ఇది…
ప్రకృతి సృష్టించిన ప్రళయం కాదు!
ఆ ఉన్మాది మెదడు పొరలలో జనియించిన
వికృత వికార చేష్టల పరాకాష్టకు ప్రతిరూపం!
విశ్వమానవ జాతి విన్నపాలను
బూటు కాళ్ల క్రింద తొక్కిపెట్టి
విశ్వశాంతి నినాదానికి చరమగీతం పాడి
మానవ హననానికి శ్రీకారం చుట్టాడు!
విశృంఖల వికటాట్టహాసంతో
మరణ మృదంగ ఘోషను
వీనుల విందుగా అనుభూతిస్తూ…
శవాల గుట్టలపై కరాళ నృత్యం చేస్తూ…
రాక్షసానందంతో
ప్రపంచ మానవాళిని
మృత్యు గుహ్వరం ముందు నిలిపాడు!
దశాబ్దాల కాల చక్రం ఇరుసు కింద…
పగిలి ముక్కలై పోయిన
తన సామ్రాజ్య చిహ్నాలను
ఒక్కటిగా అతికించాలని…
సార్వభౌమాధికారాన్ని చేజిక్కించుకొని
పూర్వ వైభవాన్ని పొందాలని…
విశ్వవిజేతలా వెలుగొందాలని…
రాజ్యకాంక్షను గుండెల్లో దాచుకొని…
మారణహోమం మొదలెట్టాడు!
ప్రపంచ మానవులారా… ఏకం కండి
శాడిస్టు నియంత పీచమణచి
విశ్వజగతిలో…
శాంతి బీజాలు నాటండి!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.