Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమేగా ప్రపంచం-6

[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘ప్రేమేగా ప్రపంచం’ అనే నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]

[తోటలోకి నాగరాజుతో పాటు వెళ్ళిన గోవిందకు ఆ తోటకి సంబంధించిన జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఓ మామిడి చెట్టుకింద కూర్చుని నాగరాజు తల్లిదండ్రుల గురించి, భార్య సుబ్బలక్షి గురించి అడుగుతాడు. అంతా బాగానే ఉన్నారంటాడు నాగరాజు. సుబ్బలక్ష్మి ఉద్యోగరీత్యా కావలిలో ఉంటోందని చెప్తాడు. తన భార్యకీ, తల్లికీ మధ్య గొడవల కారణంగా  వారాంతాలలో భార్య తమ ఇంటికి రావడం లేదని, తానే కావలి వెళ్తున్నానని చెప్తాడు. సమస్య ఏమిటని అడిగితే, తమకింకా పిల్లలు కలగకపోవడమే అని చెప్తాడు నాగరాజు. ఎవరో జ్యోతిష్యుడి మాట విని, సుబ్బలక్ష్మికి సంతానయోగం లేదని నమ్మి నాగరాజు తల్లి ఆమెను వేధిస్తోందట. కోడలిపై ఏవో లేనిపోని విషయాలు కొడుకుకి నూరిపోసింది, అతను వాటిని నమ్మాడు. గోవింద తన్ ఐఫోన్ నుంచి సుబ్బలక్ష్మికి ఫోన్ చేయిస్తాడు. ముందు నాగరాజు మాట్లాడాకా, తాను కూడా మాట్లాడుతాడు. వచ్చే ఆదివారం తాను ఊరు తప్పక వస్తానని చెబుతుంది. నేరుగా గోవింద ఇంటికే వస్తానని చెప్తుంది. కాసేపయ్యాకా, రాఘవ ఫోన్ చేసి, షోరూమ్ వాళ్ళు కారు రేపు డెలివరీ చేస్తామన్నారనీ, ఆ కారు తీసుకుని తాను మర్నాడు పది గంటల కల్లా వస్తానని చెప్తాడు. తోట లోంచి బయల్దేరి ఇంటికి చేరుతారు గోవింద, నాగరాజు. మర్నాడు రాఘవ కారు తెస్తున్నట్టు అమ్మానాన్నలకు చెప్తాడు గోవింద. అయితే జొన్నవాడ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం అంటుంది గోవింద తల్లి. మర్నాడు రాఘవ క్రొత్త కారుతో, తన తల్లిదండ్రులతో వస్తాడు. అందరూ జొన్నవాడకు వెళ్ళి కామాక్షి మాతను దర్శించి, కుంకుమ పూజ చేయించి, తీర్థ ప్రసాదాలు సేవించి తిరుగుప్రయాణానికి సిద్ధమవుతారు. రాఘవ తన తల్లిదండ్రులతో నెల్లూరికి వెళ్ళిపోతాడు. గోవింద  కారు నడుపుతుంటే, తండ్రి గోవింద పక్కన ఫ్రంట్ సీట్లో కూర్చుంటాడు. దారిలో వస్తూ, దైవం గురించి, మనుషుల ప్రవర్తన గురించి ఎన్నో విషయాలు చెప్పి, కాసేపు కళ్ళు మూసుకుంటాడు. – ఇక చదవండి.]

నాన్నగారి యీ సుదీర్ఘ ఉపన్యాసం, వినడం మా ముగ్గురు అన్నచెల్లెళ్ళకు ఇదే మొదటిసారి. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. వెను తిరిగి చూస్తే.. అమ్మ కూడా కళ్ళు మూసుకొని వుంది. కొద్ది నిముషాలు మా మధ్యన మౌనంగా గడిచిపోయాయి. నాన్నగారు కళ్ళు తెరిచి.. “గోవింద్!.. గోపాల్.. వసంతా!.. నేను చాలా సేపు మాట్లాడి.. మీకు బోరు కొట్టించానా!..” నవ్వుతూ అడిగారు.

“లేదు నాన్నా!.. మాకు తెలియని ఎన్నో విషయాలు మేము మీ నుండి తెలుసుకొన్నాము.” అంది వసంత.

“అవును నాన్నా!.. చెల్లి చెప్పింది నిజం.” అన్నాడు గోపాల్. నాన్నగారు నా ముఖంలోకి చూచారు.

“నాన్నా!.. నిజం చెప్పనా!..”

“నాకు మీ నుండి కావలసింది ఎప్పుడూ ‘నిజం’ మాత్రమే గోవిందా!..”.

“ఆవేశంగా మీరు మాట్లాడుతున్నప్పుడు.. మీరు నా కళ్ళకు మహాజ్ఞానిలా కనిపించారు నాన్నా!..” అన్నాను.

