Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమేగా ప్రపంచం-16

[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘ప్రేమేగా ప్రపంచం’ అనే నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]

[హనీమూన్‌కి కేరళ వెళ్ళిన గోవింద దంపతులు గురువాయూరులోని కృష్ణుని ఆలయం సందర్శిస్తారు. స్థానిక పూజారి ఒకరు వారికి స్థల చరిత్ర, ఆలయ చరిత్ర వివరిస్తాడు. వారం రోజుల తర్వాత ఇంటికి చేరుతారు. మర్నాడు ఉదయం సునీల్ గోవింద ఇంటికి వచ్చి, వారు కట్టదలచుకున్న ఇంటిని తాను కట్టిస్తానని చెప్తాడు. హారికని కనుక్కుని చెప్తామని గోవింద నాన్నగారు అంటారు. గోపాల్ వెళ్ళి హారికను తీసుకువస్తాడు. తానెవరికీ నిర్మాణం పని అప్పజెప్పలేదని, ఎవరు తక్కువ కొటేషన్ ఇస్తే వారికి ఇద్దామని అంటుంది. భవన నిర్మాణానికి సంబంధించి క్వాంటిటీస్ పేపర్లను హారిక సునీల్‌కు ఇస్తుంది. అందరికన్నా సునీలే తక్కువగా కోట్ చేయడంతో, పని అతనికే అప్పజెప్తారు. మంచిరోజు చూసి సునీల్ పని మొదలుపెడతాడు. హారికా, గోపాల్ పనిని పర్యవేక్షిస్తూ, పెద్దవారికి తెలియజేస్తుంటారు. శ్రీవాణి చేరాకా, సంస్థకి వర్క్ ఆర్డర్స్ బాగా రావడంతో అందరూ ఆమెను అభినందిస్తారు. తనదేం లేదని, అంతా గోవింద కృషేనని అంటుందామె. శ్రీవాణి గర్భవతి అని తెలిసిన పెద్దలు ఆమెను ఉద్యోగానికి వెళ్ళద్దని అంటే, కొన్ని రోజులు చేస్తానని అంటుంది. సంవత్సరం లోపలే ఆఫీస్‌లో జరిగిన మార్పులకు టర్నోవర్ రెండింతలు రెట్టింపు అయినందుకు, అన్ని వ్యవహారాలు క్రమంగా సకాలంలో జరుగుతున్నందుకు శ్యామలమ్మ గోవిందని మెచ్చుకుంటుంది. నాగరాజు ఫోన్ చేసి తనకు కొడుకు పుట్టాడని చెప్తాడు. గోవింద ఎంతో సంతోషిస్తాడు. ఈ శుభవార్తని శ్రీలక్ష్మికి కూడా చెప్తాడు. ఆఫ్రికా నుంచి బాబూరావు తిరిగి వచ్చాడని, వివరాలు సునీల్‌కి తెలుసని చెప్తాడు నాగరాజు. హనీమూన్‌కి వెళ్ళిన రాఘవ, వసంత తిరిగి వచ్చారని ఫోన్ రావడంతో, గోవింద, శ్రీవాణికి ఇంటికి వెళ్తారు. గోవింద తల్లిదండ్రులు, గోపాల్.. పెద్దమ్మ శ్యామల, రూప దీపలు మామయ్యగారి యింట్లో కలుస్తారు. అందరూ ఆ రాత్రి మేడ మీద వెన్నెలలో భోంచేస్తారు. – ఇక చదవండి.]

భోజనానంతరం అమ్మ, సుందరి అత్తయ్య.. ఆమె గదిలో కూర్చుని జరిగిన వసంత రాఘవ.. నా శ్రీవాణి వివాహ విషయాలను గురించి ఆనందంగా మాట్లాడుకొంటున్నారు.

గోపాల్ హారికల విషయాన్ని గురించి వారితో మాట్లాడేదానికి యిదే తగిన సమయంగా భావించాను. శ్రీవాణికి చెప్పి అత్తయ్య గదిలో ప్రవేశించాను. నన్ను చూడగానే అత్తయ్య..

