Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రతిచర్య

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన డా. మజ్జి భారతి గారి ‘ప్రతిచర్య’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

భూదేవి నరకానికి వచ్చిందన్న వార్త దావానలంలా నరకలోకమంతా వ్యాపించింది. ఆమె తన స్థానం నుండి కదిలిందంటే, ఆ చర్య పెద్ద ఉత్పాతనకు దారితీస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. దాంతో నరకవాసులకు పని పెరుగుతుంది. అందుకే నరకంలో ఆమెను చూడగానే యమకింకరులు భయపడుతుంటారు. చిత్రగుప్తుని సంగతి సరేసరి. లెక్కలన్నీ ఆయనే చూడాలి మరి. ఇక్కడిలా వుంటే, విషయం తెలుసుకున్న యమధర్మరాజుకు కూడా చెమటలు పడుతున్నాయి. కొన్ని రోజులు అంతఃపురం సంగతి మర్చిపోవలసిందే మరి, అనుకుంటూ భూదేవికి ఎదురు వెళ్ళాడు.

“మీ రాక మాకు సంతోషమే. మేము చెయ్యగలిగినదేదో చెప్పండి?” వినయంగానే అడిగాడు.

“మీకు తెలియనిదేముంది యమధర్మరాజా? లోకంలో పాపం పెరిగి పోతూ ఉంటే, మీ దగ్గరకు రాక తప్పడం లేదు” దాదాపు కళ్ళనీళ్ళ పర్యంతమై చెప్పింది భూదేవి.

“అదేమిటి భూదేవీ! నిన్నగాక మొన్ననే గదా, మీ భారాన్ని తగ్గించేందుకు, కోవిడాసురుని ప్రత్యేకంగా సృష్టించి, మీ భారాన్ని బాగా తగ్గించాను. మరల యింతలోనే..” ఆర్థోక్తిలో ఆగిపోయాడు యమధర్మరాజు.

“నిజమే! కాని వాళ్ళా విషయాన్ని మర్చిపోయి, మరల యథావిధిగా, వాళ్ల స్వభావాలను బయట పెట్టుకుంటున్నారు. మరింత విశృంఖలత్వంతో రెచ్చిపోతున్నారు. మనం అతి జాగ్రత్తగా సృష్టించిన లోక సమతుల్యతను, అత్యాశకు పోయి తూట్లు పొడుస్తున్నారు. వాళ్ళ విహారాలకు వినోదాలకు, కొండల్ని పిండి చేస్తున్నారు. మహా వృక్షాలను నేల కూల్చేస్తున్నారు. ఆనకట్టలంటూ నదులను అడ్డగించి, ఆ ప్రాంతంలో భూభారాన్ని పెంచేస్తున్నారు. పోనీ చేసేది సక్రమంగా చేస్తున్నారంటే అదీ లేదు. స్వార్థం, ధనదాహం యెక్కువైపోయిందీ జనాలకు. స్త్రీలపై అరాచకాలు, అకృత్యాలు ప్రబలి పోతున్నాయి. ఎవరికీ దైవభక్తి, పాపభీతి ఉండడంలేదు. కోవిడాసురుని ఉపసంహరణ వాళ్ళ గొప్పదనమే అన్నట్లు, మరీ విజృంభిస్తున్నారు ఈ మానవులు” గోడు వెళ్ళబోసుకుంది భూదేవి.

“కోవిడాసురుని ఉపసంహరించినా, మధ్య మధ్యలో జికాసురుని, నిఫాసురుని, మంకీపాక్స్ అసురుని పంపిస్తూనే వున్నాను కదా!” ఆశ్చర్యంగా అన్నాడు యముడు.

“వారిని పంపించినా, ప్రజలకు చీమకుట్టినట్టైనా లేదు” అన్న భూదేవి మాటలతో సాలోచనగా చిత్రగుప్తుని వైపు చూశాడు యమధర్మరాజు ‘ఏమిటీ వింత?’ అన్నట్లు.

