[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘ప్రేమేగా ప్రపంచం’ అనే నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]
[గోపాల్ హారికల పెళ్ళి విషయం గురించి పెద్దలతో మాట్లాడి ఒప్పిస్తాడు గోవింద్. గోపాల్, హారిక గోవిందకి ధన్యవాదాలు చెప్తారు. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన బాబూరావు గోవింద ఇంటికి వచ్చి కలుస్తాడు. తానక్కడ లిల్లీ చేతిలో ఎలా మోసపోయింది చెప్తాడు. తన కొడుకుని తీసుకుని ఇండియా వచ్చేసినట్టు చెప్తాడు. గోవింద అతనికి భరోసా ఇస్తాడు. కొత్త జీవితం ప్రారంభించమంటాడు. గోవింద్ తండ్రి – బాబూరావుని తమ ఊర్లోనే ఆసుపత్రి ప్రారంభించమని చెప్తారు. శ్యామలరావు మావయ్య కలుగజేసుకుని బాబూరావు తండ్రి సాంబన్న తన ఆస్తిని, ఇరవై లక్షల నగదును బ్యాంకులో వేసిన పత్రాలను తనకి అప్పగించి, ఏనాడైనా తన కొడుకు తిరిగి వస్తే, వాడికి అప్పజెప్పమని కోరాడని చెప్పి, వాటిని బాబూరావుకి ఇస్తానని చెప్తాడు. తనని క్షమించమని బాబూరావు పెద్దలందరిని వేడుకుంటాడు. ‘మానవసేవే మాధవసేవ’ అనే మాటను గుర్తుంచుకోమని శ్యామలరావు అతనికి చెప్తాడు. మర్నాడు నెల్లూరులో గోవింద కొత్త ఇంటి గృహప్రవేశం కార్యక్రమం జరుగుతుంది. – ఇక చదవండి.]
గృహప్రవేశానంతరం భోంచేసి.. నేను శ్రీవాణి ఆఫీసు వెళ్ళాము. మా గదుల్లో కూర్చొని పనిలో నిమగ్నులమైనాము.
నాలుగు గంటల సమయంలో రామసుబ్బయ్య గారు హడావిడిగా నా గదిలోనికి వచ్చారు.
“బాబూ!..” నిలబడే పిలిచారు.
“ఏమిటండీ.. సారీ, మామయ్యా!.. మీకు తెలిసిన విషయమేగా.. మీ హారిక, నా తమ్ముడు గోపీకి కాబోయే యిల్లాలు, నాకు మరదలు, కాబట్టి యికపై మిమ్మల్ని నేను మామయ్యా అని పిలవడం నా ధర్మం.” నవ్వుతూ చెప్పాను. క్షణం తర్వాత.. “కూర్చోండి..” అన్నాను.
వారు కుర్చీలో కూర్చున్నారు.
“చెప్పండి విషయం ఏమిటి?..”
“బాబు.. మన రవిబాబు మదనపల్లి శానిటోరియంలో వున్నాడట” విచారంగా చెప్పాడు.
“అంటే!..” ఆశ్చర్యంతో వారి ముఖంలోకి చూచాను.
“టి.బి. అట బాబు”
“ఆఁ..” ఆశ్చర్యపోయాను.
“అవును. దివ్య ఫోన్ చేసి చెప్పింది పది నిముషాల క్రితం” అన్నారు రామసుబ్బయ్యగారు విచారంగా.
వాడిని గురించి నా మనస్సులో ఆందోళన ప్రారంభం అయింది. ఎలా వున్నాడో ఏమో. వెంటనే వెళ్ళి చూడాలి అనే నిర్ణయానికి వచ్చాను.
“మామయ్యగారు!.. యీ విషయాన్ని పెద్దమ్మకు పిల్లలకు చెప్పవద్దు. మనం రేపు వుదయం మదనపల్లికి.. వెళుతున్నాము. సరేనా!..”
“అలాగే బాబు”
“భయపడకండి. వాడికేమీ కాదు. దేవుడు దయామయుడు. మన ప్రార్థనలను మన్నించి వాడిలో మార్పును కలిగిస్తాడనే నమ్మకం నాకుంది” నవ్వుతూ చెప్పాను. వారు వారి సీటుకు వెళ్ళిపోయారు.
