[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన సింగీతం ఘటికాచల రావు గారి ‘ప్రయోజన విద్య’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
‘చదువుకునే అవకాశం లేక తన బతుకు తెల్లారి భవిష్యత్తు చీకటి మయమైంది. కనీసం తన బిడ్డైనా నాలుగక్షరాలు చదువుకుని ప్రయోజకుడు కావాలి. తనలా వయోజన విద్య గతి పట్టకూడదు. ‘ప్రయోజన విద్య’ దక్కాలి. పగలంతా ఒళ్ళు హూనమయ్యేలా రకరకాల పనులు చేసి సాయంత్రం చెట్టుకింద బడికెళ్ళాలంటే విసుగనిపిస్తుంది’ ఆలోచిస్తున్నాడు నారాయణ.
‘చిన్నతనంలో బడికెళ్ళమంటే ఆకతాయితనంతో బడెగ్గొట్టి కన్నవాళ్ళను నానా ఇబ్బందీ పెట్టి ఆనందించాను. దాని ఫలితం ఇప్పుడు కళ్ళకు కడుతూంది. అక్షరం ముక్క ఒంటబట్టి ఉంటే ఇప్పుడిలా ఒళ్ళు హూనమయ్యేది కాదుగదా. అక్షర జ్ఞానం, లోక జ్ఞానం దేనికదే వేరు. కనీసం తన కొడుకైనా అక్షర జ్ఞానంతోబాటు లోక జ్ఞానంకూడా సంపాదించి ప్రయోజకుడైతే చాలు. ఎంత కష్టానికైనా ఓర్చి వాణ్ణి గొప్పవాణ్ణి చెయ్యాలి. ‘మొక్కైవంగనిది మానై వంగునా’ అన్న సామెత నిజమే. పురాతన కాలంనుంచే మనిషిని మానుతో పోల్చారు. మనిషి తీగలా ఉంటే కచ్చితంగా వంగేవాడే కానీ మానై కూర్చున్నాడు. ఇంగిలీషు వాడు కూడా బహుశా ఈ సామెత ఆధారంగానే పెరిగిన మనిషిని మాన్ అన్నాడేమో’ తన ఆలోచనలను తనే నవ్వుకున్నాడు నారాయణ.
ప్రభుత్వం నూరు రోజులకు పని అని ఏదో పథకం తెచ్చిందిగానీ తిండి మాత్రం రోజూ తినాలిగా. సంవత్సరంలో ఆ మిగతా రోజులు తిండికోసం ప్రయత్నించడమే పనిగా మిగిలింది. కేవలం నూరు రోజులు మాత్రమే తిని జీవితాంతం బతికెయ్యగలిగితే ఎంత బాగుంటుంది?
అలా రకరకాల ఆలోచనలు మెదడు తొలుస్తూండగా నారాయణ చెరువు పూడికతీత పనిలో నిమగ్నమయ్యాడు. అతనికి తోడు మరో పదిమందిదాకా దినకూలీలున్నారక్కడ. ప్రభుత్వం నూరు రోజుల పని పథకంలో భాగంగా దొరికిందా పని.
అతనికి ఎనిమిదేళ్ళ కొడుకున్నాడు, పేరు రంగడు. నారాయణ భార్య పేరు లక్ష్మి. అతనితోబాటు ఆమె కూడా అన్ని పనులకూ సహాయకారిగా ఉంటుంది వయోజనవిద్య సహా.
మధ్యాహ్నం పన్నెండుగంటలకు లక్ష్మి క్యారియర్‌తో వచ్చింది. దూరంనుంచే ఆమెను చూసి పార పక్కనబెట్టి గట్టుమీదికి వచ్చాడు.
రాగానే “రంగడు బడికెళ్ళాడా?” అనడిగాడు.
చిన్నగా తలూపింది. ఆమె తలూపడంలో ఏదో మర్మముందనిపించింది.
“ఏమైంది?”
“వెళ్ళనని గొడవ చేస్తే ఈడ్చి నాలుగు తన్ని లాక్కెళ్ళాను”
“ఎందుకు వెళ్ళడట?”
