[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘ప్రేమేగా ప్రపంచం’ అనే నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]
[అమెరికాలో ఉండగా వినోద్, గోవింద కొలీగ్స్. వినోద్ మంచితనం గోవిందని ఆకట్టుకుంటుంది. వినోద్ శ్రీవాణిని పెళ్ళి చేసుకుని వచ్చాకా, వారిద్దరితో స్నేహం పెరుగుతుంది. వీకెండ్స్‌లో వాళ్ళ ఇంట్లో గడుపుతుంటాడు. ఓ వారాంతంలో శ్రీవాణి ఫోన్ చేసి రమ్మంటుంది. ఆ సమయంలో వినోద్ వేరే ఊరు వెళ్ళి ఉంటాడు. ఆ రోజు శ్రీవాణి ప్రోత్సాహంతో ఆమెతో కలుస్తాడు గోవింద. మర్నాడు ఉదయం వినోద్ వచ్చి, తన ఇంట్లో ఉన్న గోవిందని చూస్తాడు. ఆ మర్నాడు ఆపీసులో ఏమీ జరగనట్టే గోవిందతో ప్రవర్తిస్తాడు. హోటల్ బాయ్ బెల్ కొట్టడంతో గతం నుంచి బయటపడ్తాడు గోవింద. ఆ సమయంలోనే గోవింద సెల్‍కి శ్రీవాణి ఫోన్ చేస్తుంది. వినోద్ తనకి విడాకులిచ్చాడనీ, తమ ఐదు నెలల సంసార జీవితంలో తమ మధ్యన ఏమీ లేదనీ, ఒక్కరోజు తప్ప.. అదీ గోవింద తోనేననీ చెప్తుంది. తనకి మూడో నెల అనీ, గోవింద ప్రతిరూపాన్ని మోస్తున్నానీ, తన మాటను నమ్మి.. తనని వివాహం చేసుకోమంటుంది. కాదంటే అబార్షన్ చేయించుకొంటాననీ, తకు గోవింద మీద ప్రేమ తప్ప ఎలాంటి కోపమూ లేదని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఏం చేయాలో అర్థం కాని గోవింద శ్యామలరావు మావయ్యకి ఫోన్ చేసి తానున్న హోటల్‌కి రమ్మని ఫోన్ చేస్తాడు. ఆయన రాగానే జరిగినదంతా చెప్తాడు. అంతా విన్న, ఆయన ఆ సమస్యని తాను పరిష్కరిస్తాననీ హామీ ఇస్తారు. మర్నాడు ఉదయం తొమ్మిదిన్నరకల్లా వాళ్ళింటికి రమ్మని చెప్పి వెళ్ళిపోతారు. కాసేపటికి నాగరాజు ఫోన్ చేసి సుబ్బలక్ష్మి కన్సీవ్ అయినట్టు చెప్తాడు. గోవింద సంతోషిస్తాడు. – ఇక చదవండి.]
మామయ్య చెప్పినట్లుగా, తొమ్మిదిన్నరకు వారి యింటికి వెళ్ళాను. వాకిట్లోనే వున్న నా చెల్లి వసంత “అమ్మా నాన్నా.. అత్తయ్యా మామయ్యా!.. అన్నయ్య వచ్చాడు” పెద్దగా అరుస్తూ యింట్లోకి వెళ్ళింది.
నేను వరండాలో ప్రవేశించేసరికి అందరూ నా ముందుకొచ్చి నిలబడ్డారు. అందరూ నన్ను చూచి నవ్వుతున్నారు. నాకు సిగ్గేసింది. తలవంచుకొన్నాను. అమ్మ నా దగ్గరకు వచ్చింది. నా చేతిని తన చేతిలోనికి తీసుకొని నన్ను గదిలోకి లాక్కెళ్లింది. మరలా.. మదిలో కలవరం.. ఏమడుగుతుందో!.. నేను ఏం జవాబు చెప్పాలో!..
