Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమేగా ప్రపంచం-9

[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘ప్రేమేగా ప్రపంచం’ అనే నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]

[తమ స్కూటర్ చెడిపోయిందని, ఇంటికి వెళ్ళేటప్పుడు తననీ, గోపాల్‍ని పికప్ చేసుకోమని వసంత గోవిందకి ఫోన్ చేసి చెబుతుంది. సరేనంటాడు. గాంధీ బొమ్మ దగ్గర చెల్లెల్నీ, తమ్ముడిని కార్లో ఎక్కించుకుంటాడు. కొంత ముందుకు వెళ్ళాకా, బస్ స్టాండ్‌లో కనిపించిన హారికని చూసి, కారు ఆపమంటుంది వసంత. గోపాల్ వెళ్ళి ఆమెను పిలుచుకు వస్తాడు. గోపాల్ వెనక సీట్లో కూర్చోగా, హారిక ముందు సీట్లో గోవింద పక్కన కూర్చుంటుంది. తమ ఇంటి ప్లాన్ గురించి అడుగుతాడు గోపాల్. అయిందని చెప్తుంది. వెంటనే ట్రీట్ ఇవ్వాలి అంటూ ఎదురుగా టీ కొట్టు కనిపించడంతో కారు ఆపిస్తుంది వసంత. టీ తాగాకా, కారుని హారికని డ్రైవ్ చేయమంటుంది వసంత. హారిక డ్రైవ్ చేస్తూ తన ఇంటి దాకా వెళ్ళి, కారు దిగి థాంక్స్ చెప్పి, ఓ గంటలో ప్లాన్ తీసుకుని వస్తానని చెప్తుంది. అన్నలు, చెల్లెలు ఇంటికి చేరుతారు. వసంత నిశ్చితార్థానికి, పెళ్ళికి ముహూర్తం నిశ్చయమైందని తండ్రి చెబితే, వసంత మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. అది చూసి, ఈ పెళ్ళి చెల్లికి ఇష్టమేనా అని కనుక్కున్నారా అని గోపాల్ అడుగుతాడు. దాంతో తల్లిదండ్రులిద్దరూ ఆమె గదిలోకి వెళ్తారు. గోవింద, గోపాల్ – గోవింద గదిలోకి వెళ్తారు. ఎందుకలా అడిగావని తమ్ముడిని అడుగుతాడు గోవింద. అప్పుడు గోపాల్ చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయి అతన్ని మెచ్చుకుంటాడు. ఈలోపు వసంతకేమీ అభ్యంతరం లేదనే శుభవార్త వినిపిస్తారు అమ్మానాన్నలు. కాసేపటికి కొత్త ప్లాన్ తీసుకుని వచ్చి, దాని గురించి అందరికీ వివరిస్తుది హారిక. పన్నెండు లక్షల ఎస్టిమేట్ ఇస్తుంది. త్వరలోనే నిర్మాణం ప్రారంభించాలని అనుకుంటారు. – ఇక చదవండి.]

“ఓ చిన్న సందేహం అన్నయ్యా!..” వెనక సీట్లో కూర్చొని యున్న గోపాల్ అడిగాడు.

“ఏ విషయంలో సోదరా!..” నాకంటే ముందు, నా ప్రక్కన కూర్చొని వున్న వసంత అడిగింది.

“వివాహ విషయాన్ని గురించి సోదరీ!..” నవ్వుతూ చెప్పాడు గోపాల్.

నేను వాడి ముఖంలోకి చూచాను. వాడు.. “ఏమిటన్నయ్యా!.. అలా చూస్తున్నావ్!.. నేను తప్పుగా ఏమీ మాట్లాడలేదుగా!..” అన్నాడు.

“లేదు.” అన్నాను. నా సెల్ మ్రోగింది. రామసుబ్బయ్య గారు ఫోన్ చేశారు. సునీల్ నాలుగు లక్షలకు డి.డి పంపాడని చెప్పి.. “సార్.. మీరు కార్లో వుదయం నేను చెప్పినట్లుగా తొమ్మిది గంటలకల్లా పాల కేంద్రం దగ్గరికి రండి. నేను ఆ సమయానికి అక్కడికి చేరతాను.” అన్నారు.

“అలాగే సార్!.. వస్తున్నాను” చెప్పి, సెల్ కట్ చేశాను.

సునీల్ గాడు నా మెసేజ్ని చూచి నాలుగు లక్షలకు మనిషి ద్వారా డి.డి.ని. పంపినందుకు చాలా సంతోషం కలిగింది. గోపాల్‍కు చెప్పాను.

“అన్నయ్యా!.. రౌతు ననుసరించి గుఱ్ఱం అనేది యిదే. కొడుకు.. నీ మెసేజ్‍ని చూచి భయపడి పంపాడు” అని,  “మరి.. అన్నయ్యా.. నా సందేహాన్ని తీర్చవా?..” అన్నాడు.

“అడుగు..”

“ఆ టాపిక్ మీద నీకేం సందేహం రా చిన్నోడా!.. నవ్వుతూ అంది వసంత.

