Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమేగా ప్రపంచం-4

[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘ప్రేమేగా ప్రపంచం’ అనే నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]

[రాఘవతో కలిసి తన మిత్రుడు రవిబాబు ఇంటికి వెళ్తాడు గోవింద. రవిబాబు ఇంట్లో లేరని వాచ్‍మన్ చెప్తాడు. రవి అమ్మగారు శ్యామలమ్మ ఉన్నారా అని, తనెవరో చెప్పి రమ్మంటాడు గోవింద. వాచ్‍మన్ లోపలికి వెళ్ళొచ్చి, అమ్మగారు రమ్మంటున్నారు వెళ్ళండి అని చెప్తాడు. లోపలికి వెళ్ళిన గోవింద, రాఘవ శ్యామలమ్మకి నమస్కరిస్తారు. తాను మరణానికి చేరువలో ఉన్నాననీ చెబుతూ తన కొడుకు రవి చేసిన దుర్మార్గాలన్నీ చెప్పుకుని బాధపడుతుంది. ఆమెని ఓదార్చి రవిని మార్చడానికి ప్రయత్నిస్తానని చెప్పి, కాసేపు కూర్చుని బయల్దేరుతాడు గోవింద. మర్నాడు ఉదయం జాగింగ్ చేస్తుండగా, ఈ రోజు ప్రోగ్రామ్ ఏమిటని గోవిందని అడుగుతాడు రాఘవ. మరో మిత్రుడు డా. బాబూరావుని కలవాలని అంటాడు గోవింద. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉండడం లేదని సౌతాఫ్రికాలో ఉంటున్నాడని చెప్తాడు రాఘవ. భార్యాబిడ్డలని తీసుకువెళ్ళాడా అని అడిగితే, అతనికి ఒకటి కాదు, రెండు పెళ్ళిళ్ళయ్యాయని రాఘవ చెప్తాడు. తతిమా వివారాలు మా నాన్నకి బాగా తెలుసని చెప్తాడు. కాసేపయ్యాకా, గోవింద వెళ్ళి మామయ్య పక్కన కూర్చుని బాబూరావు విషయమంతా తెలుసుకుంటాడు. మొదటి భార్య లావణ్యని మభ్యపెట్టి, నర్స్ లిల్లీని పెళ్ళి చేసుకోవడం, కొన్నాళ్ళకి ఆ విషయం బయటపడి, లావణ్య విడాకులివ్వడం, ఇక్కడ ఉండడానికి మొహం చెల్లక, బాబూరావు తన పేరు జాన్సన్ అని మార్చుకుని లిల్లీతో కలిసి సౌతాఫ్రికా వెళ్ళడం అన్నీ వివరంగా చెప్తారాయన. అంతా విన్న గోవింద బాధపడతాడు. సరే ఇంతకీ నీ పెళ్ళెప్పుడు అని మావయ్య అడగటంతో, చెల్లి వసంతకి పెళ్ళి చేశాకనే అని చెప్తాడు గోవింద. అప్పుడు మావయ్య, ముఖ్యమైన విషయం అంటూ అత్తయ్యని పిలుస్తారు. – ఇక చదవండి.]

“రాఘవకు వెంటనే పెండ్లి చేయాలనుకొంటున్నాను.”

“మనవడు మనవరాళ్ళతో సరదాగా కాలం గడపాలనేదేగా మీ ఉద్దేశం” అత్తయ్య నవ్వింది.

“గ్రహించావ్. చాలా సంతోషం.” లేచి గోడకు వున్న క్యాలండర్ చేతికి తీసికొని వచ్చి సోఫాలో కూర్చున్నారు. దాన్ని తదేకంగా చూడసాగారు.

“ఈ రోజు దశమి గురువారం, ప్రశస్తంగా వుంది త్వరగా తయారుకా.” “ఎందుకు?..”

“మీ ఊరికి వెళ్ళేదానికి. వసంతను మన అబ్బాయి రాఘవకు యిచ్చి పెండ్లి చేయమని మీ అన్నయ్యను అడిగేదానికి”

“ఏమిటండీ మీరంటున్నదీ!..” అత్తయ్య ఆశ్చర్యపోయింది.

నాదీ.. అదే స్థితి. అత్తయ్య ముఖంలోకి చూచాను. ఆమె వదనంలో ఎంతో ఆనందం.

“ఎందుకు అంతగా ఆశ్చర్యపోతావ్?.. వసంత నా కోడలని నేను ఎప్పుడో నిర్ణయించుకొన్నాను.” వారి మాటల్లో ముఖంలో ఎంతో ఆనందం.

“ఓరేయ్! గోవిందా!.. నాన్నకు ఫోన్ చేసి చెప్పరా మనమందరం వస్తున్నామని.”

“అలాగే అత్తయ్యా!..”

నాన్నగారికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పాను. వారు వెంటనే అమ్మను పిలిచి చెప్పారు. అమ్మ కూడా నాతో ఆనందంగా మాట్లాడింది.

రాఘవ తన గది నుండి క్రిందికి వచ్చాడు.

“సుందరీ!.. అరగంటలో మనం బయలుదేరాలి.” చెప్పి.. రాఘవ ముఖంలోకి చూస్తూ.. “మేము నీకు పిల్లను చూడబోతున్నాము. నీవూ త్వరగా రడీ అయ్యి క్రిందికి రా.” అన్నాడు మామయ్య.

రాఘవ ఆశ్చర్యపోయాడు. నా ముఖంలోకి అత్తయ్య ముఖంలోకి దీనంగా చూచాడు.

“పద వివరాలు నే చెబుతాను.” యిద్దరం రాఘవ గది వైపుకు నడిచాము. ఆనందంగా అత్తయ్య తన గదికి వెళ్ళింది.

“రాఘవా!.. నీవంటే నాకు ఎంతో యిష్టం. అలాగే నీకు నా చెల్లి వసంత.. నీకు యిష్టమేనా!.. ఆమెను నీ జీవిత భాగస్వామిగా చేయాలనేది మీ నాన్నగారి కోరిక. అదే.. నా కోరిక కూడా!..”

“బావా!.. వసంతంటే యిష్టం లేదని ఎవరన్నా అంటారా!..” సిగ్గుతో

తల దించుకొన్నాడు నవ్వుతూ రాఘవ.

“అంటే, వసంతంటే.. నీకు..”

“చాలా యిష్టం బావా!…” నేను పూర్తి చేయక ముందే తన నిర్ణయాన్ని తెలియజేశాడు రాఘవ.

నాకు చాలా సంతోషం కలిగింది. “సరే. త్వరగా రడీగా. బయలుదేరుదాం.” అన్నాను ఆనందంగా.

పదిహేను నిముషాల్లో మేమిరువురం క్రిందికి వెళ్ళాము. మామయ్యగారు సిద్ధంగా వున్నారు. అత్తయ్య హాల్లోకి వస్తూ “ఏమండీ దొడ్లో చెట్టుకు పనస పళ్ళు చాలా వున్నాయి. అవంటే మా అన్నయ్యకు చాలా యిష్టం. రెండు కాయలు కోసి కార్లో వేసుకొందాం.”

“వాటిని ఎవరు కోస్తారు?.. దుర్గయ్య లేడు సుందరీ!..”

“ఓరేయ్!.. రాఘవా నీవు కోయలేవా?..”

“కోస్తానమ్మా!..”

రాఘవ నేను యింటి వెనక్కు వెళ్ళి రెండు పళ్ళు కోశాము. అత్తయ్య అక్కడికి వచ్చింది. ప్రక్కనే దానిమ్మ చెట్టుకున్న కాయలను చూచి, పెద్దవిగా వున్న వాటిని దాదాపు యిరవై దాకా కోసింది. “మా వదినకు దానిమ్మ చాలా యిష్టంరా!..” అంది మమ్మల్ని చూస్తూ. యింతలో మామయ్య అక్కడికి వచ్చారు. వారిని చూచిన అత్తయ్య.. “పదండి. పదండి” నవ్వుతూ అంది. నలుగురం కార్లో మా వూరికి బయలుదేరాము.

ఐదు నిముషాల్లో యింటికి చేరబోయే ముందు ఫోన్ చేసి అమ్మకు వచ్చేశాం అని చెప్పాను.

మేము చేరేసరికి.. అమ్మానాన్నలు వీధి వాకిట్లో నిలబడి మా కోసం ఎదురు చూస్తున్నారు.