“గోవిందా, పడుకోలేదా!..” అడిగింది.

లేదు అన్నట్లు తల ఆడించాను.

“రా నాన్న కూర్చో” అంది అమ్మ.

వారి ఎదుటి సోఫాలో కూర్చున్నాను.

“ఏమైనా చెప్పాలా!..” అడిగింది అత్తయ్య.

“అవునత్తయ్యా..” మెల్లగా చెప్పాను.

“విషయం ఏమిటో చెప్పు నాన్నా” అంది అమ్మ.

“గోపాల్ వివాహ విషయం..”

“నీకు తెలిసిన మంచి అమ్మాయి ఎవరైనా వున్నారా!..” ప్రశ్నార్థకంగా నా ముఖంలోకి చూస్తూ అడిగింది అత్తయ్య.

“వుందత్తయ్యా.. ఆమె, మీకు బాగా తెలుసు”

“ఎవర్రా ఆ పిల్ల?..” అమ్మ అడిగింది.

హారిక అని వెంటనే చెప్పలేకపోయాను. కొన్ని క్షణాలు మౌనంగా ఆ పేరును చెబితే వారు ఎలా రియాక్టు అవుతారనే ఆలోచనలో వుండిపోయాను.

“వాడు వుద్యోగంలో చేరి మూడేళ్ళు అయింది. వెంటనే పెళ్ళి చేసెయ్యాల్సిందే. చెప్పు ఆ పిల్ల ఎవరో” అడిగింది అత్తయ్య.

“ఆమె ఎవరో కాదత్తయ్యా!.. మన హారిక..” అన్నాను ఆ మాటను వినగానే ఆ యిరువురూ నా ముఖంలోకి ఆశ్చర్యంగా చూచారు.

“గోవిందా!.. ఏమిటీ!.. నీవు అన్నది.. హారికనా!.. అమ్మ ఆశ్చర్యంతో అడిగింది.

“అవునమ్మా!.. వారిరువురూ ప్రేమించుకొన్నారు. అమ్మా నీకు బాగా తెలుసుగా.. హారిక చాలా మంచి అమ్మాయి కదా అమ్మా!..” వారిపై అమ్మకు జాలి కలిగేలా చెప్పాను.

“పిల్లకే బంగారం.. కానీ గోపాల్ కన్నా రెండు సంవత్సరాలు వయస్సులో పెద్దది కదా వదినా!..” అమ్మ వైపు చూస్తూ అడిగింది సుందరి అత్తయ్య.

“అవును” సాలోచనగా నా ముఖంలోకి చూస్తూ చెప్పింది అమ్మ.

“అమ్మా!.. అత్తయ్యా!.. ఆ శ్రీరామచంద్రమూర్తికి సీతామాతకు కూడా వయస్సు వ్యత్యాసం అని మీరు చెప్పగానే కదమ్మా నాకు తెలిసింది. వారిరువురూ ఒకరి నొకరు గాఢంగా ప్రేమించుకొన్నారు. మీరిరువురూ మా అందరి శ్రేయోభిలాషులు. కాబట్టి నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్పాను. మామయ్య నాన్నగారిని ఒప్పించి వారిరువురి వివాహం జరిపించవలసిన బాధ్యత మీది. నేను నా తమ్ముడికి.. వాడి యిష్టానుసారంగా హారికతో వివాహం జరిపిస్తానని మాట యిచ్చాను.” తెగబడి నా నిర్ణయాన్ని వారికి తెలియజేశాను.

వారు.. ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు మౌనంగా. మౌనం సమ్మతానికి చిహ్నంగా భావించి నేను..