“నన్ను చెప్పనీవే!..”

“సరే చెప్పు”

“అన్నయ్యా!..” నా వంక చూచాడు.

“చెప్పు..”

“మగవాడు.. తనకంటే ఒకటి రెండు సంవత్సరాలు వయస్సులో తేడా వున్న అంటే.. పెద్ద అయిన పిల్లను పెండ్లి చేసుకోవడం తప్పా అన్నయ్యా!..”

“యిప్పుడు నీ బుఱ్ఱలో యీ ప్రశ్న ఎందుకు వుదయించింది గోపాలా!..” నవ్వింది వసంత.

“అన్నయ్యా!.. నిన్న చెప్పానుగా దీని వరస.. క్షణం వూరుకోదు, వసపిట్ట”

“మాటను మార్చకు తమ్ముడూ!.. యిప్పుడు నీవు యీ ప్రశ్నను ఎందుకు అడిగావు?.. జవాబు చెప్పు” నవ్వుతూ అడిగింది వసంత.

“మా ఫ్రెండ్ ఒకడు.. తన మేనత్త కూతురును ప్రేమించాడు. ఆమెకు వీడికి రెండేళ్ళు వయస్సులో తేడా. ఆమె వీడిని ప్రేమించింది. వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. యీ వయస్సు వ్యత్యాసం కారణంగా వారు.. వారి నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేకపోతున్నారు. తల్లిదండ్రులకు చెప్పకుండా పారిపోయి వివాహం చేసుకోవడం వారికి యిష్టంలేదు. నన్ను నా మిత్రుడు సలహా అడిగాడు. వాడికి నేను ఏం చెప్పాలన్నయ్యా” గోపాల్.. చెప్పడం ఆపి నా ముఖంలోకి చూచాడు.

“గోపాల్.. వాళ్ళిద్దరికీ యిష్టం కాబట్టి.. యిరువురూ కలిసి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు వారి నిర్ణయాన్ని నిర్భయంగా తెలియజేయమని చెప్పు. రెండు కుటుంబాల బంధుత్వం వుంది కాబట్టి.. వారి తల్లిదండ్రులు వారి వివాహానికి సమ్మతిస్తారు. వారి వివాహం జరుగుతుంది” నాకు తోచిన జవాబును చెప్పాను.

“వయస్సు తేడా విషయంలో వారు కాదంటే వీళ్ళు..”

“ఒరేయ్!.. పురాణపురుషుడు శ్రీరాముడి కన్నా సీతామాత పెద్దదట. మనకు తెలిసి టెండూల్కర్ కన్నా.. అతని భార్య వయస్సులో పెద్ద. యిరువురు యువతీ.. యువకులకు వివాహ యోగం వుంటే.. వయస్సు వ్యత్యాసమున్నా వారి వివాహాన్ని ఎవరూ ఆపలేరు.” నాకు తెలిసిన, తోచిన విషయాన్ని చెప్పాను. నా సమాధానం వాడికి నచ్చింది. అది వాడి కళ్ళల్లో నాకు ద్యోతకమయింది.

“ఒరేయ్!.. చిన్నన్నయ్యా!.. కొంపదీసి నీవు యిలాంటి షాకింగ్ న్యూస్ మాకు త్వరలో యివ్వబోతావా ఏంటి?..” నవ్వుతూ తన సందేహాన్ని వ్యక్తం చేసింది వసంత.

“అమ్మా తల్లీ!.. నా బంగారు కదూ!.. యిక యీ టాపిక్‍ను వదిలెయ్యి.” దీనంగా అన్నాడు గోపాల్.

“నీవు ఎంతో బుద్ధిమంతుడివని మేమంతా అనుకొంటున్నాము. పిచ్చి నిర్ణయాలతో ఆ పేరును పాడు చేసుకోకు” బెదిరించినట్లు చెప్పింది వసంత. పాలకేంద్రాన్ని సమీపించాము. నేను కారు నుంచి దిగాను.

“యీ రాత్రికి నేను యింటికి రాను. కారును మీరు తీసుకొని జాగ్రర్తగా వెళ్ళండి. మీరు బయలుదేరే ముందు నాకు ఫోన్ చెయ్యండి” అన్నాను.

“అలాగే అన్నయ్యా!..” యిద్దరూ ఒకేసారి అన్నారు. గోపాల్.. డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. ‘‘బై’‘ చెప్పి వారు సిటీ వైపు వెళ్ళిపోయారు.

నేను పాలకేంద్రాన్ని సమీపించాను. రామసుబ్బయ్యగారు నాకు ఎదురొచ్చారు. యిరువురం కేంద్రంలోకి వెళ్ళాము.

దాదాపు నాలుగు వందల ఆవులు.. నలభై మంది పనివాళ్ళు, వారికి ఒక మ్యానేజర్ పాండురంగ.. అక్కడ వున్నారు. రామసుబ్బయ్యగారు నన్ను అందరికీ పరిచయం చేశారు. అంతా తిరిగి చూచిన తర్వాత పాండురంగ, రామసుబ్బయ్యగారు, నేను ఆఫీస్ గదిలో కూర్చున్నాము.

