Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమకథాసాగరమథనం శృంగారనైషధం

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘ప్రేమకథాసాగరమథనం శృంగారనైషధం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

బ్రాహ్మీదత్తవరప్రసాదుడు, పుంభావసరస్వతి, సకలాగమశాస్త్రపురాణ నిష్ణాతుడు, సకలవిద్యాసనాథుడు, సంస్కృతాంధ్ర కావ్యకళా దక్షుడు, కవిసార్యభౌముడు, శ్రీనాథమహాకవి!  రసవర్ణన ప్రధాన సంస్కృత కావ్యాల ఆంధ్రీకరణానికి, తెలుగు పంచకావ్యాలలో మొదటిదైన శృంగార నైషధానికి శ్రీకారం చుట్టిన వాడాయన.

“కవిరాజరాజిశేఖర హీర ముకుటంబు/శ్రీహీరకుల వార్ధి శిశిరకరుడు/మామల్లదేవి కుమారరత్నంబు చిం/తామణి మంత్ర చింతన ఫలంబు/కవికులాదృష్టాధ్వ గమనాధ్వనీనుండు/కాశ్మీరనృపసభ కమల హేళి/ఖండన గ్రంథనకర్కశబుద్ధి/షట్తర్కఫక్కికా చక్రవర్తిఅని భట్టహర్షుని స్తుతి చేశాడు శ్రీనాథుడు. ఖండనఖాద్యం అనే గ్రంథాన్ని కూడా శ్రీహర్షుడు వ్రాశాడట.

శృంగార నైషధ కావ్యాన్ని అశేష మనీషి హృదయంగమంబుగా, శబ్దం బనుసరించియు, నభిప్రాయంబు గుఱించియు, భావంబు పలికించియు, రసంబు బోషించియు, నలంకారంబు భూషించియు, నౌచిత్యం బాదరించియు, ననౌచిత్యంబుం బరిహరించియు, మాతృకానుసారంబునఁ తెలుగీకరిస్తున్నట్టు చెప్పుకున్నాడు. శృంగారరసం నిండిన నిషధరాజు నలుడి చరిత్ర కాబట్టి, ఇది శృంగారనైషధం అయ్యింది.

సరస్వతి ప్రత్యక్షమై, తనను తలచుకోగానే, నోటివెంట సారస్వతం వెలువడుతుందని, ఈ కథని విన్నవారికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని, కలియుగంలో శ్రీహర్షుడనే కవి నలుడి కథకు ప్రాచుర్యం కలిగిస్తాడని నలుడికే వరం ఇచ్చిందట సరస్వతి.

11వ శతాబ్దంనాటి శ్రీహర్షుడు, 13వ శతాబ్దంనాటి శ్రీనాథుడు ఇద్దరి మధ్యా 200 యేళ్ల వ్యవధి ఉంది. శ్రీహర్షుడు మహాభారతం అరణ్యపర్వంలో కనిపించే నలదమయంతుల కథకు ప్రాణం పోస్తూ నైషధచరిత్ర వ్రాశాడు. శకుంతలకు కాళిదాసు ప్రాణప్రతిష్ఠ చేసినట్టే నలదమయంతుల చరిత్రని పుణ్యచరిత్రగా శ్రీహర్షుడు తీర్చిదిద్దాడు.

శ్రీహర్షనైషధం పట్ల దేశవ్యాప్తంగా ప్రసిద్ధి ఉంది. 11వశతాబ్దంలోనే తొలి పాకశాస్త్ర ప్రామాణిక గ్రంథం ‘పాకదర్పణం’ నలుడి పేరుతో వెలువడటానికి ఈ ప్రభావమే కారణం కావచ్చు. శ్రీనాథుడి కాలానికి ఈ ప్రభావం మరింతగా ఉంది. పోతనగారి భోగినీదండక కృతి స్వీకర్త సర్వజ్ఞ సింగభూపాలుడి ప్రేరణతో మల్లినాథసూరి నైషధకావ్యానికి సంజీవనీవ్యాఖ్య వ్రాశాడు. విజయనగరానికి చెందిన నరహరి పండితుడు కూడా ఒక వ్యాఖ్యానం వ్రాశాడట. పిల్లలమర్రి పినవీరభద్రుడి రచన శృంగార శాకుంతలమూ ఇంచుమించు అదే కాలంలో వెలువడింది!

రెడ్డి, వెలమ వైరుధ్యాలు అధికంగా ఉన్న ఆ కాలంలో రెడ్డి ప్రభువుల మంత్రి సింగనామాత్యుడు తమ రెడ్డిరాజులకు ప్రతిష్ఠగా, నైషధాన్ని ఆంధ్రీకరణమే చెయ్యమని శ్రీనాథుణ్ణి కోరాడు. తన కాశీఖండం కావ్యాన్ని వీరభద్రారెడ్డికి, మరికొన్ని కావ్యాలను రెడ్డిరాజుల ఉన్నతోద్యోగులకీ, ఈ శృంగారనైషధాన్ని సింగనామాత్యుడికీ అంకితం ఇచ్చి శ్రీనాథుడు ‘రెడ్డిరాజుల కవి’ అనే పేరు నిలుపుకున్నాడు.

సింగనామాత్యుడు కూడా కవిపండితుడే! ఆయనకు శ్రీహర్షుడి ప్రశస్తి తెలుసు. పనివడి, నారికేళఫలపాకమునం జవియైనభట్ట హ/ర్షుని కవితానుగుంభములు సోమరిపోతులు కొందఱయ్య లౌ/నని కొనియాడనేర; దది యట్టిద; లేజవరాలు చెక్కు గీఁ/టిన వసవల్చు బాలకుఁడు డెందమునం గలగంగ నేర్చునే పసివాడి ముందు పరువంలో ఉన్న స్త్రీ ఎంత శృంగారం ప్రదర్శించినా వాడు గ్రహించలేనట్టే నారికేళపాకంతో రుచిమయమైన శ్రీహర్షుని కవిత్వ చమత్కారాల్ని కొందరు సోమరిపోతు లక్కటకటా.. తెలిసికోలేరు గదా!” అని సింగనామాత్యుడు నైషధవ్యాఖ్యానం చేయిస్తున్న రాజకీయ ప్రత్యర్థుల్ని కాబోలు సోమరిపోతులన్నాడు.