తను మంచం మీద కూర్చొని.. “నాన్నా!.. నీ వివాహ ప్రసక్తి ఎత్తినప్పుడల్లా.. ముందు వసంత పెండ్లి కానీ అమ్మా.. నా విషయం తర్వాత అన్నావే కాని, నేను ఒక పిల్లను ప్రేమించానని నాతో.. నీ ఈ తల్లితో.. ఎందుకు చెప్పలేదు!.. నీ ఆనందం మా ఆనందం కాదనుకొన్నావా!.. మేము నీ మాటను కాదంటామని అనుకొన్నావా!.. రాత్రి మా అన్నయ్య వచ్చి నాకు మీ నాన్నకు.. అన్ని విషయాలూ చెప్పారు. అందరం రాత్రే యిక్కడికి వచ్చాము. ఆ అమ్మాయి కూడా ఉదయం ఆరుగంటలకల్లా వచ్చింది” ఆనందంగా చెప్పింది అమ్మ.
“ఆఁ..” ఆశ్చర్యపోయాను.
“అవును. శ్రీవాణి వచ్చింది. బంగారు బొమ్మలా వుంది. మాకందరికీ బాగా నచ్చింది. మీ నాన్నగారికైతే మరీనూ!..”
“నన్ను క్షమించమ్మా!..” వంగి నా తల్లి పాదాలను తాకాను.
నా భుజాలను పట్టుకొని లేపి.. “నీవు ఏం తప్పు చేశావని ఈ క్షమాపణ. దేవకన్యలాంటి పిల్లను నాకు కోడలుగా ఎంచుకొన్నావ్. నాకు ఎంతో ఆనందంగా వుంది నాన్నా!..” నా తలను తన హృదయానికి హత్తుకొంది.
నాకు ఏడుపు ఆగలేదు. బోరున ఏడ్చాను. అమ్మ కంగారుపడింది. “ఇది.. నాలోని ఆనందం అమ్మా. ఇవి ఆనందభాష్పాలు. కళ్ళల్లో ఆగనంటున్నాయి.” తన పవిటతో నా కన్నీటిని తుడిచింది అమ్మ.
సుందరి అత్తయ్యా, వసంతా గదిలోకి వచ్చారు. నలుగురం హాల్లోకి వెళ్ళాము. నాన్నగారు ఎప్పుడూ మితభాషి, నన్ను దగ్గరకు రమ్మని పిలిచి నవ్వుతూ నా వీపు తట్టారు. “బావా!.. త్వరలో గోవింద్ శ్రీవాణీల వివాహానికి ముహూర్తం పెట్టించండి” మామయ్యను చూస్తూ చెప్పారు.
“అది నా బాధ్యత బావా!..” నవ్వుతూ అన్నారు మామయ్య. సుందరి అత్తయ్యతో శ్రీవాణి హాల్లోకి వచ్చింది.
చేతులు జోడించింది. క్షణంసేపు నా కళ్ళల్లోకి చూచి తల దించుకొంది శ్రీవాణి.
“అత్తయ్యా!.. నేను ఆఫీస్‌కు వెళ్ళాలి. టిఫిన్ పెడతావా!..” మా అత్తయ్యను అడిగాను.
“రడీ నాన్నా.. అందరూ రండి” అంది సుందరి అత్తయ్య. డైనింగ్ టేబుల్ మీద అందరం కలసి టిఫిన్ చేశాము.
“గోవిందా!.. శ్రీవాణిని నీతో ఆఫీస్కు తీసుకొని వెళ్ళి మీ ఆఫీస్‌ను చూపించు, ఆర్డర్ రిలీజ్ చెయ్యి” చెప్పాడు మామయ్య.
“అలాగే మామయ్యా!..” ఆనందంగా అన్నాను.
కాఫీ త్రాగి, అమ్మనాన్నలకు మామయ్య అత్తయ్యలకు చెప్పి.. నేను కార్లో కూర్చున్నాను. వసంత, రాఘవ నన్ను చూస్తూ అదోలా నవ్వుతున్నారు. నేను కారును స్టార్ట్ చేశాను. శ్రీవాణి వచ్చి నా ప్రక్కన కూర్చుంది. కారు వీధిలో ప్రవేశించింది.
“సార్.. మనం యిప్పుడు ఎక్కడికి వెళుతున్నాము?” అడిగింది శ్రీవాణి.
“మా ఆఫీసు..”
“నాకు సముద్రాన్ని చూడాలని వుంది. చూపించరూ!..”
“సముద్రమా!..” ఆశ్చర్యంతో అడిగాను.
“అవును” నవ్వుతూ అంది శ్రీవాణి.
కారును ముత్తుకూరు రోడ్డు వైపుకు త్రిప్పాను.
