[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘ప్రేమేగా ప్రపంచం’ అనే నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]
[ముందురోజు గోపాల్‌ని, హారికని చూసినప్పటి నుంచి వారి విషయంలో గోవిందకి అనుమానం కలుగుతుంది. ఇంటికి వెళ్ళాక తమ్ముడితో మాట్లాడాలనుకుంటాడు. గోపాల్ కన్నా హారిక రెండు సంవత్సరాలు పెద్ద అనీ, ఒకవేళ వారిరువురూ ప్రేమించుకొంటే, తల్లిదండ్రులకు అభ్యంతరం లేకుండా, అశాంతి కలగకుండా సమస్యని పరిష్కరించాలనుకుంటాడు. ఇంటికి వెళ్ళేసరికి అమ్మానాన్నలు టీవీ చూస్తుంటారు. అనుకోకుండా వచ్చిన పెద్ద కొడుకుని చూసి ఆనందిస్తారు. చెల్లెలు వసంత ఆప్యాయంగా పలకరిస్తుంది, వదినని తీసుకురాలేదా అని అడుగుతుంది. బయటకు వెళ్ళిన గోపాల్ కాసేపట్లో ఇంటికి వస్తాడు. ఆ రాత్రి టెరస్ మీద అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకుంటారు. ఎవరికీ ఏ ఇబ్బంది కలగకుండా తమ్ముడి పెళ్ళి హారికతో తాను జరిపిస్తానని గోవింద అంటాడు. వసంత రాఘవల పెళ్ళి జరిగి, వసంత అత్తవారింటికి వెళుతుంది. పది రోజుల తరువాత శ్రీవాణితో గోవింద వివాహం జరుగుతుంది. పెద్దలంతా సంతోషిస్తారు. సునీల్ వచ్చి తన తప్పుని ఒప్పుకుని గోవిందని క్షమించమని అడుగుతాడు. అతనిలో వచ్చిన మార్పుకు గోవింద సంతోషిస్తాడు. గోవింద్, శ్రీవాణి హనీమూన్‌కి కేరళ వస్తారు. – ఇక చదవండి.]
కేరళ రాష్ట్రం లోని గురువాయూరుకు విశిష్ట చరిత్ర వుంది.
ద్వాపర యుగ పురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ.. యుగాంతాన ముసలం కారణంగా యాదవులు పరస్పర భేదభావాలతో ఒకరినొకరు తుంగలతో కొట్టుకొని హతులైన తర్వాత, శ్రీకృష్ణుడు వనంలో చెట్టుకు ఆనుకొని కాలిపై కాలు వేసికొని అవతార పరిసమాప్తికి ఆయత్తుడైన తరుణంలో బోయవాడు ఆ మహాపాదాన్ని జింక చెవులుగా భావించి చెట్లు మాటు నుండి విషం రాచిన బాణాన్ని ప్రయోగించగా.. గోవిందుడు తనువు నేలకు వరిగింది. విగత జీవుడైన పరంధాముని చూచి బోయ తన మూలంగా శ్రీకృష్ణుడు గతించాడని ఆక్రోశించాడు. శ్రీ కృష్ణావతారం పరిసమాప్తి అయింది.
గురువు వాయువు పరమాత్మాణ్వేషణలో ఆ ప్రాంతానికి చేరారు. అక్కడ వారిని నేటి గురువాయూరు ఆలయంలో వున్న గోపాలని శిలామూర్తి వారికి గోచరించింది.
వారు.. ఆ మూర్తిని తమ చేతుల్లోకి తీసుకొని కళ్ళకు అద్దుకొని.. స్థాపించే నిమిత్తం తగిన స్థల అన్వేషణ సాగించగా.. వారికి ఒక జటాధారి శివన్ నామధేయుడు కనిపించాడు.
