[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘ప్రేమించండి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ప్రేమ గురించి చెప్పమంటే
రోమియో జూలియట్
లైలా మజ్నూ
సమాధయిన సలీమ్ అనార్కలి
తాజ్ మహల్ కట్టించిన షాజహాన్
దేవదాసు పార్వతిల
ఫలించని ప్రేమలను
ప్రతీకలుగా చెబుతారెందుకు
శరీరంలో సగపాలైన
పార్వతీ పరమేశ్వరతత్వం చెప్పండి
లక్ష్మిని గుండెల్లో నిలిపిన
నారాయణుని గురించి చెప్పండి
సీతారాముల అద్వైతప్రేమను
చూపండి
ప్రేమ గొప్పతనాన్ని కథలుగా
మనసుకు తెలిసేట్టు చెప్పండి
మీ కోసం తపించే
తల్లిదండ్రుల ప్రేమ విలువ
తెలుసుకోండి
చదువులు ర్యాంకులతో ప్రేమ వ్యామోహంలో
జీవితం విలువను కోల్పోకండి
అనుచిత నిర్ణయాలు తీసుకోవద్దు
ఆడపిల్లలయినా మగవారయినా
భవిష్యత్తును గమనించండి
ఆకర్షణ వ్యామోహాలు వదిలి
మనసుతో ప్రేమించండి
మీరు మీరుగా ఉండండి
ప్రేమంటే స్వార్థం కాకూడదు
పర్యాప్తం కావాలి
ప్రేమతో జీవించండి
పదుగురికి ప్రేమను పంచండి
ఉన్నతంగా జీవించి
ప్రేమ విలువను
ప్రేమలోని గొప్పతనాన్ని
తెలుసుకుని
ప్రేమైకమూర్తులుగా నిలవండి.