“గోవింద్ బాబూ!.. యీ పాండురంగ నిప్పులాంటి మనిషి. కష్టజీవి. పనివారినందరినీ ఎంతగానో అభిమానిస్తాడు. వారూ.. వీరు గీచిన గీత దాటరు. దాదాపు యిరవై వేల లీటర్ల పాలు వుదయం.. సాయంకాలం చెన్నైకి టాంకర్లతో తోలుతారు. యిక్కడ వుండే ఆవులన్నీ పాలు యిచ్చేవే. ఒట్టిపోయిన ఆవులు దాదాపు మరో నాలుగువందలు పెంచలకోన దగ్గర వున్నాయి. అవి యీనగానే యిక్కడికి తీసుకొని వస్తారు. వాటి సంరక్షణకు అక్కడ ఓ యిరవై మంది, ఒక సూపర్‌వైజర్ వున్నారు. యీ యూనిట్ నిర్వాహణ పాండురంగ ప్రశంసనీయంగా నిర్వహిస్తున్నారు. త్వరలో వీరి పెద్ద అమ్మాయి వివాహం. ఆమె కాక మరో యిద్దరు మగ పిల్లలు కాలేజీలో చదువుతున్నారు. అమ్మాయి బి.యి.డీ పాసయింది. వుద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు పాండురంగ. ఆమెకు కాబోయే భర్త మన వూరి స్కూల్లో పని చేస్తున్నాడట. పేరు అరవింద్. మీరు నాన్నగారికి చెప్పి అమ్మాయి వాణికి మన వూరి స్కూల్లో వుద్యోగం యిప్పిస్తే.. ఆ జంట హాయిగా మీ పేరు చెప్పుకొని బ్రతుకుతారు బాబు.” తాను చెప్పదలచినది చెప్పారు రామసుబ్బయ్యగారు.

“నాన్నగారితోనూ, హెడ్మాస్టర్ రామకోటయ్యగారితోను మాట్లాడతాను. తప్పకుండా ఆమెకు మన వూరి స్కూల్లో పోస్టింగ్ జరిగేలా చేద్దాం” అన్నాను.

పాండురంగ చేతులు జోడించి.. “నాకు యీ సాయం చేయండి సార్..

మీ మేలును యీ జన్మలో మరచిపోను” ప్రాధేయపూర్వకంగా కోరాడు.

“తప్పకుండా చేస్తాను” చెప్పి, రామసుబ్బయ్యగారి వైపు చూచి.. “యిక మనం బయలుదేరుదాం సార్..” అన్నాను. పాండురంగ మాతో పాటు కారుదాకా వచ్చారు.

ఇరువురం అరగంటలో ఆఫీస్‍కు చేరాము. నా గదిలో ప్రవేశించాము.

“ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ ముఖ్యులంతా వచ్చారు. బోర్డు రూమ్‍లో కూర్చుని ఉన్నారు. వారిని చూచి, మీరు వారికి చెప్పవలసిన మాటలు చెబితే బాగుంటుంది “బాబూ!..” అన్నారు రామసుబ్బయ్యగారు.

“కూర్చోండి. వారి పేర్లను చెప్పండి. వ్రాసుకొంటాను.” కూర్చొని చెప్పాను. వారూ కూర్చున్నారు. ఆరు పేర్లు చెప్పారు. సుబ్బారావు, భూపతి, త్రివిక్రమ్, రంగారావు, వినోద్, ఖాసింఖాన్.

“వీరిలో.. సుబ్బారావు గారు, త్రివిక్రమ్, ఖాసింఖాన్ చాలా మంచివారు. వారి లెక్కల్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. మిగతా ముగ్గురికి మంచి పేరు లేదు. వారు.. రవిబాబుకు చాలా ముఖ్యులు. అతనిలోని బలహీనతను తెలిసికొని, వారు వారి యిష్టానుసారంగా కంపెనీ సొమ్మును దొంగ బిల్లులతో కాజేస్తున్నారు. మన దగ్గర ఆధారాలు వున్నాయి. కాబట్టి వీరి విషయంలో, మీరు వారితో మాట్లాడి, తగిన నిర్ణయాలను తీసుకోండి బాబూ!..”

“అలాగే, పదండి”

యిరువురం బోర్డు రూమ్‍లో ప్రవేశించాము.

ఆ ఆరుగురూ లేచి మాకు విష్ చేశారు. విష్ చేసి.. మేమిరువురం కూర్చున్నాము. వారూ కూర్చున్నారు. రామసుబ్బయ్యగారు నన్ను అందరికీ పరిచయం చేశారు.

వారు చెప్పినట్లుగా.. సుబ్బారావు, త్రివిక్రమ్, ఖాసింఖాన్ ముఖాల్లో వున్న కాంతి నా పరిచయంతో ఆ మిగతా ముగ్గురు.. భూపతి, రంగారావు, వినోద్ ముఖాల్లో కనిపించలేదు. ఆ ముగ్గురి వదనాల్లో నాకు భయం గోచరించింది.

