ్ళు లేకున్నా పండుతదాయే, దిగుబడి తగ్గదా?” అన్నాడు రాంబాబు.
“ఒకే పంట వేస్తే భూసారం తగ్గి రాను రాను భూమి ఎందుకు పనికి రాకుండా పోతుంది, పంట మార్పిడితో భూసారం పెరుగుతుంది, దిగుబడి కూడా పెరుగుతుంది” అన్నాడు సుదర్శన్.
“భూమికి బలం పెరుగుతదంటే గట్లనే జేద్దాం” అన్నారు అక్కడున్నోళ్ళందరు.
“అలాగే ఇసారి వ్యవసాయ అధికారులతో భూసార పరీక్ష చేయించుదాం, వారు ఏ పంట వేయమంటే మనం అదే వేద్దాం, రసాయనాల వాడకం తగ్గించి మన భూమిని మనం కాపాడుకుందాం” అన్నాడు సుదర్శన్.
గొడుగు మూసుకుంటు లోపలికచ్చిండి వెంకటరత్నం.
“ఎటుబోయినవ్ నాయనా” అంది యాదక్క.
“మొన్న మనవరాలుకు పేరు పెట్టంగా. వాళ్ళో వీళ్ళో వేసిన బంగారం కట్నాలుండెనే, అవి బ్యాంకులో వేసి వస్తున్నాను. ఆడపిల్ల సొమ్ము ఆడపిల్లకు ఉంచడమే మంచిది, పెద్దయ్యాకా అది చెప్పుకోడానికి గుర్తుగా వుండాలే గదా” అన్నాడు వెంకటరత్నం.
పెద్దాయన ముందు చూపుకు అందరు తలో మాట గొప్పగా అనుకున్నారు.
రాధ అందరికి చాయ తీసుకచ్చి ఇచ్చింది.
“రమ అవ్వగారింటికి బోయి ఇంకా రాలేదారా కిషన్?”
“కిసి గాడు సక్కగుంటే గదేందుకు పోతదే నాయన” అంది యాదక్క.
“ఏమైందిరా మంచిగ కలిసి మెలిసి ఉండడానికి అయినా ఆలు మగలన్నాక ఎన్నో సమస్యలస్తాయి పెద్దమనుషులల్ల బడితే అది వాళ్ళకు పండుగే గదరా ఇరకక కొరకక అన్నట్టు అటు కలుపరు ఇటు విడదీయరు సక్కగా తీసుకచ్చుకుని కాపురం జేసుకో బిడ్డా” అన్నాడు పెద్దాయన.
“నేనేం అనలేదే మామ అదేమైన ఒట్టి ఒట్టిగనే కయ్యం బెట్టుకుంటది” అన్నడు కిషన్.
“ఒకింట్లకెల్లి మనింట్లకచ్చినోళ్ళు కొత్త గదా గట్లనే వుంటది. మనమే అలవాటయ్యేదాక సర్ధుకపోవాలే నేను దానికి ఫోన్ చేసి చెబుతాను. నువుబోయి విత్తనాలు పెట్టక ముందు తీసుకచ్చుకో రా” అన్నడు పెద్దాయన.
“సరే నాయనా” అన్నడు కిషన్.
గీసారి రైతులందరూ ఏకమై గ్రామ సభలో తీర్మానం చేసుకొని వ్యవసాయ అధికారులతో చర్చించి పంట మార్పిడి చేసుకొని సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం జేసుకున్నరు.
పచ్చగా వికసించిన నేలతో పుడమి నవ్వింది.
***
‘కాలం ఎంత తొందరగా గడిచిందో పుడమిని చూస్తే అర్థమైతది.’ పెరట్లో పుడమి పెట్టిన మందార చెట్టును చూసి మురిసిపోతూ అనుకుంది రాధ.
“ఏం ఆలోచిస్తున్నావు రాధా?” అన్నడు సుదర్శన్.
“కాలేజి వాళ్ళకు ఫోన్ చేసిండ్లా? పుడమి ఎట్లున్నదటా? అసలే అది బయటి ప్రపంచం తెలువని పిల్ల. అక్కడి తిండి పడుతుందో లేదో అడగయ్యా” పెనిమిటితో బాధగా అంది రాధ.
“నిజమే ఎప్పుడు బాపే వెళ్తాండు. ఈ సారి బిడ్డ దగ్గరికి మనమే బోదామని చెప్పుదాం, సరేనా” అన్నడు సుదర్శన్.
“ఏమో! తాత మనవరాలు ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేరు గదా? మనల్ని పోనిస్తాడంటావా?” పెనిమిటి భుజం మీది తువ్వాల రింగులు చుడుతూ అంది.
‘తల్లికి బిడ్డకు వున్న అనుబంధం – భూమికి ఆకాశానికున్న ఋణానుబంధం ఎంత గొప్పదో’ మనసులో అనుకుంటు ఆలోచిస్తున్నాడు సుదర్శన్.
“ఏమయ్యా ఏం అంటావు?”