“మనం కాదంటే వారు యిల్లు వదిలి, మనకు దూరంగా వెళ్ళి తప్పకుండా వివాహం చేసికొంటారు. నా తమ్ముని వివాహం అలా జరగడం నాకు యిష్టం లేదు. కాబట్టి వాడు చెప్పలేని విషయాన్ని నేను మీకు చెప్పాను. అమ్మా.. అత్తయ్యా.. నా.. వసంత, వివాహాలను జరిపించినట్లే వారి వివాహాన్ని కూడా జరిపించండి. వారికి ఆనందాన్ని కలిగించండి” ప్రాధేయపూర్వకంగా వారి ముఖాల్లోకి చూస్తూ చెప్పాను.

సోఫా నుంచి లేచి మౌనంగా బయటికి నడిచాను. తలుపు ప్రక్కన వసంత శ్రీవాణి నిలబడి వున్నారు. వారిని చూచి నేను ఆశ్చర్యపోయాను.

“అన్నయ్యా!.. అమ్మ అత్తయ్య ఏమన్నారు?..” ఆత్రంగా అడిగింది వసంత. “నేను యథార్థాన్ని వారికి తెలియజేశాను. మౌనంగా అంతా విన్నారు”అన్నాను.

యింతలో అమ్మ అత్తయ్య గది నుండి బయటికి వచ్చారు. మేము ప్రక్కకు జరిగి నిలబడ్డాము. వారిరువురూ ఫస్టు ఫ్లోర్‌లో.. నాన్న మామయ్య వున్న గదిలోనికి వెళ్ళి తలుపును మూశారు.

పరీక్షా ఫలితాల పేపర్ కోసం వేచి వున్న స్కూల్ స్టూడెంటులా నేను శ్రీవాణి.. వసంత రాఘవ హాల్లో.. అత్తా అమ్మల రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాము.

అరగంట తర్వాత వారిరువురూ మేడపైన మామయ్య గది నుండి క్రిందికి వచ్చారు. మమ్మల్ని సమీపించారు.

“పిల్లలూ.. మీ పంతమే గెలిచింది. త్వరలో గోపాల్ హారికల వివాహాన్ని జరిపిస్తాము” అంది అత్తయ్య నవ్వుతూ. అమ్మ నవ్వుతూ నా భుజాన్ని తట్టింది. వసంత అమ్మను.. శ్రీవాణి అత్తయ్య ఆనందంతో కౌగలించుకొన్నాను. నేనూ అదే స్థితిలో రాఘవను కౌగలించుకొన్నాను.

మేడపైన గది నుంచి మామయ్య నాన్నా క్రిందికి దిగి వచ్చారు. మామయ్య గోపాల్‌కు ఫోన్ చేశాడు.

“గోపాల్.. హారిక అమ్మా నాన్నలకు చెప్పు. ఎల్లుండి మేమంతా వారి పిల్లను చూచేదానికి వస్తున్నామని” చెప్పారు మామయ్య.

పారవశ్యంతో మామయ్య చేతులను నా చేతుల్లోకి తీసుకొన్నాను. ఎంతో అభిమానంతో నా తండ్రి నా భుజంపై చేయి వేశాడు.

వసంత వేగంగా యింట్లోని వంట గది లోనికి వెళ్ళి ప్లేట్లో అత్తయ్య అమ్మ కలిసి చేసిన మైసూర్ పాక్‌ను తెచ్చి తన చేతితో అందరి నోట్లో వుంచింది.

ఆనందంగా ఎవరి గదులకు వాళ్ళం వెళ్ళిపోయాము. తలుపు గడియ పెట్టి శ్రీవాణి వేగంగా నా దగ్గరకు వచ్చి నన్ను కౌగలించుకొంది.

“మై హీరో యీజ్ సూపర్ స్టార్” పరవశంతో నా బుగ్గలపై ముద్దులు పెట్టింది.

