Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమేగా ప్రపంచం-2

[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘ప్రేమేగా ప్రపంచం’ అనే నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]

చదువులలో రాణించి, ఉద్యోగరీత్యా అమెరికా వెళ్ళిన గోవింద, చాలా ఏళ్ళ తర్వాత, ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియాకి బయల్దేరుతాడు. హుస్టన్ నుండి దుబాయికి, అక్కడి నుంచి చెన్నైకి. విమానమెక్కాక, తన ప్రస్థానాన్ని, తన బాల్యాన్ని, చిన్ననాటి మిత్రులు రవిబాబు, నాగరాజు, బాబూరావులను గుర్తు చేసుకుంటూ గతంలోకి వెళ్తాడు. నాలుగేళ్ళ క్రితం ఇండియాకి వచ్చినప్పుడు తనూ, ముగ్గురు మిత్రులు, మరికొందరు జూనియర్లతో ‘ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్’ స్థాపించాడు. జూనియర్స్‌లో ఒకడైన సునీల్‌ను ప్రెసిడెంట్‍గా నియమించి స్కూలుకి మేలు చేస్తాడు. అక్కడ చదివే పిల్లలు వృద్ధి లోకి రావాలని కోరుకుంటాడు. చెన్నై ఎయిర్‍పోర్టులో దిగుతాడు. అతన్ని రిసీవ్ చేసుకోడానికి తమ్ముడు గోపాల్, చెల్లి వసంత, మేనత్త కొడుకు రాఘవ వస్తారు. ఆప్యాయంగా పలకరింపులయ్యాకా, అందరూ రాఘవ కారులో ఇంటికి బయల్దేరుతారు. – ఇక చదవండి.]

రోజు ఆదివారం. నాలుగున్నర కల్లా యింటికి చేరాము. అమ్మా నన్ను చూడ్డంతోటే.. “నాయనా వచ్చావా!..” నా చెక్కిళ్ళపై తన చేతులు వుంచి ఆనందంగా నా ముఖంలోకి చూచింది.

నాన్న నా భుజంపై చెయ్యి వేసి ఎంతో ప్రీతిగా నన్ను చూచాడు.

వారి స్పర్శతో నా శరీరం పులకించింది. వంగి వారి పాదాలను తాకాను. “నిండుగా నూరేళ్ళు ఆనందంగా అనుకూలవతి అయిన యిల్లాలితో, బిడ్డా పాపలతో చల్లగా వర్థిల్లాలి నాయనా.” అంది అమ్మ

“శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు” యిది నాన్నగారి దీవెన.

వారి ఆ ఆశీస్సులతో నా విషయంలో వారి నిర్ణయం ఏమిటో అర్థం అయింది. అందరం యింట్లోకి నడిచాము.

అమ్మ నా తలకు నూనె పెట్టింది. అరగంట తర్వాత స్నానం చేశాను. అప్పుడు సమయం ఏడు గంటలు.

చలికాలంలో వేసుకొనే దానికి నాన్నగారి కోటు.. అమ్మకు వులెన్ స్వెట్టర్ కొన్నాను. ఇరువురూ వాటిని వేసికొని నిలువుటద్దం ముందు నిలబడి చూచుకొన్నారు. చాలా బాగున్నాయని ఎంతో సంతోషించారు.

తమ్ముడు గోపాలు.. చెల్లి వసంతకు ల్యాప్‌టాప్స్.. క్యాలిక్యులేటర్స్.. గడియారాలు కొన్నాను. వాటిని చూచిన వారి ఆనందం అంతా యింతా కాదు. చివరగా రాఘవకు యాపిల్ ఐసెల్ ఫోన్‌ను యిచ్చాను. దాన్ని చూచిన వాడికి పరమానందం. “సూపర్‍గా వుంది బావా. థాంక్యూ.” నా చేతిని తన చేతిలోకి తీసుకొని కరచాలనం చేశాడు.

తర్వాత.. అందరం కలిసి కబుర్లు చెప్పుకొంటూ టిఫిన్ చేశాము. యిరుగు పొరుగు వారు వచ్చారు. కుశల ప్రశ్నలు వేశారు. వినయంగా నవ్వుతూ అందరికీ సమాధానాలు చెప్పాను.

