[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-7: ఎధుజా సైనాపియం (Aethusa Cynapium)
ఇది పూల్సు పార్సలే అనే వృక్షజాతికి చెందిన మొక్క నుండి నెన్నింగ్ ఔషధ గుణాల్ని రాబట్టని మందు. యూరోప్‌లో ఎక్కువగా పెరిగే ఈ మొక్క పుష్పించేటప్పుడు తీసిన రసంతో మందుగా వాడెదరు.
స్థానాలు:
నరాలు, జీర్ణకోశం, మెడ, లింఫ్ గ్రంథులు, మెదడు జిగురు పొరలు.
వ్యాధులు:
జీర్ణకోశ వ్యాధులు, ఎపిలెప్సీ, చిన్నపిల్లల్లో వచ్చే పక్షవాతం.
పోలికలు:
ఆర్స్ ఆల్బ్, ఇపికాక్, సెపియా, సిక్యూటా, కోనియం, ఆంటిం క్రూడమ్, కాల్కేరియా కార్బ్, మెగ్నీషియా కార్బ్.
కారణాలు:
వేసవి, వేడి, పిల్లల్లో దంతాలు వచ్చేటప్పుడు, పాలు, ఆహార లోపాలు, పరిసరాల అపరిశుభ్రత.
విరుగుళ్ళు:
కోనియం, బోవిష్టా, ఆంటిం క్రూడమ్, సిక్యూటా, లోబిలియా, మెర్క్‌సాల్, ఓపియం లకు ఇది విరుగుడు.
సహచరి:
కాల్కేరియా కార్బ్.
ఉద్రేకం:
తెల్లవారుజామున 3, 4 గంటలకు, సాయంకాలం, వెచ్చదనం, వేసవి, తిన్నతర్వాత, ద్రవపదార్థాలు తీసుకున్న తర్వాత, వాంతి తర్వాత, మల విసర్జనానంతరం వ్యాధి లక్షణాలు ఉద్రేకిస్తాయి.
ఉపశమనం:
బహిరంగ గాలిలో, నిద్రపోయిన తర్వాత, సముద్రతీరం, విశ్రాంతి, తలకు గట్టిగా గుడ్డ కట్టి కప్పుకోవడం.
తత్త్వం:
పైత్య తత్త్వం.
స్వభావం:
నరాల నిస్త్రాణతో, ఇడియోటిక్ కన్ఫ్యూజన్ టెంపర్‌మెంట్, ఆందోళనతో బాధపడే పిల్లలు, ముసలివారు ముఖం పీల్చుకొని పోయినట్లుండి ముక్కు, పెదవుల చివరి వరకు గీతలుంటాయి.
మోతాదు:
3 – 200 పోటెన్సీ, 12X – 30X.
మయాజమ్:
సోరా, సిఫిలిస్, సైకోటిక్. వేడి భరించలేరు.
మానసిక లక్షణాలు:
పిల్లల్లో పుట్టినప్పటి నుండి మానసిక ఎదుగుదల లేకపోవడం, అయోమయంగా ఉండడం, ఆందోళన, అస్థిమితంతో ఊరికనే ఏడ్వడం, పిల్లల్లో ఎగ్జామినేషన్ ఫంక్ ఉంటుంది. కండ్ల ముందు గదిలో ఎలుకలు, కుక్కలు, పిల్లులు ప్రాకుచున్నట్లు, కనపడుతున్నట్లు ఊహించుకోవడం వుంటుంది. దాంతో ప్రక్కనుండిగాని, కిటికీల నుండి దూకాలనుకోవడం వుంటుంది. శారీరకంగా, మానసికంగా నీరసం అధికంగా ఉంటుంది. ఆలోచించలేకపోవడం, ఏకాగ్రత లేకపోవడం వుంటుంది.
శారీరక లక్షణాలు:
తల:
తల వెనుక ముచ్చలిగుంట నుండి దిగువ భాగం వరకు తలనొప్పి, నిద్రమత్తు, తలనొప్పి, విరేచనమయిన, అపాన వాయువు వెళ్ళిన తర్వాత తలభారం తగ్గడం, తలనొప్పి తగ్గినా తలవేడి తగ్గకపోవడం విశేషం. నిస్త్రాణతతో పిల్లలు తల నిలబెట్టలేరు.