“వారి శక్తుల్ని మహాదేవుడు ఉపసంహరించేశాడు దేవా. అందుకని వారి ప్రభావం మానవులపై పెద్దగా ఉండడం లేదు” విషయాన్ని విడమరిచాడు చిత్రగుప్తుడు.

‘మహాదేవుడు కైలాసంలో కనులు మూసుకొని, తపస్సు చేసుకుంటూ, యింత పత్రి వేసి, నీరు పొయ్యగానే, అభిషేకమని మురిసిపోయి వరాలు గుప్పించేస్తాడు. ఈ నీచ మానవుల నైజం ఎప్పటికి తెలుసుకుంటాడో! ఏమిటో!’ మనసులోనే చికాకుపడ్డాడు యమధర్మరాజు. మనసులోని ఆలోచనలను బయటకంటే మహాదేవుని ధిక్కరించినట్టు అవుతుందనే విషయం తెలుసు మరి. ఆయనకు కోపం వస్తే నిముషంలో బూడిద చేసి పారేస్తాడు. ఇటు భూదేవిని చూస్తే జాలేస్తుంది. ఎంతకని భరిస్తుంది పాపం?

“సరే భూదేవి! మీరు బెంగటిల్లకండి. మీ సమస్య తొందరలోనే పరిష్కారమయ్యేటట్టు చూద్దాం” అని పంపించి ‘మహాదేవుని ఈ అనాలోచిత చర్యను సరిదిద్దడానికి మరల ఎంత కాలం పడుతుందో! ఎవరెవరు ఎంత ఓవర్ టైం చేయాల్సి వస్తుందో! ఆయనెప్పుడూ యింతే! వరాలిచ్చి, నిర్మలంగా కూర్చుంటాడు. ఆ వరప్రభావం వలన పాపులు చేసే అకృత్యాలకు అడ్డుండదు. వారిని అడ్డుకోవడానికి మేమంతా తలక్రిందులవ్వాల్సి వస్తుంది. యుగయుగాల నుండి ఇదే తంతు’ కోపంగా అనుకున్నాడు యమధర్మరాజు.

భూదేవి నిష్క్రమించాక, చిత్రగుప్తునితో వరుణదేవుడు, వాయుదేవుడు, ఆదిత్యుడు, అగ్నిదేవుడు, సముద్రుడు, మహా పర్వతాలను అత్యవసర సమావేశానికి ఆహ్వానం పంపమన్నాడు. వారితో పాటు కొంతమంది అసురులకూ ఆహ్వానం పంపించమన్నాడు.

ఆశ్చర్యంగా చూస్తున్న చిత్రగుప్తునితో, “వందమంది దేవతలు కొన్ని రోజుల్లో చేసే పనిని, ఒక్క అసురుడు మానవ మేధస్సులో ప్రవేశించడం ద్వారా, మిస్సైల్స్, అణ్వాయుధాలంటూ క్షణాల్లో మారణ హోమాన్ని సృష్టించగలడు” అన్న యమధర్మరాజు సూచన మేరకు అసురులకూ ఆహ్వానం పంపించాడు చిత్రగుప్తుడు.

అత్యవసర సమావేశంలో, పరిస్థితిని కూలంకషంగా వివరించాడు యమధర్మరాజు.  ఎవరెప్పుడు, యేమి చెయ్యాలో అర్థమయింది అందరికీ.

***

అంతే క్షణాల్లో కొండలు నేలకూలి, జనావాసాలు నేలమట్టమైపోయాయి. ఊళ్ళకి ఊళ్లే తుడిచిపెట్టుకుపోయాయి. హాహాకారాలు, ఆర్తనాదాలు.. ఒకప్పుడు ప్రకృతి శోభతో, కనులకు విందు చేస్తూ అలరారిన సుందర ప్రదేశాలు.. యుద్ధ వాతావరణాన్ని తలపించేలా.. బురదతో నిండిపోయి.. జనాలు అక్కడుండడానికి భయపడేలా.. అదొక పీడకలలా.