వరసకు అత్త అయిన నారాయణమ్మ అడిగింది.

“తిరిగి అమెరికాకు పోవంటగా. బంగారంలాంటి వుద్యోగాన్ని వదులుకొని యిక్కడ వుండి ఏం చేస్తావ్?..”

“ఏదో చేస్తాడు. అది నీకు యిప్పుడు అవసరమా వదినా!..” కాస్త వెటకారంగానే అంది అమ్మ.

ఆమె ప్రశ్న నాకూ నచ్చలేదు. నాన్నగారు మిగతా నా కుటుంబ సభ్యులు ఆమెను అడవి జంతువును చూచినట్లు చూచారు.

వారి చూపుల అర్థాన్ని గ్రహించిన నారాయణమ్మ.. “ఏదో అయిన వాడివి కదా అని ఆత్మీయతా భావంతో అడిగాను. ఎవరు ఏమైపోతే నాకెందుకు?..”  రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది.

యీమె తత్వం.. యిక్కవి అక్కడ.. అక్కడివి యిక్కడకు చేరవేసి మనుషుల మధ్య వుండవలసిన మమతానురాగాలను తుంచి వేయడమే.. అందులో.. ఆమెకు ఆనందం. సంతృప్తి. అందుకే మేమంతా ఆమెకు ఆడనారదుల వారనే పేరును పెట్టాము. ఆమె కనబడితే ఆ పేరును చెప్పి నవ్వుకొంటుంటాము.

అందరూ వెళ్ళిపోయాక రాఘవ.. “బావా.!.. నేను బయలు దేరుతాను” అన్నాడు.

నా మనస్సులో ఒక కారును కొనాలని వుంది. త్వరలో నెల్లూరులో ఓ కంప్యూటర్ సెంటర్ ఓపెన్ చేయాలని నా నిర్ణయం. ఆ విషయాన్ని గురించి అమ్మా నాన్నలతో ప్రస్తావించాలనుకొన్నాను.

“రాఘవా! వుండు. నీతో నేనూ వస్తాను. అమ్మా నాన్నలతో మాట్లాడి” అన్నాను.

“సరే అలాగే బావా!..”

నాన్నగారు నా మాటలు విన్నారు. అమ్మ యింట్లో వుంది.

“ఏంటి నాన్నా విషయం?..” అడిగాడు నాన్న

నవ్వి.. “అమ్మను కూడా రానీ నాన్నా. చెబుతాను” అని..”అమ్మా!.. అమ్మా!..” పిలిచాను.

అమ్మ హాల్లోకి వచ్చింది. నాన్నగారి ప్రక్కన సోఫాలో కూర్చుంది. “విషయం ఏమిటి నాన్నా!..”

“నేను మన కోసం ఒక కారు కొనబోతున్నాను. త్వరలో నెల్లూరులో కంప్యూటర్ సెంటర్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. మనకు పొగతోటలో ఆరు గ్రవుండ్ల స్థలం వుందిగా ఓ చిన్న బిల్డింగ్ నిర్మించాలనుకొంటున్నాను. యీ విషయాల్లో నాకు మీ సలహా ఏమిటి?..” వారి ముఖాల్లోకి చూస్తూ.. అడిగాను.

“కట్టించబోయే యిల్లు కాస్త పెద్దదిగానే కట్టిద్దాం. ఓ మూడు వేల చదరపు అడుగులకు తగ్గకుండా. కొంత నీ ఆఫీసు.. ట్రిబుల్ బెడ్రూమ్స్ కొంత, మనం ఎప్పుడన్నా వెళ్లి వుండేదానికి వీలుగా. ఏమంటావ్ లక్ష్మీ.” అమ్మ ముఖంలోకి చూచాడు నాన్న.

అమ్మ “మీ నిర్ణయం బాగుంది. అలాగే చేద్దాం” నవ్వుతూ నా ముఖంలోకి చూచింది

“మరి.. కారు నాన్నా!..” అడిగాను.