“సముద్రాల కవతల అమెరికాలో జీవచ్ఛవంలా వుండి, నా జీవితం ఏమౌతుందోనని ఎంతగానో బాధపడ్డాను. వచ్చేటప్పుడు వీలైతే.. విమానం నుంచి సముద్రంలో దూకి చావాలనుకొన్నాను. నన్ను యిక్కడికి క్షేమంగా చేర్చి.. ఈనాడు మీ ప్రక్కన యిలా మీ దానిలా కూర్చో కలిగేటట్లు చేసిన ఆ సాగర మాతను దర్శించి.. నా వందనాలు తెలిపి ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులను అందుకోవాలి” చెప్పి, నవ్వుతూ నా ముఖంలోకి చూచింది శ్రీవాణి.
“అలాగే..” ఆనందంగా అన్నాను. నవ్వాను.
నవ్వుతూ “ధ్యాంక్యూ సార్” చెప్పి, శ్రీవాణి నా భుజంపై వాలిపోయింది. నా మస్తిష్కంలో.. తనను నేను అమెరికాలో కలసిన తొలిరోజు.. ఆనాడు మా యిరువురి మధ్యన జరిగిన సంభాషణ.. ఆ తర్వాత ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన ద్యోతకమైనాయి.
నేను ఆస్తికుణ్ణి. ఆ కారణంగానే ఏమో నాలో తప్పు చేశాననే భావన. గతంలో ఆమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆ గత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేవి. మనస్సుకు ఎంతో బాధ కలిగేది. అదో యాక్సిడెంట్.. మరిచిపో.. అనే భావన మరోవైపు. యిలాంటి స్థితిలో నేను నా ఏకాగ్రతను వేరే విషయాలపై లగ్నం చేసి ఆ విషయాలను మరచి పోయేదానికి ప్రయత్నించేవాణ్ణి. కాలం గడిచే కొద్దీ ఆ ఆలోచనలు మదినుండి దూరం అయినాయి. వర్తమాన వ్యవహారాలు, వాటికి సంబంధించిన ఆలోచనలే మదిలో వుండేవి.
కానీ.. ఈమె ఇండియాకు తిరిగి రావడం, మామయ్యను ఈమె తండ్రిని కలవడం, మామయ్య ఈమెకు సహాయం చేసి మంచి జీవితాన్ని ప్రసాదించాలని నిర్ణయించుకోవడం, ఈమె నాకు ఫోన్ చేయడం నమ్మలేని నిజాన్ని చెప్పడం, మామయ్య.. నా విన్నపాన్ని విని నిశిరాత్రిలో నా తల్లిదండ్రులను కలిసి, వారిని ఈమెతో నా వివాహం జరిగేలా ఒప్పించడం.. వీటనన్నింటి గురించి ఆలోచిస్తే.. మనం ఎంతో సమర్థులమని గొప్ప వారమని స్వాతిశయంతో వున్నా.. భవిష్యత్తును నిర్ణయించి నడిపించే శక్తి ఏదో మన చూపులకు జ్ఞానానికి అతీతంగా వుందని, మన భవిష్యత్తును నిర్ణయించి మనలను ముందుకు నడిపించేది, కళ్ళకు కనరాని ఆ శక్తి.. ఆ దైవం అనే భావం ఆత్మావలోకణం చేసికొనే వారికి తప్పక తోస్తుంది.
ప్రస్తుత నా పరిస్థితీ అంతే.. ఈమె రాక నాలో దాగివున్న దోషిని నిర్దోషిగా నిరూపించ కలిగింది. ‘హే భగవాన్ నీకు శతకోటి వందనాలు. నా జీవితాంతం నన్ను ఇలాగే కాపాడు. నా వలన పది మంది బాగుపడాలేకాని చెడిపో కూడదు. అసలైన మనిషికి నిర్వచనంగా నా భావి జీవితాన్ని తీర్చిదిద్దు తండ్రీ!..’ నా యిష్ట దైవాన్ని వేడుకొన్నాను. ఎడమ కంటిని కారును నడుపుతూనే ఆమె వైపుకు త్రిప్పాను. ఆమె నా భుజంపై తల నుంచి కళ్ళు మూసుకొని వుంది. ఆమెను పలకరించి ప్రశాంతతకు భంగం కలిగించకూడదనుకొన్నాను. రోడ్డు వైపు చూస్తూ కారును నడపసాగాను.
