[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘ప్రేమేగా ప్రపంచం’ అనే నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]
[రుక్మిణమ్మ తన కోడలికి విడాకులిప్పించి, కొడుకు నాగరాజుకి మళ్ళీ పెళ్ళి చేయాలనుకుంటుంది. ఈ విషయమై గోవిందని సలహా అడుగుతుంది. ఈలోపు ఓల్డ్ బాయిస్ అసోసియేషన్ మెంబర్స్ వచ్చారని, అందరూ నీ కోసం ఎదురుచూస్తున్నారని వసంత ఫోన్ చేస్తుంది. దాంతో నాగరాజును వెంటబెట్టుకుని ఇంటికి బయల్దేరుతాడు గోవింద. ఇంటికి మిత్రులను పలకరించి, తోటలో కూర్చోబెట్టి, హెడ్‍మాస్టార్ రామకోటయ్యగారిని తీసుకురమ్మని గోపాల్‍ని పంపిస్తాడు. ఓల్డ్ బాయిస్ అసోసియేషన్ సభ్యులు సమావేశమవుతారు. ప్రెసిడెంట్ సునీల్ – అంతకు ముందే, సమావేశానికి రాలేనని కబురుపెట్టి, జమాఖర్చుల పుస్తకం గోపాల్‍కి కొరియర్ ద్వారా పంపుతాడు. తనపై అనుమానాలు వ్యక్తమైనందుకున తాను ప్రెసిడెంటుగా రాజీనామ చేస్తున్నానని లేఖ ద్వారా తెలుపుతాడు. చీటీల ద్వారా నాగరాజును కొత్త ప్రెసిడెంటును ఎన్నుకుంటారు. జమాఖర్చులను చెక్ చేసి, స్టేట్‍మెంట్ తయారు చేయమని నాగరాజుకి చెప్తాడు గోవింద. సమావేశం ముగుస్తుంది. అందరూ వెళ్ళిపోతారు. నాగరాజు కూడా బయల్దేరుతుంటే, ఆ శనివారం తమ కేరళ ప్రయాణం గురించి గుర్తు చేస్తాడు గోవింద. మర్నాడు ఉదయాన్నే లేచి తయారై కారులో నెల్లూరులోని శ్యామలమ్మ ఇంటికి వెళ్తాడు. ఆవిడనీ, వాళ్ళ అమ్మాయిలని పలకరిస్తాడు. ఆవిడ తమ సంస్థల వివరాలన్నీ చెబుతుంది. కాసేపటికి ఎకౌంట్స్ మేనేజర్ రామసుబ్బయ్య వచ్చి శ్యామలమ్మకి, గోవిందకి నమస్కరిస్తాడు. ఆయన తెచ్చిన పత్రాలలో గోవిందని ఎం.డి. నియమిస్తున్న ఆర్డర్, కంపెనీని నడిపడానికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఉంటాయి. కాసేపటి తర్వాత శ్యామలమ్మ, గోవింద, రామసుబ్బయ్య ఆఫీసుకి చేరుతారు. చైర్‌పర్సన్ హోదాలో గోవిందని ఎం.డి.గా నియమించినట్టు చెప్పి, అందరికీ గోవిందని పరిచయం చేస్తుంది శ్యామలమ్మ. అందరం కల్సి సంస్థ అభివృద్ధికి పాటుపడదామని చెప్తాడు గోవింద. సమావేశం ముగిసి సిబ్బంది తమ పనలకు వెళ్తారు. మరికొన్ని జాగ్రత్తలు చెప్పి, శ్యామలమ్మ వెళ్ళిపోతుంది. ఆఫీసునంతా జాగ్రత్తగా పరిశీలించిన గోవింద, వాస్తుకు అనువుగా కొన్ని మార్పులు చేయించమని సూచిస్తాడు. మధ్యాహ్నం నాయర్ ఫోన్ చేస్తే, శనివారం బయల్దేరుతున్నట్లుగా చెప్తాడు. మధ్యాహ్నం బయల్దేరి రామసుబ్బయ్యతో కల్సి టింబర్ యార్డ్‌కి వెళ్తాడు గోవింద. అక్కడ జరుగుతున్న అవకతవలని గమనించి అక్కడి బాధ్యుడు వీరయ్యని హెచ్చరిస్తాడు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకి వచ్చి తనని ఆఫీసులో కలవమంటాడు. ఇంతలో వసంత ఫోన్ చేసి తమని పికప్ చేసుకోమంటుంది. – ఇక చదవండి.]