అమ్మా నాన్నా క్రొత్త యింట్లో వున్నారు. ఆ రోజు ఆఫీసుకు వస్తూ సాయంత్రం వూరికి వెళ్ళి నాగరాజు సుబ్బలక్ష్మిల బిడ్డను చూడాలనుకొన్నాము నేను శ్రీవాణి. ఐదు గంటలకు బయలుదేరుదామని చెప్పాను.
శ్రీవాణి యింటర్కమ్లో కాల్ చేసింది.
“బాస్ గంట అయిదు. బయలుదేరుదామా!..” నవ్వుతూ అడిగింది.
“అలాగే దేవి గారూ!.. రెండు నిముషాల్లో నేను మీ క్యాబిన్లోకి వస్తున్నాను”
“గుడ్ బాయ్” నవ్వుతూ ఫోన్ పెట్టేసింది.
యిరువురం బయలుదేరి మా గ్రామానికి ఆరున్నర కల్లా చేరుకున్నాము. నేరుగా నాగరాజు యింటికి వెళ్ళాము.
నాగు సుబ్బు రుక్మిణమ్మ అత్తయ్య మామయ్య పురుషోత్తం మమ్మల్ని చూచి ఎంతగానో సంతోషించారు. నాగు బాబును చూచాము. గుమ్మడి పండులా తెల్లగా.. వున్నాడు.
“పేరు నిర్ణయించావా సుబ్బూ!..” అడిగింది శ్రీవాణి.
“ఆఁ.. పేరు మా అన్నయ్య పేరే” సంతోషంగా నవ్వింది.
ఆ రాత్రి నాగూ యింట్లో అందరం కబుర్లు చెప్పుకుంటూ భోం చేశాము. తర్వాత మా శయనం మా యింట్లో.
ఉదయం ఏడున్నరకు శ్రీవాణి నేను బయలుదేరాము. గత రాత్రి మేము యింటికి చేరేటప్పటికి గోపాల్ యింటి పనిమనిషి చేతికి తాళం యిచ్చి నెల్లూరికి వెళ్ళిపోయాడు. బహుశా మాకు ఏకాంతాన్ని కలిగించే దానికేమో!..
కారును నేను నడుపుతున్నాను. శ్రీ నా ప్రక్కన కూర్చొని వుంది. బస్టాండు సమీపించింది నా కారు.
“ఏమండీ.. కారును ఆపండి” అంది శ్రీవాణి.
“ఎందుకు?..” ఆమె ముఖంలోకి చూచాను.
“మన హారికండీ. బస్టాండులో వుంది. బహుశా బస్సు కోసం ఏమో. మనతో తీసుకెళదాం”
బస్టాండు వైపుకు చూచాను. హారికను చూచి కారును రివర్స్‌లో నడిపి ఆమె ముందు ఆపాను.
నవ్వుతూ మమ్మల్ని చూచింది హారిక.
“మరదలా కారెక్కు” నవ్వుతూ అన్నాను.
“థ్యాంక్యూ” నవ్వుతూ ఛంగున కారును సమీపించి డోర్ తెరిచి లోన కూర్చుంది.
“హ్యాపీగా కూర్చో” అంది శ్రీవాణి.
“థ్యాంక్స్ నాకు కాదు నీవు చెప్పవలసింది. మీ అక్కయ్యకు. ఆమే నిన్ను చూచింది”
హారిక.. తన చేతిని ముందుకు చాచింది. శ్రీవాణి నవ్వుతూ తన చేతిని హారిక చేతిలో వుంచింది.
ఆ క్షణంలో.. హారిక నాకు ఎంతో ఆనందంగా వున్నట్లు అనిపించింది. గలాటా చేయాలనుకొన్నాను.
“హారికా!..” అని పిలిచాను. హారికను పేరుతో పిలవడం ఇదే మొదటిసారి.
“ఏం బావా!..” వెను తిరిగి ఆమె నా ముఖంలోకి చూచింది.
“చెప్పండి” నవ్వుతూ అంది
“మొత్తానికి మా గోపిగాణ్ణి నీ పిచ్చోణ్ణి చేశావు..” నవ్వాను.
“బావా!.. చిన్న కరక్షన్!..”
“ఏమిటది?..” అడిగాను.
“నేను చెబుతాను” అంది ప్రక్కనే వున్న శ్రీవాణి.
“చెప్పు..”
“మా ముద్దుల మరిదే హారికను పిచ్చిదాన్ని చేశాడు” అందంగా నవ్వింది శ్రీవాణి.
