Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమేగా ప్రపంచం-14

[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘ప్రేమేగా ప్రపంచం’ అనే నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]

[తొమ్మిదిన్నరకల్లా గోవింద శ్యామలరావు మావయ్య ఇంటికి వెళ్తాడు. అప్పటికే అక్కడ అతని అమ్మానాన్నలు, చెల్లెలు వచ్చి ఉంటారు. మావయ్య తన తల్లిదండ్రులకి శ్రీవాణి గురించి ఏం చెప్పి ఉంటాడో గోవిందకి అర్థం కాలేదు. మొత్తానికి గోవింద శ్రీవాణిని పెళ్ళిచేసుకోడానికి పెద్దలంతా అంగీకరిస్తారు. శ్రీవాణిని తీసుకుని కారులో ఆఫీసుకు బయల్దేరుతాడు గోవింద. దారిలో ఆమె సముద్రాన్ని చూడాలని ఉందని అనడంతో ముత్తుకూరు రోడ్డు వైపుకి తిప్పి, సముద్రం వైపుకు తీసుకెళ్తాడు. కొంచెం దూరం వెళ్ళాకా హీరోహోండా మీద గోపాల్, హారిక తమ కారుని దాటుకుంటూ వెళ్ళడం గమనిస్తాడు గోవింద. సముద్ర తీరం చేరాకా, అక్కడ కాసేపు కూర్చుంటారు. శ్రీవాణి సాగరమాతకు ప్రణమిల్లి, కృతజ్ఞతలు తెలుపుకున్నాకా తిరిగి బయల్దేరుతారు. ఆమె బట్టలు తడిసిపోయాని కొత్త చీర కొంటాడు, ఆకలేస్తోందంటే ఇడ్లీ పార్శిల్ కట్టించుకుని వస్తాడు. ఆమె డ్రెస్ మార్చుకుని టిఫిన్ తిన్నాకా, ఇద్దరూ కలిసి ఆఫీసుకు వెళ్తారు. ఆమెకు అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇస్తాడు. మధ్యాహ్నం మామయ్య ఇంటికి వెళ్ళి భోం చేసి తిరిగి ఆఫీసుకు వచ్చాకా, శ్రీవాణిని యింజనీరింగ్ డివిజన్ ప్లానింగ్ మ్యానేజర్‌గా నియమించినట్టు చెప్పి సిబ్బంది అందరికీ పరిచయం చేస్తాడు. రామసుబ్బయ్య ఆమెకు ఓ గది ఏర్పాటు చేస్తాడు. గోవింద స్టడీ చేయమని చెప్పిన ఫైల్స్ జాగ్రత్తగా చదివి, చక్కని రిపోర్ట్ తయారు చేస్తుంది. సాయంత్రం ఆమెను మావయ్య వాళ్ళింట్లో దింపి, తమ ఇంటికి బయల్దేరుతాడు గోవింద. – ఇక చదవండి.]

ఇంటి ఆవరణం దాటి.. రోడ్‌లో ప్రవేశించాను. క్రిందటి రోజున గోపాల్‌ను హారికను చూచినప్పటి నుంచీ వారి విషయంలో నాకు అనుమానం కలిగింది. కులగోత్రాల విషయంలో ఏ సమస్యా లేదు. హారిక మాకు వరసైన అమ్మాయే. కానీ గోపాల్ కన్నా హారిక రెండు సంవత్సరాలు పెద్ద. ఒకవేళ వారిరువురూ ప్రేమించుకొంటే.. అది నా తల్లిదండ్రులకు సమస్యగా కాకూడదని యీ వయస్సులో ఆ పెద్దలకు మా వలన ఎలాంటి అశాంతి కలుగకూడదన్నది నా వుద్దేశం.