“నేను మామూలు మనిషి నాన్నా!.. మీరు నాలాగే ఆనందంగా బ్రతకాలని నా ఆశ.” నవ్వుతూ చెప్పి, అమ్మ ముఖంలోకి చూచాడు నాన్న.

“మన బిడ్డలు.. బంగారు బిడ్డలు. వారు ఏ విషయంలోనూ, ఏనాడూ మనకు తలవంపులు కలిగించరు.” ఆనందంగా నవ్వుతూ, మాపట్ల తనకున్న నమ్మకాన్ని చెప్పింది అమ్మ.

నాన్నా అమ్మల మాటలు విన్న తర్వాత.. ప్రతి తల్లిదండ్రులు, తమ బిడ్డలను సాకడం, చదివించడం వారికి వివాహం జరిపించడమే కాక.. తమ సంతతి, వారి భవిష్యత్తులో ఎలా సమాజంలో సాటివారితో కలసిమెలగాలని, ఎలాంటి కీర్తి ప్రతిష్ఠలను పొందాలని, వారు ఆశిస్తారో నాకు బాగా అర్థం అయింది.

నాన్నగారు చెప్పిన రీతికి విరుద్ధంగా, తల్లిదండ్రుల మాటలను లెక్క చేయకుండా, కన్నందుకు సాకడం చదవించడం తల్లిదండ్రుల బాధ్యత.. వారి బాధ్యతను వారు నిర్వర్తించారు. అందులో అతిశయం, ఆధిక్యతా ఏముందని భావించి, యుక్త వయస్కులైన తర్వాత వారి మనోభావాలను ఆదరించక, వారిని అభిమానించక.. తమ సొంత నిర్ణయాలతో, ఆవేశంతో విచక్షణా రహితంగా వర్తించి, కన్నవారికి కష్టాన్ని కలిగించి, జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేసి.. ఆమెకూ మనసుంటుందనే విచక్షణా జ్ఞానం లేకుండా మృగతుల్యంగా వర్తించి, తన భవిష్యత్తును నాశనం చేసికొన్న రవిబాబు, బాబూరావులు గుర్తుకు వచ్చారు. వారిపట్ల అసహ్యం కలిగింది. నా భావి జీవితంలో.. నాకు సంబంధించిన అన్ని విషయాలూ నా తల్లిదండ్రుల యిష్టాను సారంగానే జరగాలని నిర్ణయించుకొన్నాను. కారును మా యింటి పోర్టికోలో ఆపాను. అందరం కారు నుండి దిగాము,

వరండాలో హారిక నవ్వుతూ నిలబడి వుంది.

“అత్తయ్యా!.. మామయ్యా. నమస్కారాలు.” చేతులు జోడించి అంది. నవ్వుతూ నా ముఖంలోక క్షణంసేపు చూచి, తన చూపులను అమ్మా నాన్నల మీద లగ్నం చేసింది.

“వదినా!.. మా యింటి ప్లాన్ వేశావా?..” హారికను సమీపించి అడిగింది. చెల్లి వసంత.

అవునన్నట్లు హారిక తల ఆడించింది.

నాన్నగారు టీపాయ్ పైన రోల్ చేసిన కాగితాన్ని చూచారు.

“హారికా! పని పూర్తయిందా?..” కుర్చీలో కూర్చుంటూ అడిగారు నాన్న.

“ఆఫీస్ లో పని కాస్త తక్కువగా వుండింది. మన పనిని పూర్తి చేశాను. మావయ్యా. చూస్తారా!..” అంది.

“చూస్తారా ఏమిటే.. చూపించు” అంది అమ్మ.

హారిక రోల్‍ను విప్పింది. అది ‘ఎ 2’ సైజ్ డ్రాయింగ్, టీపాయ్ మీదపరిచింది.

“ఏం చేశావో చెప్పు” అంది అమ్మ.

“అత్తయ్యా!.. మన ప్లాటు కార్నర్ ఫ్లాటు. అంటే దానికి రెండు వైపులా రోడ్లు వున్నాయి. తూర్పున వుత్తరాన. విశాలం ఆరు గ్రౌండ్లు అంటే పద్నాలుగు వేలా నాలుగు వందల చదరపు అడుగులు. నేను ప్లాటును రెండు భాగాలుగా చేశాను. ఏడువేల రెండు వందలు ఒక ప్లాటు. ప్రస్తుతం మనం కట్టబోయే బిల్డింగ్ దక్షిణపు వైపు భాగంలో కట్టాలి. వుత్తరపు వైపు సగభాగం ఫ్రీగా వుంటుంది. పుత్తరోత్తరా కావాలంటే ఆ భాగంలో యిలాంటి బిల్డింగ్‍నే మరో దాన్ని నిర్మించవచ్చు.”