“అవునక్కా!..” సిగ్గుతో నవ్వుతూ తల దించుకొంది హారిక.
సరదాగా కబుర్లతో నెల్లూరులో ప్రవేశించాము. ఆత్మకూరు బస్టాండును చేరింది నా కారు.
“బావా!.. ఆపండి. నేను యిక్కడ దిగుతాను” అంది హారిక.
“నేను నిన్ను ఆఫీస్ దగ్గర దింపుతాను”
“వద్దు బావా. నేను యిక్కడే దిగుతాను” ప్రాధేయపూర్వకంగా అడిగింది.
ఆపండి” అంది శ్రీ. తన చూపుడు వేలును బస్టాండు వైపుకు చూపించింది. ఆ వైపు చూచాను. నా సోదరుడు గోపాల్ బులెట్‌పై కూర్చొని వున్నాడు. నాకు విషయం అర్థం అయింది. కారును ఆపాను. హారిక కారు నుండి దిగింది. “థ్యాంక్యూ బావా.. అక్కా” అంది.
“ఓకే.. క్యారియాన్” నవ్వుతూ అన్నాను.
“పాపం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడో త్వరగా వెళ్ళు” అంది శ్రీవాణి నవ్వుతూ.
ముసిముసి నవ్వులతో హారిక గోపాల్ వైపుకు నడిచింది.
నేరుగా ఆఫీకు వెళ్ళాను. రామసుబ్బయ్యగారు సిద్ధంగా వున్నారు మా మదనపల్లి ప్రయాణానికి. విషయాన్ని శ్రీవాణికి చెప్పి.. నేను రామసుబ్బయ్య గారూ మదనపల్లికి బయలుదేరాము.
మా కారు సూళూరుపేటకు పది కిలోమీటర్ల దూరంలో వుంది.
రోడ్డుపైన ఒక జంట యువతీ యువకులు స్కూటర్ మీద మాకు ముందు వెళుతున్నారు. మా కారుకు వెనక నుంచి వేగంగా వచ్చిన ఒక లోడ్ లారీ, కారును క్రాస్ చేసి వేగంగా ముందుకు వెళ్ళిపోయింది. వాడి వేగాన్ని చూచి నేను ఆశ్చర్యపోయాను.
కొద్ది నిముషాల్లో.. ఆ లారీ స్కూటర్‌ను గుద్ది ముందుకు వేగంగా సాగిపోయింది.
మా కారు కొద్దిక్షణాల్లో ఆ ప్రాంతాన్ని సమీపించింది. ఆ యిరువురూ రోడ్డు ప్రక్కన నెత్తుటి మడుగులో వుండటాన్ని నేను రామసుబ్బయ్యగారు చూచి ఆశ్చర్య ఆందోళనలకు గురి అయినాము.
కారు దిగి వారిని సమీపించాము. యిరువురూ ప్రాణాలతో వున్నారు. వెంటనే వారిని హాస్పటల్‌కు తీసుకొని వెళ్ళాలని నిర్ణయించుకొన్నాను. ఆ మాటనే రామకోటయ్యగారికి చెప్పాను.
యిరువురం కలసి వారిని మా కారు వెనక సీట్లో ఎక్కించాము. పది నిముషాల్లో మా కారు హాస్పటల్ ముందుకు ఆగింది.
పరుగెత్తుకెళ్ళి డాక్టర్‌కు విషయాన్ని చెప్పాను. స్ట్రెచర్ తీసికొని వచ్చి హాస్పటల్ సిబ్బంది వారిరువురినీ.. లోనికి తీసుకొని వెళ్ళారు. నా మనస్సుకు ఎంతో ఆవేదన.
నిర్ధాక్షిణ్యంగా వారి వాహనాన్ని గుద్ది వేగంగా వెళ్ళిపోయిన ఆ లారీ డ్రైవర్ పై కసి. ‘భగవాన్ ఆ జంటను కాపాడు తండ్రీ..’ దైవాన్ని వేడుకొన్నాను.