నాకు సంబంధించిన శ్రీవాణి విషయంలో నేను ఎంతగానో భయపడ్డాను. యథార్థాన్ని మామయ్యకు చెప్పాను. వారు సహృదయులు. శ్రీవాణి వారికి బంధువు అయినందున పెద్ద సమస్యను సునాయాసంగా నా తల్లిదండ్రులతో మాట్లాడి వారిని ఒప్పించి నాకు శ్రీవాణికి మేలు చేశాడు. మరి గోపాల్ విషయం ఏ స్థాయిలో వుందో.. వాడి నిర్ణయం ఏమిటో తెలిసుకోవడం నాకు చాలా ముఖ్యం. యథార్థాన్ని తెలుసుకొని సరైన సలహాన్ని నా తమ్ముడికి యివ్వడం నా కర్తవ్యం, ధర్మం. అందుకే యిప్పటి యీ నా పయనం మా వూరికి. ఎలాంటి సమస్యా ఉత్పన్నం కాకూడదని భగవంతుణ్ణి వేడుకొన్నాను.

గంటన్నరలో కారు మా యింటి ముందు ఆగింది. సమయం రాత్రి ఎనిమిది గంటలు.

అమ్మా నాన్నా హాల్లో కూర్చొని టీవీని చూస్తున్నారు. నన్ను చూడగానే వారి కళ్ళల్లో ఎంతో ఆనందం. “ఏం నాన్నా.. వస్తున్నట్లు ఫోన్ చేయలేదు?” ఆప్యాయంగా పలకరించింది అమ్మ.

“అమ్మాయి శ్రీవాణికి వుద్యోగాన్ని యిచ్చావా!..” నవ్వుతూ అడిగారు నాన్నగారు.

“యిచ్చాను నాన్నా!.. యీ రోజే జాయిన్ అయింది” చిరునవ్వుతో చెప్పాను.

నా కళ్ళల్లోకి చూస్తూ.. “మంచి పని చేశావ్ నాన్నా.” నవ్వుతూ అన్నారు. నా గొంతు విని చెల్లి వసంత హాల్లోకి వచ్చింది.

“అన్నయ్యా!.. వదినను తీసుకొని రాలేదా!..” అడిగింది.

లేదన్నట్లు నేను తల ఆడించాను.

“శ్రీవాణిని తీసుకొని వచ్చుంటే బాగుండేది నాన్నా!..” అంది అమ్మ. నేను చిరునవ్వుతో అమ్మ ముఖంలోకి చూచాను.

నిర్మలమైన అభిమానం అమ్మ కళ్ళల్లో గోచరించింది. “అమ్మా!.. గోపాల్ ఏడి?”

“వాడు అలా బయటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళాడు. యీ పాటికి వస్తూనే వుంటాడు” అంది అమ్మ.

గోపాల్ వచ్చాడు.

నన్ను చూచి.. “అన్నయ్యా!.. ఎప్పుడొచ్చావ్” నవ్వుతూ అడిగాడు.

“పావుగంట అయింది”

నా ముఖంలోకి కొన్నిక్షణాలు చూచి మేడ పైన తన గదికి వెళ్ళిపోయాడు. అమ్మ, చెల్లి వెళ్ళి భోజనానికి సిద్ధం చేశారు. సరదాగా కబుర్లతో భోం చేసాము. ప్రస్తావన అంతా శ్రీవాణిని గురించే.

భోజనానంతరం అమ్మా నాన్నా వారి గదికి, వసంత తన గదికి వెళ్ళిపోయారు.

గోపాల్ మౌనంగా టెర్రెస్ పైకి వెళ్ళిపోయాడు. వాడు చూపుల్లో వాడిని హారికను నేను చూచానన్న భయం నాకు కనిపించింది. విషయాన్ని నిలదీసి అడిగితే బాధపడతాడేమో!.. అడక్కపోతే నిజానిజాలు తెలిసేదెలా!.. అడగాల్సిందే అనే నిర్ణయానికి వచ్చాను. మెల్లగా టెర్రెస్ పైకి వెళ్ళాను. ఉత్తరపు వైపు చేపట్టు గోడ దగ్గర నిలబడి ఆ వైపే చూస్తున్నాడు. ఆ దిశ లోనే హారిక యిల్లు వుంది. పగలైతే.. ఆ యింటి టెర్రెస్ పై వుండే వాళ్ళు కనుపిస్తారు. రాత్రి సమయం కాబట్టి టెర్రెస్ పై ఏమీ గోచరించలేదు.

నేను మెల్లగా గోపాల్‌ను సమీపించాను. నా పద సవ్వడిని విన్న గోపాల్ నా వైపుకు తిరిగాడు.