హర్షనైషధానికి మల్లినాథసూరి వ్యాఖ్య ఆధ్యాత్మికపరమైనది. శ్రీనాథుడి మార్గం, లక్ష్యం కూడా వేరు. “మల్లినాథుని వ్యాఖ్యానం చూస్తే మల్లినాథునికి అర్థమైనంతగా శ్రీనాథునికి నైషధం అర్థం కాలేదనిపిస్తుంది” (మల్లినాథసూరి జీవితము-రచనలు: బృందావనం రామానుజాచార్యులు, డా॥గుమ్మా శంకరరావు-) లాంటి వ్యాఖ్యలు చదివితే, ఈ వైరం ఈనాటికీ కొనసాగుతోందనిపిస్తుంది.

“పెదకోమటి వేమారెడ్డి రాజ్యమునకు వచ్చిన తర్వాత (క్రీ.శ.1403 తర్వాతనే) శ్రీనాథుడు 1410, 1415, ప్రాంతముల శృంగారనైషథమును రచించెనని నేను నిశ్చయించున్నాడను” అని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ‘శృంగారశ్రీనాథము-శ్రీనాథ చరిత్రము’ గ్రంథంలో వాశారు. సంతరించితి నిండుజవ్వనంబునయందు హర్షనైషధకావ్య మాంధ్రభాషం బ్రౌఢనిర్భరవయః పరిపాకమున అంటే, తనకు 30 యేళ్ళప్పుడు వ్రాసినట్టు శ్రీనాథుడు కాశీఖండంలో చెప్పుకొన్నాడు. శ్రీహర్షుడు కూడా చిన్ననాడే నైషధ రచన చేశాడు.

శ్రీనాథుడు పెట్టిన మెరుగులు

శ్రీనాథుడు కావ్యానువాదమే చేసినా, ముక్కస్య ముక్క అర్థః అన్నట్టుగా కాకుండా, అనేకచోట్ల స్వతంత్రించటంతో అనువాద శృంఖలాల కన్నా శృంగారనైషధంలో కావ్యస్వాతంత్ర్యం ఎక్కువ కనిపిస్తుంది.

ప్రబంధయుగోదయమునకు శృంగారనైషధము వేగుచుక్కకాగా, శృంగారశాకుంతలము తొలికోడి కూత అని పల్లా దుర్గయ్యగారు, ‘హర్షనైషధం బంగారం అయితే శ్రీనాథ నైషధం దానికి మెరుగు’ అని గడియారం వెంకట శేషశాస్త్రిగారు వ్యాఖ్యానించారు. నైషధాంద్రీకరణ మతిసాహసము. కీర్తియే ప్రాణమనుకొనెడి యీనాఁటి కవి యెవ్వఁడును సాహసింపఁడు. నేటికిని నైషధమును తెనిగింపఁగల కవి మరియొకడు కానరాడు” అన్నారు కొర్లపాటి శ్రీరామమూర్తిగారు (“తెలుగు సాహిత్య చరిత్ర).

నైషధం విద్వదౌషధమ్” అనే ప్రసిద్ధి పొందితే, శృంగారనైషధం విద్వదమృతం అనే కీర్తిని శ్రీనాథుడు సాధించాడు.

రంభలాంటి అప్సరసలు, ఇంద్రుడి భార్య, ఆఖరికి జగన్మాతలైన త్రిమూర్తుల భార్యలు కూడా నలుని అందం గురించి విని మదన వికారానికి లోనైనట్టు శ్రీహర్షుడు వ్రాస్తే, శ్రీనాథుడు దాన్ని అనువదించకుండా వదిలేశాడు. అది అతని సంస్కారానికి సాక్ష్యం. నలుడి అందాన్ని రాజ్యసభలో విన్నప్పుడు దమయంతి ‘వినిద్రరోమ’ అయ్యిందని శ్రీహర్షుడు తేలికగా వ్రాస్తే, ‘ఉన్నత స్తనభారంబు కెలంకులన్ నినుచు జంచల్లీల రోమాంచముల్” అని శ్రీనాథుడు స్వతంత్రించి తెలిగించాడు.

కాలాంతఃపుర కామినీకుచతటీ కస్తూరికాసౌరభశ్రీలుంటాకము (యముడి అంతఃపురాంగనల కుచాలపైన కస్తూరికాసౌరభ సంపదని అపహరించింది), చందనాచల తటశ్రీఖండ సంవేష్టిత వ్యాలస్ఫార ఫణాకఠోరవిష నిశ్వాసాగ్ని పాణింధమముమలయపర్వతంపై చందన వృక్షాల్ని చుట్టుకొన్న సర్పాల పెద్దపడగల కఠోరవిషఫూత్కారాగ్నిని రాజిల్లజేసే కొలిమితిత్తి (పాణింధమము) దక్షిణపు గాలిని ఉద్ధేశించి విరహాగ్నిని రగిలించేదిగా వర్ణిస్తాడు. అనలసంబంధవాంఛ నా కగునయేని/ఆ నలసంబంధవాంఛ నాకగును జుమ్ము అనల, ఆ నల లాంటి విరుపులతో కావ్యానికి సొగసు నింపాడు

ఈ కావ్యంలో తెలుగు సొగసులు అడుగడుగునా పరిమళిస్తాయి. వినుకలివలపు(వినగానే పుట్టిన ప్రేమ); పూటకాపు (జామీను దారుడు); మిండతుమ్మెదపదవులు(జారత్వము); వాలిక మించు కన్గొనలు (దీర్ఘమైన కనుగొనలు); నిండుబండికి చేట భరమే = బండెడు భారానికి చేట బరువా? లాంటి అందమైన పదబంధాలు ఇందులో ఎన్నో ఉన్నాయి.

సర్వతోముఖ పిపాసకుం దప్పిపడియెడు/కామమోదనము నిక్కముగవలయు” అనే పద్యపాదంలో సర్వతోముఖ పిపాస నోటీకి సంబంధించిన దప్పిక అనీ, కామదాహంతో రగిలిపోతోందని శ్లేష. కామమోదనం అంటే కామము+ ఓదనము= ఇష్టభోజనం, కామ+మోదనము= మదానానందం అని రెండర్థాల్లో ప్రయోగించాడు. ఇవన్నీ చమత్కారాలు. ఒక్కోసారి ఈ చమత్కారం మితిమీరి, భగవదారాధన అంటే, భగము(స్త్రీ అవయవం) ఆరాధనాప్రాప్తి అని, విద్వజ్జనులంటే కామకళా నిపుణులని, విషయించి వస్తారంటే తెలుసుకుని వస్తారనే అసలు అర్థం కాకుండా, రతిని కోరివస్తారని అమితంగా శ్లేషించాడు.