పది నిముషాల తర్వాత నా కారును ఓ హీరో హెూండా క్రాస్ చేసింది. బండిని నడుపుతున్నది నా తమ్ముడు గోపాల్. వెనక కూర్చొని వున్నది హారిక. వారు ఆనందంగా నవ్వుకోవడాన్ని నేను చూచాను.
కానీ.. మరుక్షణంలోనే సందేహం. వాళ్ళు వారేనా వారిని పోలిన వాళ్ళా!.. ఈ సమయంలో ఈ వైపు నుండి, వాళ్ళు వచ్చారంటే.. సముద్రానికి వెళ్ళి వస్తున్నారా!.. నిర్ధారణగా తెలియని విషయం.. సందేహం.. మనస్సుకు అప్రశాంతతకు కారణమైనాయి.
శ్రీవాణి తలను భుజంపై నుండి తీసి నా ముఖంలోకి ప్రీతిగా చూచింది. నా కారు సముద్ర తీరాన్ని సమీపించింది. ఆపాను. “వచ్చేసాము. అదిగో సముద్రం.” నవ్వుతూ అన్నాను.
శ్రీవాణి ఆనందంగా కారు నుండి దిగింది. సముద్రపు వైపుకు నడవసాగింది. నేను ఆమెను అనుసరించాను. నాకు దగ్గరగా వచ్చి తన కుడిచేతితో నా ఎడమ చేతిని పట్టుకొంది. యిరువురం నీటిని సమీపించాము. సాగర కెరటాలు మా యిరువురి పాదాలను తాకాయి.
శ్రీవాణి.. తన చంకకున్న హ్యాండ్ బ్యాగ్ను తెరిచింది. పూలు కుంకుమ పసుపును బయటికి తీసింది. వాటిని నా చేతుల్లో వుంచింది.
తన చేతులను జోడించి గంగామాతకు నమస్కరించింది కొన్నిక్షణాలు. తర్వాత కళ్ళు తెరచి నా చేతిలోని వాటిని తన చేతుల్లోకి తీసుకొంది.
“గంగమ్మతల్లికి నమస్కరించండి. మీకు ఏం కావాలో దాన్ని కోరుకోండి” కొంటెగా నవ్వుతూ అంది.
నేను చేతులు జోడించాను. ‘తల్లీ.. భగవాన్ శ్రీవాణి కడుపులో పెరుగుతున్న నా ప్రతిరూపం.. బాగా పెరిగి శ్రీవాణికి ఏ కష్టం లేకుండా మా చేతుల్లోకి రావాలి. మా తప్పులు ఏమైనా వుంటే మమ్మల్ని మన్నించి కాచి రక్షించు’ హృదయపూర్వకంగా కోరుకున్నాను. కళ్ళు తెరిచాను. ఆమె ముఖంలోకి చూచాను.
శ్రీవాణి దీక్షగా నన్నే చూస్తూ వుంది. ‘ఏం’ అన్నట్లు కళ్ళు ఎగరేశాను.
“మీ చేతులను నా చేతుల క్రింద వుంచండి” అంది. నా చేతులను ఆమె చేతుల క్రింద వుంచాను. యిరువురం వంగి ఆమె చేతుల్లోని పూలు, పసుపు, కుంకుమలను సాగర జలంలో కలిపేశాము. చిన్న అల తరువాత పెద్ద అల వచ్చింది. వేగంగా చెలియలి కట్ట వరకూ వెళ్ళి అంతకు రెట్టింపు వేగంతో సాగరం వైపుకు సాగింది ఆ అల.
శ్రీవాణి కాళ్ళ క్రింద యిసుక నీటితో కలిసి ఆమెను ఒరిగేలా చేసింది. ప్రక్కనే వున్న నేను ఆమెను నా చేతులతో పట్టుకొన్నాను. ఆమె నా చేతుల్లో వాలిపోయింది. “వచ్చిన పని అయిందిగా యిక వెళదాం శ్రీ” అన్నాను. “అలాగే” పారవశ్యంతో అంది శ్రీవాణి.
ఆమె బట్టలు పూర్తిగా తడిసిపోయాయి. “నడవగలవా!..” అడిగాను. ఆమె దీనంగా నా కళ్ళల్లోకి చూచింది. వెంటనే నేను ఆమెను నా చేతుల్లోకి ఎత్తుకొన్నాను. కారు వైపుకు నడిచాను. నడుస్తూ ఆమె కళ్ళల్లోకి చూచాను. ఆ కళ్ళు మూసుకొని వున్నాయి. ఆ ముఖంలో ఎంతో ఆనందం ప్రశాంతత నాకు గోచరించాయి.
