Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమేగా ప్రపంచం-5

[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘ప్రేమేగా ప్రపంచం’ అనే నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]

[ముఖ్యమైన విషయం అంటూ భార్యని పిలిచిన రాఘవ తండ్రి, రాఘవకు వెంటనే పెండ్లి చేయాలని అనుకుంటున్నానని చెప్తాడు. ఆమె ఎంతో సంతోషిస్తుంది. ఆ రోజు మంచి రోజు కావడంతో వెంటనే ఊరు వెళ్ళి వసంతను రాఘవకిచ్చి పెళ్ళి చేయమని మీ అన్నయ్యని అడుగుదమని చెప్తారు. మామయ్య సలహా మీద, తామంతా ఇంటికి వస్తున్నాం అని గోవింద ఇంటికి ఫోన్ చేసి చెప్తాడు. కొద్దిసేపటికి రాఘవ, అతని తల్లిదండ్రులు, గోవింద కారులో బయలుదేరి ఇల్లు చేరుతారు. రాఘవని, అతని తల్లిదండ్రులను గోవింద నాన్నగారు, అమ్మగారు ఆదరంగా ఆహ్వానించి, లోపలికి తోడ్కొని వెళ్తారు. వసంతని రాఘవకిచ్చి పెళ్ళి చేయవల్సిందిగా రాఘవ తండ్రి గోవింద అమ్మానాన్నలను కోరుతాడు. వాళ్ళు ఆనందంగా ఒప్పుకుంటారు. బయటకు వెళ్ళిన గోపాల్, వసంత వస్తారు. వస్తూనే మామయ్య, అత్తయ్యల పాదాలకు దండం పెడతారు. ఊరు వెళ్ళ్కా, నిశ్చితార్థానికి, పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తానని చెప్తాడు రాఘవ తండ్రి. సరేనంటారు. అందరూ భోజనానికి కూర్చుంటారు. వసంత జాగ్రత్తగా వడ్డిస్తుంది. భోజనానంతరం ఓ గంటసేపు విశ్రాంతి తీసుకొని మామయ్య అత్తయ్య రాఘవ నెల్లూరికి వెళ్ళిపోతారు. సాయంత్రం హెడ్ మాస్టర్ రామకోటయ్యగారు వచ్చి గోవిందని పలకరిస్తారు. కాసేపు మాట్లాడాకా, గోవింద స్థాపించిన ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రస్తుత ప్రెసిడెంట్ సునీల్ అవవతవకలకు పాల్పడతున్నాడని చెప్తారు. ఆ విషయం తను అమెరికాలో ఉండగానే తన దృష్టికి వచ్చిందని చెప్ప్తి, త్వరలో సమావేశం జరుతుపున్నామని, అతన్ని పదవిలో ఉంచాలో వద్దో ఆ మీటింగ్‍లో నిర్ణయిస్తామని చెప్తాడు. మాస్టారు మజ్జిగ తాగి వెళ్తారు. ఆయన వెళ్ళిన కొద్దిసేపటికి మిత్రుడు నాగరాజు వస్తాడు. గోవిందతో ఏకాంతంగా మాట్లాడాలంటే, సరేనని తమ తోటకి తీసుకెళ్తాడు గోవింద. – ఇక చదవండి.]

తోటలో చెట్ల మీద కొన్ని రకాల పక్షలు, చిలకులు గోరింకలు గూళ్లు కట్టుకొని వుంటాయి. వాటికి కావలసిన ఆహారం.. పళ్ళు, ఆయా ఋతువుల్లో తోటలోనే పండుతాయి. హాయిగా తిని అవన్నీ ఆనందంగా ఆ చెట్లపైన ఎగురుతూ వుంటాయి.

దాదాపు నలభై ఆవులు.. యిరవై బర్రెలు మాకున్నాయి. తోటలోని చెట్లకు మొక్కలకు స్వచ్ఛమైన వాటి పేడనే నాన్నగారు ఎరువుగా వుపయోగిస్తారు. రసాయనికపు ఎరువులను యీ తోటలో వారు వాడరు. అందుకే.. మా తోటలో పూచిన పువ్వుకు పండిన పండుకు, కూరలకు.. మంచి వాసన, రుచి. వంతుల వారీగా తమ్ముడు గోపాల్, చెల్లి వసంతా నాన్నగారితో కలసి ఆ తోటలో పని చేస్తారు.

చాలా రోజుల తర్వాత చూస్తున్నందువల్ల గత స్మృతులన్నీ నాకు జ్ఞాపకానికి వచ్చాయి. మేము ఎప్పుడూ కూర్చొనే ఓ మామిడి చెట్టు క్రింద నేను నాగరాజు కూర్చున్నాము.

“పురుషోత్తం మామయ్య, అత్తయ్య రుక్మిణి, నీ భార్య సుబ్బలక్ష్మీ, ఎలా వున్నార్రా!..”

“అంతా బాగానే వున్నారు.”

“సుబ్బలక్ష్మి వుద్యోగం చేస్తూ వుందా, మాన్పించావా?..”

“చేస్తూనే వుంది.”

“ఏ వూర్లో?..”

“కావలి..”

“అయితే.. శని ఆదివారాలు యింటికి వస్తుందా!..”

“రాదు. నేనే వెళుతుంటాను.”

“అంటే!..”

“అమ్మకు దానికి పడడం లేదురా!..” దీనంగా నా ముఖంలోకి చూచాడు నాగరాజు.

“పెండ్లయి రెండేళ్ళు అయింది కదా!.. యింతవరకూ..”

“సుబ్బలక్ష్మి నీవు అనుకొంటున్నంత మంచిది కాదురా..”

“అంటే..”

“మా అమ్మను లెక్కచేయదు.”

“మరి మీ అమ్మ ఆమెను అభిమానంగా చూచుకొంటుందా?..”

నా ఈ ప్రశ్నకు వాడు వెంటనే జవాబు చెప్పలేక పోయాడు. బిక్క ముఖంతో శూన్యంలోకి చూస్తూ వుండిపోయాడు. కొద్దిక్షణాల తర్వాత..

“తనూ నాలాగే వుద్యోగం చేస్తూ, సంపాదిస్తున్నాననే గర్వం దానికి వుందిరా!..” అన్నాడు నాగరాజు.

“యిది నీ మాటా.. లేక, మీ అమ్మగారి మాటా?..”

“నా మాటే!..”

“పెండ్లికి ముందు సుబ్బలక్ష్మి వుద్యోగం చేసే విషయం నీకు తెలుసు కదా. గవర్నమెంటు జాబ్, రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది బిడ్డల భవిష్యత్తును బాగా తీర్చిదిద్దవచ్చు.. అని కూడా నీవు నాతో ఆనందంగా అన్నావు కదరా..”

“అన్నాను. కానీ..”

“పిల్లలు..”

“యింకా పుట్టలేదుగా!..”

“సుబ్బలక్ష్మికి పిల్లలు పుట్టరట.” నా కళ్ళల్లోకి చూస్తూ ఖచ్చితంగా అన్నాడు నాగరాజు.

“యీ మాటను నీకు ఎవరు చెప్పారు?..”

“మా అమ్మ.”

“ఆమెకెలా తెలుసు?”

“సుబ్బు జాతకాన్ని జ్యోతిష్కుడికి చూపించిందట.”

“అంటే.. ఆ జాతక బ్రహ్మ చెప్పిన మాటలను మీ జనని నమ్మి, సుబ్బలక్ష్మిని సాధించడం మొదలు పెట్టిందన్న మాట. ఆ కారణంగా సుబ్బు మీ యింటికి అదే తన యింటికి రావడం మానేసిందన్నమాట. సరే.. యీ న్యూస్ నీకు ఎప్పుడు తెలిసింది?..”

