[డా. రాయపాటి కార్తీక్ రచించిన ‘ప్రేమ కోసం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. వార్తలు చూద్దామని కార్తీక్ టీ.వి. ఆన్ చేసాడు. ఒక ఛానెల్‌లో స్వామీజి గారి ప్రవచనాలు ప్రసారం అవుతున్నాయి.
“ఒక వ్యక్తిని లేదా వస్తువుని కోరుకోవడం చాలా సులభం. కానీ ప్రయత్నించి సాధించడం చాలా కష్టం. మనం ప్రయత్నించేటప్పుడు సులభమైన దారి, కష్టమైన దారి ఈ రెండు దారులు కనిపిస్తాయి. సులభమైన దారిలోకి వెళ్తే వచ్చే ఫలితాలు..”
ఇంతలో గౌతమ్ నుండి ఫోన్ వచ్చింది.
“హలో గౌతమ్ చెప్పరా!”
“కార్తీక్ వెంటనే రోడ్ నం 72లో ఉన్న అపోలో హాస్పిటల్కి రా” అని కారణం అడిగే లోపే ఫోన్ పెట్టేశాడు.
కార్తీక్ వెంటనే హాస్పిటల్‌కి చేరుకున్నాడు. గౌతమ్ ముఖంలో జీవం లేదు. కార్తీక్‌ని చూడగానే పట్టుకొని బోరున ఏడ్చేశాడు. కొంచెం తేరుకొని అసలు కారణం చెప్పాడు.
“వినీత ఆత్మహత్య చేసుకుంది రా. ఎందుకు జరిగిందో అసలు అర్థం కావట్లేదు. నిన్నటి దాకా బానే ఉంది. నేను ముంబయి నుండి సాయంత్రం వచ్చి చూసే సరికి రూమ్‍లో పడిపోయి ఉంది. పక్కనే టేబుల్ పైన నిద్ర మాత్రలు ఉన్నాయి. డాక్టర్ కూడ నిద్ర మాత్రలు తీసుకోవడం వలన ఇలా జరిగిందని చెప్పారు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు”.
వినీతకి గౌతమ్‌కి పెళ్ళయి ఒక నెల కూడా కాలేదు. వాళ్ళిద్దరు దూరపు బంధువులు. గౌతమ్, కార్తీక్ చాలా కాలంగా ఒకే కాలనీలో ఉంటున్నారు. కార్తీక్ జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సి.ఐ.గా పని చేస్తున్నాడు.
“హలో మోహన్! నువ్వు వెంటనే అపోలో హాస్పిటల్కి రా. ఎమర్జన్సీ కేస్” అని కార్తీక్ ఎస్.ఐ.కి ఫోన్ చేసి చెప్పాడు.
ఎస్.ఐ. మోహన్ వచ్చి గౌతమ్ దగ్గర అన్ని వివరాలు తీసుకున్నాడు. గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని కోణాల నుంచి పోలీసులు ఫోటోలు తీసుకున్నారు. టేబుల్ పైన నిద్రమాత్రల సీసాతో పాటు బ్లాక్ టీ సగం వరకు ఉన్న కప్పు కూడా ఉంది. నిద్రమాత్రలు బ్లాక్ టీలో కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకుందని నిర్దారించారు.
***
“ఎంతో ఆహ్లదంగా ఉన్న జీవితం ఒక్కసారిగా చీకటితో నిండిపోయింది. తను ఆత్మహత్య చేసుకుందంటే నాకు అసలు నమ్మశక్యంగా లేదు. అలా చేసుకోవడానికి కారణం కూడ కనిపించట్లేదు. అంతా నా ఖర్మ” అని గౌతమ్ కార్తీక్‌తో చెప్పి బాధపడుతున్నాడు.
ఆ సంఘటన జరిగి వారం రోజులు అయింది. గౌతమ్‌ని ఓదార్చడం ఎవరి వల్ల కావట్లేదు. ఎంతో ఇష్టపడి పెళ్ళి చేసుకున్న అమ్మాయి పెళ్ళి అయిన నెల రోజులకి ఆత్మహత్య చేసుకోవడం కంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉండదు.
“గౌతమ్ సర్ మిమ్మల్ని కలుసుకోవడానికి ఎవరో వచ్చారు” అని అటెండర్ వచ్చి చెప్పాడు. ఇంతలో వేరే పని ఉండటంతో కార్తీక్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. కార్తీక్ వచ్చేసరికి గౌతమ్ ఆ వచ్చిన వ్యక్తిని గట్టిగా హత్తుకొని ఏడుస్తున్నాడు.
“హలో! నా పేరు అర్జున్. నేను బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. రెండు రోజుల ముందే హైదరాబాద్ బదిలీ అయ్యింది. నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాతే ఈ విషయం గురించి తెలిసింది” అని అర్జున్ కార్తీక్‌తో పరిచయం చేసుకున్నాడు.
“అవును! మీరు గౌతమ్ కి మంచి స్నేహితుడని అంటున్నారు. మరి గౌతమ్ పెళ్ళికి మీరు వచ్చిన్నట్లు లేదే” అని కార్తీక్ అడిగాడు.
“నాకు గత నెల నుంచి కొత్త ప్రాజక్ట్ వచ్చింది. దాని గొడవలో పడి పెళ్ళికి రాలేకపోయాను. నిజం చెప్పాలంటే పోయిన సంవత్సరం నుంచి గౌతమ్‌ని కలవడం ఇదే మొదటిసారి. ఎన్నోసార్లు కలవాలనుకున్న కుదరలేదు.”
