[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-8: అనాకార్డియం ఓరియంటేల్ (Anacardium Orientale)
ఇది మార్కింగ్ నట్ వృక్షజాతికి చెందిన జీడి గింజలతో రూపొందిన ఔషధం. డా॥ స్ట్రాఫ్ – హోమియో మందుగా లక్షణాల్ని రాబట్టినాడు. సంస్కృతంలో దీన్ని భల్లాతక, అగ్నిముఖిగా వ్యవహరిస్తారు.
స్థానాలు:
మనస్సు, కడుపు, చర్మం అరచేతులు, నరాలు, కండరాలు. కీళ్ళపై అధిక ప్రభావం చూపుతుంది.
వ్యాధులు:
మానసిక వ్యాధులు, చర్మం, జీర్ణకోశ, జననేంద్రియ, కీళ్ళ వ్యాధులు, న్యూరో సిఫిలిస్, నర్వస్ డిస్‌పెప్షియా వంటి వ్యాధులకు ఉపయోగపడుతుంది.
పోలికలు:
రూస్‌టాక్స్, ఎపిస్, ఆంటిమ్‌టార్ట్, ఆసిడ్‌ఫాస్, నక్స్, నేట్రం మూర్, పల్సటిల్లా. లైకో. పల్స్ తర్వాత ఇది బాగా పనిచేస్తుంది.
సహచరులు:
ప్లాటినా.
విరుగుళ్ళు:
కాఫీ, రూస్‌టాక్స్, యూకలిప్టస్.
స్వభావం:
ముఖం పాలిపోయి కళ్ళచుట్టూ నీలి వలయాలుండడం, మెంటల్ ఎగ్జైట్‌మెంట్‌తో, నాగరికతతో ఏ పని చేయనివారు.
మయాజమ్:
సోరా, సిఫిలిస్.
తత్త్వం:
చలి, వేడి వేటినీ తట్టుకోలేరు. సమశీతోష్ణ స్థితి కల్గి ఉంటారు.
ఉద్రేకాలు:
వేడి నీరు, ఉదయాన నడిచిన, తలను వెనక్కి వంచడం వల్ల, కదిలినా, గట్టిగా నడిచిన, చలి, తిన్న చాలా సేపటికి వ్యాధి లక్షణాలు ఉద్రేకిస్తాయి.
ఉపశమనం:
వెచ్చదనం, తిన్న తర్వాత పడుకున్నప్పుడు, మర్థించుట వల్ల, వేడి నీటి స్నానం వల్ల రిలీఫ్ ఉంటుంది.
టెంపర్‌మెంట్:
ఇరిటబుల్ (చిరాకు) టెంపర్‌మెంట్. వ్యాధి లక్షణాలు కుడి నుండి ఎడమవైపుకు పోవడం వుంటుంది.
మానసిక లక్షణాలు:
ఉన్నట్టుండి జ్ఞాపకశక్తి పోవడం వల్ల ప్రతిదీ కలలాగా ఉంటుంది. అయోమయంగా ఉండి వృత్తి వ్యాపారాల్ని నిర్వహించలేక పోవడం, ప్రతి విషయం త్వరగా మర్చిపోవడం, మానసిక దౌర్భల్యంవల్ల పరధ్యానం, అధైర్యం, ఆందోళన, బుద్ధి మాంద్యం, వెంటనే కోపం రావడం, అందర్నీ అనుమానించడం, చెడు ఆలోచనలు రావడం, డబుల్ పర్సనాలిటీ వల్ల తనలో ఇద్దరున్నట్లు భావించడం, దెయ్యాల్ని చూడడం, ఒకటి చెప్పింది మరొక దానికి వ్యతిరేకం. ఇతరులకు హాని చేయు క్రూర స్వభావం, తిట్టడం, శాపనార్థాలు పెట్టడం, ఏ విషయం సత్యంగా తోచదు. తనయందు, ఇతరుల యందు నమ్మకం లేకపోవడం, ప్రతి విషయం, ప్రతి వారి గురించి భయం, తనను ఎవరో తరుముతున్నట్లు భావించడం, మనశ్శాంతి ఉండదు. పిరికితనం, అసందర్భంగా ప్రవర్తించడం, పేర్లు, పరిసరాలు, స్నేహితుల్ని మర్చిపోతుంటారు. ఎవ్వర్నీ నమ్మకపోవడం, తనను తాను గాయపర్చుకోవడం వుంటుంది.
మశూచికం తర్వాత జ్ఞాపకశక్తి తగ్గడం, విద్యార్థులలో పరీక్షలంటే భయం, చదివింది మర్చిపోవడం, ఎగ్జామినేషన్ ఫంక్‌కి ఇది మంచి మందు.