“బాపు దాని మెడికల్ సీటు కోసం చాన కష్టపడ్డడు, అది తాతకు తగ్గ మనవరాలు గదా. అందుకే ఆయన కోరికను తన కోరికగా అదే ఇష్టంగా మార్చుకుని సాధించింది. అందుకే ఆయనను గట్టిగా అడగలేక పోతున్నా” అన్నడు సుదర్శన్.
పెద్దాయన మనసుకే వచ్చిందో, ఆ దేవుడే చెప్పాడో తెలియదు గానీ ఆ రాత్రి కొడుకు కోడలిని పిలిచి పుడమి దగ్గరికి వెళ్లి చూసి రమ్మన్నాడు. దాంతో వాళ్ల సంతోషానికి అవధులు లేవు. బిడ్డకు ఇష్టమైన రవ్వ లడ్డులు చేసింది రాధ. మిషిని కాడ కుట్టించిన పట్టుపరికిని బ్యాగులో సర్ది పెట్టింది. బిడ్డతో ఏమేం ముచ్చట్లు చెప్పాల్నో రాత్రంతా ఆలోచించింది.
పొద్దటి ట్రిప్పు బస్‌కు పోయిండ్లు ఇద్దరు.
అమ్మనాన్నను చూడంగనే ఎగిరి గంతేసింది పుడమి.
“ఏట్లున్నవ్ బిడ్డా!” ఇద్దరు పావురంగా దగ్గరకు తీసుకుని అన్నరు.
“నాకేందే ఇగ సూడు నేను బాగనే వున్న. ఇగో వీళ్ళు నా ఫ్రెండ్స్ వరలక్ష్మి, రాధిక, గీత వీళ్ళందర్ని అడుగు నేనెట్లుంటున్నానో” పరిచయం జేసుకుంటా అన్నది పుడమి.
“ఏట్లా చదువుతున్నవ్ రా?” పుడమి తలపై చేయివేసి అన్నడు సుదర్శన్.
“నేను బాగానే చదువుతున్న నాన్నా” అంది.
“ఇగోండ్లి బిడ్డా ఈ గారెలు, రవ్వలడ్డులు, పులిహోర” బ్యాగులోని డబ్బాలు తీసింది రాధ.
“నేను చెప్పాను గదా మా అమ్మ ఏమేం తెస్తుందో” ఫ్రెండ్స్ వైపు చూసుకుంటా అంది.
“పుడమి నువ్ చెప్పిందాట్లో ఏది తగ్గకుండా తీసుకచ్చిందే మీ అమ్మ” గీత నవ్వుతు అంది. మిగతా ఇద్దరు ముసి ముసిగా నవ్విండ్లు.
“మా అమ్మంటే ఏమనుకున్నరు” మెడచుట్టురా చేతులేసి అంది.
“నేనే గాదు మీ అమ్మైనా, వాళ్ళమ్మైనా ఎవరమ్మైనా అమ్మేరా పెరిగి పెద్దయ్యే వరకు కంటి పాపలెక్క చూసుకోవడమే మా బాధ్యత రా” అందరిని దగ్గరకు తీసుకుని అంది రాధ.
“మీరు మాట్లాడుతుండండి నేను మళ్ళీ వస్తాను” అంటూ ఆఫీస్ వైపు నడిచాడు సుదర్శన్.
రాధ అందరిని గుంపుగా కూర్చుండ బెట్టుకుని వాళ్ళకు సుద్దులు చెప్పింది.
కాసేపు ఒంటరిగా పుడమితో మాట్లాడి, పెనిమిటి సుదర్శన్ వచ్చాక పుడమిని తేరిపార చూసుకుని ముద్దులు పెట్టి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి కదిలిండ్లు.
***
“పుడమి ఎవరి రిపోర్టే అంతా తీక్షణంగా చూస్తున్నావు?” అంది డా. సృజన.
“ఇందాకటి యాక్సిడెంట్ కేసు స్టడీ చేస్తున్నాను” అంది డా. పుడమి.
ఇద్దరు కాసేపు చర్చించుకున్నాక ఒక నిర్ణయానికి వచ్చారు.
“ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడి చూద్దాం” అంది డా. సృజన.
“నర్స్ ఇందాకచ్చిన పేషంట్ వాళ్ళను పిలువు” అంది పుడమి.
ఇద్దరు బోరుమంటు లోనికి వచ్చిండ్లు. యాదమ్మ, రంగయ్యను జూసి పుడమి లేచి నిల్చుంది.
“మీరు.. యా..ద..మ్మ.. అత్త.. రం..” తన నోటిలోని మాటలు బయటకు రాకుండానే తడబడ్డాయి.
“బిడ్డా! ఉమను కాపాడు” యాదమ్మ పుడమి కాళ్ళపై పడబోయింది.
“అత్తా నేనున్నాను, మీరు ఏడువకండ్లి. నేను చూసుకుంటాను. నర్స్ వీటిపై వీళ్ళతో సిగ్నేచర్ పెట్టించు” అని బయటకు పంపింది.
