Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విపత్తు వేళ అనుబంధాల వెతలు ‘ప్రైవేట్ రైట్స్’ నవల

[‘పుస్తక సురభి’ శీర్షికలో భాగంగా జూలియా ఆర్మ్‌ఫీల్డ్ రచించిన ‘ప్రైవేట్ రైట్స్’ అనే నవలని సమీక్షిస్తున్నారు స్వప్న పేరి.]

జూలియా ఆర్మ్‌ఫీల్డ్ రాసిన ‘ప్రైవేట్ రైట్స్’ హృదయ విదారకమైన, వాతావరణ సంబంధమైన నవల. స్పెక్యులేటివ్ ఫిక్షన్‌కి డొమెస్టిక్ డ్రామాని జోడించిన నవల. వేదన, ఛిద్రమైన కుటుంబ బంధం, క్వీర్ ఐడింటిటీ (భిన్నమైన లైంగిక గుర్తింపు), ఇంకా పర్యావరణ పతనం వంటి అంశాలతో సాగుతుందీ నవల. కుంభవృష్టి వల్ల వరదలొచ్చి, నీట మునుగుతున్న, లండన్‌ నగరాన్ని గుర్తుకు తెచ్చే ఓ డిస్టోపియన్ సిటీలో నడిచే ఈ కథ – క్రూరుడైన ప్రఖ్యాత వాస్తుశిల్పి అయిన తమ తండ్రి స్టీఫెన్ మరణం తర్వాత తిరిగి కలిసే ముగ్గురు సోదరీమణులు – ఇస్లా, ఐరీన్, ఆగ్నెస్ లపై కేంద్రీకృతమై ఉంటుంది. ఈ నవల స్టీఫెన్‌కి చెందిన గ్రాండ్ గ్లాస్ హౌస్‌లో మొదలవుతుంది, అది అతని వారసత్వానికి, అతను విడిచివెళ్ళిన భావోద్వేగపు గాయాల మచ్చలకు చిహ్నం. దాచిన రహస్యాలతో, పరిష్కరించబడని వేదనతో అక్కచెల్లెళ్ళు పోరాడుతుంటారు.

జూలియా ఆర్మ్‌ఫీల్డ్

ఈ కథ షేక్‌స్పియర్ కింగ్ లియర్ నాటకం నుండి ప్రేరణ పొందింది. వారసత్వం, కుటుంబ సంఘర్షణల ఇతివృత్తాలను ఒక విచిత్రమైన పద్ధతిలో ప్రదర్శిస్తుంది. ముగ్గురు అక్కాచెల్లెళ్ళలో ప్రతి ఒక్కరి సమస్య, పోరాటం భిన్నమైనవి: ఇస్లా తన మాజీ భార్య పట్ల పరిష్కారం కాని భావాలను ఎదుర్కొంటుంది; ఐరీన్ తన నాన్-బైనరీ భాగస్వామితో సంబంధంలో ఉద్రిక్తతలను ఎదుర్కొంటుంది; ఇక ఆగ్నెస్ మొదటిసారి ప్రేమను అనుభవిస్తుంది. వారి పరస్పర చర్యలు ఉద్రిక్తతతో నిండి ఉంటాయి, సంవత్సరాల తరబడి తండ్రి వాళ్ళని పట్టించుకోకపోవడం, ప్రతికూలంగా ప్రభావితం చేయడం వల్ల అవి ఏర్పడ్డాయి. వేదన ఆ ముగ్గురి అవగాహనలను, సంబంధాలను, అవి లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ, ఎలా మారుస్తుందో, వాటికి ఎలా మానవీయతని అద్దుతుందో రచయిత్రి నైపుణ్యంగా చిత్రీకరించారు.

నవల అత్యంత అద్భుతమైన లక్షణాలలో ఒకటి దాని నేపథ్యం – ఎడతెగని వానలతో ఎల్లప్పుడూ నీట మునిగిఉండే నగరం. అక్షరాలా పర్యావరణ విపత్తుకి నేపథ్యంగా ఉండి పాత్రల భావోద్వేగ కల్లోలానికి ఒక రూపకంగా పనిచేస్తుంది. ఆర్మ్‌ఫీల్డ్ కథనం – వరదలున్న వీధుల వర్ణనలు, రైళ్ల స్థానంలో వాటర్ టాక్సీలు, ఇంకా మనుషుల నివాస స్థలాలను ఆక్రమించే వన్యప్రాణుల వర్ణనలతో – ఉక్కిరిబిక్కిరి చేసే వాతావరణాన్ని స్పష్టంగా ప్రదర్శిస్తుంది. ప్రళయకాలపు ఈ నిరుత్సాహం, కథలో గుబులుని పెంచుతుంది, అనివార్యతా భావాన్ని వ్యాపించేస్తుంది.

