[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘ప్రేమేగా ప్రపంచం’ అనే నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]
[కారుకి పూజ చేయించి తిరిగి వస్తుండగా, తండ్రి సుదీర్ఘంగా మాట్లాడుతూ చెప్పిన మాటలని మనసులో పెట్టుకుంటారు గోవింద, గోపాల్, వసంత. ఇంటికి చేరేసరికి వరండాలో హారిక ఎదురుచూస్తూ కనిపిస్తుంది. అందరూ లోపలికి నడిచాకా, తాను గీసిన ప్లాన్ చూపిస్తుంది. కట్టబోయే బిల్డింగ్ గురించి చెబుతుంది. చివరగా అందరి అభిప్రాయాలను అడగగా, మరో బెడ్ రూమ్ ఉంటే బాగుంటుందని గోపాల్ అంటాడు. కార్ గరాజ్ పైన మెజినైన్ ప్లోర్‌లో మరో బెడ్రూమ్ ఉండేలా ప్లాన్ మారుస్తానని చెప్తుంది హారిక. తర్వాత వారితో కలిసి భోం చేసి వెళ్ళిపోతుంది హారిక. రవిబాబు తల్లి శ్యామల – గోవిందా ఇంటికి వస్తుంది. తన సమస్యలన్నీ గోవింద తండ్రితో చెప్పుకుంటుంది. గోవింద ఎండిగా బాధ్యతలు తీసుకుని తన ఆఫీసును చక్కదిద్దాలని కోరుతుంది. సరేనంటాడు గోవింద. సంతోషంగా తిరిగివెళ్ళిపోతుందామె. కొచ్చిన్ నుంచి నాయర్ ఫోన్ చేస్తాడు. గోవింద తన స్నేహితుడు నాగరాజు, సుబ్బలక్ష్మిల సమస్యని ప్రస్తావించి, అక్కడికి తీసుకొస్తే, మంచి చికిత్స జరుగుతుందా అని అడుగుతాడు. అక్కడ డా. టి.టి. చాకో అనే డాక్టరు ఉన్నారని, ఆయన ఎంతో మందికి పిల్లలు పుట్టేలా చూశారని చెప్తాడు నాయర్. నాగరాజు వచ్చాక కొచ్చిన్ ట్రిప్ గురించి చెప్పి, అంతా రహస్యంగా ఉంటుంది, ఏం పర్వాలేదని చెప్తాడు. ఈలోపు సుబ్బలక్ష్మి గోవింద ఇంటికి వస్తుంది. కాసేపు మాట్లాడుకున్నాక, నాగరాజు, సుబ్బలక్ష్మి, గోవింద కలిసి నాగరాజు ఇంటికి వెళ్తారు. గోవింద నాగరాజు అమ్మ రుక్మిణమ్మకి నమస్కరిస్తాడు. ఎప్పుడొచ్చావు, అంతా బాగున్నారు కదా అని అడిగి, కోడలి వైపు తిరిగి నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతుంది. అన్నయ్య అమెరికా నుంచి వచ్చారని ఆయన ఫోన్ చేస్తే ఇందాకే వచ్చానని చెప్పి, వంటింట్లో పని అందుకోడానికి లోపలికి వెళ్ళిపోతుంది సుబ్బలక్ష్మి. మాటల్లో తన పెళ్ళి ప్రస్తావన వస్తే, వసంత పెళ్ళి అయ్యాకా చేసుకుంటానని చెప్పి, వసంతకి పెళ్ళి కుదిరిన విషయం చెప్తాడు. మాటల్లో తనకు మనవడో/మనవరాలో పుట్టకపోవడం ప్రస్తావించి, కోడల్ని నిందిస్తుందామె. తల్లిని ఆపాలని ప్రయత్నిస్తాడు నాగరాజు. ఆమె పట్టించుకోదు. తాను కొడుక్కి రెండో పెళ్ళి చేయాలనుకుంటున్నాడు చెప్తుంది. – ఇక చదవండి.]
నేనూ నాగరాజూ బిక్క ముఖాలతో, ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నాము.
“ఓరే గోవిందా!.. నాకోమాట చెప్పు”
“ఏమిటత్తయ్యా!..”
“వీడికి రెండో పెళ్ళి చేయాలంటే.. దాని చేత ‘నాకు బిడ్డలు పుట్టనందున.. మావారు మరో వివాహాన్ని చేసుకొనేదానికి నేను సమ్మతిస్తున్నాను’ అని వివరంగా.. ఒక కాగితాన్ని వ్రాయించుకొని, వీడికి రెండో పెళ్ళి చేయవచ్చునా!.. లేక విడాకులు యిచ్చే రెండో పెళ్ళి జరిపించాలా!..” ఆత్రుతతో నా ముఖంలోకి చూచింది.
నాకు ఆమెకు బదులు ఏం చెప్పాలో.. అయోమయస్థితి. దీనంగా నాగరాజు ముఖంలోకి చూచాను. వాడి ముఖం కందిపోయింది. కళ్ళు ఎర్రగా వున్నాయి. వేగంగా లేచి నిలబడ్డాడు.
“బావా!.. రా పోదాం” అన్నాడు కోపంతో.