“తప్పక వెంటనే కొనాలి. నీవు యీ పనుల మీద ఎన్నోసార్లు నెల్లూరు వెళ్ళాల్సి వుంటుందిగా. అంతేకాదు ఆరు సంవత్సరాలు అమెరికాలో కార్లో తిరిగిన వాడివి. యిప్పుడు యిక్కడ నీవు రిక్షాల్లో ఆటోల్లో తిరగలేవు నాన్నా. యీ పనులన్నీ సవ్యంగా జరగాలంటే వారం రోజుల లోపల కారు వాకిట్లో వుండాల్సిందే.” తన ఖచ్చిత అభిప్రాయాన్ని చెప్పి.. నాన్నగారి ముఖంలోకి చూస్తూ.. “మీరేమంటారు?..” అమ్మ అడిగింది.

“నీ నిర్ణయమే నా నిర్ణయం.” నవ్వుతూ చెప్పారు నాన్నగారు.

యీ సంభాషణను అంతా గోపాల్.. వసంతా వింటున్నారు. వారి ముఖాల్లో ఎంతో ఆనందం. కానీ వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది.. మా అమ్మా నాన్నలు మాకు నేర్పిన సంస్కారం. పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు పిన్నలు జోక్యం కలిగించుకోకూడదని. వారి తత్వానికి.. ముఖ భావాలకు నేను ఎంతగానో సంతోషించాను.

“నాన్నా!.. మన బిల్డింగ్ ప్లాన్ హారిక చేత వేయిద్దాం” అన్నాడు నాన్న.

“హారిక ఎవరు నాన్నా!..”

“గుర్తు లేదా!.. మా చిన్నాన్న కొడుకు.. మా అన్నయ్య శ్యామ్ సుందర్ కూతురు.” అమ్మ చెప్పింది.

“ఓ.. అలాగా!..”

“అవును. ఆ అమ్మాయి సివిల్ యింజనీర్. పి. డబ్ల్యు డిపార్టుమెంటులో నెల్లూర్లోనే పని చేస్తూ వుంది. కొద్ది కాలంలోనే మంచి పేరును సంపాదించింది. అంతేకాదు గోవిందా!.. చాలా తెలివైన పిల్ల.”

“చాలా అందంగా కూడా వుంటుంది నాన్నా!..” అమ్మ సూటిగా నా ముఖంలోకి చూస్తూ చెప్పింది.

ఆమె విషయంలో నా తల్లిదండ్రులకు వున్న అభిప్రాయం వారి మాటలతో నాకు అర్ధం అయింది. ప్రసంగం యింకా లోతుగా వెళితే నేను యిరకాటంలో పడతాను.

“సరే నాన్నా!.. అలాగే చేద్దాం.” అన్నాను ముక్తసరిగా.

“యీ రోజు ఆదివారం. యింటికి వచ్చి వుంటుంది. ఏమండీ!.. పిలిపిద్దామా!..”

“ఆ.. పిలిపించు.”

వసంత అమ్మ ప్రక్కకు జరిగింది. అమ్మ వసంత ముఖంలోకి చూచింది. నవ్వుకొంటూ వసంత వీధి వైపుకు పరుగెత్తింది.

అమ్మా నాన్నల చూపులు కలిశాయి. వారినే చూస్తున్న నాకు వారి ఉద్దేశం అర్థం అయింది. ఆ క్షణంలో వారి ముఖాల్లో నాకు ఎంతో ప్రశాంతత గోచరించింది.

ప్రతి మనిషీ.. తాను తలచినట్లు జరుగుతూ వుంటే.. ఎంతో సంతోషంగా.. ప్రశాంతంగా వుంటాడు. మా అమ్మా నాన్నలు అదే స్థితిలో వున్నారు. శేషజీవితంలో.. వారు ఎప్పుడూ యిలాగే వుండాలి. ఆ విషయంలో నా వంతు ధర్మాన్ని నేను సవ్యంగా నెరవేర్చాలి. వారికి ఆనందాన్ని కలిగించాలి’ అనుకొన్నాడు. రాఘవ.. గోపాల్ ‘హిందు’ పేపర్‍ను చదువుతున్నారు.