***

అసలే వర్షాకాలం.. మురుగు నీరు పోయేందుకు ఉద్దేశించిన కాలువలు, ప్లాస్టిక్ చెత్త చెదారంతో నిండిపోయి.. కాస్త వానకే మురుగుతో సహా వాననీరు వీధుల్లో షికారు చేస్తూ జనజీవనానికి అంతరాయం కలిగిస్తున్న తరుణంలో.. అది చాలదన్నట్టు, బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న తుఫాను.. దానికి వరుణ దేవుడు తోడయ్యాడేమో.. తెరిపినివ్వని జోరు వానలు.. కురిసిన వాన బయటకు పోవడానికి దారేది? ఇంకేమి చేస్తుంది వాననీరు? ఇళ్లల్లోకి దారితీసింది బిక్కుబిక్కుమంటూ జనాలు.. వాన నీటికి నానిపోయి గోడలు కూలిపోతే, ఇంటిలోనే సమాధి అయిపోతున్న కుటుంబాలు.. చెరువు గర్భాలను ఆక్రమించేసి కట్టిన అక్రమ కట్టడాలు, పునాదులు సరిగ్గా లేక పేకమేడల్లా కూలిపోతూ.. ఆ శిధిలాల క్రింద నలిగిపోతున్న బ్రతుకులు.

***

ఒక దగ్గర తెరిపిలేని వానలతో భానున్ని చూడడమే గగనమైపోతుంటే, యింకొక ప్రక్క భానున్ని చూడాలంటేనే భయాందోళనలకు గురయ్యేంత తీక్షణంగా భానుడు. ఒంట్లోని నీటినీ, సత్తువనూ పీల్చేస్తూ వేడి గాడ్పులతో ప్రాణాలు తోడేస్తున్నాడు. ఇంకొక ప్రక్క సుడిగాలుల రూపంలో వాయుదేవుడు ప్రాణాలు తీసేస్తున్నాడు. ఆదిత్యుడు, వాయుదేవుళ్ళ సహకారంతో, అగ్నిదేవుడు విజృంభించి, ఊళ్లను తగలబెట్టేస్తున్నాడు. ఇంకొక ప్రక్క దట్టంగా మంచు కురుస్తూ, ఊళ్లను కమ్మేస్తుంది.

***

మానవుల మేధస్సులో అసురులు దూరి.. స్వార్థానికి, అహంకారానికి పెద్ద పీట వేస్తూ, దేశ రక్షణ అంటూ పక్క దేశాల మీద యుద్ధాలకు కాలు దువ్వుతూ, మిస్సైల్స్ వేస్తూ, వేలకు వేల మందిని పొట్టన పెట్టుకుంటున్నారు. ఎటు చూసినా అగ్నికీలలతో, క్షణాల్లో తుడిచి పెట్టుకుపోతున్న నగరాలు.. అనంత వాయువుల్లో కలిసిపోతున్న వందల వేల ప్రాణాలు..

***

ఇవన్నీ కళ్ళారా చూస్తున్న నాకు కాళ్లు చేతులు వణికిపోతున్నాయి. ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి. కాళ్లల్లో నిస్సత్తువ. నిలబడలేక పోతున్నాను.

“తల్లీ! భూదేవి సహనానికి మారుపేరంటారు. నీ భారాన్ని తగ్గించుకోవడానికి, అందరితో కలిసి ఈ దారుణ మారణకాండను చేయించడం భావ్యమా?” అన్న నా ప్రశ్నకు “చర్యకు, ప్రతిచర్య ఉంటుందని సైన్సు పుస్తకాల్లో చదువుకుంటూనే వున్నా, మీ మానవులకు బుద్ధి రాదా?

