[డా. వసంత కుమార పెర్ల తుళు భాషలో వ్రాసిన కథని అనువదించి అందిస్తున్నారు శ్రీ రంగనాథ రామచంద్రరావు.]
ప్రేమ వలలో అతను ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశంలో చిక్కుకుపోయాడు. వయసులోని వసంతపు లేచివుళ్ళలో అమాయకంగా ఎవరైనా ప్రేమపాశానికి చిక్కుకుపోవటం సహజమే. అందులో ఆశ్చర్యం కానీ, ఊరు తలమీద వచ్చి పడినటువంటి అనుకోని సంఘటనకానీ ఏదీ లేదు.
కొన్నేళ్ళ నుంచి ప్రారంభమైన మాలినితో అతని ప్రేమ పంచాంగం ఇప్పుడు గట్టిపడుతూ వచ్చింది. దాన్ని కదిలించడానికి ఎవరివల్లా సాధ్యం కాదు. ఆ రోజు ఉదయం పాఠశాకు వెళుతుతుండగా కిణిగారి హోటల్ సాంబర్ తాళింపులా ఘుమఘుమలాడుతూ తేలివచ్చిన వార్త ఏమిటంటే ఎనిమిదవ తరగతి గజాననను కొరడాతో పాఠశాల దగ్గర్లోని ఒక సందులో నగ్నంగా నిలబెట్టి శంకర్ కొట్టాడని తెలిసింది. ఈ శంకర్ పి.యు.సి. పూర్తి చేసి నాలుగేళ్ళు అయింది. అతడికి వ్యవసాయం చేయడం చాలా భూమి ఉంది. సాయంత్రం కాగానే అక్కడక్కడ రహస్యంగా పిల్లల్ని కూడగట్టుకుని వాళ్ళ చేత పొగిడించుకునే ఆసామి. అతడి చెల్లెలు ఎనిమిదవ తరగతి చదువుతున్న మాలిని. గజానన చేసిన నేరం ఏమిటంటే ఏదో కుతూహలానికి లోనై, పిల్లల నోటి చాపల్యపు గుసగుసల వార్తను కార్యరూపానికి తీసుకుని రావడం. పాఠశాల గోడమీద, మూత్రశాల గోడ మీద, రోడ్డు పక్కని పిట్టగోడపైన కృష్ణమాలిని, కృష్ణమాలిని అని రాశాడు. ఈ కృష్ణ అనే పేరును ఉపయోగించుకుని అల్లరిపిల్ల అయిన మాలినిని తుంటరి పిల్లలు అల్లరి పట్టించడం ఆమె క్లాసులో మొదటి నుంచీ జరుగుతోంది. చెల్లెలి పేరు కృష్ణ అనే వ్యక్తితో పేరుతో ముడిపడి వీధిలో నలుగురి కళ్ళల్లో పడటం చూసి శంకరకు మండిపోయిది. బహిరంగ స్థలాల్లో అబద్ధపు రాతలు రాసిన కుర్రవాడు గజానన అని తెలియగానే సందులో కాచుకుని కూర్చున్నాడు. ఆ కుర్రవాడు ఇంటి నుంచి పాఠశాలకు వస్తున్న సమయంలో వాడిని పట్టుకుని బట్టలు ఊడదీసి, నగ్నంగా చేసి మూర్ఛపోయేలా కొట్టాడు. తోడుగా ఉన్న పిల్లలు పోయి హెడ్‌మాస్టరుకు కబురు అందించారు.
ఉపాధ్యాయులు, పిల్లలు పరుగునపోయి గజాననకు ప్రథమ చికిత్స చేసి, పిల్లవాడి తండ్రికి వార్త చేరవేశారు. పాఠశాల పిల్లవాడొకడిని మూర్ఛపోయేలా కొట్టడం పాఠశాలకు గౌరవానికి భంగమని భావించి పాఠశాల విద్యార్థులు శంకర ఇంటిని చుట్టుముట్టారు. అయితే సంఘశక్తిలో నమ్మకం ఉన్న శంకర సంఘటన దాని పాటికి అది చల్లబడనీ అని వారం రోజుల పాటు ఎక్కడికో పరారీ అయ్యాడు.