కారును సమీపించి దించాను.
“థాంక్యూ!..” అంది నవ్వుతూ. మరుక్షణంలోనే.. “నేను మీకు ఎంతో శ్రమ కలిగించాను. ఉదయాన్నించి నేను ఏమీ తినలేదు. నీరసంగా వున్న కారణంగా..” ఆమె ఏమి చెప్పబోయేది నాకు అర్థం అయింది. “మీరు ఎత్తుకొంటానంటే అభ్యంతరం చెప్పలేదు అనే కదా నీవు చెప్పాలనుకొన్నది” కాస్త అసహనంగానే అన్నాను.
అవునన్నట్లు కళ్లు ఎగరేసింది నవ్వుతూ శ్రీవాణి. ఆ నవ్వు తన మూర్ఖత్వంపై నాకు కలిగిన కినుకను తరిమేసింది.
“కార్లో కూర్చో” నవ్వుతూ అన్నాను.
శ్రీవాణి కూర్చుంది. కారును ముత్తుకూరులోనికి పోనిచ్చాను. హెూటల్ ముందు ఆపి.. నాలుగు యిడ్లీలు మసాలా దోశ పార్శిల్ తీసుకొని కార్లో కూర్చున్నాను. బట్టల షాపు ముందు ఆపి.. నాకు నచ్చిన చీర అదే రంగు పావడా కొన్నాను. కారును వేగంగా వూరి బయటికి నడిపాను. ఓ చెట్టు ప్రక్కన కారును ఆపి.. “శ్రీ.!.. ఆ చెట్టు చాటుకు వెళ్ళి బట్టలు మార్చుకొనిరా.” చెప్పి కవర్ను అందించాను.
ఐదు నిముషాల్లో చీర కట్టుకొని వచ్చి నా ప్రక్కన కూర్చుంది. విప్పిన బట్టల కవర్ను వెనక సీటు పై వుంచింది.
ఇడ్లీ పొట్లాన్ని విప్పి చేతికి అందించాను. ఇడ్లీని తుంచి నోట్లో వేగంగా వుంచుకొంది. తక్షణం నా ముఖంలోకి చూచింది దీనంగా.
“ఏమిటి?..” అడిగాను.
“సారీ!.. ఆకలి, మీకు పెట్టకుండానే నేను తినడం ప్రారంభించాను” అంది.
“శ్రీ.. నేను ఉదయాన్నే టిఫిన్ తిన్నాను. స్థిమితంగా వాటని తిను. ఈ స్థితిలో నీవు ఇలా ఉపవాసాలు వుండకూడదు” అనునయంగా చెప్పాను.
“అంటే!..” అమాయకంగా నా ముఖంలోకి చూచింది.
“నీకు తెలీదా!..” నవ్వుతూ ఆమె ముఖంలోకి కొంటెగా చూచాను.
శ్రీకి విషయం అర్ధం అయింది. సిగ్గుతో ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. మౌనంగా చిరునవ్వుతో తినడం ప్రారంభించింది. మసాలా దోశను అందించాను. దాన్నీ తినేసింది. అరబాటిల్ నీళ్ళు త్రాగింది. బాటిల్ నాకు అందిస్తూ.. “హమ్మయ్య!.. ప్రాణం కుదుట పడింది” నా వైపు చూస్తూ అందంగా ఆనందంగా నవ్వింది.
గంటలో నా కారు ఆఫీస్ ముందు ఆగింది. యిరువురం నా గదికి వెళ్ళాము. ఎ.సి రూమ్‌లో సోఫాలో కూర్చొని శ్రీవాణి కళ్ళు మూసుకొంది. పాపం అలసిపోయింది. ఆమె ఆర్డర్‌ను టైప్ చేసి ప్రింట్ తీసి సంతకం చేసి కవర్లో వుంచాను. గుంట ఒకటిన్నర. శ్రీని లేపి ఆర్డర్‍ను చేతికి అందించాను. కృతజ్ఞతతో ఆమె కళ్ళు మెరిసిపోయాయి. యిరువురం భోజనానికి మామయ్య యింటికి వెళ్ళాము.
