Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రసాదం!!

[శ్రీ సముద్రాల హరికృష్ణ రాసిన ‘ప్రసాదం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

వేల ఏళ్ళ చరిత్ర గల వైష్ణవ దేవాలయం.

సాధారణ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు, పలుకుబడిని బట్టి విఐపీ దర్శనాలు, ఎన్నో ఎన్నెన్నో!

ప్రపంచంలోనే భక్తుల విరాళాలలో, హుండీ చదివింపులలో ప్రథమ స్థానంలో ఉన్న దేవాలయం అది!

ఎందరికో ఆ దైవం కులదైవం, పిలిచితే పలికే ఆత్మ బంధువుతో సమానం!

ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకో వైపు అంతెత్తున ఠీవిగా, తీపిగా దర్శనమిస్తుంది, ఈ స్వామి వారికి నివేదనగా సమర్పించే ‘అరిసె’ ప్రసాదం!

అంత శుచిగా, నాణ్యమైన వస్తువులతో, గట్టి పర్యవేక్షణలో చేయబడుతుంది ఆలయ ‘పోటు’లో అని ప్రసిద్ధమైనది!

స్వామి వారి మీద ఎంత భక్తితో స్వీకరిస్తారో, దాని ఘుమఘుమలాడే ప్రత్యేకమైన రుచి కోసం కూడా అంతే ఇష్టంగా కొని పట్టుకెళ్తారీ ప్రసాదం ప్రపంచం నలుమూలల నుంచీ వచ్చే భక్తులూ, పర్యాటకులూ!

***

అయితే ఇప్పుడు దీని మీదే పెద్ద రాద్ధాంతం పుట్టు కొచ్చింది, దేశంలో పెద్ద‌ గగ్గోలూ మొదలైంది!

***

పరీక్ష లేవో నిర్వహించి, ఆ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి, ఇతర నాసి రకం సామాగ్రి వాడారని ఆరోపణలు చేశారు, ఏలుతున్న వారు, అప్పటి వరకు ఏలి, ఎన్నికల్లో రాలిన వారిని!

ఆ ప్రత్యర్థి పార్టీ వారు ఏవఁన్నా తక్కువ తిన్నారా?!

అరిసెలు కాదులెండి తిన్నారంటున్నది!

ఎత్తుగడలలో తక్కువ వారేం కాదని, పిండితార్థం!

వారు, “మా ప్రమేయమేమీ లేదిందులో, మీరొచ్చిన రెండునెలల లోనే ఏదో తిరకాసు చేసేసి మా మీద నెట్టేయాలని చూస్తున్నారు! మీ పప్పులు మా దగ్గర ఉడకవు గాక ఉడకవు”, అని గట్టిగానే జవాబిచ్చారు, ఔచితీ భంగం కలగకుండా, అదే పాకశాస్త్ర పరిభాషలో!

ఇరు వర్గాలు మాటామాటా అనుకున్నారు, శపథాలు చేశారు, శాపనార్థాలు పెట్టుకున్నారు!

మాట అన్నవారు –

సిట్టులు, స్టాండులూ వేశారు- కావాల్సిన రిపోర్టులు ఇప్పించుకున్నారు, అవసరమైనప్పుడు ఆయుధంగా వాడుకోవచ్చని!

మాట పడ్డవారు-

కోర్టు గడపలూ తొక్కారు కానీ, ఎవరు ఏ రకంగా ఏం చెప్పారో, దరిమిలా అవి ఉపసంహరించుకున్నారు!

రాజకీయపు టెత్తులలో, ఏ పావును కదిపినా – లక్ష కోణాలు, కోటి వ్యాఖ్యానాలు – చివరకు ఎవ్వరూ ఊహించని కొత్త మలుపులు!

అబద్ధాల కట్టడాలకు పునాదులతో పనేముందీ?!

***

భక్తుల‌ మనోభావాలు మీరు దెబ్బతీశారంటే మీరు దెబ్బతీశారంటూ వీథీ వాడా టముకు వేసి చాటారు, ఇరు పక్షాలూ!

అవి నిజంగా దెబ్బతిన్న భక్తులు మొహామొహాలు చూసుకున్నారు – చేసేదీ వీళ్ళే, సానుభూతి చూపేదీ వీళ్ళే, ఏం తెలివిరా అనుకుంటూ!

పైగా విషయం, రాష్ట్రం పొలిమేరలు ఎప్పుడో దాటిపోయింది,

దేశం మొత్తం దీన్ని ప్రచారం చేయటం కూడా ప్రణాళికలో భాగమేనని జనం గుసగుసలు పోయారు కూడా!

ఈలోగా దేవాలయ యాజమాన్యం అరిసె ప్రసాదం కొన్ని రోజులు ఆపేయాలని హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారు.

బదులుగా నాలుగు పేలాలు, ఒక మిస్రీ ఇయ్యటం మొదలెట్టారు!

***

మా విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, వైభవమూర్తి – ఆ బోళా శంకరుడి లాగా బోసి దేవాలయాల, బూది ప్రసాదాల వాడు కాదు, ప్రసాద పునర్వైభవం తేవాల్సిందే, రాష్ట్రంలోని రాజకీయ పార్టీల గొడవలతో మాకు సంబంధం లేదు –  అంటూ వైష్ణవ సంఘాలూ, భక్త బృందాలూ కేంద్ర ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు.