నేనేమీ చెయ్యడం లేదు. మీ చర్యలతో మీరే నాతో ప్రతిచర్య చేయిస్తున్నారు. పచ్చగా కళకళ్ళాడుతూ, చల్లగా ఉండాల్సిన నన్ను, మీ స్వార్థంతో, తరతరాలుగా నా చుట్టూ కవచంలా ఉండే మహావృక్షాలను కూల్చేస్తూ, నన్ను విపరీతమైన తాపానికి గురి చేస్తున్నారు. కులాసాగా ముందుకు సాగిపోయే నదీమతల్లులకు అడ్డంగా ఆనకట్టలు, అవీ చాలవన్నట్లు ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తూ, వాటిని వేరే దారిలో పొమ్మంటున్నారు. మైనింగుల పేర్లతో నా గర్భంలో డైనమైట్లు పెడుతున్నారు. ఇంకా ఎన్నో? నీకు తెలియనివి కావు. అహంకారంతో తెలిసే చేస్తున్నారు, మీ మనుషులు. మీ చర్యలకు ప్రతి చర్యలు మాత్రమే యివన్నీ. కొన్నాళ్లకు మనుషులన్న వాళ్లే వుండకుండా చేస్తాను. హ,హ,హ..” అని భూదేవి పగలబడి నవ్వుతుంటే ముచ్చెమటలు పోస్తున్నాయి నాకు.

“వద్దు, ప్రతిచర్య తీసుకోవద్దు, మేము బుద్ధిగా ఉంటాము” అని చెప్పబోతుంటే నాలుక పిడచ కట్టుకుపోతుంది. నోట మాట బయటకు రావడం లేదు. మనిషిని తూలిపోతున్నాను.

***

“చర్య, ప్రతిచర్య అంటూ, నిద్రలో ఆ అరుపులేమిటి? ఆ చెమటలేమిటి? ముందు నుండీ బాగా చదువుకోమని చెప్తుంటే వింటున్నావా? పరీక్షలు ముందు హడావిడిగా పుస్తకాలు తిరగేస్తే, యిలాగే వుంటుంది మరి!” అని అమ్మ రెండు తగిలిస్తే, పూర్తిగా మెలకువ వచ్చింది.

ఇదంతా కలా! గుండెల్లో ఇంకా ఆందోళనగానే వుంది. అరచేతుల్లో చెమటలు, జరిగిన దానికి నేను ప్రత్యక్ష సాక్షినన్నట్టు. పోటీ పరీక్షలకు, కరెంట్ అఫైర్స్ చదువుతూ అలా నిద్రపోయాను. కరెంట్ అఫైర్స్‌లో ఈమధ్య జరిగిన సంఘటనల సమాహారమే కలగా వచ్చిందన్నమాట. కల కాదు. అదొక హెచ్చరిక. మనలో మార్పు రాకపోతే యీ కల నిజమవ్వడానికి ఎంతో కాలం పట్టదు. ఈ కల నిజం కాకుండా వుండాలంటే నా వంతుగా నేనేమి చెయ్యాలోనని ఆలోచిస్తుంటే “పుట్టినరోజంటూ, పార్టీలు చేసుకునే బదులు తలా ఒక మొక్కను నాటినా, భూతాపాన్ని తగ్గించవచ్చు” అని అప్పుడెప్పుడో అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఆరోజు ఆ మాటను, కొట్టి పడేసిన నాకు, ఈ కల ద్వారా ఆ మాటల విలువ తెలిసివచ్చింది.

ఎవరినో ప్రభావం చేసే శక్తి నాకైతే లేదు. చంద్రునికో నూలుపోగులా, నా వంతుగా నేనేమిటి చెయ్యగలను? ఆలోచనలో పడ్డాను. నేను సైతమంటూ, మా ఇంటి చుట్టుపక్కల మొక్కలు నాటగలను. వాటిని పెంచగలను. చీటికిమాటికి బైకు తియ్యడం మానేసి నడిచో, సైకిల్ మీదో వెళ్ళగలను. ఏసి వాడకాన్ని తగ్గించగలను. ఇంకా నేనేమి చెయ్యగలనో.. నేను చెప్తే యివన్నీ చెయ్యగలిగిన ఫ్రెండ్స్ యెవరున్నారో ఆలోచిస్తున్నాను. భూతాపం తగ్గించడానికి నాకు చేతనైనంత, నేను చెయ్యాలనే నిర్ణయానికి వచ్చి మంచం దిగాను.

Exit mobile version