గురువాయులు శ్రీకృష్ణమూర్తిని వారికి చూపించి విగ్రహ ప్రతిష్ఠాపనకు అనువైన స్థలాన్ని సూచించవలసినదిగా వారు ఆ స్వామిని కోరారు. వారు తాను కూర్చుండి వున్న స్థలము నుండి లేచి.. యిదే స్థలంలో శ్రీమన్నారాయణ మూర్తిని ప్రతిష్ఠించండని చెప్పి తాను అక్కడికి కొంత దూరంలో వున్న మమ్మావూరు ప్రాంతానికి వెళ్ళిపోయారట.
గురువాయువులు ఆ కృష్ణుని విగ్రహాన్ని శివ గురువు ఆదేశానుసారంగా వారు వుండిన స్థలమునందే ప్రతిష్ఠించారట.
ఆ కారణంగా ఆ ప్రాంతానికి గురువాయూరు అనే నామం.. వారిరువురూ కలసి ప్రతిష్ఠించిన ఆ శ్రీ కృష్ణమూర్తికి.. గురువాయూరప్ప.. అన్న నామధేయాలు వెలసాయట.
స్వామి వారి దర్శనానంతరం.. వయోవృద్ధుడైన ఆలయ పూజారి మళయాళంలో.. చెప్పగా ఒక ద్విభాషి మాకు వివరించగా.. ద్వాపర యుగంలో జరిగిన ఆ సుచరిత్రను నేను శ్రీవాణి శ్రద్ధగా విని తెలుసుకొన్నాము.
ఆ తర్వాత మమ్మావూరుకు వెళ్ళి శివాలయాన్ని దర్శించి.. పరమానందంగా మా నిలయానికి చేరుకొన్నాము.
పవిత్ర స్థలమూర్తులను దర్శించే సమయంలో మనస్సుకు ఎంతో ప్రశాంతత.. స్వస్థత.. ఏకాగ్రత కలుగుతుంది. మనలోని కామక్రోధ మదమాత్సర్యాలు మనకు దూరంగా వెళ్ళిపోయాయనే భావన. మనస్సుకు ఎంతో శాంతి.. ప్రశాంతతలు కలుగుతాయి. ప్రతి ఒక్కరికీ యిలాంటి అనుభవం ఎంతో అవసరం.
శ్రీవాణి నేను మా హనీమూన్ యాత్రను ఆ రీతిగా సాగించి.. ఆనందించి మా స్వగ్రామానికి వారం రోజుల తర్వాత.. చేరాము.
ఉదయం ఆరున్నరకు సునీల్ మా యింటికి వచ్చాడు. హాల్లో వున్న అమ్మా నాన్నలు వాడిని సాదరంగా లోనికి పిలిచారు.
అక్కడే వున్న శ్రీవాణి నా గదికి వచ్చి వాడు వచ్చిన విషయాన్ని చెప్పింది.
నేను క్రిందికి వచ్చాను.
“ఏరా! యింత వుదయాన్నే వచ్చావ్!..”
“నీతో మాట్లాడాలని వచ్చాను”
“కూర్చో.. విషయం ఏమిటి?..”
“అరే గోవిందా!.. మన యింటిని నేను కడతానురా!.. పెదనాన్నా.. పెద్దమ్మా.. మీరూ అంగీకరించాలి” ఎంతో వినయంగా చెప్పాడు.
నేను నాన్న అమ్మల ముఖాల్లోకి చూచాను.
నాన్నగారు.. “యీ విషయంలో హారిక నిర్ణయం ఎలా వుందో!..” అన్నారు.
“పెదనాన్నా!.. నేను హారికను అడిగాను”
“ఆమె ఏమంది?..”
“మిమ్మల్ని అడగమంది”
తన గది నుండి క్రిందికి వచ్చిన గోపాల్.. మా మాటలను విన్నాడు. “నాన్నా!.. నేను వెళ్ళి హారికను పిలుచుకు రానా!..”
“ఆ.. వెళ్ళు..” నాన్నగారి జవాబు.
గోపాల్ వేగంగా వెళ్ళిపోయాడు.