ముందు వసంత.. వెనుక హారిక హాల్లోకి వచ్చారు. హారికను చూడగానే అమ్మ సోఫా నుంచి లేచి ఎదురు వెళ్ళి ఆమె చేతిని తన చేతిలోకి ఆప్యాయంగా తీసికొని సోఫాను సమీపించింది.

“నమస్కారం మామయ్యా..” చేతులు జోడించింది చిరునవ్వుతో హారిక.

“ఆఁ.. వచ్చావా!.. కూర్చో.” నవ్వుతూ అన్నాడు నాన్న. అమ్మ ప్రక్కన హారిక కూర్చుంది.

నేను ఆమె ముఖంలోకి చూచాను. చూపులు కలిశాయి. “నమస్తే!..”

“నమస్తే…” నాకు నమస్తే చెబుతుందని నేను వూహించలేదు. యాంత్రికంగా అదే పదాన్ని పలికాను.

“హారికా!.. వీడెవడో నీకు తెలుసుగా..” నాన్నగారు అడిగారు.

‘తెలుసు’ అన్నట్లు తల ఆడించింది హారిక.

“యీ రోజే అమెరికా నుంచి వచ్చాడు” అంది అమ్మ.

“వసంత చెప్పిందత్తయ్యా!..” హారిక కంఠం మృదు మధురం.

“నీవు ఓ రెండు వేలా ఐదు వందల చదరపు అడుగుల బిల్డింగ్ డిజైన్

చేసి మాకు యివ్వాలి హారికా..” నాన్నగారు చెప్పారు.

“అలాగే మామయ్యా!.. కానీ..”

“కానీ!.. ఏమిటి నీ సందేహం?..” హారిక పూర్తి చేయక ముందే నాన్నగారు అడిగారు.

“సింగల్ ఫ్లోరా లేక డబుల్ ఫ్లోరా?.. రెసిడెన్షియల్లా, ఆఫీస్ కాంప్లెక్సా?..”

“నాన్నా!.. నీ అభిప్రాయాన్ని చెప్పు.” నా ముఖంలోకి చూచారు నాన్నా.

“థవుజండ్ యస్.యఫ్.టి. జిప్ ఫర్ ఆఫీస్.. వన్ థవుజండ్ ఫైవ్ హండ్రడ్ ఫర్, త్రీ బెడ్రూం హౌస్, నో ఫస్టు ఫ్లోర్.”

నా యింగ్లీష్ యాక్సెను ఆశ్చర్యంగా నా ముఖంలోకి చూచింది హారిక.

“హారికా!.. మా వాడు చెప్పింది నీకు అర్థం అయిందా?..” అమ్మ ప్రశ్న.

“అయిందత్తయ్యా!..” నవ్వుతూ అంది హారిక.

ఆమె నవ్వినప్పుడు చాలా అందంగా వుంది. పై పళ్ళు కొంచెం వెడల్పు. మల్లె మొగ్గల్లా మెరుస్తున్నాయి.

“ఆ ప్లాన్ ఎన్ని రోజుల్లో యివ్వగలవు హారికా?..” నాన్నగారి ప్రశ్న.

“పై ఆదివారం యిదే సమయంలో యిస్తాను మామయ్యా”

“రోడ్లో నుంచి చూచేదానికి బాగుండాలి” యిది అమ్మ కోరిక.

“దాన్ని ఎలివేషన్ అంటారు అత్తయ్యా. చాలా బాగుండేలా తయారు చేస్తాను”

“నీవు చేయగలవు. నీ మీద నాకు ఆ నమ్మకం వుందమ్మా!..” నాన్నగారి అభిప్రాయం. అభినందన.

“నేను ఒకసారి ఫ్లాట్‌ను చూడాలి మామయ్యా!..”.

“చూడు”

“ఎప్పుడు?..”

“నేను నీకు ప్లాట్ ప్లాన్‌ను చూపిస్తాను. రేపు నీవు నెల్లూరికి వెళ్ళినప్పుడు పోయి చూడు.” లేచి వేగంగా తన రూమ్కు వెళ్ళి రొండు నిముషాల్లో తిరిగి వచ్చి ప్లాట్ ప్లాన్.. హారికకు అందించారు నాన్నగారు.