నల దమయంతుల అసలు కథ

ప్రపంచసుందరి ‘దమయంతి’ హంస ద్వారా పంపిన ఆహ్వానం అందుకుని స్వయంవరానికి బయల్దేరాడు నలుడు. దారిలో ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు అతన్ని ఆపి, దమయంతి తమలో ఎవరో ఒకరిని వరించేలా రాయబారం నడపమని ఆదేశిస్తారు. బదులుగా అదృశ్యసిద్ధి, అగ్నిసిద్ధి, లౌకిక అన్నసిద్ధి, జలసిద్ధి విద్యల్ని నలుడికి ప్రసాదించారు. దేవతల కోరిక, నలుడి రాయబారమూ రెండూ విఫలమయ్యాయి. చివరికి దమయంతి నలుడి మెడలోనే వరమాల వేసింది. వివాహం ఘనంగా జరిగింది. నలుడిపై పగబూని, కలిపురుషుడు వాళ్లు కాపురం చేయకుండా అడ్డుకుంటానంటాడు. హర్షనైషధంలో కథ ఇంతవరకే! ప్రేమ బలీయమైనదని, పవిత్ర ప్రేమని దేవతలుగానీ, కలి లాంటి దుష్టశక్తులుగానీ అడ్డుకోలేరన్నది ఇందులో నీతి.

తక్కిన కథలో శృంగార ఘట్టాలకు అవకాశం తక్కువ కాబట్టి, ఈ కావ్యాన్ని ఇక్కడితోనే ఆపారు. సీతా స్వయంవరంతో రామాయణం, ద్రౌపదీ స్వయంవరంతో భారతం అయిపోలేదు. నలదమయంతుల కథకూడా ఇక్కడితో ఆగలేదు.

నలచరిత్ర మహాభారతం అరణ్యపర్వంలో ఉంది. ఈ కథని ధర్మరాజు బృహదాశ్వమహర్షిని అడిగి చెప్పించుకుంటాడు. పగబూనిన కలి నలుడి సోదరుణ్ణి ప్రేరేపించి అతని పాచికలలో ప్రవేశించి, మాయాజూదం ఆడించి, నలుడి రాజ్యాన్ని అపహరింప చేస్తాడు. నలుడు, దమయంతి అడవుల్లో ఇక్కట్ల పాలౌతారు. దమయంతి పుట్టింటికి వెళ్లి సుఖపడ్తుందనే ఉద్ధేశంతో ఆమె నిద్రలో ఉండగా అడవిలోనే వదిలి వెళ్లిపోతాడు. ఇంతలో కర్కోటకుడనే నాగరాజు కాటుతో ఆజానుబాహువూ, అందగాడూ అయిన నలుడు పొట్టిగా, నల్లగా కురూపిగా మారిపోతాడు. కర్కోటకుడు నలుడి మేలు కోసమే ఇదంతా అని, కోరుకున్నప్పుడు అసలు రూపంలోకి వచ్చే మాయావస్త్రాన్ని బహూకరిస్తాడు. అతని సూచనమేరకు ఋతుపర్ణుడనే రాజు దగ్గర వంటవాడిగా చేరి, అతని దగ్గర ‘అక్షవిద్య’ నేర్చి, మళ్లీ జూదం ఆడి తమ్ముణ్ణి ఓడించి దమయంతిని పొందుతాడు. నలచరిత్ర విన్నాకే, ధర్మరాజు అజ్ఞాతవాసంలో కంకుభట్టు పేరున అక్షవిద్యాపారంగతుడిగా, భీముడు వలలుడి పేరుతో వంటవాడిగా, నకుల సహదేవులు అశ్వ, పశుపాలకులుగా గడపాలని నిర్ణయించుకుంటారు.

శ్రీనాథుడి నలుడు

ఆకాశగంగలా ముల్లోకాలనూ పవిత్రం చేయగల నిర్మలమైన నలుని చరిత్ర పాపహారి అంటాడు శ్రీనాథుడు. “తపనీయ దండైక ధవళాతపత్రితోద్దండ తేజః కీర్తిమండలుడు” అంటూ నలుని వ్యక్త్వాన్ని చాటాడు. ప్రతాపం వలన యశస్సు పొందాడని, “ద్రినేత్రుని యపరావతార మగుటఁ/ దెలుపు దిపాలకాంశావతీర్ణుఁడతడు”-త్రినేత్రుడి అపరావతారం, అష్టదిక్పాలకుల అంశతో జనించాడని వర్ణించాడు.

తలవెండ్రుక లెగఁగట్టెడు/కొలఁదిని నా నృపకుమారకుఁడు కడిమి మెయిన్/నలుదెసలకరులగండ/స్థలఫలకములన్ లిఖించె జయ శాసనముల్ తల వెంట్రుకలు ముడికి వచ్చేటంత పసివయసులోనే నలుదిక్కులూ జయించి యేనుగుల చెక్కిళ్ల మీద జయశాసనాలు వ్రాయించాడట. ఆడవాళ్లంతా అందానికి ప్రతిరూపం నలుడనీ, కళ్ళు మూసుకున్నా అతని రూపమే కనిపిస్తోందనీ అనుకుంటున్నారట. భూలోకంలో ఉన్న ప్రతీ రాజకన్య నలుడికి భార్య కావటానికి తన సౌందర్యం సరిపోతుందా లేదా అని అద్దంలో చూసుకుంటూ ఉండేదట.

 “సౌరభము లేనియట్టి పుష్పాంబు వోలె/ గండుఁగోయిల వెలియైన కానవోలె/ నధిప! దమయంతి తోడి సఖ్యంబు లేని/ నీదు సౌందర్య విభవంబు నిష్ఫలంబు” దమయంతితో స్నేహం లేకపోతే నీ సౌందర్యం పరిమళం లేని పుష్పంలా, కోయిల లేని వనంలా నిష్ఫలమే నంటుంది నలుడితో హంస. కథాగమనానికి ఈ పద్యమే తొలి అడుగు.

నలుడి దమయంతి

ఆమె సౌందర్యం వర్ణనాతీతం. “రాజబింబంబునందు సారము హరించి/ చేసినాడు విధాత యా చెలువమోము” దమయంతి ముఖ సౌందర్యం కోసం బ్రహ్మగారు చంద్రబింబంలో ఉన్న సారాన్నంతా తీసి ఉపయోగించాడట. చంద్రబింబంలో కనిపించే నల్లరంధ్రం లాంటి మచ్చ అందుకే ఏర్పడిందట.

