Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రత్తిపాటి సుభాషిణి శ్రీపదాలు 2

శ్రీపదాలు అనే సూక్ష్మ కవితా ప్రక్రియలో మూడు పాదాలు, పాదానికి మూడేసి పదాలు ఉంటాయి, ప్రతిపాదం అర్థవంతంగా ఉండడం లక్షణం. ప్రత్తిపాటి సుభాషిణి శ్రీపదాలలో ఇది రెండవ భాగం.

~
10
మతల ఊటల మాటలు,
నవ్వు పూతల చెమరింతలు,
అసూయాగ్నికి పూసిన మైపూతలు!!

11
అంతా నీవేనంటారు సదా…
నీ కోసమే జీవితమంటారు,
మోసపోకు! అంతరంగం తెలుసుకో!

*12*
పెదవంచుల జారే తేనెలు,
లోలోపల ఆశల ఝంకారం
సడి వినబడనంత అలంకారపుస్వరం!!

13
వెన్నెల పరుచుకున్న ఆకాశం,
ప్రేమ నిండిన హృదయం
రెండూ.. నవనవోన్మేషములే! ఎప్పుడూ!!!

14
ఎన్నో రకాల మాటలు,
కొన్ని తేనె జలపాతాలు
మరికొన్ని పడదోసే నిచ్చెనలు!!!

15
లోకమంతా చూడాలనే కోరిక,
మదిలోపలికి చూడాలంటేనే భయం,
అన్నీ…… అగాధాలు,అంతర్మథనాలేగా!!!

*16* (16_18 గెలుపు)
అలవోక మలుపు కాదది,
అవరోధపు అలల ఎదురీతది,
అందుకున్న అపురూపమైన *గెలుపు*!!!

17
ఎగతాళి ముళ్ళపై పువ్వులా..,
ఈసడింపులకు ఈసు పుట్టించేది,
*గెలుపు* చిరునవ్వు ఒకటే!!

18
పలుకురాళ్ళ ఓటమి గాయాలు,
సహనపు చందనాల మలాములు,
అందించే పారిజాతాలు *గెలుపులు*!!!

Exit mobile version