Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రణాళిక

[శ్రీమతి మంగు కృష్ణకుమారి రచించిన ‘ప్రణాళిక’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“అమ్మాయ్! ‌దుర్గా! ఇంక నువ్వు ఎంత ఏడిచీ చేసేదేమీ లేదు. నీ పిల్లల మొహం చూసయినా మామూలవాలి. కీడులో మేలు అన్నట్టు, బావ గవర్మెంట్ ఉద్యోగం చేస్తూ చనిపొయేడు కాబట్టి నీకు నీ అర్హతలకి తగ్గ ఉద్యోగం ఇస్తారు.‌‌‌” శివరావు ఆగేడు.

దుర్గకి తెలీనిదేమీ లేదు. శివరావు మళ్ళా అన్నాడు. “మన కమల బిఎస్సి అయిపోయింది కదా! దానికి బావ ఆపీసులో ఉద్యోగం వేయిస్తే సరి. నీ చదువుకి ఏం వస్తుంది?” దుర్గ హైస్కూల్ చదువు కూడా పూర్తి చేయలేదు.

దుర్గ నెమ్మదిగా అంది. “ఒక్కరోజు ఆగు అన్నయ్యా, రేపు మాటాడదాం.”

“సరేలేమ్మా! నీ ఇష్టం” అంటూ లేచేడు శివరావు. ముగ్గురు ఆడపిల్లలు, ఆఖర్న కొడుకు. పెద్ద కూతురు కమలకి పెళ్ళి చేసేద్దాం అని ఆమె భర్తతో పోరుతుండగానే హఠాత్తుగా హార్ట్ ఎటాక్‌తో భర్త పోయేడు. మొదట దుర్గ బెంబేలెత్తిపోయింది.

ఉండిందికి ఇల్లుంది. పేరుకే సొంతిల్లు. ప్రతీ నెలా‌ దాని మరామత్తులకి అయే డబ్బు ఖర్చు ఎక్కువే! బేంక్‌లో ఉన్న డబ్బు‌ ఎన్నాళ్ళో రాదు. కర్మకాండలు అవగానే పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళాలని అన్న వచ్చి

తీసుకెళ్లేడు. తన తల్లికి అన్న ఎంత చెప్తే అంతే! ఉత్తప్పుడు ఎలా ఉన్నా వదిన ఈ కష్టానికి దుర్గని చాలా దయగా చూసింది.

అయినా ఇంటికి వస్తున్న వాళ్ళ మాటలు దుర్గని చాలా కలవర పెట్టేయి.

“ఇహ కమలని ఉద్యోగంలో పెట్టాల్సిందే! లేకపోతే ఇంతమందిని దుర్గ ఎలా పోషిస్తుంది?”

“మరి రేప్పొద్దుట కమల పెళ్లయిపోతే ఎలా?”

“కమల అంత బాధ్యత లేనిది కాదు. అందరినీ అదే సాకుతుంది”

“అవును. వాళ్ళ అత్తతో అన్నాదిట.‌ మా అమ్మకి నేనే పెద్ద కొడుకుని అని”

దుర్గ తనింటికి తిరిగి వచ్చేసింది.

దుర్గ దీర్ఘంగా ఆలోచించి ముగ్గురు కూతుళ్ళనీ పిలిచింది. కమల, సుశీల, సరళ.

“అమ్మా! మీ అందరికీ మన పరిస్థితి తెలుసు. మనం వెంటనే ఏదో ఒకటి చేయాలి”

“అమ్మా! నాన్న ఆఫీసులో నేను అప్లై చేస్తాను. ఫేమిలీ గ్రౌండ్స్‌లో నాకు ఉద్యోగం వస్తుంది. ఇంటి బాధ్యత నేను చూసుకుంటాను సరేనా” కమల ఉత్సాహంగా అంది.

దుర్గ నెమ్మదిగా అంది  “మీ నాన్న నీకు పెళ్ళి చేసీయాలని ఆశ పడ్డారమ్మా! నీ పెళ్ళి ఆపేసి ఈ ఇంటి బాధ్యత నీకు అప్పచెప్పడం కన్నా, ఈ ఉద్యోగం సరళకి వేయిస్తే బాగుంటుందేమో అనిపిస్తున్నాది.”