కారు నుంచి దిగిన మామయ్యను మా నాన్నగారు.. అత్తయ్యను మా అమ్మ ఆప్యాయంగా కౌగలించుకొన్నారు. పరస్పరం వారి మధ్యన వున్న ఆదరాభిమానాలు నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచాయి. అది మన సంస్కృతికి నిదర్శనం అనుకొన్నాను.

అందరం హాల్లోకి చేరి కూర్చున్నాము. మా పాలేరు పనస పండ్లను, దానిమ్మ పండ్లను తెచ్చి డైనింగ్ టేబుల్ మీద వుంచి వెళ్ళిపోయాడు. పని మనిషి పున్నమ్మ మంచినీళ్ళు.. కాఫీని అందరికీ అందించింది.

“బావా!.. గోపాల్.. వసంతా ఏరి?” అడిగాడు మామయ్య.

“ఆఫీసు, కాలేజీకి వెళ్ళారు కదా!.. అరగంటలో వచ్చేస్తారు బావా!..” నాన్నగారి జవాబు.

“బావా!.. మీతో ఓ ముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడాలని వచ్చాను.”

ప్రక్క ప్రక్కన కూర్చొని వున్న అమ్మ అత్తయ్య ఆసక్తితో మామయ్య ముఖంలోకి చూస్తున్నారు.

“గోవిందును వివాహం ఎప్పుడు చేసికొంటావని అడిగాను. చెల్లి పెళ్ళి అయిన తర్వాత.. అన్నాడు. వాడు అన్న మాటలో న్యాయం వుంది.”

“ఏమిటన్నయ్యా ఆ న్యాయం.” అమ్మ అడిగింది.

“అమ్మా లక్ష్మీ!.. రాబోయే కోడలు ఎక్కడ వుందో ఆమె గుణగణాలు ఎలాంటివో. కోడలిగా యింట్లో ప్రవేశించిన ఆమె, అందరితో కలిసిపోతుందో లేదో.. ముఖ్యంగా మరదలు వసంత విషయంలో ఎలా ప్రవర్తిస్తుందో ఎవరికి తెలుసు!.. ఏదైనా భేదాభిప్రాయం ఏర్పడిందంటే.. యిటు కుటుంబ సభ్యులు అటు యిల్లాలు.. మధ్యన మనవాడు నలిగి పోవలసి వస్తుంది. యీనాటి చాలామంది పిల్లల విజ్ఞానం.. సంపాదనకు పరిమితమే కాని, మన సంప్రదాయాలకు సంస్కృతి కాదు. కీడెంచి మేలు ఎంచమన్నారు మన పెద్దలు. గోవింద్ యీ లాజిక్‌ను ఫాలో కావాలనుకొంటున్నాడు. అదీ కరక్టే. వాడి లైన్ క్లియర్ కావాలంటే, మన వసంత వివాహం ముందు జరగాలి. చల్లకొచ్చి ముంత దాచడం నాకు తెలియని విషయం. నేను.. మీ వసంతను నా కొడుకు రాఘవకు యిచ్చి వివాహం జరిపించ వలసినదిగా మీ ఉభయులనూ కోరుతున్నాను.” నవ్వుతూ చెప్పారు మామయ్య.

“చాలా చాలా సంతోషం బావా!.. మీ నిర్ణయమే మా నిర్ణయం” నాన్నగారి జవాబు.

“అమ్మా లక్ష్మీ!.. నీవేమంటావ్?..”

“అన్నయ్యా!.. నాకు పరిపూర్ణ సమ్మతం”

ఆ క్షణంలో అమ్మ నాన్నల ముఖాల్లోని ఆనందం వర్ణనాతీతం.

“బావా!.. ఒక్కమాట.” ప్రాధేయపూర్వకంగా నాన్నగారు చెప్పారు.

“చెప్పండి బావా!…”

“అమ్మాయి చదువు మరో సంవత్సరం..”

“వుంది.. చదవాలి.. చదువుతుంది.” నాన్నగారు పూర్తి చేయక మునుపే.. మామయ్య తన అభిప్రాయాన్ని తెలిపారు.

“యిక నాకు ఎలాంటి సందేహం లేదు బావా!.. మీ నిర్ణయమే నా నిర్ణయం.” ఎంతో సంతోషంగా నాన్నగారు చెప్పారు.

“సుందరీ!.. సంతోషమా!..”

“చాలా సంతోషం అండి.” అత్తయ్య కళ్ళల్లో వింత మెరుపు.

