[శ్రీ కయ్యూరు బాలసుబ్రమణ్యం రచించిన ‘ప్రేమికుడు’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]
నా మనోఫలకంపై
నీ జ్ఞాపకాలు రాసుకున్నా
నా మది నిండా
నీ స్మృతులు నింపుకున్నా
నా మస్తిష్కంలో
నీ రూపం నిలుపుకున్నా
నా మనసున
నీ భావాలు దాచుకున్నా
నా ఊహలలో
నీ ఊసులని పెనవేసుకున్నా
నా గమనంలో
నీ ఆగమనాన్నీ ఆహ్వానించుకున్నా
నా జీవనంలో
నీ ప్రేమయానాన్ని స్వగతించుకున్నా
నా కలలో
నీ వ్యాపకాలను బంధించుకున్నా
ఇన్ని చేశాక చివరికి తెలిసింది
నిను నేను బంధించుకోలేదని
నా సర్వస్వం నీకే వశం అయ్యిందని
నేనే నీకు దాసోహం అయిపోయానని
నిను నిత్యం పూజించే
ప్రేమ పూజారినని
నీ ఆరాధనలో
అలసిపోని ప్రేమికుడనని