నాన్నగారు నవ్వారు హారిక ముఖంలోకి చూస్తూ. హారిక చెప్పడం ఆపి నాన్నగారి ముఖంలో సందేహంగా చూచి..

“మామయ్యా!.. తప్పు చేశానా?..”

“లేదమ్మా!.. చాలా దూరదృష్టితో చేశావు. నా యీ నవ్వు.. నీకు అభినందన” హారిక అందంగా నవ్వింది.

నా ముఖంలోకి క్షణం సేపు చూచి.. “మామయ్యా బిల్డింగ్‌ను గురించి చెప్పమంటారా!..”

“చెప్పమ్మా!..” నా ముఖంలోకి చూచి.. “గోవిందా!.. జాగ్రత్తగా విను” అన్నారు నాన్నగారు.

“చెప్పు కోడలు పిల్లా.” నవ్వుతూ అంది అమ్మ.

“మామయ్యా మీకు తెలిసిన విషయమే.. ప్రతి గృహానికి దక్షిణం, పడమర వైపుల ఖాళీ స్థలం తక్కువగా వుండాలి. తూర్పు, ఉత్తరాల వైపు అధికంగా వాస్తు రీత్యా వుండాలి. మన సగం ప్లాటు కొలతలు, తూర్పు పడమరల వైపు ఎనభై అడుగులు, ఉత్తరం దక్షిణం వైపు తొంభై అడుగులు. బిల్డింగ్‌కి కావలసింది అరవై అయిదు యిన్‍టు నలభై, రెండు వేలా ఐదువందల చదరపు అడుగులు. పడమట దక్షిణాల్లో బిల్డింగ్ నుండి పదిహేను అడుగులు, తూర్పున యిరవై అయిదు, దక్షిణాన యిరవై అడుగులు ఖాళీ స్థలం వుంటుంది. డ్రాయింగును చూడండి. కార్ పోర్చి, వరండా, హాలు, ఆగ్నేయంలో కిచెన్, దానికి పడమర వైపున డైనింగ్ హాల్, దాని ప్రక్క నైరుతీలో మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్, అలాగే వాయవ్యంలో మరో బెడ్ టాయిలెట్, రెండు బెడ్రూములకు మధ్యన మరో బెడ్రూమ్, కిచెన్‌కు వుత్తరం వైపు పూజ గది. యిరవై అడుగులూ యిన్‍టు యాభై అడుగులు అంటే వెయ్యి చదరపుటడుగుల ఆఫీస్, దాని ముందు భాగంలో టెరస్‌కు మెట్లు, హెడ్ రూమ్.. మేడ మీదికి ఆఫీస్ వైపు నుంచి, యింట్లో నుంచీ కూడా వెళ్లే దానికి వీలుగా స్టేర్ కేస్‍ను అమర్చాను. బావగారు చెప్పినట్లుగా అన్నీ గ్రౌండ్ ఫ్లోర్ లోనే. మీరేదైనా సలహాలు యిస్తే.. దేన్నైనా మార్చమంటే మారుస్తాను మామయ్యా.” చెప్పడం ఆపి, హారిక నా ముఖంలోకి క్షణంసేపు చూచి, నాన్నగారి ముఖంలోకి చూడసాగింది.

నాన్నగారు ప్లాన్ను తదేకంగా చూచి.. “అన్నీ పద్ధతిగా, నా మనస్సులో వున్నట్లుగానే అమర్చింది హారిక. లక్ష్మీ.. నీవూ చూచి నీకు ఏదైనా సలహా తోస్తే చెప్పు.”

“నాన్నా!.. వెరీ గుడ్ ప్లానింగ్” ప్లాన్‌ను సాంతం చూచి నా నిర్ణయాన్ని చెప్పాను.

“యీ అడ్డం నిలువు గీతలు నాకేం తెలుస్తాయండీ. గోవిందు బాగుందన్నాడుగా, నాకూ సమ్మతమే” హారిక ముఖంలోకి చూస్తూ నవ్వుతూ అంది అమ్మ.

“గోపాల్, వసంతా!.. మీ అభిప్రాయం ఏమిటి?..”

“మరో బెడ్రూమ్ వుంటే బాగుంటుంది నాన్నా!..” అన్నాడు గోపాల్.

నాన్న అమ్మ వాడి ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూచారు. వారి భావనను గ్రహించిన గోపాల్.. “మన వసంత కోసం నాన్నా!..” నవ్వుతూ చెప్పాడు. నాన్నగారికి, నాకూ, వాడి ఉద్దేశం అర్థం అయింది.

“అవును నాన్నా!.. గోపాల్ అన్నట్లు మరో బెడ్రూమ్ వుండాలి” అన్నాను.