“గోవింద్ బాబు!.. యీ ఆరుగురిలో సుబ్బారావుగారు సీనియర్. పెదనాన్నగారు యీ యూనిట్‌ను స్థాపించినప్పుడు చేరారు. యీ కన్‌స్ట్రక్షన్ డివిజన్ డెవలప్‍మెంటుకు ఎంతగానో కృషి చేశారు. రవిబాబుగారు బాధ్యతలను చేపట్టిన తర్వాత.. వీరి సలహాలను వారు పాటించలేదు. ఫలితంగా యూనిట్‍కు నష్టాలు వాటిల్లాయి. రెండు సంవత్సరాలుగా కన్‌స్ట్రక్షన్ డివిజన్ లాస్‍లో వుంది. వీరి తర్వాత సీనియర్ ఖాసింఖాన్, వారు యీ యూనిట్ వృద్ధికి ఎంతగానో శ్రమిస్తున్నారని చెప్పి తీరాలి. వీరిరువురూ డి.జి.యం.లు. మిగతా నలుగురూ చేరి రెండు సంవత్సరాలయింది. వారు ప్రాజెక్టు మేనేజర్లుగా వున్న ప్రాజెక్టులలో పనులు సకాలంలో పూర్తి కావడం లేదు. త్రివిక్రమ్ ప్రాజెక్టులు ఫరవాలేదు. వీరి క్రింద పనిచేసే జూనియర్ స్టాప్.. బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని నాకు తెలిసింది. యిక మీరు ఎవరెవరికి ఏ సలహాలు యిస్తారో యివ్వండి” రామసుబ్బయ్య గారు వారి ప్రసంగాన్ని ముగించారు. అందరూ వారిని ఆశ్చర్యంగా చూచారు. “జంటిల్మెన్!.. ఫైనాన్సు మేనేజర్ గారు చెప్పింది అందరూ శ్రద్ధగా విన్నారనుకొంటాను. మీరు నడుపుతున్న ప్రాజెక్టులలో.. బాధ్యతాయుతంగా వర్తించే వారిని, బాధ్యతా రహితంగా ప్రవర్తించే వారిని వేరుగా రెండు లిస్టులుగా తయారు చేయండి. యీ పనిని మిమ్మల్ని ఎందుకు చేయమంటున్నానంటే.. నిర్వహించవలసిన కార్యాలకు పూర్తి జవాబుదారీ మీరే. మీరు మీ బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలంటే.. మీ కనుసన్నలో వర్తించే వ్యక్తులు మీకు ఎంతైనా అవసరం. మీ ముందు ఒకటి మాట్లాడి మీ వెనుక వేరే రీతిగా వర్తించే వారి చర్యల ఫలితం మీకూ చెందుతుంది. అది మంచైనా కావచ్చు, చెడు అయినా కావచ్చు. మ్యానేజ్‍మెంటుకు జవాబు చెప్పవలసింది మీరే.

కనుక.. యోగ్యత లేని వారిని గురించి నిష్పక్షపాతంగా మాకు.. మీరు తెలియజేయాలి. మీ బాగు, గుర్తింపు అందులోనే వుంటుంది.

తర్వాత.. మీరు చూచే ప్రాజెక్టుల మొత్తం వ్యాల్యూ.. యింతవరకూ అయిన పని వ్యాల్యూ, బిల్స్ చేసిన, చేయవలసిన వ్యాల్యూ.. మిగతా పని.. దానికి అయ్యే ఖర్చు.. పి.సి.ఎ, ప్రాజెక్టు కాస్ట్ అనలైజేషన్.. వివరాలను ప్రాజెక్టుల వారీగా స్టేట్‍మెంట్లు వేసి, రేపు మధ్యాహ్నం మూడు గంటలకు మీరు నన్ను కలవాలి. అందరూ ఒక్కసారి కాదు. ఒకరి తర్వాత ఒకరు. నేను చెప్పింది చేసి నన్ను మీలో ఎవరెవరు ముందుగా కలుస్తారో.. దాన్ని బట్టి మీ తత్వం నాకు అర్థం అవుతుంది. నీతి నిజాయితీ లేనివాళ్ళు.. నాతో కలిసి పని చేయలేరు. ధ్యాంక్యూ ఆల్. యు విల్ మీట్ టుమారో ఫ్రమ్ త్రీ పి.ఎమ్.. ఆన్ వర్డ్స్. నవ్ ఉయ్ ఆల్ విల్ అటెండ్ అవర్ డ్యూటీస్. బై..” నేను కుర్చీ నుంచి లేచాను. అందరూ నన్ను ఆశ్చర్యంగా చూచారు.

“సార్!.. అన్ని ప్రాజక్టులకు సంబంధించిన, మీ దగ్గర వున్న వివరాలు తీసుకొని రండి. చూద్దాం” అన్నాను రామసుబ్బయ్యగారితో.

“అలాగే బాబూ. పది నిముషాల్లో వస్తాను” వారు వారి గదికి వెళ్ళిపోయారు. నేను నా క్యాబిన్‍కు వచ్చాను. కొన్ని క్రెడిటార్ బిల్సు రామసుబ్బయ్య గారు ఓ ఫైల్లో వుంచి నా టేబులు మీద వుంచారు. వారు నాకా విషయాన్ని పాలకేంద్రం దగ్గర చెప్పారు.