“రాఘవా!.. మా సంభాషణ అంతా విన్నావుగా!..” రాఘవ ముఖంలోకో చూస్తూ అడిగాడు మామయ్య.

“విన్నాను నాన్నా.” వినయంతో కూడిన రాఘవ జవాబు.

“మీ నాన్న అభిప్రాయం నీకు నచ్చిందా?..”

“నచ్చింది నాన్నా!..” నవ్వుతూ చెప్పాడు రాఘవ.

“వెరీ గుడ్.. దటీజ్ మై సన్.” ఆనందంగా నవ్వాడు మామయ్య. నావైపు చూచి.. “గోవిందా నేను నీ లైన్ క్లియర్ చేశాను. రాఘవ వివాహం జరిగిన వెంటనే నీ వివాహం జరగాలి. యిఫ్ దేరీజ్ ఎనీ అప్పీల్, పుట్ట్ ఫార్వర్డ్ డియర్.”

“నో అప్పీల్ మామయ్య!..” నవ్వుతూ చెప్పాను.

అందరూ ఆనందంగా నన్ను చూస్తూ నవ్వారు.

గోపాల్, వసంత వచ్చారు. సుందరి అత్తయ్య వసంతను ఆప్యాయంగా దగ్గరకు తీసికొంది.

“నమస్తే అత్తయ్యా!.. మామయ్యా నమస్తే!..” వందనంగా పలికింది వసంత.

గోపాల్ వారిరువురి పాదాలు తాకి ఆశీర్వచనాలను తీసుకొన్నాడు. అమ్మా నాన్నల ముఖాల్లో ఎంతో ఆనందం.

“బావా!.. వూరికి వెళ్ళిన తర్వాత నిశ్చితార్థానికి వివాహానికి ముహూర్తాలు పెట్టించి మీకు తెలియజేస్తాను.” అన్నారు మామయ్య వసంత ముఖంలోకి నవ్వుతూ చూస్తూ.

“అలాగే బావా!..”

అమ్మా అత్తయ్యా లేచి వంటగది వైపుకు వెళ్ళారు. వసంత వారిని అనుసరించింది. పది నిముషాల తర్వాత వసంత హాల్లోకి తిరిగి వచ్చి.. “మామయ్యా, నాన్నా అన్నయ్యా అందరూ భోజనానికి రండి.” అని చెప్పింది.

రాఘవ వంక చూచి నవ్వింది. ఆ నవ్వులోని అర్థం తమరూ భోజనానికి దయ చేయండని. రాఘవ నవ్వుతూ మెల్లగా తల ఆడించాడు. యిరువురి చూపులను నేను గమనించానని.. తెలుసుకొన్న వసంత సిగ్గుతో నవ్వుతూ తల దించుకొని లోనికి వెళ్ళిపోయింది.

అమ్మ చెప్పగా.. అందరికీ వసంతే వడ్డించింది. మామయ్య ఆమె ప్రతి కదలికను, మాటను, ఎంతో శ్రద్ధగా గమనించారు. వారిని గమనిస్తున్న నాకు ఆ విషయం అర్థం అయింది.

“బావా!.. గోవిందుకు మన వాళ్ళల్లో ఎవరి దగ్గరైనా అమ్మాయి వుందా?..” నాన్నగారిని అడిగాడు మామయ్య.

“వున్నారు బావా!.. ముందు అమ్మాయి పెండ్లి జరిపించి తర్వాత వెంటనే చూద్దాం. ఏమంటారు?..”

“అలాగే. ఒక్క విషయం.. యీ సంవత్సరంలోనే గోవిందుడి పెండ్లి కూడా జరగాలి” నవ్వుతూ నా వంక చూచి అన్నారు మామయ్య.

భోజనానంతరం.. ఓ గంటసేపు విశ్రాంతి తీసుకొని మామయ్య అత్తయ్య రాఘవ నెల్లూరికి వెళ్ళిపోయారు.

***

ఉదయం… ఏడున్నర అయింది. వసంత యిచ్చిన కాఫీ త్రాగి వరండాలో కూర్చొని పేపరు చూస్తున్నాను. ‘లెవల్ క్రాసింగ్ దగ్గర రైలు క్రింద నలిగిపోయిన కారు’ యది ఒక హెడ్డింగ్ వార్త. వివరాలు చదివాను. ముగ్గురు స్త్రీలు ముగ్గురు మగవారు ఆ ప్రమాదంలో మరణించారు. సమయం రాత్రి పది గంటలు. ఆ వార్త చివరన పోలీసులు ప్రమాదం జరిగిన దానికి కారణాలను దర్యాప్తు చేస్తున్నారు అని ప్రచురింపబడి వుంది.