“సునీల్!.. నేను ఆ యింటికి సంబంధించిన పూర్తి బాధ్యతలను హారికకు ఒప్పచెప్పాను. ఆమె మరెవరితోనైనా మాట్లాడిందేమో నాకు తెలియదు. ఆ విషయాన్ని కనుక్కోవాలిగా!.. అందుకే ఆమెను పిలుచుకు రమ్మన్నాను”
“మంచిది పెదనాన్నా!..”
శ్రీవాణి అందరికీ కాఫీలు అందించింది.
హారిక.. గోపాల్ నవ్వుతూ హాల్లోకి వచ్చారు. ఆమెను చూచిన నాన్నగారు నవ్వుతూ..
“అమ్మా హారికా, రా. కూర్చో.” వారి ప్రక్కన సోఫాలో కూర్చుంది హారిక.
“హారికా!..”
“చెప్పండి మామయ్య!..”
“మన యింటిని యీ సునీల్ కడతానంటున్నాడు. నీవు వేరే ఎవరికైనా మాట యిచ్చావా?..”
“లేదు మామయ్యా!..”
హారిక.. ఆ మాటను విన్న సునీల్ ముఖంలో ఎంతో సంతోషం. నవ్వుతూ నా వంక చూచాడు.
“మామయ్యా!.. నేను యిద్దరికి క్వాంటిటీస్ వివరాలు యిచ్చాను. వీరికీ యిస్తాను. ఎవరు తక్కువ రేట్ కోట్ చేస్తే, వారే ఆ యింటిని కట్టగలరు” నవ్వుతూ చెపింది హారిక.
“సునీల్.. విషయం అర్థం అయిందిగా. హారిక దగ్గర క్వాంటిటీస్ తీసుకో. కోట్ చెయ్యి. నీ రేట్లు తక్కువగా వుంటే.. నీవే ఆ యింటిని కట్టవచ్చు. అంతే కదా హారికా!..”
“అవును మామయ్యా!..”
“పెదనాన్నా!.. మన యింటిని కట్టబోయేది నేనే” నవ్వుతూ చెప్పాడు.
తన చేతిలో వున్న క్వాంటిటీస్ పేపర్లను హారిక సునీల్‌కు అందించింది. సంతోషంగా వాడు అందుకొన్నాడు. అమ్మా నాన్నల పాదాలు తాకి వారి ఆశీర్వాదాలను తీసుకొని సునీల్ వెళ్ళిపోయాడు.
వాడిలో కలిగిన మార్పుకు అందరం సంతోషించాము.
వారంరోజుల తర్వాత.. ఆదివారం నాడు హారిక యింటికి వచ్చింది. అందరికన్నా తక్కువగా కోట్ చేసింది సునీల్ అని చెప్పి కాగితాలను చూపించింది. వాడి చేత యింటి పనిని ప్రారంభించమని నాన్నగారు హారికకు చెప్పారు. మంచిరోజు చూచుకొని సునీల్ మా యింటి పనిని ప్రారంభించాడు. హారిక.. గోపాల్ తరచుగా అక్కడికి వెళ్ళి.. జరుగుతున్న పని వివరాలను నాకు అమ్మానాన్నలకు తెలియజేసేవారు.
యీ యింటి నిర్మాణ కార్యక్రమం ద్వారా.. గోపాల్ హారికలు తరచుగా కలుసుకోవడం.. మరింత సన్నిహితులు కావడం నేనూ.. శ్రీవాణి గమనించాము.
బి. టెక్ చదువుతున్న రూప దీపల పరీక్షల ఫలితాలు వచ్చాయి. యిరువురికీ గోల్డ్ మెడల్స్ వచ్చాయి.
శలవుల్లో వారు ఆఫీస్కు వచ్చి.. నాకు శ్రీవాణికి సాయంగా వుంటూ మేము చెప్పిన పనులు చేసేవారు.
యిరువురికీ యం.టెక్ చేయాలనే వారి కోరికను విన్న నేను.. వారిని వైజాగ్‌లో యం.టెక్‌లో జాయిన్ చేశాను. నెలకొకసారి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలను పరామర్శించేవాణ్ణి.