డాక్టర్ వారిని పరీక్షించి పావుగంట తర్వాత వచ్చి ప్రాణాపాయం లేదని ఒకరి చెయ్యి.. ఒకరికి కాలు విరిగాయని, గాయాలు తీవ్రంగా తగిలిన కారణంగా స్పృహ వచ్చేదానికి.. కొంత సమయం పడుతుందని చెప్పారు. దైవలీలే అని చెప్పాలి. అక్కడ పని చేసే నర్స్ వారిని గుర్తుపట్టి.. “వాళ్ళు మా వూరి వారే” అని చెప్పింది. విషయాన్ని ఫోన్ చేసి గాయపడిన వారి కుటుంబీకులకు తెలియజేసింది.
అప్పటికి నాకు కొంత స్థిమితం ఏర్పడింది. పాపం రామసుబ్బయ్య బెదిరిపోయారు. కన్నీటితో ఓ ప్రక్కన నిలబడి పోయారు. వారిని జాగ్రర్తగా చూచుకోమని నా సెల్ నెంబర్ డాక్టర్‌కు యిచ్చి.. నేను రామబ్బయ్య.. మదనపల్లికి ముందుకు సాగాము.
“తప్పతాగి డ్రైవర్లు లారీలను నడపడంతో యిలాంటి విపత్తులు జరుగుతుంటాయి బాబు” అన్నారు రామబ్బయ్య.
“అవును. మీరు చెప్పింది యథార్థం. ఈ విషయంలో రక్షణ శాఖ కట్టుదిట్టం చేయాలి. పోలీసులు బ్రీత్ ఎనలైజర్స్‌తో డ్రైవర్లను చెక్ చేసి త్రాగి వున్నట్లు తెలిస్తే ఆ బండి ముందుకు సాగేదానికి అనుమతించకుండా బండి ఓనర్లకు తెలియజేసి డ్రైవర్లను శిక్షించాలి. యిలా పది కేసులు.. శిక్షలు నమోదై, పేపర్లకు ఎక్కితే త్రాగి బండి నడిపేటందుకు ఎవరూ సాహసించరు” జరిగిన దుర్ఘటన రీత్యా కాస్త ఆవేశంగానే చెప్పాను. రెండు గంటల ప్రాంతంలో మదనపల్లిని చేరాము.
రవి దివ్యలను కలిశాము. వ్యాధి కారణంగా రక్త క్షీణతతో రవి పాలిపోయి అనారోగ్యంగా వుండే అరవై ఏళ్ళ వయోవృద్ధుడిలా కనిపించాడు. మమ్మల్ని చూచి వాడు అవమానంతో.. ఆవేదనతో ఏమీ మాట్లాడలేకపోయాడు. ఏడుస్తూ తల దించుకొన్నాడు.
“రవీ.. బాధపడకు. నీకేం భయం లేదు. నీ ఆరోగ్యం తప్పక చక్కబడుతుంది. డాక్టర్లతో నేను మాట్లాడుతాను” అనునయంగా చెప్పాను.
వాడు దీనంగా నా కళ్ళల్లోకి చూచి కన్నీరు కార్చాడు. “గోవింద్.. నీవు నన్ను క్షమించగలవా!..” దీనంగా బొంగురుపోయిన కంఠంతో అడిగాడు.
“నాకు నీ మీద పగ ద్వేషం కోపం వుంటే కదరా నేను నిన్ను క్షమించాలి. నీవు నా మాటలను వినలేదే కానీ నాకు ఎలాంటి అపకారం చేయలేదుగా. బాధపడకు. త్వరలో మామూలు మనిషివి అవుతావు” ప్రీతిగా చెప్పాను.
డాక్టర్ గారిని కలసికొని మాట్లాడాను. నెలరోజుల్లో కోలుకొంటాడని.. ఆ తర్వాత ఓ సంవత్సరం మందులను క్రమంగా వాడితే పరిపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని చెప్పాడు.
దివ్య ఏడుస్తూ రామసుబ్బయ్య గారితో.. “నిరంతరం త్రాగడం.. జాదం.. రేసులు.. ఆడవాళ్ళతో చెడు తిరుగుళ్ళు వారిని యీ స్థితికి తీసుకొని వచ్చాయి.” చెప్పి బోరున ఏడ్చింది.
లక్షరూపాయలు రామసుబ్బయ్యగారు దివ్యకు యిచ్చారు. నా మాట ప్రకారం వారం వారం వచ్చి చూచి రవి త్వరలో కోలుకొనేటట్లు చూస్తామనీ.. దేనికీ భయపడవద్దని.. రవిని జాగ్రత్తగా చూచుకోమని దివ్యకు నేను చెప్పాను. ఆమె కృతజ్ఞతతో చేతులు జోడించింది. రవిని కలిసి మరోసారి ధైర్యం చెప్పి మేమిరువురం నెల్లూరికి బయలుదేరాము.