“యీ చీకట్లో యిక్కడ ఏం చేస్తున్నావ్ గోపా!..” మెల్లగా అడిగాను.

“నిద్ర రావడం లేదన్నయ్యా. అందుకే యిక్కడికి వచ్చాను”

“అలాగా!.. ఎనీ ప్రాబ్లమ్?..” అడిగాను.

వాడు జవాబు చెప్పలేదు. కొద్దినిముషాలు మా మధ్యన మౌనంగా గడిచిపోయాయి. ఏదో చెప్పబోయి ఆగిపోయాడు గోపాల్.

“గోపూ!.. నేనెవరినిరా. నీ అన్నయ్యను కదూ!.. నీ సమస్య నా సమస్య కాదా. నిర్భయంగా విషయం ఏమిటో చెప్పు. నేను పరిష్కరిస్తాను” వాడి భుజంపై చేయివేసి చెప్పాను.

“అన్నయ్యా!..” క్షణంసేపు నా కళ్ళల్లోకి చూచి తలను ప్రక్కకు త్రిప్పుకొన్నాడు.

 “చెప్పు..”

“నీవు యీ రోజు హారికను నన్ను చూచావు కదూ!..”

“ఆఁ.. చూచాను. ఐతే..”

“మేమిద్దరం ప్రేమించుకొంటున్నాము అన్నయ్యా!.. యిందులో ఆమె తప్పు ఏమీ లేదు. తప్పంతా నాదే” దీనంగా నా కళ్ళల్లో చూస్తూ చెప్పాడు గోపాల్.

నా అనుమానం నిజం అయింది. మరో సమస్య నా ముందు నిలిచింది. దీన్ని ఎవ్వరికీ ఎలాంటి కష్టం.. నష్టం జరగకుండా పరిష్కరించాలి. ముఖ్యంగా అమ్మానాన్నలను ఒప్పించాలి. నేను యీ విషయాన్ని వారికి చెబితే విని ఏమంటారో!..

హారిక అంటే.. అమ్మానాన్నలకు ఎంతో యిష్టం అది బంధుత్వ రీత్యా.. ఆమె తెలివితేటలు, మంచితనం కారణంగా. గోపాల్ హారికలు ప్రేమించు కొంటున్నారని.. వారి పెండ్లి జరిపించాలని నేను చెబితే వారు.. ఎలాంటి స్థితికి లోనౌతారో.. గోపాల్‌పై ఎలాంటి అభిప్రాయానికి వస్తారో.. వారం రోజుల్లో వసంత వివాహం జరగబోతూ వుంది.

శ్రీవాణిని గురించి మామయ్య వారికి ఏం చెప్పారో ఏమో ఆమె విషయంలో కూడా వారు చాలా ఆనందంగా వున్నారు. మా యిరువురి వివాహాన్ని త్వరలో జరపాలని నిర్ణయించుకొన్నారు. యిలాంటి సమయంలో గోపాల్ హారికల ప్రేమ వివాహ విషయాన్ని గురించి మాట్లాడటం వుచితం కాదు అనే నిర్ణయానికి వచ్చాను. “అన్నయ్యా!.. నీకు నా మీద కోపంగా వుంది కదూ!..” దీనంగా అడిగాడు గోపాల్.

“లేదు గోపు. యీ సమస్యను ఎవరికీ ఎలాంటి అశాంతి ఆవేదన కలగకుండా ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తున్నాను. అవునూ.. నీవు కొద్ది రోజుల క్రిందట ఎవరో నీ ఫ్రెండ్, తన కంటే వయస్సులో పెద్ద అయిన అమ్మాయిని ప్రేమించాడని, వారిరువురూ ప్రేమించుకొన్నారని, వారు వివాహం చేసుకొంటే తప్పా అన్నయ్యా, అని నన్ను అడిగావు గుర్తుందా” అడిగాను.

“వుంది అన్నయ్యా!.. ఆ ఫ్రెండ్ కథ అబద్దం. అది నా విషయమే!..” తల దించుకొని దోషిలా జవాబు చెప్పాడు గోపాల్.