కండ్లలో నీళ్ళు చెంపలపై నుండి ధారగా పోతున్నాయి.
‘చిన్నప్పటి నుండి తనను ఎత్తుకుని ఊరంత తిప్పెటోడు, ఆరుద్ర పురుగులు దొరకబట్టి అగ్గిపెట్టెల ఏసిచ్చెటోడు, చింత చెట్టుకు ఊయల గట్టి ఊపెటోడు రంగయ్య మామ. తనను ఎత్తుకుని ఉగ్గు తినిపించిన యాదత్త, బతుకమ్మ పండుగకు పూల కోసం చెట్టు, పుట్టలు తిప్పి నాతో ఆటలాడిన ఉమ ఇప్పుడు యాక్సిడెంట్ అయి స్టెచర్‌పై వుంది. తనని ఎలాగైనా కాపాడాలి’ మనసులో ఆలోచనలకు పసును పెడుతుంది పుడమి.
“ఏంటే ఆ కండ్ల నీళ్ళు” పుడమి భుజం తట్టి అంది సృజన.
“ఉమ నా చిన్ననాటి స్నేహితురాలు, ఇందాక మొఖమంతా నెత్తుటి మరకలతో ఉండటంతో పోల్చుకోలేక పోయిన్నే” అంది దుఃఖభారంతో పుడమి.
“నువ్ ఏంటే, తనకు ఏం కాదు. అవసరమైతే సూపరిండింటెంట్ గారితో మాట్లాడి సిటీకి షిప్ట్ చేద్దాం” అంది సృజన.
‘ఉమకు ఏం కాకుడదు అలా అయితే నేను చదివిన చదువుకు విలువేలేదు’ తల పట్టుకుని ఆలోచిస్తుండగా తనకు టక్కున ఏదో ఆలోచన స్పురణకు వచ్చిందేమో! “సృజన.. సృజన కేషిట్ తీసుకో..” అంటూ తన ఆలోచన వివరించి సర్జరీ ఎలా చేసి తనను కాపాడవచ్చో చెప్పింది పుడమి.
“నర్స్ ఉమని ఆపరేషన్ ధియేటర్ కి షిప్ట్ చేయండి” అని పిలిచి చెప్పింది డా. సృజన.
“అమ్మ పుడమి” తాతయ్య వెంకటరత్నం, యాదత్త, రంగయ్య మామను తీసుకుని దగ్గరకు వచ్చాడు. వాళ్ళ వెనకాలే నాన్న కూడా వున్నాడు.
యాదత్తది కన్న పేగాయే యాదికచ్చిన దేవుళ్ళందరిని మొక్కుతాంది.
“తాతయ్య! ఫికర్ పడకుండ్లి, ఉమకి నేనున్నాను, మీరు వాళ్ళకు ధైర్యం చెప్పండి” అంటూ థియేటర్ లోకి వెళ్ళింది.
హడావుడిగా నర్సులు తిరుగుతున్నారు.
అందరి మనసులోను ఒకటే ఉమ క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటున్నారు.
కొద్ది సేపటి తరువాత..
డాక్టర్ అనస్థీషియా చేశాక గాయాలకు చికిత్స చేశారు. ఆ తరువాత సర్జరీ జరిగింది. తల్లి గర్బం నుండి బయటి ప్రపంచంలోనికి వచ్చిన శిశువు ‘కేర్’ మంటు ఈ ప్రపంచంలోకి వచ్చాడు.
ఆపరేషన్ సక్సేస్ కావడంతో సృజనను గట్టిగా హత్తుకుంది పుడమి. ఆ తరువాత తనను ఐ.సి.యు.కి షిప్ట్ చేశారు.
బయటకు రాంగనే అందరు చుట్టుముట్టారు.
“ఉమ క్షేమంగా వుంది. తనకు పుట్టిన బిడ్డ కూడా బాగున్నాడు అత్త” యాదక్క, రంగయ్యను హత్తుకుని చెప్పింది.
చెమర్చిన కండ్లను తుడుచుకుంటు మనవరాలిను దీవించాడు వెంకటరత్నం.
పుడమి తన క్యాబిన్ లోకి వెళ్ళి కూర్చుని కిటికిలో నుండి చూసింది. భారమైన మనసు కాస్త తేలికైంది.
బయట నేల తడిసి ముద్దయింది, పచ్చని లేలేత గడ్డి మెరిసే నీటి బిందువులను మోస్తుంటే చెట్ల కొమ్మలు వీచే గాలిలో రెక్కలు విరుచుకుంటున్నట్టు అటు ఇటు ఒంగుతున్నాయి. పూలచెట్ల మధ్యలో ఒక వైపు సీతకోకచిలుకలు మరో వైపు తూనీగలు ఎగురుతున్నాయి, అక్కడక్కడ పక్షులు కిచకిచమంటుంటే తనలోని అందమైన ప్రకృతిని తానే చూసుకుని మురిసిపోతు పుడమి నవ్వింది.