“లిపిర్న దైవీ సుపఠా భువీతి/తుభ్యం మయి ప్రేరితవాచకస్య” దేవలిపి మానవులకు తెలియదు కాబట్టి ప్రేమలేఖ వ్రాయకుండా నన్ను దూతగా ఇంద్రుడు పంపాడని ఇంద్రదూతిక అన్నట్టు శ్రీహర్షుడు వ్రాశాడు. దానికి శ్రీనాథుడుచంచలనేత్ర! దివ్యలిపి సంతతి భూజనముల్ పఠింప లే/రంచును మానెగాని నఖరాగ్రమునన్ లిఖియించి నీకుఁబు/త్తెంచు జుమీ మహేంద్రుఁడు మదీయకరంబున దేవతావనీ/కాంచనకేతకీ కుసుమగర్భ దళంబున గార్యపద్ధతుల్– దేవలిపి చదవటం కష్టం అని ఇంద్రుడు నీకు ప్రేమలేఖ వ్రాయలేదు. మీరే చదవగలిగితే మా నందనవనంలోని బంగారు మొగలి రేకులమీద మీ పద్ధతిలో వేలిగోటితో వ్రాసి నా చేతికిచ్చి పంపేవాడే” అంటుంది.

ఇంతకాలం నిన్ను ఉపేక్షించటం ఇంద్రుడి తప్పే! అందుకు శిక్షగా అతని మెడని పూలహారంతో బంధించు, సాక్షాత్తూ ఇంద్రుడంతటి వాడే నిన్ను వరించాడంటే ఎంత పుణ్యం చేసుకున్నావో..! లక్ష్మీదేవి తోడుకోడలివై నందనవనంలో సుఖాలు పొందు. నారాయణుడు నీకు మరిదిగా సమస్త రాజకీయవ్యవహారాలూ నెరవేరుస్తుంటే ఇంద్రుడితో కలిసి సింహాసనం పైన కూర్చొని ముల్లోకాల్నీ పాలించు.. అంటూ ఇంద్రదూతిక ఆశపెట్టింది. నలుని వరించిన తనకు ఇంద్రుని మాటలు వినటమే పాతివ్రత్య భంగంగా భావించింది దమయంతి. భూలోకంలో ఉదయించిన నలుడనే ఈ ఇంద్రుడి సేవ చేసుకుంటానంటుంది.

“మోక్షం కోరేవాడికి ఇంద్రియ సుఖాలు రుచించనట్టు, నిరతిశయ సౌఖ్యదాయకుడైన నలుని వరించిన నాకు ఇంద్రుడి మాటలు వినదగినవి కావు. ఈ భూలోకంలో గృహస్థాశ్రమంలో పతిభక్తితో గడుపుతాను. స్వర్గంలో సుఖపడవచ్చేమో గానీ అక్కడ ఆచరించటానికి ధర్మం ఉండదు. ఈ లోకం నుండి స్వర్గానికి రావటం మనుషులకు ఉత్తమగతే కానీ, అక్కడకొచ్చాక అధోగతి పాలౌతారు..” ఇలా ఇంద్రుణ్ణి  సున్నితంగా తిరస్కరిస్తుంది. శపథంబు జేసెదన్ ననవిలుకాని పాదవలీనంబులపై, రతిచన్నుదోయిపై అంటూ రతీదేవి పాలిండ్లమీద ఒట్టు పెట్టి తాను నలుణ్ణే వరిస్తానంటుంది దమయంతి.

ఇంద్రుణ్ణి తిరస్కరించిన తప్పుని సతీవ్రతంతో తీర్చుకుంటాని శ్రీహర్షుడి దమయంతి పలికితే, నలుడితో కలిసి  యఙ్ఞహవిస్సు లర్పించి ఇంద్రుని శాంతింపచేసుకుంటా మంటుంది శ్రీనాథుడి దమయంతి. నీటికోసం పుట్టిన దప్పిక పాలతోనో తేనెతోనో తీరదని సంస్కృత దమయంతి అంటే, నెయ్యి వలన దప్పి పెరుగుతుందంటుంది తెలుగు దమయంతి. అందని మ్రాకులపండ్లు గోయం దలచెద అనే తత్త్వం ఈమెది! సంస్కృత దమయంతి అణకువకి ప్రతీక. తెలుగు దమయంతి ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు మూర్తి. ప్రేమకోసం ఇంద్రాణి పదవిని, స్వర్గలోకాధిపత్యాన్ని వదులుకున్న పుణ్యచరిత్ర ఆమెది!

శ్రీనాథుడి హంస

సీ. తల్లి మదేక పుత్రక, పెద్ద, కన్నులు/కానదిప్పుడు; మూఁడుకాళ్ళ ముసలి

ఇల్లాలు గడు సాధ్వి ఏమియు నెఱుఁగదు/పరమ పాతివ్రత్య భవ్య చరిత

వెనుక ముందర లేరు నెనరైన చుట్టాలు/లేవడి ఎంతేని జీవనంబు

 గానక కన్న సంతానమ్ము శిశువులు/జీవనస్థితి కేన తావలంబు

తే. కృపఁ దలంపఁ గదయ్య యో నృప వరేణ్య/యభయ మీవయ్య యో తుహినాంశు వంశ

కావఁ గదయ్య యర్థార్థి కల్పశాఖి/నిగ్రహింపకుమయ్య యో నిషధ రాజ

కొలనులో విహరిస్తూ నలుడికి పట్టుబడిన హంస “తాను అమ్మకి ఒక్కణ్ణే కొడుకునని, తల్లి ముసలిదనీ, అంథురాలని, భార్య  అమాయకురాలని, చూసే చుట్టాలెవరూ లేరనీ, తన పిల్లలు పసివాళ్ళని, కరుణించి వదిలిపెట్టమని వేడుకుంటుంది. తనను వదిలిపెడితే దమయంతి వరించేలా చేస్తానంటుంది. నలుడికీ దమయంతికీ పరిచయం కలపటానికే ఈ హంసోపాఖ్యానం!

‘కన్నులు కానదిప్పుడు’, ‘మూఁడుకాళ్ళ ముసలి’, ‘వెనుక ముందర లేరు నెనరైన చుట్టాలు’ ‘లేవడి ఎంతేని జీవనంబు’, ‘గానక కన్న సంతానమ్ము శిశువులు’ ఇలా శ్రీనాథుడు హంసతో జనం భాషని పలికించాడు.