“తప్పకుండా అమ్మా. ఎక్కడ వున్నారు?..”
“గాంధీ బొమ్మ దగ్గర”
“నీతోటే గోపాల్ వున్నాడా!..”
“వున్నాడన్నయ్యా!..”
“సరే, నేను అక్కడికి అరగంట లోపల వచ్చేస్తాను. సరేనా!..”
“అలాగే అన్నయ్య!..” అంది వసంత.
“ఆ.. సార్ యిక మనం బయలుదేరుదాం. గంట ఐదుంకాలు. నా తమ్ముడు చెల్లెలూ నాకోసం వెయిట్ చేస్తూ వున్నారు.” వీరయ్య గారి వైపు చూచి.. “వీరయ్యగారూ!.. చెప్పినవన్నీ గుర్తు వున్నాయిగా.. ఎల్లుండి మూడు గంటలకు మీరు నన్ను ఆఫీస్‌లో కలవాలి” అన్నాను.
“సరే సార్!..” మెల్లగా అన్నాడు వీరయ్య
నేను రామసుబ్బయ్య, టింబర్ యార్డ్ నుంచి బయలుదేరాము.
“మీ మాటలకు వాడు హడలిపోయాడు సార్.. యిలాంటి అనుభవం వాడు జీవితంలో యింతకుముందెన్నడూ చూడలేదు.” నవ్వుతూ అన్నారు రామసుబ్బయ్య.
నాకూ నవ్వు వచ్చింది.
“సార్!..”
“ఏమిటి సార్!..”
“నేను మీకన్నా చాలా చిన్నవాణ్ణి. పైగా మనం బంధువులం. మీరు నన్ను.. గోవింద్ అని పిలవండి. ‘సార్’ అని పిలుస్తుంటే నాకు వినడానికి అదోలా వుంది” అన్నాను. వారు నా ముఖంలోకి చూచి స్వచ్ఛంగా నవ్వారు.
“అలాగే బాబూ!..” అన్నారు.
కారు గాంధీ బొమ్మను సమీపించింది. వారు కారు దిగి దగ్గరలో వున్న ఆఫీసు వెళుతున్నానని చెప్పి వెళ్ళిపోయారు. నా తమ్ముడు చెల్లి కార్లో కూర్చున్నారు. మా కారు ఆత్మకూరు బస్టాండును సమీపించింది.
“అన్నయ్యా!.. కారును ఆపు.” అంది వసంత.
“ఎందుకమ్మా!..”
“హారిక అన్నయ్య!..”
“ఏదీ?..”
“అటు చూడు. బస్సు కోసం వెయిట్ చేస్తూ వుంది. మనతో తీసుకొని వెళదాం” అంది.
నేను వసంత చెప్పిన తూర్పు వైపుకు చూచాను. హారిక కనిపించింది. “గోపాల్.. వెళ్ళి ఆమెను పిలుచుకొనిరా!..” కారు ప్రక్కగా ఆపాను.
గోపాల్.. కారు దిగాడు. హారిక వైపుకు నడిచాడు.
“అన్నయ్యా!.. నేను ఒక మాట అడుగుతాను. నీవు నిజం చెప్పాలి” నవ్వుతూ అంది వసంత.
“ఏమిటమ్మా!..” వెనక్కు తిరిగి ఆమె ముఖంలోకి చూచాను.
“హారిక వదిన చాలా అందంగా వుంటుంది కదూ!..”
ఆమె మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. యీ ప్రశ్నను యీమె నన్ను ఎందుకు అడిగినట్లు?..