“ఏమో”
రంగణ్ణి బడికి పంపాలా వద్దా అన్న సందిగ్ధలో పడ్డాడు నారాయణ. ‘బాగా బతికేందుకు చదువు ముఖ్యం. అలాగైతే ఈ ఊరి కరణం మునసబులందరూ పెద్దగా చదువుకోలేదే! మరి వీళ్లంతా బాగానే బతుకుతున్నారుగా. చదువంటే కేవలం అక్షరం కాదు జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది?’ ఆలోచనలు ఆగలేదు.
***
అక్కడికి మైలుదూరంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి గదిలో కూర్చుని దిక్కులు చూస్తున్నాడు రంగడు. ఎప్పుడు గంట ఒకటౌతుందా ఎప్పుడు ఇంటికి పరిగెడదామా అని చూస్తున్నాయా చూపులు. మధ్యాహ్న భోజనం కూడా అక్కర్లేదు వాడికి.
ఐతే నారాయణ ఉద్దేశం వేరు. ‘మధ్యాహ్న భోజన పథకంవల్ల పిల్లవాడు కనీసం ఒకపూటైనా భోజనం చేస్తాడు. చదువుతోబాటు నాలుగు మెతుకులు కూడా దక్కుతాయి’
గంటకొట్టగానే ఒక్క గెంతులో గేటువద్దకు చేరుకున్నాడు. ఐతే ఠక్కున అక్కడ సైన్స్ మాస్టర్ ఎదురవ్వడంతో అడుగు వెనక్కుపడింది. అతన్ని చూస్తేనే అందరూ జడుసుకుంటారు. మాట పెగిలితే పిడుగు పడ్డట్టే! కంచు కంఠం!
“అందరూ అటువైపు వెళ్తుంటే నువ్వెక్కడికిరా?” అన్నాడు మామూలుగానే. దాంతో బెదిరిపోయి గిరుక్కున వెనక్కు తిరిగి ఒక్క పరుగుతో వంటశాల పక్కనున్న పూరిపాకకు చేరుకున్నాడు. ఆ చిన్న మనసులో ఎన్నో ఆలోచనలు!
‘ఉదయంనుంచీ సాయంత్రందాకా కష్టపడ్డా అయ్యదగ్గర ఇంత తక్కువగా డబ్బులు ఉన్నాయెందుకు? పనేమీ చెయ్యకున్నా రాజువాళ్ళ నాన్న దగ్గర అన్ని డబ్బులెలా ఉన్నాయి? అన్నింటికీ మూలకారణం డబ్బేనన్నది అర్థమౌతూంది. అదెలా సంపాదించాలో అయ్యకు తెలియదేమో. అయ్యతోబాటు నేను కూడా పనికి వెళ్తే నాక్కూడా డబ్బులిస్తారు అప్పుడు నాక్కావల్సింది నేను కొనుక్కోవచ్చు. అయ్యను ఇబ్బంది పెట్టక్కర్లేదు. ఐతే పనికెళ్తే అయ్య సైన్స్ మాస్టారిలా తిడతాడు. అందుకే తెలియకుండా వెళ్ళాలి’ అలా ఆలోచిస్తున్నాడు వాడు.
మర్నాడు బడిలో కొత్త పుస్తకాలిచ్చారు. అవి చూస్తుంటే కాస్సేపు పని, డబ్బుల సంగతి మర్చిపోయాడు. వెంటనే అవన్నీ అమ్మానాన్నలకు చూపించాలనిపించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసి సాయంత్రం బడి వదలగానే వాయువేగంతో ఇంటికి పరుగుతీశాడు.
పుస్తకాలన్నీ చూసిన నారాయణ, “వీటితోబాటు నీకు ఇంకో మంచి పుస్తకం ఇస్తాను. అది కూడా చదువుకుంటే చాలా మంచిది” అంటూ ఇంట్లోకెళ్ళి దాచి ఉంచిన పెద్దబాలశిక్ష పుస్తకం తెచ్చిచ్చాడు. పుస్తకమంతా చిరిగి ఓ మాదిరిగా ఉండడం చూసి ముఖం వికారంగా ‘దీన్ని చదవాలా?’ అన్నట్టు పెట్టాడు రంగడు.
“ఏంటలా చూస్తున్నావు? దాంట్లో చాలా మంచి విషయాలున్నాయి. ముఖ్యంగా తెలుసుకోవాలి అవన్నీ” అన్నాడు. అతని మాటల్లో ప్రేమతో కూడిన అధికారం గోచరించింది.