ముగ్గురూ అదిరి పడ్డారు. “ఏం సరళ తల్లీ! నా మీద కోపమా?” దుర్గ గొంతు దీనంగా ఉంది.

సరళకి తెగ పుస్తకాలు చదివే అలవాటుంది. తల్లంటే చాలా ఇష్టం. “లేదమ్మా! నువ్వెలా చెప్తే అలాగే” అంది సరళ. ఆమెకి పధ్దెనిమిది నిండేయి. అంతే! కమలా, సుశీలా తల్లితో వాదించేరు.

దుర్గ ఆలోచన వేరు. కమల బిఎస్సి పాసయుంది. ఎక్కడయినా ఉద్యోగం వచ్చీవచ్చు. సుశీల చదువుతోంది గానీ దానికి చదువు మీద శ్రద్ధ తక్కువ. ఇహ హరి చిన్నవాడు.

సరళకి ఇప్పుడు ఈ ఉద్యోగం ఇప్పిస్తే కొన్నేళ్ళు ఇల్లు నడుస్తుంది. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి. వాళ్ళ సంపాదన మరిగి పెళ్ళిళ్ళు చేయలేదనే అపనింద తనకి వద్దు.

అపనింద వస్తుందని కూడా కాదు‌. ఒక ప్రణాళిక వేసుకొని బతికి, పెళ్ళిళ్ళు చేయాలి.

తల్లి వివరించి చెప్పిన మీదట కమలా, సుశీలా కూడా అంగీకరించేరు. నెల రోజుల్లో సరళ ఉద్యోగంలో జాయిన్ అయిపోయింది. తన సంపాదన తల్లికే ఇచ్చేసి చాలా పొదుపుగా ఉండేది. దుర్గ ఆశించినట్టు కమలకి కూడా ఉద్యోగం వచ్చింది.

దుర్గ పెరట్లో కూరల పాదులు, అరటి, ఆకుకూరలు జాగా ఉన్నంత‌ మేరా వేసి పెంచడం మొదలెట్టింది. చాలా పొందికగా సంసారం నడపడం ఎప్పుడూ అలవాటే అయినా ఇప్పుడు మరీ ఎక్కువ చేసింది.

ఎంత అవసరం అయినా, కమల జీతం, ఇంటి ఖర్చులకి వాడలేదు దుర్గ. అలా బేంక్‌లో దాచేసేది. ఎవరితోనీ చెప్పకపొయినా‌ దుర్గ మనసులో ఒక భయం ఉంది.

అప్పుడప్పుడే ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఎక్కువ సంతానంతో బాధలు పడుతున్న తమ తల్లి జీవితాలు చూసి ‘పెళ్ళి చేసుకోం’ అని అంటున్నారు.

అది తప్పో ఒప్పో దుర్గ ఆలోచించలేదు. తన కూతుళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోవాలి. ఈ దృఢ నిశ్చయంతోనే ఉంది. రాత్రి పగలు కట్నం వద్దన్న కుటుంబం ఉంటే ఎలాగోలా పెళ్ళి చేసేస్తే! ఇదే ఆలోచన ఆమెది.

ఆ టైమ్‌లో ఆమెకి ఓ మిత్రురాలు ఓ సంబంధం గురించీ చెప్పింది. తమకి తెలిసిన వాళ్ళబ్బాయి ఓ ప్రైవేట్ స్కూల్ పెట్టుకున్నాడని, చాలా తెలివయినవాడనీ, తప్పకుండా స్కూల్ డెవలప్ చెయ్యగలడని. అయితే, స్టెబిలిటీ ఉన్న ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అయితే కట్నాలు కానుకలు లేకుండా పెళ్ళి చేసుకుంటానని అంటున్నాడని. “కమలని అడగకూడదా!” అని ఆమె అంది.

దుర్గ ఆ రోజే కమలతో మాట్లాడింది.

