[సిహెచ్. కళావతి గారు రచించిన ‘ప్రశ్న ప్రశ్నార్థకమౌతున్న వేళ’ అనే కవితని అందిస్తున్నాము.]
మనిషిలోని మానవత్వం
మాయమౌతున్న వేళ
మానవత మంటల్లో కాలి పోతున్నవేళ
తల్లికి చెల్లికి తేడా తెలీని
కొందరి మృగాళ్ళ పశుత్వం ప్రబలుతున్న వేళ
ఆడదంటే అంగడి బొమ్మ
అనుభవించే కొమ్మ అని భావిస్తున్న వేళ
ప్రపంచీకరణ మోజుతో
మన సంస్కృతీ సంప్రదాయాలకు
బూజు పటిస్తున్న వేళ
సామాన్య మనిషి జీవన పోరాటంలో
అలసి కునుకు తీస్తున్న వేళ
ప్రభుత్వాధికారులు లంచాలతో
కుస్తీ పడుతున్న వేళ
రాజకీయ నాయకులు ఆసనం వేస్తున్నవేళ
పదవులు కాపాడుకోవడం కోసం
పాకులాడుతున్నవేళ
విద్యార్థి యువత కార్పోరేట్ కాలేజీ చదువులతో
సతమత మౌతూ అసహనంతో
ఆత్మహత్యలతో తరలి పోతున్న వేళ
సరస్వతీ నిలయాలైన విశ్వవిద్యాలయాలు
కులమత రకసి కోరల్లో చిక్కుకుంటూ
బిక్కుబిక్కుమంటున్న వేళ
సమాజానికి పనికిరాని దగాకోరులతో
సామాజిక న్యాయశాస్త్రం పేజీలు చిరిగిపోతున్న వేళ
ప్రశ్న ప్రశ్నార్థకమై మనిషి ముందు నిల్చున్నవేళ
ప్రశ్నించే ప్రశ్నకు సరియైన
సమాధానాల శరఘాతాన్ని సంధిస్తూ..
దురాగతాల దుమ్ము దులిపేద్దాం
అవినీతిని అరికడదాం
కులమత రక్కసి కోరలు పీకేద్దాం
ఆనందాల సమాజాన్ని ఆహ్వానిద్దాం
ప్రశ్న ప్రశ్నార్థకమై మనిషి ఎదుట నిల్చే
పరిస్థితిని రూపుమాపుదాం.