హాస్పటిల్ ఆవరణాన్ని దాటి ఒక కిలోమీటర్ దూరం వచ్చాను. నా సెల్ మ్రోగింది.
“హలో!..”
“ఎవరినో గుర్తు పట్టగలవా మిత్రమా!.. నవ్వుతూ అడిగాడు.
ఆ కంఠ స్వరాన్ని గుర్తించలేక పోయాను. ఆశ్చర్యంతో.. “ఎవరండీ మీరు?..” అడిగాను.
“ప్రతాప్.. ఒకనాటి నీ ప్రాణస్నేహితుడు” వాడు గలగలా నవ్వాడు. ఆ పేరును వినగానే వాడెవడన్నది నాకు గుర్తుకు వచ్చింది. ప్రతాప్.. నాకు బి.యి. సి.యస్ కాలేజ్ మేట్. వాడితో మాట్లాడి దాదాపు పది సంవత్సరాలయింది. ఎంతగానో ఆశ్చర్యపోయాను.
“ప్రతాప్!.. ఎక్కడున్నావ్!.. ఎలా వున్నావ్!.. ఏం చేస్తున్నావ్?” పరవశంతో అడిగాను.
“యిప్పుడు నీ మిత్రుడు ప్రతాప్.. యస్.ఐ. వుండేది.. మదనపల్లి. నీవు ఎక్కడ వున్నావ్?.. ఎలా వున్నావ్?..” నవ్వుతూ అడిగాడు ప్రతాప్.
“నీవు వుండేది మదనపల్లా!..”
“అవును”
“నేను యిప్పుడు వున్నది మదనపల్లిలోనే. నీవెక్కడ వున్నావో చెప్పు. వచ్చి కలుస్తాను”
“నేరుగా పోలీస్ స్టేషన్‌కు రా”
“అలాగే.. పది నిముషాల్లో నీ ముందు వుంటాను” సెల్ కట్ చేసి.. నన్ను ఆశ్చర్యంతో చూస్తున్న రామసుబ్బయ్యగారి ముఖంలోకి చూచాను.
“మామయ్యా!.. ప్రతాప్ నాకు బి.యిలో కాలేజ్ మీట్. ఆ రోజుల్లో యిరువురం ఎంతో సన్నిహితంగా వుండేవాళ్ళం. రెండు మూడు సార్లు శలవుల్లో నాతో కలసి మన వూరికి కూడా వచ్చాడు. అమ్మా నాన్నలకు బాగా తెలుసు. వాడు యిప్పుడు యీ వూళ్ళోనే యస్.ఐ.గా వున్నాడట. కలిసి వెళదాం. ఏమంటారు?..” అడిగాను.
“అలాగే బాబు..” నవ్వుతూ చెప్పారు రామసుబ్బయ్యగారు.
పదిహేను నిముషాల్లో నా కారు స్టేషన్ ముందు ఆగింది. ప్రతాప్ నా కోసం స్టేషన్ ముందు నిలబడి ఎదురు చూస్తున్నాడు. నన్ను చూడగానే ముందుకు నవ్వుతూ వచ్చి నన్ను కౌగలించుకొన్నాడు.
“ఎన్నేళ్ళయిందిరా నిన్ను చూచి!..” ఆనందంగా అడిగాడు.
“పదేళ్ళయిందిరా!.. నీవు నన్ను యింకా మరువలేదంటే.. యు ఆర్ రియ్యల్లీ గ్రేట్ రా!.. నవ్వుతూ చెప్పాను.
మమ్మల్ని ఆశ్చర్యంగా చూస్తున్న రామసుబ్బయ్యగారిని ప్రతాప్‌కు పరిచయం చేశాను. ముగ్గురం స్టేషన్లోకి వెళ్ళాము. కూర్చున్నాము.
పదేళ్ళ తన జీవన విధానాన్ని వివరంగా ప్రతాప్.. నాకు చెప్పి.. చివరగా.. “గోవిందా!.. అమ్మా నాన్నా బాగున్నారు. నా భార్య పేరు శ్రీమతి. పిల్లలు కవలలు.. నాలుగేళ్ళు, వాళ్ళు రాము రాజశ్రీ. యిక నిన్న నెల్లూర్లో మన సునీల్డు కనబడ్డాడు. వాడే నీ ఫోన్ నెంబర్‌ను నాకు యిచ్చాడు చెప్పాడు ప్రతాప్.