“రేయ్.. ఎక్కడికి పోతావురా.. అవసరమైతే నీవు పో. గోవిందా!.. నా ప్రశ్నకు నీ జవాబేమిటి?..” సూటిగా నా ముఖంలోకి చూస్తూ అడిగింది.
నేను ఏదో ఒకటి చెప్పి.. ఆమె ఆవేశాన్ని తగ్గించవలసిన పరిస్థితి.
“అత్తయ్యా!.. నీ ప్రశ్నకు నేను జవాబు చెప్పలేను. కారణం.. యిలాంటి సమస్యకు మన చట్టంలో ఎలాంటి ప్రత్యామ్నాయం వుందో నాకు తెలియదు. మామయ్య శ్యామలరావుగారిని అడిగితే.. వారు రిటైర్డ్ జడ్జి కదా!.. మనకు తగిన సలహా యిస్తారు. వారిని అడిగి నేను నీకు చెబుతాను” అన్నాను.
నా ఫోన్ మ్రోగింది. వసంత ఫోన్ చేసి..
“అన్నయ్యా!.. ముగ్గురు మీ ఓల్డుబాయిస్ అసోసియేషన్ మెంబర్లు వచ్చారు. వెయిటింగ్ ఫర్ యు” అంది.
‘అమ్మ, బ్రతికాంరా బాబూ!..’ అనుకొని, “వుండమని చెప్పు. నేను నాగరాజు వస్తున్నాము..” చెప్పి ఫోన్ కట్ చేశాను.
“నాగూ!.. పద. మన అసోసియేషన్ మెంబర్లు వచ్చారట. యీ రోజు మీటింగ్ వుందిగా!..”.
“సరే బావా!.. పద.”
“అత్తయ్యా!.. నేను మామయ్యతో మాట్లాడి నీకు విషయాన్ని త్వరలో చెబుతాను” నేను ఆమె చెంతకు వెళ్ళి చెవి దగ్గర నోటిని వుంచి..
“యీ విషయాన్ని గురించి సుబ్బుతో గాని, వేరెవరితో కానీ మాట్లాడకు. మంచీ చెడ్డా తెలుసుకొని జాగ్రర్తగా నడుచుకోవలసిన విషయం కదా!.. ఆవేశపడి అవసరపడితే.. ఆ తర్వాత తలవంపులు మనకే కదా!..”
“అవునవును” నాకు మాత్రం వినిపించేలా అంది అత్తయ్య.
నాగరాజు మమ్మల్నిద్దర్నీ.. తన చూపులతోనే భస్మం చేసేలా చూస్తున్నాడు. అత్తయ్యకు దూరంగా జరిగి.. “అత్తయ్యా!.. నేను చూచుకొంటాను. వెళ్ళొస్తా” అన్నాను.
“మంచిది నాయనా. వెళ్ళిరా!..” ఆనందంగా అంది రుక్మిణమ్మ అత్తయ్య.
వీధిలో ప్రవేశించాము.
“బావా!.. చూచావుగా.. యిదీ ఆ మహాతల్లి వరస. ఆరు నెలలుగా నాకు యీ మాటలనే చెప్పి వేధిస్తూ వుందిరా!.. అందుకే సుబ్బు యిక్కడికి రావడం నాకు యిష్టం లేదు. యీ మాటలను తను వింటే.. ఎంతగా బాధపడుతుందో ఆలోచించు” విచారంగా చెప్పాడు నాగరాజు.
“నాగూ!.. ప్రతి దానికి ఒక నిర్ణీత సమయం అంటూ వుంటుంది. ఆ కాలం గడవగానే.. పరిస్థితులు మారి తీరుతాయి, ఋతు ధర్మాల వలె. నీవు భయపడకు, బాధపడకు. అమ్మ మాటలను విని సుబ్బును నొప్పించకు. పై ఆదివారం సాయంత్రానికి నీవు నేను సుబ్బు కొచ్చిన్‍లో వుంటాం. డా॥ చాకోను కలుద్దాం. వారి ట్రీట్‌మెంటుతో, వచ్చే సంవత్సరం.. యీనాటికి సుబ్బలక్ష్మి .. పాపను కనైనా వుండాలి లేక నిండు చూలాలుగానైనా వుండాలి. వుండి తీరుతుంది. నా మాట నమ్ము” రుక్మిణమ్మ అత్తయ్య మీద వున్న కోపంతో కాస్త ఆవేశంగానే చెప్పాను.
“అమ్మ యీ రీతిగా తయారైన దానికి కారణం మొదటిది ఆమె సహజ గుణం.. రెండవది యిరుగు పొరుగు ఆడవారి మాటలు.. వాకిట్లో చేరి.. ‘ఏం రుక్మిణీ!.. కోడలు యింకా ఏమీ అనుకోలేదా!.. చదువుకున్న పిల్లగదూ ఎందుకు అనుకొంటుంది?.. పిల్లలను కంటే అందం తగ్గిపోతుందంట. యిది యీ కాలం అమ్మాయిలనే మాట’. యీ మాటలను నేను ఎన్నో సార్లు విన్నాను బావా!.. అప్పుడు కసితో నేను అనుకొనేవాణ్ణి.. ‘నీవు అనుకోని నా దగ్గరకురా.. జీవితాంతం నన్ను నీవు అనుకొనేటట్లు చేస్తా’. బావా!.. యిది కేవలం వారి మీద కోపం కసితో అనుకొన్నది. యథార్థం కాదు. నన్ను అనుమానించకు.” ప్రాధేయపూర్వకంగా నా ముఖంలోకి చూచాడు నాగు.