ఈ సంఘటన తరువాత అందరూ మాలిని పేరుకు వాడి పేరును లింక్ చేశారు. ఎనిమిదవ తరగతిలో కృష్ణ అనే పేరున్న కుర్రవాడు లేడు. అది తొమ్మిదవ తరగతిలో ఉన్నవాడి పేరే అయివుండవచ్చని విద్యార్థుంతా వాడిని అల్లరి పట్టించి వెక్కిరించసాగారు. ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులూ రెచ్చగొడుతుండటంతో, వయస్సు సహజమైన రోషం వాడిలో పడగ విప్పింది. “అవును, నేనే, మీకెందుకు కడుపుమంట?” అని అందరితోనూ తిరగబడి మాట్లాడసాగాడు. హెడ్‌మాస్టర్, వాడి తండ్రి ఆప్తమిత్రులు కావటం వల్ల వాడి ప్రవర్తన గురించి వాడి తండ్రికి విషయం తెలిపారు.
ఆ రోజు సాయంత్రం వాడి ఇంట్లో కొన్ని బెత్తాలు విరిగిపోయాయి. వాడి ఒళ్ళంతా కదుములు కట్టి వాచిపోయాయి. “నువ్వు బడికి పోవద్దు” అని వాడి తండ్రి అన్నాడు. “ఇంటిని ఉద్ధరించడానికి పుట్టిన ఒక్కగానొక్క కొడుకు” అని తల్లి గొణిగింది.
తండ్రి తనను బడికి పోవద్దన్నదే వాడి తలలో ప్రతిధ్వనించసాగింది. మరుసటి రోజు పాఠశాకు వెళ్ళి తనకూ, ఈ సంఘటనకూ సంబంధమే లేదని; తన తండ్రికి ఈ విషయం చెప్పటంతో తండ్రి తన చదువును ఆపేస్తున్నాడని మొత్తుకుని ఏడ్చాడు. వాడి కంట కన్నీళ్ళు చూసిన హెడ్‌మాస్టర్ గారికి ఏమనిపించిందో, మరుసటి రోజు ఇంటికి వచ్చి వాడి తండ్రిని సమాధానపరిచారు. మొత్తానికి వాడి చదువుకు కత్తెరపడలేదు.
అయితే ఏదో ఒక విధమైన మొండితనం వాడిలో తనంతట తానే తలెత్తింది. ఆ సంఘటన అక్కడితో ముగిసినా, కుర్రవాళ్ళ మృదువైన వెక్కిరింతలు మాత్రం వాడి పాలిట అప్పుడప్పుడు దూసుకుని వచ్చేవి. దానికి ప్రతిస్పందన అన్నట్టు ఒక రోజు మాలినిని వాడు పలకరించాడు. “పదిహేను రోజుగా పాఠశాకు ఎందుకు రాలేదు?” అని అడిగాడు. “ఇంట్లో అమ్మ బాగా తిట్టింది” అని చెప్పింది. “మరి ఇప్పుడు వస్తున్నావుకదా?” అని అడిగాడు. “నేను ఏడ్చి, గొడవ చేశాని. చివరికి పాఠశాకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు” అంది.
ఆ తర్వాత ఇలాగే ఒక్కొక్క నెపంతో వాళ్ళు కలుసుకోసాగారు. అనేక విషయాల గురించి చర్చించుకోసాగారు. వారి మధ్యనున్న స్నేహం రాను రాను గాఢమైంది.
కుర్రవాళ్ళు వాళ్ళ వెనుక సి.ఐ.డి. పని చేస్తూనే ఉన్నారు. మళ్ళీ విషయం ఉపాధ్యాయుల దగ్గరికి పోయింది. ప్రత్యేకత ఏమిటంటే మొదట్లో వాడు అకారణంగా చిక్కుకునివుంటే, ఈసారి నిజంగానే చిక్కుకున్నాడు. విషయాన్ని వాడి ఇంటివరకూ తీసుకునిపోవడానికి హెడ్‌మాస్టర్ ప్రయత్నించక, ఇద్దరిని పిలిచి బుద్ధిమాటలు చెప్పారు.
ఈ కారణంగా వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దాంతో పరస్పరం ఉత్తరాలు రాసుకోసాగారు.
ఉత్తరాల్లో అన్ని విషయ్నా చెప్పుకోసాగారు. ప్రేమలేఖను ఎవరూ చింపి పారవేయరు. వాటిని దాచుకుని అప్పుడప్పుడు చదువుకోవడం ప్రేమించిన ప్రతి ఒక్కడూ చేసే పనే. వాడూ వాటినన్నిటిని కట్టకట్టి మేడమీద ఒక చోట రహస్యంగా దాచిపెట్టాడు. అక్కడే కింది భాగంలో వాడి పాఠ్యపుస్తకాల రాశి ఉంది.