నేను.. నా వివరాలనన్నింటినీ వాడికి చెప్పి.. మదనపల్లికి వచ్చిన కారణాన్ని చెప్పి.. వాడితో యింటికి వెళ్ళి భార్యా పిల్లలను చూచి, పదిరోజుల్లో మరలా వస్తానని చెప్పి నెల్లూరుకు బయలుదేరాను.
***
అప్పటికి శ్రీవాణికి ఎనిమిది నెలలు. అమ్మా నాన్నా ఆమెను ఆఫీసుకు వెళ్ళవద్దని చెప్పారు. “కొద్దిరోజులు వెళ్ళి.. ఆ తర్వాత ఆపేస్తాను” నవ్వుతూ అంది శ్రీవాణి. వారు మా నెల్లూరులోని క్రొత్త యింటికి వచ్చేశారు.
నేను శ్రీవాణి, అమ్మా నాన్నా, గోపాల్ హారిక భోజనాలు ముగించాం. అమ్మా, నాన్న, గోపాల్ హారిక.. వారి గదులకు వెళ్ళిపోయారు.
నేను శ్రీవాణి మా గదిలో ప్రవేశించాము. శ్రీ మంచంపై పడుకొంది. కళ్ళు మూసుకుంది.
నేను ఆమె ముఖంలోకి చూచాను. నాలో ఏదో అనుమానం.
“శ్రీ!..” వంగి మెల్లగా పిలిచాను.
శ్రీవాణి కళ్ళు తెరచి నవ్వుతూ కనురెప్పలు ఎగరేసింది. నా సెల్ మ్రోగింది.
అది రామసుబ్బయ్య గారి కాల్.
“ఏమిటి మామయ్యా విషయం?..” అడిగాను.
“దివ్య ఫోన్ చేసింది. ఆమె మాజీ భర్త మదనపల్లికి వెళ్ళి.. డబ్బు కావాలని వేధిస్తున్నాడట. యిప్పటికి రెండుసార్లు యిచ్చి పంపిందట. నిన్న వచ్చి లక్ష రూపాయలు కావాలని.. ఇవ్వకపోతే రవిబాబును చంపేస్తానని బెదిరించాడట. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదని, రెండు రోజుల తర్వాత రమ్మని పదివేలు యిచ్చి పంపేసిందట బాబూ!.. పాపం, దివ్య బోరున ఏడుస్తూ యీ విషయాన్ని చెప్పింది బాబు.” విచారంగా చెప్పాడు రామసుబ్బయ్య.
“దివ్య తప్పు చేసింది మామయ్యా!.. వాడు మొదటిసారి వచ్చినప్పుడు, వాడికి డబ్బు యివ్వకుండా వుండవలసింది. అప్పుడే మనకు యీ విషయాన్ని చెప్పి వుండవలసింది. వాడికి డబ్బు యిచ్చి.. తాను వాడికి లోబడినట్లయింది. ఆమె భయాన్ని వాడు ఆసరాగా తీసుకొని.. తరచుగా దాడి చేస్తున్నాడు. బెదిస్తున్నాడు. సరే మామయ్యా!.. మీరు దివ్యకు ఫోన్ చేసి భయపడవద్దని చెప్పండి. మీరు రేపు మదనపల్లికి వెళ్ళండి. మన ప్రతాప్‌ను కలవండి. నేను వాడికి ఫోన్ చేసి విషయాన్ని చెబుతాను. యీసారి ఆ రాస్కెల్ దివ్య దగ్గరకు వస్తే.. వాణ్ణి అరెస్టు చేసి జైల్లో పడేసేటట్లు చెబుతాను. మీరు పెట్టేయండి.” అన్నాను. శ్రీవాణి ముఖంలోకి చూచాను. తాను కళ్ళు మూసుకొని వుంది. నిద్ర పోయినట్లుంది.