వాడిలోని ధైర్యానికి.. నిజాయితీకి నాకు సంతోషం కలిగింది.

“భయపడకు గోపు. వసంత పెళ్ళి, నా వివాహాలు జరిగిన తర్వాత సమయం చూచి అమ్మా నాన్నలకు మీ విషయాన్ని గురించి చెప్పి.. వారిని ఒప్పించి, నీకు, హారికకు వివాహం జరిగేలా నేను చేస్తాను. నా మాట నమ్ము. అనవసరంగా ఆలోచించి మనస్సును పాడు చేసికోకు. యీ నీ అన్నయ్య నీకు అండగా వుంటాడు” వాడి చేతిలో నా చేతిని వుంచి చెప్పాను.

గోపాల్ ఎంతగానో సంతోషించాడు. నన్ను తన హృదయానికి ఆనందంతో హత్తుకున్నాడు.

చెల్లి వసంత టెరస్ పైకి వచ్చింది.

“గదుల్లో చూస్తే లేరు. ఎక్కడికి వెళ్ళారా అని యిక్కడికి వచ్చాను. ఏం చేస్తున్నారన్నయ్యా!..” అడిగింది వసంత.

“ఏం లేదమ్మా!.. నీ వివాహ విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాము” నవ్వుతూ చెప్పాను.

“అవును చెల్లెమ్మా” అన్నాడు గోపాల్.

“నాది సెటిల్డ్ మేటర్. అది కాదులే. నీ లవ్ స్టోరీని తంబికి చెబుతున్నావు కదూ పెద్దన్నయ్యా!..” అంది వసంత.

వసంత చాలా తెలివిగల అమ్మాయి. నాన్నగారంటుంటారు, యీమె అంతా మా నాయనమ్మ పోలికని. మా నాయనమ్మకు మా వూర్లో చాలా మంచి పేరు. ఆ తల్లి చేతికి నరం లేదంటుంటారు మా పల్లెవాసులు. అలాగే నా చెల్లికి కూడా పేదసాదలంటే ఎంతో అభిమానం. అమ్మానాన్నల పర్మిషన్‌తో తనకు తోచిన రీతిలో దానధర్మాలు చేస్తూ వుంటుంది. ఆమెను బుకాయించడం అసాధ్యం.

“అవున్రా.. వీడేదో అడిగాడు. నేను ఏదో చెప్పాను. నీవు.. యీసారి నేను వచ్చేటప్పుడు మీ వదినను నాతో తీసుకొని వస్తాను. ఆమెనడిగి తెలుసుకో. పదండి పొద్దుపోయింది. పడుకుందాం” అనునయంగా చెప్పాను. ముగ్గురం క్రిందికి నడిచి మా గదుల్లోకి వెళ్ళిపోయాము.

***

వసంత రాఘవల వివాహాన్ని నేను తమ్ముడు గోపాల్ నాన్న అమ్మలం కలసి ఎంతో ఘనంగా జరిపించాము. వసంత అత్తగారి యింటికి వెళ్ళిపోయింది.

వారి వివాహం జరిగిన పది రోజులకు నాకు శ్రీవాణికి మా వారంతా కలసి గొప్పగా జరిపించారు. మా నలుగురి జీవితాలు మా తల్లిదండ్రులు ఆశించిన రీతిగా పవిత్ర బంధంతో ముడిపడ్డాయి.

నా తల్లిదండ్రులు మా అత్తయ్య సుందరి మామయ్య శ్యామలరావు వారి సంకల్పం సజావుగా నెరవేరినందుకు ఎంతగానో సంతోషించారు.

వసంత వివాహ సమయంలో గోపాల్ హారికలు మా అమ్మ వెనకాలే వుంటూ అన్ని కార్యక్రమాలూ దివ్యంగా జరిగేదానికి కారకులయ్యారు. నేను వారిని జాగ్రత్తగా గమనిస్తూ వచ్చాను. వారి కదలికలు ఒకరినొకరు చూచే చూపులు.. వారు ఎంతగా ప్రేమించుకొన్నారనే విషయాన్ని నాకు స్పష్టం చేశాయి.