కండ్లు:
కండ్లకలక వల్ల కళ్ళు ఎరుపుగా ఉంటాయి. పొర్లునందు కనుగ్రుడ్లు పైకి, క్రిందకి తిరుగుతాయి.
చెవి:
చెవులలో దురద, చెవినొప్పి, చెవి నుండి చీము కారడం.
ముక్కు:
ముక్కు చివర హెర్పిస్ పొక్కులు.
ముఖం:
ముఖం నందు దిగజారుకు పోయినట్లుండి, ముక్కునుండి పెదవి చివరలకు గీతలు గీసినట్లుండి ముఖ భాగం అనగా పైపెదవి ముక్కు నుండి నోటి చివరల వరకు ముత్యం వలె తెల్లని వర్ణంగా ఉంటుంది.
నోరు:
నాలుక తేమగా, తెల్లగా ఉండడం, నీరూరడం వల్ల నెమ్మదిగా మాట్లాడడం, ఎక్కిళ్ళు ఆగాగి వస్తాయి. దాహం ఉండకపోవడం.
జీర్ణకోశం:
జీర్ణకోశంలో బాధతో వాంతులవడం, ఎక్కువగా చిరుతిళ్ళు తినేవారిలో వచ్చే అజీర్ణం, ఆహారం చూసిన వాంతి అవడం. నాడీమండల ఉద్రేకం, మానసిక వ్యాధుల వల్ల ఆహారం జీర్ణం కాకపోవడం, తిన్న 1 గంటకు ఆహారం నోటిలోకి వచ్చి ఆకుపచ్చగా వాంతి కావడం, చంటిపిల్లల్లో పాలుపడక త్రాగిన వెంటనే పెరుగు బిళ్ళల వలె పెద్ద వాంతి కావడం, నిస్త్రాణతతో. నిద్ర మత్తుగా ఉంటారు. పిల్లల్లో పండ్లు వచ్చేటప్పుడు, వేసవిలో కల్గు అజీర్ణం వల్ల ఉన్నట్టుండి నురగ వంటి పాలవలె తెల్లనిపదార్థం లేదా జున్ను పదార్థం లేదా పైత్యం వాంతి కావడం వుంటుంది. వాంతి అయిన తర్వాత శరీరం చల్లబడడం, ఆకలిగా వుండడం. వాంతులతో పాటు ఆకుపచ్చని నీళ్ళ విరేచనాలు, కోయుచున్నట్లు బాధతో, ఆసనంలో తీపుతో రక్తం జీరల్లాగా అవుతాయి. పిల్లల్లో ఆందోళన, నిస్త్రాణ ఎక్కువగా ఉంటుంది. త్రాగిన పాలు కొంతసేపు ఇమిడినట్లున్న కొంత సేపటికి పులిసి అకస్మాత్తుగా ఒకేసారి వాంతి అవుతాయి. వాంతులతో మగత, నుదుట చెమట పట్టి ఉదయాన జ్వరం రావడం జ్వరంలో దాహం లేకపోవడం. చెమట వున్నా దుప్పటి కప్పుకోవాలనిపించడం వుంటుంది. వాంతి అయినా, మలవిసర్జనానంతరం, ఈడ్పుల అనంతరం నిస్త్రాణ వల్ల నిద్రమత్తుగా ఉంటారు. విరేచనాలు జిగటగా పల్చగా, ఆకుపచ్చగా ఉండి శూల, పోట్లు కల్గుతాయి.
మూర్ఛ సంబంధమైన ఈడ్పుల వల్ల నోటి వద్ద నురగతో దౌడలు బిగుసుకొని, ముఖం ఎర్రగా మండడం, బొటనవ్రేళ్ళు ముడుచుకొని పోవడం, కంటి పాపలు పెద్దవవడం లేదా కదలకపోవడం, కండ్లు క్రిందికి ఉండడం, నాడీ వేగంగా, వడిగా, గట్టిగా ఉంటుంది. పిల్లలకు పండ్లు వచ్చేటప్పుడు వేసవిలో కల్గు అజీర్ణం, మూర్ఛలకిది మంచి మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.