దమయంతి చెలికత్తెలతో విహారంలో ఉన్న సమయంలో ఈ హంస అక్కడకు చేరింది. అది వస్తుంటే, దాని రెక్కలచప్పుడు దుందుభి వాద్యనిస్వనముతో తులతూగేలా ఉందట. యోగీశ్వరులు నిశ్చలచిత్తులై పరబ్రహ్మాన్ని చూసినట్టు చూస్తున్నారట. తాను బ్రహ్మ వాహనమైన హంస వంశంలో జన్మించాననీ, చదలేరు అంటే ఆకాశగంగలోని బంగారు తామర తూండ్లు తిని పెరిగాననీ, అన్ని లోకాలలోనూ సంచరించగలనని చెప్తుంది.“భారతీదేవి ముంజేతి పలుకుంజిలుక/సమదగజయాన సబ్రహ్మచారి మాకు” సరస్వతీ దేవి ముంజేతిపైన ఉండే పలుకులచిలుక సబ్రహ్మచారి మాకు అని చెప్తుంది. సబ్రహ్మచారి అంటే సహాధ్యాయి అని! డిగ్రీ చదివాక బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అనో, సైన్స్ అనో పట్టా ఇస్తున్నారు కదా.. ఆంగ్లేయుల పద్ధతిలో! సబ్రహ్మచారి అంటే బ్యాచిలర్స్ కోర్సులో అంటే డిగ్రీలో క్లాస్ మేట్ అని! వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల దరుణి! నీయాన ఘంటాపధంబు మాకుఅంటుంది.

ఒకసారి బ్రహ్మగారి వాహనంగా ఉన్న హంస అలిసిపోతే తాను వాహనం అయ్యానని, అందుకు బ్రహ్మగారు తనకు బహుమానం ఇచ్చారనీ, తాను దేవతాపక్షినని, మంచితనానికే పట్టుబడతాను గానీ తాళ్లతో తనను బంధించలేరనీ చెప్తుంది. భూలోకంలో రాజశ్రేష్ఠులు కొందరితో స్నేహం కోసం భూలోకానికి వచ్చానంటుంది. భూలోకంలో నిషధ దేశాధీశుడైన నలుడు చాలా గొప్పవాడిగా కనిపించాడంటూ ఆమెలో నలుడి గురించి తెలుసుకోవాలనే కోరిక రేకెత్తిస్తుంది.

హంసరాయబారం నూరుశాతం విజయవంతమైన కార్యం. నలుడికి ఇచ్చినమాట నిలబెట్టుకుంది హంస.

బువ్వంబంతి

హంసరాయబారం, నలుడి రాయబారం, బువ్వంబంతి ఘట్టాలు శృంగారనైషధానికి వన్నె తెచ్చాయి. ఈ ఘట్టాలను శ్రీహర్షుడు, శ్రీనాథుడు పోటీపడి వ్రాశారనిపిస్తుంది. బువ్వంబంతిలోని విశేషాలలో ఆస్వాదించే అంశాలు చాలా ఉన్నాయి.

బువ్వ అంటే అన్నం! విందు, భోగం అని! “సాక్షాన్మోక్ష ప్రదుండు శంకరు డారగించి మించే బువ్వ” అంటుందో స్త్రీలపాట. శంకరుడు ఆరగించేదిగా ఉండాలిట బువ్వ. “సీతారాముల బువ్వముబంతి చూడగ చోద్యమాయె”, “సుందరమగు బువ్వము చూడగ ఆనందము” లాంటి స్త్రీల పౌరాణికపు పాటల్లో బువ్వ అంటే ఖరీదైన భోజనం అని!

ఐదు రోజుల పెళ్లిళ్లలో మొదటిరాత్రి ఏర్పాటు చేసిన విందు ‘తొలిబువ్వం’. మూణ్ణిద్రలయ్యాక నాలుగోరాత్రి విందు హరిబువ్వం.  పెళ్ళివారంతా వరుసగా కూర్చుని సరససల్లాపాలు, కొంటెచేష్టలు, పరిహాసాలతో జరిపే విందు బువ్వం బంతి.

అమ్మాయిలకు అబ్బాయిలకు స్వేచ్ఛగా గడిపే వేదికలు పెళ్లిళ్లే! ప్రేమకథలు బంధుమిత్రుల పెళ్లిళ్లలోనే మొదలౌ తుంటాయి. మధ్యవర్తుల్లేకుండా నేరుగా పరిచయాలు, ప్రణయాలు, శృంగారాలు, పరస్పర కటాక్షణాలు, చతురసల్లాపాలు ఎన్నో జరిగిపోతుంటాయి.

“వ్రయ్యవడకుండ నాడిరి/వియ్యపు మేలంబు లుభయవిధబాంధవులున్/నెయ్యంబునఁ దియ్యంబున/నొయ్యనఁ జతురాక్షరాధికోక్తి ప్రౌఢిన్” రెండువైపుల చుట్టాలు చతురోక్తులతో, పరిహాసాలతో వేడుకగా బువ్వంబంతి జరుపుకున్నారు.

వెడమఱలి చూచె నొకచంద్రబింబవదన/వేడ్కదళుకొత్త నొక రాజ విటకుమారుఁ/ బెడమఱలి యేసె వాని నప్పుడ మరుండు/ సానఁబెట్టిన మోహనాస్త్రంబుం దొడిగి” ఓ అమ్మాయి పక్కకు తిరిగి విటరాజకుమారుణ్ని వేడుకగా చూసింది. సరిగ్గా అదే సమయానికి మన్మథుడు బాగా పదునుపెట్టిన మన్మథ బాణం వేశాడు.

ఒకావిడ పక్కకుతిరిగి ఎవరితోనో మాట్లాడుతుంటే, ..ధూర్తుడొక్క_రుం/డివ్వలవచ్చి వంచన మెయిన్నును మించు మెరుగు టద్దమున్/నవ్వుచుఁబెట్టె దాని చరణంబులకు న్నడుమ్మైన మేదినిన్– ఓ కొంటెగాడు మెరుగుటద్దం తెచ్చి ఆమె రెండు కాళ్ల మధ్య పెట్టాడట.

నలమహారాజు సేనాపతికి ఓ చంచలనేత్ర వట్టివేళ్ల విసనకర్రతో విసుర్తోంది. అతను పెద్దవైన ఆమె క్రొమ్మెరుగు చన్నుల బింకాన్నే చూస్తూ చెమటలు చమర్చాడు.

తోక ముందుకీ తల వెనక్కి ఉండేట్టు పులిచర్మాన్ని పరిచి ఓ చిన్నది పండితులవారిని కూర్చోమంది. ఆయన చూసుకోకుండా తోకవైపు కూర్చుంటే అది ఆ పండితుడి మూడో పాదం (జననాంగం) లా ఉందని నవ్విందట.