అన్ని బిల్సును చూచి సంతకాలు చేయడం ప్రారంభించాను. రామసుబ్బయ్య గారు ఆరు ఫైళ్ళతో నా గదికి వచ్చారు.

“అన్ని వివరాలూ ప్రాజక్టు వారిగా యీ ఫైల్సులో వున్నాయి బాబు. మీరు చూడండి.” ఫైళ్ళను టేబుల్ మీద వుంచారు.

నేను సంతకాలు చేసిన బిల్సును వారికి యిచ్చాను. “వీటికి చెక్సు వ్రాయాలి బాబూ!” అన్నారు.

“వ్రాయండి” అన్నాను.

వారు ఆ ఫైళ్ళను తీసుకొని వెళ్ళిపోయారు. పెద్దమ్మ శ్యామల ఫోన్ చేసింది. ఆ రోజు అంతవరకూ జరిగిన విషయాలను ఆమెకు వివరించాను. చాలా సంతోషించింది.

“నాన్నా.. యీ రోజు నీ చెల్లెళ్ళకు కాలేజీ లీవు. ఆ కారణంగా భోజనాన్ని తీసుకొని వారు బయలుదేరారు. వాళ్ళూ నీతో.. కలసి తింటారట”

“అలాగా!..”

“అవును నాన్నా!..”

తలుపు తట్టిన శబ్దం. “ప్లీజ్ కమీన్”

తలుపు తెరచుకొని నవ్వుతూ రూప దీపలు లోనికి వచ్చారు.

“అన్నయ్యా!.. గుడ్ఆఫ్టర్ నూన్” నవ్వుతూ యిద్దరూ ఒకేసారి అన్నారు. నేను చెప్పగా.. నా ముందు యిద్దరూ కూర్చున్నారు. “గంట ఒకటిన్నర అన్నయ్యా!.. భోంచేసి పని చేసుకో అన్నయ్యా. మేమూ నీతో కలసి తింటాము” అంది రూప.

“అలాగేనమ్మా!..”

చూస్తున్న ఫైళ్ళను ప్రక్కన పెట్టాను. ముగ్గురం కబుర్లు చెప్పుకుంటూ సరదాగా కలసి భోం చేశాము. అనంతరం.. రూప దీపలు యింటికి వెళ్ళిపోబోతూ వుండగా రామసుబ్బయ్యగారు వచ్చి, రవిబాబు తన అకౌంటులో పది లక్షలు వేయవలసిందని పంపిన మెసేజ్‍ని చూపించి “ఏం చేయమంటారు బాబూ!..” విచారంగా అడిగారు. “మామయ్య గారు!.. వాడికి డబ్బు పంపకండి” కోపంగా అంది దీప.

“అన్నయ్య!.. దీప చెప్పినట్టుగా వాడికి డబ్బు పంపకండి” రూప కూడా రోషంగా అంది.

రామసుబ్బయ్యగారు నా వైపు చూచారు. వారిని అడిగి.. రవిబాబు నెంబరుకు ఫోన్ చేశాను. కానీ వాడు లిఫ్టు చేయలేదు. సెల్ ఆఫ్ వుంది. పెద్దమ్మ ఫోన్ చేసింది. తనకూ యిప్పుడే పది లక్షలు తన పర్సనల్ అకౌంటులో వేయవలసినదిగా మెసేజ్ వచ్చినట్లుగా చెప్పి, పాతికవేలు పంపించి యింటికి తిరిగి రమ్మని మెసేజ్ని పంపమంది.

తల్లి మనస్సు.. వాడు తిరిగి వస్తే.. మరోసారి నాతో కలసి వాడికి నచ్చచెప్పి వాడిలో మార్పును చూడాలనే విషయం.. ఆమె నాతో చెప్పిన మాటల్లో.. నాకు అర్థం అయింది.

“పెద్దమ్మ!.. మీరు చెప్పినట్లుగానే పాతికవేలు క్రెడిట్ చేయమని రామసుబ్బయ్య గారికి చెబుతాను. వారు నాకు మెసేజ్ చూపించగానే, మాట్లాడాలని చేశాను. కానీ వాడు సెల్ ఆఫ్ చేశాడు. నేను శనివారం కేరళ వెళుతున్నాను. అక్కడి నుంచి మంగుళూరు వెళ్ళి వాడిని కలిసి మాట్లాడుతాను. నాతో పాటే పిలుచుకొని వచ్చేదానికి ప్రయత్నిస్తాను” అన్నాను.

“సరే నాన్నా!.. అలాగే చెయ్యి” అంది పెద్దమ్మ. సెల్ కట్ చేసింది.

“సార్.. వాడు యిల్లు వదిలి పెట్టి వెళ్ళి ఎంత అయింది?”