నా సెల్ మ్రోగింది. గోపాల్.. “అన్నయ్యా!.. నీకూ వదినకు శతకోటి వందనాలు. మీరు నా సమస్యను యింత తేలికగా పరిష్కరిస్తారని నేను అనుకోలేదు. చాలా దిగులుగా వున్నాను. మామయ్య మాటలకు నేను గాలిలో తేలిపోయాను. విషయాన్ని హారికకు ఫోన్‍లో చెప్పాను. చాలా సంతోషించింది అన్నయ్యా!..” ఎంతో సంతోషంగా చెప్పాడు గోపాల్.

***

సమయం వుదయం ఏడున్నర ప్రాంతం. నేను బాత్ రూమ్‍లో స్నానం చేస్తున్నాను.

శ్రీవాణి.. తలుపు కొట్టింది. తలుపు తెరచి..

“ఏమిటి శ్రీ!..” అడిగాను.

“బాబాయ్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. మీ స్నేహితుడు బాబురావు వచ్చారట” అంది.

శ్రీవాణి.. ఆ మాటలు వినగానే నాగరాజు చెప్పిన మాటలు నాకు గుర్తుకు వచ్చాయి. వేగంగా స్నానాన్ని ముగించి టీ షర్టు లుంగీతో క్రింది హాల్లోకి వచ్చాను. మామయ్య నాన్నగార్ల ముందు సోఫాలో కూర్చొని వున్న బాబురావు వాలకాన్ని చూచి ఆశ్చర్యపోయాను.

ఎదిగిన గడ్డం మీసాలు, తైల సంస్కారం లేని పెరిగిన తల వెంట్రుకలు.. వ్యాధిగ్రస్థుడిలా గోచరించాడు డాక్టర్ బాబూరావు నాకు ఆ క్షణంలో.

మెల్లగా వెళ్ళి వాడి ప్రక్కన సోఫాలో కూర్చొని వాడి ముఖంలోకి చూచాను. వాడి కళ్ళల్లో కన్నీరు.. “జీవితంలో ఓడిపోయాను గోవిందా!.. అన్ని విధాలా పతనమైపోయాను.” బొంగురుపోయిన కంఠంతో అన్నాడు బాబూరావు.

మా యిరువురి స్థితిని చూచి.. మాకు ఏకాంతాన్ని కలిగించే నిమిత్తం.. మామయ్య నాన్నా లేచి యింటి వెనకనున్న చెట్ల వైపుకు వెళ్ళారు.

“బాబూ!.. ఏమయిందిరా. యిలా తయారయ్యావు?..” ఆవేదనతో అడిగాను.

“పెద్దలను ఎదిరించిన దానికి.. హితుల మాటలను వినని దానికి.. అహంకారంతో.. అన్నీ నాకు తెలుసునని గర్వించిన దానికి.. ఫలితం రా యిది” దీనంగా చెప్పాడు బాబురావు.

అది హాలు.. మామయ్య నాన్న అత్తయ్య అమ్మ ఎవరైనా ఏ సమయంలోనైనా రావచ్చు. వాడి కథనంతా వివరంగా తెలిసికోవాలి. నేను వాడికి చేయతగిన సాయం చేయాలి. చేయి పట్టుకుని వాడ్ని మేడపై గదికి పిలుచుకొని వెళ్ళాను. తలుపు మూసి యిరువురం కూర్చున్నాము.

“బాబూ!.. ఏం జరిగింది.. ఎలా ఎవరి వలన నీవు యీ స్థితికి వచ్చావో.. వివరంగా చెప్పరా” అడిగాను.

“లావణ్యకు నేను చేసిన అన్యాయం నా పాలిట శాపంగా మారింది. నాలోని అహంకారం ఆమెను తూలనాడి.. అమ్మా నాన్నల మాటలను పెడచెవిన పెట్టి.. లిల్లీతో నేను ఆఫ్రికాకు వెళ్ళేలా చేసింది.

వృత్తిరీత్యా అక్కడ మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించాను. యిక్కడ నర్స్‌గా పనిచేస్తున్న లిల్లీ.. అక్కడ మేడంగా మారి హోమ్‍మేకర్‍గా యింట్లోనే వుండేది.