తరచుగా యిలాంటి వార్తలను పేపర్లల్లో టీవీల్లో చూస్తూ.. వింటూ వున్నాము. ఎవరు ఎన్ని విధాల విచారించినా, పోయినా వారిని బ్రతికించగలరా?.. కానీ బాధ్యతాయుత వుద్యోగులు.. నాయకులు తలచుకొంటే యిలాంటి ప్రమాదాలు రైల్వే క్రాసింగ్ వద్ద జరగకుండా శాశ్వత పరిష్కారాలను సమకూర్చగలరు.

స్వాతంత్ర్యం సిద్ధించి ఇన్ని సంవత్సరాలు అయింది. పది సంవత్సరాలకు ముందు నడుస్తుండిన రైళ్ళ కంటే యిప్పుడు రెట్టింపు రైళ్ళు నడుస్తున్నాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో రైల్వే క్రాసింగ్ ప్రాంతాలు పూర్వం స్వాతంత్ర్యానికి ముందు ఎలా వుండేవో… యీనాడూ అలాగనే వున్నాయి. ఆ ప్రాంతాల్లో ఓవర్ బ్రిడ్జి లేనందున యిలాంటి ప్రమాదాలు తరచూ సంభవిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో వుండే ప్రజాప్రతినిధులు, నాయకులు బ్రిడ్జి నిర్మాణం ఎంత ముఖ్యావసరమో గమనించి రాష్ట్ర ముఖ్యమంత్రికి దేశ ప్రధానమంత్రికి తెలియజేసి అత్యవసరమైన బ్రిడ్జీల నిర్మాణాన్ని కావిస్తే.. అలాంటి ప్రమాదాలు జరగకుండా చేసిన వారౌతారు కదా!.. ఒక ముఖ్యమంత్రికి.. ప్రధానమంత్రికి యిలాంటి రైల్వే క్రాసింగ్సు ఎక్కడెక్కడ వున్నాయో తెలియడం అసాధ్యం. ఆయా ప్రాంత ప్రజానాయకులే తమ యీ అవసరాలను వారి దృష్టికి తీసుకొని పోవాలి. ఆకాశ మార్గంలో జరిగే విమాన ప్రమాదాలను ఎవరూ ఆపలేరు. నెలమీద జరిగే యిలాంటి ప్రమాదాలను నిరోధించడం మన చేతిలో పని.

చచ్చిపోయిన వారికి లక్ష రూపాయలు కాంపెన్సేషన్ యిస్తే.. అది ఆ కుటుంబ సభ్యులను కొంతవరకూ ఆదుకొన్నట్లు అవుతుందేగాని, పోయిన ఆ కుటుబ సభ్యుడు తిరిగి రాలేడు కదా!.. పోయిన ఆ వ్యక్తి వ్యవసాయదారుడు కావచ్చు, విద్యావేత్త కావచ్చు.. ముఫై నలభై ఏళ్ళకు వారి జీవితం యీ రీతిగా మట్టిపాలైతే.. ఎంతో ముందు జీవితం వున్న వారి వియోగం కేవలం ఆ ఒక్క కుటుంబానికే కాదు, యావత్ మానవ సముదాయానికి, రాష్ట్రానికి దేశానికి కలిగిన నష్టం అవుతుంది.

“గోవిందా, బాగున్నావా!..”

ఆలోచనా స్రవంతి నుండి బయటికి వచ్చి ముందుకు చూచాను. ఎదురుగా మా స్కూలు హెడ్మాస్టర్ రామకోటయ్యగారు. మాకు బంధువు కూడా.

కుర్చీ నుంచి లేచి వారిని సమీపించాను. “రండి.. సార్.. రండి” చేతులు జోడించాను.

“శ్రీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.” నవ్వుతూ చెయ్యి ఎత్తి దీవించారు హెడ్మాస్టర్ గారు.

“కూర్చోండి సార్!..”

వారు కుర్చీలో కూర్చొన్నారు. “వచ్చావని విన్నాను. చూచి మాట్లాడాలని వచ్చాను.”