“జవాబు చెప్పన్నయ్యా!..”
“ఆడవాళ్ళ గురించి కామెంట్ చేయడం నాకు యిష్టం లేదురా..” అనునయంగా అన్నాను.
“నీవు నిజం చెప్పడం లేదు!..” చిరుకోపంతో నా భుజాన్ని తట్టింది వసంత.
“నీకు ఎలా అనిపిస్తూ వుంది?..” అడిగాను.
“నీ యీ ప్రశ్నకు జవాబు నా ప్రశ్నలోనే వుందన్నయ్యా!..” నవ్వుతూ చెప్పింది వసంత.
హారిక.. గోపాల్ కారును సమీపించారు.
“గోపాల్ అన్నయ్యా!.. నీవు నా ప్రక్కకు రా!..” అంది వసంత. గోపాల్ మారు మాట్లాడకుండా వెనక సీట్లో వసంత ప్రక్కన కూర్చున్నాడు. హారిక నిలబడి నా వైపు చూచింది.
“రండి.. కూర్చోండి.” ఆమె ముఖంలోకి చూస్తూ.. అన్నాను. ఆమె మనస్సులో సందేహం.
“వదినా!.. ట్రాఫిక్ వున్నాం. త్వరగా కూర్చో” అంది వసంత.
హారిక డోర్ తెరిచి లోన నా ప్రక్కన కూర్చుంది. నేను కారును స్టార్ట్ చేశాను. ఓరకంట నా ముఖంలోకి చూచి అద్దం గుండా రోడ్డును చూస్తూ వుంది హారిక.
“వదినా రేపు నీకు లీవా?..”
“అవును”
“శ్రావణ మాసం కదా!.. అమ్మ లీవు పెట్టమంది”
“ఓహో హౌస్ క్లీనింగ్ అన్నమాట” నవ్వుతూ అంది వసంత. క్షణం తర్వాత.. “వదినా!..” అంది.
“చెప్పు వసంతా!..”
“ముందు కూర్చోవడంలో నీకేం యిబ్బంది లేదుగా!”
అద్దాన్ని సరిచేసి ఆమె ముఖంలోకి చూచాను. కొంటెగా నవ్వుతూ అంది.
ఆమె నవ్వును చూచి నాకూ నవ్వొచ్చింది.
ఆమెను “అమ్మ నీకు చిన్నప్పుడు వస జాస్తిగా పోసింది వసంతా!..” నవ్వుతూ అన్నాను.
“అవునన్నయ్యా!.. నీవు చెప్పేది నిజం. మోటర్ సైకిల్లో వెనక కూర్చొని నడిపినంతసేపు నా చెవులను కొరుకుతూనే వుంటుంది.”
“ఏయ్!..” గోపాల్‍ని బెదిరించింది వసంత వారి మాటలకు హారికకు నవ్వు వచ్చింది. బయటికి వ్యక్తం కానీయకుండా ఆపుకొంది.
“నవ్వు వస్తే నవ్వాలి వదినా.. అదిమి ఆపకూడదు. అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. సరదాగా ఎంతగా నవ్వితే అంత మంచిది వదినా!.. యీ విషయం నీకు తెలీదా వదినా!..” ముందుకు వంగి హారిక ముఖంలోకి చూస్తూ నవ్వింది వసంత.
‘వూరుకో’ అన్నట్లు గోపాల్ వసంత తలపై తట్టాడు.
“అన్నయ్యా!.. యీ చిన్నోడికి చేయి దురుసు” కోపంగా గోపాల్.. ముఖంలోకి చూచింది.
“గోపాల్..” మందలింపుగా అన్నాను.
“నేనేం చేయలేదన్నయ్యా. పాపం హారిక మన మధ్య మూగదానిలా వున్నందున, వూరుకో అని తల మీద తట్టాను. అంతే” నవ్వుతూ హారికను చూస్తూ అన్నాడు గోపాల్.
హారిక.. గోపాల్ ముఖంలోకి చూచింది.