ఇలా వాళ్ళు మాట్లాడుకుంటుండగా గౌతమ్ తన ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు. జీవితంలో తనకంటూ ఏమి లేదన్నట్లు శూన్యం లోకి చూస్తున్నాడు.
“గౌతమ్! జరిగిన విషయం గురించి మనం చేసేదేమి లేదు. నువ్వు త్వరగా కోలుకోవడానికి ప్రయత్నించరా. నువు ఇలా ఉండటం నాకు అసలు ఇష్టం లేదు” అని అర్జున్ ఓదారుస్తున్నాడు.
గౌతమ్ ఏం మాట్లడలేదు. మౌనంగా ఉన్నాడు.
“మూడు రోజుల నుంచి గౌతమ్ ఆఫీస్‌కి కూడా రావట్లేదు. మెసేజ్‍లకి కూడా సమాధనం ఇవ్వట్లేదు. ఆఫీసులో లీవ్‌కి కూడా అప్లయి చేయలేదు. ఇలా అయితే కష్టం” అని గౌతమ్ వాళ్ళ మేనేజర్ కార్తీక్‌కి ఫొన్ చేసి చెప్పాడు. కార్తీక్ వెంటనే అర్జున్‌కి ఫోన్ చేసాడు. నాతో కూడ ఏం చెప్పలేదని అర్జున్ చెప్పాడు.
కార్తీక్, అర్జున్ కలిసి గౌతమ్ ఇంటికి వెళ్ళారు. గౌతమ్ ఇంటి బాల్కనీలో కూర్చుని ఏదో తీక్షణంగా ఆలోచిస్తున్నాడు.
“ఏరా! ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావ్. ఆఫీసుకి కూడా వెళ్ళట్లేదంట. ఇలా ఉంటే ఎలా రా?” అని అర్జున్ నిలదీసాడు.
“నాకు వినీత చనిపోవడానికి కారణం తెలుసుకోవాలని ఉందిరా. గత రెండు రోజుల నుంచి ఈ విషయం గురించే ఆలోచిస్తున్నాను. మా ఇద్దరికీ గత ఆరు నెలల నుంచి పరిచయం ఉంది. పెళ్ళయి నెల రోజులు అయ్యింది. కుటుంబపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఏ సమస్యలు లేవు. ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవడం అంటే సాధారణమైన విషయం కాదు. ఒక సమస్యని ఎవరితోను పంచుకోలేక తమ లోపల తామే మథనపడుతూ కొన్నాళ్ళు చస్తూ బ్రతుకుతూ చివరికి ఏ దారి లేక చనిపోదామనే నిర్ణయానికి వస్తారు. అందుకే తను చనిపోవడానికి కారణమేమిటో తెలుసుకోవాలని ఉంది”.
“ఇదేమైన సినిమా అనుకుంటున్నావా? దీని కోసం పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాలి. లేనిపోని మాటలు పడాలి. నువ్వు కారణం తెలుసుకున్నంత మాత్రాన చనిపొయిన మనిషి తిరిగి వస్తుందా? నాకైతే అనవసరమనిపిస్తుంది” అని అర్జున్ అన్నాడు.
“నువ్వు ఆగు రా! కార్తీక్ నువ్వు చెప్పు. నేను చేయాలనుకుంటున్నది కరెక్టా కాదా?”
“మనం ఇష్టపడిన మనిషి చనిపోవడానికి గల కారణం తెలుసుకోవడంలో తప్పు లేదు. నిజం చెప్పాలంటే ఈ పరిస్థితి నాకోస్తే నేను అలానే చేస్తాను. ఖాళీగా కూర్చొని బాధపడటం కంటే ఇదే ఉత్తమమైన పని” అని కార్తీక్ అన్నాడు.
వెంటనే గౌతమ్ వెళ్ళి ఎవరికో ఫోన్ చేసాడు.
“ఏంటి కార్తీక్? మీరు కూడా గౌతమ్‌కి సపొర్ట్ చేస్తున్నారా? ఈ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటే వాడు ఎలా కోలుకుంటాడు? ఒక వేళ నిజంగానే వినీత చనిపోవడానికి కారణం తెలిసిన వాడు ఏం చేస్తాడు? తనను కాపాడులేకపొయాననో లేదా తన సమస్య తీర్చలేకపోయాననో ఇంకా ఎక్కువ బాధపడతాడు”.
“గౌతమ్ కాపాడలేకపోవడం వలనే వినీత చనిపోయిందని మీరు ఎందుకు అనుకుంటున్నారు?”
“నేను ఏదో క్యాజువల్‌గా అన్నాను. అయినా మీరేంటండి! నన్ను అనుమానిస్తున్నారు” అని నవ్వాడు. ఇంతలో గౌతమ్ వచ్చాడు.
“ఈ కేసు విషయంలో మనకి సహాయం చేయడానికి ఒక లాయర్‌తో మాట్లాడాను. అందరం రేపు సాయంత్రం ఇదే సమయానికి కలుద్దాం” అని గౌతమ్ చెప్పాడు.
***
విశాఖపట్నం బీచ్ రోడ్! గోధుళి వేళ!!
అప్పటి వరకు తన ప్రతాపం చూపించిన భానుడు ఈ రోజుకి ఇక చాలన్నట్లు విశ్రమిస్తున్నాడు. రోజంతా ఎక్కడెక్కడో విహరించిన ప్రేమ పక్షులు సేదతీరడానికి ఈ ప్రదేశానికి వస్తున్నాయి.
“విన్ను! నీతో జీవితాంతం ఇలానే నడవాలనిపిస్తుంది”.
“జీవితాంతం నడిస్తే కాళ్ళు నొప్పులొస్తాయి అర్జున్. ఎక్కడైనా కూర్చుందామా?”
“నీకు ప్రతిదీ వెటకారమే! నేను చెప్పే విషయాలు ఒక్కసారైన సీరియస్‌గా తీసుకున్నావా?”
“సరే. ఇప్పుడు చెప్పు. సీరియస్‌గా వింటాను”
“నీ గురించి ఒక కవిత రాసాను విన్ను. అది చెప్తాను విను. ‘నీ మాయలో పడి ఈ ప్రపంచాన్ని ముఖ్యంగా నన్ను నేను మరచిపోయాను. నీ చూపు కోసం ఒక వెయ్యి సంవత్సరాలు నిరీక్షిస్తాను. ఈ నిరీక్షణలో ప్రతి క్షణం నిన్ను నేను తలచుకుంటూ గడిపేస్తాను’. ఎలా ఉంది?”.
“కాళ్ళరిగేలా తిరగడాలు, మొహంలో మొహం పెట్టి చూడటమేనా? సంపాదించడానికి ఏమైనా చేస్తావా?”
“ముందు చదువు పూర్తి చేస్తా. ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తా. అప్పుడు పెళ్ళి చేసుకుని స్థిరపడదాం”
“అర్జున్! నువ్వు నాకు రాసిన లవ్ లెటర్ గుర్తుందా?”
“ఏయ్ విన్ను! ఎందుకు అలా నవ్వుతున్నావ్?”
అర్జున్‌కి సడెన్‌గా మెలకువ వచ్చింది. పదే పదే వినీత గుర్తుకొస్తుంది. వాళ్ళు ప్రేమించుకున్న విషయం ఎవరికీ తెలీదు. గౌతమ్‌కి చెప్పడానికి చాలా సార్లు ప్రయత్నించాడు. కానీ ఎందుకో ధైర్యం సరిపోలేదు. ఏదో తప్పు చేస్తున్నమనే భావన రోజు రోజుకి ఎక్కువవుతుంది.
***
కార్తీక్ వెళ్ళేసరికి గౌతమ్, అర్జున్ ఏదో మాట్లాడుకుంటున్నారు. ప్రక్కనే ఎవరో అమ్మాయి కూర్చొని ఉంది.
“కార్తీక్, తన పేరు దివ్య. వినీత వాళ్ళ కజిన్. ఢిల్లీలో లాయర్‌గా పని చేస్తుంది” అని గౌతమ్ పరిచయం చేసాడు.
“హలో కార్తీక్! మీ గురించి గౌతమ్ చెప్పాడు. ఎలా ఉన్నారు?”
ఇంతలో వెయిటర్ వచ్చాడు. అందరు కాఫీ ఆర్డరు చేసారు.
“నాకు కాఫీ వద్దు. నేను బ్లాక్ టీ తాగుతాను” అని అర్జున్ చెప్పాడు.
“సారీ సార్! ఇక్కడ బ్లాక్ టీ దొరకదు” అని వెయిటర్ సమాధానమిచ్చాడు.
“పర్లేదు. నాకు వాటర్ చాలు”
వెయిటర్ ఆర్దర్లు తీసుకుని వెళ్ళిపోయాడు.
“అదేంటి అర్జున్! ఏదో ఒకటి తాగచ్చు కదా” అని కార్తీక్ అడిగాడు.
“నాకు టీ కాఫీలు అలవాటు లేదు. నేను బ్లాక్ టీ మాత్రమే తాగుతాను.”
“వాడు చిన్నప్పటి నుంచి అంతే. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువ. మనుషులు తినేవి ఏవి వాడికి నచ్చవు” అని గౌతమ్ నవ్వాడు.
“నువ్వేమన్నా తక్కువా? నీకు కూడా మనుషులు తినే గడ్డి ఏది నచ్చదు కదా” అని దివ్య అడిగింది.
“మీ ఇద్దరికి ముందు నుంచే పరిచయం ఉందా? మరి నేనేప్పుడు దివ్యని చూడలేదే?” అని అర్జున్ అడిగాడు.
“దివ్య నాకు కామన్ స్నేహితుల ద్వారా పరిచయం. అప్పుడప్పుడు పార్టీలలో, ఫంక్షన్లలో కలుసుకునేవాళ్ళం. దివ్య వలనే నాకు వినీత పరిచయమైంది. కానీ ఏదో పని ఉండటం వలన మా పెళ్ళికి రాలేదు. తర్వాత ఎప్పుడైనా వీలు చూసుకొని వస్తానంది. కానీ ఇంతలో..” అని చెప్తున్న గౌతమ్ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. నోటి నుంచి మాట రావటం లేదు.
“కార్తీక్ గారు! మీకు ఎంత మంది పిల్లలు?” దివ్య టాపిక్ మార్చటానికన్నట్లు అడిగింది.
“నాకు ఇంకా పెళ్ళి కాలేదండి”
“అదేంటి? ఎవర్నైనా ఇష్టపడ్డారా?”
కార్తీక్ అవునన్నట్లూ తలూపాడు.
“ఇంకేటండీ సమస్య? పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదా? కులం సమస్యా?”
“అదేం లేదండి?”
“మరీ ఇంకెవరు ఒప్పుకోవట్లేదు?”
“నేను ఇష్టపడిన అమ్మాయి ఒప్పుకోవట్లేదు”
అందరూ నవ్వారు.
***
వినీత కేసు విషయం ముందుకు సాగట్లేదు. కార్తీక్ తన రూమ్ లో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఏవో కాగితాలు పట్టుకొని మోహన్ వచ్చాడు.
“సర్! వినీత గారి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరి దగ్గరి నుంచి వివరాలు సేకరించాం. ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి గల కారణాలు ఏవి కనిపించటం లేదు. ఈ కేసు మనం వేరే కోణంలో ఎందుకు ఆలోచించకూడదు?”
“అంటే?”
“హత్య అని ఎందుకు దర్యాప్తు చేయకూడదు సర్?”
“వినీత ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని డాక్టర్స్ చెప్పారు. మనం రిపోర్ట్స్ కూడా రాసుకున్నాము. సర్! ఎవరినీ అడిగినా సరే వినీత గారు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వ్యక్తి కాదనీ అయినా అలా చేసుకునేంతా అవసరం ఆమెకి లేదని చెప్తున్నారు.”
“మోహన్ నీకోక విషయం చెప్పమంటావా? మనకి మనుషులు బయటకి ఎంత గంభీరంగా కనిపించినా లోలోపల కొన్ని భయాలు, బాధలు అందరికి ఉంటాయి. అవి మన స్థాయిని దాటినప్పుడు, మనం ఏం చేసిన అవి తగ్గవని తెలిసినప్పుడు మనిషి ఆత్మహత్య చేసుకుంటాడు. ఒక సమస్య వచ్చి నప్పుడు దాని పరిష్కారం కోసం అన్ని విధాలా ప్రయత్నిస్తాం. అన్ని దారులు మూసుకుపోయినప్పుడు మిగిలే చివరి దారి ఆత్మహత్య”.
“సరే సర్! నాకు అనిపించింది నేను చెప్పాను. అసలు విషయం మర్చిపోయాను. మనల్ని ఎస్.పి. గారు శశికళ ఆడిటోరియంకి రమ్మన్నారు. అక్కడ ఎవరో స్వామీజిది ప్రసంగం అట”.
ఈ ప్రసంగాలు ఎవరికీ తప్పినా మనకి తప్పుతాయా అనుకుంటూ ఇద్దరు బయలుదేరారు.
“మనిషి జాతి పుట్టుక నుంచి మరణం దాకా అనేక సమస్యలని ఎదుర్కోంటాడు. వాటి నుంచి పారిపోవడానికి ఆత్మహత్య అనే సులభమైన మార్గాన్ని ఎంచుకుంటాడు. ముఖ్యంగా రెండు కారణాల వలన మనిషి ఆత్మహత్య చేసుకుంటాడు. మొదటిది ఈ ఆధునిక యుగంలో మనిషిని పీడిస్తున్నది. అదే డబ్బు. మనిషి తన అవసరాల కోసమో డబ్బు కోసమో అప్పులు చేసి అది తన స్థాయిని దాటినప్పుడో, అన్ని దారులు మూసుకుపోయినప్పుడో ఆత్మహత్య చేసుకుంటాడు. రెండవది పరువు. ఈ సమాజంలో ఎంతో పేరు ప్రతిష్ఠలు, డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం. మనిషికి ఒక సమస్య వచ్చినప్పుడు, దానిని పంచుకోవడానికి ప్రేమించేవాళ్ళు కరువైనప్పుడో, ఇతరులతో పంచుకోవడానికి ఆత్మాభిమానం అడ్డు వచినప్పుడో ఏ పరిష్కారం దొరక్క జీవితాన్ని వదిలేస్తున్నారు. ఈ కారణంతో చనిపొయేవాళ్ళు తమ సమస్యని ఎవరితోను పంచుకోలేక, తమలో తామే కుమిలిపోయి చివరికి ఆత్మహత్యకి పాల్పడతారు.”. ..ఇలా ప్రసంగం సాగుతుంది. ఇక తర్వాత మాటలేవి కార్తీక్ పెద్దగా వినిపించుకోలేదు. ప్రసంగం అయిపోయిన తర్వాత కార్తీక్, మోహన్ ఇద్దరు కలిసి జీపులో బయలుదేరారు.
“ఏంటి సర్? మీరు గురుజీ ప్రసంగాలు ముందే విన్నారా? ఉదయం మీరు చెప్పింది ఇప్పుడు ఆయన చెప్పింది ఒకటే కదా!”
అదేం లేదన్నట్లు కార్తీక్ నవ్వాడు.
***
“మోహన్, నేను రెండు రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. నాకు ఎందుకో హత్య అనే కోణం నుంచి దర్యాప్తు చేద్దామనిపిస్తుంది. నాకు కొన్ని ఆధారాలు దొరికాయి. కానీ అవేవి వినీతది హత్య అని నిరూపించడానికి సరిపోవు” అని కార్తీక్ అన్నాడు.
“సర్! వినీత గారిని గౌతమ్ హత్య చేసాడనే కోణం నుంచి మనం ఎందుకు ఆలోచించకూడదు? వినీత గారు చనిపోయిన రోజు తను ముంబయి వెళ్ళాడని అందరినీ నమ్మిస్తుండచ్చు కదా. అదీ గాక ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేవి మనకు కనిపించడం లేదు. కేవలం ఆధారాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అవి కూడా సృష్టించినవి కావచ్చు, నేను ఒక విషయం అడగవచ్చా మిమ్మల్ని?”
“చూడు మోహన్! నేను నా స్నేహితుడని గౌతమ్‌కి అనూకులంగా వ్యవరించడం లేదు. వినీత ఆత్మహత్య చేసుకుందని ఆధారాలు కనిపిస్తున్నాయని నువ్వే చెబుతున్నావు. మనకి కావాల్సింది కూడా ఆధారాలే, కారణాలు కాదు”.
“సారీ సర్! నేను అనవసరంగా నోరు జారాను”.
“పర్లేదు మోహన్”
ఆ రోజు ఇంటికి చేరుకున్న తర్వాత కార్తీక్ కి మోహన్ చెప్పిన విషయాలే గుర్తుకురాసాగాయి. ఈ విషయం గురించి ఒకసారి దివ్యతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు.
***
“హాయి దివ్య! కూర్చోండి”.
“హలో కార్తీక్!”
“మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఫోన్లో కంటే డైరెక్ట్‌గా మాట్లాడటమే మంచిదని ఇక్కడికి రమ్మన్నాను”.
“చెప్పండి ఏ విషయం గురించీ?”
“మేము వినీత కేసులో హత్య కోణం నుంచి దర్యాప్తు చేస్తున్నాము. ఈ విషయంలో మీరు మాకు కొంచెం సహాయం చేయాలి. అది కూడా ఒక లాయర్‌లా, గౌతమ్ ఫ్రెండ్‌లా కాదు”
“అంటే?”
“మీకు గౌతమ్, వినీతలు చాలా కాలం నుంచి తెలుసు. వాళ్ళ గురించి మీకు తెలిసిన అన్ని విషయాలు చెప్పాలి. ఏ చిన్న విషయం అయినా ఈ కేసు ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడచ్చు”.
ఇంతలో మోహన్ వచ్చాడు.
“సర్! ఈ కేసు గురించి ఒక ముఖ్యమైన క్లూ దొరికింది. మీతో కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలి” అని దివ్య ముందు చెప్పడానికి సంశయిస్తున్నాడు.
“పర్లేదు మోహన్! దివ్య కూడా మనకి ఈ కేసులో హెల్ప్ చేస్తుంది”.
“సర్! వినీత గారు చనిపోయిన రోజు మొత్తం గౌతమ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఏ కాల్ రిసీవ్ చేసుకోలేదు”.
అది విని కార్తీక్, దివ్య ఆశ్చర్యపోయారు
“మోహన్ గారు! గౌతమ్ ఆ రోజు ఆఫీస్ పని మీద ముంబయి వెళ్ళానని అన్నాడు. మీటింగ్‌లో ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండచ్చు కదా” అని దివ్య అన్నది.
“నిజమే మేడమ్! నేను మొదట అలాగే అనుకొని పట్టించుకోలేదు. కానీ గౌతమ్ వినీత గారు చనిపోయిన ముందు రోజు నైట్ ముంబయి వెళ్ళానని చెప్పాడు. కానీ వినీత గారు చనిపోయిన రోజు కూడా హైదరాబాద్ లోనే ఉన్నాడు. వేరే కేసులో భాగంగా నోవాటెల్ హోటల్‌కి వెళ్ళినప్పుడు సి.సి.టి.వి ఫుటేజిలో చూసాను. ఆ ముందు రోజు హోటల్ కి వెళ్ళి ఉదయాన్నే బయటకి వచ్చాడు” అని ఫొటోలు చూపించాడు.
“అంటే గౌతమ్ హోటల్ నుంచి నేరుగా ఇంటికి వెళ్ళి వినీతని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉండవచ్చు. మనం ఈ కేసుకి సంబంధించిన బలమైన ఆధారాలు సేకరించి గౌతమ్ నోటితోనే నిజం చెప్పిద్దాం. నువ్వు దివ్యని ఇంటి దగ్గర వదిలి పెట్టి రా” అని కార్తీక్ అన్నాడు.
“అలాగే సర్” అని మోహన్ సమాధానమిచ్చాడు.
***
“హలో కార్తీక్! ఈ కేసుకి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలిసాయి. ఎక్కడికి రమ్మంటారు?” అని దివ్య కార్తీక్‍కి ఫోన్ చేసింది.
“నేను స్టేషన్ లోనే ఉన్నాను. ఇక్కడికి రండి”.
“ఇది కొంచెం ముఖ్యమైన విషయం. స్టేషన్‌లో కాకుండా బయటా ఎక్కడైనా కలవడం బెటర్”.
“సరే రోడ్ నెం.8 లో ఉన్న కాఫీ షాప్‌లో కలుద్దాం”
“ఓకె! పది నిమిషాల్లో అక్కడికి వస్తాను”.
కార్తీక్ వెళ్ళగానే దివ్య ఒక లెటర్ ఇచ్చింది.
“మెసేజ్‌లు, మెయిల్స్ ఉన్న ఈ రోజుల్లో కూడా నీకు లెటర్ రాయడం అంటే కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. మన భాషలో, మనదైన వాక్యాలతో మనసులోని భావాలని వ్యక్తీకరించడంలో వచ్చే ఆనందమే వేరు. నేను ఈ లెటర్ రాయడానికి కారణం నువ్వు నా ప్రేమని అంగీకరించి ఈ రోజుకి ఏడాది గడిచింది. అంటే మన ప్రథమ ప్రేమ వార్షికోత్సవం. నీ మీద నాకున్న ఇష్టాలు, నీ వల్ల కలిగిన అనుభూతులు, నీకు చెప్పలేకపోయిన విషయాలు ఈ లెటర్ ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మొదటి చూపులోనే ప్రేమ కలగడం అనేది నేను పెద్దగా నమ్మను. ప్రేమలో పడటం అనేది బహుశా మన చేతుల్లో ఉండదు. ఒక వ్యక్తిని చూసి, సెలక్ట్ చేసుకుని వీళ్ళతోనే ప్రేమలో పడాలి అని మనం అనుకోలేము. ఒక వ్యక్తితో స్నేహం చేసి, కొన్నాళ్ళు వాళ్ళతో సమయం గడిపిన తర్వాత కలిగే ఓ అందమైన అనుభూతి ప్రేమ. నాకు నీతో అలానే జరిగింది.
నువ్వు ప్రతి రోజు సాయంత్రం మూడు మూడున్నర మధ్యలో మా డిపార్ట్‌మెంట్ మీదుగా హాస్టల్‌కి వెళ్ళేదానివి. అప్పుడే మొదటిసారి నిన్ను చూసాను. ఆ తర్వాత ఎందుకో గానీ నిన్ను రోజు చుడాలి అని అనిపించేది. అందుకే రోజు మొత్తం ఎక్కడున్నా ఏం చేస్తున్నా సరిగ్గా మూడింటికి మా డిపార్ట్‌మెంట్‌కి వచ్చేవాడిని. నిన్ను చూసే ఆ క్షణం కోసం రోజు మొత్తం ఎదురు చూసే వాడిని. నిన్ను చూసే ఆ సమయం ఒక క్షణకాలమంత సేపు కూడా ఉండేది కావు గానీ ఎదురుచూసే ఆ రోజు మాత్రం ఒక యుగంలా అనిపించేది. నువ్వు కనిపించని రోజు మాత్రం పిచ్చివాడిలా కాలేజి మొత్తం తిరిగేవాడిని. ఏ మూలనైనా నువ్వు కనిపిస్తావన్నఆశతో. ఆ తర్వాత నీతో పరిచయం, స్నేహం, ప్రేమ ఇవన్నీ చాలా తొందరగా అయిపోయాయి.
ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. నీ ప్రేమ నాలోని ఒక కొత్త వ్యక్తిని నాకు పరిచయం చేసింది. జీవితాన్ని మరింత అందంగా చూడటం నేర్పించింది. మన స్టైల్లో చెప్పాలంటే విశాఖపట్నం సముద్రతీరంలా ప్రశాంతంగా ఉన్న నా మనసుని నువ్వు హుద్-హుద్ తుఫాన్‌లా వచ్చి అల్లకల్లోలం చేశావు. ఇంకా చాలా విషయాలు చెప్పాలని ఉంది. కానీ నీ మీద నాకున్న ఇష్టాన్ని చెప్పడానికి ఈ లెటర్ సరిపోదు. ఈ లెటర్ చదివేటప్పుడు నీ పెదాల మీద ఒక అందమైన చిరునవ్వు మొలుస్తుంది కదా విన్ను. ఆ చిరునవ్వు జీవితాంతం ఉండాలని కోరుకుంటూ!!!
ఇట్లు
నీ అర్జున్”
“ఓ మై గాడ్! అర్జున్, వినీత లకి ముందే పరిచయముందా?” అని కార్తీక్ నిర్ఘాంతపోయాడు.
“పరిచయమేంటి? ప్రేమించుకున్నారు కూడా! ఏవో కారణాల వల్ల విడిపోయారు. వినీత తన తల్లితండ్రుల బలవంతం మీద గౌతమ్‌ని పెళ్ళి చేసుకుంది. ఈ బలవంతఫు పెళ్ళిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. మనం అర్జున్‌ని అడిగితే మరిన్ని వివరాలు తెలుస్తాయి” అని దివ్య సమాధానమిచ్చింది.
అర్జున్, వినీతవి మరి కొన్ని ఫొటోలు కూడా దివ్య కార్తీక్‌కి ఇచ్చింది.
“థాంక్యు వెరీ మచ్ దివ్య. ఈ కేసు పరిష్కారమవడానికి నువ్వు చాలా సహాయం చేశావు.”
“ఇట్స్ మై ప్లెజర్ కార్తీక్” అని దివ్య సమాధానమిచ్చి వెళ్ళిపోయింది.
కార్తీక్ వెళ్ళేసరికి దివ్య, అర్జున్, గౌతమ్‌లు ఒక హాల్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళతో పాటు ఎస్.ఐ. మోహన్ కూడా ఉన్నాడు. ఇక ఆలస్యం చేయకుండా కార్తీక్ చెప్పడం మొదలుపెట్టాడు.
“మన అందరికీ వినీత బాగా పరిచయం. కానీ వినీత గురించి అన్ని విషయాలు మనకి తెలియదు. ఆ విషయాల గురించి చెప్పడానికే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. వినీత ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం నువ్వే అర్జున్. చెప్పు ఇలా ఎందుకు చేశావు?”
“వ్వాట్! నీకేమైనా మతిపోయిందా కార్తీక్? నాకు వినీత ఆత్మహత్యకి ఏం సంబంధం?”
“ఇవి చూస్తే నీకు మతిపోయింది” అని కార్తీక్ అర్జున్, వినీతల లెటర్స్, ఫోటోలు అందరికి చూపించాడు.
“ఒరెయ్ దుర్మార్గుడా! నా వినీతని నువ్వే చంపేశావ్ కదరా!” అని గౌతమ్ అర్జున్ చొక్కా కాలర్ పట్టుకున్నాడు.
మోహన్, దివ్య గౌతమ్‌ని ఓదార్చే ప్రయత్నం చేశారు. అర్జున్‌ని మాట్లడమన్నట్లు కార్తీక్ సైగ చేశాడు.
“నేను వినీత కాలేజిలో చదువుకునేటప్పుడు ప్రేమించుకున్నాం. పెళ్ళి కూడా చేసుకుందామని అనుకున్నాం. కానీ నేను జాబ్ విషయంలో కొంచెం నిర్లక్ష్యం చేశాను. అదే టైమ్‌లో వినీతా వాళ్ళ అమ్మానాన్న తనని పెళ్ళి చేసుకోమని బలవంతం చేశారు. నాతో పెళ్ళికి ససేమీరా అన్నారు. ఇక తప్పని పరిస్థితులలో తను వాళ్ళు తెచ్చిన సంబంధం చేసుకుంది. అప్పుడె తెలిసింది తను పెళ్ళి చేసుకుంటుంది నా ఫ్రెండ్ గౌతమ్‌ని అని. అందుకే నేను పెళ్ళికి వెళ్ళలేదు. ఆ తర్వాత వాళ్ళిద్దరినీ నేను ఎప్పుడూ కలవలేదు. తనని ప్రేమించిన విషయం గౌతమ్‌కి చెప్పడానికి చాలా సార్లు ప్రయత్నించాను. కానీ ఎందుకో ధైర్యం సరిపోలేదు. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాతే తెలిసింది వినీత చనిపోయిందని. కానీ తన చావుకి నేను కారణమవుతానని అనుకోలేదు” అని అర్జున్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు.
“బాధపడద్దు అర్జున్. వినీత చనిపోవడానికి కారణం నువ్వు కాదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వినీతది ఆత్మహత్య కాదు. హత్య!” అని కార్తీక్ ఒక నమ్మశక్యం విషయం చెప్పాడు.
“హత్యా?? ఎవరు చేశారు కార్తీక్?” అని గౌతమ్ కోపంతో ఊగిపోయాడు.
“మరీ అంత నటించకు గౌతమ్. ఇలాంటి నటనలు చేసి మమ్మల్ని ఇప్పటిదాకా మోసం చేసింది చాలు. చెప్పు వినీతని ఎందుకు చంపావు?”
“నేను నటించమేమిటి కార్తీక్? వినీతది హత్య అని నువ్వు చెప్పేదాక నాకు తెలియదు.”
“వినీత చనిపోయిన రోజు ముంబయి వెళ్ళానని అందరినీ నమ్మించావు. కానీ నువ్వు ఆ రోజు హైదరాబాద్ లోనే ఉన్నావు. ఇవిగో ఈ ఫొటోలు చూడు” అని కార్తీక్ సి.సి.టి.వి ఫుటేజి ఫొటోలు చూపించాడు.
“నీ దగ్గర ఒక విషయం దాచాను కార్తీక్. వినీత చనిపోయిన ముందు రోజు రాత్రి నేను నా ఫ్రెండ్‌ని కలవడానికి హోటల్‌కి వెళ్ళాను. తర్వాతి రోజు ఉదయం ముంబయి వెళ్ళాను. ఆ రోజు సాయంత్రం వచ్చేసరికి వినీత చనిపోయింది. ఎందుకు చనిపొయిందో ఎలా చనిపోయిందో నాకసలు తెలీదు” అని గౌతమ్ కన్నీళ్ళనీ ఆపుకుంటూ చెప్పాడు.
“మన అందరిలో చాలా తెలివైనది దివ్య. తనే ఈ కేసులో నాకు బాగా హెల్ప్ చేసింది. థాంక్యూ దివ్యా.”
“ఇట్స్ ఓ.కె. కార్తీక్!”
‘ఇప్పుడు చెప్పు దివ్య?”
“దేని గురించి కార్తీక్?”
“అదే వినీతని ఎందుకు చంపావో అని?”
“వ్వాట్! నేను చంపడమేటి?”
“గౌతమ్ హొటల్‍లో కలుసుకున్న ఫ్రెండ్‌వి నువ్వే దివ్యా. ఆ రోజు నాకు మోహన్ – గౌతమ్‌వి సి.సి.టి.వి ఫుటేజిలు, ఫొటోలు అందించాడు గుర్తుందా? వాటిలో నీవి కూడా ఉన్నాయి. అప్పుడే నీ పైన అనుమానం వచ్చింది. ఆ తర్వాత నీపై నిఘా పెట్టి, ఇన్వెస్టిగెషన్ నీ వైపు నుంచి మొదలుపెట్టాం. నువ్వు తెలివైనదానివి అని ఎందుకు అన్నానంటే వినీతని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన విధానం.
