[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘ప్రవాస చంద్రుడు’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
ఓ మూల తల పట్టుకుని కూర్చున్న శేఖరాన్ని చూస్తూనే, ‘ఏవిటో ఈ మధ్య వీడు రోజు రోజుకీ ఎనర్జీ నిల్ అయిపోతున్న మరీ డల్‌గా కనబడుతున్నాడు. కొంపదీయకుండా ఏదైనా ప్రేమ విఫలమా ఏంటి!’ అనుకుంటూ శేఖరం దగ్గరకి వెళ్ళి, పక్కనే కూర్చుంటూ “ఏంట్రా అలా గాలిపోయిన బంతిలా ఉన్నావ్. ఏవిటి సంగతి! ఏదైనా ప్రేమ విఫలం అయిందా ఏంటి” అడిగాడు కళ్ళెగరేస్తూ
ఆ మాటలకి చంద్రం వంక ఓ సారి కింద నుండి పైదాకా చూసి, “నాకిపుడు అదొక్కటే తక్కువైంది. ఎంతో తాపత్రయం పడుతూ, ఓ యంత్రంలా ఈ అమెరికాలో ఈ మాత్రం ఉద్యోగం చేసి, ఆ మాత్రం నామమాత్రం డబ్బు సంపాదించి, అనపర్తిలో ఉంటున్న మా కుటుంబానికి పంపుతున్నా, కొన్ని రాత్రులు టెన్షన్‌తో మాత్రలు మింగినా నిద్ర రాక, నానా యాతనలూ పడి, అతలాకుతలం అయిపోతూ మరీ ఆదా చేస్తున్నాను. అలాంటి నా బతుక్కి ప్రేమ వ్యవహారం కూడానా”, దిగాలుగా చూస్తూ అన్నాడు
“అదేంటి మరీ అంత దరిద్రంగా ఆలోచిస్తున్నావ్. మనం ఉన్నది ఆంధ్రాలో కాదు. అమెరికాలో, అది మర్చిపోతున్నావ్ నువ్వు.”
“లేకపోతే ఏంటి! మనం ఈ అమెరికాలో చికాగోకి వచ్చి నాలుగేళ్ళు అయింది. ఏదో హాయిగా ఆడుతూ పాడుతూ చేసుకుంటున్న ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని, రిసెషన్ పేరుతో పుటుక్కున తీసి పారేసారు. చటుక్కున ఏం చేయాలో పెరుగుపోక, ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే వెతుక్కోవాలని, తొణక్కుండా, వణక్కుండా స్టాట్యూ ఆఫ్ లిబర్టీలా ఇక్కడే పాతుకుపోయాం. తర్వాత, అనుకున్న స్థాయి సాఫ్టు వేర్ ఉద్యోగాలు రాకపోవడంతో, ఇక చేసేదిలేక, మనం మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఎందుకూ అని, చిన్న హౌస్‌కీపింగ్ డిపార్ట్‌మెంట్‌లో మొక్కుబడి జీతానికి సూపర్‌వైజర్స్‌గా పనిచేస్తున్నాం. కానీ గుంతలో పడ్డ ఏనుగుల్లా ఇలా ఎంతకాలం” విసుగ్గా మొహం పెట్టి అడిగాడు శేఖర్.
“నీ గురించి అయితే నాకు తెలియదు కానీ, త్వరలో నా జాతకం మారిపోబోతోంది. నేను అతి త్వరలో ఇండియాకు వెళ్లబోతున్నాను. అలా ఇండియాకు వెళ్ళి, ఒక్కసారే టపీమని కోటీశ్వరుడినైపోతాను. ఆ తరువాత, నేను ఉద్యోగం చేయడం కాదు, నేనే ఓ పెద్ద బిజినెస్ పెట్టి అక్కడ ఇండియాలో వారికి కూడా ఉద్యోగాలు ఎడం చేత్తో విసిరి అవతల పడేస్తాను” చెప్పాడు చంద్రం కళ్ళు మెరిపిస్తూ ఉత్సాహంగా.
“ఎలా! కౌన్ బనేగా కరోడ్‌పతిలో సెలెక్ట్ అయ్యావా” అడిగాడు శేఖర్ తల గోక్కుంటూ అనుమానంగా.