వారి వివాహాన్ని జరిపించాలనే నిర్ణయానికి వచ్చిన నేను వారిరువురూ సన్నిహితంగా కలిసి తిరిగే దానికి తగినట్లుగా.. అమ్మనాన్నల దృష్టిలో హారికను సెంట్ పరసెంట్ అభిమానం లభించే రీతిగా.. జరుగుతున్న కార్యానికి అనుగుణంగా వారిని పురమాయించాను. యీ కారణంగా హారికకు నా మీద నమ్మకం.. సాన్నిహిత్యం ఏర్పడ్డాయి.

నా ఉద్దేశం.. నేను హారికను గురించి అమ్మా నాన్నలతో ప్రస్తావించినప్పుడు వారు ఏకగ్రీవంగా గోపాల్ హారికల వివాహాన్ని అంగీకరించాలన్నది.

నా వివాహం హారికతో జరిగిన తర్వాత.. మామయ్య శ్యామలరావు సాయంత్రం యీ యింటి ప్రక్కన వున్న తోటలో నన్ను పిలుచుకొని వెళ్లారు.

“నాన్నా గోవింద్!.. వివాహం అనేది ఒక స్త్రీ ఒక పురుషుని మధ్యన పరస్పర నమ్మకంతో జరిగేది. ఆ నమ్మకంతోనే ఆ స్త్రీ తన సర్వస్వాన్నీ ఆనందంగా తన పురుషుడికి అర్పిస్తుంది. నీవు.. నీపై శ్రీవాణికి వున్న ఆ నమ్మకాన్ని ఎవరు ఏమనుకున్నా, ఏమన్నా.. లెక్క చేయకుండా నీవు ఆమెకు అన్ని విషయాల్లో అండగా నీ జీవితాంతం వుండాలి.

యీ దేశంలో వివాహ వ్యవస్థకు వున్న గౌరవం పవిత్రత కమనీయానుబంధం. ఆ యిరువురి దంపతుల జీవితాంతం వరకు చీకటివెలుగులతో సహన సంస్కారాలతో ప్రేమాభిమానాలతో పాలు నీళ్ళలా కలిసి వర్తించడం మన తరతరాల ఆనవాయితీ. అనాది కాలం నుంచీ మనవారు మనసారా నమ్మి పాటించి గౌరవించే యీ వ్యవస్థను.. నేటి కొందరు యువతీయువకులు, విచక్షణా రహితంగా ఆవేశంతో నిర్లక్ష్యం చేస్తున్నారు. అది వారికి వున్న అహంకారానికి అవివేకానికి అజ్ఞానానికి.. నిదర్శనం.

ప్రతి తల్లితండ్రీ.. తమ బిడ్డల విషయంలో వారి జీవితాంతం వరకూ వారు ఆశించేది తమ సంతతి, తమ గౌరవాన్ని యినుమడింప చేయాలని సాటి వారికి ఆదర్శ ప్రాయులుగా నిలవాలని వంశ గౌరవ ప్రతిష్ఠలకు వన్నె తేవాలని.

కానీ.. కాలానుగుణ్యంగా పాశ్చాత్య నాగరీకతా వ్యామోహంతో.. ఆర్జన విధానాల అనుకరణల వల్ల.. కొందరు తమ సహజ ఉనికిని ఔన్నత్యాన్ని మానవతా విలువలను, ఆచార వ్యవహారాలను, కుటుంబ సభ్యుల పట్ల వుండవలసిన ప్రేమానురాగాలను విస్మరించి.. ధనార్జనే అన్నింటి కన్నా ముఖ్యమని స్వార్థంతో విచక్షణా రహితంగా వర్తించి తల్లిదండ్రులకు అయినవారికి కష్టాలను కలిగిస్తున్నారు. యిందుకు ప్రత్యక్షసాక్షులు నీ.. ప్రియ మిత్రులు రవిబాబు.. బాబురావులే. వారు చదివి సాధించిన విజ్ఞానం.. వారిలో స్వార్థపు చింతనను బలపరిచింది.

నా ఉద్దేశంలో మనుగడకు ప్రతి వ్యక్తి ఆర్జించివలసిందే. ఆ ఆర్జన ధర్మబంధంగా వుండాలి. ఎదుటి వారిని మోసం చేయడం.. తలలు మార్చి అబద్ధాలాడి సాటి వారిని నొప్పించి సంపాదించడం అన్యాయం అధర్మం.