లలన యొకర్తువగు కృకలాసము చేరఁగదెచ్చి వంచనన్నలునకు గుంచెవట్టు నెలనాగపదద్వయ మధ్య మంబునన్ ఇంకో కొంటెపిల్ల బక్కచిక్కిన తొండని తెచ్చి, నలుడికి నెమలీకల వింజామరం విసుర్తోన్నఅమ్మాయి కాళ్ల మధ్య వదిలింది. ఆ తొండ ఆమె కాలు మీదుగా పోకముడి దాకా పాక్కొంటూ పోయి, అక్కడ ఇరుక్కుపోయింది. తొండని తీసేందుకు చివరికి ఆ స్త్రీ బట్టలు విప్పాల్సి వచ్చిందని అందరూ నవ్వారు.

ఎట్టి వినీతుఁడోయొకరు డేణవిలోచన బంతివెంటమా/ర్వెట్టగ దాని వక్త్ర శశిబింబముఁజూడఁగ నోడితాల్మిమై/బట్టముగట్టెఁ దచ్చరణ పద్మయుగాంతర చంద్రమశ్శిలా/కుట్టిమభూమిభాగమునకుం దనమంజుల దృష్టి పాతమున్” ఆమె నిలుచున్న నేలవైపే చూస్తున్నాడట ఓ వినీతిమంతుడు! అద్దంలా మెరిసే పాలిష్ చేసిన పాలరాతి నేలని ‘కుట్టిమం’ అంటారు. సుందరి ఆ నేలపైన నిలబడితే, తలకిందులుగా కనిపించే ఆమె ఫ్రతిబింబంలో ఆమె గుహ్యాయవయం కనిపిస్తుందేమోనని వాడు ఆశగా నేలచూపులు చూస్తున్నాడు.

వడ్డన పళ్ళాలన్నీ వడ్డించే పదార్థాల రంగుల్లో ఉన్నాయిట. అందులో ఆ పదార్థాలు ఉన్నా, లేవని భ్రమించి అతిథులు కోపగించు కున్నారట. పెళ్లివారిని తికమకపెట్టి ఆనందించటం పెళ్ళిళ్లలో మామూలే!

మురిపాల వడ్డనలు

వడ్డించటానికి స్త్రీలే ఎందుకంటే వాళ్లు ఆదరణతో వడ్డిస్తారని! వడ్డించేవారిని పరివేషకులన్నారు. అతిథి దగ్గరే ఉండి కొసరికొసరి వడ్డించి తినిపిస్తారు. ఆంగ్లేయులూ వడ్డించేవారిని waiters అంటారు.

ఆదరణంబుతో నభినవాజ్య విపాండురఖండశర్కరా క్షోద సమన్వితంబుగ” అంటే తాజానెయ్యి, తెల్లని చక్కెర పొడి, అన్నపూర్ణా దేవి చిరునవ్వులాంటి తెల్లని పాయసాన్నాల్ని బంగారుపాత్రలలో తెచ్చి వడ్డిస్తుంటే అతిథులు తృప్తిగా తిన్నారట.

“ఈ వడ్డించే అమ్మాయిలలో కొందరు తమ స్తనాల్ని జఘనాల్ని చక్కగా ప్రదర్శిస్తూ నీకు ఉత్సాహం కలిగిస్తారు. అధరపానమో చుంబనమో కోరితే వాటికి కేంద్రమైన ముఖాన్ని అందుబాటులో ఉంచుతారు” అని యువరాజు దముడు ఒక అతిథితో అంటాడు:. బువ్వంబంతిలో శృంగారానికి ఇలాంటి ముందస్తు ఏర్పాట్లన్నీ చేశారన్నమాట.

భోజనానికి శృంగారంతో లంకె దేనికో శ్రీహర్షుడే ఇలా వివరిస్తాడు: “న షడ్విధః షిఙ్ఞ్గజనస్య భోజనే తథా యథా యౌవత విభ్ర మోద్భవః/అపార శృఙ్ఞ్గారమయ సమున్మిషన్ భృశం రసస్తోష మధ త్త సప్తమః” ఆరురుచులూ వాటివాటి పాళ్లలో చాలినంతగా ఉన్నది షడ్రసోపేత భోజనం. అలంకార శాస్త్రానికి సంబంధించిన నవరసాల్లోని శృంగార రసాన్ని ఆహార శాస్త్రానికి సంబంధించిన షడ్రసాలకు అదనంగా ఏడవ రసంగా చేర్చటంతో ఆ విందుభోజనం సప్తరసోపేతంగా రుచిమయం అయ్యిందట! భోజనాన్నీ శృంగారాన్ని కలగాపులగం చేసి, శ్రీహర్షుడు భోజనాన్నే శృంగారం చేశాడు. వాటిలో కొన్నింటిని పరిహరించి, కొన్నింటిని పెంచి శ్రీనాథుడు శృంగారనైషధం వ్రాశాడు. శృంగారం లేని పరిహాసం లేదు, పరిహాసం లేకుండా బువ్వంబంతి లేదు.

విస్తట్లో వేడన్నం తెచ్చి వడ్డించింది ఒకమ్మాయి. అంతకు మునుపే వడ్డించగా చల్లారిన అన్నాన్ని, ఈ వేడన్నాన్ని చూపిస్తూ ఇదా.. అదా.. అనడిగాడతను. వేడన్నం అంటే పగటిపూట అని, చల్లారిన అన్నం అంటే రాత్రిపూట అని ఆ సైగలకు గూఢార్థం. ఆమె తెలివిగా తన ఎర్రని పెదవి చూపించింది. సంధ్యాసమయంలో అని చెప్పినట్టు వాడర్థం చేసుకున్నాడు.

చేతులు కడుక్కొనేందుకు నీళ్లు పోస్తున్న ఓ అమ్మాయిని ఎవరూ చూడకుండా ముద్దుపెట్టుకున్నవాడొకడు. వికారపు చేష్టలకు ఇష్టపడని ఓ అమ్మాయి అడ్డదిడ్డంగా నీళ్లు పోసి ఒళ్లంతా తడిపిందింకొకణ్ణి! ఒకడు ఏమే.. ఏమేమే.. అంటూ పిలుస్తుంటే, “ఇక్కడేదో మేక వచ్చింది, మే మే అంటోంది” అని అరిచిందట ఓ అమ్మాయి. యువామిమే మే స్రితమే ఇతీరిళో గలే తథో కా నిజగుచ్చ మేకికా.. అంటూ

శ్రీహర్షుడు జటిలంగా వర్ణించిన ఈ ఘట్టాన్ని శ్రీనాథుడు చాలా తేలికపరిచాడు.