నాన్నగారు నవ్వుతూ.. “హారికా!.. విన్నావుగా!..”.

“వాళ్ళ ఉద్దేశం నాకు అర్థం అయింది మామయ్యా!.. కార్ గరాజ్ పైన మెజినైన్ ప్లోర్‌లో మరో బెడ్రూమ్, చెప్పాను. టాయిలెట్ ఏర్పాటు చేస్తాను. ఎలివేషన్ కూడా బాగుంటుంది మామయ్యా!..” అంది హారిక.

“మెజినైన్ ప్లోర్ అంటే ఏమిటి హారికా!..” అమ్మ అడిగింది.

“కారును వుంచే గరాజ్ ఎత్తు ఎనిమిదడుగులు వుంటుందత్తయ్యా. ఆ స్లాబ్ మీద మరో బెడ్రూమ్ వుంటుంది. ఎలివేషన్ కూడా బాగుంటుంది”

“అలాగా!..”

“అవునత్తయ్యా!..”

“సరే, గోపాల్ చెప్పినట్లుగానే చెయ్యి.’

“సరే అత్తయ్యా!..”

“యీ బిల్డింగ్ ఎస్టిమేషన్..” నేను పూర్తి చేయక మునుపే.. “నాల్గవ బెడ్రూమ్‌ను యాడ్ చేసి.. ఎస్టిమేట్‌ను చేసి, యిస్తాను.” నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది హారిక.

“ఓకే అమ్మా!.. యు హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్” హారికకు నాన్నగారి అభినందనలు.

“వదినా!.. థ్యాంక్యూ!..” నవ్వుతూ హారిక చేతిని తన చేతిలోకి తీసుకొంది వసంత.

“అత్తయ్యా!.. యీ పిల్ల నన్ను పరాయిదాన్నిగా అనుకొంటుంది” చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ అమ్మతో అంది హారిక.

“హరీ!.. నీవు నా కోడలివి. పరాయిదానివి ఎలా అవుతావే!..” క్షణం సేపు హారిక ముఖంలోకి చూచి, “ఏమండీ!.. మీరేమంటారు?..” అమ్మ నాన్నగారిని అడిగింది.

“ఎవరు అన్నా, అనకపోయినా.. హారిక మన కోడలే.” నవ్వుతూ నా ముఖంలోకి చూచి.. హారిక వైపు చూచారు నాన్నగారు.

ఆమె సిగ్గుతో తలదించుకొంది. రెండు క్షణాల తర్వాత.. “మామయ్యా!.. అత్తయ్యా!.. యిక నే వెళ్ళొస్తాను” అంది హారిక.

“భోంచేసి.. వెళుదువు గాని రా వదినా!..” హారిక చేతిని పట్టుకొని యింట్లోకి లాక్కొని పోయింది వసంత.

అమ్మ వారి వెనకాలే వెళ్ళింది.

“గోవిందా!.. హారిక ప్లాన్‍ను బాగా వేసింది కదూ!..”

“అవును నాన్నా!..”

“షి యీజ్ వెరీ క్లవర్ గర్ల్. డిపార్టుమెంట్లో కూడా చాలా మంచిపేరు.” నవ్వుతూ అన్నారు నాన్న.

“ఏదో ఆర్టికల్ వ్రాసింది. దానికి బహుమతి కూడా వచ్చిందన్నయ్యా!..”. కళ్ళు పెద్దవి చేసి గోపాల్ చెప్పాడు.

“అలాగా!..”

“అవును.” గోపాల్ జవాబు.

అమ్మ పిలవగా.. ముగ్గురం భోజనానికి యింట్లోకి నడిచాము.

***

“ఊరిని, యింటిని, ఆఫీస్‌ను వదిలి ఎక్కడెక్కడో బికారిలా తిరుగుతున్నాడు వాడు. నిన్న ఆఫీస్ మేనేజర్ వచ్చి క్రిందివారు, సైట్లల్లో వుండి పనులను నడిపించేవారు, దొంగలెక్కలను, బిల్లులను తయారు చేసి.. డబ్బును కాజేస్తున్నారని చెప్పాడు. చాలాకాలం నుండి మనవద్ద వున్న నమ్మకస్థుడు ఆ రామసుబ్బయ్య, రాత్రంతా తీవ్రంగా ఆలోచించాను. ఒక నిర్ణయానికి వచ్చి.. మీ దగ్గరకు వచ్చాను బావగారూ!..” అంది పెద్దమ్మ శ్యామల రవిబాబు తల్లి.