అందరు అనుకుంటున్నట్లు నిద్రమాత్రల వల్ల వినీత చనిపోలేదు. ఒక మనిషి చనిపోయిన తర్వాత పోస్ట్‌మార్టంలో కూడా దొరకని కొన్ని పాయిజనస్ కెమికల్స్ ఉంటాయి. అలంటి పాయిజన్‌నే బ్లాక్ టీలో కలిపి వినీతకి ఇచ్చావు. తను కళ్ళు తిరిగిపడిపోతున్న సమయంలో మంచి నీళ్ళలో నిద్రమాత్రలు కలిపి తాగిపించావు. నీ పథకం ప్రకారం పోస్ట్‍మార్టం రిపోర్ట్ వచ్చింది. వినీత చనిపోయిన రోజు వివరాల కోసం నేను గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. టేబుల్ పైన బ్లాక్ టీ ది చిన్న డ్రాప్ ఉంది. దానిని ల్యాబ్ కి టెస్టింగ్ కి పంపిస్తే అది పాయిజనస్ కెమికల్స్‌లో అరుదైన రకం అని, అది కేవలం ఢిల్లీలో ఒక ల్యాబ్‌లో మాత్రమే దొరుకుతుందని తెలిసింది. గత పది రోజులుగా ఎవరు కొన్నారని వివరాలు తెప్పిస్తే కొన్న ఇద్దరిలో నువ్వు ఒకరని తెలిసింది. ఇంకో విషయం ఎంటంటే ఇదంతా చేతికి గ్లవ్స్ వేసుకుని చేసిన నువ్వు, కాలింగ్ బెల్ కొట్టేటప్పుడు మాత్రం స్వీయ వేలి ముద్రలనే ఉపయోగించావు. బహుశా ఇంటి లోపలికి వెళ్ళాక ఆ విషయం గుర్తుకొచ్చి ఉండచ్చు. ఆ తర్వాత డిల్లీ వెళ్ళి గౌతమ్‌ని ఓదార్చడానికన్నట్లు కొన్ని రోజుల తర్వాత ఇక్కడికొచ్చావు. కేసు ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుందని తెలిసింది. ఆ రోజు గౌతమ్‌ని సి.సి.టి.వి ఫుటేజిలు, ఫోటోల్లో చూశాక నీదాక వస్తుందేమో అన్న అనుమానం కలిగింది. అందుకే అర్జున్‌ని ఇరికించడానికి నాకు ఫోటోలు, లెటర్స్ అందించావు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే అర్జున్ నాకు అంతకు ముందే వాళ్ళ ప్రేమ విషయం చెప్పాడు. ఇప్పుడు అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే నువు హత్య ఎందుకు చేశావని?” అన్నాడు కార్తీక్.
“గౌతమ్ నాకు కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం. ఆ తర్వాత తెలియకుండానే తనని ప్రేమించడం మొదలుపెట్టాను. కానీ తను ప్రేమని అంగీకరించలేదు. ఆ తర్వాత తనకి వినీతతో పెళ్ళి కుదిరింది. తనని ప్రేమిస్తున్న విషయం వినీతకి చెప్పాను. గౌతమ్‌ని పెళ్ళి చేసుకొవద్దని బ్రతిమిలాడాను. కానీ తను ఒప్పుకొలేదు. ఆ తర్వాత లా ప్రాక్టీస్ కోసం నేను డిల్లీ వెళ్ళిపోయాను. ఒకసారి హైదరాబాద్ వస్తున్నానని, కలుద్దామని గౌతమ్‌కి ఫోన్ చేశాను. తను ముంబయి వెళ్తున్నాడని కలవడం కుదరదని చెప్పాడు. నన్ను కలిసి ముంబయి వెళ్ళమని తనని ఒప్పించాను. అప్పుడే వినీతని చంపడానికి ప్లాన్ వేసాను. తనని హత్యచేసి అది ఆత్మహత్యగా చిత్రీకరించి ఆ తర్వాత గౌతమ్‌కి దగ్గరవుదామని అనుకున్నాను. ఆ రోజు హోటల్ లో గౌతమ్ని కలిశాను. నాతో మామూలుగా ఉండమని, ఫ్రెండ్షిప్ చేయమని తనని ఒప్పించాను. తను ముంబయి వెళ్ళిన తర్వాత నేను నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వినీతని హత్య చేశాను.
ఆ తర్వాత నేను డిల్లీ వెళ్ళిపోయాను. అర్జున్, వినీతల ప్రేమ విషయం నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఒక వేళ ఈ కేసులో నేను దొరికే పరిస్థితి వస్తే అర్జున్‌ని ఇరికిద్దామని వాళ్ళవి కొన్ని ఫోటోలు, లెటర్స్ వినీత రూమ్ నుంచి తీసుకున్నాను. కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు వేరోకటి తలుస్తాడు కదా. నను క్షమించు గౌతమ్. ఇదంతా నీ మీద ప్రేమ తోటి చేసాను” అని దివ్య మౌనంగా తల దించుకుంది.
“ఒసేయ్ పిచ్చిదానా! ప్రేమ కోసం ఎవరైనా ఇంతటి పని చేస్తారా?” అని గౌతమ్ దివ్య చెంప చెళ్ళుమనిపించాడు.
గౌతమ్‌ని ఇంటికి తీసుకెళ్ళమన్నట్లు కార్తీక్ అర్జున్‌కి సైగ చేసాడు. దివ్యని అరెస్ట్ చేసి స్టేషన్‍కి తీసుకువెళ్తున్నారు. వెళ్ళే దారిలో మోహన్ జీపులో ఉన్న ఎఫ్. ఎమ్. ఆన్ చేసాడు. దానిలో స్వామిజీది ప్రసంగం వస్తుంది.
“ప్రేమ అనేది చాలా విచిత్రమైనది నాయనా. అది రెండు వైపుల పదును ఉన్న కత్తి లాంటిది. ఒక వైపు అది మనిషికి చాలా బలాన్నిస్తుంది. మంచి పనులు చేయిస్తుంది. గొప్ప స్థాయిలో నిలబెడుతుంది. మరో వైపు అది మనిషిని పిచ్చివాడ్ని చేస్తుంది. పాతాళానికి తొక్కేస్తుంది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రేమ కోసం మనిషి ఎంతటి స్తాయికైన దిగజారుతాడు. ఎంతటి దారుణానికైనా ఒడిగడతాడు..”