వారి నాయకులు స్వయంగా ఢిల్లీ వెళ్ళి దేశ ప్రధానిని, సంబంధిత మంత్రినీ కలిసి అర్జీలు, కోటానుకోట్ల భక్తుల సంతకాల వేల పేజీలతో సహా ఇచ్చి, మాకు న్యాయం చేయమని అభ్యర్థించి వచ్చారు.

రోజూ టీవీల్లో చర్చోపచర్చలు ప్రసాదం విషయమై!

***

అత్యవసరంగా కేంద్రమంత్రివర్గ సమావేశం జరిగింది, ఒకరోజు సాయంకాలం!

ఫలానా రాష్ట్రాలలో నెలకొని ఉన్న, అంతగా సజావుగా నడిపింపబడని ఈ కింది దేవాలయాలను- ప్రజాహితం దృష్ట్యా, ప్రజల అంతరంగాలను పసిగట్టీ, తమకున్న విస్తృత అధికారాలు ఉపయోగించీ, అధీనంలోకి తీసుకుంటున్నట్టు తీర్మానం ఆమోదించారు.

ఆ జాబితాలో ఈ ప్రసిద్ధ ‘అరిసె ప్రసాద’, ఆలయం కూడా ఉన్నది!

రెండు గంటల తరువాత ప్రకటన జారీ అయింది.

జనంలో ‘ఆహా, శ్రీహరీ’ అన్న వారూ ఉన్నారు, ‘అయ్యో, నారాయణా’ అన్న వారూ ఉన్నారు!

అయినా జనం గోడు ఎవరికి పట్టిందీ?!

జారీ అయిన వారం తిరగకుండానే, దేశ పార్లమెంటులో సవరణ బిల్లు తెచ్చి, తంతు పూర్తి చేయించేసుకున్నారు.

ప్రతిపక్షం లబోదిబో అన్నది.

టీవీలో నేరుగా ప్రసారం వెళ్తోంది, మరీ పిల్లలు భయపడే రీతిలో కరాళ నృత్యాలు చేస్తూ అరుస్తున్నారు, ప్రతిపక్ష నేతలూ, సభ్యులూ అని ప్రత్యక్ష ప్రసారం ఆపివేశారు.

తలుపులు మూసేశారు, కరెంటు ఆపేశారు.

దేశానికి తెలియలేదు ఏమౌతోందో లోపల!

ఈ కోలాహలం, గందరగోళంలోనే “ఈ బిల్లు పాసై పోయింది, ‘కావాలి, ఔను’ అనే వారే ఎక్కువగా ఉండి చేతులెత్తినట్టు నాకు వినబడి, కనబడింది కాబట్టి”, అని స్పీకర్ గారు ప్రకటించేశారు.

***

అప్పుడు లైట్లు వేసి, తలుపులు తీశారు,”అబ్బ ఏం ఉక్క, ఏం ఉక్క”, అని విసురుకుంటూ ఏలుతున్న సభ్యులు నవ్వులతోనూ, ఏలే అవకాశం కోల్పోయి మూల్గుతున్న ప్రతిపక్షం వారు, “ఔరా ఔరా”, అంటూ, ఏడుపు ముఖాలతోనూ బయటకు వచ్చారు.

***

మరునాడే దేవాలయం కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి వచ్చేసింది.

రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష నాయకులిద్దరూ, కుక్కిన పేనుల్లా, ఏమీ అనలేక పోయారు, మింగలేక కక్కలేక ఈ పరిణామంతో!

***

జనం అరిసె ప్రసాదం మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ, నామజపం, పూజలు ఇతోధికంగా చేయడం మొదలెట్టారు!

***

మళ్ళీ ఒక ప్రకటన వచ్చింది, ప్రస్తుతం దేవాలయ నిర్వహణ చూస్తున్న కేంద్రప్రభుత్వ అధికారుల నుంచి!

రాబోయే ఏకాదశి నుంచీ, భక్తులకు దేవుడి ప్రసాదంగా నికార్సైన పెసరపప్పు, పరిశుద్ధమైన పిండీ, స్వచ్ఛమైన నూనెలతో చేసిన ‘కచోరీ’లు మహా నైవేద్యం తరువాత, ఉచితంగా ప్రసాదంగా ఇవ్వబడతాయి అని!

కొన్ని రోజుల తరువాత అదనంగా కొనుక్కునే ఏర్పాటు కూడా పురుధ్ధరిస్తామని, ఆ ప్రకటనలో వారు వ్రాశారు.

***

అనతి కాలంలోనే ఇదే ప్రసాదం అలవాటై పోయింది జనానికి!

కానీ జనంలో కొంత మంది-

తాము చిన్నప్పుడు చదివిన కథ ఏదో గుర్తుకొస్తోంది, ఈ వ్యవహారం అంతా చూస్తే, అని అనుకోవటం వినబడ్డది అక్కడక్కడా!

వారననుకున్న కథేంటో కానీ, పంచతంత్రంలో లేని కథలకు తావిచ్చేది కాదూ ప్రజాతంత్రం అంటే!

కాదు మరీ!

కానీ అరిసెకు ‘అసలు’ ఏమైందో ఆ లోగుట్టు, పెరుమాళ్ళు ఎరుకకే పరిమితం అయిపోయింది-శాశ్వతంగా, ప్చ్!

***

ఏది ఏమైనా,ఈ కథ దారి ఇక కంచి దిశగానే!

కథకు కాళ్ళు ఉండవేమో, రెక్కలుండచ్చుగా!

జై శ్రీమన్నారాయణ!!

Exit mobile version