“దాదాపు మూడు నెలలు అయింది బాబూ!..” విచారంగా అన్నాడు. రామసుబ్బయ్య. క్షణం ఆగి.. “యీ మూడు నెలల్లో పది లక్షలు ఆయన అకౌంటుకు క్రెడిట్ చేశాము బాబూ!..”

వారు యింకా ఏదో చెప్పబోయి, రూప దీపలను చూచి ఆగిపోయారు. “సరే!.. సార్, పెద్దమ్మ చెప్పినట్లుగా పాతికవేలు పంపండి” అన్నాను. “అన్నయ్యా!.. వాడు ఒంటరిగా వెళ్ళలేదు. యీ ఆఫీస్ లో పని చేస్తున్న వివాహిత దివ్య అనే ఆమెను తనతో తీసుకొని వెళ్ళాడు.” అంది రూప.

“ఆ దివ్య భర్త త్రాగుబోతట. ఏ పనీ చేయడట. డబ్బు డబ్బు అని దివ్యను వేధిస్తూ కొట్టేవాడట. వాడి బాధను భరించలేక.. మన వాడితో లేచిపోయింది” అంది దీప

పిల్లలు యిద్దరూ చెప్పిన మాటలు.. నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి. “అన్నయ్యా!.. యీ ఫోటోను చూడు. మా వదినది. ఆమెకు ఏం తక్కువ” రూప తన హ్యాండ్ బ్యాగ్ నుంచి ఒక ఫోటోను తీసి నా చేతికి అందించింది.

“మా వదిన వసుధ చాలా మంచిదన్నయ్యా!.. మమ్మల్ని ఎంతగానో అభిమానించేది. కానీ వాడు ఆమెకు నరకాన్ని చూపించాడు. త్రాగివచ్చి ఆమెను కొట్టేవాడు.. డబ్బుకోసం.. దివ్య అన్నను ఆశ్రయించింది. వాడు పెట్టే నరకయాతనలను అనుభవించలేక వదిన తన పుట్టింటికి పాపతో.. కట్టుబట్టలతో వెళ్ళిపోయింది.”

రూపా దీపల నయనాల్లో కన్నీరు. వారిని ఆ స్థితిలో చూచిన నా మనస్సు కలత చెందింది.

“అమ్మా!.. బాధపడకండి. యీ ప్రస్తుత పరిస్థితులు త్వరలో తప్పకుండా మారుతాయి. నేను మీకు అన్ని విషయాలకూ అండగా వుంటాను” అనునయంగా చెప్పాను.

 “యిక మేము యింటికి వెళతామన్నయ్యా!..” కన్నీటిని తుడుకొంటూ రూప అంది.

“పదండమ్మా.” ముగ్గురం క్రిందికి వచ్చాము. వారు కార్లో యింటికి వెళ్ళిపోయారు.

పైకి వచ్చి ఆఫీస్‍లో నా గదిలో కూర్చొని రామసుబ్బయ్యగారు యిచ్చిన ఫైల్సును చూడసాగాను. నాన్నగారు ఫోన్ చేశారు. శుక్రవారం బాగుందని యింటికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించానని చెప్పారు.

ఆ రాత్రి.. నేను యింటికి రావడం లేదని శ్యామలరావు మామయ్యతో మాట్లాడి శంకుస్థాపనకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేయిస్తానని నాన్నగారికి చెప్పాను. హారిక ఫోన్ చేసింది. శ్యామలరావు మామయ్య సాయంతో ప్లాన్‍ను అప్రూవల్‍కు లైసెన్స్‌డ్ యింజనీర్ గారి ద్వారా సబ్మిట్ చేసినట్లు చెప్పింది. ఆమెకు నా ధన్యవాదాలను తెలియజేశాను.

రామసుబ్బయ్య గారు దివ్య తన భర్తకు విడాకులిచ్చిందని.. రవి దివ్యను రిజిష్టర్ మ్యారేజ్ చేసికొన్నట్లుగా చెప్పారు. వాడి నిర్ణయాలకు నాకు బాధ, ఆశ్చర్యం రెండూ కలిగాయి. మౌనంగా వారు చెప్పిన వివరాలను విన్నాను. శనివారం సాయంత్రం నేను, నాగరాజు, సుబ్బలక్ష్మి కేరళకు వెళ్ళబోతున్నామని వారికి చెప్పాను. బుధవారం వుదయానికల్లా వారిని మంగుళూరికి, రవిని కలిసేదానికి రమ్మని చెప్పాను.

రాత్రి ఎనిమిది గంటలదాకా ఆ ఫైల్సు అన్నింటినీ చూచాను. వివరాలను నా ల్యాప్‍టాప్‍లోకి ఎక్కించాను. పెద్దమ్మకు చెప్పి.. శంకుస్థాపన విషయాన్ని గురించి మాట్లాడేదానికి రాఘవ యింటికి వెళ్ళాను. నాన్నగారు వారికీ ఫోన్ చేసి చెప్పినందున నా కంటే ముందు మామయ్యగారు, ఆ శంకుస్థాపన విషయానికి సబంధించిన చేసిన ఏర్పాట్లను గురించి వారు నాకు వివరించారు.