“నేను.. మీ దగ్గరికి రావాలనుకొన్నాను. మరో.. అరగంట తర్వాత.”

“నేను నీ దగ్గరకు వచ్చినా.. నీవు నా దగ్గరకు వచ్చినా తేడా ఏముంది గోవిందా!.. మనం కలవడం ముఖ్యం.”

మాస్టారుగారు మజ్జిగ ప్రియులు. అమ్మతో చెప్పాలని.. లేచి

“సార్!.. యిప్పుడే వస్తాను.” లోనికి వెళ్ళి మాస్టారుగారు వచ్చారని అమ్మకు చెప్పి వరండాలోకి వచ్చాను.

“యింట్లో అందరూ కులాసానా సార్!..” అడిగాను.

“ఆ సర్వశ్వరుడి దయవల్ల అందరూ క్షేమమే గోవిందా!.. కూర్చో.”

కుర్చీలో కూర్చున్నాను. వారి ముఖంలోకి చూస్తూ.. “చెప్పండి మాస్టారు!..” అన్నాను.

“గోవిందా!.. మీ ఓల్డు బాయిస్ అసోషియేషన్, ప్రస్తుత ప్రెసిడెంట్ సునీల్.. యీ మధ్య కాలంలో కొంత మార్పు కలిగిందని విన్నాను. మీ స్నేహితులందరూ పంపే డబ్బును.. తన అవసరాలకు, ఆనందానికి వాడు కొంటున్నట్లుగా నీ జూనియర్స్ చెప్పగా విన్నాను. వాడు నాకు కనుపించి దాదాపు సంవత్సరం అవుతోంది.” విచారంగా చెప్పారు మాస్టారుగారు.

“మీరు చెప్పిన విషయం నా చెవికీ.. నేను అమెరికాలో వుండగానే వచ్చింది. అందుకే అందరం.. యీ ఆదివారం నాడు మన వూర్లో కలవాలని.. నేను నిన్ననే అందరికీ మెసేజ్‍ని పంపాను. ఆ సమావేశంలో అన్ని విషయాలను గురించి మాట్లాడుదాం సార్. సునీల్.. చెప్పే యధార్ధాన్ని అనుసరించి, వాణ్ణి ప్రెసిడెంట్‌గా వుంచడమా.. మరొకరిని నియమించడమా అనే విషయాన్ని నిర్ణయిద్దాం. మీ ఆశీర్వాద బలంతో మేమంతా బాగా వృద్ధిలోనికి వచ్చాము. మా జూనియర్స్ కూడా, మంచి వాతావరణంలో బాగా చదివి వృద్ధిలోకి రావాలనేది నా కోరిక.” నా అభిప్రాయాన్ని మాస్టార్ గారికి తెలియజేశాను.

మజ్జిగ గ్లాసు చేత పట్టుకొని చెల్లి వసంత వచ్చింది. మాస్టారు గారికి అందించింది.

“తీసుకోండి సార్.” అంది

“గోవిందా!.. నేను ఎప్పుడు యీ యింటికి వచ్చినా మజ్జిగ త్రాగకుండా వెళ్ళిన రోజంటూ లేదు.” నవ్వుతూ ఆనందంగా చెప్పారు మాస్టారు.

వసంత యిచ్చిన మజ్జిగ త్రాగి గ్లాసును వసంతకు అందించారు. ఆమె యింట్లోకి వెళ్ళిపోయింది.

“ఓ విషయం అడుగుతాను. తప్పుగా అనుకోవు కదా!..” అన్నారు మాస్టారు. “అడగండి సార్!..” నవ్వుతూ అన్నాను. వారు అడగబోయే విషయం నాకు తెలుసు. అది.. నా పెండ్లి ఎప్పుడని.

“నీ పెళ్ళి పప్పన్నం.. ఎప్పుడు పెట్టాలని నిర్ణయించుకొన్నావు గోవిందా?” నేను నవ్వాను. నన్ను చూచి.. “ఎందుకు నవ్వుతున్నావ్. నేనేమైనా తప్పుగా అడిగానా!..” అన్నారు మస్టారు తదేకంగా నా ముఖంలోకి చూస్తూ.