కొద్ది కాలంలోనే ఆ కాలనీ వారికందరికీ సన్నిహితురాలిగా మారిపోయింది. బాబును బోర్డింగ్ స్కూల్లో చేర్చింది. మరో బిడ్డ కావాలనే నా ఆశను.. తనలోని అందం తరిగిపోతుందని ఆ విషయంలో నాతో వ్యతిరేకించింది. అనేకసార్లు చెప్పాను. తాను నా కోరికను ఆమోదించలేదు. క్లబ్బులు, షికార్లు అని తన యిష్టం వచ్చినట్లు తిరిగేది. అప్పుడు నాకు అనిపించింది. లిల్లీని ఎన్నుకొని లావణ్యను వదలడం నేను చేసిన పెద్ద తప్పు అని. హు.. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొంటే ఏం లాభం అనే సత్యం స్ఫురణకు వచ్చింది. లేట్.. టు లేట్. విచారించి ప్రయోజనం లేని స్థితి.

దినానికి యిరవై గంటలు క్లినిక్ లోనే రోగుల మధ్యన గడిపేవాణ్ణి. నాకు కావలసిన మనశ్శాంతిని ఆ రోగుల చిరునవ్వుల్లో వెదుక్కొనేవాణ్ణి.

ప్రక్క ఫ్లాట్‌లో వున్న మరో డాక్టర్ విన్సెంట్ అనే నల్లజాతీయునితో లిల్లీకి ఎప్పుడు ఏ రీతిగా పరిచయం అయిందో నాకు తెలియదు. కానీ.. లిల్లీ వాడి మోజులో పడిపోయింది. వాడితో తనకు కావలసిన ఆనందాన్ని పొందడం ప్రారంభించింది.

ఒకనాటి రాత్రి పన్నిండు గంటలకు నిలయం చేరిన నేను వారిరువురూ ఏకశయ్యపై వివస్త్రంగా వినోదించడం నేను చూచాను. అంతవరకూ నాలో వున్న అనుమానం అద్దంలో ప్రతిబింబంలా యథార్థమని తెలిసిపోయింది.

మరుదినం ఉదయాన లిల్లీతో విన్సెంట్తో స్నేహం చేయవద్దన్నాను. లిల్లీ నన్ను ఎదిరించింది. నా నుండి విడాకులు కోరింది. నచ్చ చెప్పేదానికి ఎంతగానో ప్రయత్నించాను. నా ప్రయత్నం నిష్పలం అయింది. విడాకుల పత్రాల మీద సంతకం చేసి నా ముఖాన విసిరింది. శాశ్వతంగా విన్సెంట్ నిలయానికి వెళ్ళిపోయింది. యిరువురూ యిల్లు మారి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు.

బిడ్డ భవిష్యత్తు కోసం ఆ విలాసాన్ని సంపాదించి లిల్లీని కలిసి యింటికి రమ్మనమని దీనంగా యాచించాను.

“నాకు.. నీవు నీ బిడ్డ అనవసరం” అని నన్ను యింట్లో నుంచి బయటికి విన్సెంట్‌తో త్రోయించి తలుపులు మూసుకుంది.

నా ప్రాంతానికి తిరిగి వచ్చి స్కూలుకు వెళ్ళి బిడ్డతో యింటికి చేరాను. “అమ్మ ఏది నాన్నా!..” అని అడిగిన నా బిడ్డకు జవాబు చెప్పలేకపోయాను. బోరున ఏడ్చాను. నన్ను చూచి వాడూ ఏడ్చాడు.

నేను చేసిన పాపాలకు భగవంతుడు నాకు తగిన శిక్షను విధించాడనే నగ్నసత్యం నాకు తెలిసి వచ్చింది. చావాలనే నిర్ణయానికి వచ్చాను. విషాన్ని.. సిద్ధం చేసుకొని నా బిడ్డ ముఖంలోకి చూచాను.