ఆ రాత్రి రాఘవ రూమ్‍లో పడుకొన్నాను. మనస్సులో ఆఫీసులో వున్న సమస్యలు, రవిబాబు ప్రవర్తన, వాడి కారణంగా శ్యామల పెద్దమ్మ, రూపదీపల ఆవేదన.. ఒకదాని తర్వాత మరొకటి ప్రతిబింబించాయి.

ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి ఆఫీస్ డబ్బును కాజేసిన వారిని టెరిమినేట్ చేయాలని నిర్ణయించుకొన్నాను. రవిగాడిని కలిసి వాడి తల్లి చెల్లెళ్ళ ఆవేదనను తెలిపి.. వాడి తత్వాన్ని మార్చి వూరికి తీసికొని రావాలనుకొన్నాను. మొదటిది నా చేతిలో పని. రెండవది నా చేతిలో లేనిది. రవిగాడి నిర్ణయాన్ని బట్టి వుంటుంది. నా ప్రయత్నం నేను సవ్యంగా చేయాలని తీర్మానించుకొన్నాను. యీ కలవరంతో ఎప్పుడు నిద్రపోయానో నాకు తెలియదు.

ఉదయం.. తొమ్మిదిన్నరకు ఆఫీసు వెళ్ళాను. సుబ్బారావుగారు, ఖాసింఖాన్ అదే సమయానికి వచ్చారు. నేను కోరిన విధంగా వారు తయారుచేసిన స్టేట్మెంట్లు నాకు చూపించారు. వారిరువురూ ఆరు ప్రాజెక్టులను చెరో మూడుగా చూస్తున్నారు. రామసుబ్బయ్య గారు నాకు యిచ్చిన వివరాలకు, వారు యిచ్చిన వివరాలకూ ఎలాంటి తేడా లేదు. ఆ ప్రాజెక్టులన్నింటిలో దాదాపు మూడు వంతుల పని పూర్తియింది. ఆ కారణంగా ఆరు ప్రాజెక్టులనూ ఖాసింఖాన్ గారిని చూచుకో వలసిందిగా నిర్ణయం తీసికొని, ఆ విషయాన్ని రామసుబ్బయ్యగారికి, ఖాన్ గారికి చెప్పాను. వారు నా నిర్ణయాన్ని ఆమోదించారు.

సుబ్బారావుగారిని మిగతా అన్ని ప్రాజెక్టులను కో ఆర్డినేటర్ ప్రపోజ్ చేశాను. వారు, సుబ్బారావుగారు అందుకు ఆమోదించారు.

వారిరువురూ బాధ్యతారహితంగా వర్తించే వారి జూనియర్స్ నలుగురి పేర్లను సూచించారు. రామసుబ్బయ్యగారి అభిప్రాయాన్ని అడిగాను. వారూ ఆ నలుగురిని గురించి మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు.

“సార్.. ‘‘ఆ చెడ్డ కోతి వనమెల్ల చెరిచే’‘ యీ సామెత మీ కందరికీ తెలిసిందే. అటువంటివాడు టీమ్.. వుంటే, మంచివారు కూడా చెడిపోవచ్చు. కాబట్టి వారిని పిలిపించండి. రిజైన్ చేయమని చెప్పండి. వారుగా రిజైన్ చేసి వెళ్ళిపోతే, కంపెనీ నచ్చక వెళ్ళిపోయారనుకొంటారు. మనంగా టెర్మినేట్ చేస్తే.. అది వారికి బ్లాక్ మార్కవుతుంది. మనం ఎవరి భవిష్యత్తును చెరచడం నాకు యిష్టం లేదు. వారికి యివ్వవలసిన డబ్బును లెక్క చూచి వారికి పంపించండి. యీ సంఘటన ద్వారా.. వారు, వారి తప్పులను తెలుసుకోవడానికి, యిక ముందు చేయకుండా వుండేదానికి మనం వారికి సాయం చేసిన వారిమవుతాము. ధర్మబద్ధంగా పది మందికి సాయం చేయడం నా లక్ష్యం” నా అభిప్రాయాన్ని మరోసారి.. వారికి తెలియజేశాను.

మిగతా నలుగురిలో త్రివిక్రమ్ ముందుగా వచ్చాడు ఆ ఆరుగురిలో అతనే చిన్నవాడు. అతని ప్రాజెక్టు స్టార్ట్ చేసి మూడు మాసాలయింది. అతను అన్ని వివరాలను క్లీన్‍గా ప్రజెంట్ చేశాడు.

మిగిలింది.. భూపతి, రంగారావు, వినోద్.. ముగ్గురూ కలసి ఒకేసారి వచ్చారు. భూపతి, రంగారావులు.. వారు తయారు చేసిన స్టేట్‍మెంట్లతో పాటు.. రిజైన్ లెటర్లు కూడా యిచ్చారు. వారిరువురినీ చార్జి.. సుబ్బారావుగారి హ్యాండోవర్ చేయవలసిందిగా చెప్పాను. వారి రిజగ్నేషనన్ను ఆమోదించాను. నా నిర్ణయానికి వారి ముఖాలు తెల్లబోయాయి. వారు యిచ్చిన పేపర్లను సుబ్బారావుగారికి యిచ్చి చెక్ చేయవలసిందిగా చెప్పి ఆ ముగ్గురినీ వేరే గదికి వెళ్ళమన్నాను.