“ఆ యింజనీర్ గారూ!.. మా యింటి ప్లాను కంప్లీటు చేశారా?” నవ్వుతూ అడిగాడు.
“అవునవును. చెప్పు వదినా?..”
“ఏం చెప్పేది?” అంది హారిక.
“ఏదైనా కథ” నవ్వాడు గోపాల్ మరుక్షణంలోనే..
“నేను అడిగింది మీకు వినిపించలేదా!..” అన్నాడు నవ్వుతూ.
“మా యింటి ప్లాన్ ముగిసిందా అని చిన్నఅన్నయ్య అడిగాడు వదినా!..” లాలనగా అంది వసంత. యిరువురూ ఒకరిముఖాలు ఒకరు చూచుకొని నవ్వుకున్నారు.
“ముగిసింది” మెల్లగా అంది హారిక.
“అన్నయ్యా!.. మా వదినగారు శుభవార్త చెప్పారు వెంటనే ట్రీట్ యివ్వాలి” నవ్వుతూ అంది వసంత.
“ట్రీటా!..” ఆశ్చర్యంగా అడిగాను. ఆమె వైపుకు తిరిగి
“యిది రాజుపాలెం. యిక్కడ ట్రీట్‌కు తగిన హోటళ్లు ఎక్కడున్నాయ్?..” అన్నాను.
“పడమటి వైపు చూడు” అంది వసంత.
ఆ వైపు చూచాను. టీ బంకు కనిపించింది.
“మంచి టీ త్రాగించు అన్నయ్యా!..” అంది వసంత.
కారును ప్రక్కగా నిలిపి నలుగురం కారు దిగాము. బంకును సమీపించాము.
గోపాల్ టీ ఆర్డర్ యిచ్చాడు.
“హారికా!.. మాతో ప్రయాణం నీకు బోరుగా వుంది కదూ!..” గోపాల్ అడిగాడు.
“లేదు” నవ్వుతూ అంది హారిక.
“బిస్కెట్స్ ఏమైనా తింటారా!..” అడిగాను.
“వద్దు.” అంది హారిక.
“నాకు కావాలి” అంది వసంత.
గోపాల్ లోనికి వెళ్ళి ఎనిమిది బిస్కెట్స్ ప్లేట్లో తెచ్చాడు.
వసంత నాలుగు తీసుకొంది. రెండు హారికకు అందిస్తూ- “వదినా!.. సిగ్గుపడకు. మొహమాటపడకు. మా అన్నయ్యలు చాలా మంచివాళ్ళు. ఏమీ తప్పుగా అనుకోరు.” నవ్వుతూ బలవంతంగా హారిక చేతిలో పెట్టింది.
నా వంక క్షణం సేపు చూచి హారిక వాటిని తీసుకొంది.
“తిను. టీ త్రాగి త్వరగా యింటికి వెళదాం” అంది వసంత.
హారిక తినడం ప్రారంభించింది. షాపు కుర్రాడు దీని అందించాడు. నలుగురుం త్రాగాము. గోపాల్ వారికి డబ్బులిచ్చాడు. కారును సమీపించాము.
“నేను మా పెద్దన్నయ్య పక్కన కూర్చుంటాను. వదినా నిర్భయంగా నీవు వెనక కూర్చో” అంది వసంత. హారిక వెనక సీట్లో కూర్చుంది. ఆమె ప్రక్కన గోపాల్, నేను వసంత ముందు. మా కారు మా వూరి వైపుకు త్రిప్పాను. వెనక కూర్చున్న హారిక నన్ను చూస్తూ వుంది.
నా ముందున్న అద్దంలో నేను ఆమె చూపులను గమనించాను. గోపాల్.. ఆమెను చూస్తున్నాడు.
నా ప్రక్కన కూర్చొని వున్న నా చెల్లి.. “వదినా!.. నీకు డ్రైవింగ్ వచ్చా” అడిగింది
“వచ్చు”
“యీ కారును నడపగలవా?”
“నడుపుతాను”
“మా అన్నయ్య డ్రైవింగ్ ఎలా వుంది?”