ఆ ఆర్జన తాత్కాలిక ఆనందాన్ని కలిగించవచ్చు. కానీ.. కాలక్రమంలో దాని వలన కలిగేది అశాంతి అనారోగ్యం. వేలు లక్షలు డాక్టర్ల చేతుల్లో పోయడం.. శస్త్ర చికిత్సలు, నిరంతరం మందులకు దాసులు కావడమే అలాంటి ఆర్జన పర్యావసానం.

ఈ స్థితికి చేరిన వారికి మనశ్శాంతి వుండదు. తన అస్వస్థత కారణంగా, కోపతాపాలు అధికం కావడం, ఒకనాడు తాము ఎంతగానో ప్రేమించిన భార్యాబిడ్డలను విసుక్కోవడం.. అప్రస్తుత భాషణతో వారిని నొప్పించడం.. యీ ధోరణికి విసిగి పోయిన వారు.. తను దూరంగా చెంతకు రాకుండా సంచరించడం.. అటు శారీరకంగా యిటు మానసికంగా తీరని వ్యధతో అలమటించడం సంప్రాప్తిస్తుంది” ఎంతో భావావేశంతో ఎన్నో జీవిత సత్యాలను చెప్పిన మామయ్య చెప్పడం ఆపేశాడు. నవ్వుతూ నన్ను చూచారు. ఆ నవ్వులోని అర్థం.. నేను నీకు బోరు కలిగించానా.. అని.

“మీరు చెప్పినవన్నీ జీవిత సత్యాలు నా భావి జీవితానికి మార్గదర్శకాలు. థ్యాంక్యూ మామయ్య” నవ్వుతూ చెప్పాను.

యిరువురం మా యింటి వైపుకు నడిచాము.

***

మా వివాహానికి నేను ఊహించని రీతిలో నాగరాజుతో కలిసి సునీల్ వచ్చాడు.

“అన్నా నేను తప్పు చేశాను. నీవు నన్ను క్షమించాలి. యింత కాలం నీ ముఖాన్ని లజ్జతో చూడలేక నిన్ను కలవలేదు. యీ సమయంలో కలవకపోతే.. యిక జీవితంలో కలవలేననే భయంతో వచ్చాను” దీనంగా ప్రాధేయపూర్వకంగా కోరాడు.

వాడిలో కలిగిన మార్పుకు నేను సంతోషించాను. ఆనందంగా కరచాలనం చేశాను. గోపాల్ నాగరాజులతో కలిసి వాడూ అతిథి సత్కార్య కార్యక్రమాల్లో ఆనందంగా పాలు పంచుకొన్నాడు.

వాడిని ఆ రీతిగా చూచిన హెడ్మాస్టార్ రామకోటయ్యగారు ఆనందంగా నవ్వుతూ “కిరాతకుని.. మనిషిగా మార్చావు గోవిందా!..” ఆనందంగా నవ్వారు.

వారం రోజుల తర్వాత నేను శ్రీవాణి కేరళకు హానీమూన్‌కు బయలుదేరాము. సునీల్‌ను గురించి ఆలోచిస్తూ వున్న నేను కళ్ళు తెరిచాను. ప్రక్కనే మంచంపై పడుకొని వున్న శ్రీవాణి ముఖంలోకి చూచాను. ఎంతో ప్రశాంతంగా నిద్రపోతూ వుంది. ఆమె పెదాలు విచ్చుకున్నాయి.

“అబ్బా!.. వదలండి. ప్లీజ్..” అంది.

నేను ఆశ్చర్యపోయాను. ఆ క్రిందటి రోజు నేను శ్రీవాణి తిరువనంతపురం చేరాము. అనంత పద్మనాభస్వామి వారి దేవాలయం.. బీచ్.. ప్రక్కనే వున్న ప్రశస్త ఆలయాలను దర్శించి రాత్రి తొమ్మిది గంటలకు భోంచేసి హెూటల్ రూమ్‌కు చేరాము.