ఉదయం ఏడున్నరకల్లా కార్లో వచ్చేసింది పెద్దమ్మ మా యింటికి. అమ్మా, నాన్న నేను పెద్దమ్మ హాల్లో కూర్చొని వున్నాము. ఆమె మాటలను విని కొన్ని క్షణాలు ఆలోచించి నాన్నగారు..

“నేను నీకు ఏ రీతిగా సహాయం చేయగలను శ్యామలా!..” అడిగారు.

“నా మనస్సులో రెండు ఉద్దేశాలు వున్నాయి బావగారూ!..”

“ఏమిటవి?..”

“మొదటిది.. నేను మన గోపాల్‍ను దత్తు తీసుకోవాలనుకొంటున్నాను మీరు సమ్మతిస్తే!..” ఆశగా నాన్న అమ్మల వదనాల్లోకి చూస్తూ చెప్పింది పెద్దమ్మ. అమ్మ నాన్న నేను ఆశ్చర్యపోయాము ఆమె మాటలకు. ముగ్గురం ఆమెనే చూస్తూ వుండిపోయాము.

“శ్యామలా!.. నాకు వుండేది యిద్దరు మొగబిడ్డలు. వారిలో ఒకణ్ణి నీకు దత్తు యిస్తామని నీవు ఎలా వూహించ కలిగావు?..” అమ్మ మాటల్లో ఆశ్చర్యమూ, చిరాకు చూస్తున్న మాకు ద్యోతకమయ్యాయి.

పెద్దమ్మ క్షణంసేపు అమ్మ ముఖంలోకి చూచి విచారంతో తల దించుకొంది. “నన్ను క్షమించు లక్ష్మీ!..” గద్గద స్వరంతో అంది.

“శ్యామలా!.. అది కుదరని విషయం. నీ రెండవ అభిప్రాయం ఏమిటో చెప్పు. మాకు వీలైతే నీకు తప్పక సాయం చేస్తాము.” అనునయంగా నాన్నగారు చెప్పారు.

పెద్దమ్మ నాన్నగారి ముఖంలోకి కొన్నిక్షణాలు చూచి, తలదించుకొంది.

“శ్యామలా!.. నిర్భయంగా అడుగు.” నాన్నగారు అమ్మ ముఖంలోకి చూచారు.

“చెప్పు, శ్యామలా!.. నీ రెండో నిర్ణయం ఏమిటి?..” ఎంతో సౌమ్యంగా అడిగింది అమ్మ.

“గోవిందును యం.డి.గా చేసి ఆఫీస్ బాధ్యతలను వాడికి అప్పగించాలని నా ఆశ” మెల్లగా చెప్పింది పెద్దమ్మ.

ఆమె మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. అమ్మా.. నాన్నల ముఖాల్లోకి చూచాను. వారు మౌనంగా ఆలోచిస్తున్నారు.

“వాడికి నెలకు మూడు లక్షల జీతం, కారు, యిస్తాను బావగారూ!..” మెల్లగా అంది పెద్దమ్మ.

“వాడు సొంతంగా కంపెనీ ఆరంభించాలను కొంటున్నాడు శ్యామలా!..” అమ్మ అంది.

“లక్ష్మీ!..” యిక మాట్లాడకు అన్నట్లుగా నాన్నగారు అమ్మ ముఖంలోకి చూచారు.

“నాకు కనీసం మీరు.. యీ సాయం అన్నా చేయాలి బావా!..” దీనంగా అశ్రునయనాలతో అడిగింది పెద్దమ్మ శ్యామల.

నాన్నగారు నా ముఖంలోకి చూచారు. “మీ పెద్దమ్మకు నీవు యీ రీతిగా, సాయం చేయగలవా గోవిందా?.. నా ఉద్దేశంలో నీవు ఆ రీతిగా మీ పెద్దమ్మకు అండగా నిలబడాలి. ఆమె మనస్సుకు ప్రశాంతతను కలిగించాలి. యిది నా అభిప్రాయం” యిది నాన్నగారి నిర్ణయం.

ఆ మాటలను విన్న పెద్దమ్మ ముఖం వికసించింది. నవ్వుతూ.. “బావా!.. ధన్యవాదాలు..” చేతులు జోడించింది.

“నాన్నగారి మాట ప్రకారం.. మీ పెద్దమ్మకు ఆనందం కలిగేలా ‘సరే’ అని చెప్పు నాన్నా” అమ్మ అనునయ వాక్కులు.

నా తల్లిదండ్రులకు సాటి మనుషులు మీద, మానవత్వం మీద వున్న గౌరవాభిమానాలకు, యిలాంటి వారికి బిడ్డగా నేను పుట్టినందుకు నాకు ఎంతో సంతోషం కలిగింది. లేచి వెళ్ళి పెద్దమ్మ ప్రక్కన కూర్చున్నాను. ఆమె కళ్ళ నుంచి కారే కన్నీటిని తుడిచాను. ఆ క్షణంలో నా కళ్ళల్లో కూడా కన్నీరు నిండాయి.