శ్రీవాణి.. ఆఫీస్‌లో చేరిన తర్వాత పన్నిండు హైవ్యాల్యూ టెండర్ కోట్ చేశాము. అందులో మాకు ఎనిమిది వర్కులు లభించాయి. వ్యాల్యూ ఎనభై కోట్లు.
ఆ విషయాన్ని విన్న నాన్నా అమ్మలు, మామయ్య అత్తయ్యలు, పెద్దమ్మ శ్యామలమ్మ, పిల్లలు రూపదీపలు ఎంతగానో సంతోషించారు.
శ్రీవాణిని ఎంతగానో అభినందించారు. ‘బంగారు మనస్సు.. బంగారు పాదం’ అని ఆమెను ప్రశంసించారు. నిగర్వి.. శ్రీవాణి.
“యిందులో నా గొప్పతనం ఏమీ లేదు. అంతా మీ అబ్బాయిగారి కృషి.. సంకల్ప బలం ఫలితమే యిది” తనకు సహజమైన కల్మషం లేని నవ్వుతో చెప్పేది.
శ్రీవాణి గర్భవతి అన్న విషయాన్ని విన్న అమ్మా నాన్నలు.. పెద్దమ్మ శ్యామలమ్మ.. ఆమెను ఆఫీస్‍కు వెళ్ళవద్దని వారించారు.
కానీ.. శ్రీవాణి “మెదుడుకు ఎప్పుడూ పదును పెడుతూ పని చెయ్యాలి అమ్మా!.. అది నాకు మీ పుట్టబోయే.. వారెవరో నాకు తెలీదుగా.. వారికీ ఆరోగ్యం” చెప్పి.. అందంగా నవ్వేది.
ఆమెకు సహాయానికి ముగ్గురు యం.టెక్ అమ్మాయిలను నియమించాను. రామసుబ్బయ్యగారు శ్రీవాణిని.. కొత్తవారిని ఎంత గౌరవంగా.. జాగ్రర్తగా తన కన్న బిడ్డల్లా చూచుకొనేవారు.
సంవత్సరం లోపలే ఆఫీస్‌లో జరిగిన మార్పులకు టర్నోవర్ రెండింతలు రెట్టింపు అయినందుకు, అన్ని వ్యవహారాలు క్రమంగా సకాలంలో జరుగుతున్నందుకు పెద్దమ్మ నన్ను ఎంతగానో అభినందించింది.
***
ఆఫీస్‌లో కూర్చొని చెక్స్ మీద సంతకాలు చేస్తున్నాను. నా సెల్ మ్రోగింది.
“హలో!..”
“నేను రా.. నాగరాజ్..” ఆనందం ధ్వనించింది వాడి కంఠంలో.
“చాలా ఆనందంగా వున్నావ్, ఏమిట్రా విషయం?”
“సుబ్బలక్ష్మి ప్రసవించిందిరా. బాబు పుట్టాడు” నవ్వాడు నాగు.
“ఆఁ..”
“అవున్రా..”
“అరే బావా.. కంగ్రాచులేషన్స్.” ఆనందంగా నవ్వుతూ చెప్పాను. “అవును.. బాబు నీ పోలికా లేక సుబ్బు పోలికా”
“అందరూ నా పోలికే అంటున్నార్రా” వాడి యీ మాటల్లో నాకు గర్వం ధ్వనించింది.
అవును.. అది సహజం. దాదాపు నాలుగు సంవత్సరాలు వాడు.. సుబ్బలక్ష్మి పడ్డ కష్టాలకు.. భరించిన అవమానాలకు.. ఆ భగవంతుడు వారి యందు దయ చూపి సుబ్బలక్ష్మికి బిడ్డను ప్రసాదించాడు.
“అల్లుణ్ణి.. చూడ్డానికి ఎప్పుడు వస్తావురా!..” అడిగాడు నాగరాజు.
“త్వరలో నేను శ్రీ కలసి వస్తాం” అన్నాను.