ఒక రోజు ఏదో ముఖ్యమైన కాయితాల కోసం వెతికి వెతికి వాడి తండ్రి మేడమీదికి వచ్చి మూలమూలలనూ వెతకసాగాడు. వాడు వాడి పుస్తకాతోపాటు నిర్భయంగా ఆ ప్రేమలేఖలను పెట్టివుంటే తండ్రి వాటి తంటాకు వెళ్ళేవాడు కాడు. పాఠశాకు సంబంధించిన ఏవో వ్యాసాలు ఉండొచ్చని ఊరకుండిపోయేవారు. అయితే చక్కగా ప్యాక్ చేసి జాగ్రత్తగా దాచి పెట్టడం చూసి, కుతూహలం కలిగి ఉత్తరాల కట్ట విప్పాడు. చదువుతుండగానే ఒళ్ళు మండిపోయి, కళ్ళు ఎర్రబారాయి. వాడి తల్లి, “ఏమిటండి అవి?” అని అడగటంతో, “నీ కొడుకు పాఠశాల నుంచి రానీ, అప్పుడు చెప్తాను అవి ఏమిటో?” అని అరిచాడు.
సాయంత్రం ఈల వేస్తూ ఆనందంగా పాఠశాల నుంచి వచ్చేసరికి వాడి తండ్రి ఇంట్లో ఉండలేడు. తల్లి వాడికి ఫలహారం పెట్టింది. వాడు తింటూ ఉండగా-
“అదేమిటో నువ్వు మేడమీద కబోర్డ్‌లో దాచిపెట్టిన కాయితాలను నాన్న చదివి కబోర్డ్‌లో పెట్టారు. ఏం కాయితాలురా అవి?” అని అడిగింది.
ఫలహారం చేస్తున్నవాడు సగంలోనే హడావుడిగా లేచాడు.
నోట ఉన్న ముద్దను మింగటమూ మరిచాడు.
ఏదో భయం, ఏదో సంకోచం.. దొంగతనం చేస్తుండగా దొరికిపోయిన అనుభవం.. ఆ కాయితాలనులెలాగైనా స్వాధీనం చేసుకోవాలన్నది అప్పటి వాడి ఉద్దేశ్యం. తండ్రి దగ్గర ఆ ఉత్తరాలు ఉన్నాయంటే ఇక తండ్రి చేతిలో చచ్చినట్టే అనుకున్నాడు. కబోర్డ్ దగ్గరికి పరుగునపోయి చూశాడు. దానికి తాళం వేసివుంది. అప్పటి వాడి కలవరం ఆ దేవుడికే తెలుసు. అవి ఎలాంటి కాయితాలో తెలిసినప్పటికీ వాడి తల్లి మళ్ళీ అడిగింది. “ఏమీ లేదు” అన్నాడు. అమాయంగా ముఖం పెట్టాడు. ఏడుపు ముఖం పెట్టాడు. చేతులు నలుపుకున్నాడు. తల్లికి కొడుకు పరిస్థితి చూసి బాధవేసింది. అయ్యో అనిపించింది. భర్త చేతికి దొరికితే వాడ్ని చీల్చేస్తారని అనిపించింది. కొడుకు మీది ఆపేక్షతోనూ, కలవరంతోనూ, కరుణతోనూ, తండ్రి కోపం తగ్గిన తర్వాత రమ్మని చెప్పింది. అవమానం, కోపం, జుగుప్సతో ఏమీ చేయాలో తోచక అయ్యిందికానీ అని కబోర్డ్ తలుపు గట్టిగా లాగాడు. తలుపు తెరుచుకున్నాయి. కాయితాలన్నీ తీసుకుని గబగబా ఇంటి నుంచి బయటపడ్డాడు. వాడి తల్లి ఏదోదే బిగ్గరగా అరుస్తూ చెబుతోంది. వినిపించనట్టు బయటికి నడిచాడు.
ఎక్కడికి వెళ్ళాలి?
ఆ రాత్రి పొట్ట చింత కలగలేదు.