“సంవత్సరం క్రిందట.”

“మీ అమ్మ మాటలను నీవు నమ్మావా!..”

నా ఈ ప్రశ్నకు, నిట్టూర్చి విచారంగా తల దించుకొన్నాడు నాగరాజు.

“నాగూ!.. నా ప్రశ్నకు జవాబు చెప్పరా!..”

“అమ్మ ఏం చేసినా నా మేలు కోరే కదరా చేస్తుంది?..”

“యిది నా ప్రశ్నకు జవాబు కాదు. నమ్మాను. నమ్మలేదు. ఈ రెండింటిలో ఏదో ఒకటిగా వుండాలి నీ జవాబు.”

“నమ్మాను.” తలవంచుకొనే చెప్పాడు నాగరాజు.

వాడి అసమర్థతకు వాడిపై నాకు కోపం వచ్చినా వాడిలోని అమాయకత్వం.. నన్ను పరుషంగా మాట్లాడనివ్వలేదు.

వాడి పెండ్లి జరిగి రెండు సంవత్సరాలు. యింత వరకూ.. సుబ్బలక్ష్మి నెల తప్పలేదు. యిరుగుపొరుగమ్మల వ్యాఖ్యానాలు విని రుక్మిణి అత్తయ్య కోడలిని గొడ్రాలుగా భావించింది. పైగా.. ఆ జోశ్యుడు భవిష్యవాణి, అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది. సుబ్బు యింటికి వస్తే.. అత్తయ్య ధ్వజం ఎత్తుతుంది. ఆ సెగను భరించలేక ఆమె యిక్కడికి రావడం మానేసింది. ఒకవేళ.. వీరిరువులో ఎవరికైనా ఏదైనా లోపమా?.. డాక్టర్ చేత చెక్ చేయించుకొంటే.. నిజానిజాలు తెలిసిపోతాయి కదా!.. వీడు ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు?.. యీ నా ప్రశ్నకు జవాబు వాడే చెప్పాలి.

“ఒరేయ్!.. మీరిరువురూ డాక్టర్ని కలిశారా?..”

“లేదు..”

“నాగూ!.. నీ సమస్య నాకు పూర్తిగా అర్థం అయిందిరా. రెండేళ్ళయినా.. పిల్లలు పుట్టని కారణంగా రుక్మిణి అత్తయ్యకు సుబ్బలక్ష్మి మీద కోపం, అనుమానం. యీ రెండూ ఆమెకు దూరం కావాలంటే.. మీరిరువురూ మంచి డాక్టర్ని వెంటనే సంప్రదించాలి. టెస్టు చేసి వారు మీ సమస్యకు పరిష్కార మార్గాన్ని చెబుతారు. నీవు చాలా మంచి వాడివిరా. భగవంతుడు నీకు అన్యాయం చేయడు. నా మాట నమ్ము” ప్రీతిగా వాడి భుజంపై చేయి వేసి తట్టాను.

అంతవరకూ వాడి ముఖంలో వున్న విచార ఛాయలు, పోయి ముఖంలో క్రొత్త కాంతి నిండింది. నా మాటలు వాడి హృదయానికి శాంతిని కలిగించినందుకు నేను సంతోషించాను.

“సుబ్బలక్ష్మికి ఫోన్ చెయ్యి.” నా యాపిల్ ఐ ఫోన్ ఫైవ్ యస్‌ను వాడికి అందించాను. స్పీకర్ను ఆన్ చేశాను.

“హలో. ఎవరండీ?”

“నేను.. సుబ్బూ, నాగరాజు”

“బాగున్నారా!..”

“ఆ నీవు ఎలా వున్నావ్?..”

“షరా మామూలు.. అవునూ.. మీరు క్రొత్త ఫోన్‌ను కొన్నారా!..”

“లేదు.” నవ్వాడు నాగరాజు.

“యీ ఫోన్ ఎవరిది?..”

“మా బావ..”