“తప్పకుండా రావాలి. అత్తయ్య మామయ్యలకు కూడా చెప్పాను. వారూ ఎంతగానో సంతోషించారు”
“సరే.. మీ అమ్మ, మా అత్తమ్మ ఏమంటూ వుంది?..”
“అమ్మ సంతోషాన్ని నేను మాటలతో చెప్పలేనురా. నీవు వస్తున్నావుగా.. నేరుగా నీవే చూడు” అన్నాడు నాగరాజు.
క్షణం తర్వాత.. “ఆ.. అరే బావా, మరో విషయం” అన్నాడు.
“ఏమిట్రా అది..”
“ఆఫ్రికా నుంచి మన బాబురావు తిరిగి వచ్చాడట”
“ఆఁ..” వాడి ఆ మాటకు నేను ఆశ్చర్యపోయాను.
“నీకు ఎవరు చెప్పారు?..” ఆత్రంగా అడిగాను.
“మన సునీల్ గాడు”
“ఎప్పుడు కలిశాడట?..”
“మూడు రోజుల క్రిందట”
“యిప్పుడు ఎక్కడున్నాడు?..”
“నాకేం తెలుసు బావా.. నేను చూడలేదుగా.”
“సునీల్ గాడి నెంబర్ నీ దగ్గిర వుందా”
“వుంది”
“చెప్పు”
నాగరాజు నెంబర్ చెప్పాడు. నోట్ చేసికొన్నాను. “మనం రేపు కలుద్దాం నాగూ!..”
“సరే బావా. పెట్టేస్తున్నా”
వాడు సెల్ కట్ చేశాడు. నేను సునీల్ నెంబర్ కి కాల్ చేశాను. యంగేజ్ సౌండ్.
ఎంతో హాయిగా ఆఫ్రికాలో వున్న బాబూరావు తిరిగి ఎందుకు వచ్చినట్లు!.. కుటుంబంతో కలిసి వచ్చాడా లేక ఒంటరిగా వచ్చాడా!.. ఎలా వున్నాడో ఏమిటో వాణ్ణి వెంటనే కలసికొని మాట్లాడాలని మనస్సున ఆరాటం. మరలా సునీల్ నెంబర్ నొక్కాను. యంగేజ్ సౌండే వచ్చింది.
రిసెప్షన్‌కు కాల్ చేసి సునీల్ నెంబరిచ్చి కనెక్టు చేయమని చెప్పాను. యింటర్‌కమ్‌లో శ్రీవాణిని పిలిచాను. తను నా గదిలోకి వచ్చింది.
“అర్జంటుగా రమ్మన్నారు. ఏమిటి విషయం” కుర్చీలో కూర్చుంటూ అడిగింది.
“మన నాగరాజు భార్య సుబ్బలక్ష్మి ప్రసవించిందట. వాడు ఫోన్ చేసి చెప్పాడు. ఆ విషయం నీకు నేరుగా చెప్పడం నా బాధ్యత కదా.. అందుకే పిలిచాను” నవ్వుతూ చెప్పాను.
“యింతకూ ఏ బిడ్డో చెప్పలేదు” కొంటెగా నా కళ్లల్లోకి చూస్తూ అంది.
“మగ బిడ్డ”
“అంటే తమరు మామయ్యగారు అయ్యారన్నమాట” అందంగా నవ్వింది.
“యస్..” నవ్వాను.
“చాలా ఆనందంగా, మీకు బిడ్డ పుట్టినట్లు ఫీలైపోతున్నారు” చిలిపిగా నా కళ్ళల్లోకి చూస్తూ అడిగింది శ్రీవాణి.
