[సత్యగౌరి మోగంటి గారు రచించిన ‘ప్రేమలేఖ’ అనే కవిత పాఠకులకి అందిస్తున్నాము.]
ప్రేమలేఖ అనిర్వచనీయమైన జ్ఞాపకం
లేప్రాయపు చిలిపి తలపుల
తొలి వలపు సంతకం
నా మనసుకు లేఖ ఎలా రాయాలో..
తెలియదంటూనే..
అందమైన అక్షరాలకు మమతలు అద్ది
ప్రాణం పోశావు
మరి.. ఇప్పుడు ప్రేమలేఖ..
అందుకునే భాగ్యం ఎంత గొప్పదో కదా
నువ్వు రోజూ పూయించే.. హరివిల్లు కన్నా..
నీ ప్రేమ లేఖే మిన్న
నీలో సగమని నేను మురిసిపోతుంటే..
నన్ను నీ అంతటా నింపేసుకుని..
సంపూర్ణం చేసి..
అర్ధనారీశ్వర తత్త్వానికందనంత..
ఎత్తుకు ఎదిగినవాడివి
నువ్వు నన్ను పిలిచే పిలుపు
నన్ను ప్రతిక్షణం.. మురిపిస్తుంది
ఆనాటి వలపు తీపే..
ఈనాటి అక్షరాలలో కూడా.. కనిపించింది
నీ లేఖ చదివిన నాకు
సంద్రపు అలనై పోవాలని..
గంగా ప్రవాహమై నర్తించాలని
జన్మ జన్మలకీ.. నీ గుండె గుడిలో
నిలిచిపోవాలని.. ఒకటే ఆరాటం
ఎక్కడ కలవర పడతానోనని
కలత చెందనీయక..
అందమైన భావాల తోరణాలల్లి
లేఖ చేశావే..
పక్కనే ఊసులాడుకుంటున్నా..
ఆటలో.. పనిలో..
పాడుకుంటూ చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నా..
ఇవన్నీ ఇవ్వలేని..
అవ్యక్తానుగత.. చైతన్యోత్సాహాన్ని..
బతకడానికి..శక్తి.. కాదు.. కాదు
అమృతాన్నే..
నీ ప్రేమలేఖ ఇచ్చింది..
ఈసారి మహా సముద్రాన్ని కూడా..
అవలీలగా ఈదేద్దాం
కవయిత్రి సత్యగౌరి మోగంటి వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ఎమ్.ఎ; బి.ఎడ్, బి.ఎల్. చదువుకున్నారు. కాకినాడకు చెందిన వీరు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పదవీ విరమణ చేశారు. తెలుగు సాహిత్యం లోనూ, రచనావ్యాసంగంలోను అభిరుచి వున్న శ్రీమతి సత్యగౌరి, రేడియో ప్రసంగాలు, అడపాదడాపా వివిధ ప్రక్రియల్లో రచనా వ్యాసంగం చేస్తూ ప్రస్తుతం హైదరాబాదులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు.