Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమ ఒక అద్భుతం

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన ఓట్ర ప్రకాష్ రావు గారి ‘ప్రేమ ఒక అద్భుతం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

వాసుమూర్తి, డిగ్రీ చదువుతున్నసమయంలోనే అమూల్యతో ప్రేమలో పడ్డాడు.

“పెళ్లి చేసుకోనేంతవరకు మన ప్రేమ బయటి వారికి తెలీయకూడదు. తెలిసిందంటే తప్పకుండా మన ప్రేమకు అడ్డు పడుతారు. మనం ఇలాపార్కులో కలుసుకోవడం చాలా ప్రమాదం.” అంది అమూల్య.

వాసుమూర్తి నవ్వాడు.

“అదేమిటి అలా నవ్వుతావు.” అడిగింది.

“అమూల్యా, మనం పెండ్లి చేసుకోవాలని నిర్ణయించాము. పెండ్లయ్యేంతవరకు మనం ప్రేమికులమే. అలాగని భయపడుతూ భయపడుతూ ప్రేమించుకోనక్కర్లేదు. అసలైన ప్రేమికుల్లాగా సరదాగా గడుపుదాం. మనం చెప్పడానికి ముందే తెలిసిందంటే ఇంకా సులభమవుతుంది. పెద్దలే పెండ్లి చేస్తారా, లేక మనమే ఎదిరించి చేసుకోవాలా అని నిర్ణయించుకొందాం.” అంటూ అమూల్య బుగ్గ మృదువుగా గిల్లాడు.

“చదువుకునే రోజుల్లోనే ప్రేమ కావలసివచ్చిందా అంటూ చింతకాయను దంచి పచ్చడి చేసినట్లు నన్ను పచ్చడి చేస్తారు.”

“చింతకాయ పచ్చడి పుల్లగా ఉంటుంది, నిన్ను పచ్చడి చేసినా తీయగా ఉంటావు.” అన్నాడు వాసుమూర్తి.

“నేను చాలా సీరియస్‌గా చెబుతుంటే నీకు వేళాకోళంగా ఉందా”

“మనం పెళ్లి చేసుకోవడం నిజం. ఆ పెళ్లి పెద్దల చేతులమీదనా లేక మనమే ఎదిరించి చేసుకొంటామా అన్నది కాలమే నిర్ణయించాలి.”

“మన పెండ్లి అయ్యేంతవరకు నాకు టెన్షన్‌గా ఉంటుంది. రాత్రివేళలో నాకు నిదుర సరిగ్గా రానంటోంది. ఈ టెన్షన్ తగ్గించుకొనడానికి రేపటి నుండి మెడిటేషన్ తరగతులకు వెళ్ళదలచుకొన్నాను” అంది అమూల్య.

ఆ ప్రేమికులిద్దరికీ నిదుర రాకపోవడంతో పాటు మనసులో ఒత్తిడి అధికం కావడం గుర్తించారు. పెళ్ళయేంత వరకు మెడిటేషన్ అభ్యసించాలనుకొన్నారు. అప్పుడే పట్టణములో వచ్చిన ఒక మెడిటేషన్ బృందం ప్రకటన చూసి చేరారు.

ధ్యానం నేర్పించే మాస్టారు ధ్యానం చేసే పద్దతి చెప్పారు.

“మా ఇద్దరికీ దేవుడు మీద నమ్మకం లేదు. కానీ మాలో ఒత్తిడి తగ్గించే మంచి ఆలోచన చెప్పండి” అనడిగారు.

“ప్రతి ఒక్కరి జీవితంలో పాజిటివ్, నెగటివ్ సంఘటనలు జరిగి ఉంటాయి. ఉదయం లేస్తూనే వ్యాయామం చేసిన తరువాత ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు నేను చెప్పిన మంత్రం చెప్పడానికి మీకు అభ్యంతరం అనిపిస్తే చెప్పనక్కరలేదు. మీ జీవితంలో జరిగిన పాజిటివ్ సంఘటనలను తలచుకోండి. ఆ తరువాత మీలో ఒత్తిడి తొలగిపోతుంది. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ధ్యానం సమయంలో నెగటివ్ సంఘటనలు తలచుకోకూడదు.” అన్నారు మాస్టారు.

***

వారం తరువాత మరలా ఇద్దరూ కలుసుకొన్నారు

“వాసూ, నా వలన కావడం లేదు. ఆయన చెప్పిన విధంగా ధ్యానం చెయ్యలేకపోయాను. సంతోషకరమైన సంఘటన తలచుకొన్నా వెనుకనే ఒక బాధాకరమైన సంఘటన గుర్తుకు వస్తూనే వుంది. నావల్ల కాదు అనుకోని మానేసాను”

“అమూల్యా నాకేమో ఆ ధ్యానంలో మంచి ఆనందం లభించింది”

“ఇంతకూ నీ జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఏమిటి?”

“నా జీవితంలో ఎన్నో సంతోషకరమైన సంఘటనలు వున్నా అందులో అత్యంత ఆనందకరమైనది ప్రేమికులుగా మనం గడిపిన సమయాలు.”

“మన ప్రేమ ఎదురుచూడని విధంగా విఫలమైతే?”

“విఫలం కావడానికి అవకాశం లేదు. ఒకవేళ జరిగినా ధ్యానం సమయంలో మనం సరదాగా గడిపిన సంఘటనలు మాత్రమే తలచుకొంటాను.” అన్నాడు.

కాలేజీ చదువుముగిసాక వాసుమూర్తి ఉద్యోగాల వేటలో భాగంగా హైదరాబాద్ వెళ్ళాడు. అప్పటికే ఆ ఇరువురి ఇండ్లలోని పెద్దవారికి వారి ప్రేమ గురించి తెలిసింది.

ఆరు నెలల తరువాత ఉద్యోగం సంపాదించి హైద్రాబాదునుండి తిరిగి వచ్చాడు.

సంతోషంతో ఊరికి వచ్చాక ఎదురు చూడని సంఘటన జరిగింది. అమూల్య వారి కుటుంబ సభ్యులు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు గుర్తించాడు. ఎక్కడకు వెళ్లారో అక్కడున్న ఇరుగు పొరుగు వారిని అడిగినా సమాధానము చెప్పలేకపోయారు.

ఈ ఊరు వదలి వెళ్ళడానికి ముందు ఎవరికీ తెలీకుండా అమూల్య వ్రాసి పోస్ట్ చేసిన ఉత్తరం వాసుమూర్తి తండ్రికి అందింది. కవరు చించి లోపలున్న ఉత్తరంలో చివరగా అమూల్య పేరు చూడగానే చదవకుండా ముక్కలుముక్కలుగా చించి పారవేసిన సంగతి ఎవరికీ తెలీదు.

వాసుమూర్తి ఆ తరువాత పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా వుండిపోదలచుకొన్నాడు. దేవదాసులాగా మారకపోయినా ఉదయం లేవగానే అమూల్యతో గడిపిన తీయని తలపులతో కొంతసమయం గడపడం అలవాటు చేసుకొన్నాడు.

కొడుకు పెళ్లి చేయలేకపోయామన్న బాధతోనే తల్లితండ్రులు మరణించారు.

హైదరాబాదులో వాసుమూర్తి చెల్లెలు శాంతికి ఇద్దరు ఆడపిల్లలు. శాంతి భర్త పనిచేస్తున్న కంపెనీ నష్టాలతో నడుస్తుండటం వలన వుద్యోగం వదులుకోవలసివచ్చింది. ఆ సమయంలో వాసుమూర్తి దైర్యం చెప్పి ఆ కుటుంబ బాధ్యతలు తనపై వేసుకొన్నాడు. శాంతి భర్తకు ఒక చిన్న అంగడి పెట్టించాడు. పెద్దగా లాభాలు రాకపోయినా కుటుంబఖర్చులకు సరిపోయేది. ఇతర ఖర్చులకు వాసుమూర్తి చూసుకునేవాడు. శాంతి కూతుళ్ళ పెండ్లిళ్లను తన ఖర్చు తోనే ఆడంబరంగా జరిపించాడు. తమ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకున్న వాసుమూర్తిని ఆ కుటుంబ సభ్యులందరూ కృతజ్ఞతతో, ఆత్మీయతతో, గౌరవంతో చూసుకునేవారు.

వాసుమూర్తి జీవితమంటేనే సులభంగా తీసుకునేవాడు. స్కూటర్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోడు. నడిపేటప్పుడు నిర్లక్ష్యంతో వేగంగా నడిపేవాడు. పదవీ విరమణ పొందిన కొద్దీ రోజులకు నిర్లక్ష్యంతో నడుపుతూ తలకు గాయం అయి మూడు రోజులు ఆసుపత్రిలో వుండవలసి వచ్చింది.

ఈ మధ్య వాసుమూర్తికి అల్జీమర్స్ వచ్చిందన్న సంగతి గుర్తించారు.

వినాయక చవితి రోజున మధ్యాహం భోజన సమయంలో గదిలోపల అన్నయ్యను చూస్తే కనబడలేదు. వణుకుతున్న గుండెతో వెతకసాగింది. వీధిలో చాలామందిని అడిగింది. వినాయకుడి ఊరేగింపులో చూసినట్లు చెప్పగానే, వేగంగా వినాయకుడి గుడి దగ్గరకు వెళ్లి, గుడిలో కూర్చొనివున్న అన్నయ్యతో “అన్నయ్యా” అంటూ బాధగా పిలిచింది.

“ఎవరమ్మా మీరు” అంటూ పలుకరించగానే శాంతి నిగ్రహించుకోలేక బోరుమని విలపించింది

మరుసటి రోజు డాక్టరు దగ్గరకు తీసుకొని వెళ్లారు. డాక్టరు అడిగిన ప్రశ్నలకు శాంతి దంపతులు సమాధానం ఇచ్చారు. ఆ తరువాత వాసుమూర్తితో కొంత సేపు మాట్లాడాడు. వాసుమూర్తికి అల్జీమర్స్ అని గుర్తించారు.

“అల్జీమర్స్ అంటే ఏమిటి డాక్టర్” అడిగాడు శాంతి భర్త.

“అల్జీమర్స్ వచ్చిన వ్యక్తులకు ఈ నాడీ సమాచార వ్యవస్థ పని చేయదు. ఒక్క మాటలో మీకు అర్ధమయ్యేలా చెప్పాలంటే మనం చనిపోయిన తరువాత మరో జన్మ లోనికి వెళ్తాము అని అంటాము. వాసుమూర్తి చనిపోకుండానే మరో జన్మలోనికి ప్రవేశించాడనుకోండి.”

“గుణపరిచే మందులే లేవా డాక్టర్” ప్రశ్నించింది శాంతి.

“ఈ వ్యాధి పూర్తిగా తగ్గడానికి మందులేదు.”

వాసుమూర్తిని చిన్న బిడ్డను చూసుకొంటున్నట్లు చూసుకోవాలని ఆ దంపతులు నిర్ణయించుకొన్నారు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఒక రోజు వాసుమూర్తి ఇల్లుదాటి వెళ్లడం గమనించలేదు. అన్నిచోట్లా వెతికినా వాసుమూర్తి కనబడకపోవడంతో కనబడకపోవడంతో భర్తతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది శాంతి.

***

తల్లితండ్రులు ఇలా చేస్తారని అమూల్య కలలో కూడా ఊహించలేదు. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం మీద తండ్రి ఉద్యోగానికి రాజీనామా చేసిన సంగతి అమూల్యకు తెలీదు. ఒకరోజు వున్నట్లుండి ఇల్లు ఖాళీ చేసి సొంత ఊరైన గ్రామానికి వారితో పాటు అమూల్యను తీసుకెళ్లారు. వాసుమూర్తికి చెప్పడానికి అవకాశం లేకపోయింది. ఇల్లు ఖాళీ చేయడానికి ముందు వివరంగా ఉత్తరం వ్రాసి చేతిలో ఉంచుకొని రైల్వే స్టేషన్ నందున్న పోస్ట్ బాక్స్ నందు వేసింది.