“కాదెహె. ఇక్కడ ఈ అమెరికాలో, నువ్వు, నేను ఏం చేస్తున్నావో మనకు తప్ప, ఇండియాలో ఎవరికీ ఏవీ తెలియదు. అందుకే, మా ఇంట్లో నాకు పెళ్ళి సంబంధం కూడా చూశారు. మొన్నే జూమ్ యాప్‌లో జామ్ జామ్ అని నా పెళ్ళి చూపులు కూడా అయిపోయాయి. కట్నాలూ, కానుకలూ, సారె,వగైరా అన్నీ కలుపుకుని ఓ రెండు కోట్ల వరకు మాట్లాడారు. ఇక దర్జాగా ఇండియాకి వెళ్ళి, దర్జీ కుట్టిన కొత్త బట్టలేసుకుని, నిశ్చితార్థం, పెళ్ళి ఒకే రోజు చేసుకోవడమే తరువాయి. ఆ తర్వాత ఓ రెండు వారాలు గడిచాక, అరె అని నాలుక కరుచుకుని, అర్ధాంతరంగా ఉద్యోగం పోయిందని ఓ గట్టి కట్టు కథ చెప్తాను. మా అయితే వాళ్ళు రెండు రోజులు బాధపడిపోయి ఓ వారం రోజుల్లో మామూలైపోతారు. తర్వాత నేను, ఇక్కడే జాబ్ చూసుకుంటానూ, మీ అమ్మాయి కూడా మీ కళ్ళ ముందే ఉంటుందీ అని, ఓ నాలుగు సెంటిమెంట్ డైలాగులు, తేనె పూసి మరీ చెప్తాను. దాంతో వాళ్ళు కరిగిపోయి, సరే అంటారు. వాళ్ళు ఇచ్చిన కట్నం డబ్బుతో హాయిగా జల్సా చేస్తూ, అక్కడే ఉద్యోగం చూసుకుంటాను లేదా వ్యాపారం చేసుకుంటాను” చెప్పాడు చంద్రం.
“ఆహా! ఏం తెలివిరా నీది” చెప్పాడు మెచ్చుకోలుగా చూస్తూ.
***
ఆ తర్వాత కొద్ది రోజులకి, ఇంటి దగ్గర నుండి ఫోన్ రావడంతో, లిఫ్టు చేసి “చెప్పమ్మా, నా పెళ్ళి పనులు ఎంత వరకు వచ్చాయి” ఆసక్తిగా అడిగాడు చంద్రం.
“ఆగిపోయేంత వరకు వచ్చాయి” చెప్పిందామె అసహనంగా.
“అదేంటి! ఎందుకు?” అడిగాడు మొహం వికారంగా పెట్టి.
“ఎందుకంటే, నువ్వు అక్కడ హౌస్‌కీపింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న సంగతి వారికి తెలిసిపోయింది”.
“అదెలాగా” అడిగాడు తలని బర బరా గోక్కుంటూ.
“ఎలా ఏంటి! నీ ఫ్రెండ్ శేఖర్ గాడు, సెల్ఫీలు తీసుకుని వాడి ఫేస్‌బుక్‌లో పెట్టాడు. వాటిలో నువ్వూ ఉన్నావు. కొన్ని ఫొటోల్లో నీ యూనిఫామ్‌పై నీ కంపెనీ పేరు, నీ పేరు ఉంది. వాటిని చూసిన పెళ్ళికూతురి అన్న, వద్దన్నా వినకుండా మన ఇంట్లోకి దున్నలా దూసుకొచ్చి మరీ నానా మాటలూ, తిట్లు, బూతులు తిట్టి, నాన్సెస్ చేసి మరీ పెళ్ళి కేన్సల్ అన్నాడు. నువ్ ఇలా నీ ఉద్యోగం విషయంలో అబద్ధం ఆడ్డంతో, వాళ్ళు మాపై గద్దల్లా పడ్డారు. అలా నీ బుద్ది గడ్డికరుస్తుందనీ, ఇలా మాకు చెడ్డ పేరు వస్తుందనీ కల్లో కూడా అనుకోలేదు” అని ఫోన్ పెట్టేసిందామె. సారీ, పగలగొట్టేసిందామె.
మళ్ళీ తల్లికి ఫోన్ చేశాడు చంద్రం. మీరు ఫోన్ చేసిన వ్యక్తి, ఫోన్ నేలకేసి కొట్టారు. తిరిగి కొత్త ఫోన్ కొన్న తరువాత చేయగలరు అంటూ కంప్యూటర్ వాయిస్ వచ్చింది. ఆ కోపంతో రగిలిపోతూ, ఫ్లాట్‌కి వెళ్ళీ వెళ్ళగానే, దీనికి కారణమయిన శేఖరాన్ని నానా మాటలూ అని, నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టాడు.
“సారీ రా. ఇలా అవుతుందనుకోలేదు. అయినా, నీ స్నేహితుడిగా, నా మనసుకి అనిపించింది ఒకటి చెప్తాను. సూర్యుడిలా జీవితంలో స్వయం ప్రకాశంతో ఎదుగు. చంద్రుడిలా ఎవరి వెలుగు పైనో ఆదారపడి ప్రకాశించాలనుకోకు” అని పైకి అనేసి, ‘హమ్మయ్య, ఆ అమ్మాయి జీవితం కాపాడాను. వీడిలాంటి వాళ్ళ వల్ల ఇప్పటికే ప్రవాసాంధ్రుల మీద నమ్మకం రాను రాను తగ్గిపోతోంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మంచి వాళ్ళకి కూడా పిల్లని ఇవ్వడానికి సందేహిస్తున్నారు. అందుకే ఇలా చేశాను. ఇప్పుడు నా మనసుకి ఎంతో తృప్తిగా ఉంది’ అనుకున్నాడు శేఖర్ మనసులో.