హారిక వెంటనే జవాబు చెప్పలేదు.
“హారికా! నా చెల్లి అడిగిన ప్రశ్న మీకు వినిపించిందా!..” నవ్వుతూ అడిగాడు గోపాల్.
“చాలా బాగుంది వసంత” గోపాల్‍ని చూస్తూ అంది హారిక. అద్దంలో కనిపించే నా ముఖాన్ని క్షణంసేపు చూచింది.
గోపాల్ బిగ్గరగా నవ్వాడు హారికను చూస్తూ.
“ఆ మాటను చెప్పేదానికి అంతగా ఆలోచించాలా!..” నవ్వుతూనే అన్నాడు.
“ఒకరిని గురించి చెప్పేటప్పుడు, కొన్నిక్షణాలు ఆలోచించి నా ఉద్దేశాన్ని చెప్పడం నా అలవాటు” అంది హారిక.
“గుడ్ హ్యాబిట్, కదా అన్నయ్యా!..” నవ్వుతూ నన్ను అడిగింది వసంత.
“వెరీగుడ్ హ్యాబిట్” నాకు తోచిన జవాబును నేను చెప్పాను.
“వదినా!.. మా పెద్దన్నయ్య ఎప్పుడూ అబద్దం చెప్పడు”
“మరి మీ చిన్నన్నయ్యా!..” గోపాల్‍ని చూస్తూ అడిగింది హారిక.
“అన్నయ్య లాగానే.” హారిక ముఖంలోకి కొంటెగా చూస్తూ.. చెప్పాడు గోపాల్.
వాడి మాటల్లో వాడు హారికను ఆట పట్టిస్తున్నాడని నాకు అర్థం అయింది.
“అన్నయ్యా!.. కారును ఆపు” అంది వసంత.
“ఎందుకమ్మా!..”
“మీరు వెనక కూర్చోండి. వదిన డ్రైవ్ చేస్తుంది. ఆమె ఎలా డ్రైవ్ చేస్తుందో నేను చూడాలి.”
“తప్పదంటావా!..” నవ్వుతూ అడిగాను.
“అన్నయ్యా ప్లీజ్..” అంది వసంత.
నేను కారును ఆపాను. దిగాను. హారికా కారు దిగింది. ముందుకు వచ్చి నా పూర్వ స్థానంలో కూర్చుంది. నేను వెనక్కు వెళ్ళి గోపాల్ ప్రక్కన కూర్చున్నాను. హారిక కారును స్టార్ట్ చేసింది. ఆమె డ్రైవింగ్ పర్ఫెక్టు. నా సెల్ మ్రోగింది. నెంబర్ చూచాను. అది నాగరాజు కాల్. వూరికి వస్తున్నావా అని అడిగాడు. వస్తున్నట్లు చెప్పాను. మా అసోసియేషన్ జమా ఖర్చులు చెక్ చేసినట్లు చెప్పాడు. ఖర్చుకు సంబంధించి పదిహేను లక్షల్లో మాష్టారుగారికి సునీల్ యిచ్చింది పదకొండు లక్షలేనట. నాలుగు లక్షలు యీ మూడేళ్ళల్లో సునీల్ గాడు నొక్కేశాడని చెప్పాడు. నేను విన్న వార్త నిజం అని నాకు తెలిసింది. వెంటనే వచ్చి నన్ను కలవవలసిందిగా సునీల్‍కు మెసేజ్ పంపాను.
“వదినా!..నీ డ్రైవింగ్ సూపర్. అచ్చం మా అన్నయ్య లాగానే నడుపుతున్నావు. సెంట్ పర్సంట్ మార్కులు యిస్తున్నాను” నవ్వుతూ అంది వసంత.
కారు హారిక యింటి ముందు ఆగింది. తను దిగింది.
“గంటలో ప్లాన్ తీసికొని వస్తానని మామయ్యకు చెప్పండి” అంది. ఆమె యింట్లోకి వెళ్ళింది.