***
నాలుగు రోజులుగా నారాయణకు ఒంట్లో బాగాలేక పనికి వెళ్ళలేదు. రోజుకూలీ పద్ధతిన చేసే పనికి ఒక్కరోజు వెళ్ళకపోయినా కూలీ గిట్టదు. అప్పటికే గత రెండు వారాలుగా కూడబెట్టినదాంట్లో సగం మందులకే ఖర్చైపోయింది. లక్ష్మికి ఏం చెయ్యాలో తోచలేదు. తను కూడా పనికి వెళ్ళిపోతే నారాయణను ఎవరు చూసుకుంటారు? రంగడిని బడి మానిపించ వద్దని ఘంటాపథంగా చెప్పాడు నారయణ. అతని జ్వరం తగ్గుముఖం పట్టకపోవడంతో అతన్ని కనిపెట్టుకునేందుకు ఇంటివద్దనే ఉండిపోయింది లక్ష్మి.
రంగడికి బడిలో కూర్చున్నా పుస్తకం తెరిచి చదవాలనిపించలేదు. నాన్న అలా పడుకుని ఉంటే ఏదోలా ఉంది. అమ్మ కూడా దిగులుగా ఉంది. మరో రెండు రోజుల్లో బియ్యం ఐపోతాయని చెప్పడం వాడి చెవిన పడింది. బియ్యం ఐపోతే ఏం చెయ్యాలి? తనేమో ఉదయం బడిలోనే భోజనం చేస్తాడు. మరి అమ్మా నాన్నా? తర్వాత రాత్రికి ఏం తినాలి?
“రేయ్ రంగా, ఇక్కడ పాఠం చెబుతూంటే ఏంటీ దిక్కులు చూస్తున్నావు” అంటూ దగ్గరగా వచ్చిన సైన్స్ మాస్టారు ప్రకాశం వీపుమీద ఒక్కటి చరిచాడు.
“నాన్నకు ఒంట్లో బాగాలేదు సార్” అని ఆపై ఏమీ చెప్పలేకపోయాడు.
“అలాగని పరధ్యానంగా కూర్చుంటే మీ అయ్యకు బాగై పోతుందా? క్లాసులో ఉన్నప్పుడు పాఠం మీదనే ధ్యాస ఉండాలి” అంటూ మళ్ళీ రెండు చరిచాడు.
ప్రకాశం మంచి మనిషి. పిల్లలు క్రమశిక్షణలో ఉండాలని కోరుకుంటాడు. లేకపోతే పెద్దయ్యాక పెడదోవ పట్టే ప్రమాదముందని అతని నమ్మకం. అతను పాఠం చెబితే కథ విన్నట్టు గమ్మత్తుగా ఉంటుంది. సులభంగా అర్థమౌతుంది. అటువంటి ఉపాధ్యాయులు చాలా అరుదు.
క్లాసు ముగియగానే బయటికి వెళ్తూ “నా గదికి రారా” అంటూ రంగడిని పిలిచాడు.
వాడు వెళ్ళగానే “ఎప్పట్నుంచి ఒంట్లో బాగాలేదు?” అనడిగాడు.
“నాలుగు రోజులైంది సార్. ఆసుపత్రికి వెళ్ళి మందులు వాడినా ఇంకా తగ్గలేదు. ఇంకా మూడ్రోజులు మందులు వాడాలట. అమ్మకూడా పనికి వెళ్ళలేదు. రేపట్నుంచి ఇంట్లో బువ్వ కూడా లేదు, పస్తులేనని చెప్పింది అమ్మ” అన్నాడు పంటి బిగువున.
ప్రకాశం జేబులు తడుముకున్నాడు. పై జేబులోనుంచి యాభై రూపాయల కాగితం తీసి రంగడికిస్తూ “తొందరగా బాగైపోతుందిలే, దిగులు పడకు. ఇది తీసుకెళ్ళి నాన్నకివ్వు” అన్నాడు. దాన్ని చూడగానే ఒక్క క్షణం కళ్ళుమెరిసినా వెంటనే తల అడ్డంగా ఊపాడు.