కమల “నీ ఇష్టం..” అనేసింది. అన్నా వదినలని వాళ్ళింటికి వెళ్ళమని అడిగింది. చకచకా అన్నీ జరిగిపోయేయి.

ఇంటి ముందు షామియానా వేసి క్లుప్తంగా పెళ్ళి జరిపించింది. అల్లుడికి, వియ్యపురాలికి మంచి బట్టలు మాత్రం పెట్టింది. అంతే! కమల అత్తవారింటికి వెళిపోయింది. భర్త మంచివాడవడంతో బాగా కలిసిపోయింది. అల్లుడు కూడా అత్తవారిని ఆదరణగా చూసేవాడు.

సుశీల నామకః కాలేజీకి వెళ్ళడం, రావడం తప్పితే, డిగ్రీ తెచ్చుకోలేదు. కుట్టు నేర్చుకుంటానంది. దుర్గ సంతోషంగా కుట్టు క్లాసులో జాయిన్ చేసింది. వాయిదా పద్ధతి మీద కుట్టు మిషన్ ఒకటి కొన్నాది.

కుట్టులో సుశీల బాగానే రాణించింది.

కమలకి కొడుకు పుట్టేడు. కమల పుట్టింటికి వచ్చినా చాలావరకు తన పురిటి ఖర్చు తనే పెట్టుకుంది. కమల అత్తగారు దుర్గతో ఒక సంబంధం ప్రస్తావన తీసుకొచ్చింది.

వాళ్ళకి తెలిసిన అబ్బాయి. అబ్బాయి ఉద్యోగం మంచిదే! కానీ ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నాడు. అతని తాతగారు నాయనమ్మా చాలా సంప్రదాయికులు. ఇతని మీద ఇద్దరు అన్నలు వదినలు పిల్లలు. తరవాత ముగ్గురు చెల్లెళ్ళు. ఒకమ్మాయికి పెళ్ళి అయింది. ఇంకా ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి సొంతిల్లు మేడమీదా కిందనా గదులున్నది ఉంది. మరో కోడలు వచ్చినా ఇల్లు చాలదన్న భయం లేదు. అందువల్ల వాళ్ళకి సంసార పక్షమయిన అమ్మాయి అయితే చాలు.‌ సుశీలని అడగమంది.

దుర్గ ఆలోచనలో పడింది. “మరి కట్నాలు ఎంతలో ఉన్నారో?” అంది.

“ఒక మాట చెప్తాను వదిన గారూ! కట్నం ఇంతా అని అడగొచ్చు. లేదా లాంఛనాల రూపేణా అడగొచ్చు.‌ ఏదయినా మీకు భారం అనిపిస్తే వద్దులెండి. మన పిల్లని ఇవ్వం. అంతే కదా” అంది కమల అత్తగారు సావిత్రి.

“సరే, మా తరపున మీరే వెళ్ళి కదపండి”. అంది దుర్గ. పెళ్ళివారు ఓ పదిమంది పెళ్ళి చూపులకి వచ్చేరు. కమలా ఆమె భర్త వేదవ్యాస్ అన్నీ చూసుకున్నారు.

పిల్ల, దుర్గ పొందిక అందరికీ బాగా నచ్చేసాయి. పెళ్ళి మాటలకి తన అత్తగారితో వెళ్ళిన కమల తిన్నగా తల్లి దగ్గరకే వచ్చింది. “వాళ్ళు కట్నం తీసుకోరుటమ్మా! కానీ ఆడపడచులకి అత్తగారికీ లాంఛనాలు, పెళ్ళి కొడుక్కి ఉంగరం, సూటు, పట్టు బట్టలు కుటుంబం అందరికీ అప్పగింత బట్టలు అడిగేరు” అని చెప్పింది.

దుర్గ భయపడుతూ ఉంటే కమలే అంది “అమ్మా! పెళ్ళివారి లాంఛనాలు నేను కొంటాను. మిగిలినవి అప్పు చేసయినా సరే నువ్వు జరిపించు. సంబంధం మంచిది. మన సుశీల‌ చదువు వాళ్ళు పట్టించుకోటం లేదు. నువ్వు ఊఁ అను” మొత్తానికి కమల దుర్గని ఒప్పించేసింది.