రచయిత్రి కాలాన్ని, జ్ఞాపకాలని విస్తృతంగా ప్రస్తావించడం వల్ల, జటిలంగా అనిపించే ‘ప్రైవేట్ రైట్స్’ నవలకు మరో పొరని జోడించినట్లయింది. కథనం క్రమబద్ధంగా లేకపోయినా, గత గాయాలను, ప్రస్తుత సవాళ్లతో మేళవిస్తున్న సోదరీమణుల దిక్కుతోచని స్థితిని ప్రతిబింబిస్తుంది. ఈ రకమైన రచనా సంవిధానం నవలలోని కలవరపు స్వరాన్ని హెచ్చుస్థాయికి తీసుకువెళ్తుంది, దాంతో పాఠకులు పాత్రల మాదిరిగానే నిరంతరం దృష్టి మరల్చకుండా ఉంటారు. వ్యక్తిగత సంక్షోభాలు, ప్రాకృతిక విపత్తుల మధ్య పరస్పర చర్య – పతనం అంచున ఉన్న ప్రపంచంలో వారసత్వం ఎంత వ్యర్థమో నొక్కి చెబుతుంది.

ఈ నవల – క్వీర్ ఐడింటిటీ, వాంఛ వంటి ఇతివృత్తాలను కూడా సూక్ష్మ నైపుణ్యాలతో, లోతుగా పరిశీలిస్తుంది. ఆర్మ్‌ఫీల్డ్ తన పాత్రల ద్వారా క్వీర్ అనుభవాల వర్ణపటాన్ని ప్రదర్శించారు, భావోద్వేగపు దుర్బలమైన పొరలతో కథనాన్ని సుసంపన్నం చేశారు. నవలలో వర్ణించబడిన సంబంధాలు గజిబిజిగా, అసంపూర్ణంగా ఉంటాయి కానీ ప్రామాణికతతో ప్రతిధ్వనిస్తాయి. గందరగోళం మధ్య సాన్నిహిత్యంపై ఈ దృష్టి – ఊహాజనిత అంశాలను లోతైన వ్యక్తిగత కథనంతో మిళితం చేయగల రచయిత్రి సామర్థ్యాన్ని ప్రస్ఫుటం చేస్తుంది.

వాతావరణ రచనగా, నేపథ్యపరంగా ‘ప్రైవేట్ రైట్స్’ నవల అద్భుతంగా ఉన్నప్పటికీ, కొంతమంది పాఠకులకు దాని వేగం అసమానంగా ఉన్నట్టు అనిపించవచ్చు. కొన్ని భాగాలు అనుకోని మలుపులు తిరిగి, ఆకస్మిక ముగుస్తాయి, ఇది కాస్త గందరగోళంగా అనిపించవచ్చు. అయితే, ఈ అసమానత నవల పూర్తి ప్రభావాన్ని పెద్దగా తగ్గించదు. సత్యం, మనుగడ, సంక్షోభ సమయాల్లో మనల్ని కలిపి ఉంచే సున్నితమైన బంధాలు నవల కీలకమైన ఇతివృత్తాలు, వీటిని బలోపేతం చేసే ఆశ్చర్యకరమైన మలుపును క్లైమాక్స్ అందిస్తుంది.

మొత్తం మీద, ‘ప్రైవేట్ రైట్స్’ అనేది ఫ్యామిలీ డైనమిక్స్, ఐడెంటిటీ, పర్యావరణ పతనంపై ఉత్సుకతని రేపే నవల. ఆర్మ్‌ఫీల్డ్ ఉత్తేజకరమైన కథనం, సంక్లిష్టమైన పాత్రల రూపకల్పన – ఈ నవలని స్పెక్యులేటివ్ ఫిక్షన్‌కు ఒక విశిష్టమైన జోడింపుగా చేస్తాయి. ఆమె మునుపటి రచనల అభిమానులు లేదా భావోద్వేగాల లోతులు ఉన్న ‘లిటరరీ హారర్’ని ఇష్టపడేవారు ఈ నవల పట్ల ఆకర్షితులవుతారు.

***

Book Title: Private Rites
Author: Julia Armfield
Published By:  Fourth Estate
No. of pages: 208
Price: Paperback ₹499/-
Link to buy:
https://www.amazon.in/Private-Rites-unmissable-novel-author/dp/0008608040

Exit mobile version