మరుసటిరోజు ఉదయం నుంచి కడుపుకు ఆహారం కావాలి కదా! ఉదరాసురుడు ఊరికే కూర్చోడు కదా- అని ఆలోచిస్తూ ఇంటి ఎదురుగ్గా ఉన్న గుట్టమీదికి పోయాడు. రాత్రంతా గుట్టమీద కూర్చున్నాడు. చలికి వణుకుతూ, చీకటికి భయపడుతూ, భయానికి తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ, చేసిన పనికి పశ్చాత్తాపపడుతూ కూర్చున్నాడు. కిటికీ ద్వారా ఇంట్లో జరిగే సమస్త కనిపిస్తున్నాయి. రాత్రి తొమ్మిది గంటకు వాడి తండ్రి ఇంట్లో వాళ్ళను వసారాలోకి పిలిచారు. వాడికి పెళ్ళయిన ఇద్దరు అన్నలను, వదినలను, తల్లి, తండ్రి- సుమారు గంటసేపు వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకున్నారు. ప్రస్తుతం వాడి పాలిట వాణ్ణి వదిలేయాలని; పరిస్థితులు చల్లబడ్డాక వాడికి బుద్ధి చెప్పాలని వాడి అన్నలు తండ్రికి సూచించారు. వాడు ప్రాణానికి ఏదైనా ప్రమాదం తెచ్చుకుంటాడనే భయం ముఖ్యంగా వాడి తల్లిని వేధిస్తోంది.
మరుసటి రోజు మెల్లగా ఇంట్లోకి దూరాడు. ఎవరూ పలకరించలేదు. టిఫిన్ చేసి, కాఫీ తాగి పాఠశాకు బయలుదేరాడు. అప్పటికీ వాడు ఈ ఇంటికి సంబంధించని వాడన్నట్టు చూశారు. తల్లి కళ్ళల్లో కరుణ హద్దు దాటి ప్రవహిస్తోంది. అయితే దాన్ని ప్రకటించడానికి లేదు. దానికి కారణం తండ్రి కఠినమైన ఉత్తర్వులు. వారం గడిచాక సోదరుడు వాణ్ణి దగ్గరికి పిలిచాడు. ఏవేవో బుద్ధిమాటు చెప్పాడు. తండ్రి బాధ్యతను అన్న మోసుకున్నాడు. “చూసినవాళ్ళనంతా ప్రేమించకూడదు. తల్లితండ్రులు అంగీకరించి పెళ్ళి చేసుకున్న అమ్మాయిని ప్రేమించి సంసారం చేసుకోవాలి” అన్నది సోదరుడి బుద్ధిమాటల సారాంశం.
అన్న చెప్పినట్లు నడుచుకోవాని అనుకున్నాడు. మనస్సును కాస్త అదుపులో పెట్టుకోవాని అనుకున్నాడు. మూగుదారం తెగిన ఎద్దులా ప్రవర్తించకూడదని అనుకున్నాడు. చదువులో మనస్సు పెట్టాలని అనుకున్నాడు. ఆదర్శవంతుడైన విద్యార్థిలా నడుచుకోవాలని అనుకున్నాడు. పెద్దవాళ్ళుకు నచ్చిన పిల్లవాడవ్వాలి- ఇలా ఏవేవో గొణుక్కున్నాడు.
అదంతా ఒకే ఒక క్షణం.
మాలిని గుర్తుకు రాగానే అనుకున్న నిర్ణయాలన్నీ కరిగి నీరయ్యాయి.
మరుసటి రోజు మాలిన ఉత్తరం చూసి కవరపడ్డాడు. తన ఇంట్లో ఆమెకూ అతని అవస్థే పునరావృతమైంది. ఆమె అతను రాసిన ప్రేమలేఖన్నీ పెట్టెలో దాచి పెట్టింది, అకస్మాత్తుగా అవి ఆమె అన్న కంటపడ్డాయి. తల్లి, సోదరుడు ఒక్కటై (ఆమెకు తండ్రి లేడు) ఆమెను చిత్రహింసకు గురిచేశారు. మూడు రోజులు అన్నంనీళ్ళు ఇవ్వకుండా గదిలో బంధించారు. గుండెలు పగిలేలా ఏడ్చింది. స్నానం చేయనివ్వలేదు. దుస్తులు మార్చుకోనివ్వలేదు. తల దువ్వుకోనివ్వలేదు. పాఠశాలకు పంపలేదు. చివరికి ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికీ స్వాతంత్రం లేదు. వడలిపోయి, నిశ్శక్తురాలైన ఆమెను చూస్తూ, “నీకు లవర్ కావాలా? గాడిదా, శని పట్టిందేమే, దరిద్రురాలా” అని దూషిస్తూ కాస్త కాస్త తిండి పెట్టారు. మొత్తానికి ఆ సంవత్సరపు ఆమె విద్యాభ్యాసం నాశనమైపోయింది.