గది ముందున్న వరండాలోకి వచ్చాను. ప్రతాప్‌కు ఫోన్ చేశాను. వాడు కాలను రిసీవ్ చేసుకొన్నాడు. దివ్యకు సంబంధించిన అన్ని వివరాలు వాడికి చెప్పాను. అంతా విని.. “ఎల్లుండి మరలా వాడు వస్తాడుగా!.. నేను రేపు వుదయం నుంచే దివ్యకు ఒక లేడీ కానిస్టేబుల్‌ను తోడుగా వుండేలా ఏర్పాటు చేస్తాను. వాడు వచ్చాడంటే.. పట్టుకొని కటకటాల వెనక తోసేస్తాను. నీవు నిశ్చింతగా వుండు” అన్నాడు ప్రతాప్.
***
మరుదినం రామసుబ్బయ్య గారు మదనపల్లికి వెళ్ళి దివ్యకు ధైర్యం చెప్పి.. ప్రతాప్‌ను కలిసి వచ్చాడు.
మూడవరోజు సాయంత్రం ఏడుగంటలకు ప్రతాప్ నాకు ఫోన్ చేశాడు. వాడి పేరు నాగభూషణం. వాడు హాస్పటిల్ ఆవరణంలో ప్రవేశించగానే పట్టుకొని బాగా తన్ని జైల్లో తోసేసినట్లు రామసుబ్బయ్యగారికి నాకు ఎంతో ఆనందం. రెండు వారాల తర్వాత.. నేను రామసుబ్బయ్య గారు మదనపల్లికి వెళ్ళాను. రవిబాబు బాగా కోలుకొన్నాడు. మా యిరువురినీ చూచి ఆదరంగా పలకరించాడు. అందరి యోగక్షేమాలను గురించి అడిగాడు. తను చేసిన తప్పులను అన్నింటినీ మరచి క్షమించవలసినదిగా కోరాడు.
వాడిలో కలిగిన మార్పుకు నాకు చాలా ఆనందం కలిగింది.
వూరికి తిరిగి వచ్చిన తర్వాత.. పెద్దమ్మ శ్యామలను కలుసుకొన్నాను. అతనికి వచ్చిన వ్యాధి గురించి చెప్పలేదు. వాడిలో మార్పు కలిగిందని, యింటికి రావాలనే వుద్దేశం కనబరిచాడని.. ఒక్కసారి మీరు ఫోన్ చేసి మాట్లాడితే.. వాడు తప్పక యింటికి వస్తాడని చెప్పాను. రామసుబ్బయ్యగారు నా మాటలను బలపరిచారు.
నా మాటల మీద పూర్తి విశ్వాసం వున్న పెద్దమ్మ రవికి ఫోన్ చేసి మాట్లాడింది. రవి పెద్దమ్మతో తాను యింటికి వస్తున్నట్లు చెప్పాడు.
రామసుబ్బయ్యగారు మదనపల్లికి వెళ్ళి రవిని దివ్యను యింటికి తీసుకొని వచ్చారు. అప్పటికి దివ్య ఆరు మాసాల గర్భవతి. కొడుకును కోడలిని శ్యామల పెద్దమ్మ అభిమానంతో అక్కున చేర్చుకుంది.
మరుదినం.. రవిని ఆఫీస్‌కు తీసుకొని వెళ్ళి ఆఫీస్‌కు సంబంధించిన అన్ని వివరాలు చెప్పి.. నే కూర్చొనే స్థానాన్ని చూపి.. “అది నీ స్థానం కూర్చో” అన్నాను.
“అది యికపై ఎన్నటికీ నీ స్థానమే.. నీవు చెప్పిన పనిని చేయడం నా కర్తవ్యం. అంత భారాన్ని నేను మోయలేనురా” దీనంగా నా చేతులు పట్టుకొని చెప్పాడు రవి.
పెద్దమ్మ.. రామసుబ్బయ్యలు వాడి మాటలకు సంతోషించారు.
***
గోపాల్ .. హారికల వివాహాన్ని ఎంతో వైభవంగా అమ్మానాన్నలు జరిపించారు. వారు హనీమూన్‌కు కాశ్మీర్ వెళ్ళిపోయారు.
నా తమ్ముడి వివాహంలో.. ఆ వూరి డాక్టర్‌గా బాబూరావు.. యింటికి తిరిగి వచ్చిన రవిల కలయిక మా మిత్రులందరికీ.. మా పెద్దలందరికీ.. ఎంతో ఆనందాన్ని కలిగించింది.
శుభదినాన నా శ్రీవాణి.. ప్రసవించింది. మాకు పాప పుట్టింది. ‘పుట్టింది మా అమ్మ’ అని మా నాన్నగారు మురిసిపోయారు. బాలసారె మహోత్సవం ఘనంగా జరిగింది. పాప పేరు అమృత. అది మా నాయనమ్మగారి పేరు.
భోజనానంతరం అందరూ పందిట్లో కూర్చొని వుండగా మా హెడ్ మాస్టర్ రామకోటయ్యగారు..
“యీనాడు మనమందరం యింత ఆనందంగా వున్నామంటే దానికి కారణం మన గోవింద్.. అతని మనస్సు నిండా వున్నది నిస్వార్థపు ప్రేమ.. యీ గోవింద్.. ఆ గోవిందుడి సరి.. వీడూ అందరివాడు. ప్రతి తల్లి తండ్రి తమ సంతతిని ఎంతగానో ప్రేమిస్తారు. అది ప్రేమే కాదు వారి జీవితాతం తమ బిడ్డలపైన వుండే అవ్యాజానురాగం. విద్యార్థి దశలో ఇరువురు చూపులతో.. చేయి చేయి కలుపుకొని హితులుగా మారి మంచి స్నేహితులౌతారు. వారు ఎదిగే కొద్దీ వారి స్నేహం బలపడుతుంది.. ఒకరి పట్ల ఒకరికి అభిమానం.. ప్రేమ గౌరవం పెరుగుతాయి. కొందరి విషయంలో అవి వారి జీవితాంతం అలాగే వుంటాయి. యుక్త వయస్సులో యువతీ యువకుల మధ్యన తొలుత ఆకర్షణ అభిమానం ఆత్మీయత ఒక స్థాయి నుంచి మరో స్థాయికి చేరి ప్రేమగా మారుతుంది. వివాహంతో వారు సహజీవనం సాగిస్తారు. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యన వుండేది.. ఇరువురు స్నేహితుల మధ్యన నెలకొనేది.. యువతీ యువకుల మధ్యని నిలిచేది.. ప్రేమ.. ప్రేమ.. ప్రేమ.. అది వారి వరకే పరిమితం.. కానీ కొందరు మన గోవింద్ లాంటి వారు.. యావత్ సమాజాన్ని గౌరవిస్తారు.. అభిమానిస్తారు.. ప్రేమిస్తారు.. మన యీ గోవింద్ పవిత్ర ‘ప్రేమేగా ప్రపంచం’ అంటాడు. వాడి ఆ భావనకు తగినట్లుగా వర్తిస్తాడు. అందరి ఆనందాన్ని క్షేమాన్ని కోరేవాడు. వీడు నా ప్రియ శిష్యుడని నేను సగర్వంగా ఎంతో ఆనందంతో చెబుతున్నాను. వీడికి నా హృదయపూర్వక శుభాశీస్సులు” ఆ క్షణంలో వారి కళ్ళల్లో ఆనంద భాష్పాలు.
అందరం కరతాళధ్వనులతో వారిని అభినందించాము. మేము.. అందరం కలిసి యిరవై లక్షల విరాళాన్ని వారి చేతులకు మా స్కూలు అభివృద్ధికి అందించాము. వారు ఓల్డ్ బాయిస్ అసోసియేషన్ సభ్యులనందరినీ మనసారా దీవించారు.
(సమాప్తం)
సిహెచ్. సి. ఎస్. శర్మ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి జననం నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా ఊచగుంటపాళెంలో జరిగింది. ప్రాథమిక విద్య పెయ్యలపాళెం, బుచ్చిరెడ్డిపాళెంలోనూ, ఉన్నతవిద్య నెల్లూరులోనూ.
సివిల్ ఇంజనీరుగా రాష్ట్రంలోని పలు సంస్థలలో వివిధ హోదాలలో పని చేసి చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరక్టర్ స్థాయికి ఎదిగారు.
చిన్ననాడు బామ్మగారు చెప్పిన కథలతో ప్రేరణ పొంది బాల్యం నుంచే రచనలు చేశారు. మిత్ర రచయితల ప్రోత్సాహంతో రచనా రంగంలో విశేషంగా కృషి చేశారు. 20 నవలలు, 100 కథలు, 12 నాటికలు/నాటకాలు, 30 కవితలు రాశారు.
వివిధ సాహితీ సంస్థల నుంచి పలు పురస్కారాలు పొందారు.