వసంత డ్రైవ్ చేయగా మేము మా యింటికి చేరాము.
మేము ముగ్గురం యింట్లోకి ప్రవేశించాము. అమ్మనాన్నలు హాల్లో కూర్చొని వసంత వివాహాన్ని గురించి మాట్లాడుకొంటున్నారు.
“గోవిందా!.. మీ మామయ్య ఫోన్ చేశాడు. నిశ్చితార్థానికి వివాహానికి ముహూర్తాలు పెట్టించారట పై నెల ఆరవతేదీన నిశ్చితార్థం. శ్రావణమాసం అంటే.. ఆగస్టు ఆరవ తేదీన వివాహం” నవ్వుతూ చెప్పారు నాన్నగారు.
వసంత అమ్మా నాన్నలను రెండు క్షణాలు చూచి తలవంచుకొని తన గదికి వెళ్ళిపోయింది.
“మంచిది నాన్నా!.. నాకు చాలా సంతోషంగా వుంది”
గోపాల్ నా ముఖంలోకి చూచాడు. వాడు ఏదో చెప్పాలనుకొంటున్నాడని నాకు తోచింది. “గోపాల్.. నీవేం మాట్లాడవేం?..”
“వసంత నిర్ణయాన్ని తెలిసికోవడం మన బాధ్యత కదా అన్నయ్యా!..” మెల్లగా చెప్పి అమ్మానాన్నల ముఖంలోకి చూచాడు.
అమ్మా నాన్నలు.. గోపాల్ ముఖంలోకి ఆశ్చర్యంగా చూచారు.
“అమ్మా!.. యిది మీ కాలం కాదు. కాలం మారింది. యీ కాలం ఆడపిల్లలకు స్వతంత్ర భావాలున్నాయి. వివాహం అనేది నూరేళ్ళ పంట కదా అమ్మా!.. యీ సంబంధాన్ని గురించి మీరు వసంతను అడిగారా!.. ఆమె ఉద్దేశాన్ని తెలుసుకొన్నారా!.. రాఘవ మన బంధువే. కానీ.. బంధుత్వం వేరు.. వివాహం వేరు. వసంత చాలా అమాయకురాలమ్మా. ఆమె యిష్టప్రకారమే ఆమెకు నచ్చిన వాడితో ఆమె వివాహం జరగాలి” ఎంతో ఆనునయంగా చెప్పాడు గోపాల్.
“గోపాల్.. రాఘవంటే వసంతకు యిష్టం లేదనా నీ అభిప్రాయం?..” నాన్నగారు అడిగారు.
నాకు గోపాల్ చెప్పిన మాటలు యథార్థాలుగా తోచాయి. వసంత గదిలోకి వస్తూ అంగీకారాన్ని తప్పక తెలుసుకోవాలనిపించింది.
“వాడి ఉద్దేశం అది కాదు నాన్నా!.. మాకు వుండేది ఒక్క చెల్లి. ఆమె ఉద్దేశాన్ని తెలుసుకొని, ఆమెకు ఆనందం కలిగేలా వివాహాన్ని జరిపించాలని వాడి ఉద్దేశం. అమ్మా!.. నీవు వసంతను అడుగమ్మా!..” అనునయంగా చెప్పాను. అమ్మ వెంటనే లేచి.. వసంత గదికి వెళ్ళిపోయింది.
మేము నాన్నగారు నన్ను.. గోపాల్‌ను పరీక్షగా చూచి అమ్మ వెనకాలే వెళ్ళారు.
“గోపాల్.. యీ విషయాన్ని గురించి వసంత నీతో ఏమైనా చెప్పిందా!..” ఆతృతతో అడిగాను.
“లేదన్నయ్యా!.. అందుకే.. ఆమె ఉద్దేశాన్ని కనుక్కోవాలి అని నేన్నది.”
“సరే పద.. అమ్మా నాన్నా వెళ్ళారుగా!.. వసంతను అడిగి తెలుసుకొంటారు. మనం ప్రెష్ అవుదాం. హారిక వస్తానంది కదూ!..” అన్నాను.