ఆ ఎకడెమిక్ సంవత్సరం గడిచిన తరువాత ఆమె అన్న, తల్లి ఆలోచించి, ఆ పాఠశాకు పంపితే పరిస్థితులు మారవని, దూరంలో ఉన్న పాఠశాలలో చేర్చారు. అక్కడి నుంచి ఆమె అతనికి ఉత్తరం రాయసాగింది. అప్పటికింకా వాడు పదవ తరగతిలో వున్నాడు. వాడి మనస్సులోనూ, ఆమె ఇంట్లోనూ సంఘటన చల్లబడిందనే అందరూ భావించారు.
ఒకసారి ఒకరిలో ప్రేమ అంకురిస్తే దాన్ని తుడిచివేయటం చాలా కష్టం. అడ్డంకులు వచ్చినట్టల్లా మొండితనం గట్టిపడుతుంది. మాలిని నుంచి ఉత్తర్నా వారానికి ఒకటి పోస్ట్‌లో రాసాగాయి. అందులో ఆమెకు ఇంట్లో పెడుతున్న కష్టాల వివరణ వుండేది. ఇంట్లో జీవితం ముళ్ళ మీద నిలుచున్నట్టు ఉందని రాస్తుండేది. ఇటు చూస్తే అన్న నోరు తెరిస్తే ‘ముండా, లంజ’ అని తిడుతున్నాడని రాసేది. మాటమాటకు అవమానించటం, కాస్త బాగా అంకరించుకుంటే ‘ఏ ప్రేమికుడిని సంతోషపరచడానికి’ అని తిట్టడం- ఇలాంటివన్నీ ఉత్తరంలో రాసేది. ఇక్కడ అతని పరిస్థితి కూడా అంతకన్న అధ్వాన్నంగా ఉంది. రెండుసార్లు ఆమె రాసిన ఉత్తరాలు అతని చేతికి అందక అతడి అన్న చేతికి దొరికింది. అప్పుడు అతను, “నీ పాత బుద్ధి పోలేదు కదా?” అని గుర్రుగా చూశాడు. “నేను చెప్పిన బుద్ధిమాటలు బూడిదలో పోసిన పన్నీరు అయింది. హూఁ నీ నుదుట రాసింది ఏమిటో ఎవరికి తెలుసు? మంచిదారికి వస్తావని అనిపించటం లేదు. పాడైపో, నాకేమిటి?” అని ఆ విషయాన్ని అక్కడితో వదిలేశాడు.
ఈ విధంగా ఉత్తరాలు రాస్తూ, పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, బాధలు చెప్పుకుంటూ, మరింత గాఢంగా ప్రేమించుకుంటూ సంవత్సరాలు దొర్లిపోయాయి. గతసంవత్సరం అతడి డిగ్రీ పూర్తయింది. మాలిని పి.యు.సి.తో చదువు ఆపేసింది. ఆమె వెళుతున్నది జూనియర్ కాలేజికి. పైచదువుకు కాలేజికి పంపటానికి ఆమె ఇంటివాళ్ళు ఇష్టపడలేదు. కాలేజి వదిలేసిన సందర్భంలో ఆమె నుంచి లెక్కలేనన్ని ఉత్తరాలు – ప్రతి రోజులాగే వస్తున్నాయి. ఇంట్లో తనకు కలిగే కష్టాలు, పెడుతున్న హింస, బాధలు అన్నిటిని రాసేది. చదువుతుండగా దుఃఖించటం తప్ప వేరే ఏమీ చేయటానికి అతని వల్ల సాధ్యం కాలేదు. మహా అయితే ఉత్తరంలో నాలుగు సాంత్వనపు మాటలు రాసేవాడు, ఒకటి రెండు ప్రేమ మాటలు చేర్చేవాడు. అంతే.
ఈ మధ్య అతడిని బహీనపరిచే మూడు-నాలుగు ఉత్తరాలు ఆమె నుంచి వచ్చాయి. ‘నాకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. అడకత్తెరలో చిక్కుకున్నాను. అంగీకరించలేక, అంగీకరించకుండా ఉండలేక, సంకటంలో పడ్డాను. తొందరగా ఈ బందీఖనా నుంచి విడిపించు’ ఆ మొత్తం ఉత్తరాల సారాంశం.