ఒకరోజు తనదగ్గర అనుమతి తీసుకోకుండానే పెళ్లి చూపుల ఏర్పాటు చెయ్యడం అమూల్యకు చాలా బాధ కలిగించింది. పెళ్ళికొడుకు కాస్సేపు మాట్లాడాలని అడుగగానే నిజం చెప్పాలని నిర్ణయించుకొంది.

ఇద్దరినీ పెరటి వైపు వెళ్తామన్నారు.

“క్షమించండి నేను ఒకరిని ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలనుకొన్నాను. మన కులం కాదంటూ.. వున్నట్లుండి ఇక్కడకు తీసుకొని వచ్చి.. ఆరునెలలు గడిచింది. అతనికి వుద్యోగం దొరికిందో లేదో ఇంకా తెలీదు.” అంది.

“నాదీ నీలాంటి కథ. మా ఇంట్లో వారు అంగీకరించలేదు. మొదట పెళ్లి చేసుకోకూడదనుకొన్నాను. చివరకు మా అమ్మ ఆత్మహత్య చేసుకొంటాను అంటూ బెదిరించడంతో అంగీకరించాను. నీ ప్రేమ విషయం నిర్భయంగా చెప్పడం నాకు నచ్చింది. నీకిష్టమైతే నిన్ను చేసుకొంటాను” అన్నాడు.

ఒక శుభముహూర్తాన వివాహం జరిగింది.

అమూల్యకు కొడుకు పుట్టాడు. కొడుకు మొదటి తరగతి చదువుతున్నప్పుడు భర్త ప్రమాదంలో చనిపోగానే ప్రైవేటు ఆసుపత్రిలో పని చేసిన భర్త ఉద్యోగాన్ని అమూల్యకు ఇచ్చారు. అరవై సంవత్సరాలు పూర్తయినా ప్రైవేటు ఆసుపత్రి అయినందువలన అమూల్య ఇంకా పని చేయసాగింది.

***

వాసుమూర్తి ట్రైన్ ఎక్కాడు. కొంత సమయం తరువాత ఒక స్టేషన్ నందు ట్రైను నిలబడింది. ప్లాట్‌ఫారం మీదున్న కొళాయిని చూడగానే నీరు తాగాలనిపించి ట్రైను దిగాడు. నీరు తాగుతున్న సమయాన కదులుతున్న ట్రైను వైపు మామూలుగా చూసాడు.

ట్రైను వెళ్ళాక ప్లాట్‌ఫారం మీదున్న బెంచిపైన కూర్చొని శూన్యంలో చూడసాగాడు.

కొంత సమయం గడిచాక అదే బెంచీలో మరో చివర కూర్చొన్న ఆమె ఏడుస్తుండటం గమనించాడు “ఎందుకేడుస్తున్నారు” అంటూ అడిగాడు.

తలయెత్తిన అమూల్యను చూడగానే “మీరు.. నీవు అమూల్య కదూ, నేను.. నేను” అనబోతూ తన పేరు మరచిపోయాడు.

“వయసు మార్పులు తెచ్చినా, నీ ముఖంలో మార్పు లేదు. వాసూ” అంటూ దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొంది.

“ఎలావున్నావు అమూల్యా” అడిగాడు.

“ఒంటరిగా బాధతో ఏడుస్తూ కూర్చోన్నాను”

“ఎందుకూ”

“ఒకరోజు నా కొడుకు ఎవరినో ప్రేమించాను అంటూ చెబితే, మన ప్రేమను మన ఇంటి పెద్దలు వ్యతిరేకించినట్లు నేను వ్యతిరేకించకుండా సంతోషంతో దగ్గరుండి వివాహం జరిపించాను.”

“వెరీ గుడ్. చాలా మంచి పని చేసావు అమూల్యా”

“పెళ్లయ్యాక వాడిలో మార్పు వచ్చింది. వాడి భార్య మాట విని నన్ను ఇంటినుంచి బయటకు..” బాధను బలవంతంగా దిగమింగుకొని మరలా “నేను పనిచేస్తున్న ఆసుపత్రి దగ్గర ఒక ఇల్లు బాడుగకు తీసుకొని నివసిస్తున్నాను. ఇంతకు మునుపు నా కొడుకు, కోడలు. మనవడు ఇలా వెళుతూ నన్ను చూసి చూడనట్లు వెళ్తుంటే పిలిచాను. నా పిలుపును పట్టించుకోకుండా వేగంగా వెళ్లారు..” అంటూ బోరుమని విలపించింది.