శారీరక లక్షణాలు:
మానసిక పరిశ్రమ వల్ల నాడీ సంబంధ తలనొప్పులు, తలలో మేకు వంటిది గ్రుచ్చుకున్నట్లు, కొయ్యబారినట్లు బాధగా ఉండడం, మెడ నరం పట్టినట్లుండడం, నుదురు, నడినెత్తిన, తల వెనుక భాగంలో నొప్పి, భోజనం చేసిన తర్వాత ఉపశమించడం, శరీర అవయవాల్లో ముఖ్యంగా తల, కడుపు, జీర్ణకోశంలో, ఆసనంలో ప్లగ్ (అదిమినట్లుండే) లాంటి భావన. దృష్టి లోపాల వల్ల కళ్ళు మంటగా ఉండి వస్తువులు దూరంగా ఉన్నట్లుండే భావన ఉంటుంది. విచిత్రంగా అగుపడడం.
ముక్కు:
దీర్ఘకాలం పొడిగా ఉండే జలుబు, కలప కాలినట్లు, పావురం రెట్ట వంటి వాసనలు రావడం.
చెవులు:
జలుబు, తుమ్ములతో చెవులు సరిగా వినపడకపోవడం, రొంపతో గుండె దడ, గొంతులో, చెవిలో కుక్కినట్లుండి చెవుడు వస్తుంది.
నోరు:
నోటి దుర్వాసన, నోటిలో బాధతో కూడిన నోటి పొక్కులతో నాలుక వాచి మాట్లాడుటకు, నోరు కదుల్చుటకు కష్టంగా ఉండడం. లాలాజలం ఎక్కువగా ఊరుచుండడం, మిరియాలు తిన్న వారివలె పెదవులు మండడం ఉంటుంది.
జీర్ణకోశం:
జీర్ణశక్తి తక్కువగా ఉండడం వల్ల తిన్న 1-2 గంటలకు కడుపులో చెప్పలేని బాధ ఉండడం, ఆహారం తొందరగా తినడం వల్ల అజీర్ణం, పుల్ల త్రేన్పులు, కడుపులో ఖాళీగా ఉన్నట్లు బాధ ఉండి తిన్న తర్వాత తగ్గడం.
జీర్ణకోశంలో అల్సర్స్, కేన్సర్, కంతులకి ఇది మంచి మందు. కడుపుబ్బరించి వ్రేలాడినట్లుండడం, అన్నపానీయాలు తీసుకున్నప్పుడు సాధారణంగా ఉగ్గపట్టినట్లుండి ఊపిరాడదు.
అవయవాల్ని బద్దీతో బిగించినట్లుండడం విశేషం. శారీరక పరిశ్రమ లేక కూర్చుండి జీవితం గడుపువారి యందు కల్గు జీర్ణకోశ సంబంధమైన, నాడీమండల సంబంధమైన తలనొప్పులకు ఇది మంచి మందు.
పొత్తికడుపులో బాధతో గుడగుడలాడినట్లుండి విరేచనానుమానం ఉంటుంది. ఆసనం ముడుచుకొనిపోయినట్లుండడం వల్ల మలవిసర్జన కష్టంగా ఉంటుంది. బాధతో కూడిన మూలశంఖ, ఆసనం దురద, తేమతో, రక్తం కారడం, మూలశంఖ, మలబద్దకంతో కూడిన మనోవ్యాధి. తల, కండ్లు, మలాశయం, ఆసనం, మూత్రకోశంలో అడ్డుపెట్టినట్లు, ఏదో కుక్కినట్లు భావన ఉంటుంది.
గర్భిణీల్లో వేవిళ్ళు, తరుచుగా తినడం, దురద, నొప్పితో తెల్లమైల, బహిష్టు స్రావం తక్కువగా పోవడం, అధిక సంభోగం వల్ల కలిగే మనో వ్యాకులత.
గుండె దడతో పక్షవాతం, నీరసం, మూర్ఛలు రావడం వుంటుంది. ఛాతీలో నొక్కినట్లు నొప్పిగా, బరువుగా, వెచ్చగా, ఆందోళనగా ఉండడం వల్ల రోగి చల్లగాలిని కోరడం వుంటుంది.
మోకాళ్ళ నొప్పులు, మెడ, భుజాలు బరువుగా పట్టేసినట్లుండడం, పిక్కలు లాగడం, కూర్చున్నప్పుడు కాళ్ళు అస్థిమితంగా ఉండి నడిచినప్పుడు అలసటగా ఉండడం, కాళ్ళు, చేతులు, శరీరం తల బద్దెతో బిగించినట్లుండడం.
చర్మం, కాళ్ళు చేతుల వ్రేళ్ళపై మంట, దురదతో కూడిన ఎర్రటి పొక్కులు, పొక్కులున్న భాగం ఉబ్బి మంటతో ఉండి చీము పట్టడం, పసుపు పచ్చని చీము స్రవించడం, కుష్టుభాగం, బోదకాలు, అరచేతుల్లో పులిపిర్లుంటాయి. లైకన్‌ప్లానస్, న్యూరోటిక్ ఎగ్జిమాకు మంచి మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.