ఆ డ్రాయింగ్‌ను కొన్ని సెకండ్లు చూచిన హారిక.. “చాలా మంచి ప్లాట్ మామయ్య. యీస్టు ఫేసింగ్.” చిరునవ్వుతో ప్లాట్‌కు సంబంధించిన తన ఆనందాన్ని వ్యక్తం చేసింది హారిక. ఒక్కక్షణం నా ముఖంలోకి చూచి చూపును అమ్మ వైపుకు త్రిప్పి.. “అత్తయ్యా!.. యిక నే వెళ్ళొస్తాను.” అంది.

“కోడలు పిల్లా!.. ఆ యింటిని నీవే మాకు కట్టించి యివ్వాలి.” నవ్వుతూ అంది అమ్మ.

“అలాగే అత్తయ్యా!.. నేను వెళ్ళి వస్తాను.” నా వైపు అందరి వైపూ చూచి, చెప్పి ఆ ప్లాన్‌తో హారిక వెళ్లిపోయింది.

“బావా!.. యిక మనం బయలుదేరుదామా..!..” దగ్గరగా వచ్చి అడిగాడు రాఘవ.

అమ్మా నాన్నలకు చెప్పి.. నేను రాఘవ వాడి కార్లో నెల్లూరుకు బయలుదేరాము.

***

ఇరువురం అంటే నేను రాఘవ మహేంద్రా షో రూమ్‍కు వెళ్ళి మోడల్స్ క్యాటలాగ్ చూచి సిక్సు సీటర్ బొలేరోను సెలక్టు చేసాము. వారం రోజుల్లో డెలివరీ చేస్తామని షోరూమ్ మేనేజర్ చెప్పాడు. బ్యాంకుకు వెళ్ళి క్యాష్ డ్రా చేసి వారికి యిచ్చాను.

రాఘవ యింటికి వెళ్ళాము. మా అత్తయ్య సుందరి, మామయ్య శ్యామలరావు నన్ను సాదరంగా ఆహ్వానించారు. అమెరికా విశేషాలడిగి తెలుసుకొన్నారు. ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అడిగారు. నా నిర్ణయాన్ని తెలియజేశాను. వారు చాలా సంతోషించారు. అందరం కలసి భోంచేశాము. రాఘవ తన ఆఫీస్ గదిలోనికి తీసుకొని వెళ్ళాడు. లా బుక్సు చూపించాడు. తనూ చిన్న చిన్న కేసులు వాదిస్తున్నట్లు చెప్పాడు.

ఓ గంట సేపు వాడి గదిలో నిద్రపోయాను. మూడు గంటలప్పుడు లేపి అత్తయ్య సుందరి కాఫీ యిచ్చింది. త్రాగి.. రవికి ఫోన్ చేశాను. వాడు ఎత్తలేదు.

“రాఘవా!.. మన రవిబాబు ఫోన్ ఎత్తడం లేదు. నీవు యీ మధ్య వాణ్ణి ఎప్పుడు చూచావు?..”

రాఘవ నా ముఖంలోకి ఆశ్చర్యంగా చూచాడు.

“అతని తత్వం.. అతని జీవితాన్ని నాశనం చేసింది బావా!..” విచారంగా చెప్పాడు రాఘవ.

నా ప్రశ్నకు వాడు ఆశ్చర్యపోయినట్లుగా.. వాడి జవాబుకు నేను ఆశ్చర్యపోయాను.

“అతని భార్య వసుధ యిప్పుడు అతని దగ్గర లేదు.”

“ఆమెకు ఏమయింది?..”

“డ్రైవర్‍తో లేచి పోయింది బావా!..”

“ఎప్పుడు?..”

“తొమ్మిది నెలల క్రిందట.”

“యిప్పుడు ఎక్కడ వుంది?..”

“నాకు తెలియదు బావా!..”

“వాడికి ఒక పాప కదూ!..”

“అవును”

“ఆమె వయస్సు..”

“దాదాపు వన్ యియ్యర్ అబౌ!..’