భోజనానంతరం.. నేను శ్రీవాణి ఆఫీసకు వచ్చాము. ఆమెను యింజనీరింగ్ డివిజన్ ప్లానింగ్ మ్యానేజర్‌గా అందరికీ పరిచయం చేశాను. తిరిగి నా గదికి వచ్చాను.
రామసుబ్బయ్యగారు మేము అనుకొన్న రీతిలో ఆఫీసులో మార్పులు చేయించారు.
వారు నా క్యాబిన్‌కు వచ్చి శ్రీవాణిని చూస్తూ.. “మేడమ్ మీ రూమ్ సిద్దంగా వుంది” నవ్వుతూ చెప్పారు.
కొన్ని ఫైల్లును శ్రీవాణికి యిచ్చాను. వాటిని స్టడీ చేయవలసిందిగా చెప్పాను. ఆరుగంటలకు వస్తానని చెప్పి రామసుబ్బయ్యగారితో కలిసి లోకల్ సైట్లు, టింబర్ డిపో చూచేదానికి బయలుదేరాను.
అన్నింటినీ చూచుకొని అక్కడి వారికి యివ్వవలసిన సూచనలను యిచ్చి ఆరున్నరకు ఆఫీస్‌కు చేరాను.
శ్రీవాణి నేను యిచ్చిన ఫైల్స్‌ను స్టడీ చేసి వివరాలను ఓ ఫార్మాట్‍లో, స్టేట్‌మెంట్స్‌గా తయారు చేసి నాకు పంపింది.
ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి చూచాను. యిచ్చిన ఆరు ఫైల్స్ సారాంశాన్ని.. ఫైల్‌కు మూడు కాగితాల చొప్పున.. పద్దెనిమిది షీట్లలో మొత్తం వివరాలను పూరించింది. నేను ఆశించిన దానికన్నా గొప్పగా అన్ని వివరాలను ప్రాజక్టు వారీగా తయారు చేసింది శ్రీవాణి. ఇంటర్‌కమ్‌లో పిలిచాను. నవ్వుతూ వచ్చి నా ముందు నిలబడింది.
“ప్లీజ్ టేక్ యువర్ సీట్” కుర్చీని చూపించాను.
“స్టేట్‌మెంట్స్ ఎలా వున్నాయి సార్” కుర్చీలో కూర్చుంటూ అడిగింది. “యక్సలెంట్ శ్రీ. వితిన్ త్రీ షీట్స్ హండ్రెడ్ పర్సెంట్ యిన్ఫర్మేషన్. ఐయాం వెరీ గ్లాడ్. వెల్‌డన్” ఆనందంగా చెప్పాను.
“థ్యాంక్యూ” అంది శ్రీవాణి నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ.
యింటికి బయలుదేరిన రామసుబ్బయ్యగారు లోనికి వచ్చారు. వారిని కూర్చోమని చెప్పాను. వారు శ్రీవాణి ప్రక్కన వున్న కుర్చీలో కూర్చున్నాను. వారికి శ్రీ చేసిన స్టేట్‌మెంట్సును చూపించాను.
కొన్ని క్షణాలను వారు వాటిని పరీక్షగా చూచారు. “వీటిని..” వారు పూర్తి చేయకముందే..
“నేనే చేశాను సార్.” అంది శ్రీవాణి.
“చాలా బాగుంది. అమ్మా!.. యింతకు ముందు ఎక్కడ పని చేశారమ్మా..”
అడిగారు రామసుబ్బయ్యగారు.
“మా నాన్నగారి దగ్గర.. వారూ సివిల్ కాంట్రాక్టర్. చదువుకొనే రోజుల నుంచీ నేను వారి ఆఫీస్‌కు వెళ్ళేదాన్ని. వారు చేసే పనుల్లో వారికి సాయం చేసేదాన్ని. వారు నాకు ఎన్నో విషయాలు నేర్పారు. నా డిగ్రీ పూర్తయిన తర్వాత నేనూ నాన్నగారితో కలిసి ఆఫీస్‌కు వెళ్ళేదాన్ని. రెండు సంవత్సరాల్లో వారి వద్ద అన్ని విషయాలూ నేర్చుకొన్నాను. ఆ అనుభవంతోనే వీటిని చేయగలిగాను” నవ్వుతూ నా వైపు ఓరకంట చూస్తూ చెప్పింది శ్రీవాణి.
