నా ప్రతి యోచనా..
నా ప్రతి శ్వాసా..
నిన్నే కోరుతున్నాయి!
నీ ప్రియమైన కళ్ళల్లో
నీలిరంగు నక్షత్ర కాంతుల్ని..
నీ మనసు లోతుల్లో ప్రతిఫలించిన
హరివిల్లు సుందర వదనాన్ని..
దర్శించి తరించాయి నా కళ్ళు!
ఈ మాయా లోకంలో ఉద్భవిస్తోన్న
అనేకానేక పరిణామాలను..
ప్రతిబింబించే దర్పణాలు కదా నీ కళ్ళు!!
అవును సుమా..!
అది నిజమే నంటూ
హృదయాలను అల్లకల్లోలం చేసే..
విషయాలన్నీ ప్రతిఫలిస్తున్నాయి ఆ కళ్ళల్లో!
నా అంతరంగంలో చెలరేగిన
భావోద్వేగాలలో కొట్టుకుపోకుండా
ఎంతో స్థితప్రజ్ఞతను కలిగి ఉండి..
నిన్ను చూసిన ఆ క్షణం నుండి
నా కళ్ళల్లో నీ కళ్లు
స్థిరనివాసమేర్పరుచుకున్నాయి!
శరీరగతమైన శ్వాసలు
హృదయగతమైన ఆలోచనలు
రసరమ్యమైన అమృత ఘడియలలో
మన ప్రేమ..
కావ్య రూపం సంతరించుకున్నది!
ఆ అద్భుత క్షణాలలో
నా కళ్ళల్లో నీ కళ్లు..
నీ హృదయంతో నా హృదయం..
ఒకరిలో మరొకరం
బస చేయడం మొదలెట్టాక..
ఎక్కడి నుండో సుమధుర గానం
మన ఇద్దరికీ వీనుల విందు చేస్తోంది!
ఆ గాత్రం..
ఆ పలుకులు..
ఆ హృదయం..
ఎక్కడో..
సుదూర తీరాల నుండి
ధ్వనిస్తున్నాయని భ్రమిస్తున్నావు కదూ!?
కాదు నెచ్చెలీ..!
మన ఇరు హృదయాలు ఒక్కటైన వేళ
ప్రకృతి పరవశించి
మనకు బహుకరించిన
మహా ఏకత్వాన్ని ప్రతిధ్వనించే
దివ్యనాదమే సుమా!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.