“అంత చిన్న బిడ్డను వదలి ఆమె ఎలా వెళ్ళిపోయింది?.. రాఘవా!.. కాస్త వివరంగా చెప్పగలవా?..”

సరే అన్నట్లు రాఘవ తల ఆడించాడు.

“నేను విన్న విషయాన్నే మీకు చెబుతున్నా బావా!.. అతని తత్వాన్ని గురించి కంటే.. మీకు బాగా తెలుసు.

వాళ్ళ తొలిరేయి రోజున రవి త్రాగి పడక గదిలో ప్రవేశించాడట. అతని స్థితిని చూచి ఆమె ఆశ్చర్యపోయింది. ఆందోళన చెందింది. అతని పట్ల ఆమెకు వున్న గౌరవ మర్యాదలను రవి.. వారి ఆ తొలి సంగమంలోనే కోల్పోయాడు. రాత్రి వారిరువురి మధ్యన ఏం జరిగిందో. ఆ యిరువురూ.. ఆ రాత్రి ఎలా గడిపారో వారికే తెలియాలి.

వారం రోజుల తర్వాత ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోయిందట. నేను విన్నంత వరకూ ఆమె యం.ఎ. దాకా చదివింది. ఆమె తల్లిదండ్రులు మంచి ఆచార సంపన్నులు. దైవాన్ని నమ్మి కొలిచేవారు. ఆమెలోనూ ఆ గుణాలు వున్నాయని విన్నాను.

నెలరోజుల తర్వాత.. తిరిగి రాని కోడలి కోసం రవిబాబు తల్లిదండ్రులు వారి వూరికి వెళ్ళి ఆమెను.. తల్లిదండ్రులను కలిశారట. కుమారుడి తరపున వారికి క్షమాపణలు తెలియజేసి.. వారిని ఒప్పించి రవిబాబు భార్యతో తిరిగి వచ్చారు. అప్పటికి ఆమె గర్భవతి.

ఆ తర్వాత ఏడవ మాసం సీమంతాన్ని జరిపి కాన్పుకు గాను ఆమెను వారి వూరికి తీసుకొని వెళ్ళారు. ఆడపిల్ల పుట్టింది. మన రవి కొడుకును ఎక్స్‌పెక్ట్ చేశాడట. ఆడపిల్లను కన్నందుకు ఆమెను దూషించాడట.

మూడవ నెలలో కూతుర్ని తీసుకొని ఆమె అత్తగారింటికి వచ్చింది. భార్యాభర్తల మధ్యన వుండవలసిన అన్యోన్యత వారిరువురి మధ్యన లేకుండా పోయిందట.

తన ఆఫీస్ టేబుల్ మీద భార్య ఫోటోను ఒక ప్రక్కన పెండ్లయిన కొత్తలో రవి వుంచాడట. ఒక కాంట్రాక్టు ఫైనలైజేషన్‌కు వచ్చిన ఆ యజమాన్యపు అధికారి, రవి టేబుల్ మీద వున్న ఆమె ఫోటోను చూచాడట. తనకు ఒక రాత్రి ఆమెతో గడపాలని వున్నదని.. అది జరిగితే అరవై కోట్ల కాంట్రాక్టు నీదేనని రవితో చెప్పాడట. ఆ మరుదినం సాయంత్రం.. భార్యను తయారు కమ్మని, ఆమెతో కలసి ఆ యాజమాన్యపు ఆఫీసర్ వున్న లాడ్జికి వెళ్ళి, భార్యను గదిలో వదిలేసి తను వెళ్ళిపోయాడట.

అతని వికృత భాషణ చేష్టలను గ్రహించిన రవి భార్య అతన్ని తన మాటలతో అవమానించి.. తిట్టి అక్కడి నుండి పారిపోయి, కష్టపడి యింటికి చేరిందట.

అరవై కోట్ల కాంట్రాక్టు తనకు రావలసింది.. ఆమె మూలంగా తనకు రాకుండా పోయినందుకు రవి ప్రతిరాత్రీ ఆమెను చిత్రహింసలు పెట్టాడట. వాళ్ళ డ్రైవర్ ఆమె పుట్టింటి వూరివాడే. ఆమె నాన్నగారు పంపగా వచ్చి.. రవి దగ్గర పని చేస్తున్నాడు.