“బాబూ!.. ఇక బయలుదేరుదామా” శ్రీవాణిని ప్రీతిగా చూస్తూ అడిగారు రామసుబ్బయ్యగారు.
“పదండి” కుర్చీ నుంచి లేచాను. ముగ్గురం క్రిందికి వచ్చాము. నేను శ్రీవాణి మామయ్య యింటికి కార్లో బయలుదేరాము. రామసుబ్బయ్యగారు యింటికి వెళ్ళిపోయారు.
శ్రీవాణి మామయ్యగారి యింట్లో దింపి అమ్మా నాన్నా వాళ్ళు వూరికి వెళ్ళినందున నేను వూరికి వెళ్ళి గోపాల్‌తో మాట్లాడాలని నిర్ణయించుకొన్నాను. అత్తయ్య మామయ్యలకు చెప్పి బయలుదేరాను. శ్రీవాణి వచ్చి ఓ ప్రక్కగా నిలబడి నా వంక చూచింది. ఆ చూపుల్లో నేనూ మీతో వస్తాననే అభ్యర్థన గోచరించింది.
కానీ.. నాతో ఆమెను వూరికి తీసుకొని వెళ్ళడం నాకు యిష్టం లేదు. కారణం శ్రీవాణి నాతో వస్తే అమ్మ.. తనను గురించి ప్రస్తావిస్తుంది. ఆమె ప్రశ్నలకు నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం రావచ్చు. ఆ పని చేయడం.. నా వారిని మోసగించడం నాకు యిష్టం లేదు.
ఆమెకు అర్థం అయ్యేలా.. “అత్తయ్యా నేను ఉదయాన్నే ఎనిమిది గంటల కల్లా వస్తాను. సరేనా!..” అన్నాను శ్రీవాణి ముఖంలోకి చూస్తూ.
“సరే!.. గోవిందా.. జాగ్రత్తగా వెళ్ళిరా” చెప్పింది అత్తయ్య సుందరి. పెరటి వైపున వున్న మామయ్య తన్ను పిలవడంతో అత్తయ్య ఆ వైపుకు వెళ్ళింది.
శ్రీవాణి నన్ను సమీపించింది.
“నాకూ మీతో రావాలని వుంది” తలవంచుకొని మెల్లగా చెప్పింది.
నేను నవ్వాను. “యిప్పుడు కాదు. ఈసారి వెళ్ళేటప్పుడు తప్పకుండా పిలుచుకు వెళతాను. సరేనా!..” అనునయంగా చెప్పాను.
నా సమాధానం ఆమెకు నచ్చలేదనే విషయం నాకు ఆమె ముఖంలో గోచరించింది.
“నేను మాటను తప్పను” అన్నాను.
శ్రీవాణి నిట్టూర్చింది. “సరే.. మంచిది. జాగ్రర్తగా వెళ్ళి రండి” అంది క్రీకంట నా ముఖంలోకి చూస్తూ.
ఇరువురం కారును సమీపించాము. నేను డోర్ తెరచి కార్లో కూర్చున్నాను. శ్రీవాణి డోర్‌ను సమీపించింది. నేను కారును స్టార్టు చేశాను.
“జాగ్రత్త” మెల్లగా అంది శ్రీవాణి.
“థ్యాంక్యూ!..” నవ్వుతూ చెప్పి, కారును స్టార్ట్ చేశాను.
(ఇంకా ఉంది)
సిహెచ్. సి. ఎస్. శర్మ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి జననం నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా ఊచగుంటపాళెంలో జరిగింది. ప్రాథమిక విద్య పెయ్యలపాళెం, బుచ్చిరెడ్డిపాళెంలోనూ, ఉన్నతవిద్య నెల్లూరులోనూ.
సివిల్ ఇంజనీరుగా రాష్ట్రంలోని పలు సంస్థలలో వివిధ హోదాలలో పని చేసి చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరక్టర్ స్థాయికి ఎదిగారు.
చిన్ననాడు బామ్మగారు చెప్పిన కథలతో ప్రేరణ పొంది బాల్యం నుంచే రచనలు చేశారు. మిత్ర రచయితల ప్రోత్సాహంతో రచనా రంగంలో విశేషంగా కృషి చేశారు. 20 నవలలు, 100 కథలు, 12 నాటికలు/నాటకాలు, 30 కవితలు రాశారు.
వివిధ సాహితీ సంస్థల నుంచి పలు పురస్కారాలు పొందారు.