“అన్నయ్య అమెరికా నుంచి వచ్చారా!..”

“వచ్చాడు.”

“ఎప్పుడు?..”

“రెండు రోజులయింది.”

“వారు యిప్పుడు ఎక్కడ వున్నారు?..”

“నా ప్రక్కనే వున్నాడు”

“ఫోన్ ఒక్కసారి అన్నయ్యగారి చేతికి యిస్తారా!..”

“యస్..” నాగరాజు ఫోన్‍ను నా చేతికి యిచ్చాడు.

“హలో!.. సుబ్బలక్ష్మి..”

“అన్నయ్యా!.. బాగున్నారా!..”

“బాగున్నానమ్మా. నిన్ను చూడాలని వుంది”

“నాకూ మిమ్మల్ని చూడాలని వుందన్నయ్యా!.. నేను యీ ఆదివారం మన వూరికి వస్తానన్నయ్యా.”

“తప్పకుండా వస్తావా అమ్మా..”

“యీ చెల్లి అన్నయ్యకు యిచ్చిన మాట ఎలా మీరగలదన్నయ్యా?..”

“చాలా సంతోషం అమ్మా.”

“నాకూ మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తూ వుందన్నయ్యా. ఆదివారం తొమ్మిది గంటలకల్లా నేరుగా మన యింటికే వస్తాను. పెదనాన్నకు పెద్దమ్మకు గోపాల్ వసంతలకు చెప్పండి. వుంటానన్నయ్యా థాంక్యూ.”

సుబ్బలక్ష్మి కట్ చేసింది.

“నాగూ!.. మైక్ ఆన్ చేసి వుంచాను. విన్నావుగా, సుబ్బూ మాటలను. ఆమె నీతో మాట్లాడిన మాటల్లో, నాతో మాట్లాడిన మాటల్లో ఎంతో ఆప్యాయత అభిమానం నిండి వున్నాయి. ఆమె చర్యల్లో ఏ తప్పు వుండేదానికి ఆస్కారం లేదు. ఆవేశం.. తొందరపాటు.. మాట దురుసు మీ అమ్మ.. మా అత్తయ్య రుక్మిణీ మాటల్లో వుండి వుంటాయ్. సమస్య వున్న వారిపై అభిమానాన్ని చూపించాలే కాని.. అసహ్యించుకోకూడదు నాగూ. అత్తయ్య చేసింది తప్పు. సుబ్బలక్ష్మి ఏ తప్పూ చేయలేదు” అనునయంగా చెప్పాను. యిరువురం లేచి యింటి వైపుకు నడిచాము. యిరువురం మా యింటి వరండాను సమీపించాము. అమ్మ వరండాలోకి వచ్చింది. నా ఫోన్ మ్రోగింది. అది రాఘవ కాల్. ఎవరు అన్నట్లు అమ్మ తల ఆడించింది. “రాఘవ అమ్మా!..” అమ్మకు చెప్పి “చెప్పు రాఘవా!..”

“బావా!.. మీ కారు రేపు డెలివరీ చేస్తారట. తీసుకొని నేను మన వూరికి వస్తున్నాను. పది గంటలకల్లా చేరుతాను.” ఎంతో హుషారుగా చెప్పాడు రాఘవ.

“వెరీ గుడ్ రాఘవా. వెరీ గుడ్.” నవ్వుతూ నా ఆనందాన్ని వ్యక్తం చేశాను. “జాగ్రర్తగా రా రాఘవా!..” అన్నాను.

“అలాగే బావా.” రాఘవ కట్ చేశాడు.

“ఏంటి నాన్నా విషయం?..” అమ్మ అడిగింది.

“రాఘవ మన కారుతో రేపు పదిగంటలకల్లా యిక్కడ వుంటాడట.”

“అలాగా!..” అమ్మ వదనంలో ఆశ్చర్య ఆనందాలు.