“నాన్నా మనం.. మన దేశానికి వెళ్ళిపోదాం. అక్కడ మనవాళ్ళు మనకు చాలామంది వున్నారుగా నాన్నా!..” కన్నీటితో దీనంగా వాడు నా కళ్ళల్లో చూస్తూ చెప్పిన మాటలు.. నా మూర్ఖత్వాన్ని.. నా నిర్ణయాన్ని చంపేశాయి. నా నిర్ణయాన్ని మార్చుకొన్నాను. నా బిడ్డ కోసం జీవించి కాలానికి ఎదురీదాలని నిర్ణయించుకొన్నాను. విషం గ్లాసును విసిరి పారేశాను. నా బిడ్డను నా హృదయానికి హత్తుకొన్నాను.

అవును నాన్నా!.. నీవు చెప్పినట్లుగానే మనం మన భారతదేశానికి మన వూరికి వెళ్ళిపోదాం. అక్కడ మన వాళ్ళు చాలా మంది వున్నారు. వాళ్ళు మనలను అభిమానిస్తారు. ప్రేమిస్తారు” అన్నాను.

“ఎప్పుడు నాన్నా మనం మన వూరికి వెళ్ళేదీ!..” దీనంగా నా బిడ్డ రాజీవ్ అడిగాడు.

“వెంటనే వెళ్ళిపోదాం నాన్నా. నేను ఆ ఏర్పాట్లును చేస్తాను” ప్రీతిగా చెప్పాను. ఆ మాటలను విన్న నా బిడ్డ కళ్ళల్లో కొత్త వెలుగు ఆనందం. వాణ్ణి నా హృదయానికి హత్తుకొన్నాను.

మూడు రోజుల క్రిందట మన వూరికి వచ్చి.. నిన్ను గురించి విచారించాను. నీ వివరాలు అనిల్ నాకు చెప్పాడు.

రాజీవ్‌ను హారిక వాళ్ళ యింట్లో వదిలి నిన్ను చూడాలని వచ్చాను. చూచాను. నా కథనంతా వివరంగా నీకు చెప్పాను.

రేయ్ గోవిందా!.. నన్ను క్షమించరా. నీ మాటలను లెక్క చేయని దానికి నాకు తగిన శాస్త్రి జరిగింది. నేను బ్రతకాలి. నా బిడ్డ భవిష్యత్తు కోసం నేను బ్రతకాలి. నేను ఏం చేయాలో నీవు నాకు చెప్పాలి. నీవు ఏది చెబితే అది నేను చేస్తాను”

ఏడుస్తూ బాబురావు నా చేతులు పట్టుకొన్నాడు.

వాడి విషాదగాధ విన్న తర్వాత నా కళ్ళూ చెమ్మగిల్లాయి. వెంటనే మాట్లాడలేకపోయాను. నన్ను నేను తమాయించుకొని కొద్దిక్షణాల తర్వాత “నాన్నా.. మామయ్యలతో మాట్లాడి ఒక నిర్ణయానికి వద్దాం. వారు పెద్దవారు. మన హితాన్ని కోరేవారు. వారు చక్కటి సలహాను యివ్వగలరు. లే. నాతో రా.. స్నానం చేసి బట్టలు మార్చుకో. టిఫిన్ చేద్దాం. తర్వాత నాన్నా మాయయ్యలతో మాట్లాడుదాం” అన్నాను.

నేను ముందు నడువగా నా వెనకాలే బాబురావు నా గదిలోకి వచ్చాడు. బట్టలిచ్చి బాత్రూమ్ చూపించాను.

వాడి స్నానానంతరం అందరం కలిసి టిఫిన్ చేశాము. అనంతరం నాన్నా మామయ్య.. అమ్మ అత్తయ్యలను హాల్లో కూర్చోవలసిందిగా కోరాను.