వాసుమూర్తి సముదాయించాడు. అమూల్య కళ్ళు తుడుచుకొంది.

“ఇంతకూ నీవు ఇక్కడ..” అడిగింది

“ఔను నేను ఇక్కడ ఎందుకున్నాను” అనగానే అమూల్యలో చిన్న అనుమానము కలిగింది.

న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ నిహారిక దగ్గరకు వచ్చే మెడికల్ రిపోర్టులు ఎన్నో తయారు చేసిన అనుభవం ఉండటం వలన వాసుమూర్తికి అల్జీమర్స్ వ్యాధి ఉందని గుర్తించింది.

మరుసటి రోజు ఉదయమే దినపత్రికలో అల్జీమర్స్ వ్యాధి గల వాసుమూర్తి తప్పిపోయిన ప్రకటనను అమూల్య చూసింది.

***

తన ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టరు నిహారిక దగ్గరకు తీసుకెళ్లింది అమూల్య.

డాక్టరు అడిగిన ప్రశ్నలకు వాసుమూర్తి ఓపికగా సమాధానం ఇచ్చాడు.

“వాసూ నీవు ఆ మూల కూర్చో”అని చెప్పగానే మూలగానున్న కుర్చీలో కూర్చొన్నాడు.

“ఊరి పేరు, ఎందుకొచ్చావు అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినా. అప్పుడు కమలహాసన్ మరోచరిత్ర సినిమాకు వెళదామని నేను బలవంతం చేస్తే ఆ సినిమాలో ప్రేమికులు విడిపోతారు వద్దు అంటూ రెండవసారి శంకరాభరణం సినిమాకు తీసుకెళ్ళావు. నీవు బయపడినట్లే మన ప్రేమ ఫెయిల్ అయింది. మనం కలసి తిరిగిన స్థలాలు, సంఘటనలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. నాకు తీరిక దొరికినప్పుడంతా నీ ఆలోచననలతో గడుపుతుంటాను, అంటుంటే నేను బొమ్మలాగా నిలబడి పోయాను. అల్జీమర్స్ వున్నా నా జ్ఞాపకాలు మాత్రం అలాగే వుంది.” అంది అమూల్య

“అతను నిన్ను ఇంకా గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఇప్పటికీ ప్రతిరోజూ ఉదయం లేవగానే నీ ప్రేమ తాలూకు జ్ఞాపకాలు నెమరువేసుకొనే అలవాటుంది. అందుకే అంతటి అల్జీమర్స్ లోనూ మీప్రేమ తాలూకు సంఘటనలు ఇంకా గుర్తుంచుకొన్నారు. ఒక్క మీ ప్రేమ సంఘటనలు తప్ప మిగతావన్నీ మరచిపోయాడు, మీరు పెళ్లి చేసుకొంటారో లేక ప్రేమికులుగా జీవిస్తారో అది మీ ఇష్టం. అల్జీమర్స్ నుండి పూర్తిగా గుణం పొందడం మీ చేతుల్లో వుంది. అతనికి మందులు మాత్రలు అక్కరలేదు. మీ ప్రేమను చూస్తుంటే ఒక అద్భుతం లాగుంది. అల్జీమర్స్ కూడా మీ ప్రేమ ముందు తలవంచింది.” అంది డాక్టరు నిహారిక .

“నా కోసం ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా.. అందుకే.. బాగా అలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. రేపు ఉదయం గుడిలో మా పెళ్లి. మన ఆసుపత్రిలో ముఖ్యమైన వారిని మాత్రం పిలువదలచుకొన్నాను. ఇక్కడకు రావడానికి ముందు ఆయన చెల్లెలుతో మాట్లాడాను. మా పెళ్లి ముందుండి జరిపిస్తామన్నారు.” అంది అమూల్య.

Exit mobile version