నేను
అమ్మ పొత్తిళ్ళ పేగు రక్తాన్నీ
కాయం నేనే గాయం నాదే
పాట అమ్మదే నాయిన బాటలో
ప్రసవం అమ్మదై జననం నాది
నన్ను
భూమి కనక మునుపే
ఆకాశంలో చుక్కల వెన్నెల విరిసే
అవని చెట్లు ఊయలూగే కొమ్మల్లో
జీవనం నాదైనా అలల నదిలా సాగే
నేను ఆడుకున్నాను
అమ్మ వొడి ఐసీయూలో
తనువూ మనసూ వికాసమే
శీతల గదిలో పడక పూల పాన్పే
ఉమ్మి నీరులో ఈతే స్నానం
అద్భుతం అమ్మ తోడు ధరణిలో
అడవికి అందం ఆకుపచ్చ ఆకుల్లో
పసిడి మెరుపు తనువులో తంగేడు
నింగి ఆడే జాబిలి వెన్నెల
మనసు పాటే సన్నాయి జోల
ఈ మట్టిలో
రాళ్ళు కరిగించే కష్టాల దారి
రత్నాలు పండించే దేహ తరిలో
మనిషి బతుకే చెమట సిరిచెలిమే
నా జన్మ అమ్మ పూచిన ధైర్యసీమ
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.