“ఓరే బావా!.. నీ సామర్థ్యం నాకు తెలియందా!..” నవ్వాను.
వాడూ.. ఆనందంగా నవ్వాడు. యిరువురం మా యింటికి చేరాము. పాత విద్యార్థులు పన్నెండు మంది వచ్చారు. గోపాల్‍ని పిలిచి హెడ్మాస్టర్ గారిని పిలుచుకొని రమ్మని పంపాను. వసంత అందరికీ కాఫీలు అందించింది. గోపాల్ మాస్టారు రామకోటయ్యగారితో వచ్చాడు. వారిని చూడగానే పరుగున లోనికి వెళ్ళి ఐదు నిముషాల్లో మజ్జిగ గ్లాసుతో వచ్చింది వసంత. మాస్టారు గారికి అందించింది. నవ్వుతూ వారి గ్లాస్‌ను అందుకొన్నారు. త్రాగిన గ్లాసును వసంత అందుకొంది. లోనికి వెళ్లిపోయింది.
నేను అమ్మతో చెప్పి.. అందరం మా తోటలోకి వెళ్ళాము. గోపాల్ చెట్ల క్రింద క్లీన్ చేయించి పట్టలను పరిపించాడు వుదయాన్నే.
సునీల్ రాలేదు. రొండు రోజుల క్రితం గోపాల్ పేర ఒక కొరియర్ వచ్చింది. అందులో జమా ఖర్చుల వివరాలు నోట్ బుక్ వుంది. ఒక లేఖ కూడా వుంది. అందరం కూర్చున్నాము. నోట్‍బుక్‌ను, లేఖను గోపాల్ మాస్టారి గారి చేతికి అందించాడు.
“నా చేతికి ఎందుకు గోపాల్ అన్నయ్య చేతికి యివ్వు” అన్నారు మాస్టారు. గోపాల్ అందించిన వాటిని అందుకొన్నాను.
“సార్!.. సునీల్ వ్రాసిన లేఖను చదవనా?..” అడిగాను
“చదువు గోవిందా!..”
“డియ్యర్ ఫ్రెండ్స్.. అనివార్య కారణాల వలన నేను మీటింగ్‍కు రాలేకపోతున్నాను. యికపై నేను మన అసోషియేషన్ ప్రెసిడెంట్ బాధ్యతలను నిర్వహించలేను. యీ సమావేశంలో వేరెవరినైనా.. మీరు ప్రెసిడెంటుగా ఎన్నుకోండి. మూడు సంవత్సరాలు నేను ఈ బాధ్యతను నిర్వహించాను. జమా ఖర్చుల వివరాలను సంవత్సరం వారిగా నోట్‍బుక్‍లో వ్రాసాను. నా మీద కొందరికి అనుమానం అని నేను విన్నాను. కనుక ప్రెసిడెంట్ బాధ్యత నుండి తప్పు కొంటున్నాను. మెంబర్‍గా వుంటాను. క్రొత్త ప్రెసిడెంట్ నాకన్నా చిన్నవాడే అవుతాడు. వాడికి నా శుభాకాంక్షలు. ఇట్లు. మీ సునీల్.
వచ్చిన పన్నెండు మందిలో ఐదుగురు సునీల్‌కు సన్నిహితులు.
“సార్!.. యిప్పుడు మనం కొత్త ప్రెసిడెంట్ను ఎన్నుకోవాలి. నేను ఏకగ్రీవంగా నాగరాజును ప్రపోజ్ చేస్తున్నాను. ఎవరికైనా అభ్యంతరం వుంటే చెప్పండి.” అందరి ముఖాల్లోకి చూచాను.
ఆ వర్గం నుండి బాషా చేయి ఎత్తాడు.
“ఏమిటి నీ అభ్యంతరం?..” అడిగాను.
“నేను మనోహరుని ప్రపోజ్ చేస్తున్నాను” అన్నాడు.
మనోహర్ ముఖంలోకి చూచి, బాషా ముఖంలోకి చూస్తూ.. “యిక్కడ వున్నది పద్నాలుగు మంది. ఆరుగురు రాలేదు. పోటీ అవసరమా బాషా!..” అనునయంగా అడిగారు మాస్టారు.
“పోటీ లేకపోతే.. యిది ఎలక్షన్ ఎలా అవుతుంది సార్!..” బాషా ప్రశ్న.
“వుండేది పద్నాలుగు మందే కాబట్టి గోవింద్ చెప్పినట్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అది మీలో వున్న ఐక్యతకు సాక్షి అవుతుంది బాషా!..” నెమ్మదిగా మస్టారు గారు చెప్పారు.
“సార్!.. బాషా వుద్దేశ్యం వేరుగా వుంది. కాబట్టి లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం మంచిది. ఎవరికీ ఎవరి మీద ఎలాంటి అపోహలూ వుండవు ముఖ్యంగా నాకు వర్గ భావన గిట్టదు. యిక్కడ వున్నవారంతా నా దృష్టిలో ఒక్కటే. గోపాల్.. అందరి పేర్లను వేరు వేరు చీటీలలో వ్రాయి. కులికి బాషా.. ఒక చీటీని తీస్తాడు. ఎవరి పేరు వుంటే.. వారే నూతన ప్రెసిడెంట్” అన్నాను.