“అవును”
“అరే.. ఆ విషయాన్ని మనం నాన్నకు చెప్పలేదే!..”
“నీవు నీ గదికి వెళ్ళు. నాన్నకు నేను చెబుతాను”
వసంతను గురించిన ఆలోచనలతో నేను నా గదికి వైపుకు నడిచాను. గోపాల్ వసంత గది వైపుకు వెళ్ళాడు.
యిరవై నిముషాల్లో గోపాల్ నా గదికి వచ్చాడు. నన్ను చూచి నవ్వాడు. “వసంత ఏమందిరా!..” ఆతృతతో అడిగాను.
“డబుల్ ఓకే చెప్పిందట. అమ్మ చెప్పింది. యిప్పుడు నాకు చాలా చాలా ఆనందంగా వుందన్నయ్యా!..” ఆనందంగా నవ్వాడు.
వాడి మాటలకు నా మనస్సు పులకించింది. మా చెల్లికి.. మా తల్లిదండ్రుల పట్ల, మా యిరువురి పట్ల చిన్ననాటి నుంచీ వున్న ప్రేమాభిమానాలు గుర్తుకు వచ్చి.. మనస్సుకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి.
పంపిన చిన్నవాడైనా.. గోపాల్, అమ్మానాన్నలకు చెప్పిన మాటలు.. వారు వసంతను అడిగి ఆమె నిర్ణయాన్ని తెలిసికోవడం.. ఆమె నిర్ణయం మా అందరి నిర్ణయం కావడం.. ఎంతగానో సంతోషించవలసిన విషయం కదా!.. అదే నాలో జరిగింది. నా తమ్ముణ్ణి కౌగలించుకొన్నాను. నూరేళ్ళు వాడు చల్లగా కీర్తి ప్రతిష్ఠలతో వర్ధిల్లాలని మనసారా దీవించాను.
“అన్నయ్యాలూ!.. హారిక మీ కోసం వెయింటిగ్.” గదిలోకి వస్తూ అంది వసంత.
ముగ్గురం క్రింది హాల్లోకి నడిచాము. అమ్మా నాన్నా హారిక కూర్చొని వున్నారు. మమ్మల్ని చూచి హారిక నిలబడింది.
“నీవు కూర్చో అమ్మా!.. వాళ్ళూ కూర్చుంటారు” అన్నారు నాన్నగారు. మేము ముగ్గురం కూర్చున్నాము. టీపాయ్ పై పరచిన డ్రాయింగ్‍ను గురించి వివరించింది హారిక. నాలుగు బెడ్ రూమ్లతో, ఫ్రంట్, సైడ్ ఎలివేషన్స్‌తో డ్రాయింగ్ మాకందరికీ బాగా నచ్చింది. పన్నెండు లక్షల ఎస్టిమేషన్‌ని కూడా యిచ్చింది. నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించాలని అందరం నిర్ణయించుకొన్నాము.
(ఇంకా ఉంది)
సిహెచ్. సి. ఎస్. శర్మ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి జననం నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా ఊచగుంటపాళెంలో జరిగింది. ప్రాథమిక విద్య పెయ్యలపాళెం, బుచ్చిరెడ్డిపాళెంలోనూ, ఉన్నతవిద్య నెల్లూరులోనూ.
సివిల్ ఇంజనీరుగా రాష్ట్రంలోని పలు సంస్థలలో వివిధ హోదాలలో పని చేసి చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరక్టర్ స్థాయికి ఎదిగారు.
చిన్ననాడు బామ్మగారు చెప్పిన కథలతో ప్రేరణ పొంది బాల్యం నుంచే రచనలు చేశారు. మిత్ర రచయితల ప్రోత్సాహంతో రచనా రంగంలో విశేషంగా కృషి చేశారు. 20 నవలలు, 100 కథలు, 12 నాటికలు/నాటకాలు, 30 కవితలు రాశారు.
వివిధ సాహితీ సంస్థల నుంచి పలు పురస్కారాలు పొందారు.