బాబురావు.. చేదు గత చరిత్రను వారికి వివరించాను. అంతా విన్న వారు ఎంతో సానుభూతితో జాలిగా వాణ్ణి చూచారు.

“బాబూ!.. నేను నీకు తండ్రిలాంటి వాణ్ణి, నా దృష్టిలో నీవు గోవింద్ లాంటి వాడివే. నేను నీకు యిచ్చే సలహా మన గ్రామంలో నీవు హాస్పటల్ ఓపెన్ చెయ్యి. చుట్టూ వున్న గ్రామాల పేద ప్రజలకు వైద్య సహాయం చెయ్యి. దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు నేను మా బావా కలిసి చేస్తాం. ఏం బావా ఏమంటావ్?..” మామయ్య ముఖంలోకి చూస్తూ అడిగాడు నాన్నగారు.

వారి సలహా నాకు బాగా నచ్చింది. వైద్యావసరాలకు ఆ గ్రామ ప్రజలు పది కిలోమీటర్లు వెళ్ళవలసి వుంది బాబురావు అక్కడ హాస్పటిల్ నడిపితే గ్రామవాసులంతా ఎంతగానో సంతోషిస్తారు.

“బావా!.. నేనూ ఆ విషయాన్నే చెప్పాలనుకొన్నాను. నీవు చెప్పావు. యీ విషయంలో మన యిరువురి నిర్ణయం ఒక్కటే. మీకు తెలియని విషయం.. వీరి నాన్న సాంబయ్యగారు యితని పేర ఆరు ఎకరాల భూమిని యిరవై లక్షల డబ్బును బ్యాంకులో వేసి పత్రాలను నాకు యిచ్చి.. ఏనాటికైనా వాడు తిరిగి వస్తే.. వాడు ఏ స్థితిలో వున్నా వాటిని వాడికి ఇవ్వు. వారికి నా మీద వున్న నమ్మకంతో నా స్వాధీనం చేసి వెళ్ళిపోయారు. నేను వాటిని బాబురావుకు యిస్తాను”

“బావా!.. సాంబన్న అలా చేశాడా!..” ఆశ్చర్యంతో అడిగారు నాన్నగారు. “అవును బావా!.. నీకు తెలియంది కాదు. నవనాగరీకతా వ్యామోహంతో తల్లిదండ్రులను యంత్రాలుగా భావించే సంతతి వున్నా.. ఆ సంతతి పై తల్లిదండ్రులు బ్రతికి వున్నంత వరకూ అభిమానం ప్రేమా చావదు బావా!.. తమకు దూరమైనా తమ బిడ్డలు ఎక్కడున్నా హాయిగా ఆనందంగా వుండాలనే ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారని నా అభిప్రాయం. యీ కోవకు చెందిన మహనీయుడు సాంబయ్య బావ.” నవ్వుతూ చెప్పాడు మామయ్య.

వారి మాటలను విన్న బాబురావు కళ్ళు చెమ్మగిల్లాయి.

“నన్ను క్షమించండి” అంటూ మామయ్య నాన్నల పాదాలను తాకాడు.

వారు ఆనందంగా.. “యికపై నీకు అన్నీ మంచి రోజులే. ‘మానవసేవే మాధవసేవ’ యీ మాటను గుర్తుంచుకో” అన్నారు మామయ్య అతన్ని ప్రీతిగా చూస్తూ.

మరుదినం వుదయం మేము నెల్లూరులో నిర్మించిన గృహప్రవేశం. అందుకుగా హారిక ఆమె తల్లిదండ్రులు, నాగరాజు రామకోటయ్య, గోపాల్ అందరూ కలిసి వచ్చారు. అందరం వెళ్ళి యింటిని నాలుగు దిశలను.. చూచి, హారిక పనితనానికి ఆమెను సునీల్‌ని.. అభినందించాము. ఘనంగా మరుదినం ఉదయం గృహప్రవేశం జరిగింది.

(ముగింపు వచ్చే వారం)

Exit mobile version