నాన్నగారు పొలం నుంచి తిరిగి అదే సమయానికి వచ్చారు. విషయాన్ని వారికీ చెప్పాను. వారు నవ్వుతూ అమ్మ ముఖంలోకి చూచారు. “బావా!.. యిక నే వెళతాను.” అన్నాడు నాగరాజు.

“మీ బావ, మామయ్యతో కలసి భోం చేద్దువుగాని వుండరా నాగూ!..” అంది అమ్మ.

“లేదత్తయ్యా!.. నాన్న నాకోసం ఎదురు చూస్తూ వుంటారు. వెళతాను. రేపు బావతో కలసి భోం చేస్తాను.” నవ్వుతూ చెప్పాడు నాగరాజు.

“సరే.. నీ యిష్టం.”

నాగరాజు.. నాన్నకు నాకు చెప్పి వెళ్ళిపోయాడు. అమ్మ నాన్న నేను యింట్లోకి నడిచాము.

నాన్నకు నాకు అమ్మ భోజనాన్ని వడ్డించింది. మేము తినడం ప్రారంభించాము.

అమ్మ క్యాలెండర్ చేతికి తీసుకొని కొన్ని సెకండ్లు చూచి గోడకు తగిలించింది.

“లక్ష్మీ ఏమిటి విషయం.. క్యాలెండర్‍ని చూచావు?..” అడిగారు నాన్నగారు.

“రేపు మన కారు వస్తూ వుందిగా!..”

“అవును. శుక్రవారం, దశమి తిథి, మంచిరోజు.”

“అందరం కలసి జొన్నవాడ వెళ్ళి కామాక్షి తల్లిని దర్శించి రావాలని వుందండి.” నాన్నగారి ప్రక్కకు వచ్చి చెప్పింది అమ్మ.

“కారు ఎన్ని గంటలకు వస్తుంది గోవిందా..”

“పది గంటల కల్లా వస్తానని రాఘవ చెప్పాడు నాన్నా!..”

“సరే.. మనమంతా రడీగా వుందాం. కారు రాగానే జొన్నవాడకు వెళ్ళి ఆ తల్లిని దర్శించి వస్తాము. సరేనా లక్ష్మీ!..”

అమ్మ ముఖంలో వెయ్యి దీపాల కాంతి. “నాకు చాలా ఆనందంగా వుందండి” అంది అమ్మ నాన్నగారి ముఖంలోకి చూస్తూ.

“నాకూ చాలా సంతోషంగా వుంది లక్ష్మీ. అమ్మాయి వివాహ విషయాన్ని గురించి కూడా ముచ్చటించాం కదా!.. జొన్నవాడకు వెళ్ళి, ఆ తల్లిని దర్శించి వద్దాం. అన్ని పనులనూ ఆ తల్లి ముందుండి సవ్యంగా నడిపిస్తుంది.” ఆ తల్లి మీద తనకున్న నమ్మకాన్ని నాన్నగారు వ్యక్తం చేశారు. మామయ్య శ్యామలరావుకు ఫోన్ చేసి, వారిని జొన్నవాడకు రమ్మని చెప్పారు.

మరుదినం.. రాఘవ అరగంట ముందుగానే క్రొత్త కారుతో వచ్చాడు. జొన్నవాడకు వెళ్ళి కామాక్షి మాతను దర్శించి, కుంకుమ పూజ చేయించి, తీర్థ ప్రసాదాలు సేవించి ఆనందంగా మా వూరికి బయలుదేరాము. రాఘవ, మామయ్య, అత్తయ్య నెల్లూరికి వెళ్ళిపోయారు.

నాన్నగారు ముందు సీట్లో నా ప్రక్కన కూర్చున్నారు. నేను డ్రైవ్ చేస్తున్నాను. అమ్మ తమ్ముడు చెల్లి వెనక సీట్లో కూర్చున్నారు.