వడ్డించే అమ్మాయిని మాటిమాటికీ అడిగిందే అడుగుతూ ఒకడు విసిగిస్తుంటే పక్కనున్నవాడు అంటున్నాడు. నువ్వు కూర, పప్పు, పచ్చడి ఇలా నెమ్మదిగా వరుసలో వడ్డిస్తున్నావు. వాడిక్కావాల్సిన ఆ ఆఖరి వరవ్యంజనాన్నే వడ్డించు” అని! ఆఖరిదంటే ఆలింగన చుంబనాదుల వరుసలో ఆఖరిదైన రతినే ప్రసాదించమని సిఫారసు.

భుజక్రియ

ఆహార చమత్కారాలు శ్రీహర్షుడికి ఇష్టమైన విషయాలే అనటానికి అతని గురించి ఓ కథ ఉంది. శ్రీహర్షుడు నైషధ కావ్యాన్ని సరళంగా వ్రాయటానికి తన మేథాశక్తిని తగ్గించుకోవాలని ‘బింబీ బుద్ధినాశినీ’ సూక్తిననుసరించి రోజూ దొండకాయా కూరే తిన్నాడట. ఒక రోజు శ్రీహర్షుడి ఇంటికి వాళ్ళ మేనమామ వచ్చాడు. ఆ సమయానికి శ్రీహర్షుడు మినపట్టు తింటున్నాడు. “కిమశ్నాసి” ఏం తింటున్నావని అడిగితే, అశేష శేముషీమోషమాషమశ్నామి మారిషః “మినపట్టనే గజదొంగని నమిలేస్తున్నా” అన్నాడట. అది విన్నాకే, తల్లి సరళమైన నైషధకావ్యరచనకు అనుమతించిందట.

ఆహారంతో ముడిపెట్టి, శృంగార చమత్కారాల్ని శ్రీహర్ష శ్రీనాథులిద్దరూ ఘనంగానే గుప్పించారు.

పయఃస్మితా మణ్డపమండలాంబరా/వటాననేన్దుః పృథులడ్డుక స్తనీ/పదం రుచే ర్భోజ్యభుజాం భుజిక్రియా/ప్రియా బభూ వోజ్యల కూరహారిణీ అంటూ భుజిక్రియనే అంటే భోజనం చేయటాన్నే ఒక స్త్రీగా వర్ణించాడు శ్రీహర్షుడు. భోజనంలో వడ్డించిన క్షీరాలు ఆ స్త్రీ చిరునవ్వులు. భోజనం చేసే జనసమూహం ఆమె వస్త్రాలు. పాలలో నానించిన గారెలు ఆమె ముఖారవిందం. పెద్దవైన లడ్డూలు ఆమె స్తనసంపద. వంటకాల రుచి ఆమె అందానికి సంకేతం. కమ్మగా వండిన కూరలు ఆమె మెడలో హారాలు. ఇన్నింటితో కూడిన ఆ స్త్రీ భోక్తలకు తృప్తినిస్తుంది..” అంటాడు. దీనికి శ్రీనాథుడి సరళీకరణ ఇది:

చలివాలు నవ్వు లడ్డువ/ములు చన్నులు పనసతొలలు మోనవ్రలు మండెం/గలు చీరలుగ, భుజిక్రియ/వలపించెన్ బెండ్లివారి వనితయుఁబోలెన్చలివాలు అంటే తెల్లనిపాలు, చిరునవ్వుల్లా, లడ్డూలు స్తనాల్లా, పనసతొలలు (తీపి భక్ష్యాలు) అధరాల్లా ఉన్నాయి. మండెంగలు అంటే పొరలమీద కాల్చిన పరోటాల్లాంటి రొట్టెలు ఆమె కట్టుకున్న చీరల్లా ఉన్నాయి. ఈ విధంగా భుజిక్రియ అనే పెళ్లివారి వనిత వలపించిందట. శ్రీనాథుడి అనువాదంలో తెలుగు వంటకాలతో భుజక్రియ అనే స్త్రీ వర్ణనలో తెలుగుదనం తొంగి చూస్తుంది.

విందుభోజనాన్ని తొలకరితోను, భుజించేవారిని పంటచేనుగానూ పోలుస్తాడింకో పద్యంలో! భోక్తృసస్యం అంటూ భోజన సమయం తొలకరిలా, భోజనానికి కూర్చున్న భోక్తలు పంటచేనులా కనిపిస్తున్నారని వర్ణిస్తాడు మరో పద్యంలో!

శ్రీనాథుడి వంటకాలు

మరకత మణిపాత్ర గగనమండల మయ్యెన్/జిరువడములపాసెము శశ/ధరుం డయ్యెం జుక్క లయ్యె ద్రాక్షపలంబుల్” మరకత మణులు పొదిగిన పాత్ర గగనమండలంగా ఉందని, అందులోని పాయసంలో చిరువడములు చంద్రుడిలా ఉన్నాయనీ వర్ణిస్తాడు. వడము అంటే తాడు. బియ్యప్పిండిని ముద్దలా చేసి చక్రాల గిద్దలో వేసి పాలలో చక్రాల్లా వత్తి ఉడికిస్తారు, ఈ చక్రాల్నే శ్రీనాథుడు చిరువడము లన్నాడు. పాలతాలికలంటే ఇవే! ఈ చిరువడ చంద్రబింబంలా, అందులో కల్పిన ఎండు ద్రాక్షలు (కిస్మిస్) నక్షత్రాల్లా ఉన్నాయంటాడు.

నివసద్భాష్ప మఖండితాఖిలము నిర్ణికం బసంత్యక్తమా/ర్దవ మన్యోస్య మసంగతం బహృత సారస్యంబు గౌరం బగౌ/రవమౌ మోదన మోదనం బమృత పర్యాయంబుసంబంధి బాం/ధవభూపాలసుతుల్ భుజించిరి వయోళదర్పార్చానురూపంబుగన్” అన్నం వేడిగా ఉంది. నూకలన్నంలా కాకుండా అఖండితంగా ఉంది. నిర్మలంగా, మృదువుగా, మెతుకులు అంటుకోకుండా పొడిపొడిగా, సరసమైనవిగా,

వెన్నెల్లా తెల్లగా సన్నగా సంతోషం కలిగించేలా ఉందట. ఆ అన్నాన్ని ఎవరికి వారు తమ వయసుకు తగ్గట్టుగా తిన్నారట.