“ముందు చెల్లి వసంత పెళ్ళి.. ఆ తర్వాత నాది. సార్!.. నిన్ననే మా సుందరి అత్తయ్యా, శ్యామలరావు మామయ్యా వచ్చి.. వసంతను వాళ్ళ రాఘవకు యివ్వవలసిందిగా అడిగి.. నాన్న అమ్మలను ఒప్పించి వెళ్ళిపోయారు.”

“ఓహెూ!.. అలాగా. చాలా మంచి వార్తను చెప్పావు గోవిందా.. నాకు చాలా ఆనందంగా వుంది. అవును.. ముందు వసంత వివాహం జరగడమే ధర్మం.” నవ్వుతూ చెప్పారు మాస్టారుగారు. కుర్చీ నుండి లేచారు.

“గోవిందా!.. యిక నే వెళ్ళొస్తాను.” అన్నారు.

“మంచిది సార్.”

వారితోపాటే వీధి వాకిటి వరకూ నడిచాను. వారు మరోసారి వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. మా యింటి వైపుకే వస్తున్న నా మిత్రుడు నాగరాజును చూచి నవ్వుతూ నిలబడ్డాను. వాడు నవ్వుతూ నన్ను సమీపించాడు.

“బావా!..” అంటూ నన్ను కౌగలించుకొన్నాడు.

నిజం చెప్పాలంటే నాకు రవిబాబు, బాబూరావు కన్నా వీడంటే ఎక్కువ యిష్టం. కారణం.. వీడు అమాయకుడు. ప్లెయిన్ హార్టెడ్ ఫెలో.

“నాగూ!.. యింట్లో అందరూ బాగున్నారా!..”

“ఆఁ” మెల్లగా అన్నాడు.

ఆ పలుకులో నేను ఆశించిన జవాబు లేదు. వాడి ముఖంలోకి పరీక్షగా చూచాను.

“బావా!.. నీతో నేను చాలా మాట్లాడాలిరా!.. యీ రోజు నీ ప్రోగ్రామ్ ఏమిటి?”

“రెస్టు ఎట్ హోమ్.” నవ్వుతూ అన్నాను.

“సరే పద.. మన మామూలు స్థలానికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకొందాం”

గోపాల్, వసంత వాకిట్లోకి నెల్లూరికి వెళ్ళేదానికి వచ్చారు. గోపాల్ బుల్లెట్ యిరువురూ మాకు ‘బై’ చెప్పి వెళ్ళిపోయారు. వారితో పాటు అమ్మ కూడా వాకిట్లోకి వచ్చింది. అమ్మకు చెప్పి, నేను నాగరాజు మా యింటి వెనకన వున్న మా తోట వైపుకు నడిచాము.

ఆ తోట వైశాల్యం ఐదు ఎకరాలు. ఒక ఎకరంలో మట్టి, యిసుక పరిపించి మేము ముగ్గురం మా స్నేహితులతో కలసి అన్ని ఆటలూ ఆడేదానికి వీలుగా తయారు చేయించారు నాన్నగారు. ఆయన యిప్పటికీ ఉదయాన్నే గంటసేపు ఆ ప్రాంతంలో జాగింగ్ కసరత్తు చేస్తాడు. ఆరోగ్యంగా వుండాలంటే ప్రతి ఒక్కరూ వ్యాయామం తప్పని సరిగా చేయాలనేది వారి సిద్ధాంతం.

నాలుగెకరాల్లో లేని పండ్ల చెట్లు, పూలచెట్లు అంటూ వేరే ఏమీ లేవు. సహజంగా జన్మించింది వ్యవసాయ కుటుంబంలో కాబట్టి.. ఆ తోటలో వున్న చెట్లన్నా పూలమొక్కలన్నా నాన్నగారికి ఎంతో యిష్టం. పాదులను సరిచేసి మోటర్ ఆన్ చేసి వాటన్నింటికీ తగిన రీతిగా నీటిని పెట్టడం, ప్రతి దినం వారి ఉదయపు దినచర్య. అమ్మ కూడా వారితో కలసి పని చేస్తుంది. నేను అమెరికాకు పోకముందు నాన్నగారికి సహాయంగా మా తోటలో అమ్మానాన్నలతొ కలిసి పనిచేసేవాణ్ణి. మాకు కావలసిన అన్ని రకాల కూరగాయలు నాన్నగారు మా తోటలోనే పండిస్తారు.

(ఇంకా ఉంది)

Exit mobile version