చెట్లు ఏళ్ళకి ఏళ్ళు పచ్చగా చిగురిస్తూనే ఉంటాయి
హృదయాలు వయోపరిమితి వదిలి స్నేహిస్తుంటాయి
మనసు పుష్పక విమానమై సహచరులకు చోటిస్తుంటుంది
నెయ్యపు మమకారాన్ని సదా ఆస్వాదిస్తూ ఉంటుంది
స్నేహపురధం మిత్రుల నవ్వులయాత్రలా సాగుతుంటుంది
నేస్తాలు నిత్యపరిమళ హృదయాలతో గుబాళిస్తుంటారు
సరదా సరాగాలై ఆహ్లాద శృతితో సహచరునలరిస్తుంటారు
చెలిమి కలిమితో వాత్సల్య సుగంధాన్ని శ్వాసిస్తుంటారు
బతుకు పుస్తకంలో మిత్రత్వ మొక్కటే మధుర వాక్యం
మైత్రీ లత తీగె సాగి సన్నిహితమై నిలవడం అపురూపం
ఎదలోపలి ఆపేక్షా మధురఫలాలను పంచడమొక భాగ్యం
అర్హమైన ఆత్మీయులు దొరకడమే అసలైన పెద్ద వరం!
అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.