“ఎందుకు నాన్నా యీ కన్నీరు?..” గద్గద స్వరంతో పెద్దమ్మ అడిగింది.

“యివి కన్నీరు కాదు పెద్దమ్మా!.. ఆనందబాష్పాలు. మీకు నేను సాయపడబోతున్నందుకు నా మనస్సుకు ఎంతో ఆనందంగా వుంది. నేను మీరు నాకు అప్పగించే బాధ్యతలను సవ్యంగా నెరవేరుస్తాను నేను.. రవిబాబు ఎక్కడ వున్నా కలిసి, వాడితో మాట్లాడి.. వాడిలో మార్పు కలిగే దానికి నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు దేనికీ.. దిగులు పడకండి. బాధ పడకండి.” ప్రీతిగా చెప్పాను.

పెద్దమ్మకు ఎంతో ఆనందం. “నీ యిద్దరి చిన్న చెల్లెళ్ళను బాగా చదవించి నీవే వారికి మంచి సంబంధాలు చూచి పెళ్ళిళ్ళు చేయాలి గోవిందా!.. ఆ రోజు నీవు యింటికి వచ్చినప్పుడు రూప, దీప ట్యూషన్‌కు వెళ్ళి వున్నారు. నీవు వారిని చూడలేదు. నీవు వచ్చి వెళ్ళిన విషయం చెప్పగానే వాళ్ళు ఎంతగానో సంబరపడ్డారు.” నవ్వుతూ చెప్పింది పెద్దమ్మ. మా అమ్మ ప్రక్కకు వెళ్ళి కూర్చొని, ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని.. “అక్కా!.. నీకు నా మీద కోపం లేదుగా!..” అడిగింది.

“పిచ్చిదానా!.. నీ మీద నాకెందుకే కోపం?.. యీ వయస్సులో ఎంతో ఆనందంగా వుండవలసిన నీవు అటు బావగారి .. యిటు కన్న కొడుకు కోడలికి దూరమై అన్నీ వుండీ.. మానసికంగా నీవు బాధ పడుతున్నందుకు నాకు కష్టంగా వుందే!..” అమ్మ మాటల్లో ఎంతో సానుభూతి నిండి వుంది.

“శ్యామలా!.. యిక నీవు ఏ విషయానికీ బాధపడకు. ఎల్లుండి సోమవారం పది గంటలకల్లా గోవింద్ మీ యింటికి వస్తాడు. వాడితో పాటు నీవూ ఆఫీసు వెళ్ళి అందరినీ వీడికి పరిచయం చేసి.. వీడినీ అందరికీ పరిచయం చెయ్యి. మీటింగ్ పెట్టి వీడి అనుమతి లేకుండా యికపై ఏదీ జరగకూడదని వారందరికీ తెలియజేయి. అన్ని విషయాలూ గోవింద్ చూచుకొంటాడు.”

నాన్నగారు చెప్పిన యీ మాటలకు పెద్దమ్మ ఎంతగానో సంతోషించింది. వారి పాదాలు తాకి ఆశీస్సులతో ఆనందంగా వెళ్ళిపోయింది.

***

ఏడు గంటలకు సుబ్బలక్ష్మి కావలి నుంచి ఫోన్ చేసింది. ఎనిమిదిన్నర కల్లా వూరికి వస్తానని చెప్పింది. ఆనందంగా రమ్మని ఆహ్వానించాను.

ఆ కాల్ తర్వాత కొచ్చిన్ నుంచి ‘నాయర్’, నా ఆమెరికా ఆఫీస్ మీట్ ఫోన్ చేశాడు. నెలరోజులు అక్కడ వుంటానని చెప్పి నన్ను రమ్మన్నాడు. వీలు చూచుకొని తప్పక వస్తానని చెప్పాను. ఆ క్షణంలో నాలో ఓ ఆలోచన కలిగింది. ఆయుర్వేద వైద్యానికి కేరళ ప్రసిద్ధి కదా!.. సుబ్బలక్ష్మి నాగరాజుల సమస్యను గురించి వాడికి చెప్పాను. డా. టి.టి. చాకో పెండ్లి అయ్యి పది సంవత్సరాలయినా, తమ బంధువులకు సంతానం కలుగనందున, వారిని సంప్రదించినట్లు.. వారు యిచ్చిన మందుల వలన ఆ దంపతులకు సంవత్సరం లోపల పండంటి మొగబిడ్డ పుట్టినట్లు.. మీ వారెవరికైనా అలాంటి సమస్య వుంటే తీసుకొని రమ్మని.. తప్పక వారికి సంతానం ఆ డాక్టర్ యిచ్చే మందుల వల్ల కలుగుతుందని నాయర్ చెప్పాడు.