అందరూ మౌనంగా వున్నారు. నో కామెంట్సు.
“మీలోని ఐక్యతను ఋజువు చేసేదానికి.. యీ పద్ధతే సరైంది. గోవిందా!..” నవ్వుతూ చెప్పారు మాస్టారు.
గోపాల్.. చీట్లను వ్రాసి చూడమని బాషా చేతికి యిచ్చాడు. వాడు పద్నాలుగు పేర్లను చూచి ఓకే అన్నాడు. మడిచి.. మంచినీళ్ళు త్రాగే గ్లాసులే వేసి కులికి బాషా చేతికి యిచ్చాడు. వాడూ కులికి ఒక చీటీని తీసి మాస్టారుగారి చేతికి యిచ్చాడు. వారు విప్పి చూచి “నాగరాజు” పేరును చెప్పి చీటీని అందరికీ చూపించారు. అలా క్రొత్త ప్రెసిడెంట్గా నాగరాజు ఎన్నికైనాడు. గోపాల్ అందరి పేర్లను తేదీ వేసి వ్రాసి సంతకాలు తీసికొన్నాడు. సమావేశం ముగిసింది.
నా మాట ప్రకారం జమాఖర్చుల పుస్తకాన్ని గోపాల్ నాగరాజుకు యిచ్చారు. మిగతా వారంతా వెళ్ళిపోయారు.
“నాగూ!.. జమాఖర్చులను చెక్ చెయ్యి. ఓ స్టేట్మెంటును తయారు చెయ్యి. ఆ తర్వాత మాస్టారు గారితో చర్చిస్తాము. సునీల్ ఎంత మింగింది తెలిసిపోతుంది. అవసరం అయితే వాణ్ణి కలసుకొని కాజేసిన దాన్ని వసూలు చేద్దాం. ఏమంటారు సార్!..” అన్నాను.
“అలాగే గోవిందా!.. కానీ ప్రస్తుతంలో సునీల్ వ్యక్తిత్వంలో ఎంతో మార్పు వచ్చిందని విన్నాను. కాంట్రాక్టు పనులు చేస్తూ బాగా అన్ని విధాలా ఎదిగాడట” విచారంగా అన్నారు మాస్టారుగారు.
“ప్రతి ఒక్కడూ ఎదిగి గొప్పవాడు కావలసిందే. కానీ.. వ్యక్తిత్వాన్ని.. మానవత్వాన్ని విస్మరించకూడదు కదా సార్!..” అన్నాను.
“యీ రోజుల్లో.. ఆ రెండూ నేటి యువతలో ఏ కొందరికో వున్నాయి. ధనార్జన ముందు అన్నీ చెల్లనివై పోయాయి. కాల మహిమ.” విరక్తిగా నవ్వారు మాస్టారు రామకోటయ్యగారు.
వీధి వాకిటిని సమీపించాము. మాస్టారుగారు వెళ్ళిపోయారు.
“నాగూ!.. నీవు నేను సుబ్బలక్ష్మి శనివారం రాత్రికి కేరళకు బయలుదేరుదాం. సుబ్బును మూడు రోజులు శలవు పెట్టమను. సరేనా!..”
“అలాగే బావా!.. వస్తాను” నాగూ వెళ్ళిపోయాడు.
నేను గోపాల్.. మా యింట్లోకి వెళ్ళిపోయాము.
***
ఐదు గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకొని పది నిముషాలు పూజా మందిరంలో కూర్చొని, దైవాన్ని ధ్యానించి.. టిఫిన్ తిని అమ్మా నాన్న ఆశీస్సులతో ఆరున్నరకు నెల్లూరికి కార్లో బయలుదేరాను. ముందుగా సుందరి అత్తయ్య యింటికి వెళ్ళాను. విషయాన్ని మామయ్యకు అత్తయ్యలకు చెప్పి వారి ఆశీస్సులతో.. ఎనిమిది గంటలకల్లా శ్యామల పెద్దమ్మ యింటికి వెళ్ళాను. పెద్దమ్మ చెల్లెళ్ళు, రూప.. దీపలు నన్ను చూచి ఎంతో సంతోషంతో ఆహ్వానించారు.
రూపా దీపలు బి. టెక్ చదువుతున్నారు. వాళ్ళ కాలేజీని గురించి లెక్చరర్ల గురించి కొంతసేపు మాట్లాడుకొన్నాము. తర్వాత.. వాళ్ళ అన్నయ్య రవి బాబును, వదిన వసుధను గురించి ఆ పిల్లలిద్దరూ మాట్లాడారు. అన్న మంచివాడు కాదని.. వదిన చాలా మంచిదని బాధపడుతూ నాకు వారు తెలియజేశారు.
వారి మాటలను విన్న తర్వాత.. రవిగాడు నిజంగా పరమ దరిద్రుడనిపించింది. ధనదాహంతో వాడు మానవత్వాన్ని విస్మరించాడని నాకు తేటతెల్ల మయింది. వాళ్ళ నడిగి వాడి సెల్ నెంబరు ట్రై చేశాను. కానీ నో రెస్పాన్స్.