మిసిమి గల పుల్ల పెరుగుతో మిళితమైన/ఆవపచ్చళ్ళు చవి చూచి రాదరమున/జుఱ్ఱుమను, మూర్థములు తాకి/యొఱ్ఱ దనము పొగలు వెడలింప నాసికాపుటములందు బంగారపు రంగులోకి మారేంతగా పులిసిన పెరుగుతో చేసిన ఘాటైన ఆవపచ్చడిని అన్నంలో కలుపుకుని అతిథులు జుర్రుకు తింటూ ఉంటే దాని ఘాటు మూర్థన్యాల్ని తాకింది. ముక్కుల్లోంచి పొగలు వెడలాయంటాడు.  తెలుగులో ‘పుల’ అంటే పసుపు+ తెలుపు కలిసిన బంగారపు రంగు. అలా మిసిమి కలిగిన పెరుగుని ‘పులపెరుగు’ అంటారు. మామూలు పుల్లపెరుగు కన్నా ఎక్కువ పులిసింది పులపెరుగు. దీనికి ఆవపిండి, పసుపు కలిపి తాలింపు పెడితే అదే ఆవపచ్చడి! ఆవపిండి కలపగానే దానికి ఘాటుదనం వస్తుంది. ఆవపిండి కలిపాక 4-5 గంటలు కదల్చకుండా ఉంటే దాని ఘాటు నసాళానికంటేంతగా ఉంటుంది. నసాళం అంటే మధ్య మెదడు. నాడీ వ్యవస్థ మొత్తం కేంద్రీకృతమయ్యే చోటు. ఆవాల్ని హిందీలో రాయీ అంటారు. పెరుగులో ఆవపిండి కలిపి తాలింపు పెట్టిన ఆవపెరుగుపచ్చడి “రాయిత” లేదా రైతా. ఇది తెలీక హోటళ్లవాళ్లు, ఉల్లిముక్కల పెరుగుని రైతా అంటున్నారు,.

ఆమిష మనామిషముగ న/నామిష మామిషముగాఁ గుహకమార్గకళా/సామర్థ్యంబునఁ జేసిన/తేమనములు మనములం బ్రతిష్ఠించె రుచుల్” తేమనం అనేది మజ్జిగతో చేసిన ఒక వంటకం. ఇది తినగానే అతిథులకు మతులు పోయినట్టయ్యింది. గారడీవాడి మాయలాగా మాంసాలు శాకాలుగా, శాకాలు మాంసాలుగా కనిపించసాగాయిట. తెలుగు నిఘంటువులు తేమనం అంటే మెంతిమజ్జిగ అని, చల్లపులుసు (మోరుకొళంబు) అన్నాయి. పాకదర్పణం గ్రంథంలో శుద్ధతేమనం తయారీ గురించి ఇలా ఉంది:  తక్రస్యామ్లం మర్దయిత్వా జలేన చ విచక్షణః/తత్ర సైంథవ సిద్ధార్థ మరీచానాగరౌద్భవమ్– కొద్దిగా పులిసిన పెరుగులో తగినన్ని నీళ్లు కలిపి చల్లకవ్వంతో చిలకాలి. సైంధవలవణం, ఆవపిండి, మిరియాల పొడి, శొంఠిపొడి వీటిని ముద్దలా చేసి ఈ మజ్జిగలో తగినంత చేర్చి, కొద్దిగా పచ్చ కర్పూరం వేసి, ఇంగువ తాలింపు పెట్టింది శుద్ధతేమనం.  ఇదే మన మజ్జిగచారు. ఇందులో మెంతులతో తాలింపు పెడితే అది ‘మెంతిచారు’.

సీ. గోధూమసేవికా గుచ్చంబు లచ్ఛాచ్ఛ/ఖండశర్క_రలతోఁ గలపి కలపి

గుజ్జుగా గాఁచిన గోక్షీర పూరంబు/జమిలి మండెఁగల పై జల్లిచల్లి

మిరియంబుతోఁగూడ  మేళవించిన తేనెఁ/ దోరంపు లడ్వాలు దోఁచితోఁచి

పలుచగా వండిన వలిపంపుఁ జాఁపట్లు/పెసరపప్పులతోడఁ బెనఁచి వెనఁచి

తే. గోవ జవ్యాదిఁ గస్తూరిఁ గొఱఁత పఱుచు/వెన్నపడిదెంబు బొబ్బిల విద్రిచి విద్రిచి

వారయాత్రికు లనుమోద వంతు లగుచు/వలచి భుజియించి రొగిఁ బిండివంటకముల.

గోధుమపిండితో చేసిన సేవికా గుచ్చాలంటే సేమ్యాచుట్టల్ని అచ్ఛాచ్ఛఖండశర్కర అంటే స్వచ్ఛమైన పంచదారతో పాకం పట్టి తయారు చేసిన సేమ్యాకేసరిని వడ్డించారట. మండెగలంటే పొరలమీద వత్తిన మందపాటి రొట్టెలు. రెండు మండెగల మధ్య కొబ్బరి లౌజు పెడితే అది జమిలి మండెగ. గుజ్జుగా కాచిన గోక్షీరాన్ని (పాలకోవా) వీటిమీద దట్టంగా పట్టించారట. మిరియంపొడి కలిపిన తేనెతో చేసిన లడ్డూల్ని పళ్లెం వంచి చేత్తో విస్తట్లోకి తోశారట. చాపట్లు అంటే చాపరాయి అనే పెద్దపెనం మీద కాల్చిన పెద్ద పెసరట్టు తెచ్చి వడ్డించారట. గోవజవ్వాది కస్తూరిలతో పోటీపడేలా కమ్మగా కాచిన వెన్నపడిదెం (ఉలవచారులాంటి పులుసు)ని మునివేళ్లతో ముద్దని విదిల్చి విదిల్చి వెన్నతో నంజుతూ తిన్నారట. ‘వారయాత్రికులు’ అంటే పెళ్లివారు అనుమోదవంతులయ్యేలా వంటకాలు వడ్డనలు సాగాయి!

శ్రీనాథుడి శృంగారనైషధాన్ని చదివితే రంగుల చలనచిత్రం చూసిన అనుభూతి కలుగుతుంది. పాత్రోచితమైన నడక, నడత అబ్బుర పరుస్తాయి. పాండిత్యం కన్నా పరిశీలన దృశ్యమానం అవుతుంది. దమయంతిని శ్రీనాథుడు ప్రేమైక జీవిగా చిత్రించాడు. వారిద్దరి మధ్య అశ్లీల శృంగార వర్ణనలు చెయ్యలేదు. ఇద్దరి మధ్యా గాఢనురక్తి. నిర్మలమైన ప్రేమ మాత్రమే కనిపిస్తాయి. వారిది నిజమైన అమలిన శృంగారం. ప్రేమంటే అశ్లీలత కాదు, ఒక పవిత్రబంధం అని  చాటిన దమయంతి కథ ఇది.

Exit mobile version