“చాలా అలసటగా వుంది బాబూ..” అంటూ శ్రీవాణి మంచంపై వాలిపోయింది. నేనూ ఆమె ప్రక్కనే చేరాను. ఓ గంటసేపు ఛలోక్తులు.. సరస సంభాషణలు.. ఎంతో పారవశ్యంతో మా మధ్య జరిగాయి. రెండు తనువులు మనస్సులు.. అలసిపోయాయి. ఆనందంగా నిద్రపోయాము.

టీపాయ్ పై వుంచిన వాచ్‌ను తీసి చూచాను. గంట ఆరున్నర. మా ప్రోగ్రాం ఆ రోజు తొమ్మిది గంటలకు బయలుదేరి గురువాయూర్ వెళ్ళాలని. శ్రీవాణిని లేపేటందుకు నా కుడి చేతిని ఆమె నొసట పై వుంచి..

“శ్రీ..” మెల్లగా పిలిచాను.

శ్రీవాణి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. నన్ను చూచి లేచి కూర్చుంది.

“నిద్ర సరిపోయిందా!..” నవ్వుతూ అడిగాను.

తొట్రుపాటుతో.. “మనం తొమ్మిది గంటలకు గురువాయూర్ బయలుదేరాలి కదూ!..” అంది

“అవును. టైమ్ చాలా వుంది. స్థిమితంగా కాలకృత్యాలు తీర్చుకొని బయలుదేరుదాం. సరేనా!..” అన్నాను.

“అలాగే..” చెప్పి, మంచం దిగి బాత్రూమ్‌కు వెళ్ళి ఐదు నిముషాల్లో తిరిగి వచ్చింది. దంతధావనం చేసి యిరువురం కాఫీ త్రాగాము.

“నేను మిమ్మల్ని ఓ మాట అడగనా!..”

“అడుగు”

“నన్ను తప్పుగా అనుకోకూడదు”

“అనుకోను. కారణం నీవు నా అర్ధాంగివి కదా!..” నవ్వుతూ చెప్పాను.

“హారిక మీకు వరసకు మేనత్త కూతురు కదూ!..” అడిగింది శ్రీవాణి.

“అవును”

“మీరు ఆమెను ప్రేమించారా!..”

“ఈ రీతిగా నీకు నా మీద అనుమానమా!..”

“మన పెళ్ళిలో ఆమె మిమ్మల్ని చూచిన తీరు.. ఫీలింగ్సు నాకు సందేహం కలిగేలా చేశాయి. దేన్నీ నేను మనస్సులో ఎక్కువ కాలం దాచుకోలేను. అందుకే అడిగాను”

ప్రశ్నార్థకంగా నేను చెప్పబోయే జవాబు కోసం నా ముఖంలోకి చూచింది శ్రీవాణి.

“హారిక ఆ స్థితికి కారణం నేను కాదు శ్రీ..” అనునయంగా చెప్పాను.

“అంటే!..”

“నీవు ఊహించిన, అనుమానించిన రీతిగా ఆ రెండు అక్షరాలకు మా మధ్యన తావులేదు. ఆమె హీరో వేరే.”

“అతనెవరు?..”

“మీ ముద్దుల మరిది”

“ఎవరూ గోపాలా!..” ఆశ్చర్యంతో అడిగింది శ్రీవాణి.

శ్రీవాణి విషయాన్ని పసికట్టింది కాబట్టి యథార్థాన్ని ఆమెకు తెలియజేయడం నా ధర్మంగా భావించాను. గోపాల్ నాకు చెప్పిన విషయాన్నంతా శ్రీవాణిని నా ప్రక్కన కూర్చో పెట్టుకొని వివరించాను.

ఆమె మనస్సులోని అనుమానం మాయమయింది. ఆనందంగా నవ్వుతూ.. “వారిరువురి వివాహం జరిగేలా మనం చూడాలి. యీ విషయంలో ఓ వదినగా నా మరిది క్షేమం ఆనందం కోసం నా నాధుడైన తమరి సలహాలను నేను తూచా తప్పకుండా పాటిస్తాను. వాళ్ళ వివాహం కూడా త్వరలో జరిగేలా మనం చేయాలి” అంది శ్రీవాణి.

(ఇంకా ఉంది)

Exit mobile version