వాడి మాటలను వినగానే.. సుబ్బలక్ష్మిని నాగరాజును తీసికొని కొచ్చిన్ వెళ్ళి ఆ డాక్టర్ గారిని కలవాలని నిర్ణయించుకొన్నాను. నాగరాజు యింటికి వచ్చాడు. వాడికి నాయర్ చెప్పిన విషయాన్ని చెప్పాను. వాడు సంతోషించాడు. తప్పకుండా వెళదామన్నాడు. కానీ.. యీ విషయం అమ్మ నాన్నలకు తెలియకూడదని చెప్పాడు. వాడి సమస్య నాకు తెలిసిందే. కాబట్టి.. మన కేరళ విజిట్ రహస్యంగానే జరుగుతుందని వాడికి చెప్పాను. వాడు నన్ను శ్లాఘించాడు.

“ఓరే బావా!.. నాకు పొగడ్తలు నచ్చవు. నాకు నీవు పరాయివాడివా!.. నీ సమస్య నా సమస్య కాదా!.. గడచిన రెండు సంవత్సరాలుగా నీవు, సుబ్బలక్ష్మి ఎంతగా కష్టపడుతున్నారో నేను అర్థం చేసుకొన్నాను. త్వరలో మీ సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం నాకుందిరా.”

వాకిట్లో బస్సు ఆగింది. సుబ్బలక్ష్మి దిగింది. వరండాలో వున్న మమ్మల్ని నవ్వుతూ సమీపించింది.

“బాగున్నారా అన్నయ్యా!..”

“ఓకే.. నీవెలా వున్నావమ్మా?..” అడిగాను.

క్షణంసేపు.. నాగరాజు ముఖంలోకి చూచి నవ్వుతూ నా వంక చూచి.. “బాగున్నా అన్నయ్యా!..” అంది.

వసంత వాకిట్లోకి వచ్చి సుబ్బలక్ష్మిని చూచి.. “అమ్మా!.. సుబ్బలక్ష్మి అక్క వచ్చిందమ్మా!..” అరిచింది. ఆమెను సమీపించింది. ఆమ్మ నాన్నలను చూచి పలకరించేటందుకు వసంతతో కలిసి సుబ్బలక్ష్మి యింట్లోకి పోయింది.

“బావా!.. యిప్పుడు ఒక సమస్య!..” దీనంగా అన్నాడు నాగరాజు.

“ఏమిటది?..”

“సుబ్బు నేరుగా యింటికి రాకుండా మన యింటి ముందుగా ఎందుకు వెళ్ళినట్లు అని అమ్మ సుబ్బును నిలదీస్తుంది.” వాడి కళ్ళల్లో భయం గోచరించింది నాకు.

“భయపడకు. నేను అత్తమామయ్యలను చూడాలి. నేనూ మీతోపాటే మన యింటికి వస్తాను. అత్తయ్య సుబ్బును ఏమీ అనకుండా నేను చూచుకొంటాను. సరేనా!..” అన్నాను.

మా వాడి ముఖం వికసించింది. యిద్దరం యింట్లోకి వెళ్ళాము.

“నేను యీ రోజు మా అన్నయ్యను చూచేదానికే వచ్చాను పిన్నీ.” యిది అమ్మ అడిగిన ప్రశ్నకు సుబ్బలక్ష్మి జవాబు. అత్త ఏమి అడిగి ఉంటుందో నేను ఊహించుకోగలను. నాగరాజు నా మొహంలోకి చూచాడు.

“మీ అమ్మ అడుగుతుందని నీవు అనుమాన పడ్డావే.. అదే ప్రశ్న అమ్మ అడిగింది. దానికి సుబ్బు ఇచ్చిన జవాబు విన్నావుగా!..” నవ్వుతూ వాడి ముఖంలోకి చూచాను. వాడూ పేలవంగా నవ్వాడు.

అమ్మ అందరికీ టిఫిన్, కాఫీ యిచ్చింది. సుబ్బలక్ష్మి అమ్మకు సాయంగా వర్తించింది.

“అమ్మా!.. నేను వీరితో కలిసి వెళ్ళి అత్తయ్య, మామయ్యలను చూచి వస్తాను”

“సరే నాన్నా!..”

ముగ్గురం.. నాగరాజు యింటికి చేరాము.

“ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావురా!..” కొడుకును అడిగి, “సుబ్బలక్ష్మీ!.. నీవు ఎప్పుడొచ్చావు?..” నిశితంగా ఆమె ముఖంలోకి చూస్తూ అడిగింది రుక్మిణీ అత్తయ్య.