అకౌంట్సు మేనేజర్ రామసుబ్బయ్యగారు వచ్చారు. పెద్దమ్మకు నాకు నమస్కరించారు. వారు పెద్దమ్మ చేతికి కొన్ని కాగితాలను అందించారు. అందుకొని చూచి వాటిపై పెద్దమ్మ సంతకం చేసి, చేతికి చ్చింది. “చూడు, గోవిందా!..” అంది నవ్వుతూ
అవి నాలుగు కాగితాలు. ఒకటి నా ఆర్డర్ యాజ్ యం.డి. రెండవది కంపెనీని నడిపేదానికి.. నా జనరల్ పవర్ ఆఫ్ అట్టార్నీని.
“మీ పెదనాన్నగారు నాలుగేళ్ల క్రితం.. ఏ ఉద్దేశంతో చేశారో నాకు తెలియదు. నన్ను కంపెనీకి సి.యం.డీగా ఫుల్ పవర్స్‌తో చేశారు. కొడుకును యి.డిగా నియమించారు. ఆయన డైరెక్టర్‌గా వుండి అన్ని కార్యాలూ నిర్వహిస్తున్నారు. పదిహేను రోజుల్లో కన్ను మూస్తారనగా నాకు యీ విషయాలన్నీ చెప్పారు. ఆస్తిని నాలుగు భాగాలుగా చేసి వీలునామా వ్రాసి సంతకం చేసి రిజిష్టర్ చేయించి నా చేతికి యిచ్చారు. హు!.. ఆ మహానుభావుడు నన్ను వదిలి వెళ్ళిపోయారు. నీ మిత్రుడి కథ నీకు తెలిసిందే కదా!.. అందుకే యీ పిల్లలకు నిన్ను గార్డియన్‍గా, ఆఫీస్‍కు సంబంధించిన అన్ని వ్యవహారాలకు నిన్ను బాధ్యుణ్ణిగా యం.డిగా నియమించాను. మీ పెదనాన్నగారి కీర్తి ప్రతిష్ఠలను కాపాడేదాని కోసం.. మనలనే నమ్ముకొని బ్రతుకుతున్న వెయ్యి కుటుంబాల క్షేమం కోసం.. యీ గురుతర బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను నాన్నా. ఒకవేళ వాడు బుద్ధి మారి తిరిగి వచ్చినా.. నీవు వాడికి ఏ పని చెబితే అది చేయాలి కాని.. వాడుగా ఏ నిర్ణయాలూ తీసుకోరాదు. వాడిని పనిలో పెట్టుకోవడం.. లేక వీలు కాదని అనడం.. నీ నిర్ణయం మీదనే ఆధారపడి వుంటుంది. నీ నిర్ణయం ఏదైనా నాకు ఆమోదమే. సంతోషమే!.. కారణం, నా గోవిందు ఎన్నడూ ఏ విషయంలోనూ తొందరపడి, విచక్షణారహిత నిర్ణయాలు తీసుకోడనే.. నీపై నాకు వున్న నమ్మకం. ఆ సర్వేశ్వరుడు నీకు అండగా వుండి అంతా మంచే జరగేలా చేస్తాడని ఆశిస్తున్నాను.” కాస్తంత ఆవేశంతోనే పెద్దమ్మ చెప్పింది.
“మీ సలహా లేకుండా నేను ఏ నిర్ణయాన్నీ తీసుకోను పెద్దమ్మా” అన్నాను.
ఆమె నా ముఖంలోకి చూచి తృప్తిగా నవ్వింది. రూపా దీపలు కరచాలనం చేసి “కంగ్రాచులేషన్స్, అన్నయ్యా!..” ఆనందంగా చెప్పారు.
“రామసుబ్బయ్య గారూ!.. మీరు ఆఫీస్‍కు వెళ్ళి అందరినీ సమావేశ పరచండి. మేము అరగంటలో అక్కడికి వస్తున్నాము” అంది పెద్దమ్మ.
రామసుబ్బయ్యగారు ఆఫీస్‌కు వెళ్ళిపోయారు. “రా గోవిందా!..” పిలిచి తను పూజ గదిలోనికి వెళ్ళింది. నేను రూప దీపలు ఆ గదిలోకి వెళ్ళాము. దేవుడి ముందు కూర్చొని పది నిముషాలు ధ్యానించింది పెద్దమ్మ. క్షీరాన్ని నివేదన చేసి, కర్పూరాన్ని వెలిగించి మాకు చూపింది. మేము కళ్ళకు అద్దుకొన్నాము. సిందూరాన్ని నా నొసటన వుంచింది. తన కుడి హస్తాన్ని నా తలపై వుంచి నన్ను, పిల్లలను దీవించింది.
గ్లాసులో పాలు పోసి నా చేతికి అందించింది. “త్రాగు. యిక మనం బయలుదేరాలి.” అంది. పాలు త్రాగాను. రూప నా చేతిలోని గ్లాసును అందుకొంది. నలుగురం వరండాలోకి వచ్చాము. కారు సిద్ధంగా వుంది. పెద్దమ్మ వెనక సీట్లో కూర్చొని “రా గోవిందా!..” పిలిచింది. పిల్లలు “విష్ యు ఆల్ ది బెస్ట్ అన్నయ్యా!..” నవ్వుతూ చెప్పారు. కార్లో కూర్చున్నాను. డ్రైవర్ కదిలించాడు. యిరవై నిముషాల్లో కారు ఆఫీసులో ప్రవేశించింది. రామసుబ్బయ్యగారు, మరికొందరు మాకు విష్ చేసి సాదరంగా ఆహ్వానించారు.