“అవును శ్రీ. పాపం సుబ్బలక్ష్మి నాగరాజులు.. మా అత్తయ్య రుక్మిణమ్మ మూలంగా.. సంతానం కలుగనందుకు చాలా బాధ పడ్డారు. చెప్పాను కదా నీకు ఆ కథనంతా. చూడు.. ఎదుటి వారికి ఆనందం కలిగించే రీతిగా సాయం చేయడం.. వారి ఆనందంలో పాలు పంచుకోవడంలో ఎంతో ఆనందం వుంటుంది. ఎదుటివారి ఆనందాన్ని మనం కోరుకొంటే.. ఆ దేవుడు, దయామయుడు తప్పకుండా మనకూ ఆనందాన్ని ప్రసాదిస్తాడని నా నమ్మకం. స్వానుభవం, దానికి సాక్ష్యం నాదానివై నా ముందున్న నీవే. నాతో ఏకీభవిస్తావు కదూ!..” ఆశగా అడిగాను.
“యస్.. యస్.. మైడియర్ హజ్బెండ్” అందంగా నవ్వుతూ తన చేతిలోకి నా చేతిని తీసుకొంది శ్రీవాణి.
ఆలు మగల మధ్యన నమ్మకం.. చక్కటి అవగాహన, పరస్పర ప్రేమాభిమానాలు, గౌరవం, సాదర మైత్రీ.. ఆదర్శ దాంపత్యానికి ఎంతైనా అవసరం. యీ విషయాన్ని నేను మా అమ్మనాన్నలను చూచి నేర్చుకొన్నాను. నా జీవిత భాగస్వామిని ఆ రీతిగా మలుచుకోవాలన్నది నా ఆశయం. మా కొద్ది రోజుల సహజీవనంలో శ్రీవాణి నన్ను పూర్తిగా అర్థం చేసుకొంది. తన సహకారాన్ని నాకు ప్రతి విషయంలో యింట అర్ధాంగిగా.. ఆఫీస్‍లో సహబాధ్యతాయుత సహచరురాలిగా వర్తిస్తూ వుంది. అది నా అదృష్టం. నా సెల్ మ్రోగింది. శ్రీవాణి అందుకొంది. హనీమూన్‌కు కాశ్మీరుకు వెళ్ళిన నా చెల్లి వసంత రాఘవ తిరిగి వచ్చినట్లుగా.. వెంటనే యింటికి వసంత మమ్మల్ని రమ్మంటున్నదని శ్రీవాణి చెప్పింది.
వారు రెండు వారాల క్రిందట నార్తుకు వెళ్ళారు నాకూ.. చెల్లిని రాఘవను చూడాలనే ఆశ.
“పద యింటికి వెళదాం” అన్నాను.
“యస్ బాస్.” నవ్వుతూ అంది శ్రీవాణి.
రామసుబ్బయ్యగారికి యింటర్‌కమ్‌లో విషయం చెప్పి యిరువురం యింటికి బయలుదేరాము.
అమ్మ.. నాన్నా.. గోపాల్.. పెద్దమ్మ శ్యామల, రూప దీపలు మామయ్యగారి యింట్లో సమావేశం అయ్యారు. అందరం.. కబుర్లు చెప్పుకొంటూ వెన్నెల్లో టెరస్‌పై భోంచేశాము.
(ఇంకా ఉంది)
సిహెచ్. సి. ఎస్. శర్మ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి జననం నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా ఊచగుంటపాళెంలో జరిగింది. ప్రాథమిక విద్య పెయ్యలపాళెం, బుచ్చిరెడ్డిపాళెంలోనూ, ఉన్నతవిద్య నెల్లూరులోనూ.
సివిల్ ఇంజనీరుగా రాష్ట్రంలోని పలు సంస్థలలో వివిధ హోదాలలో పని చేసి చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరక్టర్ స్థాయికి ఎదిగారు.
చిన్ననాడు బామ్మగారు చెప్పిన కథలతో ప్రేరణ పొంది బాల్యం నుంచే రచనలు చేశారు. మిత్ర రచయితల ప్రోత్సాహంతో రచనా రంగంలో విశేషంగా కృషి చేశారు. 20 నవలలు, 100 కథలు, 12 నాటికలు/నాటకాలు, 30 కవితలు రాశారు.
వివిధ సాహితీ సంస్థల నుంచి పలు పురస్కారాలు పొందారు.