సుశీల మొహంలో స్పష్టంగా సంతోషం కనపడింది. అనుకున్న దానికన్నా డబ్బు ఖర్చు ఎక్కువ అయినా ఏ పేచీలు లేకుండా పెళ్ళి జరిగిపోయింది.

దుర్గకి కొంత మనశ్శాంతి వచ్చినా సరళకి కూడా న్యాయం అవాలని ఆలోచన పట్టుకుంది. సరళ పేరుకి తగ్గది. చాలా నెమ్మదయినది. తల్లన్నా అక్కలన్నా తమ్ముడన్నా చాలా ప్రేమ. పిల్లలు వాళ్ళలో వాళ్ళు సఖ్యంగా ఉండడం దుర్గకి ఆనందమే!

కమల దగ్గర తన ఆవేదన చెప్పుకుంది. “ఒక్క ఏడాది ఆగమ్మా! సరళకీ చూద్దాంలే” అంది. ఈ ఏడాదిలో కమలకి కూతురు పుట్టింది.

సుశీలకి కొడుకు. కమల మాటెలా ఉన్నా సుశీల‌కి సీమంతం బారసాల అన్నీ ఆర్భాటంగానే చేయాల్సి వచ్చింది. ఇద్దరూ తమ తమ ఇళ్ళకు వెళ్ళిన దగ్గరనించీ దుర్గకి సరళ బెంగ పట్టుకుంది.

దేముడు దుర్గపట్లో సరళ పట్లో ఉన్నట్టు సరళకి ఆమె పనిచేసే ఆఫీసులో అతనే తన తల్లి తండ్రులని ఒప్పించి ముందుకు వచ్చేడు. మళ్ళీ కమల ముందుకొచ్చింది. “అన్నీ సరిపోయేయమ్మా! అబ్బాయి మంచివాడు. ఏ కట్నాలు అడగటం లేదు. చేసిద్దాం” అని పట్టు పట్టింది.

రెండు కుటుంబాలు కలుసుకోడం తేలికగానే పెళ్ళి‌మాటలు అయిపోయేయి. సరళ రాత్రి తల్లినడిగింది.‌‌ “అమ్మా! నా పెళ్ళయితే ఎలా?”

దుర్గ కూల్గా చెప్పింది. “ఇంక నాకు ఏ బెంగా లేదమ్మా! తమ్ముడి చదువు కూడా అయిపోవచ్చింది కదా! వాడికి ఉద్యోగం వచ్చేదాకా నాన్న పెన్షన్‌తో మేం గడుపుకుంటాం. ఇన్నాళ్ళు నీ సంపాదనా ధైర్యంతోనే ఈ సంసారం భారం మోసేను తల్లీ! మీ నాన్న చేయాల్సిన పనంతా నువ్వు చేసేవు. నా కూతురువి కావు. నాకు తల్లివి” దుర్గ గొంతు బొంగురు పోయింది.

సరళ కూడా కళ్ళు తుడుచుకుంటూ “పై వాళ్ళకి చేసానా అమ్మా! అయినా ఇదంతా నీ‌ ప్లానింగే కదా! అందరూ చెప్పినట్టు అక్కకే ఉద్యోగం వేయించి ఉంటే ఇన్నాళ్ళు ఈ సంసారం చాలా కష్టమయిపోను. నీ తెలివితేటలే మాకు ఆదర్శం” అన్నాది.

రెండేళ్ళలో సరళ కూతురుని ఎత్తుకొనేసరికి హరి బేంక్ ఉద్యోగం సంపాదించుకొని అక్కలనీ బావలనీ పిల్లలనీ అందరినీ భోజనాలకి పిలిచి అందరికీ బట్టలు పెట్టేడు.

దుర్గ తన సంతానాన్ని తృప్తిగా చూసుకుంది.

Exit mobile version