అందరం బోర్డు రూమ్‍లో సమావేశం అయ్యాము. కుర్చీలు చాలక కొందరు నిలబడ్డారు.
“గుడ్ మార్నింగ్ టు ఆల్. మీ విలువైన కాలాన్ని నేను ఎక్కువగా మాట్లాడి వేస్టు చేయను. వీరు మిస్టర్ గోవింద్. మీ కొత్త యం.డి. యిక మీదట మీరంతా వీరితో కలసి, వారు కోరిన విధంగా పని చేయాలి. కంపెనీలోని లోటుపాట్లను సవరించి బాగా వృద్ధిలోనికి తీసుకొని రావాలి. అన్ని విషయాలకు యికపై వీరిదే తుది నిర్ణయం.” ఎంతో గాంభీర్యంగా చెప్పి, నా వంక చూచి “గోవిందా!.. ప్లీజ్ సే ప్యూ వర్డ్స్” నవ్వుతూ అంది పెద్దమ్మ.
“అందరికీ నమస్కారాలు. నా మీద ఎంతో నమ్మకంతో ఛైర్మన్ గారు నాకు ఈ బాధ్యతను అప్పగించారు. ప్రతి మనిషి బ్రతికే దానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది ఎలాగైనా బ్రతకాలి. రెండవది ఇలాగే బ్రతకాలి. నా మార్గం ఆ రెండవ మార్గం. మనమంతా కలసి పనిచేసి యీ ఆర్గనైజేషనన్‍ను వృద్ధిలోకి తీసుకొని రావలసి వున్నందున, నేను మీ బాసను అయినందున, మీరంతా నాతో పాటే నా మార్గంలోనే నడవాలని కోరుతున్నాను. మీ అభివృద్ధి మీ చేతుల్లోనే వుంది. నీతి, నిజాయితీ, కాలాన్ని గౌరవించి పని చేయడం, మీ మీ అభివృద్ధికి కారణాలవుతాయి. అజ్ హెూప్ కలెక్టివ్ స్పిరిట్ ఫార్ ది బెస్టు ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ ఇండివిడ్యువల్. థ్యాంక్యూ.” వందనంతో నా ప్రసంగాన్ని ముగించాను.
అందరి కరతాళధ్వనులతో ఆ హాలులో మారుమ్రోగాయి.
“నవ్.. లెట్ అజ్ డు అవర్ వర్క్” నవ్వుతూ అంది పెద్దమ్మ.
ఆమె ఓల్డు బి.ఎ. “శ్యామల యింగ్లీష్ చాలా బాగా మాట్లాడుతుందిరా!..” అని ఎప్పుడో అన్న నాన్నగారి మాటలు గుర్తుకు వచ్చాయి.
అందరూ వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు. నేను, పెద్దమ్మ, రామసుబ్బయ్యగారు ముందు నడవగా, నాకుగా నిర్ధేశించిన గదిని సమీపించాము. వారు డోర్ ఓపెన్ చేశారు. ముందు పెద్దమ్మా వెనుక నేను, నా వెనక రామసుబ్బయ్య గారూ ఆ గదిలో ప్రవేశించాము.
“టేక్ యువర్ సీట్ గోవిందా!..” కుర్చీని చూపుతూ నవ్వుతూ అంది పెద్దమ్మ.
“థాంక్యూ పెద్దమ్మా!” వంగి ఆమె పాదాలను తాకి వెళ్ళి నా సీట్లో కూర్చున్నాను.
పెద్దమ్మ, నాకు ఎదురుగా టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుంది. రామసుబ్బయ్య గారిని చూచి “కూర్చోండి సార్!..” అంది. వారు.. ఆమె ప్రక్కన కూర్చున్నారు.
“నాన్నా గోవిందా!.. ఆఫీస్ నంతా వీరితో కలసి ఒకసారి చూడు. అందరినీ పిలిచి మాట్లాడు. ఏదైనా మార్పులు అవసరం అయితే చేయించు. ఎవరైనా నీ దృష్టికి అవకతవకగా గోచరిస్తే.. వారి ఆర్డర్ ప్రకారం వారికి యివ్వవలసింది యిచ్చి బయటికి పంపించు. అవసరానికి తగినట్లుగా నీకు నచ్చిన వారిని అపాయింట్ చేసికో. డోన్ కీప్ ఇమ్మోరల్ పర్సన్స్ ఇన్ ద టీమ్. టింబర్, మిల్కు, కన్‌స్ట్రక్షన్ ఈ మూడు డివిజన్స్ హెడ్లను పిలిపించి మాట్లాడు. టింబర్, కన్‌స్ట్రక్షన్ డివిజన్స్‌లో కొన్ని అవకతవకలను వీరు గుర్తించి, నాతో చర్చించారు. సరైన దక్షుడు లేకుండా కెలక కూడదని వూరుకొన్నాను. నవ్ యు డు, వాట్ యు ఫీల్ బెటర్. అన్ని వివరాలు వీరు నీకు తెలియజేయగలరు. వీరు మన బంధువే. హారిక పెదనాన్నగారు తెలుసుగా!..” నవ్వుతూ అంది పెద్దమ్మ.