“పిల్లలూ నేను చెప్పేది జాగ్రర్తగా వినండి. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికీ దైవం మీద నమ్మకం వుండాలి. మన జనన మరణాలకు కర్త ఆ దైవమే. దైవాన్ని నమ్మినవాడు ఎన్నటికీ చెడిపోడు. తను సృష్టించిన వాణ్ణి కాచి.. రక్షించడం ఆ దేవును కర్తవ్యం. మనం చేయవలసిందిల్లా చిత్తశుద్ధితో దైవాన్ని నమ్మడం, నిస్వార్థ చిత్తంతో మన కర్తవ్యాన్ని నిర్వహించడం. స్వార్థం, ద్వేషం, దురాశలకు దూరంగా వుండడం, సాటి మనిషిని.. మనిషిగా గుర్తించి ప్రేమాభిమానాలను సౌభ్రాత్రాన్ని పంచడం. యీ విధానాలను నమ్మి ఆచరించిన వారి జీవితాలు ప్రశాంతంగా సాగిపోతాయి. నేటివరకూ నేనూ మీ అమ్మ మా జీవితాలను యీ సిద్ధాంత రీతిగానే గడిపాము. అంతిమ శ్వాస వరకూ మా రీతి యింతే.

‘నేను’ అనే పదం ‘అహంకారం’. ఈ అహంకారానికి లోనైనవారు తను నాశనమై పోవడమే కాక.. తన సంబంధీకులనూ కష్టాల పాలు చేలు చేసిన వారౌతారు. ‘మనం’ అనే పదం ‘ఆత్మీయత’. యిది కలిగిన వారు.. తాము ఎంతో ప్రశాంతంగా జీవిస్తు, తనకు అయిన వారికి చుట్టు ప్రక్కల వారికి.. శాంతి సౌఖ్యాలను కలిగించిన వారౌతారు. ధనార్జన మనుగడకు అవసరం. మనిషి ధనాన్ని ఆర్జించగలడు. కానీ.. ధనం మనిషిని సృష్టించలేదు. అవసరాలకు అవసరమైన ఆర్జన మనిషికి అవసరం. దురాశతో ధనమే సర్వస్వం అని భావించి ఆర్జనా వ్యామోహంలో పడిపోయిన వాడు, విచక్షణారహితుడై దానవుడిగా మారిపోయి, తప్పులు చేసి ఆ తప్పులను సరిదిద్దుకొనేటందుకు మరికొన్ని తప్పులు చేసి మనశ్శాంతిని కోల్పోయి మృగంలా మారిపోతాడు.

ముఖ్యంగా ప్రతి పురుషుడూ తెలిసికొనవలసింది, గుర్తుంచుకొనవలసింది, తన జీవిత కాలంలో ఆచరించవలసింది ‘స్త్రీ మూర్తి’ని గౌరవించడం. ఈ సృష్టిలో ఆ పవిత్రమూర్తి లేకుంటే.. పురుష రూపానికి ఆస్కారం లేదు. ఓ స్త్రీ.. యిల్లాలుగా, అమ్మగా, అక్కచెల్లిగా పెద్దమ్మ, పిన్నిగా, అత్తగా, నానమ్మ అమ్మమ్మగా, యిన్ని రూపాంతరాలతో, పురుషుడి శ్రేయస్సును తమ జీవితాంతం కోరుతూనే వుంటుంది. వారి దైవ ప్రార్థన ఆరాధనలు తమ భర్త కోసం.. సంతతి కోసం.. తాను క్రొవ్వు వత్తిగా మారి తన వారికి వెలుగును అందించి చివరికి శేష చరితమై ఒకనాడు కన్నుమూస్తుంది. ఆమె లేని నాడు తెలిసి వస్తుంది ఆ లోటు. అందరూ తెలిసి కొనవలసినది.. ‘స్త్రీ’ అంటే ‘శక్తి’. శక్తి తోడు లేని నాడు పురుషుడు నిర్వీర్యుడు. జీవచ్ఛవం.