“నేను నీ చేయి వదలను. కచ్చితంగా నిన్ను కాకుండా వేరే ఎవరినీ పెళ్ళిచేసుకోను. కాస్త ఓపికపట్టు. ఇక్కడ నా పరిస్థితి కూడా అలాగే ఉంది” అని అతను ఉత్తరం రాశాడు. మరొక ఉత్తరంలో, “ఇద్దరినీ ఇప్పటికే తిరస్కరించాను. ఇక ఏం చేయాలో తోచటం లేదు. అమ్మ, అన్నల అనుమానం పెరుగుతోంది. మొన్న నాకు పెళ్ళే వద్దన్నందుకు, “మళ్ళీ ఎవరిని ఇష్టపడ్డవే గాడిదా” అని తిట్టి అన్నయ్య కొట్టాడు. ఇంకా భరిస్తూ ఉండటానికి నాకు సాధ్యంకాదు. ఓర్పుకూ ఒక మితి ఉంటుందికదా. నా కృష్ణ ఎప్పుడు నా ముందు ప్రత్యక్షమవుతాడా అని ఎదురుచూస్తున్నాను. మీకు సమర్పించిన హృదయం మరొకరిని ఆశ్రయించలేదు. దానికన్నా ఆత్మహత్య మేలు!” అనీ దీర్ఘంగా తన బాధను చెప్పుకుంది.
“నేను నిన్నే పెళ్ళిచేసుకుంటాను. భయపడకు. నాకోసం ఎదురుచూడు. ఏదో ఒక రోజున నీ కృష్ణ నీ ముందు ప్రత్యక్షమవుతాడు. తొందరపడకు. ఓపికగా ఉండు. నేను ఎలాగూ డిగ్రీ చేశాను. ఉద్యోగం దొరనీ. తర్వాత ఎవరికీ భయపడను. ఇప్పుడు నా కాళ్ళ మీద నిలబడలేదు. ప్రతిదానికీ ఇంటివాళ్ళ మీదే ఆధారపడుతున్నాను. ఒక విధంగా నేను పరాన్నజీవిని. ఇలాంటి సందర్భంలో నేను నిన్ను ఎలా పెళ్ళిచేసుకోగలను. కష్టాల రోజులు గడిచి, సుఖపడే రోజులు తప్పకుండా వస్తాయి. అయితే అప్పటి వరకూ నీకు కలిగే హింసను భరిస్తూ నా కోసం ఎదురుచూడు” అని దుఃఖంతో అతను ఉత్తరం రాశాడు. పనికోసం అతను వందలాది చోట్ల దరఖాస్తులు పెట్టాడు. పోస్టాఫీస్ వారి స్టోర్ నింపడం తప్ప దానివల్ల ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఐదు నుంచి పదిహేను రూపాయల వరకు పోస్టల్ ఆర్డర్ పంపి ఇంటివాళ్ళ ఓపికను పరీక్షకు పెడతాడు. ఇంటివాళ్ళకూ అతని పట్ల ఇప్పుడిప్పుడు అతని మీద విసుగు వచ్చింది. అతని విద్యాభ్యాసాన్నీ, దురదృష్టాన్నీ, ప్రేమ ప్రకరణాన్నీ దూషించడం మొదలుపెట్టారు.
ఉద్యోగం.. ఉద్యోగం.. ఉద్యోగం.. అన్ని చోట్లా ప్రయత్నించాడు. మాలిని ఒత్తిడి విపరీతమైంది. అతని ఓపిన మంచుగడ్డలా నెమ్మదిగా కరిగిపోసాగింది. అతని భావనలన్నీ ఆరిపోయి, ఇంకిపోయే ముందు, మాలిని, అతని సహనం కరిగిపోయే ముందు అతనికొక ఉద్యోగం దొరకాలి. తర్వాత అతను, మాలిని కలిసి ప్రేమ స్వచ్ఛతను ప్రపంచానికి చూపించాలి. కొత్తదారిని వెతుకుతూ ఈ నీచ సమాజానికి బైబై చెప్పాలి – అని మనస్సు విప్పి అతను తనకు తాను చెప్పుకున్నాడు. నేనూ ‘అవునని’ అంటాను – ఎందుకంటే నాకు అతని వాదన వాస్తవమని అనిపిస్తుంది. పైగా అతను నా స్నేహితుడు, ఆప్త మిత్రుడు.
తుళు మూలం: డా. వసంత కుమార పెర్ల
అనువాదం: రంగనాథ రామచంద్రరావు