వారిని నేను చూచి పది సంవత్సరాలకు పైగా అయింది. యథార్థం చెప్పాలంటే సరిగా గుర్తులేదు. నా అవివేకాన్ని వ్యక్తం చేయకుండా నవ్వి తల ఆడించాను.
“సరే నాన్నా!.. యిక నే వెళతాను. మధ్యాహ్నం క్యారియర్ పంపుతాను. సాయంత్రం వూరికి వెళతావా, యిక్కడే వుంటావా?..”
“వూరికి వెళ్ళి.. వుదయాన్నే వస్తాను పెద్దమ్మ!..”
“సరే అలాగే చెయ్యి.” రామసుబ్బయ్యగారి వైపు చూచి
“సార్!.. అన్ని వివరాలు మన వాడితో చెప్పండి. సమస్యకు తగిన నిర్ణయం గోవింద్ తీసుకొంటాడు. సరేనా!..”
“అలాగే అమ్మా!..”
“సరే, యికనే వెళతాను” చెప్పి పెద్దమ్మ వెళ్ళిపోయింది.
నేను రామసుబ్బయ్యగారు ఆఫీస్ లోని అన్ని భాగాలు చూచి అందరి పేర్లు తెలిసికొని పలకరించి నా గదికి వచ్చాము.
ఆ భవంతి రెండు ఫ్లోర్లు. ముఖ ద్వారం ఆగ్నేయ భాగంలో వుంది. అది ఈశాన్యంలో వుంటే మంచిదని నాకు తోచింది. తూర్పు వైపున వుత్తరం వైపునా ఫైళ్ళ ర్యాక్సు.. యింకా యితర సామాగ్రితో బరువు అధికంగా వుండడాన్ని నేను గమనించాను. తూర్పున ఉత్తరానా నడిచే మార్గాలను కల్పించి పడమర, దక్షిణంలో బరువులు వుండేటట్లు ఆఫీస్‌ను మార్చాలని నిర్ణయించుకొన్నాను. అదే విషయాన్ని నేను రామసుబ్బయ్యగారితో చర్చించాను. వారూ నాతో ఏకీభవించారు. అనేకసార్లు యీ విషయాన్ని రవిబాబుతో చెప్పినట్లు, వాడు పెడ చెవిన పెట్టినట్లు విచారంగా నాతో అన్నారు రామసుబ్బయ్య.
పెద్దమ్మకు ఫోన్ చేసి చేయవలసిన మార్పులను గురించి చెప్పాను. ఆమె సంతోషించింది. “నాయనా!.. గోవిందా!.. అది నీ ఆఫీస్, నీకు నచ్చిన రీతిగా తీర్చిదిద్దుకో..” అంది.
చేయవలసిన మార్పులను గురించి మరోసారి.. రామసుబ్బయ్యగారితో చర్చించి, నా రూము, పెద్దమ్మ గారి రూము నైరుతిలో వుండేటట్లుగా, వాకింగ్ పాత్ తూర్పున ఉత్తరానా వుండేటట్లు ఓ స్కెచ్ వేసి వారికి యిచ్చి పనిని ప్రారంభించవలసినదిగా చెప్పాను. రెండు రోజుల్లో కావలసినవి సమకూర్చి పనిని ప్రారంభించేలా చేస్తానని వారు నాకు చెప్పారు.
ఒంటిగంట అయింది. పెద్దమ్మ క్యారియర్.. పంపింది. భోంచేస్తూ వుండగా ‘నాయర్’ ఫోన్ వచ్చింది. శనివారం బయలుదేరి ఆదివారం వస్తున్నట్లుగా వాడికి కన్ఫమ్ చేశాను.
యింటికి ఫోన్ చేసి.. ఉదయపు దినచర్యను గురించి అమ్మ నాన్నలకు వివరించాను. వారు సంతోషించారు. జాగ్రత్తగా మంచిచెడ్డలను గురించి.. ఆలోచించి, నిర్ణయాలు తీసికోవలసినదిగా హెచ్చరించారు. వారికి సంతృప్తి కలిగేలా ‘అలాగే’.. నవ్వుతూ వారికి సమాధానమిచ్చాను.
భోజనానంతరం టింబర్ యార్డుకు వెళ్ళాము నేను, రామసుబ్బయ్య. అక్కడి మేనేజర్ వీరయ్య. వయస్సు దాదాపు అరవై సంవత్సరాలు. నన్ను చూడగానే అతని ముఖంలో ఎంతో ఆశ్చర్యం. రామసుబ్బయ్య గారు నన్ను వారికి పరిచయం చేశారు.