కనుక.. స్త్రీని చిన్నచూపు చూడటం, మాయమాటలు చెప్పి తమ యిష్టానుసారంగా వాడుకొని మరో స్త్రీతో సంబంధం కల్పించుకొని, మొదటి ఆమెను నిర్లక్ష్యం చేయటం మహాపాపం. స్త్రీ వేదన, శాపంగా మారి ఆమెతో ఆడుకొన్న వాడిని, వారి వంశాన్ని నాశనం చేస్తుంది.

నేను చెప్పిన పై విషయాలకు, గోవిందా!.. నీ స్నేహితులు రవిబాబు, బాబూరావులే ప్రత్యక్షసాక్షులు.

ముప్పయ్ ఏడువేల జీవరాసులు వున్న యీ సృష్టిలో.. అత్యంత వున్నతమైనది యీ మన మానవ జన్మ. ఆ భగవంతుడు కేవలం మనిషికే ప్రసాదించిన మహత్తర శక్తులు రొండు. జ్ఞాపకశక్తి, విచక్షణా జ్ఞానం. మనిషిలో వున్న యీ విశేష శక్తులే, నేడు మనం చూస్తున్న నూతన విజ్ఞాన సాధనాలు. విజ్ఞానపు విరులు. వాటిని సద్వినియోగం చేసికోవాలే కాని, దుర్వినియోగం చేయకూడదు. కొందరు నేటి మీలాంటి విద్యావంతులు ఆ సాధనాలను దుర్వినియోగం చేస్తున్నారు. స్త్రీ జాతికి కష్టాలను కలిగిస్తున్నారు. అలాంటి సంఘటనలను గురించి పేపర్లల్లో టీవీల్లో ఎంతో, బాధాకరమైన వార్తలను చదువుతున్నాము. వింటున్నాము.

ప్రపంచంలో ఏ జాతికీ లేని ఔన్నత్యం మన హైందవ జాతికి.. యీ భూమి భారతావనికి వుంది. సనాతన ధర్మం.. అద్వైత సిద్ధాంతం మన సొంతం. పవిత్రత.. శాంతి.. సహనం.. సౌభ్రాత్రం మన సహజ గుణాలు. మనుగడకు మీరు చదివే పాశ్చాత్య విజ్ఞానం మన.. మన తరతరాల విజ్ఞానానికి భిన్నం. యీ విజ్ఞానం మీలోని సహజత్వాన్ని మరిచేలా చేసి, మీరెవరో మీకు తెలియని స్థితికి వచ్చారు నేటి కొందరు విద్యావేత్తలు. స్వధర్మాలను తెలిసికోలేని వాడు.. పరధర్మాలను పై మెరుగులను మనుగడ వరకే తెలిసుకొంటాడు గాని.. ఆ ధర్మాలనూ పూర్తిగా అవగాహన చేసికోలేడు. నేటి యువత జీవితం.. వ్యామోహంతో కూడిన విచక్షణ లేని పరుగు పందెం అయిపోయింది. అందుకే ఎన్నో వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి. నా బిడ్డలైన మీరు నేను చెప్పిన వాటికి అతీతంగా మీరెవరో.. ఎరిగి మీ భావి జీవితాలను, కన్న తల్లిదండ్రులమైన మాకు, మనకు అయినవారికీ, ఆనందం కలిగించేలా సంతరించుకోవాలని నా కోరిక. మా జీవిత కాలంలో మీరు పదిమందికి ఆదర్శప్రాయులుగా బ్రతకాలని మా యిరువురి ఆకాంక్ష. మనం నమ్మి దైవం మీకు వేళలా అండగా వుండాలని ఆ మహాశక్తి స్వరూపిణి జొన్నవాడ కామాక్షి మాతను వేడుకొన్నాను. వేడుకొంటున్నాను” నాన్నగారు చెప్పడం ఆపి కళ్ళు మూసుకున్నారు.

(ఇంకా ఉంది)

Exit mobile version