“వద్దు సార్. ఏదైనా పని చెప్పండి చేస్తాను. తరువాత తీసుకుంటాను” అన్నాడు.
ప్రకాశం మాస్టారు క్షణకాలం విస్తుపోయాడు. అయాచితంగా వచ్చిన డబ్బు తీసుకోవడానికి ఇష్టపడని అతని సంస్కారం నచ్చింది. వాడి మనసులోని భావాన్ని అర్థం చేసుకుని “సరే సాయంత్రం బడి వదలగానే ఇంటికి రా, తోటపని ఉంది. అది చేసిన తరువాత తీసుకుంటావా?” అనడిగాడు. ఇప్పుడు రంగడి కళ్ళు నిజంగానే మెరిశాయి. సంబరంగా అలాగేనన్నట్టు వేగంగా తలూపాడు.
బడి వదిలాక నేరుగా మాస్టారువెంటే అతనింటికి వెళ్ళాడు రంగడు. నాలుగు నుంచి సాయంత్రం ఐదు గంటలవరకూ చెట్లకు పాదులు తీయడం నీళ్ళు పెట్టడం వంటి పనులు చేశాక మాస్టారు భార్య రంగడికి ఒక సంచిలో బియ్యం, పప్పులు వేసిచ్చింది. మాస్టారు యాభై రూపాయలు జేబులో ఉంచాడు.
“నాన్నకు బాగాలేక పోయినా నేనిచ్చిన డబ్బులు నువ్వు తీసుకోలేదు కాబట్టి నీచేత పని చేయించాను. ఇక ముందు ఎంత కష్టమైనా చదువు మాత్రం మానకు” అన్నాడు.
తలూపి మాస్టారుకు దణ్ణం పెట్టి సంచిని ఒక చేతిలో పదిలంగా పట్టుకుని మరొక చేత్తో జేబులోని డబ్బును భద్రంగా మూసి పట్టుకుని నడుస్తున్నాడు.
ఆరోజు గురువారం. ఊర్లో సంత. సాయంత్రం బజారు గోలగోలగా ఉంది. మెల్లగా నడుస్తూ అంగళ్ళన్నీ చూస్తుంటే అంతలో ఒక అంగడి అరుగుమీద పుస్తకాలు కనిపించాయి. అది నాన్న ఇచ్చిన పెద్దబాలశిక్ష పుస్తకం. చూడ్డానికి చాలా కొత్తదిగా ఉంది. ఇంట్లో ఉండే పుస్తకం చిరిగిపోయి చూస్తేనే చదవబుద్ధి కావడం లేదు. అంగడివద్దకు వెళ్ళి అంగడివాడికి పుస్తకం చూపి, “అదెంత?” అనడిగాడు.
“ఏడు రూపాయలు” అన్నాడు అంగడివాడు.
అసలు దాని విలువెంతో ఏడు రూపాయలిచ్చి కొనవచ్చో కూడదో తెలియలేదతనికి. మెల్లగా వెనక్కు తిరిగి తిరిగి ఆ పుస్తకాన్నే చూస్తూ నిష్క్రమించాడు.
మర్నాడు క్లాసులో రంగణ్ణి చూసిన ప్రకాశం ఉలికిపడ్డాడు. చేతుల మీద భుజం మీద ఎర్రగా వాతలు కనిపించాయి. అతను ఇచ్చిన బియ్యం పప్పులు డబ్బులు ఎక్కడివని కొట్టాడట. నిజం చెప్పినా నమ్మలేదట. ప్రకాశంకు తను చిన్నతనంలో చదివిన విష్ణుశర్మ కథ జ్ఞాపకం వచ్చింది. అందులో పసిపాపను పాము బారినుంచి కాపాడబోయిన పెంపుడు ముంగిస ఏవిధంగా ప్రాణాలు కోల్పోయిందో గుర్తుకొచ్చింది.
‘తప్పు తనదే. తండ్రి ఆరోగ్యం గురించి పసివాడు పడే బాధను అర్థం చేసుకున్నాడు గానీ పెద్దవాళ్ళేమనుకుంటారో ఆలోచించలేదు’. సాయంత్రం బడి వదలగానే ప్రకాశం రంగడికి తెలియకుండా వాడిననుసరించాడు. రంగడు సంతవీధిలోనుంచి వెళ్తూ యాంత్రికంగా ఠక్కున పాతపుస్తకాల చావడి వద్ద ఆగాడు. వాడి కళ్ళు మళ్ళీ పెద్దబాలశిక్ష మీద పడ్డాయి. కాస్సేపు ఆ పుస్తకంవంకే చూసి ముందుకు నడిచాడు. రంగడు కొంతదూరం వెళ్ళాక ప్రకాశం పుస్తకాల షాపు వాణ్ణడిగి విషయం తెలుసుకున్నాడు. రంగడు ఇల్లు చేరుకున్న పది నిముషాలకు ప్రకాశం రంగడి ఇంటికు చేరుకున్నాడు. ఇంట్లో ఎవరిదో దగ్గు వినిపిస్తూంది. అప్పటికే రంగడు పుస్తకాలు ముందేసుకుని చదువుకుంటున్నాడు.
“నారాయణా” అంటూ పిలిచాడు ప్రకాశం. రంగడి తల్లి బయటికి వచ్చింది. వచ్చిన వ్యక్తి ఎవరో ఎందుకొచ్చారో తెలియలేదు.
“నేను మీ రంగడి స్కూలు టీచర్ను. నా పేరు ప్రకాశం” అని పరిచయం చేసుకున్నాడు.
“దండాలయ్యా” అంటూ చేతులు జోడించింది ఏం చెయ్యాలో తోచక. అతనెందుకు వచ్చాడో తెలియదు. ఈ రంగడేమైనా స్కూల్లో గొడవచేశాడా అన్న విషయం మీదే మనసు వెళ్ళింది. క్షణంపాటు వాడిమీద కోపం పొంగింది. ఐనా తనను తాను నియంత్రించుకున్నది.
“రంగణ్ణి నిన్న మీరు కొట్టారట” ఊహించని ఆ ప్రశ్నకు ఏం జవాబు ఎప్పాలో తెలియక ఆమె మౌనం వహించింది.
“చెప్పండి, కొట్టారా?” మరింత గట్టిగా అడిగాడు. మౌనంగానే తలూపిందామె. అప్పుడే నారాయణ మెల్లగా దగ్గుకుంటూ బయటికి వచ్చాడు.
“ఇన్నేళ్ళుగా వాడెప్పుడైనా అబద్ధం చెప్పడం మీరు విన్నారా?” లేదన్నట్టు తలూపింది.
“అంటే ఈనాటివరకూ అబద్ధం అంటే ఏమిటో తెలియకుండా పెంచారు. చాలా మంచి పని. అలాంటప్పుడు వాడు నిన్న చెప్పిన మాటలు మాత్రం ఎందుకు నమ్మలేదు?”
అతని ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. జరుగుతున్నదేమిటో అర్థం కాక వాళ్ళిద్దరివంకా అయోమయంగా చూస్తూ నిలబడ్డాడు నారాయణ.
“మీకంతగా అనుమానం ఉంటే బడికి వచ్చి ఉండాల్సింది. ఇంకా కావాలనుకుంటే నేరుగా మా ఇంటికే వచ్చి ఉండాల్సింది. నిజం తెలిసేది. పసిపిల్లలెప్పుడూ నిజాయితీగానే ఉంటారు. కాలక్రమంలో మనలాంటి పెద్దవాళ్ళవల్లే వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది”
నారాయణ, లక్ష్మి అపరాధ భావనతో తలవంచుకుని నిలబడ్డారు.
“ప్రవర్తన స్నేహితులవల్ల మారుతుంది అంటారేమో. దానికైనాగానీ ఆ స్నేహితుల కన్నవాళ్ళు, పెద్దలేగా కారణం. మీ పెంపకం మీద నమ్మకమున్నప్పుడు ఏ స్నేహితులూ మీ పిల్లల్ని ఏమీ చెయ్యలేరు. ఒకసారి రంగణ్ణి పిలవండి” అన్నాడు.
లోపలికి వెళ్ళి రంగణ్ణి పిల్చుకు వచ్చిందామె. వాడి చేతిలో తండ్రి ఇచ్చిన చిరిగిన పెద్దబాలశిక్ష పుస్తకముంది. మాస్టారిని చూసి భయంతో తల్లి వెనకాలే నక్కి నిలిచాడు.