దాదాపు రెండు కోట్ల రూపాయల ఉడ్ కటింగ్ మిషన్లు వున్నాయి. వాటితో ఏ థిక్‍నెస్ కావాలన్నా టాగ్సును కోసి.. ఆర్డరు ప్రకారం సప్లయ్ చేస్తారు. గుట్టగా ఎంతో స్క్రాప్ అక్కడక్కడా వుంది. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో గుట్టలు గుట్టలుగా టేకు, నాటు చెట్ల లాగ్సు వున్నాయి. ఏదీ క్రమంగా అమర్చి లేదు. దాదాపు ముప్ఫై మంది పనివాళ్ళు పని చేస్తున్నారు. నాలుగు లారీలు, నాలుగు టెంపోలు, ఆర్డరు ప్రకారం కొనుగోలు దారులకు టింబర్ సప్లయ్ చేసే దానికి వున్నాయి. ఆ వాహనాలు మట్టికొట్టుకొని కళావిహీనంగా పెయింటు ఫేడ్ అయి వున్నాయి. యిద్దరూ కలిసి నడుస్తుండగా.. రామసుబ్బయ్య గారు “వీడిని వెంటనే తొలగించాలి. యీ వర్క్‌షాపుకు యజమాని తనే అని వీడి భావన. గత సంవత్సరంలో యిరవై లక్షలు కాజేశాడు. వీడు లేడీ బ్రోకర్. ఆ కారణంగా రవిబాబుకు వీడు మంచి సన్నిహితుడు. యిక్కడ వీడు ఆడింది ఆట.. పాడింది పాట” ఎంతో విచారంగా చెప్పారు. రామసుబ్బయ్యగారు.
ముగ్గురం ఆఫీస్ రూమ్‍లో కూర్చున్నాము. అందమైన యిరవై సంవత్సరాల పిల్ల కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేస్తూ వుంది. మమ్మల్ని చూచి నవ్వుతూ ‘గుడ్ యీవినింగ్’ చెప్పింది. నన్ను.. రామసుబ్బయ్యగారు.. వీరయ్యకు ఆ అమ్మాయి సీతకు పరిచయం చేశారు.
“వీరయ్యగారూ!.. యార్డు చూచేదానికి చాలా చండాలంగా వుంది. లాగ్స్ అన్ని అడ్డదిడ్డాలుగా పడి వున్నాయి. కటింగ్ ఆపేసి.. రేపు యీ సమయానికల్లా జాతి వారిగా లాగ్స్‌ని అరేంజ్ చేయించండి. మామిడి చెక్క అని చెప్పి చింత చెక్కను అమ్మడం తప్పు. మనం చెప్పేది, కష్టమర్స్‌కు అమ్మేదీ ఒకటిగానే వుండాలి. యీ వ్యాపారం ద్వారానే మా పెదనాన్నగారు మిగతా వ్యాపారాలను ప్రారంభించగలిగారు. ఆయనకు వున్న పేరును మనం కాపాడాలి. తర్వాత స్క్రాప్‌ను అంతా ఒక వైపున పోగేయించి ఎన్ని టన్నులు వుందో ఆ వివరాలను తయారు చేయండి. జాతి వారిగా వున్న లాగ్స్ స్టాక్ వివరాలను తయారు చేయండి. యిప్పుడు వున్న స్టాక్ అరవై శాతం సేల్ అయ్యే వరకూ క్రొత్త లాగ్స్‌ని తెప్పించకండి. పై అన్ని వివరాలతో బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు నన్ను ఆఫీస్‍లో కలవండి” అన్నాను నా మాటలకు వీరయ్య బెదిరిపోయాడు. బిక్కముఖంతో తల ఆడించాడు. “మరోమాట.. పాపం, మీరు ఒక్కరే యిన్ని పనులు నిర్వహించడం, చాలా కష్టం. లోడింగ్, అన్‌లోడింగ్ ఇక పై మీరు చూచుకోండి. మిగతా పనులు.. చూచుకొనేదానికి, నాకు అవసరమైన యిన్ఫర్మేషన్ యిచ్చేదానికి మరో వ్యక్తిని త్వరలో నియమిస్తాను. అప్పుడు మీరు.. మీ పనిని హాయిగా టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు.” ఎంతో సౌమ్యంగా చెప్పాను.
నా ఈ మాటలను వినగానే వీరయ్య ముఖం.. వెలవెలపోయింది. యాంత్రికంగా తల ఆడించాడు. నా సెల్ మ్రోగింది. ఫోన్ చేసింది వసంత నా చెల్లి.
“ఏమ్మా!..”
“అన్నయ్య మా మోటర్ బైక్, ట్రబుల్ యిచ్చింది. నీవు వూరికి వస్తున్నావుగా!..”
“అవును.”
“మమ్మల్ని పికప్ చేసికొంటావా?”
(ఇంకా ఉంది)
సిహెచ్. సి. ఎస్. శర్మ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి జననం నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా ఊచగుంటపాళెంలో జరిగింది. ప్రాథమిక విద్య పెయ్యలపాళెం, బుచ్చిరెడ్డిపాళెంలోనూ, ఉన్నతవిద్య నెల్లూరులోనూ.
సివిల్ ఇంజనీరుగా రాష్ట్రంలోని పలు సంస్థలలో వివిధ హోదాలలో పని చేసి చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరక్టర్ స్థాయికి ఎదిగారు.
చిన్ననాడు బామ్మగారు చెప్పిన కథలతో ప్రేరణ పొంది బాల్యం నుంచే రచనలు చేశారు. మిత్ర రచయితల ప్రోత్సాహంతో రచనా రంగంలో విశేషంగా కృషి చేశారు. 20 నవలలు, 100 కథలు, 12 నాటికలు/నాటకాలు, 30 కవితలు రాశారు.
వివిధ సాహితీ సంస్థల నుంచి పలు పురస్కారాలు పొందారు.