రవి పెట్టే బాధలను భరించలేక.. తన కష్టాలను ఆ డ్రైవర్‍తో ఏకాంతంగా చెప్పి.. రవి వూర్లో లేని సమయంలో ఒక రాత్రి వేళ బిడ్డను తీసుకొని ఆమె శాశ్వతంగా ఆ యిల్లు వదలి వెళ్ళిపోయింది.

ఆమె వెళ్ళిపోయిన తర్వాత.. రాత్రి పగలు అనే తేడా లేకుండా రవి విపరీతంగా త్రాగడం.. తనకు నచ్చిన ఆడవారితో గడపటం ప్రారంభించాడు. అతనికి ఎందరితోనో పరిచయం వుందని విన్నాను.

యీతని దుస్థితిని చూడలేక.. తండ్రి మూడు నెలల క్రిందట గుండె ఆగి చనిపోయాడు. ఆఫీస్‍లో కొందరు మేధావులు బాస్ స్థితిని చూచి.. తమ చాకచక్యాన్ని అంకెల్లో ప్రదర్శించి సొమ్మును దోచుకొంటున్నారనీ.. విన్నాను.

మీ మిత్రుడు రవిగారిని గురించి నాకు తెలిసిన విషయాలు యివి బావా!..” రాఘవ చెప్పడం ఆపేశాడు.

నేను రవి కథను విని నిర్ఘాంతపోయాను. చేతి వాచీ కేసి చూచాను. గంట ఐదున్నర.

“వాణ్ణి చూడాలంటే.. మనం ఎక్కడికి వెళ్ళాలి రాఘవా?..” రవిని చూడాలనే ఆశతో ఆడిగాను.

“యీ రోజు ఆదివారం. ఆ మహానుభావుడు ఎక్కడ వుంటాడో నేను ఎలా చెప్పగలను బావా!..” దీనంగా చెప్పాడు రాఘవ.

“యీ కథ అంతా తెలిసిన తర్వాత నేనూ ఒక రోజంతా చాలా బాధపడ్డాను. బావా!.. కారణం అతను నీ ప్రియ మిత్రుడు. యీ విషయాన్ని విన్న తర్వాత నీవు ఎంతగా బాధపడుతున్నావో నేను వూహించగలను.” విచారంగా చెప్పాడు రాఘవ నా ముఖంలోకి చూస్తూ.

“వాడి అమ్మా నాన్నలు చాలా మంచి వారురా!..”

“ఆ మాటే నేనూ విన్నాను బావా!..”

“వాళ్ళ యిల్లు నీకు తెలుసా!..

“తెలుసు బావా!..”

“వెళ్ళి వాళ్ళ అమ్మను ఒక్కసారి చూడాలని వుందిరా.”

“యిప్పుడే వెళదామా?..”

“నీకు అభ్యంతరం లేకపోతే!..”

“అమ్మతో చెప్పి బయలుదేరుదాం బావా!..”

“సరే.”

యిద్దరం వాడి గది నుంచి బయటికి రాబోతూ వుండగా.. నా మనస్సున మరో ఆలోచన కలిగింది. ఆగిపోయాను.

“ఏం బావా!.. ఆగిపోయావ్?..”

“మరేం లేదు రాఘవా. మన ఓల్డు బాయిస్ అసోషియేషన్ మెంబర్లకి అందరికీ నేను వచ్చినట్లు పై సండే మనవూర్లో కలవవలసిందిగా ఓ మెసేజ్ పంపాలిరా.” అన్నాను.

ల్యాప్‍టాప్ ఓపన్ చేసి రాఘవ నేను చెప్పింది ఫీడ్ చేసి.. “బావా చూడు.” అన్నాడు.

నేను మెసేజ్‍ని చూచాను. టైమ్ ఇండికేట్ చేయలేదు అందులో. ఉదయం పదిన్నరకు అని యాడ్ చేయమని చెప్పాను. రాఘవ యాడ్ చేసి మెసేజ్‍ని పంపేశాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version