“రంగా, ఇలా రా” అంటూ పిలిచాడు. వాడు ముందుకు వచ్చేందుకు జంకాడు.
“నిన్నేమీ అనడం లేదు. ఇది తీసుకో” అంటూ ప్రకాశం తన చేతిలోని పుస్తకాన్ని ముందుకు చాచాడు. అది చూడగానే రంగడి కళ్ళు విప్పారాయి. అది వాడు పాతపుస్తకాల చావడిలో చూసిన పెద్దబాలశిక్ష పుస్తకం. దాన్ని చూడగానే వాడి ముఖం వెలిగిపోయినా తల్లి చాటునుంచి మాత్రం బయటికి రాలేదు.
“ఫర్వాలేదు తీసుకో నిన్నెవరూ ఏమీ అనరు” అన్నాడు ప్రకాశం రెట్టిస్తూ.
ఐనా వాడు ముందుకు రాలేదు. ప్రకాశం రెండడుగులు ముందుకు వేసి తల్లి వెనుకనుంచి వాణ్ణి ముందుకు లాగి ఆ పుస్తకాన్ని బలవంతంగా వాడి చేతిలో ఉంచాడు.
“కేవలం అక్షరాలు దిద్దుకుంటే చాలదు. పిల్లలు పుట్టినప్పట్నుంచీ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలన్న జిజ్ఞాసతోనే ఉంటారు. వాళ్ళ జిజ్ఞాస తీర్చేందుకు కన్నవాళ్ళే మార్గదర్శులై ఉండాలి. ఆ తరువాత గురువులు. నీకు ఒంట్లో బాగాలేదంటే నేనే వాడిచేత కాస్తంత ఇంటి పని చేయించి ఆ డబ్బులు బియ్యంపప్పులు ఇచ్చాను. ఎందుకంటే జాలిపడి నేను డబ్బులిస్తే వాడు తీసుకోలేదు కాబట్టి. మీ అబ్బాయి తలుచుకుంటే వాడు సంపాదించిన యాభై రూపాయల్లో నిన్ననే ఈ పుస్తకం కొనుక్కునే వాడు. ఐతే నీ వైద్యానికీ మీ తిండి ఖర్చులకూ డబ్బులు కావాలని కొనేందుకు వెనుకంజ వెయ్యడం ఈరోజు ప్రత్యక్షంగా చూశాను. అందుకే దాన్ని కొనిచ్చాను. ఇంత చిన్న వయసులోనే ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడో చూడండి. అటువంటి కొడుకును కన్నందుకు మీరు గర్వపడాలి. వాడికెలాగూ చదువు మీద మక్కువ ఉంది కాబట్టి మీరేమీ బలవంతపెట్ట నక్కరలేదు. సాధ్యమైతే మీరు కూడా సమయం దొరికినప్పుడల్లా ఆ పుస్తకాన్ని చదవండి. ఇంకా కూడా మంచి మంచి పుస్తకాలు తెచ్చిస్తాను. దానికి తోడు మీకు దొరికిన పత్రికలు పుసకాలు కూడా చదవండి. అప్పుడే బడిలో గురువులు చెప్పేదానికి తోడు మీరు కూడా వాడి చదువుకు మరింత సహాయపడొచ్చు. చదువుకునేందుకు వయసు పరిమితి అంటూ లేనేలేదు. ఏ వయసులోనైనా చదువుకోవచ్చు” అంటూ నిష్క్రమించాడు ప్రకాశం.
కాస్సేపటికివరకూ అతను వెళ్ళినవైపే చూస్తూ నిలబడ్డారు ముగ్గురూ. ముందుగా లక్ష్మి తేరుకుని కళ్ళల్లో నీరు సుడులు తిరుగుతూండగా ఆకుపసరు తెచ్చి రంగడి చేతిమీద ఎర్ర చారలకు పూసింది. నారాయణ ఆప్యాయంగా రంగడిని అక్కున జేర్చుకున్నాడు.
తండ్రి బాహువుల్లో గువ్వలా ఒదిగిన రంగడు బలవంతంగా తన చేతులు మాత్రం బైటికి రప్పించుకుని అక్కడే తన చేతిలో ఉన్న కొత్త పెద్దబాలశిక్ష పుస్తకం తిరగేయసాగాడు.