“అన్నయ్య వచ్చాడని వీరు చెప్పారు. వాళ్ళ యింటికి వెళ్ళి వస్తున్నానత్తయ్యా.’ వినయంగా చెప్పింది సుబ్బు.

“అత్తయ్యా!.. కొడుకు కోడలు వంకే కాదు నా వైపు కూడా చూడత్తయ్యా!.. నేను మీ గోవిందును, జ్ఞాపకం వున్నానా!..”

“ఓరేయ్ గోవిందా!.. ఏమిట్రా ఆ మాటలు. నీవేమన్నా పరాయి వాడివా, మరచిపోవడానికి, రా.. రా..” అంది సౌమ్యంగా.

ముగ్గురం ఆమె ముందు నడవగా యింట్లోకి ప్రవేశించాము. డైనింగ్ టేబుల్ మీద తన హ్యాండ్ బ్యాగ్‌ను వుంచి.. “అత్తయ్యా!.. పనేమైనా వుందా!..” అడిగింది సుబ్బు.

“వంటింట్లో తట్టలో వంకాయలు వున్నాయి. కూర చేయాలి. అన్నం వండాలి. మీ మామగారు చారు పెట్టమన్నారు.” సుబ్బూ డ్యూటీని వివరించింది అత్తయ్య.

“సరే అత్తయ్యా!.. నేను వంటింట్లోకి వెళుతున్నాను” సుబ్బలక్ష్మి వెళ్ళిపోయింది. ముగ్గురం కూర్చున్నాము.

“గోవిందా!.. ఏమిటి అమెరికా విశేషాలు?..” అడిగింది రుక్మీణీ అత్తయ్య.

“అత్తయ్యా!.. అన్నీ నీకు తెలిసినవే. టీవీలో చూస్తుంటావుగా. ఆరు సంవత్సరాలు వున్నాను. తిరిగి వచ్చేశాను.”

“అంటే.. తిరిగి వెళ్ళవా?..”

“లేదత్తయ్యా!.. యిక మీదట మీ అందరికీ దగ్గరగా వుంటాను. నెల్లూరులో ఓ ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నాను”

“అలాగా!..”

“అవునత్తయ్యా!..”

“మరి.. పెండ్లి ఎప్పుడు చేసుకొంటావ్?..”

“వసంత పెళ్ళి అయ్యాక.”.

“అది చిన్నపిల్ల కదరా!.. పైగా దాని చదువు పూర్తి కావాలిగా!..”

“వసంత చదువు ఒక్క సంవత్సరంలో పూర్తి అవుతుంది అత్తయ్యా!.. కానీ, శ్యామల మామయ్య, సుందరి అత్తయ్యలు రాఘవకు వెంటనే వివాహం చేయాలని నిర్ణయించుకొన్నారు. మొన్న వచ్చి అమ్మా నాన్నలకు తమ నిర్ణయాన్ని తెలియజేశారు. వారూ సరే అన్నారు. అంటే.. త్వరలో రాఘవకు వసంతకు వివాహం జరుగుతుంది” నవ్వుతూ చెప్పాను.

“అంటే.. సుందరి శ్యామలరావులు త్వరలో మనుమడినో, మనుమరాలినో ఎత్తుకోవాలను కుంటున్నారన్నమాట. వారికి ఆ ఆశ వుండటం సహజమే కదా!.. వాళ్ళకే కాదు.. నాకూ మీ మామయ్యకూ అదే ఆశ. కానీ.. సుబ్బలక్ష్మి జాతకంలో సంతాన యోగం లేదట. వీడితో ఆ మాటంటే నా మీదకి కస్సున లేస్తాడు తోక త్రొక్కిన పాములా. వీళ్ళ పెళ్ళి అయ్యి రెండేళ్ళయింది. దానికి పిల్లలు పుట్టరని చెప్పినా వీడు నా మాట వినిపించుకోవడం లేదంటే.. అది వీణ్ణి ఎలా గంగిరెద్దులా చేసిందో చూడు.”

“అమ్మా!.. యీ విషయాన్ని గురించి మాట్లాడం యిక ఆపుతావా!..” విసుగ్గా అన్నాడు నాగరాజు.

“ఆపనురా!.. ఎందుకు ఆపాలి?.. నేను మాట్లాడేది యథార్థమేగా!.. చూడు గోవిందా!.. నీవు న్యాయం చెప్పు. మాకు మనుమడో.. మనవరాల్నో ఎత్తుకోవాలనే ఆశ వుండటం తప్పా?.. నీ ముందు నాకు దాపరికం ఏంది?.. వీడికి నేను రెండో పెళ్ళి చేయాలని నిర్ణయించుకొన్నాను.” తన హృదయ ఆవేశాన్ని వెళ్ళగక్కేసింది రుక్మిణమ్మత్త.

(ఇంకా ఉంది)

Exit mobile version