యిక మిగిలింది వినోద్. అతని క్రింద వున్న స్టోర్ అసిస్టెంట్ సరిగా పనిచేయడం లేదని.. యిసుక, కంకరలకు దొంగ బిల్సు యిస్తున్నాడని.. ఆ కారణంగా తన ప్రాజెక్టు లాస్లో పోతూ వుందని చెప్పాడు. వాడు భూపతి మేనల్లుడనీ తెలిపాడు. వాడికి టెరిమినేషన్ యిచ్చి.. సుబ్బారావుగారి ప్రాజెక్టులో పనిచేసే మరో అసిస్టెంటును శ్రీ వినోద్ ప్రాజెక్టుకు ప్రమోషన్ మీద స్టోర్స్ యిన్ఛార్జిగా ఆర్డర్స్ రిలీజ్ చేశాను. వినోద్ చాలా సంతోషించాడు. యితను త్రివిక్రమ్ దాదాపు ఒక వయస్సువారే.

సుబ్బారావుగారు చెక్ చేయగా.. దొంగ బిల్లులను అకౌంట్ చేసిన కారణంగా భూపతి, రంగారావులకు.. యివ్వవలసిన ఒక వెల జీతం కూడా యిచ్చే దానికి వీలు కాలేదు. మెడికల్ బిల్సు, యల్.టి.పి. బోసన్ కూడా యిచ్చే దానికి లేదని చెప్పారు రామసుబ్బయ్య.

సుబ్బారావుగారు వారితో, వారు చూచే లోకల్ సైట్లన్నింటినీ చూచి వచ్చి.. ఛార్జి పేపర్ల మీద సంతకాలు చేశారు.

నో డ్యూ స్టేట్మెంటు మీద సంతకాలను తీసుకొని.. వారిరువురినీ రిలీవ్ చేశాను. అనుభవం వున్న యింజనీర్సు.. కావాలని పేపర్లో యాడ్ వేయవలసిందిగా రామసుబ్బయ్యగారికి చెప్పాను.

రామసుబ్బయ్య సుబ్బారావుగార్లతో బయలుదేరి దగ్గరలో వున్న ఆరు సైట్లను విజిట్ చేశాను. స్టోర్స్ ఇన్‍ఛార్జి టెరిమినేషన్.. భూపతి రంగారావుల రిజిగ్నేషన్.. రిలీవింగ్, వార్త అన్ని సైట్లలో అందరికీ తెలిసింది సెల్ ఫోన్ మహిమతో.

ఒక సైట్లో కాంక్రీటింగ్ జరుగుతున్నందున సుబ్బారావుగారు అక్కడే వుండిపోయారు. నేను రామసుబ్బయ్యగారూ ఆఫీసు ఏడుగంటలకు చేరాము. రామసుబ్బయ్యగారు చెప్పగా, సుబ్బారావుగారి అల్లుణ్ణి టింబర్ షాప్ ఇన్‍ఛార్జిగా ప్రమోషన్ మీద ట్రాన్స్‌ఫర్ చేశాను.

ఆఫీసులో మా యిరువురి మధ్యనా.. లాస్టియర్ టర్నోవర్ గురించి, ప్రాజెక్టువైజ్ ప్రాఫిట్.. లాస్ల గురించి సంభాషణ జరిగింది. టైమ్ ఎస్టేషన్.. సైట్ హ్యాండోవరింగ్ డిపార్టుమెంటు వల్ల అయిన ఆలస్యం.. ఎస్కలేషన్ క్లాజ్ అగ్రిమెంటులో వుందా లేదా అనే విషయాలను గురించి.. ఆర్బిట్రేషన్కు వెళ్ళవలసిన ప్రాజెక్టుల గురించి, అడిషనల్ క్లయిమ్స్ గురించి.. ప్రాజెక్టు వారీగా వివరంగా చర్చించాము. ఆఫీస్ లో కూర్చొని వీటన్నింటినీ అగ్రిమెంట్లను చూచి సక్రమంగా పనిచేసేదానికి ఒక సీనియర్ పర్సన్ కావాలని, నాకు తోచిన అభిప్రాయాన్ని రామసుబ్బయ్యగారికి చెప్పాను. వారు ముకుందరావు అనే రిటైర్డ్ యస్.సి. పేరును సూచించారు. వారి నెంబర్ రామసుబ్బయ్యగారి వద్ద వున్నందున ముకుందరావుగారితో మాట్లాడి మా ఉద్దేశాన్ని వారికి తెలియజేశాను. వారిని జి.యం. ప్రాజెక్టుగా తీసుకోవాలని మేమిరువురం నిర్ణయించుకొని ఆర్డర్ తయారు చేయవలసిందిగా రామసుబ్బయ్యగారికి చెప్పాను.

(ఇంకా ఉంది)

Exit mobile version